కథా భారతి
స్కూళ్ళు మళ్ళీ తెరిచారు
- ఆర్. శర్మ దంతుర్తి

జూన్ మొదటివారం. కొద్దికొద్దిగా ఎండలు ముదురుతున్నాయి వర్జీనియా రాష్ట్రంలో. మొన్నమొన్నటివరకూ వాడిన కోటులన్నీ లోపలపారేసి కాటన్ బట్టలూ, నిక్కర్లూ బయటకి తీయడం అయింది కూడా. శుక్రవారం ఇంట్లో కాస్త పని ఉంది, శెలవు కావాలని రవి ఈమెయిల్ మీద అడిగితే వెంఠనే సమాధానం వచ్చింది బాస్ దగ్గిర్నుంచి, "ఈ శుక్రవారం శెలవు కుదరదు. నువ్వు ఇక్కడ ఎనిమిదింటికి ఉండి తీరాలి." ఎప్పుడూ సరే అనే ఈవిడ ఇలా అందేమిటా అనుకున్నాడు రవి కానీ పెద్దగా ఆలోచించలేదు దాని గురించి, ఏదో మీటింగ్ పెట్టిందో, పెట్టబోతోందో అనుకుంటూ.

శుక్రవారం పొద్దున్నే క్యూబ్ లోకి వచ్చేసరికి రెండు ఖాళీ అట్టపెట్టెలు కనిపించాయి. తనకూడా పట్టుకొచ్చిన సంచీ, కాఫీ గ్లాసు టేబుల్ మీద పెడుతూండగానే వెనకనే క్రిస్టా నుంచుని ఉండడం గమనించి, గుడ్ మార్నింగ్ అన్నాడు యధాలాపంగా. "ఓ సారి అలా కాన్ఫరెన్స్ రూములోకి వచ్చి కలుసుకో" అని చెప్పి మాయమైపోయింది ఆవిడ. కాఫీ గ్లాసు చేత్తో పట్టుకుని కాన్ఫరెన్స్ రూములోకి నడిచేడు. క్రిస్టా కాయితాలు చేతికందించి బుర్ర వంచుకుని ఏవో కాయితాలు చూసుకోవడం సాగించింది. చదవడం అయ్యాక రవి తల ఎత్తి చూసాడు ఆవిడకేసి, ఇదన్న మాట ఈవిడ చేసిన నిర్వాకం. ఈ కాయితాలు తనని లే ఆఫ్ చేస్తూ ఇచ్చిన నోటీసులు! ఇన్నాళ్ళూ ఎంత కష్టపడ్డా ఒక్క వారం కూడా తనకి ముందైనా చెప్పకుండా బయటకి పంపిస్తున్నారు. ఆలోచనలని అడ్డుకుంటూ ఆవిడ నోరు విప్పింది, "రవీ, నీ ఐ. డి కార్డు నేను తీసుకోవాలి రూల్స్ ప్రకారం. నీ క్యూబ్ లో ఉన్న ఖాళీ బాక్సుల్లో నీ సామాను అంతా పెట్టుకుని తీసుకెళ్ళవచ్చు. నువ్వు చేసే ప్రోజక‌్ట్ కి డబ్బులు అయిపోయాయి. ప్రోజక్ట్ అవలేదు అని నాకూ తెలుసు కానీ మరో నాలుగు నెలల దాకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవచ్చు డబ్బుల గురించి ఎందుకంటే వాళ్ళ ఫిస్కల్ ఇయర్ మొదలయ్యేది అక్టోబర్ ఒకటి నుంచి. మరో ప్రోజక్ట్ కి డబ్బులు వస్తే నిన్ను మళ్ళీ రమ్మని పిలుస్తాం. ఈ లే ఆఫ్ లో నాదేమీ హస్తం లేదు. జస్ట్ డబ్బుల వ్యవహారం అంతే...."

"మరి నేను ఇప్పటి దాకా చేసిన పనీ, అన్నీ దేనికీ కొరగావా? ఒక్క రెండు వారాల ముందు ఇలా లే ఆఫ్ గురించి చెప్పి ఉంటే నా ప్రయత్నాలు నేను చేసుకునేవాణ్ణి కదా?" రవి అడిగేడు పాలిపోయిన మొహంతో.

"చెప్పానుగా, నాదేం లేదు ఇందులో. కంపెనీ నీకు చెప్పమన్నారు నేను చెప్పేను, " సారీ అనే పదం నోట్లోంచి రాకుండా జాగ్రత్త పడింది క్రిస్టా, "అయినా నీకు ఆరువారాల దాకా జీతం ఇస్తున్నారు. మెడికల్ బెనిఫిట్సూ అవీ మాములుగానే ఉంటాయి. ఈ లోపుల ఇంకో ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు. మాకే కనక గవర్నమెంట్ గ్రాంట్ వస్తే ఇక్కడకే రావొచ్చు కూడా. అదీగాక ఇవాళ పదింటికి లే ఆఫ్ చేసిన అందరికీ కోచింగ్ ఇస్తున్నారు. అదికూడా మీకు ఉపయోగపడొచ్చు."

