నాకునచ్చిన కథ
పేగు కాలిన వాసన
కథారచన- ఎ.ఎన్. జగన్నాథ శర్మ
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి

వాన వెలిసింది. వాతావరణమంతా తడితడిగా, చలిచలిగా వుంది. ఈక్షణమో, మరుక్షణమో మళ్ళీ చినుకు పుంజుకునేటట్టుంది. పదిన్నరయినా పాసింజరు బండి రాలేదు. ఆకలిగా వుంది. అసహనంగా వుంది. దీపస్తంభాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ వందలాది రెక్కల పురుగులు, నేలమీదికి దూసుకొచ్చి, ఆత్మత్యాగాలు చేసుకుంటుంటే జాలిగా వుంది.

తురాయి చెట్టునీడన నిల్చుని వున్నాను. గాలి కెరటం కదిలినప్పుడల్లా కొమ్మలు కలవరపడుతున్నాయి. అదుముకున్న నీటిని ఆకుల సందుల నుండి జారవిడుస్తున్నాయి. తలమీద చినుకుపడి చిట్లుతున్న శబ్దం. శరీరమంతా జలదరిస్తోంది.

పట్టాలకి అటూగా నిలిచిన జట్కా, చీకటి సముద్రంలో చిరునావలా వుంది. తడిసిన గుర్రం తల విదిల్చినప్పుడల్లా, దాని మెడనున్న మువ్వల పేరు కదిలి, శబ్దం చెవులను స్పృశించి, చెదిరిపోతోంది.

రైలొస్తున్నట్టుంది. పట్టాలు పలుకుతున్నాయి. చెట్టు నీడను వదిలి వచ్చాను. కనుచూపుమేర కాంతి పుంజం కన్పించింది. వచ్చి నిలిచిన పాసింజరు బండిలో నుంచి, ఆ ఆరుగురూ కిరాణా కొట్టు శెట్టీ, మేస్టరమ్మా, పోలీసు, జబ్బు మనిషి గురుమూర్తి, కాలేజి కుర్రోడు, టైపు నేర్చుకుంటోన్న అమ్మాయి దిగారు. గుంపుగా చేరి, నా కోసం వెదకసాగారు.

ఇళ్ళకి చేరాలని వాళ్ళకెంతో ఆత్రంగా వుందో, నేనూ ఇంటికి చేరుకోవాలని అంతగనే ఆత్రపడుతున్నాను. ఆ శరీరాలను వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో జారవిడిచేసి, చేతులు దులుపుకోవాలని వుంది.

జట్కా దగ్గరికి పరుగుదీశారు వాళ్ళు. వాళ్ళ వెనుగ్గా నడిచాన్నేను. సన్నగా వర్షం మొదలైంది.

అంతా ఒకరి మీద ఒకరుగా జట్కా మద్యలో ముడుచుక్కూర్చున్నారు. లాంతర్ని వేలాడదీసి నేనూ జట్కానెక్కాను. గుర్రం నడకలు పోయింది. వర్షం పుంజుకుంది.

ఊరికి దూరంగా నాలుగు మైళ్ళివతల వుందీ రైల్వేస్టేషన్. స్టేషన్ వరకు ఊరు ఎదగలేదు. ఎదిగే అవకాశమూలేదు. పది, పన్నెండిళ్ళతో చిన్న చిన్న గ్రామాలుగా వుందీ ప్రదేశం. కొండ ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది. పట్నం నుండి ఒకటి రెండు బస్సులు వున్నాయిక్కడికి. అయితే వర్షాకాలంలో బస్సుల జాడ కనిపించదు. మైదానాల వరకూ పరుగెత్తుకొచ్చిన బస్సులు, కొండను చూసి, గుండెలు బాదుకుని, వెనుతిరిగిపోతాయి. ఫలితంగా నావంటి జట్కావాలాలు బతకగలుగుతున్నారు.

గత పదేళ్ళుగా ఈరోడ్డుని చూస్తున్నాన్నేను. దీంతో ముచ్చట్లాడుతున్నాను. మురిపాలు పోతున్నాను. నాకు బాగా పరిచయమున్న రోడ్డిది! ఎక్కడ ఎత్తులున్నదీ, పల్లాలున్నది, గుంటలున్నది అన్నీనాకు కంఠోపాఠం. జట్కా నడపడంలో మెలకువలు చూపించనవసరం లేదు. అప్రయత్నంగా, అసంకల్పితంగా బండి సజావుగా సాగిపోగలుగుతుంది. నాకంటే, నాగుర్రానికి ఈ రోడ్డంతా మరీ సుపరిచితం.

