ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

ఇంద్రజిత్తు మాయాయుద్ధం, రామలక్ష్మణుల మూర్ఛ

అంగదుడు అప్పుడు ఇంద్రజిత్తును ఎట్లానైనా మట్టుపెట్టాలని తీవ్రోద్రిక్తుడై వెళ్ళి ఇంద్రజిత్తు గుర్రాలనూ, సారథినీ హతమార్చాడు. ఆ రథం అట్లానే వదిలివేసి ఇంద్రజిత్తు మాయమై పోయినాడు. ఎప్పుడైతే ఇంద్రజిత్తు కనపడకుండా పోయినాడో అప్పుడు రాముడు అంగదుణ్ణి జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కపివరు లందరినీ హెచ్చరించాడు. 'ఇంద్రజిత్తు క్రూరపాపాత్ముడు. పగబట్టి ఇప్పుడు మన మీద చెలరేగుతాడు. అశనివర్షంలా అస్త్రశస్త్రాలు మనపై ప్రయోగిస్తాడు' అని శ్రీరాముడు తన సైన్యాన్ని ప్రబోధించాడు. ఇంద్రజిత్తును కనిపెట్టవలసిందిగా వానరప్రముఖులను ఆదేశించాడు.

ఇంద్రజిత్తు రామలక్ష్మణులప ఆపాదశిరం, పాములవంటి శరాలను ప్రయోగించాడు. అవి నాగపాశాలవలె వాళ్ళిద్దరినీబంధించాయి. వాళ్ళిద్దరూ సొమ్మసిల్లి మూర్ఛితులై నేలకొరిగారు. వానరులు హాహాకారాలు చేశారు.

అప్పుడు సుషేణుడి కొడుకు లిద్దరున్నూ, అంగదుడూ, మహాబలుడు నీలుడూ, శరభుడూ, వినతడుఊ, జాంబవంతుడూ, సానుప్రస్థుడూ, ఋషభస్కంధుడూ వృక్షాయుధాలతో రంగమంతా గాలించటానికి ఆకాశంలోకి ఎగిరారు. ఇంద్రజిత్తు వాళ్ళపై మహాప్రభావంగల అస్త్రాలను అభిమంత్రించి వాళ్ళ వేగాన్ని నిరోధించాడు. వాళ్ళ దేహాలనిండా గాయాలైనాయి. ఆ నిశీథిలో ఇంద్రజిత్తు నీలమేఘాలు కప్పిన సూర్యుడిలాగా అదృశ్యుడైపోయినాడు. ఇంద్రజిత్తు రెచ్చిపోయి రామలక్ష్మణులపై మరిన్ని నాగాస్త్రాలు ప్రయోగించాడు. అవి రామలక్ష్మణుల శరీరాలను కప్పివేశాయి. ఆపాదమస్తకం వాళ్ళిద్దరి శరీరాలు రక్తంతో తడిసిపోయినాయి. వాళ్ళిద్దరూ అప్పుడు ఆకు కనపడకుండా పూచిన మోదుగుచెట్లలాగా కన్పించారు.

ఎర్రజీరల కళ్ళతో కాటుకకొండ వంటి దేహం కల ఇంద్రజిత్తు అదృశ్యరూపంతోనే రామలక్ష్మణులను బెదిరించాడు. 'మిమ్ములను యమలోకానికి పంపిస్తాను' అని కటువుగా పలికాడు. పగలబడి నవ్వాడు. దిక్కులు బద్దలయేట్లు నారి సారించాడు. కేకలు బబ్బలూ పెట్టాడు. మళ్ళీ మళ్ళీ నాగపాశాలతో వాళ్ళను కట్టి పడవేశాడు. రామలక్ష్మణు లిద్దరూ నేల వాలి సొమ్మసిల్లి పోయినారు. లక్ష్మణుడు అతిప్రయత్నంమీద కనురెప్పలు కదిలించి రాముణ్ణి చూశాడు కాని నిరాశిపహతుడైనాడు. హనుమంతుడు, ఇతర వానరప్రముఖులూ అంతా అక్కడ చేరి ఆర్తిచెందారు.

ఇంద్రజిత్తు తన కోరిక పరిపూర్ణంగా నెరవేరినట్లు భావించి యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. అత్యంతవ్యాకులత్వంతో సుగ్రీవుడూ, కుముదుడూ, అంగదుడూ పరుగు పరుగున వచ్చి రామలక్ష్మణులను చూసి విషాదం పొందారు.

