తెలుగు మాండలిక పద సేకరణ విధానం– అనుభవాలు


- డా.యస్. చంద్రకిరణ్, సీనియర్ లింగ్విస్ట్,

తెలుగు వర్డ్ నెట్ ప్రాజెక్ట్, ద్రవిడ విశ్వ విద్యాలయం, కుప్పం.

భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠద్వనుల సముదాయమే భాష. మాండలిక భాష అంటే ఒక మండలం లేదా ప్రాంతంలో మాట్లాడే భాష అని అర్థం. ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ మొదలగు ప్రక్రియలలో దూసుకుపోతున్న మానవ జీవన విధానంలో భాషలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయనే చెప్పాలి. జీవద్భాషకు మార్పు అనేది సహజంగానే వస్తుంది. ఈ మార్పు వల్ల భాషలో బహురూపత, వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడ్డ భాషావైవిద్యాలను/భేదాలను మాండలికాలు అంటాం. భాష ఏదైనా దానికి మౌలికమైన, మూలమైన సంభాషణా విధానం ఒకటుంటుంది. రాష్ట్రాలలో పల్లె జన పదాలెక్కువ. వాటిలో జన సందోహం స్వతస్సిద్ధంగా, అనుశ్రుతంగా వస్తున్న పదాలతో, వాక్యాలతో మాట్లాడుకుంటారు. ఆ మాటలకు నగ్న స్వరూపాలు, నగిషీలూ, అలంకరణలూ వుండవు. ఆ స్వరూపం పల్లెల్లో వీచే పైరగాలంత స్వచ్ఛంగా, మధురంగా వుంటుంది. తెలుగు భాషనే తీసుకొంటే ఒక్కో జిల్లాకు ఒక్కో మాండలికం వుంది. భాష లిపి, తీరు ఒకటే అయినప్పటికీ మాటల తీరు వేరువేరుగా ఉంటుంది. ఇలాంటి తీరును ‘మాండలికం’ అంటారు. భాషలో మొదట ఉండేది మాండలికమే. ఒకే భాషకు చెందిన భిన్న భిన్న ప్రాంతాలలోని భేదాన్ని మాండలికాలుగా పిలుస్తారు. ప్రతి రాష్ట్రానికి ఉండే ప్రధాన భాషకు ఆ రాష్ట్ర మండలాల్లో మాట్లాడే భాషకు కొంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మాండలిక భాషను ఉపభాష లేదా ప్రాదేశిక భాష అనవచ్చు. భాషలో ధ్వనుల ఉచ్చారణ, వాక్యనిర్మాణం, వ్యాకరణ నిర్మాణం, పదజాలం, వాక్య ఉచ్చారణలో ఎన్నో ప్రాంతీయ భేదాలు ఉంటాయి. చారిత్రకంగా ఒక మాటకు మండల భేదాన్ని బట్టిగానీ వర్గ భేదాన్ని బట్టిగానీ వ్యవహర్తల ఉచ్చారణలో ఏర్పడ్డ రూప భేధాలను మాండలికం అంటారు. మాండలిక భాష అంటే ఒక మండలం లేదా ప్రాంతంలో మాట్లాడే భాష అని అర్థం. ఒకే భాషకు చెందిన భిన్న భిన్న ప్రాంతాల్లోని భేదాన్ని మాండలికాలుగా పిలుస్తారు.

