ధారావాహికలు - సుందరకాండ

(గత సంచిక తరువాయి భాగం)

- డా.అక్కిరాజు రమాపతిరావు

నిరుత్సాహం వీడి మళ్ళీ సీతాన్వేషణం:

మళ్ళీ రాజవీధులలో, సందుగొందులలో, ఉద్యానవనాలలో, కొడలు, కొలనిగట్లు, సెలయేళ్లు, నదులు – అన్నీ గాలించినా ఆమె జాడ తెలుసుకోలేకపోయినాడు. సంపాతి ఏమో తాను నూరు యోజనాలైనా కంటితో చూడగలననీ, సీతాదేవి లంకలో ఉందనీ మాకు చెప్పాడు. కాని ఆమె నాకు ఇక్కడ కనబడలేదు. ఎక్కడ జనకమహారాజు! ఎక్కడ విదేహవంశం! ఆమె ఎంత అల్లారుముద్దుగా పెరిగింది. ఎంత సుకుమారి! చివరకు ఆమెకు ఇటువంటి శోకం సంభవించింది. రావణాసురుడు రామబాణం తనను వెన్నంటి వస్తున్నదని భయపడిపోడి ఆ తరువాత తీవ్రవేగంతో ఆమెను లంకకు తీసుకొస్తుండగా మధ్యలో ఎక్కడైనా పడిపోయిందేమో? లేదా సముద్రంలో పడిపోయిందేమో! జలచరాలకు ఆహారమై పోయిందేమో అని హనుమంతుడు భీతిల్లాడు. రావణాసురుడు క్రూరంగా తనను చెరపట్టి లంకకు తీసుకుని వస్తుంటే భయోద్వేగంతో గుండె పగిలి చనిపోయిందేమో! ఆమె ఎదురు తిరిగితే ఈ క్షుద్రుడే ఆమెను భక్షించాడేమో!

నేను కిష్కింధకు తిరిగివెళ్ళి ‘సీత నాకు కనిపించలేదు’ అని మిక్కిలి అప్రియమైన మాట రాముడికి చెబితే ఆయన జీవించడు. అన్న లేక లక్ష్మణుడూ బ్రతకడు. భరతశత్రుఘ్నులూ నశిస్తారు. వారి తల్లులూ జీవించరు. రాముడి ప్రియమిత్రుడైన మా రాజు సుగ్రీవుడూ ప్రాణాలు విడుస్తాడు. అతని భార్యలూ అంగదుడూ కూడా జీవించరు. అతనిపట్ల ఆదరంకల వానరజాతియే నశిస్తుంది. రాముడు కోపించి, వానరసైన్యాన్ని నాశనం చేసినా చేయవచ్చు అని హనుమంతుడు ఎంతో దుఃఖోద్విగ్నహృదయుడైనాడు.

హనుమంతుని అశోకవన ప్రవేశం:

ఇట్లా హనుమంతుడు విచారహృదయుడై లంకలో పరిభ్రమిస్తుండగా ఆయనక్కు ఒక గొప్ప ఉద్యానవనం కన్పించింది. దీలిలోకి వెళ్ళి ఇంతవరకు చూడలేదే? అని ఆయనకు అన్పించింది. అది దట్టంగా మహోన్నత వృక్షాలతో ఉంది అనుకుంటూ సమస్తదేవతలకూ హనుమంతుడు నమస్కారాలు చేశాడు. ఈసారి రాక్షసులను అందరినీ సంహరిస్తాను. మహాతపస్వికి తపస్సిద్ధిలాగా ఇక్ష్వాకువంశానికి చిరయశస్సు సముపర్జిస్తారు. అనుకుంటూ కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. అప్పుడాయన మనసులో కలత తీరిపోయింది.


నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః


రామలక్ష్మణులకు ముందుగా నమస్కారాలు. జనకనందిని సీతాదేవికి నమస్కారం. అని వాళ్ళను ప్రస్తుతిస్తూ సుగ్రీవుణ్ణి తలచుకొని నమస్కారం చేసి దిశలన్నిటినీ తేరిపారచూసి అశోకవనిలో ప్రవేశించాడు హనుమంతుడు.
అశోకవనంలో చాలామంది రాక్షసులుంటారు. ఎందరో కావలి కాస్తుంటారు. వాయుదేవుడే అక్కడ స్వేచ్ఛగా వీచడు. నా దేహాన్ని బాగా తగ్గించుకుని నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను.

ఆ పతివ్రత, ఆ మహాభాగ, ఆ పరమపూజ్యురాలు సీతాదేవి నాకు ఇక్కడ కనపడాలి. ఇప్పుడామె ఎట్లా ఉందో! అనుకున్నాడు హనుమంతుడు. రావణుడి అంతః పుర ప్రాంతం నుంచి అశోకవనానికి ఆయన వెళ్ళాడు. అక్కడి చెట్లనిండా పూర్లూ, పండ్లూ సమృద్ధిగా ఉన్నాయి. లతలు విరగపూసి ఉన్నాయి. ఆ వనం ఎప్పుడూ పక్షుల కలగానంతో కూడి ఉంటుంది. అక్కడ ఆయా పుష్పవాటికలు విడివిడిగా ఉన్నాయి. కోకిలల కలకూజితాలు, నెమళ్ళ క్రేంకారాలు వినవస్తున్నాయి. మృగపక్షిసమూహాలు ఉల్లాసంగా సంచరిస్తున్నాయి.

ఒక చెట్టు మీది నుంచి ఇంకో చెట్టు మీదికి దుముకుతూ సీతాదేవిని అన్వేషించసాగాడు హనుమంతుడు. వాటిమీద ఉండే పక్షులు కలకలం చేస్తూ ఎగిరిపోయాయి. పూలు జలజల నేలరాలాయి. ఆ పూలన్నీ హనుమంతుడి శరీరాన్ని పూల కొండను చేశాయి.

అశోకవనంలో ఎన్నో కొలనులున్నాయి. వాటి చుట్టుపట్ల దేవకాంచన వృక్షాలు దట్టంగా ఉన్నాయి. కమలాలు కలువలూ గుత్తంగా నీళ్ళు కనపడకుండా అల్లుకున్నాయి. అక్కడ ఒక క్రీడా పర్వతాన్ని చూశాడు హనుమంతుడు.

ఆ వనంలో ఒక రమ్యమైన అశోకవృక్షాన్ని చూశాడు హనుమంతుడు. దాని చుట్టూ బంగారు అరుగులున్నాయి. ఈ చెట్టు మీద కూర్చొని ఇక్కడి పరిసరాలన్నీ పరికిస్తాను అనుకున్నాడు హనుమంతుడు. సీతాదేవి ఇక్కడకు రావచ్చునేమో అని ఆశపడ్డాడు. చాలా సమీపంలోనే అక్కడ ఒక తామరకొలను ఉంది. సీతాదేవిని వనసంచారం అంటే ఇష్టం. తన శోకాన్ని ఉపశమింపచేసుకోవడానికైనా ఆమె ఇక్కడకు వస్తుందేమో. ఈ కొలను దగ్గర కామె సంధ్యోపాసనకైనా రావచ్చు అని కుతూహలంతో తాను ఇతరులకు కనపడకుండా ఆకుగుబురుల మధ్య కూచుని ఆయన నిరీక్షించసాగాడు.

(సశేషం)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)