ధారావాహికలు

మరీచికలు - (15 వ భాగం)

"మైత్రీ ఫర్నషింగ్స్" గురించి, లోకల్ గా ప్రచారంలో ఉన్న దినపత్రిక లన్నింటిలోనూ వరసకీ నాలుగు రోజులపాటు అడ్వర్టైజ్ మెంట్ వేయించారు. బిల్డింగ్ కనస్ట్రక్షన్ జరుగుతున్న చోటులలో పాంఫ్లెట్సు పంచిపెట్టే ఏర్పాటు జరిగింది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన పత్రికల్లో కూడా హైదరాబాదులో తెరవబోతున్న "మైత్రీ ఫర్నిషింగ్స్"ని గురించిన వార్తలు వచ్చాయి. దాంతో అది చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రకటనలను చూసి హైదరాబాదు, ఆ చుట్టుపక్కలా ఉన్న బిల్డర్సు బాగా సంతోషించారు.

భవన నిర్మాణంలో చెక్కపని ఒక ప్రత్యేక విభాగం కావడంతో బిల్డర్ కి అది ఒక గొప్ప తలనొప్పి పని గా అనిపించేది. ఇప్పుడా బాధ్యత మైత్రీ ఫర్నిషింగ్సు వారు తీసుకోడంవల్ల, ఆ తలనొప్పి బాధ తప్పిపోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళకి. తలుపులూ, ద్వారమంధాలూ మొదలు, ఇంటిని సంపన్నం చేసే వుడ్ వర్కు వరకు, ఇంకా గృహోపకరణాలైన ఫర్నిచరు - అంతా రెడీమేడ్ గా, నాణ్యమైన సరుకు, సరసమైన ధరలకు ఒకేచోట తమకు దొరుకుతుందంటే అంతకన్నా కావలసిందేమిటి! తమ తలబరువు తగ్గినందుకు సంతోషించింది బిల్డర్సు మాత్రమేకాదు, గృహ యజమానులు కూడా! తాము పెట్టిన పెట్టుబడికి తగినంత నాణ్యమైన సరుకు దొరుకుతుందన్న సంతృప్తితో.

దినపత్రికలో వచ్చిన అడ్వర్టైజుమెంటు చూడగానే హైదరాబాదులోనే ఉన్న "రియల్ ఎస్టేట్ మాఫియా డాన్" వీరేంద్ర భూపతికి ఆనందం తలమునకలయ్యింది. అతను తలపెట్టిన మెగా కనష్ట్రక్షన్ ప్రోజక్టుకి ఇది పెద్ద సహకారం ఔతుందని ఉప్పొంగిపోయాడు. వెంటనే అతడు లేచి, బయలుదేరాడు, "మైత్రీ ఫర్నిషింగ్సు" C.E.O. ని కలుసుకోడానికి.

ఆఫీసులో ప్రవేశించిన అతనికి ముందుగది ఖాళీగా కనిపించి ఆశ్చర్యపోయాడు. అతన్ని చూసిన రాజు, అతడు వచ్చిన విషయం సారుకి చెప్పడానికి పరుగెత్తాడు. స్ప్రింగ్ డోర్ తోసుకుని కంగారుగా లోపలకు వస్తున్న రాజు వైపు, తను చూస్తున్న ఫైలుని మూసి, ఆసక్తిగా చూశాడు అమరేంద్ర.

"వీరూ భాయ్ వచ్చారు సార్! ఎందుకో తెలియదు" అన్నాడు రాజు కంగారు పడుతూ.
"ఎవరాయన? ఇలా లోపలకు తీసుకురా" అన్నాడు అమర్, ఫైల్ పక్కన పెడుతూ.

రాజు ఎంతవేగంగా వచ్చాడో అంత వేగంగానూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లో ఆ ఆగంతకుడు లోనికి వచ్చాడు. తనని తాను పరిచయం చేసుకుని, బిల్డర్ ననీ, ఫర్నిషింగ్స్ బల్కు ఆర్డర్ ప్లేస్ చెయ్యడానికి వచ్చాననీ చెప్పాడు వీరేంద్ర భూపతి.

అమరేంద్ర అలర్టు అయ్యాడు. ఆయనని మర్యాదగా ఆహ్వానించి, కూర్చోమని కుర్చీ చూపించాడు. తనకు కావలసిన వాటి జాపితా ఏకరువు పెట్టాడు వీరేంద్ర భూపతి. అతను చెప్పిన లెక్కలు విని ఆశ్చర్యపోయాడు అమర్. తొలి ఆర్డరే ఇంత బ్రహ్మాండంగా ఉంటే ఇక ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది - అని లోలోన ఉప్పొంగిపోయాడు. అమరేంద్ర. చెప్పిన A,B,C మూడు రకాల ఫర్నిషింగ్సూ కూడా తనకు అవసరమే - అన్నాడు వీరేంద్ర భూపతి.

అమర్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యాన్ని చూసి, వీరేంద్ర భూపతి గర్వంగా చెప్పాడు, "ఈ ట్విన్ సిటీస్ లో కనష్ట్రక్షన్ కింగుని నేనే! ఇక్కడ ఎవరినడిగినా చెపుతారు మీకా విషయం. హైదరాబాదులో, సికిందరాబాదులో, ఇంకా సబర్బన్సులో మాకు ఎన్నో కనష్ట్రక్షన్ సైట్సు ఉన్నాయి. ఈ సిటీలో చాలా బిల్డింగులు మేము కట్టించినవే! బిల్డింగ్సు కట్టించి అమ్మడం నా బిజినెస్. నేనేం మిమ్మల్ని దేబిరించి అడగను; బల్కు ఆర్డర్ కనుక, మీ అంతట మీరే మీ యూజువల్ డిస్కౌంటు ఇవ్వడం బాగుంటుంది." అన్నాడు వీరేంద్ర భూపతి దర్పంగా.

ఒక పాంఫ్లెట్టు, తన కొత్త విజిటింగ్ కార్డు అతనికి ఇచ్చాడు అమరేంద్ర. "మేము మూడు విధాల ఫర్నిషింగ్సు చేస్తున్నాము. కాని, దేనిలోనూ కూడా అందంలోగాని, నాణ్యతలో కాని ఎక్కడా మేము రాజీ పడము. మాకు లాభాలు మాత్రమే కాదు, కంపెనీకి వచ్చే మంచిపేరు కూడా ముఖ్యమే! ఇది మీరు గుర్తుంచుకోండి. వస్తువు తాలూకు నాణ్యతే మా లక్ష్యం! మీకు ఏ రకం ఎన్ని కావాలో చెపితే, మీ ఆర్డర్నిబట్టి సాధ్యమైనంత తొందరగా వాటిని తెప్పించి ఇస్తాము.

మేమూ మూడురకాల కనష్ట్రక్షన్లు చేపడతాము. మాకు మూడురకాల ఫర్నిషింగ్సు కావాలి. మా ఇంజినీర్ని అడిగి త్వరలోనే మీకు ఏవేవి ఎన్నెన్నికావాలో తెలియజేస్తాను, సరా" అన్నాడు వీరేంద్ర భూపతి.

