ఒక స్వరాక్షరం కోసం

- నాగరాజు రామస్వామి

తెల్లవార్లూ సాగిన సంగీత కచేరీలోఅలసిన రాత్రి
ఆవులిస్తున్నది ఆరుబయట
ఇంకా ఆరని వెన్నెల స్వరగంధం .
ఉషస్సంధ్యలో హృదయం రసనిష్యందం !

నేను వేకువ కషాయాన్ని కాఫీ కప్పులో కరిగించు కుంటూ
యూట్యూబ్ వొంపిన సునాద సుధను ఆస్వాదించుకుంటూ
చూపుల తూపులను విసిరాను కిటికీ గుండా
చివరి స్వరచరణం ఏదైనా చిక్కుతుందేమోనని.
తొలి కిరణం గుచ్చుకుంటుందని
తొందరిస్తున్నది భూపాళం !

జారుతున్న తమసు తెరలను తొలగించుకుంటూ
పలుకుతున్నది విభావారికి భైరవి మంగళం !
దూరాన , తూర్పు తీరాన
ఏటివాలులో ఎండుటాకు హిందోళమై తేలుతున్నది
సమయరాగ ఉదయ కిరణ ఆలాపన
అలవోకగా సాగిపోతున్నది
వంశీవనం సుమాళించు చిరచీకటి వేణు గీతి
లే పవనం చెంగలించు పిల్లగాలి ఈల పాట
యమన్ కళ్యాణీ రాగ జతుల జుగల్బంది !

ఆ నిసర్గ స్వరరాగ సమ్మేళనంలో
ఆ ఆనందారుణ రాగోదయ సంధ్యలో
శ్రవణ సౌభాగ్యం ప్రాభాత చాక్షుష సౌఖ్య మైన వేళ
నేను సంగీతాన్ని తాగి సాహిత్యాన్ని పుక్కిలించాలని
ఒక సృజనాక్షరం కోసం , ఒక సుస్వరం కోసం
ఆరాట పడుతున్నాను !

ఒక్క క్షణం స్వరాక్షరంగా మారి పోవాలని
పరితపిస్తున్నాను !

---* ఒక రాగ పంక్తి లోని ఒక స్వరం ( note of the music), అదే స్థానం లోని అక్షరం (syllable in the lyric) ఒకటే అయినప్పుడు అది స్వరాక్షరం.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)