మాండలిక నిఘంటువులు వచ్చినపుడే సంపూర్ణ దేశ్య నిఘంటు నిర్మాణం సాధ్యమవుతుంది. భావప్రకటనకు భాష ముఖ్యమైతే - ఆ భాషకు ప్రాణం మాండలికం. ఇదే అసలైన తెలుగు. మాండలికాలు భాషకి సజీవ చిహ్నాలు. మాండలిక పదాల స్వరూపాలవల్ల ప్రాచీన కావ్యాల్లోని కొన్ని పదాలకు స్పష్టంగా అర్థనిరూపణ చేసే వీలు కలుగుతుంది. ఎందుకంటే ప్రాచీన కవులు ఎంతటి ఉద్ధండ పండితులైనా సందర్భోచితంగానో, కావాలనో, ఛందస్సు కోసమో. కారణమేదైనా మాండలికాలను ప్రయోగించారు. తెలుగు అకాడమీ జిల్లాలవారీగా మాండలిక వృత్తి పదకోశాలను ప్రచురించింది. డా.అక్కిరాజు రమాపతిరావు సంకలనకర్తగా తెలుగు అకాడమీ 1985లోనే ‘మాండలిక పదకోశం’ ప్రచురించింది. అయితే ఈ కృషి కొనసాగకుండా ఆగిపోయింది. పైగా మాండలికాలంటే తెలుగులో నాలుగే వున్నాయన్న అభిప్రాయం స్థిరపడింది. ఎపుడో కోస్తా, తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయసీమ మాండలికాలని వర్గీకరించారు. ఇవాళ ఇదే నిశ్చయం కాదు. కోస్తాలో గోదావరి మాండలికం వేరు, గుంటూరు మాండలికం వేరు. రాయలసీమలో చిత్తూరు, కడప మాండలికాలు వేర్వేరు. ఇలా ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసివుంది.మన తెలుగు పదాలు చాలా పదాలు నిఘంటువులోకి ఎక్కలేదు. ముఖ్యంగా ఈ పల్లెటూళ్ళలో చాలా చిన్న చిన్న కులాల్లోనూ, వృత్తుల్లోనూ మాట్లాడే వాళ్ళ పదాలు కొన్ని విస్మరించబడ్డాయి. క్షేత్ర పర్యటనకు వెళ్ళినపుడు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షుల పేర్లుచెప్పారు. మట్టగిడిసకొర్రమేను,బొమ్మిడాయి,శీలావతి,గొరక,ఇంగిలాయి, జల్ల, బొచ్చ, జడ్డువాయి, చేదుపరిగె, వాలుగ, పండుకప్ప, గండిబొడిగి, కొయ్యంగ, మునగపాము, గుడగ్గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార,చాకిరొయ్య, గడ్డికొయ్య, మాలతప్పడాలు, ఏటిజల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజల్ల, పారాటాయి ఇలా ఎన్నో పేర్లు. అనునిత్యం చేపలు పట్టుకుంటూ ఈ చేప ఇది, ఈ చేప ఇది అని దాని నిర్మాణాల్ని బట్టి దానికి పేరు పెట్టుకున్నాడు. అలాగ పక్షుల పేర్లు పరజ, ఆసాబాతు కళాయి, చేతేనబాతు, నల్లముక్కలు, సముద్రపు చిలక,నత్తకొట్టుడు ఇలా చాలా ఉన్నాయి. ఈ భాషా పదాలు ప్రజల వ్యవహారంలో ఉన్నపుడు ఇవన్నీ నిఘంటువుల లోనికి చేరవలసిన అవసరం ఉంది. తెలుగు భాష మరింత సుసంపన్నం కావాలంటే మామూలు ప్రజల భాషల్లోంచి పదాలను తీసుకొని ఒక మహానిఘంటువును తయారు చేయాల్సిన అవసరం ఉంది.

నేటి అవసరాల దృష్ట్యా తెలుగు భాషకు ప్రాముఖ్యత పెరిగింది. శాస్త్ర, సాంకేతిక, పరిపాలన, విద్య, సాహిత్య రంగాలలో తెలుగు వాడుక పెరిగింది. సమాచార సాధనాలు కూడా తెలుగును ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. తెలుగు భాషా వైశాల్యాన్ని దర్శించడానికి, భాషకు ప్రజా జీవితానికి గల పరస్పర సంబంధ పరిణామాలను అవగాహన చేసుకోవడానికి, తెలుగు భాషను ప్రామాణీకరించడానికి, దేశ్య పదజాలాన్ని ప్రమాణ భాషలో పునరుజ్జీవింపజేయడానికి, మాతృభాషలో కొన్ని సామాన్య శాస్త్ర గ్రంధాలు రచించడానికి, వయోజనవిద్యా వ్యాప్తికి తెలుగు పరిసర భాషలతో గల సంబంధాన్ని నిరూపించడానికి మాండలిక పదసేకరణ చేయాలి. వృత్తి మాండలిక పదకోశాలను ఇదివరకే తయారు చేశారు. తెలుగు పద సంపద సంపూర్ణంగా ఉండాలంటే వాడుకలో ఉన్న సామాన్య మాండలిక పదాలను సేకరించి సంపూర్ణ మాండలిక పదకోశం అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడం నేటి అవసరాల దృష్ట్యా అత్యంత ఆవశ్యకం.తెలుగు భాషలోని అన్ని రకాలైన పదాలతో కూడిన సమగ్ర, సంపూర్ణ మాండలిక పదకోశం తయారుచేసి భావితరాలకు అందించాలనే సంకల్పంతో ’తెలుగు మాండలిక పదసేకరణ’ అనే ప్రాజెక్టును ఆచార్య కె. ఆశీర్వాదం, ఆచార్య నడుపల్లి శ్రీరామరాజు గారి పర్యవేక్షణతో భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్) మైసూరు వారి సహకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం చేపట్టి పూర్తి చేయడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం.

