శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసంప్రశ్న:

దత్తపది: పివి(పీవీ), సింధు, సాక్షి, మాలిక్ పదాలను అన్యార్ధములతో వాడుతూ ఒలింపిక్ క్రీడలను వర్ణించాలి

గతమాసం ప్రశ్న:

చెడుగుణములె మేలుఁగూర్చుఁ జీవునికెపుడున్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

డా. ఐ.యస్.ప్రసాద్, సైంట్ లూయిస్, మిస్సోరి
చెడులును మంచియు తప్పులు
మడుసులనందరనయుండు మంచిమరువకన్
జెడులను తప్పిదనముల మరి
చెడుగుణములె మేలుగూర్చు జీవునకెపుడున్

సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
ఇడుముల నరి నైన విధికి
విడువక చేయూత నిడుటవిధిగా నెం చీ
కడు దయ చూపి సహక రిం
చెడు గుణములె మేలు గూర్చు జీవుని కెపుడున్

మల్లేశ్వరరావు పొలిమేర, కెల్లర్, టెక్సాస్
(1)
నడు ధర్మము నిలుపుటకై,
విడువకు భవబంధములను విధి నిలుపుటకై,
ముడిపడిన జన్మయని తల
చెడు గుణములె మేలుఁగూర్చుఁజీవునికెపుడున్!

(2)
బడి మనకు బతుకు తెరువై,
చెడె నిప్పుడు వర్తకమ్ముచే స్వార్ధమునన్,
విడి బాగుగ చేయుట తల
చెడు గుణములె మేలుఁగూర్చుఁజీవునికెపుడున్!

చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
ఇడుములు పెరుగగ చింతన్
బడయుచు వత్తిడికి దేహ భారము పొందన్
నడవడి మారగ తొలగిం
చెడు గుణములె మేలుగూర్చు జీవునికెపుడున్

శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
గడుపగ వాట్సప్‌ ఫేస్‌ బుక్స్‌
కడతేర్చవు కాలమున దుఃఖములన్‌! స్మార్ట్‌ ఫో
నెడబాటు రవంత సహిం
చెడు గుణములె మేలు గూర్చు జీవునికెపుడున్‌

గండికోట విశ్వనాధం, హైదరాబాదు.
చెడు నడవడితో యిడుములు
బడసిన బడుగుకు చితికిన బ్రతుకున ముదిమిన్‌
పొడమిన భక్తితొ, వుడిగిన
చెడు గుణములె , మేలు గూర్చు జీవుని కెపుడున్‌.'

డా. బులుసు వేంకట సత్యనారాయన మూర్తి, రాజమహేంద్రవరము
కడు భక్తిని సేవించుచు
నిడుములు వెట్టక పితురుల యిష్టములన్ వా
రడుగక తీర్చి ముదము గూ
ర్చెడు గుణములె మేలుఁ గూర్చు జీవునికెపుడున్

మహీధర రామశాస్త్రి, రాజమహేంద్రవరము
నడమంత్రపు సిరి తోడను
నడువడి త్రపితంబుకలుగ నానారీతుల్
కడు రమ్యంబుగ ప్రవచిం
చెడు గుణములె మేలు గూర్చు జీవునికెపుడున్

శ్రీమతి డేగల ఆనితాసూరి, హైదరాబాద్
(కవిత)
నేడు ఈర్ష్య అసూయలు
వడివడిగా పెరిగిపోతున్న తరుణం లో
అండగా నిలిచి నిస్వార్ధ స్నేహం పం
చెడుగుణములె మేలుగూర్చు జీవునికెపుడు

పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
(పైనున్న అనితాసూరి గారి కవితకు పద్యరూపము)
పుడమిన నీర్ష్య నసూయలు
ఎడపెరుగక పెరుగుతున్న ఈ తరుణము లో
అడగకనే స్నేహము పం
చెడుగుణములె మేలుగూర్చు జీవునికెపుడున్

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)