రాక్షసమాయలు తెలిసిన విభీషణుడు ఇంద్రజిత్తు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కనుక్కున్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు, తనతో ఉన్న రాక్షసులలో తన మహాపరాక్రమం గురించీ, తన మాయాయుద్ధప్రావీణ్యం గురించి తనను తానే శ్లాఘించుకుంటున్నాడు. 'ఇక రామలక్ష్మణులు జీవించి ఉండడం కల్ల. నేను శత్రువులను రూపుమాపాను. రావణుడి పరాభవాగ్నిని చల్లార్చాను. జనస్థానంలో ఖరదూషణుల వధకు ప్రతీకారం తీర్చుకున్నాను' అని ఆత్మప్రశంస చేసుకోవటం విభీషణుడు విన్నాడు. 'రాముణ్ణి నేను హతమార్చాను' అని చెప్పుకుంటూ తన ఇష్టపరివారాన్ని సంతోషపెట్టి, తన తండ్రి దర్శనార్థం లంకలోకి వెళ్ళాడు ఇంద్రజిత్తు. వెళుతూ వెళుతూనే ఉద్ధతంగా ఉప్పొంగిపోతూ 'రామలక్ష్మణులను చంపివేశాను' అని చెప్పాడు తండ్రికి. సభామధ్యం నుంచి దిగ్గున లేచి రావణుడు ఎదురు వచ్చి ఇంద్రజిత్తును కౌగిలించుకున్నాడు. మూర్ధాఘ్రాణం చేశాడు. వివరంగా కొడుకుచేత ఆ వృత్తాంత మంతా చెప్పించుకున్నాడు.

యుద్ధభూమిలో సర్వాంగాలు సర్పబాణాలచే ఆచ్ఛాదితమై ఎంతమాత్రమూ చలనం లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ఎడతెగకుండా కన్నీరు కార్చసాగాడు. పరమద్ణుఖితుడు అయ్యాడు. ఆయన్ను గొప్ప భయం చుట్టుకుంది.

సీతమ్మను త్రిజట ఓదార్చటం

అప్పుడు రావణుడు అశోకవనంలో సీతాదేవికి కావలి ఉంటున్న రాక్షసాంగనలను కబురు పెట్టి పిలిపించుకున్నాడు. 'ఓ రాక్షసవనితలారా! రామలక్ష్మణులను ఇంద్రజిత్తు హతమార్చాడు. ఈ విషయం సీతకు చెప్పి ఆమెను పుష్పకవిమానంలో ఎక్కించుకొని ఆ రామలక్ష్మణులు అచేతనంగా యుద్ధభూమిలో పడి ఉండటం చూపవలసిం'దని కోరాడు. 'ఇప్పుడిక సీతాదేవిని నేను పొందడం తథ్యం' అన్నాడు రావణుడు. అప్పుడా రాక్షసాంగనలంతా పుష్పకవిమానం దగ్గరకు పోయినారు. సీతాదేవిని, త్రిజటతో సహా అందులో అధివసింపచేశారు.

'రామలక్ష్మణులను ఇంద్రజిత్తు సహరించాడు' అని లంకాపట్టణమంతా దండోరా వేయించాడు రావణుడు. నగరమంతా ధ్వజాలతో, పతాకలతో అలంకరింపచేశాడు. త్రిజట తనపక్కనే ఉండగా పుష్పకవిమానం నుంచి సీతాదేవి యుద్ధభూమిలో కుప్పతెప్పలుగా చచ్చిపడి ఉన్న వానరులను చూసింది.

