ధారావాహికలు

సుందరకాండ - (10 వ భాగం)

సీతాదేవి రావణుడికి బుద్ధిచెప్పటం

 

అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియమ్,
నయంతి నికృతిప్రజ్ఞం పరతారా పరాభవమ్.
ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తసే,
తథా హె విపరీతా తే బుద్ధి రాచారవర్జితా.
వచో మిథ్యాప్రణీతాత్మా పథ్యముక్తం విచక్షణై:,
రాక్షసానా మభావాయ త్వం వా న ప్రతిపద్యసే.
అకృతాత్మాన మాసాత్య రాజాన మనయే రతమ్,
సమృద్ధాని వినశ్యంతి రాణి నగరాణి చ.

తన భార్యలతో సంతోషించక, ఇంద్రియలోలుడై, చంచలుడై, నీచబుద్ధి కలవాడిని పరస్త్రీలు పరాభవిస్తారు. ఈ దేశంలో సత్పురుషులే కరవైనారా? ఒకవేళ ఉన్నా వారి మాట వినవా? నీవు అట్లా వినకపోవటంచేత సదాచారం లేక నీ బుద్ధి పెడత్రోవ పట్టింది. నీవు అనేక దుష్ట ప్రసంగాలు చేస్తూ, సత్పురుషుల హితోక్తులను వినటం లేదు. నీవిట్లా ప్రవర్తిస్తూ రాక్షసవినాశాన్నే కోరుకొంటున్నావు. నీతిమాలి, సదుపదేశం వినని రాజు పాలనలో అతని రాష్ట్రాలు, నగరాలు నశించిపోతాయి.

ఒక్క నీ, అపరాధం వల్ల లంక అంతా మహోపద్రవంతో క్షోభిస్తుంది. నీ అధికారం ఐశ్వర్యం నన్నేమాత్రం ఆకర్షించవు. సూర్యడి నుంచి కాంతి వేరు కానట్లు రాముడిని ఎడబాసి నేను ఉండలేను. నీవు నన్ను మళ్ళీ రాముడికి సమర్పించి ఆయనను శరణు వేడుకో. అప్పుడు నీకు కీడు జరగకుండా మేలు జరుగుతుంది. రాముడి బాణం ఇంద్రుడి వజ్రాయుధం వంటిది. శ్రీరాముడి ధనుష్టంకారం నిన్ను త్వరలోనే మూర్ఛితుణ్ణి చేయబోతున్నది. జనస్థానంలో ఏం జరిగిందో అదే ఇప్పుడు నీకు జరగబోతున్నది. నీవు పరమ నీచుడవు. నా భర్తకు భయపడి నన్ను దొంగతనంగా తీసుకుని వచ్చావు. వాళ్ళు విధివంచితులు కాకపోయినట్లైతే పెద్దపులి వాసనకు కుక్క పరుగు తీసినట్లు పారిపోయేవాడివి. పిడుగు పడ్డ వృక్షంలాగా నీవు కూలిపోతావు. నీకు చేటు కాలం వచ్చింది. మృత్యువును తప్పించుకోలేవు." అన్నది సీతాదేవి.

రావణుడు సీతాదేవికి గడువు విధించటం

ఇంత కర్ణకఠోరంగా ఆమె చెపుతుంటే రావణుడు ఆగ్రహోదగ్రుడైనాడు. "లోకంలో స్త్రీలు వేడుకున్న కొద్దీ మగవాణ్ణి అవమానం పాలు జేస్తారు. అయినా నీ పట్ల నాకుండే మోహంతో ఆ కోపాన్ని అణుచుకుంటున్నాను. లేకపోతే నిన్ను చిత్రవధ చేయాల్సినంత పరాభవానికి నన్ను గురిచేశావు. తూలనాడావు. నీకు రెండు నెలలు గడువిస్తున్నాను. ఆ రెండు నెలలు కాగానే నిన్ను వశం చేసుకుంటాను. అప్పటికీ నీ మనసు మార్చుకోకపోతే నా ప్రాత:కాల భోజనకోసం నిన్ను నా వంటవాళ్ళు సిద్ధం చేస్తారు." అని భయంకరంగా బెదిరించాడు రావణుడు.

’అయ్యో రావణా! నీ మేలు కోరే వారెవరూ ఈ లంకలో లేరా? నీ తీరు చూస్తుంటే కుందేలు మదపుటేనుగుతో పోరాడాలనుకుంటున్నట్లున్నది. నీ కళ్ళు నేలరాలుతాయి. నీ నాలుక చీలికలైపోతుంది. నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అంటావే! రాముడు లేకుండా చూసి కదా పిరికితనంతో నన్ను అపహరించుకొని వచ్చావు." అని రావణుణ్ణి తిరస్కరించింది సీతాదేవి.

అప్పుడు రావణుడు విసవిసా తన అంత:పురంలోకి క్రోధావమానాలతో వెళ్ళాడు. ఇదంతా చూసిన సీతాదేవిని కావలి కాస్తున్న రాక్షసస్త్రీలు ఆమెను ఎంతో భయపెట్టారు.

