వీక్షణం

మాసం మాసం శ్రుత సాహిత్యం



- నాగరాజు రామస్వామి


ఈ నెల 14 న వీక్షణం సమావేశం పాలడుగు శ్రీచరణ్ గారి ఇంట్లో (సాన్ హోజే ) జరిగింది. సుమారు ముప్ఫై మంది తెలుగు సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు. వేద గురువు శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారు తమ మంగళాచరణాలతో, వేదమాతాస్తవ శ్రావ్య శ్లోకాలతో కార్యక్రమానికి శుభారంభం చేశారు. సాహిత్యాభిలాషి ఐన శ్రీచరణ్ గారు స్వతహాగా సంస్కృత అభినివేశీ, ఆధ్యాత్మిక అనుశీలీ అవడం వల్ల వేదగురువుతో సభ ప్రారంభంకావడం ముదావహం.

శ్రీచరణ్ గారు ఇదివరలో రచించిన 'ఛందః పద్మములు' గ్రంథప్రాశస్త్యాన్ని వారు కొనియాడారు. కార్తీక మాసం లో మిల్పీటాస్ లోని వేద దేవాలయంలో శ్రీచరణ్ గారు 30 రోజులపాటు క్రమం తప్పకుండా విరచించి సమర్పించుకున్న శ్లోకాల సమాహారం "హరిః ఓమ్ కార్తీకే రుద్రాభికోత్సవే ధ్యానమ్ "గ్రంధాన్ని శ్రీ వెంకట నాగాశర్మ గారు ఆవిష్కరించారు. హరిహరాద్వైత ఛందస్పందము ఈ గ్రంథమని ప్రశంసించారు.

మాతృభాషకు మరణం లేదని, మననం వల్ల భాష చిరంజీవి అవుతుందని, అలాంటి ప్రయత్నపర్యవసానమే ఈ "వీక్షణం" అని వాక్రుచ్చారు.



శ్రీచరణ్ గారు ప్రథమ వక్త. శీర్షిక "వేదం లో సాహిత్య విశేషాలు". వేదాల గురించి మాట్లాడుతూ, అవి కేవలం ఆధ్యాత్మిక మత వాజ్మయాలుగానే పరిగణించబడుతూ వస్తున్నందున , సాహిత్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వబడని కారణంగా కాలక్రమేణ అవి మనకు దూరమై పోతున్నవని వాపోయారు. ఇంకా ఇలా చెప్పుకు పోయారు. “వేద ప్రమాణం మారనిది. నిజానికి 'ప్రమాణం' అన్నపదాన్ని నిర్వచించింది వేదమే. వేదాలు శబ్దప్రధానాలు.స్వర నిబధ్ధాలు. శబ్దోచ్చారణ లోనూ, స్వరప్రకాశం లోనూ ఎలాంటి అస్పష్టత ఉండదు. వేదాలు సంహితలుగా, బ్రాహ్మణాలుగా, అరణ్యకాలుగా , ఉపనిషత్తులుగా విస్తృతి నొందినవి. ఆ తరువాత యజుర్వేదం కూడా కృష్ణ, శుక్ల యజుర్వేదాలుగా వృధ్ధి నొందినవి. వేదం అక్షర పరబ్రహ్మం.మహర్షులు ద్రష్టలు. వాళ్లు శబ్దాన్ని విన్నారనటం కన్నా శబ్దాన్ని చూచారనటం సమంజసం. వేదము నందలి స్వరవిశేషం ఉదాత్తంగా, అనుదాత్తంగా, స్వరితంగా విభజన చేయబడింది. ఇది ధాతువులలో, సమాసాలలో ఉక్తిదోషం లేకుండా చేసుకో వీలైన విధానం.స్వరం మారితే అర్థం మారే ప్రమాదముంది. ఉదాహరణకు "రాజపుత్ర" అనే పదబంధం సందర్భాన్నిబట్టి తత్పురుషగాను, బహువ్రీహి గాను, ద్వంద్వ,కర్మధారయ సమాసంగానూ వర్తింప చేసుకునే వీలుంది.