చిన్ననాటి స్నేహితులివి!

వొలిపిరి కొడుతోంది. గాలి వాటుకి జల్లు, జట్కాలోనికి తొంగి చూస్తోంది. ముందుక్కూర్చున్న మేస్టరమ్మా, టైపు నేర్చుకుంటున్న అమ్మాయి తడిసినట్టున్నారు.

“వెధవ్వాన” అన్నది మేష్ట్రమ్మ.

“చలి చలి” అన్నది అమ్మాయి.

“ఇటు రారాదా” అన్నాడు మేస్టరమ్మను ఉద్దేశించి కిరాణాకొట్టు శెట్టి. పోలీసు పగలబడి నవ్వాడు. గురుమూర్తి దగ్గాడు. కుర్రాడెందుకో మౌనంగా వున్నాడు. ఏడు గంటలకు రావాల్సిన పాసింజరు బండి, మూడున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ ఆలస్యం, ఈ చీకటి, ఈ వర్షం శెట్టినీ, పోలీసుని సరదాలకూ, సరసాలకు ఉసిగొలుపుతోంటే, పాపం! ఆ మేష్ట్రమ్మనీ, అమ్మాయిని, గురుమూర్తిని బాదిస్తున్నట్టున్నాయి. కుర్రాడి గుండె గుబులు నేనెరుగను! నావిషాద నేపథ్యం వీళ్ళెరుగరు!

ఊరునుండి స్టేషన్‍కీ, స్టేషన్ నుండి ఊరుకి జట్కాలో దిగవిడిచినందుగ్గాను, వీళ్ళంతా నెలసరి కిరాయిగా యాభయి రూపాయల్ని నాకొక్కరూ చెల్లిస్తారు. పైపై బేరాలు పోను, నెల తిరిగేసరికి చేతిలో రెండువందల రూపాయలు మాత్రమే పడతాయి. శెట్టి, పోలీసు పైసా ఇవ్వరు. పోలీసు బాబుని కిరాయి అడిగే ధైర్యం నాకులేదు. కిరాయిని, వడ్డీకింద జమ చేసుకుంటాడు.

రెండేళ్ళక్రితం జట్కా బోల్తా పడింది. చక్రాలు విరిగిపోయాయి. గుర్రం కుంటిదయింది. అప్పుడు శెట్టిని ఆశ్రయిస్తే అయిదు వందల రూపాయలు అప్పిచ్చాడు. అప్పిచ్చి ఆనాడు ఆదుకుని ఈనాటికీ అసలు చెల్లించలేని నా జీవితమ్మీద స్వారీ చేస్తున్నాడు.

పట్నం ఠాణాలో పోలీసు బాబు పని చేస్తాడు. పక్కనే శెట్టి కిరాయి దుకాణం. ఫర్లాంగు దూరంలో స్కూల్లో మేష్త్రమ్మా, కాలేజీలో కుర్రాడు, ఇన్‌స్టిట్యూట్‌లో టైపు నేర్చుకునే అమ్మాయి, ఆస్పత్రిలో రోజూ పరీక్ష చేసుకునే గురుమూర్తి... వీల్లంతా ప్రతిరోజూ పట్నాన్ని పలకరించి, పరామర్శించి రాక తప్పదు. సెలవు దినాల్లో ఒకరిద్దరు తక్కువయినా, మిగిలిన వాళ్ళ కోసం నా వృత్తికి సెలవంటూదొరకదు.

బురదగుంటలో చక్రం పడింది. జట్కా తూలి పడి నిలిచింది. గుర్రం, శక్తినంతా కూడదీసుకుని లాగుతోన్నా ఫలితం లేదు. తప్పదనిపించింది. కుర్రాణ్ణీ, పోలీసుని, శెట్టిని జట్కాను నెట్టేందుకు కిందికి దిగమన్నాను. నలుగురమూ సాయం పడితేనేగాని జట్కా పైకి లేవదు.

ఇది మామూలే! వర్షాకాలంలో, దారిలో ఇటువంటి అడ్డంకులు తప్పనిసరవుతాయి.

"కావాలంటే అప్పిస్తాను! బండికి మోటారు పెట్టించరాదురా" అన్నాడు శెట్టి.