ఈ లోగా యామిని రాజుచేత కూల్ డ్రింక్సు తెప్పించి అందమైన గాజు గాసుల్లో పోసి, ట్రేలో ఉంచి రాజుచేత పంపించింది ఇద్దరికీ. కూల్డ్రింక్ సిప్ చేస్తూ, గది నాలుగుమూలలా పరికించి చూస్తూ వీరేంద్ర , " మీది పెద్ద కంపనీ కదా, రిసెప్షనిస్టు లేకపోతే ఎలా? నేను వచ్చిన పది నిముషాలవరకూ నన్ను పట్టించుకున్నవాళ్ళే లేకపోయారు. ఇట్ ఈస్ వెరీ బాడ్" అన్నాడు.

అమరేంద్ర నొచ్చుకున్నాడు. "ఐ యాం సారీ! రియల్లీ ఐ యాం సారీ! రిసెప్షనిస్టు కోసం అడ్వర్టైజుమెంట్ ఇచ్చాం, అప్లికేషన్లూ వచ్చాయి. సెలక్షన్లే తరవాయి. బెస్ట్ ఇన్ ది వరెష్టు లాట్ - అని, త్వరలోనే ఎవరో ఒకర్ని సెలెక్టు చేసేస్తాము" అన్నాడు.

"అలా వద్దు. మా వాళ్ళ అమ్మాయి ఒకతె డిగ్రీ చేసి ఖాళీగా ఉంది. ఉద్యోగం చేస్తానని తెగ
సరదాపడుతోంది. వేరే ఎవరికీ చెప్పొద్దు, రేపే ఆ అమ్మాయిని పంపుతాను" అన్నాడు వీరేంద్ర భూపతి.
క్షణం ఆలోచించి, "సరే! పంపండి " అన్నాడు అమరేంద్ర.

* * *

వారం చివరలో ఇంటికి వెళ్ళిన యామిని, వకుళ పుట్టినరోజు కావడంతో సోమవారం కూడా సెలవు పెట్టి, అక్కడే ఉండిపోయింది. మంగళవారం ఆమె ఆఫీసుకి వచ్చేసరికి, ముందుహాలు నిండుగా

కలకలలాడుతూ కనిపించింది. హాలంతా కొత్త ఫర్నిచర్ తో నిండి ఉంది. రిసెప్షన్ డెస్కు ముందర ఒక అమ్మాయి కూర్చుని ఉండడం చూసి చాలా సంతోషించింది యామిని. ఆమె దగ్గరకి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంది. రిసెప్షనిష్టుగా వచ్చిన భామిని తన పరిచం చెప్పుకోడమే కాకుండా "అక్కా" అంటూ యామినితో వరస కూడా కలిపేసుకుంది చనువుగా.

రోజురోజుకీ బిజినెస్ పెరగడమే కాకుండా చిన్నా పెద్దా ఆర్డర్లు వరసగా వస్తున్నాయి. పని పెరిగింది కాని క్లరికల్ పోస్టుకి మరొకర్ని నియమించడంవల్ల మొత్తం మీద యామినికి పనిభారం కొంత తగ్గిందేగాని, ఎంతమాత్రం పని పెరగలేదు. ఎప్పటిలాగే ఆమె ప్రతి వారం ఇంటికి వెళ్ళేందుకు వీలుగా ఉండేలా ఆమె చెయ్యాల్సిన పని తొందరగా ముగించి, ఆమెకు శలవిచ్చి పంపించేస్తున్నాడు అమరేంద్ర.

గోపాల్రావుగారి వల్ల కొంత వరకూ ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న అమరేంద్రకు ఆమె మీదనున్న అలసభావం పోయి, క్రమంగా గౌరవం పుట్టి, పెరగడం మొదలయ్యింది. అప్పగించిన పనిని పూర్తిచెయ్యడంలో ఆమె చూపించే అంకిత భావం, ఓర్పు, నేర్పు, సిన్సియారిటీ మొదలైన సుగుణాలన్నీ క్రమంగా అతడు గుర్తించగల్గుతున్నాడు. అయినా ఇంకా బహిరంగంగా ఆవిషయాన్ని వ్యక్తీకరించడానికి అతనికి అహం అడ్డొస్తోంది. దానికి అతనికి స్త్రీ జాతి మీదపుట్టిన అసహ్యం కారణం కావచ్చు! ఆడవాళ్ళు అవకాశవాదులనీ, స్వప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించ గలరనీ అతనికున్న అభిప్రాయం. అంత త్వరగా పోయేది కాదు మరి! వస్తుత: మంచివాడు కావడం వల్ల అతడు యామినిని వాచా కొంటె మాటలతో ఎద్దేవా చేసినా, క్రియాత్మకంగా ఎప్పుడూ ఆమెకు కీడు కలిగించే పని ఏమీ చెయ్యలేదు. అంతేకాదు, నిశ్శబ్దంగా ఆమెకు సాయపడుతూనే ఉన్నాడు. యామిని అది గుర్తించింది. అక్కడితో, ఆమెలోని బెరుకు తగ్గి, అతనినొక శ్రేయోభిలాషిగా తలచడం మొదలు పెట్టింది. కాని ఆమెకూడా ఆ విషయాన్ని ఎప్పుడూ బైటపెట్టలేదు. ఇద్దరిమధ్య, వాళ్ళకు తెలియకుండానే ఒకవిధమైన స్నేహ భావం ఏర్పడడంతో, ఆ తరవాత, P.A.గా బాస్ చుట్టూ తిరుగుతూ పనిచెయ్యవలసి వచ్చినా ఆమెకు ఏమాత్రం కష్టమనిపించలేదు. శాలరీ హైక్ వల్ల, ఖర్చులకు పోగా కొంత డబ్బు తప్పకుండా మిగులుతుందనీ, తగినంత డబ్బు కూడబెట్టి, వీలైనంత తొందరగా సుదర్శనం బాకీ తీర్చెయ్యాలననీ - అనుకుంది యామిని.

* * *

P. A. గా ప్రమోషన్ వచ్చాక వారాంతంలో ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన యామినిని చూసి వకుళ ఆశ్చర్యానందాలతో పరుగున ఎదురొచ్చి "హాయ్! యామినీ డియర్" అంటూ కౌగిలించుకుంది.
యామిని ఆరోజు ఇదివరకటికన్నా ముందుగా, బాగా వెలుగుండగానే వచ్చేసింది. ఆమెను చూసి ఇంటెల్లపాదీ సంతోషించి, ఆమెను ప్రేమగా ఆహ్వానించారు.

