ధారావాహికలు

రామ నామ రుచి

- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం

శిథిలమైన గ్రామం


తే.గీ.

మఱుసటి దినమం దూరిలో తిరిగినాడ
గ్రామ మే రీతి నుండెనో కనుకొనగను
కళ్ళు చెమ్మగిల్లెను నాకు, కడుపులోన
త్రిప్పినట్లయ్యె ఆ యూరి తీరుచూడ.

ఆ.వె.

ఊరు పెరిగె గాని ఉన్న ఇళ్ళకు కనగ
వెల్ల లేక చివికి పెల్లులూడె,
కప్పులందు పెద్ద కన్నాలు కన్పట్టే
తలుపులుండు చోట తడికలుండె.

ఆ.వె.

వెనుక లేని ‘తారు’ వీధు లిపుడు వచ్చె
కాని రోడ్ల నిండ కంత లుండె;
ఇళ్ళ నుండి కుళ్ళు నీళ్ళు రోడ్లను పాఱె
ముఱుగు కాల్వలన్ని పూడియుండె.

ఆ.వె.

‘నల్ల’ లుండె గాని నీళ్ళ చుక్కయు రాదు
మూడు నాళ్ళ కొక్కనాడు గాని,
వచ్చు నీళ్ళు గూడ పుచ్చె పుర్వుల తోడ,
త్రాగు నట్టులైన రోగ మొదవు.

ఆ.వె.

వీధు లందు కలవు విద్యుత్తుదీపాలు
జ్వలన మొంద వవియు ‘పవరు’లేక,
రోడ్ల తిరుగు గొడ్లు రుద్దుకొనగ నడ్లు
ఉన్న స్తంభము లుపయుక్తమయ్యె.

మ.

కనగన్ నా చిననాటి యూరు బహుధా కాలుష్యమై హెయమై
పొనుగయ్యెన్, దరిబేసులైరి జనులున్, పోకాడె సౌభాగ్యముల్,
తన పూర్వాతిశయంబు మంట గలిసెన్, దారిద్ర్య భూతంబు తె
య్యని నాట్యంబొనరించె, వీక చెడి పౌరానికముల్ క్రుంగిరిన్


కం.

ఆ సాయంతనము హితుని
నే సాయంబుగ పిలుచుకొని వెడలినాడన్
గాసిలి పొలిమేరను గల
ఆ సరసికి, నిమ్నగకు, నహార్యంబునకున్

తే.గీ.

చెత్తమొక్కల తోడను చెఱువునిండె,
ఆనకట్టయు చూడంగ గానబడదు
ఇసుక పెద్ద మేటలు వేసె నేటిలోన
నీరు పాఱక గుంటల నిలిచె యుండె.

ఆ.వె.

వరిని సాగు చేయు వ్యవసాయమే లేదు,
పెక్కు పొలములందు దుక్కి సున్న
నీళ్ళూ లేక చేలు బీళ్ళుగా మారెను,
బావులన్ని యెండి బావురనియె

తే.గీ.

వరికి నీళ్ళు చాలక మెట్టపంట లచ్చ
లచట రైతులు విత్తినారవియుగూడ
వాన తగినంతగా లేక వాడియుండె,
పండబోయెడు కొన్ని చేలెండిపోయె.

 

(సశేషం)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)