"అవున్నిజం" అన్నాడు పోలీసు. ఆ మాటలకి బతుకు భయం కలిగిందేమో! గుర్రం వణికింది. ఒక్కసారిగా శరీరాన్ని విదిల్చింది. జట్కా ఓ అడుగు ముందుకి నడిచి, నిలిచింది. చేతినంటిన మట్టిని, జట్కా అద్దాలకు పూసి, వాళ్ళు జట్కానెక్కితే, మట్టివాసనను వదుల్చుకోదలచక, నేనదే చేతుల్తో కళ్ళాన్ని అందుకున్నాను. లేచింది మొదలు పడుకునేవరకూ ఇదేమట్టిలో పరుగెడతాను. దీన్ని కాదనుకునే వాణ్ణికాను.

“దెయ్యాల వేళక్కాని ఇళ్ళకి చేరమేమో” అన్నాడు శెట్టి.

“మీరన్నది నిజం! పన్నెండు గ్యారంటీ” అన్నాడు పోలీసు.

“మరయితే రేపు మేష్ట్రమ్మ స్కూలుకి రాదు” అన్నాడు శెట్టి.

“ఆవిడ సంగతేమోగాని, గురుమూర్తిమాత్రం రేపు ఆసుపత్రికి రాడు” అన్నాడు పోలీసు. ఆమాటకి కితకితలు పెట్టినట్టుగా నవ్వాడు శెట్టి.

గురుమూర్తి చావుమీద సరస సంభాషణ సాగుతోంది. వస్తోన్న దగ్గునణచుకొని ఉక్కిరిబిక్కిరవుతున్నాడు గురుమూర్తి. తన ప్రాణంతో పరాచికాలాడడాన్ని అతను భరించలేకున్నాడు.

గాలివాటం తగ్గింది. వర్షం నిలిచి కురుస్తోంది. కాలవలు కట్టి, నీరు రొదగా ప్రవహిస్తోంది.

ఈసరికి, గుడిసె నిండుగా నీరు నిలిచి వుంటుంది. గిన్నెలూ, బట్టలు తేలిపోయుంటాయి. అన్నం గిన్నె గిరికీలు కొడుతూ వుంటుంది. పల్లంలో వున్న గుడిసె మీద తల్లి గంగకి ఎల్లల్లేని ప్రేమమరి.

ఆకలిని అణగార్చుకున్నా, అలుపును మరచి పోయేందుకు, గాఢంగా నిద్రించేందుక్కూడ అవకాశం లేదు. ఏటవాలుగా నిలిచిన జట్కాలోనే, జారుడు బల్లమీద వాటంలా విశ్రాంతి తీసుకోవాలి.

అత్తమ్మ వుంటే గుడిసెలోని నీటిని తోడి పారేసేది. ఏ వేళనయినా మంచు ముద్దలా పిడికెడు అన్నాన్ని కంచంలోనుంచేది. మామయ్య చనిపోవడంతో అత్తమ్మ లేక పోయింది. పట్టెడన్నంకోసం, శరీరాన్ని ఎరజూపుతూ పిచ్చితల్లి లేచిపోయింది. ఎవర్ని అల్లుకుని, ఎక్కడ ఆకలిని తీర్చుకొంటోందో ఏమో!

రాయి మీంచి చక్రం నడిచినట్టుంది. జట్కా తూలిపడి నిలదొక్కుకుంది. అంతా ఒక్కసారిగా అరిచి సద్దుమణిగారు.

“కళ్ళు మూసుకున్నావేట్రా బాబూ” అడిగాడు శెట్టి.

“లేదు! రోడ్డు మూసుకుపోయింది” అన్నాడు జవాబుగా.

“జాగ్రత్తరా బాబూ! రేపు మినిస్టరుగారొస్తున్నారు. బందోబస్తుకెల్లాలి” అన్నాడు పోలీసు.

అతనికి బదులు పలకలేదు. అసలా పోలీసుతో మాట్లాడాలంటేనే అసహ్యం! అతను చనిపోతే బాగుణ్ణనుకుంటాను. పట్నంలో ఏదో ఒక దొమ్మీలో ఎవరో ఒకరు పోలీసుని చంపినట్టు వార్త రాకూడదూ? అన్పిస్తుంది. అతనిమీద ఎందుకనో చెప్పలేనంత కసి!