రవి ఆవిడకేసి చూసేడు. ఆరువారాలంటే ఆగష్టు మధ్యదాకానన్నమాట. ప్రోగ్రామింగ్ అంటే ఏమీ తెలియని ఈవిడ, పని చేసిన రోజుల్లో, తను టీము లీడ్ కాబట్టి తన టీము చేత పని చేయించుకోవడం కోసం, తన కాళ్ళు పట్టడానికీ, కాకా పట్టడానికీ తయారైపోతూ ఉండేది. ఇప్పుడో? మేక వన్నె పులి. ఆహా... సరే తనకిచ్చిన కాయితాలన్నింటి మీదా సంతకాలు పెట్టి బయటకి నడిచేడు. వచ్చేసేటప్పుడు తన ఐ డి ఇచ్చేసి మరీను. అట్టపెట్టెల్లో తన క్యూబ్ సామాను సర్దుతూ ఉంటే, క్రిస్టా వ్యవహారం చూసాక చటుకున్న స్ఫురించింది, మేనేజర్ అంటే ఎలా ఉండొచ్చో, ఉండకూడదో.

సామానంతా పేక్ చేసి కారులో పెట్టి ఇంటికొచ్చేడు అన్నీ అయ్యేక. స్కూళ్ళు అయిపోయి వేసవి శెలవుల్లో ఉన్న అమ్మాయిలిద్దరూ, కోమలీ ఆశ్చర్యపోయేరు అర్ధాంతరంగా ఇంటికొచ్చిన రవిని చూసి. జరిగినదంతా చెప్పేక ఈ సారి మరింత ఆశ్చర్యం. ఆరువారాల్లో ఉద్యోగం దొరుకుతుందా? అదీ ఈ రిచ్ మండ్ లాంటి ప్రాంతంలో? ఈ రిచ్ మండ్ లో దొరక్కపోతే ఏ డి.సి. కో వెళ్ళాలి కాబోలు. డి.సి. లో దొరికితే మూడేళ్ళ క్రితం కొన్న ఇల్లు అమ్మవద్దూ? పిల్ల చదువులెలా? మంచి స్కూలు దొరకొద్దూ? దొరికినా ఇక్కడ జరిగినట్టూ ఇంటి ముందుకి బస్సు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తుందా? ఏదైనా ఓ రోజు బస్సు తప్పిపోతే స్కూలుకి డ్రైవ్ చేయడం మరో తద్దినం. డి.సి. ట్రాఫిక్కా, మజాకా?

భోజనం చేసేదాకా ఆలోచనలతో, పెళ్ళాం పిల్లలతో వాగి వాగి అలిసిపోయిన రవి మధ్యాహ్నం మూడింటికి మంచం ఎక్కేడు. ఎప్పుడు నిద్ర పట్టిందో, కళ్ళు తెరిచేసరికి ఆరు కావొస్తూంది. పక్కనే చిన్న అమ్మాయి పావని తనకేసి చూస్తూంటే అడిగేడు రవి, "చాలాసేపు నిద్రపోయానా?"

అడిగినదాన్ని పట్టించుకోకుండా, ఏడేళ్ళ పావని అడుగుతోంది, "డాడీ, మరి నీకు రేపట్నుంచి ఉద్యోగం లేదా?"

"రేపట్నుంచి కాదమ్మా, ఆగస్టు ఇరవై నుంచి. అప్పటిదాకా జీతం ఇచ్చి మేపుతానని చెప్పారు కదా?"

"మరి మనం ఫ్లోరిడా వెళ్ళొచ్చా అయితే?" అప్పటికి తనకి తోడుగా వచ్చిన పెద్దమ్మాయి ఆమని తో కలిసి ఉత్సాహంగా అడిగింది పావని.

ఒక్కసారి గుండె గుభేల్ మంది రవికి. నిజమే ఈ ఫ్లోరిడా ట్రిప్పుకి రెండు నెలలనుంచి ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం పోయింది కనక వెళ్ళడమా మానడమా?

బెడ్ రూం లోంచి బయటకొచ్చి టీ తాగుతూ కోమలితో చర్చించేడు ఫ్లోరిడా విషయం. వెళ్ళాలనుకున్నది జూలైలో. వెళ్తే చేతి చమురు బాగా వదులుతుంది. వెళ్ళకపోతే డబ్బులు మిగులుతాయి సరే మరి ఉద్యోగం గురించి ఆలోచనలూ, పిల్లల గోలా తప్పవు. ఓ గంట తర్జన భర్జనలు పడ్డాక వెళ్ళడానికే నిశ్చయం చేసేరు. రాత్రి నుంచి చూడాలి పిల్లల కంగారు, ఇంకా ఇరవైరోజులుండగానే సామాను సర్దడం, ఏమేమి చూడాలో గూగిల్లో వెతకడం అన్నీను.

