సుజననీయం
తెలుగు భాషాదినోత్సవం

- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

'వ్యావహారిక భాష' వికాసం కోసం పరిశ్రమించిన గిడుగు వేంకట రామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగష్టు 29న 'తెలుగు భాషాదినోత్సం' జరుపుకొంటుంది తెలుగుజాతి. ఈ సందర్భంగా కొందరు భాషా ప్రవీణులు తెలుగుభాష ఉన్నతికోసం తమ వ్యాసాల్లో, పుస్తకాల్లో చెప్పిన మాటల్ని మరొక్కసారి గుర్తు చేసుకొందాం.

'పాఠశాలలో చేరేసరికి అంటే అయిదేండ్ల లోపల మాతృభాషకు సంబధించిన భాషా వ్యవహారం పిల్లలకు సిద్ధించి ఉంటుంది. చిన్న తరగతుల్లో బోధించవలసినవి - రాయటం, చదవటం, పదసంపద పెంపొందించటం. సులభంగా బోధించదగిన భాషా నిర్మాణాంశాలను క్లిష్టమైన వ్యాకరణ సూత్రాల రూపంగా బోధించడంవల్ల పిల్లలకు తెలుగు తరగతులంటే ఏవగింపు కలుగుతుంది.' - డా. వి.లక్ష్మణరెడ్డి

'తెలుగు ద్రావిడభాష. తమిళం, కన్నడాలకు మాదిరి ప్రాచీన ద్రావిడం నుంచే తెలుగు పుట్టింది. తెలుగు మూలదావిడం నుంచి విడివడి ప్రత్యేకభాషగా క్రీ.పూ. 5, 6 శతాబ్దాల నాటికే స్థిరపడి ఉంటుందని భాషా శాస్త్రవేత్తల అంచనా. జనవ్యవహారంలో, వాణిజ్య వ్యవహారంలో, జానపద సాహిత్యంలో ఉన్న ప్రాచుర్యమే భాష ప్రాచినతకి గీటురాయి - కవిత్వం గీటురాయి కాదు.' - డా. ద్వా.నా. శాస్త్రి

'తెలుగులోనే వివిధ సంస్థల నిమిత్తం వివిధ పరిభాషలు ఏర్పడాలి. తెలుగు మతగ్రంథాల్లో పరిభాషా, తెలుగు జ్యోతిషాది గ్రంథాల్లో పరిభాషా, తెలుగు న్యాయస్థానాల్లో పరిభాషా, తెలుగు రాజకీయంలో పరిభాషా, తెలుగు పాఠశాలల్లో పరిభాషా... పారిభాషిక పదాల్లోంచి కొన్నొచ్చి సంభాషణలో పడడం, సంభాషణలోంచి కొన్ని పదాలు వెళ్లి ప్రత్యేక స్పష్టార్థాల్లో పారిభాషిక పదాలుగా వెలువడం, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు జరగడం, ఉభయతారకంగా అది పరిణమించడం...' - భమిడిపాటి కామేశ్వరరావు

అలాగే తెలుగుభాష మాండలీకాల్లో వైవిధ్యాలున్నాయి. వాటిల్లో మాధుర్యమున్నది. మాండలీకం ఆ ప్రాంతపు సంస్కృతిని, జన జీవన సౌందర్యాన్ని గోచరింపజేస్తాయి. పైన చెప్పుకొన్న పెద్దల మాటలను స్ఫురణకు తెచ్చుకుంటూ మనం ఈ వైరుధ్యాల్ని ఆదరించాలే తప్ప గర్హింపకూడదు.

 

- తాటిపాముల మృత్యుంజయుడు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)