సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

అలంకార శాస్త్ర ప్రామాణిక గ్రంధమైన సాహిత్య దర్పణంలో “కన్య” అనే నాయికను వర్ణిస్తూ "కన్యాత్వజాతోపయమా సలజ్జా యౌవనా" అన్నారు. అంటే వివాహము కానట్టియూ,లజ్జా యౌవనములు గలిగినది యగు స్త్రీని కన్య యనబడును అని అర్ధం. మనం నాయకునికి ఏ లక్షణాలు ఆపాదించామో నాయికలకూ దాదాపు అవే లక్షణాలు అలంకార శాస్త్రంలో ఆపాదించారు. ప్రబంధ వ్యాపకత్వం, ప్రధాన ఫలభోక్తృత్వం, మహా కులీనతాదులు ఉభయులకూ సమానమే. "నాయికా ప్రతి పూర్వాసా ఉపపూర్వాను నాయికా అన్నారు. అంటే నాయికలలో..ప్రతినాయికలు,ఉపనాయికలు, అనునాయికలు కూడా ఉంటారని భోజుడు పేర్కొంటే.. నాయికా బేధాలు ముఖ్యంగా - అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను "స్వీయ" అనీ, వివాహము కాని పడుచును "కన్య" అనీ, పరుని వివాహమాడిన స్త్రీని "పరకీయ లేక అన్య లేక అన్యోఢ" అనీ, సర్వ సాధారణ స్త్రీని "సామాన్య" అనీ, ఇంకా వయస్సు కౌశలన్ని బట్టి చూస్తే..శృంగారం పట్ల ప్రతికూలత చూపే స్త్రీని "ముగ్ధ" అంటారనీ, అలాగే "మధ్య, ప్రౌఢ" అనే బేధాలుంటాయని శాస్త్రకారులు చెప్పారు.

ఆలంకారికులు శృంగార నాయికా నాయక సమాగమనానికి విట, చేట, విదూషక, పీఠమర్ధ అనే నలుగురిని చెప్తారు. కానీ అన్నమయ్య ఆ విదూషకులకు బదులుగా తానే ఆ పని నిర్వహిస్తూ దూతికలను మాత్రమే కీర్తనల్లో పేర్కొనడం జరిగింది. "కన్య" అయిన నాయిక చెలికత్తె తో పలికే పలుకులు ఈ క్రింది కీర్తనలో తెలుసుకుందాం.

కీర్తన:
పల్లవి: ననిచి యీతనితోనే నగుత నుండెద గాక
చనవుగలిగినవెనక జరయదగునటవే.

.1. భావ మాతని మీద బాదు కొలిపిన వెనక
చేవదేరగ నలుగ జెల్లునటవే
కావరపు వలపు లొడిగట్టుకుండిన వెనక
వావాత మచ్చికలు వదలదగునటవే || ననిచి||

.2. మిగులనతనికి మోవి మీదుకట్టిన వెనక
జిగిమించి ఇకబలుక జెల్లునటవే
పగటుతో వయసు తనపాలబెట్టిన వెనక
మగిడి మొగమాట లటు మానదగునటవే || ననిచి||

.3. లవి భోగ మతనితో లంకె సేసిన వెనక
చెలిమి సేయక మరువ జెల్లునటవే
యెలమి శ్రీవేంకటేశుడింతలో ననుగూడె
వెలలేని తమకమిక విడవదగునటవే! || ననిచి||
(రాగం: శ్రీరాగం; శృం.సం.సం 28; రాగి రేకు 1810; కీ.సం.54)

విశ్లేషణ:
అన్నమయ్య పదాలలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, అలమేలు మంగమ్మ నాయిక. ఆమె "కన్య" అన్నమయ్య శృంగార రాయబారి, ఒక్కోసారి దూతిక పాత్రకూడా వహించడం చేస్తాడు. ఈ కీర్తనలో కన్య నాయకుని గూర్చి చెలికత్తె తో చెప్పడం విశేషం.

పల్లవి: ననిచి యీతనితోనే నగుత నుండెద గాక
చనవుగలిగినవెనక జరయదగునటవే.

