విజయలక్ష్మి రవీంద్ర నాధ్

Dr.చాగంటి కృష్ణకుమారి


మన దేశం లో ఎక్కువ శాతం తల్లి తండ్రులు ఆడపిల్ల చదువులను డిగ్రి తో ఆపేసి పెళ్ళి చేయాలను కొంటారు . ఈ 21 శతాబ్దం లో కొంత మార్పువచ్చినప్పటికీ, 1960 లలో ఈ పరిస్థితి బాగా వుండేదనే చెప్పవచ్చు. అంతకు మించి చదివించితే వారికి తగిన విద్యార్హత లు గల వరుడు దొరకడం కష్టమనే భావనే అందుకు ప్రధానమైన కారణం

చదువు కొంటూ పోతే వయసు మీరితూ వుంటుందనీ,అందువల్ల కూడా వారికి తగిన జోడీ దొరకదనే భయం మరో కారణం.మహా అయితే పి.జి పూర్తిచేసే వరకూ ఆగి ఆపైన వరాన్వేషణ మొదలు పెడతారు.ఆ విధంగా కాస్త చదువుకొన్న వర్గాలలోని ఆడపిల్లలు సైతం పి .జి. చేస్తూనే వివాహ జీవితం లోకి అడుగు పెడతారు.అందుకు భిన్నంగా ఉద్యోగాలు చెస్తూనో, లేదా పరిశోధన చేస్తూనో మరి కొంతకాలం వారు కన్యలుగా కొనసాగుతూ వుంటే అందుకు ఆర్ధిక పరమైన లేదా ఇతరములైన కారణాలు వుంటాయి.

పరిశోధన పట్ల ఆసక్తి అందుకు తగిన సమర్ధత గల వారికి సైతం వారు అడువారు అయితే వారి విద్య పిజిస్థాయి దగ్గర ఆగి పోతుంది.కొండొకచో పి.జి పూర్తి చేసినప్పటి కీ, పరిశోధనలో చేరినప్పటికీ పరిశోధనాజీవితాన్ని కొనసాగించడం వారికి జరగని పని.ఎందువల్ల నంటె సరిగ్గా ఆసమయానికి వారు వివాహితు లై బిడ్డలను కనే వయసుకు వచ్చివుంటారు. చూలింతగా,బాలింతగా,పిల్లలని సాకేతల్లిగా ఆమె తన పరిశోధనాసక్తిని చంపు కొంటుంది. మరీ ముఖ్యం గా విజ్ఞాన సాంకేతిక రంగాలలో పరిశోధన స్థాయి లో స్త్రీల సంఖ్య అంతంతమాత్రంగా ఉండడానికి ప్రధానమైనకారణం ఇదే! నూటికో కోటికో ఒకరిద్దరు మహిళలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలొ మేలైన పరిశోధనా ఫలితాలను సాధిస్తూ ఎంతో ఎత్తుకి ఎదిగి ఉన్నత పదవులలో పనిచెస్తూ కనిపిస్తారు.

అటువంటి కొద్దిమంది వనితల్లో విజయలక్ష్మిరవీంద్రనాధ్ ఒకరు. స్వతః సిద్దంగా తెలివితేటలూ పరిశధనాశక్తీ, సమర్ధతలు గల విజయలక్ష్మి కి ఇటు తల్లితండ్రుల అండదండలు, అటు భర్త రవీంద్రనాధ్ అందించిన చేయూత, తోడ్పాటూ , కొడుకు ఆసరా కూడా దండి గా లభించాయి .ఆమెకు బుద్ది కుఱపిన ఆచార్యులుసతం అపారమైన ప్రోత్సాహ సహకారాలను అందించారు. ఇది మన దేశంలో చాలా అరుదైన సందర్భం .

