సారస్వతం - 'దీప్తి' వాక్యం
ప్రపంచం
- దీప్తి కోడూరు

ఎన్ని జీవులో అన్ని ప్రపంచాలు!

ఏమిటిది తలాతోకా లేని మొదలు అనుకుంటున్నారా?

అంతేమరి.

ఆవిర్భావానికి ఆద్యంతాలు లేవు కదా!

నా వ్యాసమూ అంతే.

సరే. ఎన్ని జీవులో అన్ని ప్రపంచాలు ఉన్నాయన్నాను కదా! దాని సంగతి చూద్దాం.

అసలు ప్రపంచం అంటే ఎమిటి?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా మరో ప్రశ్న ఉదయిస్తుంది.

ఆ నిర్వచనం ఎవరి కోణంలోంచి చెప్పాలి అని.

అవును. నిజమే.

ప్రపంచం ప్రతివారి కోణంలోంచి కొత్త రంగులు సంతరించుకుంటుంది. ఏ ఇద్దరి ప్రపంచము ఒకేలా ఉండదు. ఉంటే ఇద్దరుండాల్సిన పనేముంది? సృష్టి అంటేనే వైవిధ్యం కదా!

కప్ప ప్రపంచంలో నాలుగే రంగులు ఉంటాయి.

పసిబిడ్డ మూడో నెల నిండేవరకు నలుపు తెలుపు రంగుల్లోనే ఈ ప్రపంచం పలకరిస్తుంది. రంగును గుర్తించే శక్తి పసికందు కంటికి లేదు.

అలాగే రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే ఎన్నో నక్షత్రాలు అందంగా కనువిందు చేస్తాయి.

వాస్తవానికి ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ నక్షత్రాలు ఆ క్షణంలో ఇంకా అక్కడే ఉన్నాయో, లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం చూస్తున్నది ఎప్పుడో ప్రయాణించి, ఇప్పుడు మనల్ని చేరుకొన్న ప్రతిబింబాన్ని మాత్రమే!! గతాన్ని చూసి, వర్తమానంగా భావించుకొని మురిసిపోతున్నామన్నమాట!!

మరి ఉందో లేదో తెలియని నక్షత్రం మన ప్రపంచంలో భాగమైపోలా!!!

స్థూలమైన ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎక్కడో మారుమూల పల్లెటూర్లో, చదువురాని మామూలు ఇల్లాలిగా ఉన్న మా అమ్మమ్మ! ఆమెకు అక్షరాలు కూడబలుక్కుని సాయి చరిత్ర చదువుకోవడం వచ్చు. చేయి వణకని రోజుల్లో రామ నామం రాసుకోవడం తెలుసు. అంతే. ఆమె ప్రపంచంలో అధునాతన నాగరికత, వైజ్ఞానిక ఆవిష్కారాలు ఉన్నాయంటారా?

మనకు తెలియనిది మన ప్రపంచంలో లేనట్లే కదా?

మహాభారతంలో ధర్మరాజుకు ఎంత వెతికినా పూర్తి చెడ్డవాడు కనిపించలేదట. అలాగే ధుర్యోధనుడికి పూర్తి మంచివాడూ కనపడలేదట! దీనర్థం ఏమిటి? ధర్మరాజు ప్రపంచంలో మంచికి చోటెక్కువ. ధుర్యోధనుడి ప్రపంచంలో చెడుకి చోటెక్కువ.

సరే. బాగుంది. ప్రపంచం ప్రతివారికీ వేరుగా అనుభవమౌతుంది అనేది రూఢి ఐంది కదా. ఇప్పుడు దాని పూర్వాపరాలేమిటో చూద్దాం.

ముందుగా ప్రపంచం అంటే ఏమిటి?

నాకు బాహ్యంగా ఎదురౌతున్న ప్రాణులు, పరిస్థితులు, పదార్థాలు. ఇంకా అంతరంగంలో చెలరేగుతున్న భావాలు, ఆలోచనలు, ఊహలు - ఇదే ప్రపంచం.

మనలోని ఈ ప్రపంచం ఎలా ఏర్పడుతుంది?

కొంతవరకు మనకు పుట్టుకతో వచ్చే తల్లిదండ్రులు, బంధువులు, వాతావరణం ఇదే మొదట మన ప్రపంచంగా ఉంటుంది. తర్వాత వాటిని ఆధారం చేసుకొని మనకు మనం మనదైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాం. ఇంకా జన్మాంతర సంస్కారాలుగా మనలోనే నివసిస్తున్న వాసనలు మన ప్రపంచాన్ని సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ప్రపంచపు ప్రభావం మన మీద ఎలా ఉంటుంది?

మనం సృష్టించుకున్న ఈ ప్రపంచమే మన ఎదుగుదలకు, లేదా వినాశనానికి కారణమౌతుంది. నిజానికి ప్రపంచంలో మంచి, చెడు రెండూ లేవు. అవి ఉండేది మనలోనే. మనలోని మంచి చెడులే మన చుట్టూ ప్రతిబింబిస్తూ ఉంటాయి.

నారద మహర్షిలాగా నిత్యం సత్సాంగత్యపు నీడలో ఓలలాడుతూ, నిన్ను నీవు నిర్మించుకోవచ్చు.