ఇంద్రుణ్ణి చంపడానికి యజ్ఞం చేస్తూ వాగ్దోషం వల్ల, తత్పురుష సమాసం బహువ్రీహి గా మారి , అర్థం తలకిందులై తానే మరణించిన ఉదంతం ఉంది. అలాంటి అస్పష్టతకు అవకాశం లేని స్వర సంవిధానం వేదంలో ఉన్నందునే అపౌరుషేయాలైన వేదాలు ఎలాంటి మార్పులకు లోనుగాకుండా నిలిచి ఉన్నవి. పరిశీలిస్తే వేదం లో కథాకధనమే గాక నాటకీయత కూడా చూడవచ్చు. స్థిరమైన సాహిత్య రీతులు సంగ్రహంగా పొందుపరచబడి ఉన్నవి. అలాంటి వేదాలకు మనం దూరం కావడం దురదృష్టకరం. ఇలా శ్రీచరణ్ గారు సాహిత్య దృక్కోణంలో వేదజ్ఞానాన్ని సభికులకు ఎరుకపరచారు.

తరువాత స్వీయకథాపఠనం లో భాగంగా తాటిపాముల మృత్యుంజయుడు గారు కథ వినిపించారు. కథ పేరు "ఆర్ యూ రెడీ? ". ఈ కథ 'ఈ మాట' లో 2010 లో ప్రచురింపబడింది. సమకాలీన ఇతివృత్తం. వాసూ, రోజీలు ఈ కాలం యువ జంట. ప్రేమలో పడతారు. వారి ప్రేమ సినిమా వీక్షణాలతోనూ, పబ్బుల్లోను వర్ధిల్లుతుంది. తరువాత వాసు దృష్టి మరో అమ్మయి లావణ్య మీదకు పోతుంది. లావణ్యను తనదాన్నిగా చేసుకునే నిర్ణయాన్ని తెలిపేందుకు అతను ఆమె వద్దకు పోతాడు. వాళ్లిద్దరూ బీచ్ లో నడచిపోతుంటారు. లావణ్య తెలివిగా ఈ కాలపు యువ ప్రేమ వ్యవహారాల కథ వినిపిస్తుంది. సున్నితంగా, భావనిశితంగా (sentimental) ఆమె వినిపించిన కథ అతని  ఆత్మసాక్షికి(conscience) ఎక్కడో తగిలి ఉంటుంది. అతను లావణ్యను శాశ్వతంగా తక్షణం విడచి వెళ్లేందుకు వెనుతిరుగుతాడు. లావణ్య ఎక్కడికి వెళుతూన్నావని కేక వేస్తుంది. 'రోజీ దగ్గరకు' అంటున్న వాసు మాటలు సముద్ర ఘోషలో లావణ్యకు వినిపించవు. ఇందులో ఉన్న కిటుకేమిటంటే లావణ్య, రోజీలు ఇద్దరు మిత్రులు. కావాలనే లావణ్య కథ నడుపుతుంది. ఈసంగతి వాసుకు గాని, పాఠకునికి గాని ముగింపు వరకు తెలియకపోవడం కొసమెరుపు. కథ నడిపిన తీరు బాగుంది.



ఆ తరువాత గునుపూడి అపర్ణ గారు 'కాలచక్రం' అనే కథను వినిపించారు. ఈ కథ అపూర్వ చిత్ర (సినీ నిర్మాణ సంస్థ ) సహకారంతో కథల పోటీలో ఎంపికై "కౌముది" 2012 లో ప్రచురించబడింది. కథావస్తువు నేటి మధ్యతరగతి సభ్య కుటుంబంలో వంశపారంపర్యంగా సాగుతున్న జీవన సరళి. తరానికీ, తరానికీ మధ్య ఆలోచనా విధానం లో మార్పు వస్తున్నట్టు గానే కనిపించినా, మౌలిక మైన జీవన సంవేదనలు అవే. ఉత్తమ పురుష లో రాసిన కథ. తన చిన్నతనం లో తన తలితండ్రులు తన మాట వినేవారు కారు.ఇప్పుడు తన పిల్లలు వినటం లేదు. ఇది పిల్లల పెంపకంలో తలెత్తే సమస్య. కాలచక్రగమనంలో ఆమె డాక్టర్ అవుతుంది. తండ్రి పోతాడు. తల్లి వృద్ధాప్యంలో ఆమె ఇంట్లోనే వుంటుంది. పిల్లల పెంపకం లో తల్లి అనుభవించిన సమస్యలన్నీ ఇప్పుడు ఆమె అవగాహనలోకి వస్తున్నవి. తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించిన సంగతి ఆలస్యం గా తెలిసి వస్తుంది. తల్లి మానసిక పరిస్థితి వికటించి చిన్నపిల్లలా మారాము చేస్తుంటుంది.ఇందరు పిల్లలను పెంచిన తల్లి ఈ రోజు పసిపిల్లగా మారడం సృష్టి లోని కాలచక్ర మహిమ. తల్లిని బుజ్జగిస్తూ హార్లిక్స్ తాగమని బతిమాలే దైన్య స్థితిలో కథ ముగుస్తుంది. సంఘటనల సమాహారం చక్కగా కుదిరడం వల్ల కథ రక్తి కట్టింది.