విజ్జి 1953 అక్టోబర్ 18న చెన్నై లో తమిళుల ఇంట పుట్టింది. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో 1972లో డిగ్రీ పూర్తి చేసే సరికి ఆమె తల్లి,ఇతర కుటుంబభ్యులు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపేయాలని గట్టి పట్టు పట్టారు.విజ్జి పిజి చేస్తానంది. తండ్రి సరే నన్నాడు.కుటుంబంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఆయన కూతురిని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం చదువు కోవడానికి చేర్చాడు. విజ్జి పి.జి పరీక్షలో అత్యున్నత స్థానాన్నిసంపాదించ డిగ్రిని పొందింది.బెంగుళూర్ లోని ‘ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్’ లో ప్రోజక్ట్ అసిస్టెంట్ గా చేరింది. అక్కడ భాగవతుల రవీద్రనాధ్ తో పరిచయం అయింది. 1981 నాటికి మైసూర్ సి.ఎఫ్. టి.ఆర్.ఐ. రీసెర్చ్ ఫెలోషిప్ తో పిహెచ్ డి పట్టా పొందింది. రవి కూడా ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే ఆర్గానిక్ కెమిస్ట్రి లో పి జి చేసి ఢిల్లి విశ్వవిద్యాలయంలో ఆచార్య శేషాద్రిగారి దగ్గర చేరి పిహెచ్ . డి. చేసాడు. ఇండియన్  ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్’ లో అప్పుడు సైన్టిస్ట్ గా పని చెస్తున్నాడు. రసాయన పరిశోధనలో పొందే ఆనందం, విషాదం, కష్టం, సుఖం అన్నీ ఎరిగివున్నవాడు. పరిశోధనాశక్తి ,కుశాగ్రబుధ్ధి గల విజయలక్ష్మిని చేపట్టాడు. ఆమె విజయ పంధాన నడిచేటందుకు తోడుగా నిలిచాడు. విజయలక్ష్మి ‘విజయలక్ష్మిరవీంద్రనాధ్’ గా తెలుగింటి కోడలైంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొంది తెలుగువారిక తమిళులకు కూడా గర్వకారణమైంది.

పిహెచ్ . డి. అయ్యాక పోస్ట్ డాక్టొరల్ చేయడానికి విజ్జి కి యు.ఎస్.లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్.ఐ.హెచ్.) నుండి పిలుపు వచ్చింది.అప్పటికి ఆమె పసిబిడ్డడి తల్లి.

“పిల్ల వాడిని మేము చూసుకొంటాం నువ్వు వెళ్లు”- అన్నారు ఆమె భర్త ,తల్లితండ్రులు. ఎన్.ఐ.హెచ్. వాషింగ్టన్,డిసి లో రెండు సంవత్సరాలు విజిటింగ్ ఫెలోగా పని చేసింది.అక్కడ డాక్టర్ మెఖైల్ బోయడ్ ఆమెకు బుద్ది కఱపిన గురువు. అతని నుండి విజ్జి మంచి ప్రోద్బలాన్ని పొందింది. ఇండియాకి రాగానే బెంగుళూరులోని నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ లో చేరింది. స్వత్రంతంగా పరిశోధనా జీవితాన్ని ప్రారంభించింది. మొదట్లో చాలా గడ్డు పరిస్థితులను చవి చూసింది.ఎందుకంటే పరిశోధనకు కావలసిన మూలధనాన్ని సమకూర్చుకోవడం చాలా కష్టమైన సంగతి.ఒక అసోసియెట్ ప్రొఫసర్ గా పని చేస్తున్న వ్యక్తికి అది వంశంకాని పని. నిరాశ చెందుతూ తానొంటరిననే భావనకు లోనయ్యింది. ఇంతలో డాక్టర్ బాయెడ్ ఆమెతో కలసి పరిశీధన చేయదలచినట్టుగా తెల్పుతూ అందుకు మనసా పూనుకొన్నాడు. ఇద్దరు కలసి మూలధనాన్ని సమకూర్చు కొనడానికై ప్రతిపాదనలను తయారుచేసి ధనాన్ని రాబట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. “డాక్టర్ బాయడ్ సాధన సంపత్తులను సమకూర్చుకొనడంలో నాకు సాయపడి పరిశోధన నిరాటంకంగా కొనసాగేలా చూసాడు, మేధోపరమైన ఆసారానిచ్చి ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా మా సమఉజ్జీలతో పరిచయాలవడానికి చక్కని వేదికను అందించాడు. అందువల్లే నేనీస్థాయికి రాగలిగాను” అని విజ్జి చెపుతుంది.