బూతు సాహిత్యమే నేపథ్యంగా నిర్మింపబడుతున్న నేటి సినీదృశ్యకావ్యాలను ఆధారం చేసుకొని పతనమౌతున్న మనలో కొందరు యువకులలాగా నీ శీలానికి నువ్వే శిలువ వేసుకోనూవచ్చు.

నా చుట్టూ ఉండేది నాకు అన్నిసార్లూ నచ్చదు. ఎందుకని?

ముందు చెప్పుకొన్నట్లు వైవిధ్యానికి కారణం జన్మాంతర సంస్కారాలుగా మనలో కొనసాగుతూ వచ్చే వాసనలు. మనకు నచ్చనిది మనకు ఎదురౌతుంటే అనుభవించాల్సిన ప్రారబ్ధం కొంత పోగుచేసుకున్నామని అర్ధం. మన చుట్టూ ఉన్న మన ప్రపంచం మనకి రకరకాల అనుభవాలను, అనుభూతుల్ని, కలిగించవచ్చు. బాధ, కోపం, అసూయ, అయిష్టం వంటివి దుఃఖంతో కూడుకొని ఉంటే, సంతోష, సుఖం, శాంతి, తృప్తి వంటివి తద్వతిరేకమైన అనుభవాలు.

ఎక్కడో నేపాల్ లో జరిగిన భూకంపమో, ఇరాన్, సిరియాలలో జరిగిన కాల్పులు, ఏనాడో హిట్లర్ సాగించిన పరమ దారుణ మారణకాండో, ఉత్తర భారత దేశంలో వరద హోరు సృష్టించిన భీభత్సమో, సొమాలియాలో పెరిగిపోతున్న ఆకలి చావులో వినగానే నన్ను కదిలిచింది. హృదయమంతా కలచి వేసింది. ఆ వివరాలు తెలిసిన రాత్రి నా కంటికి కునుకు లేదు. ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని వేల సంవత్సరాల ఎడమైనా వారి కష్టం నన్ను కదిలించింది.

ఏనాడో సిద్ధి పొందిన శిరిడి సాయిబాబా దివ్య అనుగ్రహాన్ని, ఆనాటి మదర్ థెరిస్సా మన సోదరులపై చూపిన అపార ప్రేమను, ఒకప్పటి రూమి కవిత్యాన్ని ఇంకా ఎన్నో అనిర్వచినీయమైన సంభవాలు దేశ, కాలమానాలకు సంబంధం లేకుండా నా గుండెను తాకుతున్నాయి.

మరి ప్రతి ఒక్కరు నేను పొందుతున్న అనుభూతుల్నే పొందుతున్నారా? నాకు మాత్రమే ఇలా అనిపించడానికి కారణం?

కారణం ఏమిటంటే నా ప్రపంచంలో వీటికి చోటిచ్చాను.

అందరి ఆలోచనల్లో ఇవే ఉండాలని లేదు కదా? ఎవరు ఏ భావాలను ప్రోది చేసుకుంటారో వారికి వాటికి సంబంధించిన అనుభూతులే మిగులుతాయి.

మనం దేని గురించి తెలుసుకుంటామో, దేని కోసం సమయం వెచ్చిస్తామో, దేనికి మన మెదళ్ళలో, హృదయాల్లో చోటు కల్పిస్తామో అవే మన ప్రపంచాన్ని, మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి మన ప్రపంచంలో చోటు కల్పించుకున్న ప్రతి అంశం పట్ల బహు జాగ్రత్తగా ఉండాలి. వాటి పట్ల మన ప్రతిచర్యలే మున్ముందు మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి.

మరి మనం ఎలా ఉండాలి?

ధర్మంగా.

మనకు లభించిన వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల, పదార్థాల పట్ల మనం ధర్మంగా ఉండాలి.

దేని పట్ల మనం ధర్మంగా ఉండమో, దానిని మనం కోల్పోతాము. తల్లి పట్ల ధర్మంగా లేకపోతే తల్లిప్రేమకు దూరం కావలసి వస్తుంది.

సమాజం పట్ల ధర్మంగా లేకపోతే సామూహిక హింసకు గురి కావలసి వస్తుంది. ఇప్పటి కాలుష్యం, కాపట్యం, కల్లోలం అన్నీ వాటి ప్రతిఫలాలే.

మరి ధర్మంగా ఉండటమంటే ఏమిటి?

ఆ స్థానంలో మనమే ఉంటే ఎలాంటి ప్రవర్తనని ఆశిస్తామో అలాగే ఉండటం.

మన ప్రపంచాన్ని మనకు నచ్చినట్లుగా సృష్టించుకోవచ్చా?

కచ్చితంగా.

నిన్నటి మన భావాలు, కర్మలే నేటి మన ఆలోచనలు, ఆశయాలుగా రూపుదిద్దుకొన్నపుడు, నేటి మన భావాలే రేపటి మన భవిష్యత్తుగా పురుడు పోసుకుంటుంది అనేది నిర్వివాదం. ఈ క్షణాన్ని ఎలా సృజించుకొంటామో, పై క్షణం దాని ఆధారంగానే ప్రాణం పోసుకుంటుంది.

మనదైన ప్రపంచాన్ని క్రియాశీలంగా, ప్రయోజనాత్మకంగా సృజించుకొని, తోటివారి ప్రపంచాలకు కూడా మన ఆనందాన్ని అందిద్దాం.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)