గురుమూర్తి పెద్దగా ఆయాసపడుతున్నాడు. బుసలు కొడుతున్నాడు. చచ్చిపోతాడేమో! అతగాడి శవాన్ని, ఇంటికి అప్పజెబుతాననిపించింది.

శెట్టిని హత్య చేయాలనివుంది మేష్త్రమ్మను తిట్టిపోయాలని ఉంది. టైపు నేర్చుకుంటోన్న అమ్మాయిని తన్ని ఇంట్లో కూర్చోబెట్టాలని వుంది. కాలేజీ కుర్రాడి మీద కోపగించుకోవాలని వుంది. ఎందుకు? ఎందుకంటే జవాబులేదు. ఈ ముఖాల్ని చూస్చూసి, వీటితో విసిగిపోయుంటాను. బతుకులో కొత్తదనం లేదనిపించడం కూడా ఈ ఆవేశానికి, అసహనానికీ కారణం కావచ్చు.

మొహం మొత్తేటట్టు జీవించడం ఇష్టం లేకపోతోంది. ఏదో కావాలనిపిస్తోంది.

ఈ అనుభవం నాకు కొత్తది కాదు. ఈ బాధా సరికొత్తది కాదు. బుద్దెరిగిన నాటినుంచీ నేనిలాగే ఆలోచిస్తున్నాను.

అప్పుడూ అంతే! ఇప్పుడూ ఇంతే!

అమ్మను ఆట పట్టించిన రోజుల్ని, నాన్నతో దోబూచులాడిన వేళల్ని, అక్కను గిల్లి అల్లరి చేసిన సంఘటనల్ని తలచుకుంటుంటే, ఈనాడవి అందంగా అందరాని అనుభూతులనిపించినా ఒకనాడవి రోత పుట్టించాయి. భయాన్ని కలిగించాయి. పరిస్థితుల నుండి, పల్లె పట్టునుండి నన్ను పారిపోయేటట్టు చేసాయి.

నా బాల్యం, నన్ను నానా రకాలుగా హింసించింది. నన్ను ముక్క ముక్కలు చేసింది. నన్నెదగనీయలేదది. కళ్లకి కలలు ముసుగేసి నన్ను నా నుండి కనుమరుగు జేసింది.

నాన్న కర్రల మిల్లులో పనిచేసేవాడు. ’కటర్’ గా పనిచేసేవాడు. నిక్కరూ, బనియను ధరించి, తోలు పట్టానొకదాన్ని గుండెల మీద కవచంలా వుంచుకుని పెద్ద పెద్ద దుంగల్ని చీల్చి చెండాడేవాడు.

కర్రను కోసేవేళ రంపపు ధ్వని ’అమ్మకి దండం! నాన్నకి గండం’ అని వల్లె వేసేది. మనసులో ఆ మాటల్ని ఉచ్చరిస్తే చాలు! పాటయ్యేది. ఆ పాటలతో దుంగల మీంచి దూకుతూ ఆటలాడుకునేవాణ్ణి. జారిపోతున్న నిక్కర్ని ఎగదోసుకుంటూ, చొక్కాను సర్దుకొంటూ జులాయిగా వుండేవాణ్ణి.

అమ్మ, కర్ర పొట్టును గోనె సంచుల్లో నింపుతుండేది. సంచిలో పొట్టుని కుక్కి కుక్కి నింపడంలో నా సహాయాన్ని అర్ధించేదామె.

“ఆ గెంతులేవో, ఈగోనె సంచి మీద గెంతరాదురా” అనేది. బ్రతిమలాడేది. అందక పరుగెత్తే నన్ను అంది పుచ్చుకుని, పొట్టుగుట్ట మీదకి లాక్కొచ్చేది. జల్లులా కురుస్తోన్న పొట్టులో పొర్లి పొర్లి, వంటి నిండా పొట్టు అంటుకుంటే… ’అచ్చు పగటి వేషగాడిలా వున్నావు’ అన్న కితాబు లభిస్తే అమ్మనప్పుడు ఆదుకునేవాణ్ణి. బుగ్గల్ని పొంగించి హనుమంతుణ్ణనుకుని పొట్టు బస్తాపై చిందులేసేవాణ్ణి. అలా నింపిన పొట్టు బస్తాకి అమ్మకి పావలా ఇచ్చేవారు. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె గెంతడాన్ని చూసే వాణ్ణి. బడివేళ వరకు అమ్మకి అండగా వుండి, ఆతర్వాత నేను బడికి వెళ్ళిపోతే, అమ్మొక్కర్తీ ఆకాశాన్ని అందుకోవాలన్నట్టుగా ఎగిరి గంతులేసేది. తోడుగా అక్కనుమాత్రం రమ్మనేది కాదు. అక్క గంతులేయడాన్ని అక్కడంతా ఆత్రంగా చూడడాన్ని గమనించి నాన్న వద్దన్నాడు.

