కథా భారతి - అనగనగా ఓ కథ
రెండగ్గి పుల్లలు
- డా||ముక్తేవి భారతి

"ఆ తలలు అలా విరిగిపోతే నీతల ఎగిరిపోతుంది. అలా చూస్తావేమిటీ వీపుమీద దెబ్బపడింది. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. పిలకజడ వెనక్కేసుకుని కాళ్ళు దగ్గరగా పెట్టుకుంది బంగారి.

"అలా కూచుంటే పని ఎప్పటికవుతుందీ... ఒక్కటి, ఒక్కటి విరిగినా చెప్తా నీపని విసురుగా ఆ చిన్నగదిలోంచి బయటికి వచ్చేసింది రాజేశ్వరమ్మ.

"ఇదిగోనమ్మ..." కూల్‍డ్రింక్ అందించాడు డ్రైవర్ రంగయ్య. కూల్‍డ్రింక్ చల్లగానే వుంది.

కానీ ఏదో గుండెల్లో మంట రాజేశ్వరమ్మని బాధిస్తోంది... చిట్టితల్లి మనసులో మెదలుతోంది....

ఊతగావున్న కర్రజారి చిట్టతల్లి కిందపడ్డ దృశ్యం కళ్ళలో మెదలుతోంది... కూల్‍డ్రింక్ కిందపెట్టి రాజేశ్వరమ్మ ఆ చిన్నగదిలోకి తొంగిచూసింది... బంగారీ గలగలా నవ్వుతోంది... బంగారి కళ్ళు నల్లగా మిలమిలా మెరుస్తున్నాయి.

అది వేసుకున్న జాకెట్టు తన కూతురిదే... అది వేసుకున్న పరికిణీ తన కూతురిదే ... ఎంత బాగా కుదిరాయో దీనికి - ఈ బంగారి తండ్రి తన దగ్గర పనిచేసినవాడే - నల్లగా మొద్దులా వుంటాడు- బంగారీ నలుపే- అయితేనేం ఎంతో కళ వుంది ముఖంలో ... పదేళ్ళు నిండలేదు గానీ పన్నేండేళ్ళ పిల్లలా బొద్దుగా వుంటుంది.

చిట్టితల్లి ఇదీ ఒక ఈడువాళ్ళే - అయితేనేం- చిట్టితల్లి సన్నగా ఊపిరిలేనట్లే వుంటుంది.

భగవంతుడు దాని కాలికి అవిటితనం కూడా ఇచ్చాడు ఎందుకో!! రాజేశ్వరమ్మ గొంతులోకి చల్లని డ్రింకు పోవటంలేదు... సీసా పక్కన పెట్టింది... ఆ చిన్న గదిలో బంగారీ విరగబడి నవ్వుతోంది. ఏదో చెప్తోంది అందరికీ... రాజేశ్వరమ్మ ఒళ్ళు భగ్గుమంది...హాండ్‍బాగ్‍లోంచి చిన్న రుమాలు తీసి ముఖం తుడుచుకుంది.

గబగబా వెళ్ళి కారులో కూచుంది రాజేశ్వరమ్మ.

ఓ రెండుపుల్లలు విరిగితే ఏమయిందో. ఓ రెండుపుల్లలు ఎక్కువ పెడితే, అదీ పొరబాటున పెడితే, పెద్ద కొంపమునిగిపోయినట్లు గోలచేస్తుందేమిటీ- ఛీ,- బంగారివంచిన తల ఎత్తకుండా గబగబా అగ్గిపుల్లలు పెట్టెలో సర్దింది... ముఖాన పడ్తున్న జుట్టు పక్కకి తోసుకుంది.

ఉష్ - గాలిలేదు... అబ్బా- చేయి పైకెత్తింది విదిలిస్తూ... చేయి గోడకి తగిలింది. ఎర్రమట్టి గాజులు విరిగి నేలపైన పడ్డాయి... రాజేశ్వరమ్మ మాటలు, బొంగురుగొంతు- చెవిలో మారుమ్రోగుతున్నాయి.

" ఈ అగ్గిపుల్లల తలలు సరిగ్గా పెట్టకపోతే, ఈ పుల్లల తలలు విరిగిపోతే మా తలలు విరిగిపోతాయా - ఇవి అసలు తలలా - బంగారికి నవ్వు ఆగలేదు. మందు దట్టించిన అగ్గిపుల్లల కేసి చూసింది. ఈ రాజేశ్వరమ్మ ఏం చేస్తుందో ... కోపంగా రెండు పుల్లలు విరిచింది.