సోమవారం ఆలస్యంగా లేచిన రవికి ఇల్లంతా కొత్తగా కనబడింది. ఉద్యోగం ఉన్నప్పుడు బయటకొస్తే అక్కడో కారూ ఇక్కడో మోటార్ సైకిలూ కనిపించేవి వీకెండ్ లో. ఇప్పుడో? రోడ్డు మీద జనసంచారం లేదు. లోపలకెళ్ళి ఇంటర్నెట్టులో ఉద్యోగాలకి చూస్తూ అప్లికేషన్ పంపించడానికి యజ్ఞం మొదలు పెట్టేడు. ఈ మధ్య ఏవీ జాబ్స్ కి అప్లై చేయలేదు కనక మొదటి పని రెజ్యూమె తయారుచేసుకోవడం. జెనరల్ డైనమిక్స్ కంపెనీలో క్రిస్టా తో చేసిన పని తన చివరి ఉద్యోగం. ఈ రెజ్యూమె తయారయ్యేసరికి పన్నెండైంది. తాను సిటిజన్ కనక ఏ ఉద్యోగం కోసమైనా అప్లై చేసుకోవచ్చు. యధాలాపంగా చూస్తూంటే ఫోర్ట్ లీ వారి ఉద్యోగం కనబడింది. తనకిప్పుడొచ్చే జీతం కన్నా తక్కువే. అయితేనేం అదీ ఒక ఉద్యోగం కాదూ? ఓ అప్లికేషన్ పారేసి లేచేడు.

రోజులు పరుగెడుతూ, జూలై ఎంత త్వరగా వచ్చిందో ఫ్లోరిడా ట్రిప్పూ అంతే త్వరగా వచ్చింది. ఎంత సరదాగా ఉందామన్నా ఇంకో మూడు వారాల్లో తనకి ఉద్యోగం ఉండదనే ఆలోచన రవిని మాత్రం సమాధానపరచలేకపోతోంది. ఫ్లోరిడా నుంచి వెనక్కొచ్చిన మూడో రోజు నుంచి పిల్లలిద్దరూ సణుగుడు ప్రారంభించేరు స్కూల్ సప్లైస్ కొనాలంటూ. పిల్లలిద్దరికీ రెండేళ్ళ వయసే తేడా వల్ల ఇద్దరికీ దాదాపు ఒకటే లిస్టు కాకపోతే పెద్దమ్మాయికి కాస్త పెద్దది. లిస్టు కేసి చూసేడు రవి. వైడ్ రూల్డ్ కాయితాలు నోట్సు రాసుకోవడానికి, క్రేయాన్స్, పెన్సిళ్ళు, రబ్బర్లూ, జిగురు, ఎట్సెట్రా, ముక్కు తుడుచుకునే కాయితం కూడా పంపించండి మహా ప్రభో అని రాసి పారేసారు లిస్టులో. ఇంట్లో అక్కడొకటీ ఇక్కడొకటీ వాడిన పెన్సిళ్ళు ఓ వందదాకా ఉన్నాయి. అవి పనికిరావుట పిల్లలకి. కొత్తవి కొని ఇవ్వాలి. క్రితం ఏడాది కొన్న కాయితాల్లో సగం వాడినదే లేదు. అవి వాడొచ్చుగా? అలా కుదరదు అంటోంది చిన్నమ్మాయి పావని. ఈ సంత అంతా మోయడానికో మాంఛి బేక్ పేక్, మధ్యాహ్నం తినడానికి పట్టుకెళ్ళే లంచ్ బాక్సుకి మరో సంచీ. పెరిగే పిల్లలు కనక క్రితం ఏడాది బట్టలు ఈ ఏడాది పడతాయా? మరి బూట్లో? అవి పట్టకపోతే మరో జత కొనడం తప్పదు. మళ్ళీ ఇందులో లొసుగు ఏమిటంటే కొనే షూస్ నైకీ వారివై ఉండాలి. ఏమైనా అడిగితే పిల్లలిద్దరికీ అలక, అన్నం తినకుండా చేసే ఉపవాస యుద్ధం. ఇటువైపు ఖర్చులు అటువైపు తనకి లే ఆఫ్ వల్ల ఆగిపోయే జీతం.

ఆలోచనల్లో ఉండగానే పావని అడుగుతోంది. "నాన్నా స్కూల్ సప్లైస్ ఎక్కడ కొందాం?"

"చూద్దాం లే అమ్మా ఇంకా టైం ఉంది కదా?"

"డాడ్, స్కూల్ రెండువారాల్లో మొదలు పెడుతున్నారు. నా ఫ్రెండ్స్ అంతా కొనేసి ఉంటారు ఈ పాటికి."

"స్కూల్ సప్లైస్ కొనడానికి అప్పుడే ఏం తొందర? ఓ వారం ముందు కొంటే అన్నీ రేట్లు తగ్గి చవకగా దొరుకుతాయి కదా?"

"డాడ్ నువ్వెప్పుడూ ఇరవై సెంట్లకీ, నలభై సెంట్లకీ తేడా చూసుకుంటావెందుకు? నువ్వో చీపో గాడివి." తిరస్కారంగా చూస్తూ అంది పావని.

"అవునులే, ఆదివారం పేపర్ చూశాక కొందాం. ఇవాళ ఇంకా శుక్రవారమేగా?" నవ్వుతూ చెప్పేడు రవి.

"పెద్ద లిస్టు ఉంది డాడ్, ఇప్పుట్నుంచే కొనాలి. లేకపోతే దొరకవేమో"

"అవునా, ఏదీ ఆ లిస్టు ఇలా తే, చూద్దాం" ఆశ్చర్యం నటిస్తూ చెప్పేడు రవి.