భోజనాలైనాక తండ్రికి మందులు ఇచ్చి, ఆయనతో కొంతసేపు కబుర్లు చెపుతూ కూర్చుంది యామిని. ఆమె బాసుని గురించీ, ప్రమోషన్ గురించీ, ఆఫీసుని గురించీ రకరకాలుగా అడిగి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వినీ, మురిసిపోయాడు విశ్వనాధం. నిద్రతో ఆయన కనురెప్పలు బరువెక్కీవరకూ కబుర్లు చెప్పి, ఆయన కళ్ళు మూసుకుని పడుకున్నాక దుప్పటీ కప్పి, ట్యూబ్ లైటు తీసేసి, బెడ్ లైట్ వేసి మరీ ఆక్కడనుండి బయటకు వచ్చింది యామిని.

యామిని రాకకోసం ఎదురుచూస్తూ, ఏదో ఇంగ్లీష్ నవల చేత్తో పట్టుకుని, మంచం మీద మెలకువగానే పడుకుని ఉన్న వకుళ, యామినిని చూడగానే పక్కకి దొల్లి ఆమెకు చోటు వదిలి, ఒకపక్కగా ఒద్దికగా పడుకుంది. తనకై మినహాయించబడ్డ చోటులో తానూ ఒద్దికగా పడుకుని, వకుళ వైపు తిరిగింది యామిని.

'"నాన్న ఏవేవో ఆఫీస్ విషయాలు అడుగుతూంటే, కూర్చుండిపోయా. ఆలస్యమైపోయింది కదూ" అని అడిగింది యామిని అపాలజెటిగ్గా.

" యామినీ! ఇంతకీ మీ బాస్ ఏమన్నాడో చెప్పావుకాదేమి? డెకరేషన్ నచ్చిందిటా?"

" ఆ! చాలా మెచ్చుకున్నాడు వకుళా! కలర్ స్కీం అంతా అచ్చం తనకు నచ్చిన పద్ధతిలో ఉందిట. ఎవరో తన టేష్టు గురించి బాగా తెలిసిన వాళ్ళు చేసినట్లుగా అనిపించిందిట. నేను నిన్నే తల్చుకున్నాను."

అమ్మయ్య! ఇప్పటివరకూ నిన్నేమంటున్నాడో , ఏం తోకలుకట్టి నిన్ను ఇబ్బంది

పెడుతున్నాడో, నువ్వేం బాధలు పడుతున్నావో - అని తెగ ఇదైపోతూ బెంగపెట్టుకున్నా నంటే నమ్ము! అంతా సౌమ్యంగా జరిగిపోయింది కదా, సంతోషం!" రిలీఫ్ తో నిట్టూర్చింది వకుళ.

"థాంక్సు వకుళా! నీ సహాయం లేకపోతే ఇదంతా నా వల్లనయ్యేది కాదు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు నాకు " అంది యామిని.

"చాల్లే!ఇక ఊరుకో! నాకూ నీకూ మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దు. ఔనుగాని యామినీ!

అంతసేపు అంకుల్తో మాటాడావు కదా, ఇంతకీ మీ బాస్ గురించి ఏం చెప్పావేమిటి?" మాట మార్చేసింది వకుళ .
"ఏం చెప్పాలో అదే చెప్పా; ఉన్నది ఉన్నట్లుగా! బాస్ ఈస్ ఎ గుడ్ గై! వుయ్ కెన్ గెటాన్ వెరీ వెల్! జాబ్ ఈస్ నైస్. ఐ యాం హాపీ!" ఆశ్చర్యంతో నోరు తెరిచేసింది వకుళ. యామిని నవ్వుతూ ఆమె నోరు దగ్గరగా నొక్కి, "ఇంట్లో దోమలు ఎగురుతున్నాయి, జాగ్రత్త! ఐనా అంత అద్భుతంగా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు ఇందులో. నేను చెప్పిందేమీ అర్ధసత్యం కాదు, అసలుసిసలైన అక్షరసత్యం. ఇది వరకులా కాదు, బాస్ చాలా మారాడు" అంది యామిని.

తన నోటిమీదున్న యామిని చెయ్యి పక్కకి తీసి, "తధాస్థు దేవతలారా 'తధాస్థు" అని మమ్మల్ని దీవించండి" అంది వకుళ కొంటెగా చేతులు తిప్పి యాక్షన్ చేస్తూ.

"సశేషం! ఇక చాలులే, నీ హాస్యం రేపటికి వాయిదా వేద్దామ్. ఇక పడుకో! నాకు బాగా నిద్రవస్తోంది, నేను పడుకుంటా బాబూ" అంటూ కప్పుకున్నదుప్పటీ తలమీదకంతా లాక్కుంది యామిని.

* * *

ప్రమోషన్ వచ్చాక యామిని, అదే తొలిసారి ఇంటికి రావడమేమో, శ్రేయోభిలాషులందరూ ఆనందంతో పొంగిపోయారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఒక రోజు విందు ఉత్తరపు వాటాలో ఐతే, మరురోజువిందు దక్షిణపు వాటాలో! మురళీ కుటుంబం కూడా ఆ సంబరంలో పాలు పంచుకుంది. ఉల్లాసంగా గడిచిపోయాయి ఆ సెలవు రోజులూ

ఆ రాత్రి ఒకే మంచం మీద నిద్రకి చేరిన స్నేహితురాళ్ళు ఇద్దరూ, అలవాటుగా ముచ్చటించుకోసాగారు .........

"యామినీ! సశేషమన్నావు గుర్తుందా?" అడిగింది వకుళ.

"గుర్తుంది. ఇంతకీ నీకు కావలసినది ఏమిటి నేస్తమా? అట్టా, ముక్కా?"

"అట్టూ వద్దు ముక్కావద్దు. నాకు కావలసింది సత్యం అంటే నిజం! సొరకాయ కోతలు మాని అసలువిషయం చెప్పు, చాలు" అంది వకుళ .

"నేను చెప్పిందంతా నిజమే వకుళా! గాడ్ ప్రోమిస్, గురుడిలో చాలా మార్పొచ్చింది. కారణం నాకు తెలియదు. మొదట్లో నేను భయపడ్డట్లు, నాకిప్పుడు తీరుబడిలేనంత పని కూడా లేదు. ఇదివరకటి కంటె హాయిగా ఉంది ప్రాణం. టీజింగ్ కూడా మానేశాడు మహానుభావుడు. అప్పుడే ఇతడు ఇక్కడికి వచ్చిసుమారుగా ఆరు నెలలయ్యింది. మొదట్లో కూడా అతనిది ఒట్టి నోటిమాటల డాంబికమే కాని, నాకే అపకారం చెయ్యలేదు.

మనిషి వస్తుతహా దుర్మార్గుడు కాడనిపిస్తోంది. వయసుకి చిన్నవాడైనా,మనం కథల్లో చదివిన కేరక్టర్లకున్నట్లు ఇతనికి కక్కుర్తి బుద్ధులేవీ ఉన్నట్లు లేవు. అందుకనే నేనీ ఉద్యోగంలో నిలదొక్కుకో గలిగా. అర్థం చేసుకో వకుళా! ఇప్పుడు నేను హాపీగా ఉన్నా! నా గురించి . నువ్వేం దిగులు పడకు."