తెలుగు భాషలోని సొగసు, మాధుర్యం, నాదం, ఆత్మ, ఆత్మీయత, సృజనాత్మకత, మౌళికత, సార్థకత, మట్టివాసనలు ఆవిష్కరించడానికి ఈ మాండలిక పద సేకరణ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడింది. భాషకు సంబంధించిన రహస్యాలు ఎన్నో ఈ క్షేత్రపర్యటనవలన తేటతెల్లమయ్యాయి. మన పూర్వికులు వాడిన, మనకు తెలియని పదాలు, తెలిసినా ఆసక్తి లేక, పదాలకు సరిగా అర్థం తెలియక మరుగున పడిన అనేక పద రత్నాలు ఈ పర్యటనలో బయట పడ్డాయి.

పదసేకరణ విధానం:ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు మాండలిక పద సేకరణ కొరకు బహు భాషావేత్తలై, నిఘంటు నిర్మాణదక్షులైన ఎనిమిది మంది క్షేత్ర పరిశోధకులను ఎంపిక చేయడం జరిగింది. వీరు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోనూ పర్యటించి ప్రశ్నావళిని నింపడంతోపాటు సంభాషణలను రికార్డు చేయడం ద్వారా పదసేకరణ చేయటం జరిగింది. భాషలో సజీవంగా ఉన్న సాక్ష్యాలను గుర్తించి ఆయా మాండలికాల వ్యవహర్తలతో భాషను రికార్డు చేయడం జరిగింది. అలాగే అవసరమున్న చోట ప్రతి సన్నివేశాన్ని కెమెరా ద్వారా చిత్రీకరించడం జరిగింది. వృత్తి పరంగా, ఆర్థిక స్థాయి వల్ల, విద్యా పరంగా, వయస్సు రీత్యా భాషలో వచ్చిన వైవిద్యాలను ఆడియో, వీడియోల ద్వారా కూడా పద సేకరణ జరిగింది.

పదసేకరణకు ఎంచుకున్న సామాజిక వర్గాలు: తెలుగు పలుకుబళ్లతోనే కొత్త తలంపులకు మాటలు కల్పించే శక్తి జానపదుల సొమ్ము. తెలుగు భాషా స్వరూపాన్ని సమగ్రంగా దర్శించడానికి జానపదుల వాడుకలోని మాటలన్నిటిని సేకరించి కోశరూపంలో సంకలనం చేయటంలో ఎక్కువ శాతం యాభై సంవత్సరాలు పైబడినవారినే వ్యవహర్తలుగా ఎంపిక చేయడం జరిగింది. అధిక సమాచారం సేకరించడం కొరకు వివిధ కులాలవారు, వివిధ మతాలకు చెందిన వారు, స్త్రీలు, పురుషులు, చదువుకున్నవారు, చదువు లేనివారు, బాలురు, బాలికలు, ద్విభాషీయులు, శ్రామిక వర్గాలు, ధనిక వర్గాలు, సాంస్కృతిక వర్గాలు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధులు, మైదాన ప్రాంతాలవారు, అటవీ ప్రాంతాలవారు, నదీతీర ప్రాంతాలవారు, సముద్ర తీర ప్రాంతాలవారు, కొండలు గుట్టలలో నివాసముండే ప్రజలు మరియు సామాజిక సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాము. మూఢనమ్మకాలు, డ్రామాలు, వీధినాటకాలు, బుర్రకథలు, స్త్రీల పాటలు, జోలపాటలు, లాలిపాటలు, గొబ్బి పాటలు, నలుగు పాటలు, బత్కమ్మ పాటలు, నారేత పాటలు, శ్రామిక గేయాలు, శ్రామిక గేయాలు, సోదె చెప్పేవారి మాటలు, చిలుక జ్యోస్యం చెప్పేవారి మాటలను రికార్డు చేసి వాటిలో వచ్చే మాండలిక పదాలను సేకరించాలని నిర్ణయించుకున్నాము. ఇరుగు పొరుగు భాషా ప్రాంతాలలో తెలుగుదేశానికి చిరకాలంగా ఉన్న సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలవల్ల ఆయా భాషలలో ఉండే ఆటలు ఎన్నో సరిహద్దులను దాటి నాలుగు మూలలనుండి తెలుగు భాషలోనికి ప్రవేశించాయి. అందుకనే సరిహద్దు జిల్లాల్లో నివసించే ప్రజల వ్యవహారం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే విలక్షణంగా ఉంటుంది కాబట్టి సరిహద్దు గ్రామాలలో కూడా మాండలిక పదసేకరణ చేయడం జరిగింది.