పావని పట్టుకొచ్చిన లిస్టు చూసి తననే చదవమంటే "మొదటిది రెండు బాక్సుల పెన్సిళ్ళు" అంది.

రవికి తన చిన్నతనం గుర్తొచ్చింది ఓ సారి. ఒకప్పటి ఆంధ్రాలో కొత్తగూడెం ఎక్కడా, ఇప్పుడు తానుండే రిచ్ మండ్ ఎక్కడా? పావని వయసులో స్కూలుకెళ్తూంటే తన దగ్గిర ఓ ఇంకు పెన్ను ఉండేది. అదేనా తన అక్క వాడేసినది. అదే తన దగ్గిరకి వచ్చేసరికి ఏనుగెక్కినంత సంబరంగా ఉండేది, తనకది కొత్త పెన్ను కిందే లెక్క. దాంట్లో ఇంకు పోసి జాగ్రత్తగా ఓ వారం దాకా వాడేవాడు. ఎప్పుడైనా ఆటల్లో కిందపడ్డప్పుడో, స్కూలుకెళ్ళేదారిలో జేబులోంచి పడ్డప్పుడో అందులోంచి ఇంకు కారిపోయి బట్టలమీద పడేది. ఆ రోజు తనకి స్కూల్లో అయ్యవారిచేతుల్లోనూ, ఇంటి దగ్గిర అమ్మ చేతుల్లోనూ వీపు విమానం మోతే బట్టలు పాడుచేసుకున్నందుకు. ఆ ఇండియన్ ఇంకు ఎంత తోమినా పోదని అమ్మ గోల అయితే ఇంకుమరకల్తో స్కూలుకొస్తున్నాడని అయ్యవారి గోల స్కూల్లో. పెన్సిలా? అది అసలు పదో తరగతికి వచ్చేదాకా వాడనే లేదు. పదిలో మాత్రం ఓ పెనిసిలు కొని దాన్ని మధ్యకి విరక్కొట్టి బ్లేడు తో చెక్కి ఇచ్చేవాడు నాన్న. ఓ ముక్క పారేస్తే మరోటి ఉంటుందనే ధీమా కాబోలు. స్కూల్లో పెనిసిలు ముల్లు విరిగిపోతే దాన్ని బ్లేడుతో చెక్కడం, చేతకాక వేళ్ళు కొసుకోవడం. ఒకే పెనిసిలు మొత్తం పదో తరగతి చివరి దాకాను. అది కానీ పోతే వీపు మరో సారి విమానం మోత మోగకుండా ఎంత జాగ్రత్తో.

ఆలోచనల్లోంచి తేరుకుని అడిగేడు రవి, "సరే తర్వాతది?"

"కాలేజీ రూల్డ్ నోట్ బుక్ పేపర్, 250 షీట్లు."

"హేవిటీ? మూడో క్లాసు చదివే నీకు 250 షీట్లు ఎందుకే?"

"డాడ్, టీచర్ కి తెలుసా నీకు తెలుసా? 250 షీట్లు కావాలి అని రాశారు చూసావా?" లిస్టు చూపిస్తూ అంది పావని.

మళ్ళీ గతంలోకి వెళ్తే....ఒక తరగతి పరీక్షలైన వెంఠనే అది పాసవ్వగానే, ఉన్న నోట్ బుక్కులన్నింటిలోను మిగిలిపోయిన తెల్ల కాయితాలో, రూళ్ల కాయితాలో జాగ్రత్తగా విడదీసి వచ్చే ఏటికి ఒక చిత్తు పుస్తకం తెలిసిన ప్రెస్సులో కుట్టించుకోవడం. ఏదైనా సబ్జెక్ట్ కి నోట్ బుక్కు లేనప్పుడు ఈ చిత్తులోనే రాసుకోవడం. ఏడాదికి రెండో మూడో నోట్ బుక్కులు కొనుక్కునేవాడా? ఏమో గుర్తున్నట్టులేదు.

"తర్వాత?" అడిగేడు రవి.

"క్రేయాన్స్, నాలుగు బాక్సులు"

"అవన్నీ ఎందుకే?"

"మరి ఏడాది అంతా డ్రాయింగ్ కీ, బొమ్మలు వేయడానికీ."

"క్రితం ఏడు కొన్నవన్నీ అలాగే ఉన్నాయి. వాడినదీ లేదు, పోయిందీ లేదు. అవి వాడుకోవచ్చుగా?"

"డాడ్!" అరిచింది పావని.

...డ్రాయింగ్ మేస్టారి అరుపులు గుర్తొచ్చాయి ఒక్కసారి. పెన్సిల్తో వేసిన బొమ్మ సరిగ్గా రాలేదని వీపు చీరేసాడు ఆయన. వేసిందే వేసి ఇంక ఎంతమాత్రం ఓపిక లేక అలాగే వదిలేసాడు తాను. ఎనిమిదో తరగతి లోనో తొమ్మిదిలోనో సైన్సు మాస్టారు పెద్ద చార్టు మీద బొమ్మ వేసుకుని రమ్మంటే కాలేజీలో చదువుతున్న పక్కింటి కుర్రాడు వేసిపెట్టాడు. తన దగ్గిర పెనిసిలూ లేదు, ఇంకూ లేదు; కొనడానికి డబ్బులూ లేవు.