"అతనికి పెళ్ళయ్యిందో లేదో ఇప్పటికైనా తెలిసిందా నీకు? వయసు ఎంత ఉంటుందంటావు? మొన్న వచ్చినప్పుడు చూస్తా అనుకున్నా, కాని నాకు ప్రాప్తం లేదు, మ్చు!"

"అతని పెళ్ళిని గురించి నాకేమీ తెలియదు. కాని ఒకటి మాత్రం చెప్పగలను, అతడు నాతో ఎప్పుడూ హద్దలు మీరి ప్రవర్తించ లేదు. అతన్నెప్పుడూ నేను, "నీకు పెళ్ళయ్యిందా, లేదా" అని అడిగిందీ లేదు. దట్ ఈజ్ నాట్ మై బిజినెస్! ఇక వయసంటావా - అదీ సందిగ్ధమే! అనుభవజ్ఞుడైతేగాని ఒక సంస్థకు C.E.O. కాలేడు కదా! ఇక ముప్ఫై ఐదేళ్లయినా లేకుండా సామాన్యంగా అనుభవం రాదు. కాని మనిషిని చూస్తే మాత్రం ముప్ఫై ఏళ్లు కూడా ఉండవనిపిస్తుంది. అతని వయసును తెలుసుకునీ ప్రయత్నంలో నేను రికార్డులు సెర్చిచేసి చూసిందీ లేదు మరి! నేను చెప్పిందాన్నిబట్టి నువ్వే ఊహించుకో అతని వయసు, బాగుంటుంది" అంది యామిని.

వకుళ నవ్వి, "నన్నడిగితే ముప్ఫై లోపైతేనే బాగుంటుంది. ఇరవై రెండేళ్ళ అమ్మాయికి అంతకన్నా పెద్దవయసు వాడైతే అంతగా బాగుండదు" అంది, ఇంతవరకూ తను చదివిన "మిల్సు అండ్ బూన్స" నవలలోని కథ ఇచ్చిన స్పూర్తితో! తెల్లబోయి, కళ్ళు విశాలంగా చేసుకుని, వెర్రిగా చూసింది యామిని స్నేహితురాలి వైపు. అదేమీ గమనించకుండా వకుళ తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది, " బాసు - సెక్రటెరీల రొమాన్సు గురించి ఎన్ని కథల్లో చదివలేదు మనం ! ముందుగా సిగపట్లతో మొదలైన వాళ్ళ పరిచయం, నెమ్మదిగా పరిపక్వతకొచ్చి ప్రేమగా మారి, ఇద్దరూ రాజీపడగా, చివరకది, వాళ్ళు "వెడ్లాక్"తో ఒకటైపోడం తో కథ క్లైమేక్సుకి వచ్చి, సుఖాంతం కావడం గురించి! ఎన్ని ఒడిదుడుకులు పడినా అంతా చివరికి సుఖాంతం కావాలన్నదే నా ఆశ! అదే నా ఆకాంక్ష కూడా" అంది వకుళ అవధులెరుగని ఉద్వేగంతో.

వకుళ మాటలకు యామిని వెర్రిగా నవ్వసాగింది. ఈ మాటు తెల్లమొహం వేసుకు చూడడం వకుళ వంతయ్యింది. అలా నవ్వినవ్వి, ఆ నవ్వు ఆపి చెప్పడం మొదలుపెట్టింది యామిని ......,

" వెర్రి కుదిరింది, తలకి రోకలి చుట్టండి" అన్నట్లుగా, వినడానికి చాలా బాగుంది నువ్వు చెప్పింది! పిచ్చిపిల్లా! అలాంటి లేనిపోని ఆశలు పెంచుకుని తలనెప్పి తెచ్చుకోకు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నాకు పెళ్ళిగురించిన ఆలోచనలేం లేవు. ఈ యామిని - టోటల్లీ డెడికేటెడ్ టు జాబ్, జాబ్ ఓన్లీ!

మా నాన్న మామూలు మనిషై, మళ్ళీ టైప్ ఇనిస్టిట్యూట్ తెరిచేవరకూ నేను ఉద్యోగం చెయ్యక తప్పదు. నేను నా స్వార్ధం చూసుకుని, తగుదునమ్మా - అని, పెళ్ళీచేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే; తన చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే, మళ్ళీ పెళ్ళిమాట తలపెట్టకుండా, నా కోసం ఏకాకి బ్రతుకు గడుపుతున్న మా నాన్న; నాకు తల్లి లేదన్న లోటు తెలియనీకుండా తానే తల్లై నన్ను ప్రాణంగా పెంచిన మా అత్తయ్య ఏమై పోవాలి? వాళ్ళు నాకు చేసిన దానిలో, నేను వాళ్ళకి చేస్తున్నది ఎన్నో వంతూ కూడా కాదు. ఆ జన్మాంతం నాకు పెళ్ళి కాకపోయినా ఫరవాలేదు. బ్రతికున్నన్నినాళ్ళూ, నేను వాళ్ళ బిడ్డగా, సంతోషంగా బ్రతికెయ్య గలను. ఇంతకీ, ఇది గుర్తుపెట్టుకో, అతను నాకు బాసు, నేను అతనికి P.A.ని, అతనికి పెళ్లి అయినా కాకపోయినా అదే మా పర్మనెంట్ రిలేషన్షిప్!" అలా యామిని ఏకబిగిని మాటాడి, తన మనసు విప్పి వకుళ ఎదుట పరిచింది.

వకుళ తన తెలివిలేనితనాన్ని తల్చుకుని చాలా బాధపడింది. 'సారీ యామినీ! సరదాగా మాటాడుతున్నాననుకున్నాగాని, నీ మనసును ఇంతలా గాయపరుస్తున్నానన్న స్పృహే లేకపోయింది నాకు, వెరీ బేడ్! వెరీవెరీ సారీ" అంటూ చాలా బాధపడింది.

"నేనేం బాధపడటం లేదు. కేవలం నీ సందేహాలన్నీ తీర్చడంకోసం చెప్పాను, మరెప్పుడూ ఇలాంటి ఆలోచనలతో నువ్వు మనసు పాడుచేసుకోకుండా ఉండాలని నా ఉద్దేశం, అంతేగాని ఎంతమాత్రం నిన్ను కించపరచాలని కాదు. నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివి. అందుకే నా మనసు నీకు విప్పి చెప్పా, అంతే! నువ్వు బాధపడాలని మాత్రం నా అభిమతం కాదు" అంది యామిని వకుళ చెయ్యి తనచేతిలోకి తీసుకుని.