క్షేత్ర ఎన్నిక విధానం: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలోనూ తెలుగు మాండలిక పదసేకరణ జరిగింది. ఒక జిల్లాను ఎంచుకున్నపుడు ఆ జిల్లాలోని మండలాలను ఎంపిక చేసుకొని మండలంలోని దగ్గరగా ఒక గ్రామం, దూరంగా ఒక గ్రామం ఎంపిక చేసుకున్నాము. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను ఎంపిక చేసుకున్నపుడు ఈ జిల్లాలో 66 మండలాలుఉన్నాయి. ఎనిమిదిమంది క్షేత్ర పరిశోధకులు ఒక్కొక్కరు మూడు మండలాలచొప్పున ఎంపిక చేసుకొన్నాము. మమ్డలాల ఎంపికలో జిల్లా మధ్యలో ఉన్న్న మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మండలాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. మండలంలోని ఏయే గ్రామాలలో యాస ఎక్కువ ఉందో తెలుసుకని ఆయా గ్రామాలకు వెళ్ళి పదసేకరణ చేశాము.

వ్యవహర్తల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు:


వ్యవహర్త వయస్సు 50 సంవత్సరాలు పైబడి ఉండాలి

అదే గ్రామంలో పుట్టి పెరిగినవాడై ఉండాలి.

ఇతర ప్రాంతాలలో ఎక్కువకాలం ఉండి మళ్ళీ వచ్చినవారిని పరిగణనలోకి తీసుకోలేదు.

వీలైనంతవరకు వ్యవహర్త మాట ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. పళ్ళు ఉండాలి

వీలైనంతవరకు వ్యవహర్త సమీప నగర సంపర్కం ఉండకూడదు.

సేకరించవలసిన పదజాలం పరోక్షంగా రాబట్టాలి

ప్రత్యేకంగా తయారుచేసిన చార్టులలోని బొమ్మలను చూపించడం ద్వారా పదసేకరణ సేయడం జరిగింది

జీవన చక్రం, ఆచార వ్యవహారాలు, వంటలు తయారుచేసే విధానం, వ్యవసాయం చేసే పద్దతి, కథలు, జానపద గేయాలు వంటివాటిని రికార్డు చేసి అందులో ఉండే పదజాలాన్ని సేకరించడం జరిగింది.

ప్రశ్నావళిలో పొందుపరచిన వివరాలు:గ్రామదేవతలు, దేవతలు, పండుగలు, జాతరలు,ఆటలు-సాధనాలు,చెట్లు(పూల మొక్కలు, పండ్లచెట్లు), జంతువులు (పెంపుడు జంతువులు, క్రూర జంతువులు), పక్షులు (పెంపుడు పక్షులు, నీటి పక్షులు, వలస పక్షులు), రోగాలు (మనుషులకు, పశువులకు, పక్షులకు వచ్చే రోగాలు), క్రిములు, కీటకాలు, శరీర భాగాలు (మనుషులు, జంతువులు, పక్షులు), ఇంట్లో వాడే వస్తువులు (వంటగది, పడకగది, స్నానాలగది మొదలైనవి), వంటలు- చేసే విధానం, (పిండివంటలు, మాంసాహారం, శాఖాహారం), రుచులు, బంధువాచకాలు, అలంకరణ సామగ్రి (పురుషులు, స్త్రీలు), తూనికలు-కొలతలు, సంఖ్యాపదాలు (మనుష్యులకు,వస్తువులకు, జంతువులకు) వృత్తికి సంబంధించిన విషయాలు (వ్యవసాయం, చేనేత, కుమ్మరం, కమ్మరం, వడ్రంగి, చెప్పులు కుట్టడం, తోళ్ళపదును, మేదర, తాపీ, మంగలి, కల్లుగీత, లోహపు నగిషీ, కలంకారీ, వడ్డెర, శిల్పం, గాజుల తయారీ, బెల్లం తయారీ, సున్నం తయారీ, ఇటుకల బట్టీ, పెంకుల తయారీ, నూనె తీయడం, దూది ఏకడం, దూదితీయడం, బొమ్మల తయారీ, వంటలు చేయడం, బట్టలు కుట్టడం మొదలైనవి), పకృతికి సంబంధించిన విషయాలు (భూమి, ఆకాశం, వాతావరణం), కాలాలు-కార్తెలు, రంగులు, లోహాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రయాణ సాధనాలు, తిట్లు, జాతీయాలు, సామెతలు, పొడుపుకథలు, మానవ జీవన చక్రం (పుట్టినప్పటినుండి చనిపోయేవరకు వివిధ దశలలో చేసుకొనే కార్యక్రమాలు), ఆచారాలు, మూఢనమ్మకాలు, ఉప సంస్కృతి, క్రియలు-వాటి అన్వయాలు, చిన్నపిల్లల భాష, భావోద్రేకాలు మొదలైనవి ప్రశ్నావళిలో పొందుపర్చడం జరిగింది.