"సరే ఇంకా మిగతావి ఉన్నాయా?"

"ఆ, రబ్బర్లు, గ్లూ, టిష్యూ పేపర్లు, బోర్డ్ మీద రాసుకునే డ్రై ఎరాజ్ పెన్నులు"

.... గ్లూ అంటే జిగురేనా? పిండి కి మైనం ముద్ద కలిపి బొగ్గుల కుంపటి మీద ఉడికించుకోవడం, దానితో గాలిపటం చేసుకుని ఎగిరించుకోవడం అదే తమ సరదా. పేపర్ తో రాకెట్ చేయడానికి నోట్ పుస్తకంలో సరదాగా కూడా కాయితం చింపుకోలేని లక్జరీ తనది. ఏ వారపత్రిక తోనో న్యూస్ పేపర్తోటే చేస్తే పల్చటి కాయితం వల్ల అది ఎగిరేది కాదు....

ఎప్పుడు లోపలకి వచ్చి ఇవన్నీ విందో పెద్దమ్మాయి ఆమని చెప్తోంది, "డాడ్ నాకు అమెరికా మేప్ కొనమని చెప్పారు మా టీచర్."

"మేప్? అదెందుకు? అవి పై తరగతిలోకి కదా?"

"కాదు డాడ్, వాటిలో నదులూ అవీ చూపించాలిట, పోయినేడు కొన్ని వేసాము, మళ్ళీ ఈ ఏడు వేయిస్తామని చెప్పారు మా జి.టి టీచర్. మా క్లాసులో నేనొక్కదాన్నే గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ తెలుసా?" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్తోంది కూతురు.

... సాంబశివరావు గారనే తన మేష్టారు. "ఒరే అందరూ తలో పదిరూపాయలూ తెండిరా, నేను అందరికీ మేప్ లు కొని పట్టుకొస్తా" అని చెప్తే ఇంట్లో దెబ్బలాడి తన్నులు తిని పట్టుకెళ్ళాడు తాను పది రూపాయలూను. ఆ సాంబశివరావు గారు క్లాసులో యాభై మందిచేతా అయిదొందల రూపాయలు కట్టించుకుని వెళ్ళినవాడు మళ్ళీ పత్తా లేడు. వేరే ఊరికి ట్రాన్స్ ఫరై వెళ్ళిపోయార్ట. ఎనిమిదో తరగతిలో అలా చేసినాయన సాంబశివరావు అయితే తొమ్మిదిలో అదే తంతు. ఈసారి మేష్టారి పేరు మరో సదాశివరావు. ఆ తర్వాత మరెప్పుడూ మేప్ లూ కొనలేదు, నదులూ వేయలేదు. ఉత్తరోత్తరా ఇంజినీరింగులో సీటు వచ్చాక మాత్రమే కొత్తగూడెం నుంచి విజయవాడ, అక్కడ్నుండి వైజాగ్ వెళ్తుంటే ఈ నదులనీ, వాటి మీద కట్టిన వంతెనలనీ దాటుతున్నప్పుడు అవి ఎక్కడ పుట్టాయి ఎట్నుంచి ఎటు ప్రవహిస్తాయో తెల్సింది....

"ఇవన్నీ ఇవాళ కొందాం డాడ్", ఇద్దరమ్మాయిలూ బతిమాలుతూంటే ఆఫీసు రూములోంచి కింద హాలులోకి వచ్చి "ఏవీ, క్రితం ఏడు మీ సామానులన్నీ తీయండి అసలు అందులో ఏవుందో చూద్దాం?" అన్నాడు రవి.

పాత పెనిసిళ్ళు, పెన్నులూ, కాయితాలూ, క్రేయాన్స్, రబ్బరుముక్కలూ అన్నీ బయటకి తీస్తే అందులో అన్నీ దాదాపు పనికొచ్చేవే. "ఇవన్నీ ఏమి చేయాలి? వీటిని జాగ్రత్తగా బాక్సులో సర్దుకుని వెళ్ళొచ్చు కదా?" అడిగేడు కాస్త కోపంగా రవి పిల్లలిద్దర్నీ.

"డాడ్" అంటూ అరిచేరు పిల్లలిద్దరూ నమ్మలేనట్టుగా "అందరూ కొత్త పుస్తకాలు, కొత్త పెన్సిళ్ళు తీసుకొస్తే మేము పాతవి ఎందుకు తీసుకెళ్ళాలి?"

"ఎందుకా? నాకు ఉద్యోగం పోతోంది కనకా, జీతం రాదు కనకాను," అప్రయత్నంగా నోట్లోంచి వచ్చేసింది సమాధానం. పిల్లలిద్దరూ ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. కాసేపటికి పెద్దమ్మాయే అంది, "డాడ్ ఇవన్నీ కలిపి మహా అయితే యాభై డాలర్ల కంటే ఉండవు కదా? ఆ మాత్రం డబ్బ్లుల్లేవా?"