ఇక్బాల్ గారి అరబ్బీ భాషాశాస్త ప్రసంగ సిరీస్ లోని భాగంగా ఈ ఉపన్యాసం సాగింది. అరబ్బీ లిపి, వ్యాకరణ సంబంధమైన పలు విషయాలను వివరించారు. అరబ్బీ వర్ణమాలలో 28 అక్షరాలు ఉంటాయని, అవి సూర్య చంద్ర విభాగాలుగా పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. అరబ్బీ లోని మూడు షార్ట్ వోవెల్స్ అ , ఇ , ఉ లను మార్చి రాసే పద్దతిలో భాష ఎలా సంతరించుకున్నదో  వివరించారు. భాషా కుటుంబాలు వేరైనా ఉర్దూ, అరబ్బీ భాషల లిపి ఒకటేనని తెలిపారు. రానున్న సమావేశం లో మరింత లోతుగా చర్చిస్తానని చెప్పారు.

స్నాక్ బ్రేక్ తర్వాత కవిసమ్మేళనంతో కార్య క్రమం తిరిగి ప్రారంభమయింది. తొలుత నాగరాజు రామస్వామి చదివిన కవితలు 'అమెరికాలో ఆకురాలుకాలం' , 'సుప్రభాతం' . డా|| కె.గీత “వానంటే భయం లేదు” అనే చక్కని వచన కవితను వినిపించారు. విజయలక్ష్మి గారు "హుత్ హత్ తుఫాన్" కవిత చదివి విశాఖ లో ఈ మధ్య వచ్చిన తుఫాన్ భీభత్సాన్ని కళ్ళకు కట్టించారు. శంషాద్ గారి "నిన్నటి మీరు , రేపటి నేను" వచనకవిత అందరికీ నచ్చింది. శ్రీచరణ్ గారు ఆధ్యాత్మిక పద్య కవిత "పులిగోరు" చదివారు. వారి కవిత్వం లో వారు వాడిన "కండ సిరి ", "భస్మాంగ రాగమ్", "ఆకాశ వైతాళికం" "భూపుత్ర గేహం" వంటి పదబంధాలు కవితను ప్రౌఢ కవిత్వంగా మలచాయి.

ఆఖరున ఆసక్తి కరమైన సాహిత్య క్విజ్. శ్రీ కిరణ్ ప్రభ ( కౌముది సంపాదకులు) నిర్వహించిన క్విజ్ విజ్ఞాన దాయకంగా ఉండి అందరినీ ఆనంద పరిచింది.

సమావేశంలో - రచయితలూ, కవులు, అంతర్జాల సాహిత్య సంచికల సంపాదకులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, సాహిత్యాభిరుచి ఉన్నసాంకేతిక నిపుణులు- ఇలా భిన్న క్షేత్రాలలో అభినివేశం ఉన్న తెలుగు అభిమానులందరూ ఒక చోట చేరి సాహిత్య సమాలోచనంలో పాలుపంచు కోవడం అభినందించదగిన విషయం.

సుమారు మూడు గంటల పాటు ఆత్మీయంగా సాగిన సాహితీ సమావేశం డా.గీత గారి వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)