సేకరించిన పదాలను వృక్ష వర్గ పదావళి(ఆకు కూరలు, కాయలు, కూరగాయలు, చెట్లు, ఔషధమొక్కలు, దుంపలు, గడ్దలు, ధాన్యాలు, పండ్లు, పూలు), జీవ వర్గ పదావళి (కీటకాలు, కప్పలు, చేపలు, జంతువులు, జంతువుల ఆహారం, జంతువుల రోగాలు, జంతువుల అవయవాలు, పక్షులు, పాములు), మనుష్య వర్గ పదావళి (బంధు వాచకాలు, మనుషుల రోగాలు, శరీర భాగాలు, హోదా తెలిపేవి, తిట్లు), పర్యావరణ వర్గ పదావళి(ఆకాశం, కార్తెలు, కాలాలు, భూమి, రంగులు, లోహాలు), జానపదవర్గ పదావళి (ఆభరణాలు, ఆటలు, దేవతలు, గ్రామ దేవతలు, వాద్యాలు, పండుగలు, జీవన చక్రం), సాంఘిక వర్గ పదావళి (కొలతలు, నాణెములు, ప్రయాణ సాధనాలు, వస్త్రాలు, కులం), వృత్తివర్గ పదావళి (వ్యవసాయం, చర్మకారులు, వడ్రంగం, తాపీపని, కుమ్మరం, మేదరి, కంసాలి, చాకలి, మంగలి, వ్యాయామం, కుస్తీ, చేనేత, కల్లుగీత మొదలైనవి), గృహ-గ్రామ వర్గ పదావళి (ఆహారం, పిండవంటలు, మాంసాహారం, నూనెలు, వెచ్చాలు, రుచులు, వంటపాత్రలు, ఇల్లు-ఇంటిపరిసరాలు, గ్రామం-గ్రామంల్ వస్తువులు), భాషావర్గ పదావళి (క్రియలు, నామాలు, విశేషణాలు, అవ్యయాలు, వ్యాకరణ పదావళి, రూపాంతరాలు, జంటపదాలు), సాహిత్య వర్గ పదావళి (సామెతలు, పొడుపు కథలు)గా వర్గాలుగా విభజించి కంప్యూటర్ లో నిక్షిప్తం చేయడం జరిగింది.