"అది కాదు ప్రశ్న, మీరు ఇవన్నీ ఎండుకు వాడకూడదూ అని. ఇవి పాడవలేదు. పెన్సిళ్ళన్నీ చెక్కితే శుభ్రంగా తయారౌతాయి కూడా. మీరు అడిగిన వన్నీ కొనడానికి యాభై డాలర్లైతే, మీ షూస్ ఒక్కోటి నలభై డాలర్లు. తమరికేమో నైకీ తప్ప ఏవీ కుదరదని శెలవిచ్చారు కదా ముందో సారి?"

ఏమీ మాట్లాడకుండా ఇద్దరూ బిక్కమొహాలు వేసుకుని వాళ్ల గదుల్లోకి వెళ్ళాక కోమలి అంది రవితో, "వాళ్ళని అలా కసుర్తారెందుకూ? మెల్లిగా నచ్చ చెప్పొచ్చు కదా?"

"ఆ చెప్పొచ్చు, వాళ్ళు వింటారు కూడాను," కోపం అదుపులో లేదని తెలుస్తూంటే మెయిల్ చెక్ చేయడానికి మళ్ళీ ఆఫీసు రూములోకి దూరేడు రవి.

ఈమెయిల్ తెరిచేసరికి అప్పుడే వచ్చినట్టుంది కొత్తగా ఫోర్ట్ లీ వాళ్ళ దగ్గిర్నుంచి ఆ మధ్య ఎప్పుడో పంపిన అప్లికేషన్ కి సమాధానం. "మీరు పంపిన అప్లికేషన్ అందినది. ఇప్పట్లో ఏమీ ఖాళీలు లేవు. ఎడ్వర్టైజ్ మెంట్లో చెప్పినట్టూ మీ అప్లికేషన్ ఫైల్ లో పెట్టాం. ఖాళీ ఏదైనా వస్తే తర్వాత ఎవరో మిమ్మల్ని సంప్రదిస్తారు."

"తాను అప్లికేషన్ పంపినది నిజమైన ఉద్యోగానిక్కాదన్న మాట. ఏదో డాటాబేస్ లో తన రెజ్యూమే కుక్కారు. అది పైకి తేలితే అప్పుడు చూద్దాం. అసలే చిరాగ్గా ఉన్న రవికి ఈ మెయిల్ చూసే సరికి వళ్ళు మండింది. కాళ్ళ దగ్గిరేముందో చూసుకోకుండా 'స్టుపిడ్' అంటూ ఒక్క తన్ను తన్నాడు. డెస్క్ టాప్ పెద్ద శబ్దం చేస్తూ కిందపడింది. దాంతోపాటే డెస్క్ మీద ఉన్న మానిటర్ వైరు ఊడిపోయి కిందపడింది. అన్ని వైర్లూ సాకెట్లోంచి బయటకొచ్చి ఒక్కసారి పవర్ పోయినట్టూ కంప్యూటర్ ఆఫ్ అయింది. తనకోపమె తన శతృవు... ఒక్కసారి చల్లబడి కుర్చీలోంచి లేచి అన్నీ సరిగ్గా అమర్చాడు రవి. ఓ గంట నిశ్శబ్దంగా కూర్చున్నాక హాల్లోకి తిరిగి వచ్చాడు. పిల్లలిద్దరూ ఇంకా భయపడుతున్నట్టున్నారు. ఎక్కడా అలికిడి లేదు.

మిగతా రోజంతా ముభావంగా గడిచింది అందరికీ. రాత్రి పడుకోబోతూంటే పిల్లలిద్దరికీ గుడ్ నైట్ చెప్పడానికి వాళ్ళ గదిలోకి వెళ్ళడానికి మనసొప్పలేదు రవికి. పడుకోబోయే ముందు పిల్లల మొహాల్లో కనబడే కొత్త సప్లైస్ కొనుక్కోలేమనే విచారం, వాడిపోయిన మొహాలూ, కాంతిలేని కళ్ళూ గుర్తొచ్చాయి. తాను ఆదాచేయబోయే యాభై డాలర్లు పిల్లలకన్నా ముఖ్యమా? ఏదో ఒక ఉద్యోగం రాకపోదా? అంతగా అయితే అన్ ఎంప్లాయ్ మెంట్ ఇన్స్యూరెన్సో, ఏదో ఒకటి చేయొచ్చు. మరీ కష్టమైతే ఏ చర్చ్ లోనే జరిగే బేక్ టు స్కూల్ పండగకి వెళ్తే సరి వాళ్ళే ఈ సప్లైస్ అన్నీ ఇస్తారు. ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా కళ్ళు మూసుకుని నిద్రకుపక్రమించేడు.

రెండువారాలు గడిచాయి. మరో వారంలో పిల్లల స్కూళ్ళు తెరుస్తారు. ఆదివారం పేపర్ చూసి పిల్లలిద్దరితో చెప్పేడు రవి, "ఈ రోజు మీ స్కూల్ సప్లైస్ కొనడానికి టార్గెట్ కి వెళ్దాం మధ్యాహ్నం భోజనం అయ్యాక; సరేనా?"

"డాడ్ మరి బేక్ పేక్, షూస్ ఎక్కడ కొందాం?" అడిగేరు పిల్లలు.

"బేక్ పేక్ దేనికీ? క్రితం ఏడు కొత్తది కొన్నాం అది బానే ఉందిగా? షూస్ కూడా ఏడాది అవలేదు కొని."