అక్క, దుంగల మీది బెరళ్ళను తీసి తట్టలో వేసుకునేది. మంచుకీ, వర్షానికి తడిసిన దుంగల మీది బెరళ్ళను తీయడం అంటే అక్కకు కష్టంగా ఉండేది. గోళ్ళలో పేళ్ళు గుచ్చుకున్నా ఖాతరుచేసేదికాదు. ఒక్కొక్కప్పుడు బెరల్ల నడుమ జెర్రెలనూ, తేళ్ళను చూసి, బెంబేలు పడి భయంగా కేకలేసేది. చీమల్ని చంపినట్టుగా నేను జెర్రలను చంపుతోంటే, చేయిజారి, నన్నుదగ్గరగా తీసుకునేదక్క మెచ్చుకోలుగా నాజుత్తు నిమిరేది. తోడుంటానని బడికివెళ్ళనని మొరాయిస్తే “వెల్లిరారా” అని ప్రాధేయపడేది.

ఇంట్లో ఎక్కాలూ పద్యాలు, పెద్ద గొంతుతో చదువుతోంటే, అమ్మ పొంగిపోయేది.

“ఆరు పావలాలు ఎంతరా” అనడిగేది. “రూపాయిన్నర” అని చెబితే, నాటి తన సంపాదనను చూసి చిన్నబుచ్చుకునేది. “దేనికి సరిపోతుందిది” అని దుఃఖించేది.

“వళ్ళంతా పచ్చి పుండుగా వుంది! కడుపు నిండా గంజి తాగి కునుకు తీద్దామంటే నా సంపాదన నాకే చాలదు” అని నెత్తి కొట్టుకునేది. “ఇందులో పిల్లలకేం పెడతాను! పెనిమిటికేం పెడతాను” అని ఏడ్చేది.

అక్క సంపాదనంతా అణాపైసల్లో వుండేది. నాన్న కష్టం ఆయన కల్లు ముంతలకి పోయేది.

తాగొచ్చిన నాన్నతో, అమ్మ తగవులాడేది. “ఇలాగయితే ఎలాగయ్యా” అని ఆయన్ని నిలదీసేది. అమ్మప్రశ్నలకి, నాన్నకి జవాబు తెలియదుగాని, జబర్దస్తీ తెలుసు! ఫలితం అమ్మ బాగా దెబ్బలు తినేది.

“మళ్ళీ నోరెత్తితే నరికి పోగులు పెడతాను” అనేవాడు నాన్న. నన్ను దగ్గరగా తీసుకుని హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను పద్యాలను చదివించుకుని చల్లబడే వాడు.

రంపానికి దుంగనందించడంలో ఓసారి ప్రమాదవశాత్తు నాన్న చేతివేలు చీలిపోయింది. కుడిచేతి బొటనవేలు తెగిపోయింది. చేపలా కిందపడి పొట్టు పాలయిందది. ’గొల్లు’ మన్నారంతా. నాన్న రక్తాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మిల్లు యజమానిని కేకేసి జరిగింది చెప్పారు.

“ఎక్కడ చూస్తున్నావురా” అని నాన్నను కోపగించుకున్నాడాయన. యాభయి రూపాయల నోటిచ్చాడు.

“ఆస్పత్రిలో చావు” అన్నాడు. పాతికరూపాయల మందులు తిని, నాన్న చేయి రక్తాన్ని దిగమింగుకుంటే మిగిలిన డబ్బుతో బాధను దిగమింగుకునేందుకు నాన్న కల్లు పాకని ఆశ్రయించాడు. వారం రోజులపాటు పని లోనికి పోలేదాయన. కుడిచేతిని కళ్ళ ముందుంచుకుని విలపించాడు. యజమాని మళ్ళీ పనిలోనికి తీసుకోడేమోనని దిగులు చెందాడు. అయితే నాన్నని ఓదారుస్తూ “నాకు పని ముఖ్యంరా! నీ వేలు కాదు” అని యజమాని అనడంతో నాన్న ఆనందానికి ఆనాడు పట్టపగ్గాలు లేకపోయాయి. బొటన వేలు మళ్ళీ మొలిచినంతగా సంతోషించాడు. “మీరు దేవుడు బాబూ” అన్నాడు. యజమానికి పడిపడి నమస్కరించాడు. నాలుగు వేళ్ళూ నోటికి పోనున్నాయన్న ధీమాతో రెట్టించి పని చేశాడు.