ప్రశ్నావళి, నోట్ బుక్, నోట్ ప్యాడ్, టేప్ రికార్డర్, క్యాసెట్లు, వివిధ వర్గాలకు చెందిన చార్టుల ఫైలు, మ్యాపులు, కెమెరా, పెన్నులు, పరిశీలనలో రాసుకోవడానికి చిన్న నోటుబుక్కు మొదలైన సరంజామాతో కేత్రపర్యటనకు బయలుదేరేవాళ్ళం. ప్రయాణంలో పక్కన కూర్చున్న వారితో మాటలు కలిపి ఒకవేళ ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే అనేక వివరాలను అడిగి తెలుసుకునేవాళ్ళం. వారు మాట్లాడేటపుడు వచ్చే పదాలను జాగ్రత్తగా గమనిస్తూ ప్రత్యేకమైన మాండలిక పదజాలాన్ని రాసుకునేవాళ్ళం. బస్సులోని వారి సంభాషణలను వింటూ పదజాలాన్ని రాసుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మాండలిక పదావళిని సేకరించడానికి బస్సులో వెళ్తున్నపుడు ఒక అబ్బాయి కిటికీ నుండి తల బయటకు పెట్టినపుడు ప్రక్కన ఉన్న అబ్బాయి తల్లి బుర్రొక్కడుద్ది అన్నది. అంటే తల బయట పెట్టకు తలకు రంధ్రం పడుతుంది అనే అర్థంలో వాడింది. మరొక సంధర్భంలో తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో బస్సు ప్రయాణంలో కండక్టరు ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ ను ఆ వ్యక్తి కింద పడేసుకొని నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదని కండక్టర్ ను దబాయించాడు. ఆ కండక్టరు అతన్ని బూకరిత్తున్నావేటి అన్నాడు. అంటే అపద్ధం చెబుతున్నావేమిటి అని అర్థంలో ఉపయోగించాడు. నెల్లూరు పర్యటనల లాడ్జిలో దిగినప్పుడు అక్కడి మేనేజరుకు అడ్వాన్సుగా 500 రూపాయల నోటు ఇచ్చినపుడు పెద్దకాగదం ఇస్తున్నారు నా దగ్గర అన్నీ బందాలే ఉన్నాయి అన్నాడు. కాగదం అంటే నోటు అనీ బంధాలు అంటే నాణేలు అనీ అర్థం అయింది. అక్కడ పనిచేసే వారి దగ్గరి నుండి కూడా అనేక సమాచారాన్ని రాబట్టి వాటిలో నుండి మాకు కావలసిన మాండలిక పదాలను సేకరించేవాళ్ళం. గ్రామాలకు వెళ్ళినపుడు ముందుగా సర్పంచిని గానీ స్కూలు ఉపాద్యాయులను గానీ, ఆ ఊరి పెద్దలను గానీ కలిసి మాండలిక పదసేకరణ గురించి చెప్పేవాళ్ళం. మనం మాట్లాడుతున్న భాష తెలుగే అయినప్పటికీ రాయలసీమ, తెలంగాణ, కళింగాంధ్రలలో వివిధ యాసలతో మాట్లాడుతున్నారు కదా. ఇలా మాట్లాడే పద్దతిని మాండలికం అంటాం. ఈ పదాలను మన ఊరి పెద్దలను అడిగి రాసుకోవడానికి వచ్చాం. ఒక వస్తువును వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఇంద్ర ధనుస్సును కాముడు భీముడు, కాముడిబిళ్ళ, వక్రం, బాణం, కొరుడు, కొర్రు, అరిల్లు, హరివిల్లు, అరివిల్లు, వానవిల్లు, సింగిడి అని అనేక పేర్లతో వ్యవహరిస్తున్నారు. అలాగే గోంగూరను తెలంగాణాలో పుంటికూర అనీ, రాయలసీమలో గోగాకు అనీ, శ్రీకాకుళంలో జనపకూర అనీ, తూర్పుగోదావరిలో గోంగూర లేదా పుల్లకూర అనీ పిలుస్తారు. వీటిని మన ప్రాంతంలో ఎలా వ్యవహరిస్తామో తెలుసుకుందామని వచ్చామని చెప్పేవాళ్ళం. యాభై సంవత్సరాలకుముందు మాట్లాడిన మన తెలుగు భాష ఇప్పుడు మారింది. ఇక యాభై సంవత్సరాల తర్వాత మాట్లాడ బాషలో మార్పు రావచ్చు. కాబట్టి మన భాషా సంస్కృతులను భావి తరాలకు అందించాలంటే ఇప్పటి మన భాషన గ్రంధస్థం సేసినట్టయితే మనం భావితరాలకు మేలుసేసినవారమవుతామని చెప్పినపుడు వారు బాగా స్పంధించి ఉత్సాహంతో మరిన్ని కొత్త సంగతులను తెలియజేసేవారు. పరోక్షపద్ధతి ద్వారా ప్రశ్నలను అడిగి ప్రశ్నావళిన నింపేవాళ్ళం. వ్యవహర్తకు పని ఉండి వేరే వ్యక్తిని పరిచయం చేసి వెళ్ళేవాడు. తిరిగి అతడు ఆ పని పూర్తి చేసుకొని వచ్చే వరకు అక్కడే కూర్చొని రాసుకొంటుండడం చూసి అతను చాలా ఆశ్చర్యానికి లోనై మమ్మల్ని అభినందించేవాడు.

అలాగే మానవ జీవన చక్రానికి సంబంధించిన అన్ని విషయాలను రికార్డు చేసేవాళ్లం. అందులో శ్రీమంతం, పురుడు, ఊయలలో వేయడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సమర్త, పెళ్ళి, చావు మొదలైన మనిషి జీవన చక్రంలోని ఆచార వ్యవహారాలను అడిగి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని రికార్డు చేసేవాళ్ళం. వ్యవహర్తను అడుగుతున్నపుడు వాళ్ళకు గుర్తుకురాని విషయాలను వారి ఇంటిలోనివారిని అడిగి తెలుసుకొని మరీ చెప్పేవారు. మిగిలిన విషయాలను వారి ఇంటిలోని స్త్రీలు ముందుకు వచ్చి కావలసిన సమాచారాన్ని ఇచ్చేవారు.


