సారస్వతం
అన్నమయ ఆత్మబోధ
- పన్నాల రఘు రాం, పన్నాల భారతి

అన్నమయ 32,౦౦౦ కీర్తనల రాశిలో శృంగార , అధ్యాత్మ విభాగాలు ప్రధానమైనవి.

వేంకటేశ్వర నామం, రూపం విభూతిగా, మనసా, వాచా, కర్మణా నమ్మి తాను పొందిన ఆత్మానందాన్ని నలుగురికీ తెలియచెప్పడానికి అన్నముని చేసిన ప్రయత్నమే సంకీర్తన రచన , ప్రవచన.

ఈ సంకీర్తనలలోని కొన్ని ఆత్మావలోకన సంకీర్తనల పరిశీలనా ప్రయత్నం ఈ వ్యాసం.

కొందరికి మాటలు పూర్తిగా అర్ధం అవ్వవు ; మరికొందరికి పాటలు పూర్తిగా అర్ధం అవ్వవు ;కొందరికి మంత్రాలూ పూర్తిగాఅర్ధం అవ్వవు ; కొందరికి వేదం పూర్తిగాఅర్ధం అవ్వదు ;కొందరికి వేదాంతం పూర్తిగాఅర్ధం అవ్వదు. అర్ధమైన దాంతో ఎవరి లోకంలో వారు ఏదో లోకంలో బ్రతికేస్తుంటే అందరికీ అర్ధం అయ్యేలాగా బహిరంతర్లోకాల దర్శనం చేయించి ఏడేడు లోకాల లోకేశుడిని వేంకటేశుడిని చూపించాడు అన్నముని.

ఆయన పౌత్రుడు తాళ్ళపాక చిన్నన్న చెప్పినట్టు అన్నమయ కీర్తనలు
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై వేంకటశైల వల్లభరతిక్రీడా రహస్యంబులై నుతులై తాళ్ళపాక అన్నమయ వచోనూత్నక్రియల్ చెన్నగున్.

పెద్దలు ఆత్మ జ్ఞానం గురించి ఎప్పుడు చెప్పినా ముందుగా ఉదహరించేది ఆది శంకర విరచితమైన
'భజ గోవిందం ' రచనని.

అన్నమయ మనకి అర్ధమయే రీతిన
‘కర్మ మెంత మర్మ మెంత కలిగిన కాలమందు, ధర్మ మిది యేమరక తలఁచవో మనసా’ - సంపు: 4-389

అని తన మనసుకి, అలాగే చదువరుల మనసుకు చెప్పి ' శ్రీ వేంకటేశు భక్తి చేరితే సౌఖ్యము' అని అలాంటి వారికి 'చావులేదు నోవులేదు సర్వజ్ఞులకును' అని అంటాడు.

వేంకటేశుడు ఏడుకొండల మీద ఉన్నట్లే ప్రతి గుండెలో ఉన్నాడు అందుకే అన్నమయ
'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటె, అందరికి శ్రీహరే అంతరాత్మ' అని అంటాడు , ఇది గీతా సారం , వైదిక జీవన ప్రాకారం.

మనసా, వాచా , కర్మణా శ్రీనివాసుని నమ్మిన వాడు అన్నమయుడు , వాక్కుకీ ,కర్మకీ ఆధారం శరీరం .
‘దేహో దేవాలాయో ప్రోక్తో’ అన్నది ప్రాకృత ఉవాచ .

తెనుఁగున మన అన్నమయ 'తనువే గుడియట తలయే శిఖరమట' అన్నాడు .

॥పల్లవి॥ నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
సంపు: 2-82

॥చ1॥ తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమటా
కనుఁగొను చూపులే ఘనదీపము లట
తనలోపలి యంతర్యామికిని


॥చ2॥ పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలఁపులోపలనున్న దైవమునకు

॥చ3॥ గమనచేష్టలే యంగరంగగతియట
తమిగల జీవుఁడే దాసుఁడట
అమరిన వూర్పులే యాలవట్టములట
క్రమముతో శ్రీవేంకటరాయనికిని
సంపు: 2-82

వ్యక్తిత్వ వికాసానికి వైదిక గ్రంధాలని మించిన ఆధారమూ లేదు , వాటి సారాన్ని తేలికగా అర్ధం చేసుకోవడానికి అన్నమయ కీర్తనలని మించిన సమాహారమూ లేదు.

శరీరం-గుడి, తల-శిఖరం, కళ్ళు-దీపాలు, నాలుక-ఘంట, పలుకు-మంత్రము, రుచులు-నైవేద్యాలు అని తేలికగా అన్న అన్నమయ ఆఖరి చరణంలో 'గమనచేష్టలే యంగరంగగతియట' అంటే మన కదలికలు అంతర్యామికి ఊరేంగింపు అని అంటాడు ,లోపలి జీవుడు వేంకటపతి దాసుడు అని అంటూ , ఉచ్చ్వాస నిశ్వాసాలే ఊయల సేవ అని ముగిస్తాడు , మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాడు.