కాని,అందరిలాగే వకుళ కూడా అలా అలవిమాలిన మాటలు మాటాడడం యామినికి అంతగా

నచ్చుబాటు కాలేదు. మొన్న ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన గో.రా. గారు కూడా ఇదే ఉద్దేశాన్ని సూచించారు. ఆపై శారదాంబ! ఇప్పుడు వకుళ - మనవాళ్ళంతా ఇంతే! వయసులో ఉన్న ఒక అమ్మయీ, ఒక అబ్బాయీ ఒకేచోట కనిపిస్తే చాలు, వెంటనే చూసిన వాళ్ళ మనసుల్లో పెళ్ళిబాజాలు మ్రోగకమానవు. వెంటనే వాళ్ళిద్దరికీ ఎలాగైనా పెళ్ళి జరిగితే బాగుండును - అనుకుంటారు, అదేమి పాపమో! ఈ జనంలో వకుళనుగాని, గో.రా.
గారినిగాని మినహాయించడం అన్నది ఎలాకుదురుతుంది? - అలా ఆలోచిస్తూ, అంతలోనే నిద్రపోయింది యామిని. వకుళకు మాత్రం చాలాసేపటివరకూ నిద్రరాలేడు.

వకుళ మాటలకు యామిని మనసులో ఒక మారుమూల జాగాలో ఒక చిన్న స్పార్కు పుట్టి,

తళుక్కున మెరిసి, అతిచిన్న హృదయ స్పందనకు శ్రీకారం చుట్టింది. కాని యామినికి ఇంకా అదేమీ తెలియలేదు, పాపం!

* * *

ఆదివారం ఉదయం లేస్తూనే అనుకుంది వకుళ, "రేపు ఈ సమయానికి అప్పుడే యామిని బస్సులో ఉంటుంది కదా" అని. ఆ రోజు ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చి యామినిని అభినందించి వెళ్ళారు. వారిలో సోమయాజులుగారు, అన్నపూర్ణమ్మ గారూ కూడా ఉన్నారు.

ఆ రోజు లంచ్, డిన్నర్ - అన్నీ రామేశంగారి ఇంట్లోనే. ఆ మధ్యాహ్నం మూడు దాటాక యామినీ వకుళా వీణలు తెచ్చి, జుగల్మందీగా వాయించి, పెద్దవాళ్ళను సంతోషపెట్టారు.

రాత్రి పదవ్వగానే అందరూ నిద్రపోడానికి వెళ్ళారు. వకుళ, యామినీ కూడా మంచాన్ని చేరారు. యామిని గదిలోకి రాగానే, వకుళ వెళ్లి గది తలుపు గడియ వేసి వచ్చింది. ఇద్దరూ పక్కపక్కన మంచం మీద పడుకుని నెమ్మదిగా కబుర్లు చెప్పుకోడం మొదలుపెట్టారు.........

"యామినీ ఈ మూడు రాత్రులూ ఇట్టే గడిచిపోయాయి.తెల్లారగానే నువ్వు వెళ్ళిపోతావు. మళ్ళీ నేను నీ రాకకోసం స్వాతి వానకోసం ముత్యపు చిప్పలాగ ఎదురుచూస్తూ, వేళ్ళు లెక్కెట్టుకుంటూ ఉంటాను. నీకైతే అక్కడ మీ జాలీ రిసెప్షనిస్టు ఉంటుంది తోడుగా. ఇక్కడ నాకు ఎవరూ లేరు" అంది వకుళ దిగులుగా.

" భామిని ఉంటుంది, నిజమే! కాని భామిని భామినే! వకుళ కాదు కదా ... . ఆమెకూ నాకూ ఉన్నది, ఒకేచోట ఉద్యోగం చేసే ఇద్దరు మధ్య ఉండే ,సంబంధం మాత్రమే! అది బాదరాయణ సంబంధం లాంటిది. ఆఫీసులో ఉన్నంతసేపూ ఎవరిపని వాళ్ళం చేసుకుంటూ ఉంటాము. ఒక్క లంచివేళలో మాత్రం కాసేపు ఇద్దరం కలిసి మాటాడుకుంటాము. మేమిద్దరం స్నేహితులమని నాకెప్పుడూ అనిపించలేదు. నేనూ నిన్ను మాత్రం ఎప్పుడూ మిస్ ఔతూంటాను. వీకెండ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మళ్ళీ మనమిద్దరం ఇలా పడుకుని కబుర్లు చెప్పుకుంటామా - అని, నేనూ, ఆ ఐదు రోజుల పాటు వేళ్ళు లెక్కెట్టుకుంటూనే ఉంటాను" అంది యామిని కూడా.

"నిజమా! ఐతే మన స్నేహం కూడా మన నాన్నల స్నేహంలా నిత్య నూతనంగా, పదికాలాలపాటు పచ్చగా కలకలలాడుతూ ఉండాలి, ఏమంటావు? మా నాన్న, మీ నాన్నా చూడు, ఇన్నేళ్ళు వచ్చాక, ఇప్పుడు కూడా స్నేహామృతాన్ని రెండుచేతులా జుర్రుకుంటూ హాయిగా ఉన్నారు. మనం కూడా అలా ఉండాలి - అని నా కోరిక." అంది వకుళ ఉబలాటపడుతో.

"ఔను వకుళా! నాకూ అదే ఆశ ఉంది. కష్టాలూ సుఖాలూ వస్తూంటాయి, పోతూంటాయి. సుఖాల్లోనే కాదు, కష్టంలో కూడా తనని కనిపెట్టి ఉండే మిత్రుడు దొరకడం అన్నది గొప్ప అదృష్టం. చూస్తే, మా నాన్న అటువంటి అదృష్టవంతు డనిపిస్తోంది."

" ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ ! అదే నిజమైన స్నేహం! యామినీ ఇక పడుకో. మళ్ళీ నువ్వు తెల్లారకుండా లేచి ప్రయాణమవ్వాలి కదా " అంటూ పక్కకి ఒత్తిగిలి కళ్ళు మూసుకుంది వకుళ.

** *

హైదరాబాదులోని, మైత్రీ ఫర్నిషింగ్స్ బిజినెస్ జోరు నానాటికీ పెరిగి పోతోంది. అక్కడికి చుట్టుపక్కలనున్న ఊళ్ళలో ఇళ్ళు కట్టించుకుంటున్నవాళ్ళు కూడా వ్యయ ప్రయాసల కోర్చి, హైదరాబాదుకి వచ్చి మరీ కొనుక్కుపోతున్నారు వాటిని. నాజూకైన అందానికీ, పటిష్ట మైన నాణ్యతకూ ప్రతీకలైన మైత్రీవారి వస్తువులకు రోజురోజుకీ గిరాకీ పెరిగిపోతోంది. పేరున్న ప్రతి కంట్రాక్టరూ, తను కట్టే బిల్డింగుకి మైత్రీ ఫిట్టింగ్స్ నే వాడాలని అనుకుంటున్నాడు. ఆ తరువాత ఆ యింటిలో ప్రవేశిస్తున్న గృహస్తు కూడా మైత్రీ ఫర్నిచర్నే కొనడానికి ఇష్టపడుతూండడంతో, పనిలో పనిగా ఫర్నిచర్ డివిజన్ కూడా అభివృద్ధి చెందుతోంది. మొత్తం మీద మైత్రీ వారి బిజినెస్ మూడు పూవులూ ఆరు కాయలూగా వృద్ధి చెందుతోంది హైదరాబాదులో !