"దయ్యం పట్టిందా..." గదమాయించింది పక్కనున్న రాములమ్మ.

"రెండు పుల్లలు విరిగాయని నావీపుమీద అంత దెబ్బకొడితే ఏంకాదా-- ఇవే తలలయితే, నాది వీపు కాదా - చూడు ... ఎంత దెబ్బో - వెనక్కి తిరిగింది బంగారి. రాములమ్మ మట్లాడకుండా పని చేస్తోంది.

"నిన్ను కొడితేకదా నీకు తెలుస్తుంది ... అయినా నువ్వు చెప్పు - ఈ తలలు విరిగితే, నాతల ఎగురుతుందా" - బంగారి అగ్గిపుల్లలవంకే చూస్తోంది - ’మట్లాడకు-’ రాములమ్మ ముఖాన పట్టిన చెమట తుడుచుకుంది.

బంగారి మూతితిప్పి అగ్గిపుల్లలన్నీ లెక్కపెట్టి పెట్టెలో పెడుతుంది. మధ్యమధ్య జెడకీకట్టిన రిబ్బను విప్పి కట్టుకుంటూ.

ఎవరి చేతి సంచులు వాళ్ళు పట్టుకుని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ బయటకొచ్చారు. పంపుదగ్గర నీళ్ళు తాగి ముఖం కడుక్కుంది బంగారి. సాయంత్రమయేసరికి తోటకూర కాడలా వాడిపోతుంది బంగారి, అక్కడ పనిచేసే అందరిలోకి చిన్నపిల్ల అదే.

చేతిసంచీ ఊగించుకుంటూ రోడ్డున నడుస్తుంది బంగారి.

పొద్దున జరిగిన విషయం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది.

అమ్మగారు ఇలా చిన్న చిన్న పొరబాట్లకి అందరిముందు కొట్టడం, తిట్టడం ఇది మెదటిసారికాదు,- అయినా ఎప్పుడూ తననే ఎందుకు కొడుతుంది. ఎందుకు తిడుతుందీ- తనంటే ఇష్టంలేదు అమ్మగారికి.

ఆరోజు చిట్టితల్లి సంగీతం మేష్టారు వచ్చినప్పుడు తను గుమ్మంపక్కన నిలబడి పాట వింటుంటే అమ్మగారొచ్చి పొమ్మని తోసేయటం తనకీ గుర్తులేదా - అమ్మగారికి ఎందుకు తనమీద కోపం -ఏమో!! - ఈ పని అయ్యదే - అయ్యకి జబ్బుచేసి రెండునెలలుగా పనికి రాకపోతే, అమ్మగారిని బతిమాలితే ఈపనిలో తనని పెట్టింది-- అయ్య జబ్బు తగ్గి ఇంకో పది రోజుల్లో పనిలోకి రాడా.

తను ఈపని మానేయదా - అందుకేగా అమ్మగారు తిట్టినా, కొట్టినా పడివుంటోంది తను!!- బంగారీ గబగబా నడుస్తోంది -- అమ్మగారి కుంటిపిల్లను తను ఎప్పుడయినా ఎక్కిరించిందా - పాపం ఆ అమ్మాయి అంటే తనకి ఎంతో జాలి పాపం,- అయినా అమ్మగారు!! - బంగారికి ఒక్కసారిగా అమ్మాగారి మీద కోపం వచ్చింది...

బంగారి చేతిసంచి కిందపడిపోయింది ఆనక ఆగిన కారు హారను చప్పుడికి ఉలిక్కిపడింది బంగారి.

"ఏమిటా ఖంగారు ... కారెక్కు" - రంగయ్య నవ్వుతున్నాడు.

"ఏమిటీ" - బంగారి చేతిసంచి దులుపుతూ అంది.

"అమ్మగారు రమ్మంది".

"నన్నా"

"ఆ... నిన్నే" - రంగయ్య కారు తలుపు తెరిచాడు.

పొద్దుటికోపం ఇంకా పోలేదా అమ్మగారికి అనిపించి భయమేసింది బంగారికి.

"అయ్యకి చెప్పి వస్తా"

"నీ యిష్టం - అదే చెప్తా అమ్మగారికి. వెళ్ళు "రంగయ్య కారు తలుపు పట్టుకునే అన్నాడు.

"తలుపు తియ్యి" - బంగారి ఖంగారుగా కారులో ఎక్కి కూచుంది.

* * *

ఆ భవనంలో అడుగుపెడుతుంటేనే కాళ్ళు వణికాయి బంగారికి. గేటు లోపలే నిలబడింది భయంగా.