రావణుడి వంశోన్నతిని ’ఏకజట’ అనే రాక్షసి గొప్పగా ప్రస్తుతించింది. ‘హరిజట’ అనే పిల్లికళ్ళ రాక్షసి భయంకరంగా కళ్ళు తిప్పుతూ ముల్లోకాలనూ జయించిన రావణుణ్ణి నీవు ఎందుకు ఒల్లవు? అని కోపంగా ప్రశ్నించింది. ప్రఘస, వికట, దుర్ముఖి అనే భయంకర రాక్షస స్త్రీలు రావణుడి గొప్పతనం ఏకరువు పెట్టారు సీతాదేవికి. ’ మండోదరికన్నా నీవు ప్రియమైన రాణివవుతావు రావణుడికి ’ అని అంటూ ఆమె అవివేకానికి సీతాదేవిని మందలించారు. రావణుడి అంత:పురంలోని సమస్త భోగభాగ్యాలను వర్ణించి చెప్పారు ఆ రాక్షసస్త్రీలు.

అప్పుడు సీతాదేవి! "మీరు లోకనింద్యమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను మానవాంగనను, రాక్షసుడికి భార్య నెట్లా కాగలను?

దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా స మే గురు:,
తం నిత్య మనురక్తాస్మ్ యథా సూర్యం సువర్చలా.

(సుందర. 24.9)

దీనుడైనా, రాజ్యహీనుడైనా నాకు శ్రీరాముడే దిక్కు, ఆయనే నా ప్రభువు. నా పెనిమిటి. సువర్చల సూర్యునియందు అనురాగం కలిగి ఉన్నట్లు నేను సదా నా భర్తయందే అనురాగంతో ఉంటాను. శచీదేవి ఇంద్రుణ్ణి వలె, అరుంధతీదేవి వసిష్ఠమహర్షినిలాగా, లోపాముద్రాదేవి అగస్త్యుణ్ణిలాగా, సుకన్య చ్యవనుణ్ణీ, సావిత్రీదేవి సత్యవంతుణ్ణీ, శ్రీమతి కపిలుణ్ణీ, రోహిణీదేవి చంద్రుణ్ణీ ఎడబాయనట్లు నేను రాముణ్ణి వదలి ఉండడమనేది అసంభవం" అని దృఢంగా వారికి చెప్పింది సీతాదేవి.

సీతమ్మ విలాపం

ఆ మాటలు విని సీతాదేవి దీనాతిదీనంగా విలపించింది. ’మనుష్య స్త్రీ రాక్షసుడికి భార్య కావటం పొసగదు. మీరు కోరినట్లే నన్ను భక్షించండి’ అని వాళ్ళకు చెప్పింది. అక్కడనుంచి తడబడుతూ భయంకంపిత, దైన్య చిత్తయై హనుమంతుడు కూర్చుని ఉన్న అశోకవృక్షం కిందికి పోయి రాముణ్ణి తలచుకుంటూ పనవి పనవి దు:ఖిస్తూ నిలబడింది. తన దుర్గతినంతా తలచుకొంటూ రోదించింది. అయ్యో! నాగుండె ఎంత గట్టిది! అది ఎందుకు పగిలిపోదు? అని నేలమీద పడిపోయి పొర్లుతూ ఆడు గుర్రపు పిల్లలాగా ఆమె ఆక్రందించింది. అక్కడున్న క్రూరచిత్తులైన ఆ రాక్షసాంగనల్తో ’నన్ను చంపండి, చీల్చండి, చిత్రవధ చేయండి. ఇక ఈ దు:ఖాన్ని నేను భరించలేను. సహించలేను’ అని అంగ లార్చింది. అయ్యో రాముడు ఎంత దివ్యపరాక్రముడు! జనస్థానంలో రాక్షసుడనేవాడు లేకుండా చేశాడే, ఆయనెందుకు నన్ను రక్షించడంలేదు? అని సీత కుమిలి కుమిలి ఆక్రోశించింది.

నేనిక్కడ ఉన్నట్లు వాళ్ళకు తెలియదేమో! తెలిసి ఉండదు. లేకపోతే ఆ అన్నదమ్ములు ఇప్పటికే ఈ లంకా నగరాన్ని నేలమట్టం చేసి ఉండేవాళ్ళు. నేను కుమిలి కుమిలి ఏడుస్తున్నట్లే ఈ లంకలోని స్త్రీలంతా శోకిస్తూ ఉండేవాళ్ళు.

’ఇక్కడ నాకు విషం కూడా లభించదే, మృత్యువాత పడడానికి. రాముడు కూడా నాతో వియోగ దు:ఖాన్ని భరించలేక ఏమైనాడో! లేకపోతే ఎందుకు వచ్చి నన్ను రక్షించడు? నేను జీవించి ఉండడం ఎందుకు? ఏమి బావుకుంటాను? చచ్చిపోతే నాకు కష్టాలన్నీ తొలగిపోతాయి,’ అని దీనంగా శోకించింది సీతాదేవి.