తయారైన వస్తువుల్ని పలాసా సామిల్లులకు సంబంధించిన కార్ఖానాలనుండి తెప్పించి, కోరినవారందరికీ అందచెయ్యాలంటే చాలా కష్టమౌతోంది. చెప్పిన సమయానికి సరుకు అందించడం సాధ్యపడదేమోనని ఎప్పటికప్పుడు భయపడవలసి వస్తోంది. దాంతో అమరేంద్ర ఇక్కడ పరిస్థితిని ఫోనులో మిత్రాగారితో సంప్రదించాడు. వెంటనే ఆయన హైదరాబాదుకి సమీపంలోనే ఒక కార్ఖానా నెలగొల్పడం మంచిదనే
అభిప్రాయాన్ని వెలిబుచ్చి, ఆ కార్ఖానాకి కావలసిన నాణ్యమైన ముడి సరుకు తాను సప్లై చేస్తానని హామీ ఇచ్చి, ఆ పని భారం కూడా అమరేంద్ర మీదే ఉంచారు.

"యామినీ! మైత్రీ వాళ్ళ కార్ఖానా ఈ ఊళ్ళో ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో చెప్పగలవా? ఈ ఊరు నాకు కొత్త, ఈ ఊరి లే అవుట్ ఏమీ తెలియదు నాకు" అన్నాడు అమరేంద్ర .

తెల్లమొహం పెట్టింది యామిని."నాకూ ఇక్కడి విషయాలేమీ తెలియవు సర్! మన వెంకట్రావు గారినైనా, శశిధర్ గారినైనా కనుక్కోడం బాగుంటుంది. చాలా కాలం నుండి వాళ్ళు ఇక్కడే ఉన్న వాళ్ళు కనక మీ ప్రశ్నకు జవాబు సరిగా చెప్పగలరు - అని నా నమ్మకం " అంది.

అమర్ బెల్ రెండుసార్లు ఒత్తేసరికి, రాజు పరుగున వచ్చాడు. వెంటనే రాజును పంపించి వెంకట్రావుగారిని రప్పించాడు అమరేంద్ర . ఎందుకో తెలియక కంగారు పడుతూ వచ్చాడు ఆయన.

"నమస్తే,సర్! రండి, కూర్చోండి" అంటూ ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించింది యామిని. కాని, ఆయన కూర్చోలేదు. "ఎందుకు సార్! నన్ను రమ్మన్నారు" అని అడిగాడు.

అమర్ చిరునవ్వు నవ్వి, " మరేమీ లేదు, పెద్ద విశేశమేమీ కాదు. ఈ ఊరి లే అవుట్ విషయంలో చిన్న సలహా అడగాలని పిలిచా. పెద్దవారు, మీరు అంతసేపు నిలబడి ఉండడం బాగుండదు, కూర్చోండి, ప్లీజ్" అన్నాడు.

ఆయన కూర్చోగానే చెప్పాడు అమరేంద్ర "ఈ ఊరు మీకు బాగా పరిచితమైనదే కనుక, మనం ఒక కార్ఖానా పెట్టి, ఫర్నిషింగ్సు ఇక్కడే తయారు చేయించాలంటే సబర్బన్సులో ఏ ప్రదేశం అందుకు తగి ఉంటుందో చెప్పండి. అక్కడ రవాణా సౌకర్యం బాగుండాలి. మనకి మధ్య ప్రదేశ్ అడవులనుండ ముడి సరుకు రావాలి కనుక, రైలురోడ్డు కూడా దానికి దగ్గరలో ఉండాలి. అలాగే మనం తయారుచేయించిన ఫిట్టింగ్సు బిల్డర్సుకి చేరాలంటే చేరువలో ఒక మెటల్ రోడ్డుకూడా ఉండడం అవసరం. ఈ అవసరాలన్నీ తీర్చగలిగే ప్రదేశం ఏదో మీరు నిర్ణయించి చెప్పండి. త్వరలోనే అక్కడ మనం సైట్ కొని, షెడ్సు వేసి పని ప్రారంభించవచ్చు. ఆర్డర్లు ఎక్కువై పోతున్నాయి నానాటికీ! తయారైన సరుకు పలాసా ఫేక్టరీ నుండి తెప్పించి సప్లై చెయ్యడం కష్టంగా ఉంది. మనకది తేలికవ్వాలంటే కార్ఖానా దగ్గరలో ఉండడం చాలా అవసరం."

వెంకట్రావుగారు కాసేపు ఆలోచించి, "ఘటకేసర్లో ఐతే మీరు చెప్పిన అవసరాలన్నీ తీరుతాయనిపిస్తోంది. ఒకసారి మీరు అటువైపు వెళ్ళి చూసిరావడం బాగుంటుంది. ఎందుకైనా మంచిది, నేను శశిధర్ని కూడా సంప్రదించి, మీకు ఏ మాటా తెలియజేస్తాను" అని చెప్పి సెలవుతీసుకుని వెళ్ళిపోయాడు ఆయన.

** *

నెలతిరిగేసరికి ఘటకేసర్లో రైలు స్టేషన్ దగ్గర రోడ్డు పక్కనున్న రెండెకరాల ఖాళీ స్థలం కొని, దానిలో షెడ్లు వేయించి, అక్కడ పని మొదలు పెట్టడం అన్నది యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిపోయింది. కలప పలాసాలోని మైత్రీవారి సామిల్లులనుండి వేగన్లమీద సరఫరా అయ్యింది. కొంచెం జీతం ఎక్కువ అడిగినా ఇచ్చి, నిపుణులైన వడ్రంగుల్ని పనికి నియమించారు. దానివల్ల పనిలో నాణ్యత హెచ్చడం మాత్రమే కాదు, పని చురుగ్గా జరుగుతోంది కూడా. ఘటకేసర్లోని ఫాక్టరీలో A, B ,C - అనే మూడు రకాల ఫర్నిషింగ్సు శరవేగంతో తయారవుతున్నాయి. పలాసా నుండి వచ్చిన ఫిట్టింగ్సుకీ, ఘటకేసర్ ఫేక్టరీలో తయారైన వాటికీ మధ్య ఏమీ తేడా ఉండకుండా, తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు అమరేంద్ర.

"ఇంక కష్టమర్సు ఎంతమంది వచ్చినా మనం ఈజీగా టాకిల్ చెయ్యగలం" అనుకుంటూ సంతృప్తితో నిట్టూర్చాడు అమరేంద్ర.

రోజులు గడుస్తున్నకొద్దీ అభివృద్ధి పధంలో ముందుకి సాగుతోంది మైత్రీ ఫర్ణిషింగ్సు తాలూకు బిజినెస్సు. పనిలోపనిగా మైత్రీ ఫర్నిచర్సు కూడా! ఆఫీసులోనూ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. చూస్తూండగా ఫోన్లు వచ్చాయి, స్టాఫ్ బాగా పెరిగింది.