నాటి నుంచే అమ్మ దగ్గడం ప్రారంభించింది. దగ్గి దగ్గి గుండెలు తోడేసినట్టు గిలగిలా కొట్టుకునేది. కెళ్ళలుకెళ్ళలుగా కఫాన్ని కక్కుతూ కుల్లిపోయేది. రోజుకి ఆరేడు బస్తాల్లో పొట్టును కూరగలిగే అమ్మ, రెండు మూడు బస్తాల్లో మాత్రమే పొట్టును కూరుతూ డీలాపడిపోయేది. చేతిలో రూపాయి కూడా పడని తన శ్రమని చెడ తిట్టుకునేది. బడికి పోనని బస్తాల్లో పొట్టు కూరుతానని మొండికేసే నన్ను తిట్టి, కొట్టి బడికి సాగనంపేది.

బడి వదలిన తర్వాత మిల్లులో దుంగల మీద కూర్చొని పాఠాల్ని బట్టీ పట్టేవాణ్ణి. అక్కడక్కడే అక్క తచ్చాడుతూ వుండేది.

అక్కనేదో పురుగు కరిచి దుంగల్లోనికి పారిపోయిందోరోజు! పెద్దగా కేకేసి అక్క నిలువునా కూలిపోయిందానాడు. మాట్లాడదు. మెలికలు తిరిగి పోతోంది. కరిచింది ఏమిటన్నదీ అంతు చిక్కలేదు. పాము కాటేసిందేమోనని అంతా భయపడ్డాం. కాసేపటికి తేరుకుని అక్క కాదన్నది. ఆ పురుగు కందిరీగలా వున్నదన్నది. తనను కరిచి దుంగ పగులులోనికి జారిపోయిందన్నది. కసిరేగి పగులులో కళ్ళుంచి తీక్షణంగా చూశాన్నేను. ఏదీ కన్పించలేదు. పగులులో వేళ్ళు జొనిపి, దుంగంబడి నడిచాను. పురుగు దొరికితే పిసికి పారేద్దామన్నంత కక్ష రేగింది.

నోటు పుస్తకాల్లేక నోట్సు రాసుకునేవాణ్ణి కాదు. ఫలితంగా మేష్టారితో చింత బరికెతో దెబ్బలు తినాల్సి వచ్చేది. రక్తం చిప్పిల్లిన చేతుల్ని ఉమ్ము తడిజేసుకుని ఊరుకునేవాణ్ణి తప్ప ఆ ఊసెవరికీ తెలియనిచ్చేవాణ్ణి కాదు. అయితే నాన్నకీ సంగతి తెలిసింది. తెలిసి యజమాని ఇచ్చే యాభయి రూపాయిల కోసం కుడిచేతి చూపుడు వేలుని పోగొట్టుకున్నాడు. రంపానికి ఆ వేలుని బలిచ్చాడు.

దుంగల మీది పుట్టగొడుగుల్ని తొలగిస్తూ కూర్చున్న నా దగ్గరగా వచ్చి చేతిలో పది నోటునుంచాడు. “వెళ్ళి పుస్తకాలు కొనుక్కో” అన్నాడు.

ఆ రాత్రి “ఎంత పనిచేశావయ్యా” అని తాగొచ్చిన నాన్నని అమ్మ నిలదీస్తే –

“నాకోసం నేనీ పనిచేయలేదే! నన్ను నమ్ము” అన్నాడు.

“చదువుకుని వాణ్ణయినా బాగుపడనీ” అన్నాడు. నన్ను కాటిసీను పద్యాల్ని విన్పించమన్నాడు. ఎన్నడూ లేనిది, ఆనాడెందుకో ఆ పద్యాల్ని రాగయుక్తంగా నాన్నకి విన్పించాలనిపించింది.