పండుగలు జరుపుకునే విధానం, ఆచార వ్యవహారాలను రికార్డు చేసేవాళ్ళం. సమాచారాన్ని మరిచిపోయినపుడు సంధర్భాలను గుర్తుచేసి సమాచారాన్ని రాబట్టుకునేవాళ్ళం. గర్భవతి అయింది అనడానికి నీళ్ళోసికుంది, కడుపుతో ఉంది, యాగిటయింది, నెల తప్పింది అని వివిధ ప్రాంతాలలో అంటారు. సమర్త అయింది అనడానికి పుష్పవతి అయింది, రజస్రాలు అయింది, రుజువయింది, ఎదిగింది, పెదమనిషయింది, గండిబగిలింది, చేతికచ్చింది అని వ్యవహరిస్తారు. కేశఖండనాన్ని పుట్టెంటుకలు దీయడం, మునిదేవర, ఎంటికలు దీసుడు అని, శోభనాన్ని పరుబ్బటించడం, గర్భదాన మూర్తం, పల్దానం అని అంటారు.

ఆ ఊరిలో జానపద గేయాలు పాడేవారు ఉన్నారా అని అడిగి వారిదగ్గరికి వెళ్ళి లాలిపాటలు, జోలపాటలు, శ్రామిక గేయాలు, కూలిపాటలు, గొబ్బి పాటలు, బతుకమ్మ పాటలు, పెళ్ళిపాటలు మొదలైన ఎన్నోరకాల పాటలను రికార్డు చేసుకునేవాళ్ళం. ఆ సమయంలోనే పాటలలో వచ్చే మాండలిక పదావళిని రాసుకునేవాళ్ళం. భక్తి పాటలు పాడేటపుడు పూలపేర్లు, ఆభరణాల పేర్లు ఎక్కువగా వచ్చేవి.

వివిధ వృత్తులవారిని కలిసి పనిముట్ల పేర్లను రాసుకొని అవసరమైతే వారి మాటలను రికార్డు చేసుకునేవాళ్ళం. బంధువాచకాలలో నాయనమ్మను అమ్మాయి, అవ్వ, జేజమ్మ, జేజి అని వ్యవహరించేవారు. తాతను జేజినాయన అని వియ్యంకున్ని యీరకాడు, యీయలకాపు, యియ్యంకుడు, బిగుడు అని వ్యవహరించేవారు. తోడికోడలిని యారాలు అని, మేనత్తను బాప్ప అని, అక్కను అప్ప అని పిలుస్తారు. ఆభరణాల విషయానికొస్తే వడ్డాణాన్ని డావు అని, బెల్టును ముడ్డోర అని, చేదబావిని గిలకబావి అని, చేదర బాయి, మంచినీళ్లబాయి అని పిలుస్తున్నారు. తోమడం అంటే తిక్కడం అని, వెంట్రుకలను ఈకలని పిలుస్తున్నారు. తూనీగను తుమ్మీగ, తూనిక్కట్టి, దువ్వెన, బూగ, తూరింగ అని, దోమను గొయిక అనీ, నల్లతేలును మండ్రగబ్బ, నండ్రగబ్బ, ఇన్పతేలు, ఇంగిళీకం, పొట్టు అని, గమేలాను ఇన్పగుల్ల, టకార అనీ వ్యవహరిస్తున్నారు. బొద్దింకను లచ్చిందేవి పురుగు, రిల్ల, పరడ, లచ్చిమి పురుగు అనీ, వ్యవహరిస్తున్నారు. కళింగాంధ్ర మాండలికాలలో కాపీనం అంటే అత్యాస, కోరిక అనీ, కాయిదా అంటే కాపలా అనీ, కారం అంటే చాకలిసోడా అనీ, కిల్లలు అంటే దెబ్బలు అనీ, బేగి అంటే తొందర అనీ, బైపోతు అంటే ముంగిస అనీ, బైసి అంటే పరువు అనీ, వర్ర అంటే కారం అనీ, వాజీబు అంటే అలవాటనీ, సొన్నారి అంటే స్వర్ణకారుడు అనీ పిలుస్తున్నారు. అలాగే కొలతలవిషయానికొస్తే జోడ అంటే రెండు అనీ, పుంజిడు అంటే నాలుగనీ, చెయ్యి అంటే అయిదు అనీ, నాలుగు చేతులు అంటే ఇరవై అనీ వ్యవహరిస్తున్నారు. ఇంకా సామెతలు, పొడుపుకథలకు కొదువేలేదు.