ఒక్క సంవత్సరమైనా గడవకుండానే ఇంత అభివృద్ధి సాధించినందుకు, మిత్రాగారి అభినందనలు అందుకున్నాడు అమరేంద్ర. ఎవరికీ పని భారం ఎక్కువ కాకుండా చూస్తూండడంతో, ప్రతి ఒక్కరికీ పని మీద మక్కువ పెరిగి, మనసుపెట్టి మరీ పనిచేస్తున్నారు శ్రద్ధగా. . వయసులో చిన్నవాడైనా, అక్కడ పనిచేస్తున్నవారందరికీ బాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

** *

ఆఫీస్ మూసే వేళ దగ్గరపడడంతో,ఫైళ్ళన్నీ వాటి యధాస్థానాల్లో సద్దుతోంది యామిని. అప్పుడు బాస్ నుండి పిలుపు వచ్చింది . వెంటనే చేతిలో పని ఆపి వెళ్ళింది యమిని.

"హలో! ఒక చిన్న ప్రోబ్లం వచ్చింది .... ! రేపే తప్పనిసరిగా పోస్టు చెయ్యాల్సిన లేటర్ ఒకటి ఉంది. డిక్టేట్ చేద్దామంటే రిఫరెన్సు మెటీరియల్ ఇంటిదగ్గర పదిలంగా ఉండిపోయింది. నువ్వు నాకో సాయం చెయ్యాలి ....... " అని ఆగాడు అమరేంద్ర.

" చెప్పండి సర్! ఏమి టది?" అడిగింది యామిని.

"నువ్వు నాతోపాటు మా ఇంటికి రావాలి ..... " అని ఆగి, ఆమె వైపు చూశాడు అమర్.

ఒంటరిగా అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిదో, కాదో నిర్ణయించుకోలేక, ఆలోచనలో పడి, క్షణం మౌనంగా నిలబడిపోయింది యామిని.

ఆమె అలా ఔనో, కాదో చెప్పకుండా బొమ్మలా నిలబడి ఉండిపోడం అతనికి నచ్చలేదు. చిరాగ్గా మొహం పెట్టి , " ఆడవాళ్ళను సబార్డినేట్సుగా వేసుకుంటే ఇదే చిక్కు! ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అన్నింటికీ కుశ్శంకలు, అపార్ధాలూ, అనుమానాలూ, భయాలూ ......

దేనికీ చొరవ చెయ్యలేరు! సర్లే, నువ్వెళ్ళు, నా తిప్పలు నేను పడతాను" అన్నాడు.

వెంటనే యామిని స్పందించింది. "నేను మీతో వస్తున్నాను సర్!" అంది.

"గుడ్" అంటూ అతడు కారు దగ్గరకు దారితీశాడు. బేగ్ బుజానికి తగుల్చుకుని అతని వెంట నడిచింది యామిని.

** *

హైదరాబాద్ లో అప్పటికింకా అపార్టుమెంట్సు కట్టడమన్నది అప్పుడప్పుడే ప్రారంభమయ్యింది. మరికొన్నాళ్ళలో, క్రమంగా అది ఊపందుకుంది.

అప్పటికే అక్కడక్కడ ఒక్కొక్క బహుళాంతస్తుల భవనం ఆకాశంలోకంతా తలెత్తి దర్పంగా నిలబడి కనిపిస్తూ ఉంది. అలాంటి ఒక భవనం తాలూకు పార్కింగ్ ప్లేసులోకి వెళ్ళి ఆగింది కారు. అమర్ కారుదిగి వెళ్ళి యామిని కోసం డోరు తెరిచి పట్టుకున్నాడు. యామిని కారు దిగింది.

నాటకీయంగా కొద్దిగా వంగి "వెల్కం హోం" అంటూ ఆమెను తనింటికి ఆహ్వానించాడు అమర్.
యామిని చిన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఇద్దరూ మెట్లెక్కి, రెండవ అంతస్తులోఉన్న అమరేంద్ర ఉండే అపార్టుమెంటుకి దారితీశారు.

లోపల కాలుపెట్టగానే ఆమెకది ఇంద్ర లోకంలోని ఒక భాగంలా కనిపించింది. ఆ హాల్లో ఉన్న అలంకరణ వస్తువులన్నింటికన్నా, ఆ హాల్లో, దివాన్ మీద పొందికగా ఉంచబడిన వీణ ఆమెను ఎక్కువ ఆకర్షించింది. "అరే, వీణ" అంటూ వేగంగా రెండడుగులు ముందుకువేసి, అంతలో నిగ్రహించుకుని ఆగి, ఆరాధనగా దానినే చూస్తూ నిలబడిపోయింది యామిని.

వీణని చూడగానే యామినిలో చెలరేగిన ఉద్వేగాన్ని చూసి, విస్తుపోయాడు అమర్. "ఏమిటి, నీకు వీణంటే అంత ఇష్టమా"అని అడిగాడు ఆశ్చర్యపోతూ.

"ఇష్టమా? కాదు, ప్రాణం ! మీ ఇంట్లో ఎవరు వాయిస్తారు ఈ వీణ?"

"మా ఇంట్లో నేను తప్ప, ఇంకెవరూ లేరు. నేను ఒంటరిని! ఈ వీణ నాదే, మరీ తోచనప్పుడు వాయించుకుంటూంటాను " అంటూ వీణకు దగ్గరగా వెళ్ళి, మునివేళ్ళతో వీణ తీగల్ని సుతారంగా మీటాడు అమర్. మధురమైన వీణా నిక్వణంతో ఆ గదిలోనిగాలి కంపించింది.

"ఇప్పుడు వీణలు చాలాచోట్ల తయారౌతున్నాయి. మనరాష్ట్రంలో బొబ్బిలిలో చేస్తారు వీణలు. అన్నీ మంచివే! కాని, తంజావూరు వీణియకున్న స్వరమాధురి, శృతి నిబద్దత మరి దేనికీ లేదు - అంటారు విధ్వాంసులు. అందుకే నేను దీన్ని తంజావూరు నుండి ప్రత్యేకం ఆర్డరిచ్చి తెప్పించాను" అన్నాడు అమరేంద్ర వీణవైపు చూస్తూ.
"మా ఇంట్లో మా అమ్మ వీణ ఉంది. అదీ తంజావూరు వీణే! వారం వారం ఇంటికి ఎలాగా వెడుతున్నాకదాని దాన్ని ఇక్కడికి తేలేదు. ఇక్కడైతే ఊరికే అప్పుడప్పుడు గాత్రసాధన చేస్తూ ఉంటా. ఇంటికెళ్ళినప్పుడుమాత్రం వీణ వాయించుకుంటా" అంది యామిని వీణవైపు ప్రేమగా చూస్తూ.

"ఒకసారి వాయించుకుంటావా ఎమిటి? ఈ లోగా నేను మన ఇద్దరికీ కాఫీ కలిపి తెస్తా, తరవాత మనం పని మొదలు పెట్టొచ్చు" అంటూ అతడు కాఫీ చెయ్యడం కోసం లోపలకు వెళ్ళాడు.