కోమలి అంది మెల్లిగా పిల్లల్తో, "ఈయన మళ్ళీ మొదలెట్టాడు సంత."

ఈ కామెంటు రవికి చురుక్కు మని తగిలినా, ముందో సారి అయిన దెబ్బలాట గుర్తొచ్చి నోరుమూసుకున్నాడు. టార్గెట్ కి వెళ్తుంటే దారిలో మనసులో అనిపించింది బయటకి చెప్పకుండా ముభావంగానే ఉన్నాడు. సాయంత్రానికి స్కూల్ సప్లైస్, బూట్లు, బేక్ పేక్ లు కొని వెనక్కొచ్చాక రవి హాలులో కూర్చుని ఒక్కో పేకెట్టు విప్పి బేక్ పేక్ లో సర్దుతూ ఉంటే పిల్లలిద్దరూ సహాయం చేసారు. రవికి తన బాల్యం గుర్తొచ్చింది మరోసారి. స్కూలుకెళ్ళడానికి కొత్తగా హవాయి చెప్పులు కొనిచ్చాడు నాన్న. అవి రెండు నెలల్లో తాళ్ళు తెగి పిన్నీసులు పెట్టాక కూడా పనిచేయనని మొరాయించాయి. అక్కడకీ వాటిని రిపేర్ చేయించి వాడుతుంటే గుడికి వెళ్ళినప్పుడు ఎవరో కొట్టేసారు వాటిని. ఆ తర్వాత ఇంక చెప్పుల్లేకుండానే నడక. అసలు ఇంజినీరింగ్ పూర్తి అయ్యి ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి వెళ్ళేదాకా తనకి బూట్లే లేవు. స్కూలుకెళ్ళే దారి పుంతలో ఎన్ని ముళ్ళు గుచ్చుకునేవో...బేక్ పాకా? ఉన్న పుస్తకాలు భుజం మీద పెట్టుకుని నడవడమే. దారిలో బరువుకి అప్పుడప్పుడూ కింద పడిపోతూండేవి పుస్తకాలు. ఇప్పుడీ సప్లైస్, బేక్ పాక్, షూస్ కొన్నాక ఈ పిల్ల లిద్దర్లి కళ్లలో ఎంత వెలుగు? ఎన్ని డబ్బులు దాచినా ఇటువంటి వెలుగు తాను చూడగలడా పిల్లల మొహంలో? వందో రెండు వందలో పోతే పోనీయ్ గాక. అప్పుడప్పుడూ అలా పిల్లల కళ్ళలోకి చూస్తూనే తన గతాన్ని నెమరు వేసుకుంటూ ఆ ఆదివారం గడిపేడు రవి. ఆ తర్వాత వచ్చే గురువారం నుంచే స్కూళ్ళు మొదలు.

మూడు రోజులు గడిచి స్కూళ్ళు తెరిచే రోజు రానే వచ్చింది. మరో వారంలో తన కొచ్చే జీతం డబ్బులు రావు ఇంక అనే ఆలోచన ముల్లులా పొడుస్తూనే ఉంది రవిని. పొద్దుటే లేచి తయారైన పిల్లల్తో బాటు బస్సు వచ్చే సమయానికి ముందే బయట నుంచున్నాడు రవి. యార్డ్ లో గడ్డి పొద్దున్నే కురిసిన వర్షానికి తడిసి ఫ్రెష్ గా ఉంది. మంచి వాతావరణం. పిల్లలిద్దరి కళ్ళల్లోనూ కోటి వెలుగులు, స్కూలుకి కొత్త బేగ్ తో, కొత్త షూస్ తో వెళ్తున్నందుకు. మరో సారి రవికి తన గతం గుర్తొచ్చింది. మొదటి రోజే తమ స్కూల్లో పిల్లల్ని కొట్టే టీచర్లూ, అటువంటి ఒకానొక రోజుల్లో తన వీపు మోగడం, తన ప్రిన్సిపాలు కం ఇంగ్లీషు టీచర్ సుందర్రామ్మూర్తి గారు కుర్రాళ్ళందర్నీ మొదటి రోజే ఏదో సరిగ్గా పలకలేదని 40 నిముషాలు క్లాసులో అందర్నీ నించోపెట్టడం. ఒక్కసారి తల విదిల్చి తనలోనే గొణుక్కుంటున్నట్టు అన్నాడు రవి - "ఎప్పుడో ముందు రోజుల్లో నాకు జరిగిన చెడు గుర్తు తెచ్చుకుని ఈ రోజు పాడు చేసుకోదల్చుకోలేదు." ఈ మాట అనుకుంటూండగానే ఎర్ర లైట్లు వెలుగుతూ బస్సు వచ్చింది పిల్లల కోసం. ఇద్దరికీ తలో ముద్దూ ఇచ్చి వాళ్ళు బస్సు వైపు కదులుతూంటే చేతులూపేడు. బస్సు ఎక్కబోతూ పావని ఏదో అరిస్తే సరే అన్నాడు కంగారుగా. లోపలకి వస్తూంటే అనిపించింది, "ప్రపంచంలో ఎన్ని డబ్బులున్నా పోయినా ఈ పిల్లల సంతోషం కాదనడానికి తనకి అర్హత లేదు."