ఏమరుపాటున ఉన్న అక్కను గిల్లి, పురుగని అల్లరి చేసినా, దొరికితే కాటిసీను పద్యాల్ని విన్పించమంటాడని పెరట్లో చెట్ల మీదా, గుబురుల వెనకా దాగి నాన్నతో దోబూచులాడినా, అదంతా నాకు నాటకీయంగానేవుండేది. సహజమనిపించేదికాదు.

అమ్మ దగ్గు విషాదం! నాన్న త్యాగం విషాదం! అక్క చితుకులేరుకోడం విషాదం! విషాదాల్లో సరదాలాడడం కృత్రిమం గాక మరేమిటి?

పదో తరగతి పాసయ్యాను. నన్ను చూసి నా వాళ్ళంతా సంబరపడ్డారు. మిల్లు యజమాని దగ్గరకు తీసుకువెళ్ళి నేను పదో తరగతి పాసయ్యానన్నది చెప్పాడు నాన్న. “పై చదువులు చదివిస్తావా” అని అడిగిన యజమానితో-

“ఈ చదువుకే రెక్కలు ముక్కలయ్యాయి” అన్నాడు.

“చదివిన చదువు చాలు! దయతలచి తమరు చిన్న నౌకరీ ఇప్పించండి. వాడి పొట్టకి వాడు సంపాదించుకుంటే అదే పదివేలు” అన్నది అమ్మ. కాదనలేదు యజమాని. కర్రల కొలతలుచూసే పని నాకప్పగించాడు. నెలకి యాభయి రూపాయలు జీతమని చెప్పాడు.

అయితే ఆ మిల్లులో నౌకరీ నాకిష్టం లేకపోయింది. రాకాసి లోయలో నేను జీవించలేననిపించింది.

దగ్గు రూపేణా అమ్మను అణగారుస్తోన్న జబ్బు, అక్కని కాటేసిన విషప్పురుగు, నాన్న వేళ్ళని కొరికేస్తోన్న కోరల కత్తీ… అన్నీ ఆమిల్లు యజమానని నాకు తెలిసీ తెలియడంతో ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను. యజమానికి దూరంగా పారిపోవాలనుకున్నాను. పరుగెత్తాను.

జట్కావాలానొకణ్ణి ఆదరపు చేసుకుని నాన్నతో తెగతెంపులు చేసుకుని వున్న అత్తమ్మ వూరికి వచ్చాను. కన్నవాళ్ళకీ, పుట్టి పెరిగిన ఊరుకి దూరమయ్యాను.

”ఆపావు” అన్నది టైపునేర్చుకుంటోన్న అమ్మాయి. ఆపిల్ల ఇల్లు దగ్గర పడింది. కళ్ళాన్ని బిగించనవసరం లేకపోయింది. గుర్రం ఆగిపోయింది. వోణీని నిండుగా కప్పుకుని, ఆ అమ్మాయి కిందికి దూకడంతో నేల మీది నీరు పైకి చిమ్మింది. లాంతరు వెలుగులో నీటి చుక్కలు ముత్యాల్లా మెరిశాయి.

జట్కా కదలనుందో లేదో, పరుగులాంటి నడకతో ఓ వ్యక్తి ఎదురొచ్చాడు. అతను నిక్కరు, లాల్చీలో వున్నాడు. పూర్తిగా తడిసి ముద్దయి ఉన్నాడు. యాభయ్యేళ్ళ వయసుంటుందతనికి. ఫలానా చోటుకని చెప్పి జట్కాను ఎక్కబోయాడు. చేతినందించి, అతన్ని మీదికి లాక్కున్నాను. మేష్ట్రమ్మ పక్కన చతికిలపడి స్థిరంగా కూర్చున్నానని నిర్దారించుకున్న తర్వాత గాని అతను నా చేతి ఆసరాను వీడలేదు. అప్పుడతని చేతి వేళ్ళ వైపు చూశాను. చూసి పొంగిపోయాను. అతని కుడిచేతికి బొటనవేలు లేదు. ఈ వయసులో ఈ దుస్తుల్లో నాన్న అచ్చం ఇలానే వుంటాడనిపించింది. నాన్నే నా ప్రక్కన జట్కాలో కొలువుదీరాడనిపించింది. ఆనందం కలిగింది. నాకు మరింత సమీపంగా అతన్ని ముందుకు రమ్మన్నాను. వచ్చాడతడు. కల్లు వాసనవేశాడు. సంబరపడ్డాను.