బుజానికున్న బాగ్ తీసి కుర్చీలో పడేసి, పీచు మీద కాళ్ళు శుభ్రంగా తుడుచుకు వెళ్ళి, దివానుమీద కూర్చుని వీణని ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుంది యామిని.

హరికాంభోజి రాగానికి తంత్రులను మేళవించి, సున్నితంగా మీటలు సవరించి, కొద్దిగా రాగాలాపన చేసి కీర్తన అందుకుంది యామిని , "రాగసుధారస పానము చేసి రంజిల్లవే ఓ మనసా ......." అంటూ. శ్రీ త్యాగరాజ స్వామివారి కీర్తనలకు సహజమైన మనోరంజకమైన మాధురితో ఆ గదంతా నిండి పోయి, వంటగదిలో ఉన్న అమరేంద్రను చేరుకుంది. అప్రయత్నంగా అతడు కూడా లోగొంతులో పాటెత్తుకుని పాడ సాగాడు.

"యాగయోగ భోగా త్యాగ ఫలమొసగే .... , రాగసుధారస పానము చేసి ... " కీర్తనను లో గొంతుతో పాడుకుంటూనే అతడు కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి, ట్రేలో ఉంచి, వేరే బౌల్లో బిస్కట్లు ఉంచి, దాన్నికూడా ట్రేలో పెట్టి తీసుకు వచ్చేసరికి, యామిని కీర్తన పూర్తిచేసి, కల్పనా స్వరాలు వాయించడంలోకి వచ్చింది.

కల్పనాస్వరాలు పలికించడంలో ఎంతో నేర్పును చూపిస్తూ యామిని తన్మయత్వంలో మునిగి ఉంది.

అతడు కాఫీ తెచ్చిన సంగతి ఆమె గుర్తించనే లేదు. అతడు కూడా ఆమెను కదిలించదల్చుకోలేదు.

నెమ్మదిగా ట్రే ని టీపాయ్ మీద ఉంచి, సోఫాలో కూర్చుని సైలెంటుగా ఆ స్వరాలకు తాళం వెయ్యసాగాడు అమరేంద్ర. అతనికి ఆ కల్పనా స్వరాలు వెయ్యడంలో ఎక్కడో ఏదో సాన్నిహిత్యం ఉంది తనకు - అనిపించింది. అతనికి మనసులో సెలవేసి ఉన్న పాత జ్ఞాపకాలు పైకి లేఛాయి. మనసు బాధతో మూలిగింది. అంతలో, "గతాన్ని తలుచుకుని, ప్రస్థుతాన్ని మర్చిపోవ"ద్దంటూ వివేకం హెచ్చరించింది.

కొద్ది సేపట్లో, యామిని కల్పనా స్వరాలు ముగించి, వీణ పక్కన ఉంచి, దివాన్ దిగి వచ్చింది. ఎదురుగా అమరేంద్ర కనిపించే సరికి ప్రస్థుతం గుర్తొచ్చి గతుక్కుమంది. సంగీతం మత్తులోపడి సర్వం మరిచి, ఆ సంగీతంలోనే మమేకమైపోయినందుకు సిగ్గుపడింది.

"సారీ, సర్! క్షమించండి" అంది అపరాధ భావంతో. ఎర్రగా కందిన తన ముఖం అతని కంట పడకూడదని, తలబాగా వంచేసుకుంది.

తన ఆలోచనలనుండి బయట పడి అమర్ చిన్నగా నవ్వాడు. "సారీ అనొద్దు. చక్కగా ఉంది నీ సంగీతం. అంతే కాదు, ఈ కీర్తన నాకు చాలా ఇస్టమైనది. ఇది వింటూంటే నాకు టైం తెలియలేదు. ఇదిగో, ఇటు చూడు, ఈ కాఫీ చప్పగా చల్లారిపోయింది. వెచ్చచేసి తెస్తానుండు" అంటూ లేచాడు అమరేంద్ర.

" మీరు ఆగండి సర్! నేను వెచ్చజేసి తెస్తాను" అంటూ అతని అనుమతికోసం ఎదురు చూడకుండానే, చనవుగా ట్రే అందుకుని, వంటగదిలోకి నడిచింది యామిని. అమరేంద్ర లేచి లైట్లు ఆన్ చేశాడు. ఇల్లంతా మెరుపు దీపాల కాంతితో నిండిపోయింది.

తక్కిన ఇల్లులాగే వంట గదికూడా చక్కగా అమర్చబడి, నీట్ గా ఉంది. వంటగట్టుమీద గాస్ స్టౌ ఉంది. తక్కిన సామాను ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండి, పరిశుభ్రంగా ఉన్నాయి. సాధారణంగా బ్రహ్మచారుల ఇళ్ళు గలీజుగా, అస్తవ్యస్తంగా ఉంటాయని విన్న యామినికి ఆ ఇంటితీరు ఆశ్చర్యాన్ని కల్గించింది. అమరేంద్ర మీద, ఇప్పుడిప్పుడే ఆమెలో ఏర్పడుతున్న సదభిప్రాయం, ఇప్పటికిప్పుడు మరింతగా పెరిగింది.

యామిని పొగలు కక్కుతున్నకాఫీ కప్పులు, ట్రే లో ఉంఛి తెచ్చేసరికి, లెటర్ డిక్టేట్ చెయ్యడానికి సిద్ధంగా, కావలసిన కాగితాలన్నీ టేబుల్ పైన ఉంచి, రిఫరెన్సు పేపర్లు పరీక్షిస్తూ కనిపించాడు అమరేంద్ర . ఒక కప్పు అతనికి ఇచ్చి, ఒకకప్పు తను తీసుకు తాగసాగింది యామిని.

ఇద్దరూ కాఫీ తాగడం అవ్వగానే, అతడు లెటర్ డిక్టేట్ చెయ్యడం మొదలుపెట్టాడు. అతడు చెప్పినదంతా జాగ్రత్తగా షార్టు హాండులో రాసుకుని, ఆ కాగితాన్ని మడిచి, పదిలంగా తన పర్సులో ఉంచుకుంది యామిని.

అంతలో గోడనున్న "కుక్కూ క్లాక్"లోని చిలక పదే పదే బయటికి వచ్చి కూస్తూ, టైమ్ ఎనిమిదయ్యిందని హెచ్చరించి, లోపలకు వెళ్ళి తలుపు వేసుకుంది. యామిని మనసులో కంగారు మొదలయ్యింది.

ఆమె ముఖంలోని ఆందోళన చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అమరేంద్ర. "సారీ! యామినీ! నీకు చాలా లేటయ్యింది. నడు, నిన్ను ఇంటిదగ్గర దింపి వస్తాను" అంటూ లేచి, అతడు టేబుల్ మీదున్న కారు తాళాలను చేతిలోకి తీసుకున్నాడు.

(సశేషం)మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)