చీకటి

కప్పగంతుల సత్యనారాయణ

భోజనాలయ్యాయి. రామచంద్రమూర్తి చెయ్యి తుడుచుకుంటూ, వరండాలోకి వచ్చి కూర్చుని పేపరు చదువడం ఆరంభించాడు. నాలుగు నిముషాలలో సీతకూడా వంటయింటి తలుపులు వేసుకుని తమలపాకులూ, వక్కపొడి సీసా, సున్నపు సీసా తీసుకొనివచ్చి మూర్తి ప్రక్కన కుర్చీలో కూచుంది. ముర్తి ఆమె వంక ఒకసారి చూసి, మళ్ళీ పేపరు చదువులో లీనమయాడు.

సీత వక్కపొడి అందించింది. మూర్తి అందుకుని నోట్లో వేసుకున్నాడు. సీత సున్నంరాసిన తమలపాకు చిలకను అందించింది. ముర్తి తలత్రిప్పి చూడకుండానే, చేత్తో చిలకను తీసుకుని నోట్లో వేసుకున్నాడు.

అంత దీక్షగా చదువుతున్నారు. ఏమిటది? అని అడిగింది సీత.

ఏదో నీకర్ధం కాదు. అని తల త్రిప్పి చూడకుండానే జవాబు చెప్పేడు. అక్కరలేని గొడవలు నాకెందుకుగాని, యివ్వాళకూడా వెళ్ళారు కాదేమండీ? అంది సీత.

ఎక్కడికి? అని అడిగాడు మూర్తి.

ఎక్కడికా? రోజూ చెప్పాలి కాబోసు. చెప్పి, చెప్పి నా గొంతుకి నొప్పి వస్తోంది కూడాను. ఉన్న రెండు చీరలూ చిరిగిపోయాయి. ఎవరు వచ్చినా, ఎదటబడడానికి సిగ్గేస్తోంది. ఇరవై రోజులనుంచి చెబుతూఉన్నాను. పోనీ, షాపుకి వెళ్ళడానికి మీకు తీరికలేకపోతే, ఆ డబ్బేదో నాకిస్తే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఎన్నాళ్ళు యీ చింకిగుడ్డలతో గడపనూ..? అంటూ, మరొక చలికను అందించింది సీత.

జవాబు చెప్పకుండా, ఆ చిలకను నోట్లో వేసుకున్నాడు మూర్తి.

మాట్లాడరేమండీ! మీకు కావలసిన సూట్లూ, బూట్లూ మాత్రం నిమిషంలో అమర్చుకుంటారు గదా – అని సీత కొంచెం జాలి మొహం పెట్టింది.

నేను కాస్త మంచిబట్టలు కట్టుకుంటున్నాననేనా, నీ యేడుపు? ఏడు అని విసుక్కున్నాడు మూర్తి.

అవును ఏడవక ఏంచేస్తాను? కాపురానికి వచ్చినప్పటినుంచీ, నా బ్రతుకు ఏడుపు బ్రతుకే అయింది. ఓ మంచిబట్ట చూశానా, అందమైన రవిక చూశానా? పైగా మెళ్ళో ఉన్న ఒక్క గొలుసూ, అయ్యగారి చేతుల్లోపెట్టిన దాకా, అయ్యగారికి నిద్ర పట్టలేదు. అని సీత అంటూ ఉండగానే మూర్తి అందుకున్నాడు.

సంసారానికి చాలకపోతే ఏం చెయ్యమంటావు? పెళ్ళాం మెళ్ళో గొలుసు తీసుకోవడం, నేటికి నేనొక్కణ్ణే చేసినపని కాదు. తగినంత సంపాదించుకోలేని ప్రతి వెధవా చేస్తూనే ఉన్నాడు. ఆ వెధవలలో నేనొక్కణ్ణి. వెధవని కనుకనే, సరైన సంపాదన లేకుండా పెళ్ళి చేసుకున్నాను. వెధవని కనుకనే, నువ్వన్న అడ్డమైన మాటలూ పడుతున్నాను. వెధవ పెళ్ళి, వెధవ సంసారమూనూ. ఛీ.. అంటూ చేతిలో ఉన్న పేపరు నేలకు విసిరికొట్టాడు మూర్తి.

నేనూ అలాగేననుకుంటున్నాను ఏ ట్రయినింగో చదువుకుని బ్రతక్కుండా మా నాన్న నన్నిలా చేశాడేమా అని. అనేసింది సీత.

నాకర్మం, నీ కర్మం నాకొద్దుబాబూ అని ఎంత బ్రతిమాలినా వినక, యీ సంబంధం తెచ్చి నాకంట గట్టాడు మా అన్నయ్య అని బయటపెట్టాడు మూర్తి.

ఇంకో సంబంధం చేసుకుంటే సుఖపడుదురన్నమాట. ఆ దరిద్రపు ప్రొద్దు నా మొహాన్నే పొడిచిందన్నమాట. ఇలాటి వెధవ బ్రతుకు బ్రతకడం కంటే, ఏ నూతిలోనో, గోతిలోనో పడి చచ్చినా బాగుండును. ఏం సుఖపడుతానని, యీ యింటిని అంటిపెట్టుకుని చావడం. వెధవ వంటలక్కలాగా బ్రతకడం కంటే చావడమే మేలు అంది సీత.

విసుగులోనూ, కోపంలోనూ సీత మొహంకేసి చూసి ఛస్తే చావు, నీకు అడ్డమొచ్చినవాడెవడూ యిక్కడ అనేశాడు మూర్తి.

సీతకు కోపం పట్టరానంతగా వచ్చింది. ఎందుకు ఇలాటి వెధవ బ్రతుకు. అని దభాలున వీధితలుపు తీసుకొని, భడేల్మని వేసేసుకుని సీత బయటకి వెళ్ళిపోయింది.
పది నిముషాలలో ఇంత ఘోరమైన పరిణామం వచ్చిందేమా అని అలోచిస్తూ దిగ్భ్రమచెంది మూర్తి అలాగే, కుర్చీలో కూచున్నాడు.

ఒక నిమిషం కూడా గడవలేదు. మెల్లిగా తలుపు తెరుచుకుని సీత లోపలికి వచ్చింది.

మూర్తి తలయెత్తి, తెల్లపోతూ ఆమెవంక చూశాడు.

బయటంతా చీకటి గబ్బగీములాగ ఉంది. ఏ దొంగ వెధవలేనా తల పగలగొడతారేమోకూడానూ. అంటూ పడకగదిలోకి వెళ్ళింది సీత.

  • ***  మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)  పేరు:
  ఇమెయిల్:
  ప్రదేశం:
  సందేశం:
   
   

  సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
  సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
   


  గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


  (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)