’వెళ్ళు’ రంగయ్య ముందుకు నడుస్తూ అన్నాడు.

’రా... లోపలికి’ రాజేశ్వరమ్మ తమలపాకులు నములుతోంది. బంగారు గోళ్ళు కొరుకుతూ గోడలవంక అటుఇటు చూస్తూ నిలబడింది.

పొద్దున్న పనికి వచ్చావో లేదా - అంత నిద్రా నీకు? - రెండగ్గిపుల్లలు విరిగిపోతే ఏం నష్టమంటున్నావా ... పిట్టకొంచెం కూత ఘనంలాగా నీకు ఐదేళ్ళు నిండలేదు కానీ పొగరేం తక్కువలేదు..?"

రాజేశ్వరమ్మ బంగారి వంక చూస్తోంది... పెద్ద కళ్ళు. నవ్వుతుంటే ఎంతో కళగా వున్న ముఖం ... చెంగు చెంగున గంతులేస్తూ, గలగల మాట్లాడుతూ వుండేది ఇదా!!

రాజేశ్వరమ్మ నోట్లో ఉన్న తమలపాకులు నమిలి తుప్పున ఉమ్మింది పక్కనే వున్న పెద్దకుండీలో.

బంగారికి నవ్వొచ్చింది ... అప్రయత్నంగా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది.

"ఏమిటా నవ్వు ... నిన్నెందుకు పిలిచానో తెలుసా .. రేపు మీ అయ్యని కలవమని చెప్పు తెలిసిందా ..." రాజేశ్వరమ్మ ఇంకా ఏదో అనబోయింది.

"మమ్మీ ... ఒక్కసారి లోపలికి రా..." - రాజేశ్వరమ్మ గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది.

ఆ గదిలోవున్న గోడలవంక చూస్తోంది బంగారి .. పెద్ద పెయింటింగ్ వంక కన్నార్పకుండా చూసింది.... అందమైన ’సోఫాలవంక. ఎంతో అందమైన కర్టెన్ల వంక చూసింది బంగారి. అబ్బ ఎంత పెద్ద ఇల్లో - బంగారికి వెంటనే నవ్వొచ్చింది - రెండగ్గిపుల్లలు విరిగితే ఈ అమ్మగారికో లెక్క!! అంతలోనే కర్టెన్ కదలడం కనిపించింది బంగారికి.

"మీ అయ్య ఎందుకూ ... నీకే చేప్తా ... రేపటినుంచి పనిలోకి రావద్దు తెలిసిందా ..." రాజేశ్వరమ్మ బంగారివంకే చూస్తోంది.

కాళ్ళకింద నేల కదిలినట్లే అనిపించింది ఓ క్షణం ... నౌకరీ తీసేస్తే ఎలా ... తన తండ్రి జబ్బు ఇంకా ఎప్పటికి తగ్గుతుందో ... తగ్గకపోతే!? - బాబోయ్!!

బంగారి అమ్మగారి కాళ్ళు పట్టుకుంది గట్టిగా ...

"చాల్లే ... లే ... ఈ దొంగవేషాలు నాకు నచ్చవు - నేనంటే భయంలేదు - పైగా నేనంటే నిర్లక్ష్యం - ఏదో మీ అయ్య మీది జాలితో పనిలో పెట్టుకున్నా ... నెలరోజులయేసరికి నీకు ఒళ్ళు బలిసిపోయింది - వెళ్ళు - రేపటినుండి రాకు -" రాజేశ్వరమ్మ పక్కకుండీలో తుప్పున ఉమ్మి సోఫాలోంచి లేచింది.

బంగారి ఆ గోడనానుకుని ఆలానే నుంచుంది కొద్దిసేపు. రాజేశ్వరమ్మ తన వీపు మీద కొట్టిన దెబ్బను జాకెట్టు వెనక్కి పోనిచ్చి చూసుకుంది బంగారి.

రెండగ్గిపుల్లలు ఎక్కువ పెడితే నీకింత కష్టమయితే, నా నౌకరీపోతే నాకెంత కష్టం బంగారి కళ్ళు తుడుచుకుంది ... ఇంటికేడితే అయ్య తంతాడు -

బంగారి కళ్ళు ఎర్రపడ్డాయి. రాజేశ్వరమ్మ బొంగురుగొంతు చెవిలో మారుమోగుతోంది.