ఇలాగే
అలరఁ జంచలమైనఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాసపవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల
సంపు: 1-67
అని కూడా అంటాడు.

భాగవత పురాణంలో పురంజనోపాఖ్యాన నెపంతో శుకుడు మానవ దేహం యొక్క నిజా నిజాలని కళ్ళ ముందు ఉంచుతాడు , పోతన గారు అంతే పటిమతో తెలుగున రచించారు.

అన్నమయ్య భాగవత స్ఫూర్తితో ఈ కీర్తన రచించాడు

కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ
పాయక తిరిగాడేరు పాపపుతలారులు
సంపు: 1-488

వరనవ ద్వార కవాట గవాక్ష తోరణ దేహళీగోపురముల నొప్పి
ప్రాకార యంత్రవప్రప్రతోళీ పరిఖాట్టాల కోపవనాళి( దనరి [పోతన భాగవతం నాల్గవ స్కంధం]

ఆత్మ జ్ఞానం పొందాలంటే ఏమిటి చేయటం? అంటే , మాయని జయించటం అంటారు పెద్దలు .
మోహము విడుచుటే మోక్షమది , దేహ మెఱుఁగుటే తెలివీనదే .....
నెమ్మది వేంకటనిలయునిదాసుల , సొమ్ముయి నిలుచుట సుకృత
మది సంపు: 1-263

అంటాడు మన అన్నమయ ,అంతా విష్ణుమాయ అని అంటాడు , ఈ కీర్తనలో వేంకటేశ్వరుని మాయలో జీవులు ఎలా మునిగారో చెప్తాడు

నిండు కంతటా నున్నది నీమాయ , వొండొకరు జనులకు నుపదేశించనేలా
నేరకుంటే సంసారము నేరుపును నీమాయ , పెక్కులాగుల నన్నిటాఁ బెనగించు నీమాయ
సంపు: 3-237

ఇది చదువుతుంటే మనకి తెలిసినదే కదా ,కొత్తగా ఏముంది అని అనిపిస్తుంది. ఇది మనలో మనం అనుకుంటే ,అన్నయ్య అచ్యుతుడితో అంటాడు , ఏమని ? ‘అది నేనెఱగనా’ అని ,కానీ తెలిసినది పాటించకుండా చేసేది మాయ , భ్రమ అందుకే ‘అంతలో భ్రమతుఁ గాక’ అని కూడా అంటాడు.

అది నేనెఱగనా అంతలో భ్రమతుఁ గాక , మదనజనక నాకు మంచి బుద్ధియియ్యవే సంపు: 2-185
అని వేడుకొంటాడు. అందుకే ఆయన అంటాడు

తెలిసితే మోక్షము తెలియకున్న బంధము , కలవంటిది బదుకు ఘనునికిని సంపు: 2-19

విజ్ఞానానికి, విఘాతానికి కారణమైన ఈ మనసుని గురించి ఆయన క్రింది కీర్తనలో ఇలా వర్ణించాడు
కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు,
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు
సంపు: 2-21

ఈ కీర్తనలో మనతోనే ఉంటుంది చుట్టం కాదు , కరగదు రాయి కాదు , అటు ఇటు పరిగెటుతుంది నీరు కాదు , లోనే ఉంటుంది దైవం కాదు , కప్పి మూట గట్టలేను గాలి కాదు ఏమిటో ఈ మనసు అని , వేంకటేశుని తలిస్తే అన్నిటా గెలిచేనీ మనసు అని అంటాడు.

నటనల భ్రమయకు నామనసా , ఘటియించుహరియే కలవాఁడు
వంచనల నిజమువలెనే వుండును , మంచులు మాయలే మారునాఁడు
సంపు: 4-317
అని మన మనసుని హెచ్చరిస్తాడు.

మనసుని గెలిచే ప్రయత్నాలు కొన్ని సఫలం కొన్ని విఫలం , ఏది మంచి ఏది చెడు,
అంతా సందేహం….. సందిగ్ధం…..

కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు , కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది సంపు: 1-226

సముద్రంలో అలలు తగ్గిన తరువాత స్నానం చేయాలని అనుకొనే వాడికి అది ఎలా సాధ్యపడదో , కోరికలు తీరిన తరువాత తత్త్వం తెలుసుకోవాలన్నా అంతే ! అందుకే అందమైన తిరు వేంకటాద్రీశు సేవించి అయోమయావస్థ నుండి బయట పడమంటాడు.

దేహం ఉన్నంత కాలం మోహం తప్పదు
దేహినిత్యుడు దేహము లనిత్యాలు , యిహల నా మనసా యిది మరువకుమీ సంపు: 2-419
జీవాతుమై యుండు చిలుకా నీ- ,వావలికి పరమాత్ముఁడై యుండు చిలుకా సంపు: 1-50
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ- , నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు
సంపు: 1-97

అని శ్రీనివాసుని మాయతో ఈ జీవుడు , ఈ దేహం ఉందని ఆత్మ జ్ఞానం తెలుసుకోమని చెప్తాడు.
పై కీర్తనలన్నీ వేదాంత సారం , భగవద్గీత చిద్విలాసం . అన్నమయ్య గీతా సారాన్ని కీర్తనలలో వివరిస్తే ఆయన కుమారుడు పెద తిరుమలయ్య తెనుగున ‘ఆంధ్ర వేదాంతం’ పేరున అనువదించారు.