బెంగుళూర్ లోని ‘నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ కి చెందిన సైకోఫార్మకాలజి (మెదడు పైమందులు పనిచేసే తీరును వర్ణించే శాస్తం) విభాగంలో మొదట పూల్ ఆఫీసర్ గా చేరిన విజయలక రవీంద్రనాధ్ క్రమక్రమంగా పదోన్నతులను పొందుతూ 2000 సంవత్సరం నాటికి నాడీమండలరసాయనశాస్త్ర విభాగం లో(డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో కెమిస్ట్రి) ఆచార్యపదవికి చేరుకొంది.

నాడీశాస్త్రాలలో (న్యూరోసైన్సెస్) లో ఆమె సాధించిన పరిశోధ నా ఫలితాలకి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. వైద్య చికిత్స శాస్త్ర ( మెడికల సైన్సెస్) విభాగంలో 1996లో ఎస్.ఎస్.భట్నగర్ ప్రతిస్టాత్మక పురస్కారాన్నిపొందింది. 2001లో ఓమ ప్రకాష్ భాసిన్ , 2006లో జె.సి బోస ఫెలోషిప్ లను అందుకొంది.

అంతర్జాతీయ పరిశోధనా పత్రికలైన 'న్యూరో సైన్స్ రీసెర్చ్’, ’న్యూరో టాక్సిసిటి రీసెర్చ్’ వంటి అనేక పత్రికలకి సంపాదక సభ్యురాలైంది. గవర్నింగ్ కౌంన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బ్రేన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐ.బి.ఆర్.ఒ.) లో సభ్యత్వాన్ని పొందింది “ ఆసియా ఫసిఫిక్ రీజినల్ కౌ న్సిల్ ఆఫ్ ఐ.బి.ఆర్.ఒ.” కి పాలక మండలి సభ్యత్వాన్ని పొందిన మొట్టమొదటి ఇండియన్ గా నిలిచింది. దేశంలోగల మూడు సైన్స్ అకాడమిలైన నేషనల్ ఎకాడమి ఆఫ్ మెడికల్ సై న్సెస్,ఇండియా, ఇండియన్ ఎకాడమి ఆఫ్ న్యూరోసైన్సెస్ ,

థర్డ్ వర్ల్డ్ఎకాడమి ఆఫ్ సై న్సెస్ కికి విజ్జిని ఆహ్వానించారు. 2000 సంవత్సరం సెప్టెంబరులో ఆ సంస్థ వ్యవస్థాపకురాలిగా,సంచాలకురాలిగా నియమిస్తూ ఉత్తరవులను జారీ చెసారు.

“ పోస్ట్ డాక్టొరల్ సంవత్స రాలలో నేను నాకుటుంబానికి దూరంగా వున్నాను. ఎన్. బి.ఆర్.సి ని నెలకొల్పే క్రమంలోనూ ,ఆ తరువాత సంచాలక పదవీ బాధ్యతలను చేపట్టడం వల్ల మళ్ళీ నేను నా కుటుంబ సభ్యులకు దూరంగా వున్నాను. దాదాపు పది సంవత్సరాల పాటు నేను ఢిల్లి , బెంగుళూర్ లమధ్య తరచూ ప్రయాణాలు చేస్తూ ఎక్కువ కాలం గడిపాను. నా ఈ వృత్తి జీవితాన్ని కొనసాగించుకొనడం లో నా కుటుంబసభ్యులు నాకు అపరిమితంగా సహకరిస్తూ అండాగా నిలిచారు . స్నేహితుల నుండి నా సమఉజ్జి శాస్త్రవేత్తల నుండి లభించిన సహాయం చెప్పుకోదగ్గది. అతి తక్కువ సమయంలో జాతీయస్థాయిలోనేకాక అంతర్జాతీయ స్థాయి లోనూ మహోత్కృష్టమైన కేంద్రంగా ఎన్. బి.ఆర్.సిపేరు తెచ్చుకొంది. డీమ్డ్ యూనివర్సిటి ప్రతిపత్తిన పొందింది. దేశం లోని డిబిటి, సిఎస్ఐఆర్, ఐసిఎమ్ ఆర్ వంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ లలొ డీమ్డ్ యూనివర్సిటి హోదాను పొందగలిగిన ఏకైకసంస్థగా ఎన్. బి.ఆర్.సి ఎదిగింది. వ్యవస్థాపక సంచాలకురాలిగా విజయలక్ష్మి రవీంద్రనాధ్ ప్రదర్శించిన చురుకుదనం, శక్తివంతమైన నాయకత్వ లక్షణాల వల్లే అది సాధ్యమైంది.

