సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

అనాదిగా మన భరతఖండం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఆత్మానుభవంతో సత్యశివసుందరమైన దృక్పధాన్ని కలిగించిన వైదిక మహర్షులే మన ఆది ఆధ్యాత్మిక గురువులు. ఆ కోవలో ఆత్మకూ పరమాత్మకూ ఉన్న సంబంధాన్ని రాధాకృష్ణ లీలలుగా అభివర్ణించారు వైష్ణవాచార్యులు. నమ్మాళ్వార్ రచించిన 'తిరువాయి మొజ్షీ విరహిణి గీతాలపమే! మహారాష్ట్రలో మీరాబాయి, తెలుగు నేలపై అన్నమయ్య ఆ కోవలో ముఖ్యులు. అన్నమయ్యకు తర్వాతి కాలం వాడైన రూపగోస్వామి "ఉజ్జ్వల నీలమణి" అనే గ్రంధం రాశాడు. దానిలో శృంగారమూర్తి శ్రీకృష్ణుడే నీలమణిగా భాసిల్లాడు. భగవదనుభూతి యోగ్యమైన శాంతి, ప్రీతి, ప్రేయస్సు, వత్సల, ఉజ్జ్వల రసాలలో, ఉజ్జ్వల ఓ శ్రేష్టమైన భక్తి రసం. శ్రీ మధుసూధన సరస్వతి కూడా తన "భక్తి రసాయనం" లో భక్తిలో నుండి శృంగారం మొదలైన అనేక రసాలు పుడతాయని చెప్పారు. ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని, అగాధం, విశాలం అయిన ఈ సూక్ష్మ ప్రపంచంలో ప్రవేశించి అనిర్వచనీయమైన సత్యాన్ని, సౌందర్యాన్ని గుర్తెరిగి తన సంకీర్తనలతో ఒక నూతన భక్తి సామ్రాజ్యాన్ని సృష్టించిన అన్నమయ్య ఘనత మాటలలో కొలువజాలము.

అన్నమయ్య తెలుగు భాషలో సాహిత్య రసికతను ఒక వాగ్గేయకారునిగా విభిన్న మార్గాలలో ప్రస్ఫుటింపజేశాడు. రసికుడు అనే మాటను మనం గమనిస్తే...రసికుడనగా శృంగారి. రస్యమానతా హృదయం ఉన్నవాడు అన్న అర్ధాలు తెలుస్తాయి.. కానీ రసికుడంటే కేవలం శృంగారలోలుడు కాదు. రసార్ధ్ర చిత్తవృత్తి గల కవి తన సంకీర్తనలు లేదా కావ్యాల ద్వారా రసమయ జగత్తును సృష్టించే నేర్పరి. అలాంటి పవిత్ర భావాలతో, స్పందనలతో, చేతనలతో సాహిత్యాన్ని జాగ్రత్తగా ఆవిష్కరించగల కవి చరిత్ర పుటల్లో చిరంజీవిత్వాన్ని పొందుతాడు.

“ శ్లో|| త్యాగీ, కృతీ, కులీన: సుశ్రీకో రూప యౌవనోత్సాహహే! I ,

దక్షో నురక్తలోకస్తేజో వైదగ్ధ్య శీలవాన్ నేతా.II

అని సాహిత్య దర్పణం నాయక గుణాలను విపులీకరించింది. త్యాగము, కృతజ్ఞత, కులీనత్వము, సుశ్రీకత్వము, రూపవత్త్వము, యౌవనము, ఉత్సాహము, సర్వజనానురాగము, తేజము, వైదగ్ధ్యము, శీలము అనే గుణాలు నాయకునిలో ఉండాలి అని అర్ధం.