అక్కడ సంతోషంతో సంచరిస్తున్న రాక్షసయోధులను చూసింది. అక్కడ (పరదీన వదనాలతో) నేల మీద పడి ఉన్న రామలక్ష్మణుడలను పరివేష్టించి ఉన్న వానరప్రముఖులను చూసింది. రామలక్ష్మణుల రక్తసిక్తదేహాలను చూసింది. ఆమెకు దుర్భరమైన ద్ణుఖం కలిగింది. ఎడతెగకుండా శోకంలో కూరుకొనిపోయిందామె. రామలక్ష్మణులు ప్రాణాలతో లేరనే ఆమె అనుకున్నది. 'అయ్యో! నేను సంతానవతి నౌతానని జ్యోతిష్కులు, కార్తాంతికులు, సాముద్రిక శాస్త్రాభిజ్ఞులు చాలాసార్లు చెప్పారే! వాళ్ళ మాటలన్నీ మిథ్యలేనా?' అని కుమిలి కుమిలి ఏడ్చింది. శ్రీరాముడు అశ్వమేధం వంటి మహాయజ్ఞాలు చేస్తాడని కూడా భవిష్యజ్ఞులు ఎన్నోమార్లు చెప్పారే' అని ద్ణుఖించింది. 'నా పాదాలలో పద్మ స్వస్తిక రేఖ లున్నాయనీ నేను మహాచక్రవర్తితో కూడి పట్టాభిషిక్తురాల నవుతాననీ కూడా జ్యోతిష్కులు, సాముద్రికశాస్త్రవేత్తలు చెప్పారు. అవన్నీ వొట్టి కల్లలేనా? రాముడికి విపత్తు సంభవించిందని తెలిస్తే అయోధ్య ఏమైపోతుంది? మా అత్త కౌసల్య ప్రాణాలతో ఉండగలదా?' అని విలపించింది సీతాదేవి.

అట్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న సీతతో త్రిజట 'అమ్మా! ఇందులో సంశయాస్పదమైన విషయాలు చాలా తోస్తున్నాయి. నీ భర్త, తమ్ముడితో కూడా జీవించే ఉన్నాడమ్మా! ఈ వానర సైన్యంలో దైన్యం కొంత కనపడుతున్నదే కాని, వాళ్ళలో యుద్ధోత్సాహం కొరవడటం కాని, దీనస్థితి కాని ఏమీ లేదు. రామలక్ష్మణులు సజీవులే అనడానికి అదొక ప్రబలకారణం. అదీకాక ఈ పుష్పకం దేవతాసంబంధమైంది. రామలక్ష్మణులకు ఏదైనా జరిగి ఉంటే అది నిన్ను తీసికొని వచ్చేది కాదు. నన్ను నమ్ము. నామాట ఎన్నటికీ అసత్యం కాదు. సురాసురులు దేవేంద్రుడి సహితంగా దండెత్తి వచ్చినా రామలక్ష్మణులను జయించటం కల్లఔ' అని త్రిజట గట్టిగా సీతకు బోధించింది. సీతాదేవి చేతులు జోడించి 'నీ మాటకు దేవతలంతా తథాస్తు అనాలి' అన్నది.

అప్పుడు సుగ్రీవుడు మొదలైన వానరప్రముఖులంతా విషణ్ణవదనాలతో మను చూస్తూ ఉండగా రాముడు తెప్పరిల్లి నెమ్మదిగా కళ్ళు విప్పాడు. నాగపాశాలు ఆయన నేమీ చేయలేకపోయినాయి. రక్తసిక్తదేహంతో తన పక్కనే పడి ఉన్న లక్ష్మణుణ్ని చూశాడు. పరిపరివిధాల ద్ణుఖించాడు. దీనాలాపాలు పలికాడు. 'అయ్యో నావెంట ఇందుకా నా తమ్ముడు అడవికి వచ్చాడు! నే నిప్పుడు వీణ్ణి అనుసరించిపోతాను. నా తమ్ముడు కార్తవీర్యార్జునుడి కంటే పరాక్రమంలో గొప్పవాడే! ఎందు కిట్లా అయిపోయినాడు? ఈ రణక్షేత్రంలో విభీషణుడి కిక లంకారాజ్యానికి పట్టాభిషేకం ఎట్లా చేసేది? హనుమంతుడి విక్రమమంతా సముద్రం పాలైపోయింది. తేరిచూడరాని పరాక్రమవంతులైన ఈ వానరవీరుల ప్రయత్నమంతా నిష్ఫలమేనా? సుగ్రీవా! నీ శపథం ఇట్లా నెరవేరబోతున్నదా? అని శ్రీరాముడు విలపించాడు. వానరుల కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి.