తీరిగ్గా స్నానం చేసి కాఫీ తాగుతూ ఈమెయిల్ తెరిచేడు. రెండు కొత్తగా వచ్చిన మెయిల్స్ లో ఒకటి క్రిస్టా దగ్గిర్నుంచీ, రెండోది ఫోర్ట్ లీ దగ్గిర్నుంచీను. "ఫోర్ట్ లీ మెయిల్ ఎలాగా పనికిరానిదే క్రితం సారి లాగానే అది తర్వాత చూడొచ్చు" అనుకుని క్రిస్టా మెయిల్ చదవడం మొదలుపెట్టేడు రవి.

"రవి, ఈ మధ్య జరిగిన ఆడిట్ లో కంట్రాక్టర్లకి ఇచ్చిన డబ్బులు లెక్క చూస్తే మరో నాలుగు వారాలకి డబ్బులు మిగిలాయిట. వచ్చే సోమవారం నుండి నాలుగువారాలు నిన్ను మళ్ళీ ఉద్యోగంలోకి పిలుస్తారు. మరో మంచి విషయం ఏమిటంటే, ఆ తర్వాత అక్టోబర్ ఒకటికి మన ప్రోజక్ట్ ని మూడేళ్ళు పెంచుతూ ఫెడరల్ గవర్నమెంట్ డబ్బులిచ్చింది. అందుచేత ఈ మెయిల్ నిన్ను వెనక్కి రమ్మని చెప్పడానికి. సోమవారం ఎనిమిదింటికి కలుద్దాం. వెల్కం బేక్ టు వర్క్!"

ఎందుకో ఒక్కసారి రవిని నీరసం ఆవహించింది. క్రిస్టా వ్యవహారం చూసాక మళ్ళీ ఆవిడతో పనిచేయాలనిపించడం లేదు ఇప్పుడు. క్రిస్టా సంగతి అలా ఉంచితే, ఈ ఉద్యోగంలో మళ్ళీ జేరడానికి ఒప్పుకుంటే తనకి ఉద్యోగం అనేది ఒకటి ఉంటుంది. అదొక పెద్ద రిలీఫ్. రెండో ఈమెయిల్ ఫోర్ట్ లీ దగ్గిరనుంచి వచ్చినది చదవడం మొదలు పెట్టేడు.

"డియర్ అప్లికంట్, మీరు కొన్ని వారాల క్రితం పంపిన అప్లికేషన్ పరిశీలించడమైనది. మీ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ అన్నీ చూసి, మీ రిఫరెన్సులతో మాట్లాడేము. ఇవ్వన్నీ చూసాక మీరు మాకు కావాల్సిన కాండిడేట్ అని అర్ధమైంది. మీకు ఇష్టం ఉంటే ఈ మెయిల్ అందిన తర్వాత ఓ సారి ఫోర్ట్ లీ ఆఫీసుకు వస్తే మీ సెక్యూరిటీ క్లియరన్స్ అవీ చూసి ఉద్యోగం ఎప్పుడు మొదలుపెడతారో నిర్ణయించుకుందాము. రాబోయే రెండు రోజుల్లో ఈమెయిల్ ద్వారా గానీ కిందనిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి గాని మీ అభిప్రాయం తెలియపర్చ గలరు."

వచ్చిన మెయిల్ చదివాక చాలాసేపు అలా మానిటర్ కేసి చూస్తూ ఉండిపోయేడు రవి.

ఆఫీసు రూములోంచి కిందకొచ్చి కోమలి తో చెప్పేడు. క్రిస్టా గురించీ, ఇప్పుడొచ్చిన మెయిల్స్ గురించీ విన్నాక ఫోర్ట్ లీ ఉద్యోగం లో జేరడానికి నిశ్చయం అయిపోయింది; జీతం కాస్త తక్కువైనా సరే. క్రిస్టా తో ఉద్యోగం ఎంత డేంజరో ఆవిడే చూపించింది కదా? డబ్బులున్నప్పుడు రమ్మనడం, అవి లేనప్పుడు కుక్క కంటే హీనం గా చూడ్డం ఈ కంట్రాక్టర్లకి అలవాటే. వయసు మీద పడే తనకి ముందు ముందు ఎలా కుదురుతుంది? గత రెండు నెలలుగా ఎంత చిత్రవధ అనుభవించాడు తాను? ఆఖరికి పిల్ల స్కూల్ సప్లైస్ దగ్గిర కూడా జాగ్రత్తగా ఉండాలనుకోవడం ఎంత సిగ్గు చేటు?

అన్నీ నిర్ణయించుకున్నాక, ఆవిడ తరహాలోనే సారీ చెప్పకుండా, క్రిస్టాకి మెయిల్ పంపించడానికి మళ్ళీ ఆపీసు రూములోకి దూరేడు రవి. మెయిల్ ఓపెన్ చేస్తూంటే, చిన్న పాప పావని బస్సుకేసి వెళ్తూ "డాడ్ నీకు ఒక్క వారంలో ఉద్యోగం వచ్చి తీరుతుంది" అన్న మాటలు చటుక్కున గుర్తొచ్చి రవి మొహం మీద చిరునవ్వు తొణికిసలాడింది.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)