విజయలక్ష్మి రవీంద్రనాద్ మానవ మెదడులోజరిగే ఔషధ జీవ క్రియ ( డ్రగ్ మెటబాలిజమ్) పై పరిశోధనలకు బాటవేసిన ప్రధమురాలు. కాలేయంతో పాటూ మనోక్రియాశీల ఔషధాల చికిత్సాచర్యలను మెదడు కూడా ప్రభావితం చేస్తుందని ఆమె చేసిన పరిశోధన వెల్లడించింది . విజయ సాదించిన ఫలితాలు మనో వైకల్యాల చికిత్సలో ఉపయోయోగపడె కొంగ్రొత్త మనోక్రియాశీల ఔషధాలను అభివృద్ది చేయడంలో తోడ్పడ్డాయి. సాధారణంగా మానసిక రోగులలోకనిపించే మందులు పనిచేయకపోవడం అనే లక్షణానికి గల ఫార్మకోడైనమిక్స్అవగాహనను ఆమె ఫలితాలు కలగజేసాయి. ( ‘ ఫార్మా కొడైనమిక్స్’ శారీరక క్రియలపై, జీవరసాయన క్రియల పై మందులు తీసికొని వచ్చే ప్రభావలను, మందు పనిచేసే క్రియా సంవిధానాన్నీ, ఇచ్చిన మందు గాఢతకీ అది చూపే ప్రభావానికి గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది.) ‘అటాక్సియా’ లో కనిపించె శారీరక ప్ర వృత్తులు క్రమం తప్పడం, మనో దౌర్బల్యం తో కూడిన ఉన్మాదం వంటి నరాల క్షీణత వల్ల ఏర్పడె రకరాల వైకల్యాల మూలం, వికాశాలగురించిన విజ్ఞానాన్న ిఆమె ప్రయోగ ఫలితాలు వెల్లడించాయి. మోటార్ న్యూరన్, పార్కిన్సన్ రోగాలతో నున్న జంతునమూనాలతో చేసిన అధ్యయనాల ద్వారా ఎంతో విలువైన సమచారాన్ని సేకరించగలిగింది .విటమిన్-ఇ వంటి సాంప్రదాయక ఆంటీ ఆక్సిడెంట్ కంటె ఎక్కువగాథయోల ఆంటీ ఆక్సిడెంట్లు నరాలకు రక్షణని ఎక్కువగా ఈయగలవని ఆమె పరిశోధనా ఫలితాలు ప్రధానంగా చెప్పాయి. నాడీక్షీణత వైకల్యాలు రావడంలోను అవి పెరగడంలోనూ స్త్రీలకీ పురుషులకీమధ్య కనిపించే తేడాలను అధ్యయనం చేసింది. ఆడువారి హార్మోన్ అయిన ఈస్ట్రొజన్ నరాలకు ఇచ్చేరక్షణ విషయమై ఆమె పరిశోధనా ఫలితాలు చక్కని వివరాలను వెలుగులోకి తెచ్చాయి. మందుమొక్కల కషాయాలు ఆల్జిమర్స్ రోగపు లక్షణాల తీవ్రత ను తగ్గించిన వైనాన్ని ,ఉపశమనాన్ని కలగచేసిన సందర్భాలనూ జంతు నమూనాలపై ప్రయోగ పూర్వకంగా ప్రదర్శించి చూపింది వీటికి పేటెంట్ లను పొందింది.