ఇంతలో విభీషణుడు గద పట్టుకొని అక్కడకు వచ్చాడు. వానరసైన్య మంతాఇ అతణ్ణి గుర్తించలేక కకావికలైనారు. ఆయుధాలన్నీ ఎక్కడివక్కడ వదిలిపెట్టి పరుగులు తీశారు. సుగ్రీవుడు ఇందుకు కారణం తెలియక విస్మితుడైనాడు. 'ఏమిటా సంక్షోభం' అని ఆయన అంగదుణ్ణి అడిగాడు. 'రామలక్ష్మణుల ఈ దీనావస్థను చూసి వాళ్ళంతా భయాందోళనలకు గురైనారు' అన్నాడు అంగదుడు. అప్పుడు విభీషణుడు సుగ్రీవుడికి శుభం పలికాడు. సుగ్రీవుడి కప్పుడు విభీషణుణ్ణి ఇంద్రజిత్తు అని భ్రమించి వానరసేనలు కకావికలై ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారన్న ఆలోచన వచ్చింది. అప్పుడు జాంబవంతుణ్ణి పిలిచి వాళ్ళ భయం నివారించవలసిందిగా చెప్పాడు.

జాంబవంతుడు వాళ్ళందరికీ అభయం చెప్పి స్వస్థులను చేశాడు. ఆ వచ్చింది విభీషణుడనీ, ఇంద్రజిత్తు కాదనీ తెలుసుకొని వానరవీరులంతా మళ్ళీ యుద్ధోత్సాహం పొందారు. అప్పుడు విభీషణుడు ఆ అన్నదమ్ములను చూసి ద్ణుఖించాడు. వాళ్ళ కళ్ళు తుడిచి సేదతీర్చాడు. 'మాయాయుద్ధంలో ఆరితేరిన ఈ రాక్షసులు మిమ్ముల్ని కడగండ్ల పాలుజేశారు' అని చెప్పి విభీషణుడు రామలక్ష్మణులను ఊరడిల్లజేశాడు. కూటయుద్ధం చేసి కుటిలుడి వల్ల మీకీ దురవస్థ వచ్చిందని ఆ అన్నదమ్ములను ఓదార్చాడతడు. ''ఈ రామలక్ష్మణుల శరీరాలు పట్టుతప్పిపోయాయి. ఇక నేను బతికి ఉండి ఏం ప్రయోజనం? శరణాతతత్రాణ పరాయణుడైన శ్రీరాముడే ఇటువంటి ఆపదపాలు కాగా ఇక నాకు ముంచుకొని వచ్చే విపద్ధశ గూర్చి వేరే చెప్పాలా?'' అని శోకార్తుడైనాడు విభీషణుడు. అతణ్ణి కౌగిలించుకొని సుగ్రీవుడు ఆయనకు ధైర్యం చెప్పాడు. 'రావణుడి కోరిక నెరవేరదు. వాడి కొడుకు విర్రవీగుడు అంతమవుతుది. నీవు లంకకు ముమ్మాటికీ పట్టాభిషిక్తుడి వవుతావు. ఈ రామలక్ష్మణులు స్వస్థత చెంది రావణసంహారం చేసి తీరుతారు!' అని అతణ్ణి ఓదార్చాడు సుగ్రీవుడు.

ఈ మాటలు విన్న సుషేణుడు 'కపిరాజా! పూర్వం దేవాసురయుద్ధం జరిగినప్పుడు నేను దానిని చూశాను. దానవులు దేవతలపై శరవర్షం కురిపించగా దేవత లెందరో మృతులైనారు, మూర్చపోయినారు. బృహస్పతి తన మంత్రవిద్యతో, ఓషధిబలంతో వాళ్ళకు ప్రాణం పోశాడు. మూర్చనుండి వారిని తేర్చాడు. ఆ వనమూలికలు క్షరసముద్రతీరంలో లభిస్తాయి. అక్కడి పర్వతాలలో సంజీవకరణి, విశల్యకరణి అనే మహౌషధులు లభిస్తాయి. వాటిని మన వానరులు ఎరుగుదురు. వెంటనే మన వానరప్రముఖులను పంపించి వాటిని తెప్పించాలి. పాలసముద్రం మథించేటప్పుడు ద్రోణపర్వతమూ, చంద్రపర్వతమూ అని ఉన్న రెండు పర్వతాలమీద సంజవకరణీ, విశల్యకరణీ అనే ఈ మహౌషధులను దేవతలు నాటారు. మహారాజా! మన వాయుతనయుడు వాటిని తీసుకొనిరావటానికి సమర్థుడు. మారుతిని పంపించు' అని సుగ్రీవుడికి సలహా చెప్పాడు.

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)