ఇది చదివిన తరువాత ఇలా బ్రతకడటం సాధ్యమా? తప్పులు ఎవరైనా చేస్తారు కదా అని అనిపించ్చు , చేసిన చిన్న చిన్న తప్పులు గుర్తుకు రావచ్చు , తప్పులు చేయని వాడెవ్వడు అనొచ్చు. అందుకే మన అన్నమయ్య మన తరపున మాధవునితో మాట్లాడాడు

సేయనివాఁ డెవ్వఁడు చేరి చిల్లరదోషాలు ,యేయెడ జీవులజాడ లీశ్వరకల్పితమే సంపు: 2-72

చేతనాత్ముడకైన శ్రీ వేంకటేశ్వరుని కొలిస్తే దోషాలు తొలగుతాయని అంటూ , సూర్యునికి అంధకారం ఎదురా , గరుడునికి పాములెదురా అని నిలదీస్తున్నాడు.

మరి ఎలా బ్రతకడం అంటే

మహినుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు , సహజివలె నుండేమీ సాధింపలేడు సంపు : 2-212
అప్పులేని సంసార మైనపాటే చాలు , తప్పులేనిజీత మొక్క తారమైనఁ జాలు
సంపు: 1-114

ఎందుకు ఇలాగే బ్రతకాలి అంటే
కూడువండుట గంజికొరకా తనకు , వేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక …
కొండ దవ్వుట యెలుక కొరకా తాఁ , గొండ యెక్కుట దిగుటకొరకా
కొండలకోనేటిపతిఁ గొలిచి తనదు , నిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక
సంపు: 1-115

విష్ణు సహస్రనామం లోని ఒక నామం అన్నం , దాని తెలుగు పదం 'కూడు' తేట తెలుగు పదం . కూడు - గుడ్డ , తోడు - నీడ , ఆట - పాట ఇవి పెద్దలు మనకి చెప్పినవి. అన్నమయ్య పాట అచ్చ తెలుగు పద జాజిరి

జీవితాంతం వెన్నెల వంటి వెన్నుని నామం వదలక ; వెక్కసమగు నీ నామము వెల సులభము , ఫలమధికము అని తానే
…మదిలో చింతలు మయిలలు మణుఁగులు , వదలవు నీవవి వద్దనక సంపు: 1-381
తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని , తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
విడువలేని శ్రీవేంకటవిభుఁడవు , కడదాఁకా నిఁకఁ గాతువుఁ గాకా
సంపు: 3-474

అని నమ్మి బ్రతికి మనకి నిదర్శనంగా , సుదర్శనంగా నిలిచాడు.

ఎన్ని మార్గాలున్నా అవన్నీ శ్రీనివాసాభిముఖమే , వాసుదేవుని వద్దకే !
అందుకే మన అన్నమయ్య
నానాభక్తులివి నరుల మార్గములు , యే నెపాననైనా నాతఁ డియ్యకొను భక్తి సంపు: 2-469

ఉన్మాదభక్తి ,పతివ్రతాభక్తి ,విజ్ఞానభక్తి ,రాక్షసభక్తి, తురీయభక్తి ,తామసభక్తి ,వైరాగ్యభక్తి ,రాజసభక్తి ,నిర్మలభక్తి అన్నిటిలోకి , తట్టు ముట్టు లేక ఎప్పుడూ కొలిచేదే నిజమైన భక్తి అని ప్రవచించాడు

గట్టిగా శ్రీవేంకటేశు కైంకర్యమే సేసి , తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి సంపు: 2-469

అన్నమయ గురించి ఎన్నో విషయాలను తెలిపిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారికి , ఈ వ్యాస రచనలో తగిన సూచనలను, సలహాలను అందించిన శ్రీమతి వల్లూరు లీలావతిగారికి , అడగగానే భావ గర్భితమైన చిత్రాన్ని ప్రత్యేకముగా గీసిన శ్రీ నీలి వెంకటరమణ గారికి మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన ‘సుజనరంజని’కు మా ధన్యవాదములు.

ఇహమేకాని యిక బరమేకాని , బహుళమై హరి నీపైభక్తే చాలు || సంపు: 2-131
అని శ్రీనివాస సాన్నిధ్యము పొందిన ; నాదోపాసకుడు ; మధుర గాన మురళి ; గంభీర గాత్ర రవళి
శ్రీ మంగళంపల్లి వారికి ఈ వ్యాసం అంకితం.

ఆధార రచనలు:
తాళ్లపాక పదసాహిత్యం (తి.తి.దే ప్రచురణ, 1998)
తాళ్లపాక చిన్నన్న విరచిత అన్నమాచార్య చరిత్ర వ్యాఖ్యానం (తి.తి.దే ప్రచురణ , 2012)
పోతన భాగవతము (తి.తి.దే ప్రచురణ, 2015)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)