నాయకుని ప్రవర్తనకు అనుగుణంగా 1. అనుకూలుడు 2. దక్షిణుడు 3. శఠుడు 4. ధృష్టుడు అనే రకాలుగా ఉంటారని అనుకున్నాం. అలాగే... ధీరోదాత్తాది నాయకులు అన్ని రకాల రూపాలలోనూ ప్రతిబింబిస్తుంటారు. శృంగార విషయంలో దక్షిణనాయకుడు అంటే పెక్కండ్రు నాయికల యందు సమాన ప్రీతి గలవాడు. శ్రీకృష్ణుడు దీనికి మంచి ఉదాహరణ. ఒక్క అనుకూలునికి మాత్రమే ఉదాహరణగా శ్రీరామ చంద్రుడిని తీసుకోవచ్చు. మిగిలిన శఠ, ధృష్టుల గుణగణాలూ శ్రీ కృష్ణునికే అన్వయించుకోవచ్చు అంటారు సాహిత్య కారులు. ప్రస్తుతం అన్నమయ్య వర్ణించిన దక్షిణ నాయకుని గూర్చి తెలుసుకొందాం.

కీర్తన:
పల్లవి: గుఱుతులెల్లా గంటిమి గుట్టు సేయ నికనేల
మఱుగులు వెట్టకిక మాతో జెప్పవయ్యా!

చ.1. చెలియ ముడుచుకున్న చెంగలువ పువ్వులు
యెలమి నీకొప్పులోని కేల వచ్చెను
పొలుపుగా జన్నులపై బూసిన గంధము నీమై
వెలయగ నంటుకొన్న విధమానతీయవయా! ||గుఱు||

చ.2. ఆ కాంత గట్టుకొన్న యట్టి చంద్రగా(కా?) వి చీర
నీకు దట్టియైనట్టి నెపమేటిది
మేనొని యాపె పాదాల మించులును మెట్టెలును
యీ కాడ నీవేళ్ళనున్న దిదేమి చెప్పవయా! ||గుఱు||

చ.3. సుదతి చెవిలోనున్న సొంపైన తట్టుపుణుగు
చెదరి నీపచ్చడాన జెందియున్నది
అదన శ్రీవేంకటేశ అట్టెనన్ను గూడితివి
పొదలీ మోము కళలు బొంకక చెప్పవయా! ||గుఱు||
(రాగం: పాడి; శృం.సం.సం.28; రాగి రేకు 1889; కీ.సం.522)

పై కీర్తనలో ఇతర నాయికలతో కూడి అలసి వచ్చిన దక్షిణ నాయకుడైన స్వామిని దేవేరి నిలదీస్తోంది.

"స్వామీ! నీశరీరంపై సాక్షీభూతంగా ఉన్న అన్ని గుర్తులూ చూశాను. ఇంకా గుట్టెందుకు? చెప్పండి. ఇంకా దాపరికం ఎందుకు మాతో జెప్పండి" అంటోంది ఛలోక్తిగా దేవేరి. నవ్వు రాజిల్లెడు మోమువాడు మాత్రం ఏమీ సమాధానం చెప్పడంలేదు. అవునుస్మీ! ఈ గుర్తులు ఎలా వచ్చాయి అని అలోచనలో పడ్డాడు. ఒక్కొక్కటీ గుర్తొచ్చినకొద్దీ మోముపై చిరునవ్వు వస్తోంది. దానికి దేవేరికి కోపం ఇంకా అధికమౌతోంది. చివరికి ఏమౌతుందో చూద్దాం.

పల్లవి: గుఱుతులెల్లా గంటిమి గుట్టు సేయ నికనేల
మఱుగులు వెట్టకిక మాతో జెప్పవయ్యా!

దక్షిణ నాయకుడైన స్వామిని దేవేరి గట్టిగా నిలదీస్తోంది. "నీశరీరంపై ఉన్న అన్ని శృంగారపరమైన గుర్తులూ గమనిoచేశాం. ఇంకా గుట్టు మట్టులెందుకు? ఇంకా విషయం మరుగు పరచడం ఎందుకు? జెప్పండి" అని అడుగుతోంది అప్పటివరకూ విరహోత్కంఠితావస్థ ననుభవించిన గడుసు నాయిక.