"రాజేశ్వరమ్మా ..... ఈ రెండగ్గిపుల్లలతోనే నిన్ను అంటించేస్తా ... నీ’ ఫ్యాక్టరీ తగులపెట్టేస్తా ... నిన్ను, నిన్ను ..." బంగారికి కోపంతో నోట్లోనుంచి వస్తున్న మాటలు ఆ చిన్నగొంతులోనే అడ్డంపడి అణగిపోయాయి!! - రంగయ్య గుమ్మంలో నిల్చుని నవ్వుతున్నాడు.

’ధూ’ - కసిగా దగ్గరలోవున్న పూలచెట్లు ఉమ్మి, గబగబా బయటికి నడిచింది బంగారి.

* * *

రెండువారాలు గడిచాయి ... నాలుగు వారాలు గడిచాయి. బంగారికీ నౌకరీ దొరకలేదు. ఎంతమరిచిపోదామన్న రాజేశ్వరమ్మ మనసులోంచి పోవటంలేదు.

ఆ చిన్నగదిలో తన పక్కన పనిచేసే రాములమ్మ ఈ మధ్య ఎందుకో మరీమరీ గొర్తొస్తోంది. బంగారికి.

సినిమాలో చూసిన ఆడపిల్ల రౌడీలను తన్నింది. కొట్టింది ... తనకీ అలాంటివి వస్తే డొక్కలో ఒక్క తన్ను తన్నేది - నోట్లో గుడ్డకుక్కి గొంతునొక్కి చంపిపారేసేది ఈ రాజేశ్వరమ్మని ...

కానీ తనకేమీరావుగా - నాలుగో తరగతి చదువుతుంటే మాన్పించి అయ్య - అరె - తను జీతం పైసలు తెచ్చుకోవద్దా! - అయినా పుణ్ణానికొచ్చాయా పైసలు - బంగారి చేతిసంచి తీసుకుని, అందులో అగ్గిపెట్టె గలగలలాడుతుంటే, గబగబా మండుటెండలో బయలుదేరింది!

ముఖాన చెమట తుడుచుకుంటూ గబగబా నడిచి రాజేశ్వరమ్మ పని పట్టాలనే కోపంతో ఆ పసిమనసు పరుగులు తీస్తుంటే, అ పెద్ద భవనంలోకి అడుగుపెట్టింది బంగారి.

అంతా నిశ్శబ్దంగా వుంది ... రంగయ్య ఊళ్ళో లేడు ... చిట్టితల్లి లోపల గదిలో నిద్రపోతుందేమో! ఏమో! - రాజేశ్వరమ్మ పడగ్గది దగ్గర నిలిచింది బంగారి ... నెమ్మదిగా తొంగిచూసింది ...

గాఢనిద్రలో వుంది రాజేశ్వరమ్మ ... బంగారి మనసులో ఆనందం నిండిపోయింది ... క్షణంలో బంగారి ముఖమంతా చెమటలు పోసాయి ... చేతిలో సంచి కదులుతుంది ...; ఒక్క అగ్గిపుల్ల గీసింది ... పుల్ల విరిగి కిందపడిపోయింది ... ఇంకా - బంగారి చేతులు వణుకుతున్నాయి ... సంచి కిందపడింది అగ్గిపుల్ల.

బంగారి ఖంగారుగా గదిదాటి బయటికి పరిగెత్తింది ... ఆగకుండా పరిగెత్తింది ... పరిగెత్తింది ... కాలికి రాయి తగిలి ముందుకు పడింది ... ’హమ్మయ్య’ - బంగారి కళ్ళు గట్టిగా మూసుకుంది ఓ క్షణం ... పెదాలపై చిన్ననవ్వు!! - బంగారీ గబగబా నడిచి ... ముఖానపడ్డ జుట్టు చేత్తో తీసుకుంటూ ఇంట్లో అడుగుపెట్టింది బంగారి.

’పైసలిచ్చిందా’ ముసలాడు మంచంమీద నుంచే అరిచాడు.

’లేదింకా-’ బంగారీ లోపలికి పరిగెత్తింది.

* * *

వారం రోజులు గడిచాయి ... ఈమధ్య చాలా చిరాగ్గా వుంటుంది. బంగారికి.

అసలు నిద్రపట్టడం లేదు - ఎవరిమీదో కోపం ... ఎవరూ ఏ విషయాలూ చెప్పరేం తనతో! అయినా ఇంట్లోకూచుంటే ఎలా తెలుస్తాయి కబుర్లూ - బంగారీ జడ అల్లుకుని ఎర్రరిబ్బను పెట్టుకుంది - పూసల గొలుసు మెళ్ళో వేసుకుంది ... గుమ్మంలోవున్న ఎర్ర గన్నేరుపూవు కోసం వెతికి జడలో పెట్టుకుంది ... చాలా ఉత్సాహంగా నడుస్తోంది బంగారి ...