ఎన్. బి.ఆర్ . సి. వ్యవస్థాపక సంచాలకురాలిగా ఆసంస్థకి ప్రపంచం పలు మూలలనుండి వివిధ వైజ్ఞానిక శాఖలకుచెందిన నిపుణులు వచ్చి చేరేలా ఆకర్షించగలిగింది. మానవ మెదడును అవగాహన చే సుకొనడానికి ,ఒకరితోఒకరు విషయ పరిజ్ఞానాన్నిపంచుకొంటూ ముందుకు సాగాలన్నది ఆమె నమ్మకం. అందువల్ల ఆసంస్థలో అణు జీవశాస్త్రంనుండి శరీరధర్మశాస్త్రం, కంప్యుటేషనల్ సై న్స్ , గణితం దాకా అన్నివిభాగాలవారూ వున్నారు. మన భారతదేశంలో ఒకే సమస్యపై నిష్ణాతులైన జీవ శాస్త్రజ్ఞులూ, గణితజ్ఞులూ కలసి పనిచేస్తున్న ఏకైకసంస్థగా జాతీయ మెదడు పరిశోధనాకేంద్రం ( నేషనల్ బ్రేన్ రీసెర్చ్ సెంటర్) నిలిచింది.

నేను నా విద్యార్దినులకు ‘ మీరు రబ్బరుబంతిలా తయారుకావాలి , దానిని ఎంత గట్టిగా నేలకేసికొడితె   అది  అంత ఎత్తుకి ఎగురుతుంది’ అని చెపుతూవుంటాను” అని విజ్జి అంటుంది.

“ స్త్రీలు విజ్ఞాన సాంకేతిక రంగంలో పరిశోధనను చేపట్టిన తొలి రోజులలొనూ , శాస్త్రవేత్తలుగా ఎదిగే వయసులోనున్న ఆ సంవత్సరాల లోనే వారు పిల్లలనికని, వారిని పెంచే వయసు లోవుంటారు.ఆ తొలి వైవాహిక జీవితదశలోవారికి గట్టి రక్షణ వ్యవస్థ ,సహాయం అవసరం. అభివృద్ది పధాన నడుస్తున్నవృత్తి జీవితంతో ,వైవాహిక జీవితాన్నీ , పెరుగుతున్న కుటుంబాన్నీ సమతుల్యంగా సమర్ధించు కొనడానికి పడే అవస్థలలో ఆమెకు కుటుంబ సభ్యుల సహకారం లభించాలి. అప్పుడే అమె తన మేధో శక్తిని వెలికి తీయగలుగుతుంది. ఇటు పని ప్రదేశాలలోకూడా సమ ఉజ్జీల సమూహాన్ని ఏర్పరచుకొని తనదీ అయిన ఒక రక్షణ వ్యవస్థను ఏర్పరుచుకోడానికి ఆమెకు సమయం సరిపోదు. పని ప్రదేశంలో సాటివారితో విజయాలనూ,వైఫల్యాలనూ పంచుకోవడం అవసరం .ఒక శాస్త్రవేత్తగా జీవించే వ్యక్తికి ఇది తప్పనిసరి.ఈవిషయం లో నేను అపరిమితంగా లాభం పొందాను. శాస్త్రవేత్తలైన స్త్రీలు తమకు తాముగా ఒక నెట్ వర్క్ ని ఏర్పరచు కోవాలి, పరస్పరం సహకరించు కోవాలి అప్పుడే వా రికి వృత్తి జీవితంలొ తగిన వాతావరణం వుంటుంది “ అని చెపుతూ “ కొత్త తరంలో సాధికారిత గల శాస్త్రవేత్తల సంఖ్య పెరుగుతుంది; వారిలో మహిళలుంటారు; అంతేకానీ “మహిళాశాస్త్రవేత్త లు ” అని చెప్పబడె ఒక ప్రత్యేకవర్గం లేదంటుంది విజయలక్ష్మి రవీంద్రనాధ్.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)