శీర్షికలు - సంగీతరంజని
స్వాతి తిరునాళ్
- డా. కోదాటి సాంబయ్య సౌజన్యంతో

శ్రీ స్వాతితిరునాళ్ వర్ధంతి : 27 డిసెంబర్ 1846

సాధారణంగా లక్ష్మి, సరస్వతులు ఒక్క వ్యక్తిలో ఉండడం అరుదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అత్తా కోడళ్లు. కాని శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ విషయంలో ఇది నిజం అయ్యింది. సంగీతం, సాహిత్యం, చిత్రకళ, సైన్స్ అన్నిట్లోనూ సాధికారత గల రాజు.

శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ (ఏప్రిల్ 16, 1813 - డిసెంబరు 25, 1846) కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత. ఇతడు మహారాజా రామవర్మకు, మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు. స్వాతి నక్షత్రాన జన్మించినందు వలన కుమారునికి స్వాతి తిరునాళ్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాలుగు నెలలలోనే (29 జూలై, 1813న) రాజ్యానికి అధిపతిగా ప్రకటించారు. తిరువాన్కూరు సంస్థానాన్ని(కేరళ) పరిపాలించిన రాణి లక్ష్మీ బాయికి లేక లేక కలిగిన కుమారుడే స్వాతి తిరునాళ్ రామ వర్మ. అది బ్రిటిష్ వారు భారత దేశంలో రాజ్య విస్తరణ చేస్తున్న కాలం. బ్రిటిష్ వారి రాజ్య విస్తరణలో భాగంలో తెచ్చిన చట్ట ప్రకారం రాణిగారి మగ సంతానమే రాజ్యాధికారానికి అర్హులగుదురు. రాణిగారికి మగ సంతానం కొరకు రాజ్యమంతా ఎదురు చూస్తున్న సమయంలో రాణి గారికి కలిగిన మగ సంతానమే స్వాతి తిరునాళ్ రామ వర్మ.

ఇతడు గొప్ప పండితుల వద్ద సంస్కృతంలో ఇతర భాషలెన్నో నేర్చుకున్నాడు. భాషలతో పాటు సంగీతంలో కూడా ప్రతిభ ప్రదర్శించాడు. తంజావూరు సుబ్బారావు ఇతని గురువుగా మరియు దివాన్ గా స్వాతి తిరునాళ్ అభ్యున్నతికి కారణభూతులైనాడు. ఇతడు 16 సంవత్సరాల వయసులో తిరువంకూరు మహారాజుగా (1829లో) అధిష్టించి, 1846లో మరణించే వరకు రాజ్యపాలన చేశారు. త్యాగరాజు స్వామి శిష్యుడైన కన్నయ్య భాగవతార్, మృదంగంలో ప్రవీణుడైన షట్కాల గోవిందమారర్, గాత్రశిఖామణి పరమేశ్వర భాగవతార్ మొదలైన వారు ఎందరో స్వాతి తిరునాళ్ ఆస్థానంలో నిలయ విద్వాంసులుగా ఉండేవారు.

స్వాతి తిరునాళ్ సంస్కృతంలో రచించిన గ్రంధాలు గొప్ప భక్తి ప్రబోధకాలు. వీటిలో తమ ఇలవేల్పు పద్మనాభస్వామిపై చెప్పిన 'భక్తి మంజరి' గొప్ప స్తోత్రం. నూరు పద్యాలు గల ఈ రచన పది భాగాలుగా విభజింపడినది. తొమ్మిది విధములైన భక్తి మార్గాలు మరియు పద్మనాభుని అపురూప సౌందర్యం ఇందులో మహత్తరంగా వర్ణించబడినవి. 'శ్యానందూరపుర వర్ణన' అనే మరొక సంస్కృత గ్రంధంలో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర వివరించబడినది. ఇతని మరొక రచన 'పద్మనాభ శతకము'. ఇందలి పద్యాలు స్వామి సన్నిదానంలో ఈనాటికీ వల్లిస్తుంటారు.

స్వాతి తిరునాళ్ సంగీతాన్ని బాగా ప్రోత్సహించేవారు. ఇతడు కర్నాటక సంగీతంలో ఇంచుమించు 400 కృతులు రచించారు.[1] ఇందులో పద్మనాభ పాహి, దేవ దేవ, సరసిజనాభ మరియు శ్రీ రమణ విభో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇతనికి సంస్కృతం, హిందీ, మళయాలం, మరాఠీ, తెలుగు, బెంగాలీ, తమిళం, ఒరియా, ఇంగ్లీషు మరియు కన్నడ భాషలలో ప్రావీణ్యం కలదు.[2][3] స్వాతి తిరునాళ్ తెలుగులో రచించిన కీర్తనలలో 'వలపు తాళ వశమా నా సామికి చలము సేయ న్యాయమా', 'ఇటు సాహసముల ఏల నాపై చక్కని స్వామీ' అనే జావళి మిక్కిలి ప్రసిద్ధమైనవి. తిరునాళ్ కుచేలోపాఖ్యానం, అజామీళోపాఖ్యానం సంస్కృతంలో రసవత్తరమైన హరికథగా రచించాడు.

తిరువనంతపురంలోని ఖగోళ దర్శిని, జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ప్రభుత్వ ముద్రణాలయం, ప్రధాన గ్రంథాలయం, Oriental Manuscript Library, మొదలైనవి స్వాతి తిరునాళ్ ప్రారంభించినవి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)