సాహిత్యంలో చాటువులు. 14.

- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు


“ సుకవితా యద్యస్తి రాజ్యేన కిం” మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందులకు. అన్నారు పెద్దలు. “స హితస్య భావం సాహిత్యం” హితాన్ని కలిగించేది సాహిత్యం. అది మనోరంజకము, మార్గ నిర్దేశ్యము, అజరామరము. కనుకనే “విశ్వశ్రేయః కావ్యం” అనికూడా అన్నారు. “మానిషాద’ అని వాల్మీకి నోటినుండి వెలువడిన సాహిత్యం శ్రోతస్వినిలా నిరంతరం లోకంలో ప్రవహిస్తూనే ఉంది. మనల్ని నడిపిస్తూనే ఉంది. అట్టి సాహిత్యం నిత్యము,సత్యము,శాశ్వతము.

ఉదయించే సూర్య కిరణాలలోని నులివెచ్చదనపు సుఖాలని, పిండి ఆరబోసినట్లు జగమంతా వ్యాపించిన వెన్నెల కిరణాలలోని చల్లదనాన్ని, ఉదయకాలంలో వికసించే కుసుమాల సోయగాల్ని, చిగురాకులు మేసి కూసే కోయిల గానాన్ని,సెలయేటి గలగలల్ని, కరి మబ్బులను చూసి పరవసించి, చేసే మయూర నృత్యాలని, చెంగు చెంగున ఎగిరిదూకే తువ్వాయి పరుగులని, పసి పాపల బోసి నవ్వుల్నీ, తొలకరి జల్లులకి పులకరించిన భూమి వెదజల్లే మట్టి వాసనలని, ఇలా భగవంతుడు మనకి ప్రసాదించిన ప్రకృతిలోని అందాలని, మనకనులముందు ఆవిష్కరింపజేసేదే కవిత్వం. అంతేకాదు, అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు, కోపాలు,తాపాలు, మానసిక సంఘర్షణలు, సుఖ దుఃఖాలవంటి అనేక భావాలను ప్రకటించి, అనుభవింప జేసేదికూడా కవిత్వమే!

హృదయాలని ద్రవింప జేసే ఈ ఉదాహరణ చూడండి!--- “ ఓ వ్యక్తి కారాగారంలో శిక్ష అనుభవిస్తూ, చివరిదశలో ఉంటాడు. అతణ్ణి చూడటానికి బాలింతరాలైన అతని కుమార్తె వస్తుంది. తాగడానికి నీళ్ళు కూడా లభించక దాహంతో అలమటించే తండ్రి దీనస్థితిని చూసి మిక్కిలి కలత చెందిన ఆమె తన ‘స్తన్యాన్ని’ తండ్రికి ఇచ్చి అతని దాహార్తిని తీర్చి చరితార్థ అవుతుంది.” ఓ చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని వర్ణించి చెప్పే అపురూప దృశ్యం పై ఉదాహరణ. కవిత్వం నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటనీరు తెప్పిస్తుంది, మునుముందుకు నడిపిస్తుంది. కనుకనే “ కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ. అట్టి అద్భుతమైన, అంతులేని సాహిత్య సముద్రంలోని కెరటాలవలేనున్న సాహిత్య ప్రక్రియల్లో ఒకటైన చాటు సాహిత్యాన్ని చదివి,ఆనందిద్దాం రండి.---

పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష నవ్వు తెప్పిస్తుంది. అట్లాంటి చాటు పద్యం ఇది. శార్దూల పద్యం.

“ అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే?
విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిస్సారషే !
విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ
ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!”


చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి ( అప్పట్లో కొళాయిలు లేవు) బిందెలు తోముకొంటూ జరిపిన సభాషణ,పై  చాటు పద్యం. భావం వివరిస్తాను.

“ అవునే చూసావా! (అంటే ప్రక్కావిడ పలకలేదు.) ఏమే నీకుచేముడా!(రెండో ఆమె) అయ్యో అలాగా ఏమిటి? (అని అడిగింది) విస్సా వఝలవారి అమ్మాయిని (బుఱ్ఱి అంటే అమ్మాయి) మన విస్సాయికి (కుర్రవాడికి) ఇచ్చి పెళ్లి చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత కళగా ఉంటాడో” అని శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు మాటాడుకొంటారు. చూసారా ఎంత చక్కని చాటుపద్యం కవి కలంనుండి జాలువారిందో!  ఇట్టిదే ఇంకో చాటు వాక్యాన్ని చూడండి

“ ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరవేశాను. అది ఎండిందంఛావా? లేదంఛావా?” అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే అరుగు. గావంచా అంటే చిన్ని టవలు. ఇంకో చమత్కారయుతమైన చాటు వాక్యంచూద్దాం.

ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్ళికి కొంతమంది కవులు,పండితులు వెళతారు. వివాహానంతరం వారికి సంభావనలు (డబ్బులు) ఇచ్చేటప్పుడు ఆ యజమాని కవులకి కొంచెం ఎక్కువ, పండితులకి తక్కువగా సంభావనలు ఇస్తాడు. వారిలో ఒక కవికి తక్కువ సంభావన వస్తుంది. ఆ కవికి కోపంవచ్చి యజమానితో ఇలా అంటాడు. (ఇవి పద్యపాదాలు) “ కవిగనుము కనులు లేవా!”

నేను కవిని నీకు కనిపించటం లేదా? అని. యజమానికూడా పద్యపాదంలోనే కోపంగా సమాధానం చెపుతాడు. “ కవివైతే ‘చంకనాకు’ గంటంబేది?” అని. (పూర్వం వ్రాసుకోడానికి తాటాకులు ఉపయోగించేవారుకవులు. అట్టి తాటాకుల కట్ట చంకలో పెట్టుకొనేవారు. మొలకి వ్రాసుకొనే గంటం వ్రేలాడేది.) నువ్వు కవివైతే నీ చంకన్+ఆకు= చంకలో ఆకు, మొలలో గంటం ఏది? అవి లేవు కనుక పండితుడనుకొని సంభావన తక్కువగా ఇచ్చేను. అని సమాధానం. ఇందులో ఇంకో చమత్కారం “ చంకనాకు” అనేది ఓ తిట్టు కూడా! (కోపంతో నా చంకనాకు అని అంటారు) ఇట్టి హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు సాహిత్యంలో కోకొల్లలు

 

( వచ్చేనెల మరికొన్ని.)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)