బంగారి ఫ్యాక్టరీ దగ్గరలోవున్న తురాయి చెట్టుకింద నిలబడింది ... ఒక్కొక్కరు బయటికొస్తూ కనిపిస్తున్నారు .... ’ఇంకా రాదేం’ - విసుగ్గా అటే చూస్తూ నించుంది బంగారి నిమిషాలు గంటల్లా అనిపిస్తున్నాయి.

’బాగున్నావా’ - భుజంపై చేయిపడేసరికి ఉలికిపడింది బంగారి.

’రాములమ్మా ... అమ్మగారు బావున్నారా’ - బంగారి ముఖమంతా కళ్ళు చేసుకుని రాములమ్మ వైపు చూస్తోంది.

’మీ అయ్య బాగున్నాడే’ - రాములమ్మ బంగారివంక చూస్తొంది.

’అబ్బ - అమ్మగారి విషయం చెప్పు!’

"మీ అయ్య నౌకరీలో పైనెలలో చేరతాడటగా’

"ఏమో - అమ్మగారు" - బంగారీ కంగారు అర్థంకావటంలేదు.

"నీకూ తెలిసిందా బంగారీ..."

’ఏమిటీ - పెద్దగా అంది బంగారీ.

"అదే - వారం రోజులనాడు అమ్మగారికి పెద్ద ప్రమాదం." రాములమ్మ మాట పూర్తి కాలేదు.

"ఏమైందీ" - బంగారీ కళ్ళనిండా ఉత్సాహం - విజయగర్వం!

"ఆ - అదేరోజు అమ్మగారి చీర అంటుకుని పెద్ద మంటలు వచ్చాయి ... అమ్మగారు..." రాములమ్మ బంగారివంక చూసింది చెప్తూ.

"చచ్చిపోయిందా..." ఠక్కున అనేసింది బంగారీ.

"ఛీ - పాడుమాటలు ... పనిమనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మంటలు ఆర్పేసింది ... అమ్మగారు ఆరోజు కాటన్ చీర కట్టుకున్నారు - అదే పాలిస్టరయితే-"

"హాయిగా చచ్చిపోయి వుండేది కదూ" - బంగారి గొంతునిండా ఓ క్షణం ఉత్సాహం!! రాములమ్మ విస్తుపోయి చూసింది బంగారివంక.

కానీ వెంటనే అర్థమయింది బంగారికి అమ్మగారు చచ్చిపోలేదని!!

రాములమ్మ ఏదో చెప్తోంది.

అయ్యగారు సిగరెట్లు కాలుస్తారట - సిగరెట్టు పీక గాలికి రగిలిందట - అమ్మగారి చీరకొంగు నేలకి తాకుతుంటే అంటుకుందిట - "బంగారీ పెద్దాళ్ళ విషయాలు మనకీ తెలియవే - అమ్మగార్ని ఆ దేవుడే కాపాడాడు -" రాములమ్మ మాటలు ఒక్కటికూడా వినపడటం లేదు బంగారికి.

బస్సు రావటంతో రాములమ్మ గబగబా బస్సెక్కింది.

బంగారీ కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరింది ... సందుచివర చెత్తకుండీ దగ్గర ఆగింది బంగారి ... సంచిలో అగ్గిపెట్టె గలగల లాడింది ... రెండగ్గిపుల్లలు తీసుకొచ్చి కసిగా అందులో విసిరింది ... భగ్గున మంటపైకి లేచింది ... బంగారి భయంగా పరిగెత్తి వచ్చేసింది ఇంటికి.

"మరోసారి మండవా అగ్గిపుల్లలు" గట్టిగా పైకి అనేసింది చిన్న బంగారి.

"అమ్మగారు జీతం పైసలిచ్చిందా" - ముసలాడు మంచలో వుండీ బంగారివైపు చూసాడు.

"అమ్మగారు ఛస్తే కానీ పైసలు రావు" - బంగారీ అరిచింది ....

"తప్పమ్మా ... అమ్మగార్ని అలా అనకూడదు"- ముసలాడి మాటలు వినిపించలేదు బంగారికి.

సంచిలో అగ్గిపెట్టె గలగల లాడుతుంటే బంగారి ఆ సంచిని భద్రంగా కొయ్య పెట్టెలో దాచిపెట్టింది రహస్యంగా!!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)