క్షేత్రపర్యటనలో ఎదుర్కొన్న ఇబ్బందులు: పదసేకరణ కొరకు బాగా వెనుకబడిన గ్రామాలను ఎంపిక చేసుకొనేవాళ్లం కాబట్టి ఒక్కోసారి గ్రామాలకు నేరుగా బస్సులు ఉండేవికాదు. రోడ్డులో దిగి చాలాదూరం నడవాల్సివచ్చేది. దారిలో గ్రామస్తులతో మాటలు కలిపి వారిద్వారాకూడా పదసేకరణ చేయడం జరిగింది. వ్యవహర్తల ఎంపిక చేసుకొన్న తర్వాత ఆ వ్యవహర్త ఎక్కువ సమయం మాతో ఉండేవాడుకాదు. దానివల్ల మరొక వ్యవహర్త కొరకు వెతకవలసి వచ్చేది. వ్యవహర్తలు మనకు కావలసిన సమాచారాన్ని ఇచ్చి జానపద గీతాలు పాడిన తర్వాత డబ్బును ఆశించేవారు. కొందరు మాకేమి లాభం అంటూ తప్పించుకొనేవారు. కొన్ని గ్రామాలలో మధ్యాహ్న భోజనం దొరికేదికాదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉండేది. కులపిచ్చి ఇంకా అక్కడక్కడా ఉండడం వల్ల కొంత ఇబ్బందిపడ్డాము. ఈ ఇబ్బందులన్నీ చాలా తక్కువ గ్రామాలలో మాత్రమే పడ్డాం. మాతృభాషపట్ల పూర్తి మమకారంతో వెళ్ళిన ప్రతిచోటా అక్కడి గ్రామస్తులు అందించిన సహకారం మరువలేనిది. భోజన సమయం అయినపడు భోజనం పెట్టి ఆదరించేవారు. కొన్నిసార్లు పదసేకరణ నిమిత్తం రాత్రి వరకు ఆ గ్రామంలోనే ఉండవలసి వచ్చేది. ఎందుకంటే వ్యవహర్తలు ఎక్కువగా తమ పనులనుండి సాయంత్రం, రాత్రి సమయాలలోనే లభించేవారు. పదసేకరణ చేసుకొని రాత్రి అయినపుడు బస్సు సౌకర్యం లేనపుడు వారి వాహనం ద్వారా లాడ్జి దగ్గర దిగబెట్టడం వరకు వారి సహకారం మరచిపోలేని మధురానుభూతి. తెలుగు భాషా పరిరక్షణలో భాగంగా తెలుగు విశ్వ విద్యాలయం చేపట్టిన ఈ ప్రాజెక్టులో క్షేత్ర పరిశోధకునిగా పనిచేయడం నాకు దక్కిన అత్యంత గౌరవం.

సేకరించిన పదాలను జిల్లాలవారీగా మాండలిక పదకోశాలను చేయవచ్చు, ప్రాంతాలవారీగా తులనాత్మక పదకోశాన్ని నిర్మించవచ్చు అంతేగాకుండా రికార్డు చేసి సేకరించిన జానపద గేయాలను, మనిషి జీవన చక్రాన్ని, ఆచార వ్యవహారాలను అంతర్జాలంలో ఉంచినట్లయితే పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది.

జాతికి జీవనాడి, సంస్కృతికి కేంద్ర బిందువు, సమాజానికి దాని ఉనికికి మూలం అయిన మాండలికాన్ని తెలుగు రచయితలు, కవులు విస్తృతంగా వాడి, మాండలికాన్ని, తెలుగు భాషను, భాషా సంస్కృతిని, పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. మాండలికం చిగురులు వేసి కొమ్మలు, రెమ్మలై విస్తరిస్తే తెలుగు భాష అభివృద్ధి, విస్తృతి జరిగినట్లే! తెలుగు భాషను మాండలికాన్ని బ్రతికించుకొని పెంచి పెద్ద చేసే మార్గంలో తెలుగు ప్రజలమైన మనం నడవాలని ప్రతిజ్ఞ తీసుకొందాం.

మాండలికాల కోసం ఉద్యమించడం తెలుగు భాషని ప్రేమించేవారి తక్షణ కర్తవ్యం. అవును. మాండలికాల్లో రచనల కోసం, అధ్యయనం కోసం జీవభాషను ప్రేమించేవారు ఉద్యమించాలి.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)