జడివాన జలతారు తీవెలనిపించింది. చలిగాలి నులివెచ్చననిపించింది. అసహనం, అసహ్యాలూ గుండెల్లోంచి ఎగిరిపోయి, హాయి హాయనిపించింది. జట్కా లోని వారినంతా తిరునాల్లకి తీసుకుపోతున్నట్టుగా వుంది. దగ్గరగా నాన్న వున్నాడన్న భావన చెప్పలేని అనుభూతి అన్పించింది. చర్నాకోలాను ఝుళిపించాను. గుర్రం పరుగు శరవేగమయింది.

నాన్నలాంటి వ్యక్తిని, ఏ వివరాలూ అడగదలుచుకోలేదు. చలికి వణుకుతున్న అతని చుట్టూ చేతులుంచి హుషారయ్యాను.

ఇప్పుడెందుకో మేష్ట్రమ్మకు నమస్కరించాలని వుంది. కాలేజీ కుర్రాణ్ణి అనునయించాలని వుంది. గురుమూర్తి నిండు నూరేళ్ళూ బతకాలని వుంది. పోలీసు మీద పగలేదు. శెట్టిని హత్య చేయాలనీ లేదు. మేష్ట్రమ్మను ఆట పట్టిస్తూ శెట్టి మాట్లాడితే బాగుణ్ణని వుంది. పోలీసు పగలబడి నవ్వితే కలిసి నవ్వాలని వుంది. అణువణువూ అందంగా, ఆనందంగా వుందనిపించింది. ఈలవేసి పాట పాడాలనిపించింది.

గొంతెత్తాను! బతుకంతా పాటగా సాగిపోయింది!

ఎవరిళ్ళ దగ్గర వారు దిగిపోయారు. నాన్నలాంటి వ్యక్తి కూడా నన్ను విడిచి దిగి వెళ్ళిపోయాడు. దిగి వెళ్ళిపోతూ అతను కిరాయిగా రూపాయి నోటును నాకందివ్వ నుంటే “వద్దు నాన్నా” అన్నాను. నవ్వి ఊగుతూ వెళ్ళిపోయాడతను. నన్ను దీవించి నట్టుగా చేతినెత్తి గాలిలో ఊపాడు. ఆలోచింపజేశాడు.

గడచిన పదేల్లలో ఏదో అవసరానిగ్గాను చేతులకున్న పదివేళ్ళనీ నాన్న పోగొట్టుకుని వుంటాడు. మొండి చేతుల్తో దుంగల్ని నెడుతూ అమ్మో, అక్కో తినిపించగలిగితేనే అన్నం ముద్దని నోటికి అందుకోగలుగుతూ వుండి వుంటాడు. దగ్గు జబ్బుతో అమ్మ శల్యమయి వుంటుంది. పొట్టు బస్తాలో తనని తానే కుక్కుకోగలిగే స్థితికి చేరుకుని వుంటుంది. అక్కను ఏ తేళ్ళు కుట్టాయో! ఏ పాములు కరిచాయో! ఏ పేళ్ళలో ప్రాణాల్ని బలి పెడుతుందో ఏమో!

నా వాళ్ళంతా ఎలా వున్నారో! ఏమయి వున్నారో!

ఏ దృశ్యాలకు భయపడి, ఏ జీవితాల్ని అసహ్యించుకుని ఎవరకి దూరంగా పారిపోదలచానో, అది నాకు సాధ్యం కాలేదు. ఎల్లెడలా ఒకటే దృశ్యం! ఒకటే జీవితం!

రాకాసిలోయ అంతటా వ్యాపించి వుంది. క్రూర మృగాలు, మారణాయుదాలు, మంత్రతంత్రాలన్నీ నాలాంటి కుటీంబీకుల కోసమే పొంచి వున్నాయనిపించింది.

నావాళ్ళను నేను రక్షించుకోవాలి! అందుకు సన్నద్ధం కావాలనుకున్నాను. కొరడాను విసిరి, జట్కాను మా ఊరివైపు పరుగుదీయించాను. ఈ దీర్ఘరాత్రిలో, మైళ్ళ దూరంలో ఉన్న మా ఇంటికి ఈ కట్కాలో నేను చేరుకోగలనో లేదో! కాని, చేరుకోవాలన్న దృఢ సంకల్పం అయితే నాలో వుంది!!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)