చ.1. చెలియ ముడుచుకున్న చెంగలువ పువ్వులు
యెలమి నీకొప్పులోని కేల వచ్చెను
పొలుపుగా జన్నులపై బూసిన గంధము నీమై
వెలయగ నంటుకొన్న విధమానతీయవయా! ||గుఱు||

స్వామి తప్పించుకోవడానికి వీలులేకుండా దాడి చేస్తోంది నాయిక. "స్వామీ! ఎందుకా మౌనం? ఎవరో అమ్మాయి తలలో పెట్టుకున్న చెంగలువ పూలు తమ కొప్పులోకి ఎలా చేరాయో చెప్తారా? స్త్రీలు వక్షోజాలపై పూసుకునే గంధం నీ వక్షస్థలం పై అంటుకుని వుందేమిటి స్వామీ? ఆ వ్యవహారం ఏమిటో తాము ఆనతిస్తే వీనులవిందుగా వినాలని ఉంది" అంటోంది గడుసు నాయిక. స్వామికి ఏం చెప్పాలో తెలీడం లేదు. స్వామికి చిన్నతనం నుండి చెంగలువ పూలు అంటే మహా ఇష్టం. "చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ / బంగరు మొలత్రాడు పట్టుదట్టి /సందిట కడియాలు సరిమువ్వ గజ్జెల" అన్న తన బాల్య స్థితి గోచరించి నవ్వొచ్చింది స్వామికి. ఏం చెప్పాలో తెలీలేదు. ఆ చిరునవ్వులను చూసి నాయికకు కోపం హెచ్చింది.

చ.2. ఆ కాంత గట్టుకొన్న యట్టి చంద్రగా(కా?) వి చీర
నీకు దట్టియైనట్టి నెపమేటిది
మేనొని యాపె పాదాల మించులును మెట్టెలును
యీ కాడ నీవేళ్ళనున్న దిదేమి చెప్పవయా! ||గుఱు||

ఇదేమి చోద్యం స్వామీ! ఆ పడతి గట్టుకున్న ఎరుపు రంగు చీరె మీ శరీరంపై నడుముకు చుట్టబడిఉన్నదేమిటి మహానుభావా? చెప్పండి? ఏమి జరిగింది ఎలా జరిగింది? ఆమె కాళ్ళకుండవలసిన మెట్టెలు నీ కాళ్ళకున్నాయేమిటి? చెప్పవయా? అనగానే స్వామి గబుక్కున తన నడుం వేపు, కాళ్ళవేపు చూసుకున్నాడు వంగి. నిజమే! అవును ఇవి ఎలా వచ్చాయి అని అలోచనలో పడ్డాడు. ఈ సందర్భంలో మనకు పోతన "నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు...అనే పద్యం లో నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో...మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్ము చెప్పరే!" అని మల్లె పొదలను ప్రశ్నిచడం గుర్తొస్తుంది. కన్నయ్య ఎంతటి గడుసు వాడు కాకపోతే చెట్లను, పుట్లను కూడా అడుగుతాడు పాపం పోతన.

చ.3. సుదతి చెవిలోనున్న సొంపైన తట్టుపుణుగు
చెదరి నీపచ్చడాన జెందియున్నది
అదన శ్రీవేంకటేశ అట్టెనన్ను గూడితివి
పొదలీ మోము కళలు బొంకక చెప్పవయా! ||గుఱు||

ఆమె చెవిలోనున్న సుగంధ భరితమైన తట్టుపునుగు నీ అంగవస్త్రానికి ఎలా అంటుకున్నదయ్యా స్వామీ! బదులు పలకండి! అన్నా వీటికి స్వామి సమాధానం ఇవ్వనే లేదు. "శ్రీవేంకటేశ్వరా ! నను కూడిన ఓ స్వామీ! నీ ముఖారవింద కళలకు అర్ధం ఏమిటి అబద్ధం చెప్పకుండా నిజం తెలియజెయ్యి స్వామీ!" అని ప్రార్ధిస్తోంది నాయిక. ఆమెను ఆలించి, లాలించి, బుజ్జగించి కౌగిట చేర్చుకుంటాడు తప్ప సమాధానమిస్తాడా?

ముఖ్యమైన అర్ధములు: చంద్రకావి, చెంగావి = ఎర్రని వర్ణము లేక కాషాయ వర్ణము ; దట్టి = తువాలు, తుండుగుడ్డ [నెల్లూరు మాండలికం] ; తట్టుపుణుగు = పునుగుపిల్లి వలన లభించే సుగంధ ద్రవ్యం ; పచ్చడము = వస్త్రము (వేడినిచ్చు వస్త్రము) ;

-o0o-


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)