మహాత్ములు, పాపరహితులు, జితేంద్రియులు అయిన వారికి ఇది ప్రియం ఇది అప్రియం అనే తలంపు కలగదు.

ప్రియాన్న సంభవేద్దు:ఖ మప్రియా దదికబ్ భయమ్,
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్.

(సుందర. 26-50)

మహాత్ములకు ప్రియమైనది దొరకలేదని దు:ఖం కాని, అప్రియంవల్ల అధిక భయం కాని ఉండవు. ఆ విధంగా ప్రియాప్రియాలకు దూరంగా ఉండే మహాత్ములకు నమస్కారం. అనుకున్నది సీతాదేవి.

ఇలా ఉత్తమ గుణశాలియైన రాముడికి దూరమై, రావణుని చెరలో ఉన్న సీతమ్మ దు:ఖిస్తూ, తనకిటుపై మరణమే శరణమని నిశ్చయించుకొన్నది.

త్రిజటా స్వప్నం

రాక్షసులంతా ఆమెను హృదయవిదారకంగా భయపెడుతూ బెదిరిస్తూ ఉండగా ఆ రాక్షససమూహంలోనే వృద్దురాలు, త్రిజట అనే ఒక రాక్షసి ’సీతాదేవిని అట్లా భయపెట్టవద్దనీ, అది వాళ్ళకు చెరుపుచేస్తుందనీ లంకకు చేటు మూఢే కాలం అచిరకాలంలోనే సంభవించనున్నదనీ, తనకు రాత్రి ఒక కల వచ్చిందనీ, ఆ కల సీతాదేవికి సమస్త్శుభాలు చేకూర్చనున్నదనీ, రావణుడికి భయంకరమైన వినాశాన్ని సూచిస్తున్నదనీ, తనకు వచ్చిన కల స్వరూపస్వభావాలు రాక్షసాంగనలు కళ్ళకు తట్టినట్లుగా చెప్పింది. నాలుగు దంతాలు గల గొప్ప తెల్లటి ఏనుగుపై కూర్చుండి సీతాదేవి సర్వాలంకార భూషితురాలై, మంగళకరమైన స్వరూపంతో, పరమ సంతోషంతో వెళుతూ ఉండటం చూశాననీ, ఆమె సూర్యమండలాన్నీ, చంద్ర మండలాన్నీ చేతులతో తాకుతూ సర్వదేవతాగణాలు సంతోషంగా స్తోత్రాలు చేస్తూ ఉండగా ఆ ఏనుగు మీద వెళ్ళుతూ ఉండడం చూశాననీ, చెప్పింది త్రిజట. ఏనుగు దంతాలలో నిర్మితమైన వేయిహంసలు మోసుకు వచ్చిన ఒక దివ్యమైన శిబికలో రామలక్ష్మణులు రావడం, శ్వేతపర్వతం మీద సర్వాలంకారశీభితయైన సీతాదేవిని పల్లకిలో రాముడు తీసుకొని పోవడం తాను కలలో చూశానని త్రిజట చెప్పింది.

ఇక రావణుడు గాడిదపై వంటినిండా నూనె కారుతుండగా, మద్యంతో కైపు ఎక్కి దక్షిణం వైపు వెళుతుండటం తాను కలగన్నట్లు త్రిజట చెప్పింది. ఇంకా ఆ గాడిద మీద నుంచి రావణుడు విభ్రాంతుడై నేలమీద పడిపోవటం, మళ్ళీ గాడిదలు పూన్చిన రథంపై నల్లని బట్టలు ధరిచి దక్షిణదిశగా వెళ్ళడం చూసినట్లు త్రిజట చెప్పింది. ఎర్రటిచీర కట్టుకున్న నల్లని స్త్రీ రావణుణ్ణి నేలమీద పడవేసి దక్షిణదిశకు లాగుకొని పోతున్నట్లు చూశానని చెప్పింది.

రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తూ వరాహాన్నీ, ఒంటెనూ, మొసలినీ ఎక్కి దక్షిణదిశకు పోవడం తనకు కనపడిదని త్రిజట చెప్పింది.

తెల్లటి పుష్పహారాలతో, తెల్లటి వస్త్రాలతో, తెల్లటి గంధంతో, విభీషణుడు ఏనుగునెక్కి ఊరేగడం తాను చూసినట్లు చెప్పింది. రాక్షసులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధంలో మరణించినట్లు తాను కలలో చూశానని చెప్పింది. విభీషణుడికి శ్వేతచ్ఛత్రమూ, వింజామరలతో రాజలాంఛనగౌరవం కలిగినట్లు తాను చూశానని చెప్పింది. సీతను క్రూరంగా భయపెట్టవద్దనీ, హింసించవద్దనీ త్రిజట ఆమె చుట్టూ గుమిగూడిన భయంకర రాక్షసాంగనలకు హితవు బోధించింది. త్రిజట చెపుతున్న ఈ మాటలన్నీ అశోకవృక్షమీద కూచుని ఉన్న హనుమంతుడు విన్నాడు.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)