నాయిక అలమేలుమంగ కన్యా నాయికగా చెప్తోంది. “ఓ దూతికా...నాకు సిగ్గు, బిడియం చాలా ఎక్కువ ఆ విషయం నీకు తెలిసిందే కదా!. కొత్తవారితో అసలు మాట్లాడలేను సుమా! ఇక ఈ శ్రీనివాసునితో నంటావా...కాస్తా చనువు..పరిచయం ఏర్పడింది కాబట్టి ప్రేమతో ఇతనితోనే కాస్తా ఎక్కువగా నవ్వుతూ ఉంటానంటూ... ఇది నిందించదగ్గ తప్పేమీ కాదు” అని చెప్తూ నే తనకు శ్రీనివాసునిపై ప్రేమ ఏర్పడిందన్న విషయం అన్యాపదేశంగా చెప్తోంది నాయిక.

.1. భావ మాతని మీద బాదు కొలిపిన వెనక
చేవదేరగ నలుగ జెల్లునటవే
కావరపు వలపు లొడిగట్టుకుండిన వెనక
వావాత మచ్చికలు వదలదగునటవే

నామనసు ఆతనిమీదనే నెలకొనింది. మా బంధం బలపడిన తర్వాత అలగడం, మాట్లాడకుండా ఉండడం తగదు కదా..దూతికా! నేను పొగరు, గర్వంతో ప్రవర్తించి, నాకు ఆయనపై గల ప్రేమను, మోహాన్ని పోగొట్టుకుని ఉండగలనా చెప్పు అని, నా పక్షాన న్యాయం ఉంది కదా.. చెప్పు.. .. చెప్పు.. అని నిలదీస్తోంది నాయిక చెలికత్తెను.

.2. మిగులనతనికి మోవి మీదుకట్టిన వెనక
జిగిమించి ఇకబలుక జెల్లునటవే
పగటుతో వయసు తనపాలబెట్టిన వెనక
మగిడి మొగమాట లటు మానదగునటవే

అతనిపై మరులుకొని, నా మోహాన్ని ఆతనికి ముడుపు కట్టిన తర్వాత, ఇలా కపటపు మాటలు మాట్లాడడం న్యాయమంటావా? చెప్పు? నా వయసు యౌవనం నీదేనని బాహాటంగా ప్రకటించి చెప్పిన తర్వాత, మళ్ళీ సంకోచంతో, మోమాటంతో అవీ ఇవీ మాట్లాడడం తగునా? చెప్పు.. నేను చేసేదంతా న్యాయమే కదా అని చెలికత్తె ఒప్పుదల కోరుతోంది నాయిక.

.3. లవి భోగ మతనితో లంకె సేసిన వెనక
చెలిమి సేయక మరువ జెల్లునటవే
యెలమి శ్రీవేంకటేశుడింతలో ననుగూడె
వెలలేని తమకమిక విడవదగునటవే!

గిల్లికజ్జాలాడుకుంటూ స్వామిపై నాకుగల బంధం లంకెవేసిందన్న విషయం ఎరుగుదువు కదా! ఇప్పుడు ఆతనితో చెలిమితో సరసన ఉండకపోవడం తగునా? ఆనందంతో, ఎంత వికాసంతో ఆ స్వామి నన్ను చేరిన విషయం నీకు తెలియనిదా చెప్పు? ఆ స్వామి అందించే ఇంత వెలకట్టలేని మోహాన్ని విడవడం నాకు సాధ్యమా? విడవగలనా? అని స్వామి పై తనకు గల అనురక్తిని "కన్య" నాయికగా అమ్మ అలమేలుమంగమ్మ వ్యక్తం చేస్తోంది.

ముఖ్యమైనఅర్ధములు:
ననిచి = ఇష్టపడు, ప్రియమగు (ననుచు యొక్క రూపాంతరం); నగుత = నవ్వుట; జరయ = నిందించు; పాదుకొలుపు = నెలకొను, నిలుపు; చేవదేర = బలపడుట; కావరము = పొగరు, గర్వము; వావాత = నోరార; మీదు కట్టిన = దేవునికి మ్రొక్కుకొని ముడుపుగట్టిన; జిగి = కాంతి, ప్రకాశము; పగటు = ప్రకటించు; మగిడి = పాములవాడు వూదు బూర; (క్రియా విశేషణంగా వాడినట్లైతే మగిడి అనే పదానికి.. మరల, వెనుక అనే అర్ధాలు ఉన్నాయని శంకరనారాయణ నిఘంటువు); మొగమోటము = సంకోచము; లవి = గిల్లు, కోయు, పొందగలుగు; ఎలమి = సంతోషము, తృప్తి, ఆనందము; తమకము = మోహము.

-0o0-



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)