కథా భారతి

తావుర్యా

- సమ్మెట ఉమాదేవి

''ఉష్..హౌరు.. ఉష్.. చేతి కందిన రాళ్ళు విసురుతూ

''దిక్కు మాలిన కోతులు సూడబోతే ఈటి కోసమే మక్క పంట ఏసినట్టున్నది..'' తావుర్యా తిట్టుకున్నాడు. ఇటు నుండి కొడుతుంటే అటునుండి గుంపులు గుంపులుగా వచ్చి పడుతున్న కోతులను చూస్తూంటే అతని కోపం నసాలానికి అంటుతున్నది. అతను అటొక పరుగు, ఇటొక పరుగూ పెడుతూ వాటిని కొడుతున్నాడు. అవేమన్నా తక్కువా వున్నంత సేపు వుండి తిరగబడి తావుర్యా మీదకు ఉరికి వస్తున్నాయి. తావుర్యా మళ్ళీ విజృంభించి వాటిని తరిమి తరిమి కొడుతున్నాడు. కాస్సేపటికే అలసినట్లు వాలిపోయి కూలబడుతున్నాడు. ఎట్లా ఈ పంటను కాపాడుకోవాలో అతనికి అర్ధం కావడం లేదు.

కంకులు లేత పిందెలు వేసింది మొదలు పిచ్చుకలు, పాలపిట్టలు, రామ చిలుకలూ వాలి పోతుంటాయి. చిన్న చిన్న రాళ్ళు ఏరి తెచ్చుకుని తావుర్యా కొడుకులు రామ్లాల్, శ్యామ్లాల్వుండేలు పట్టుకుని అతని కూతురు బుజ్జీ వాటిని తరిమి కొడుతుంటారు. అయినా లాభం లేకపోతున్నది. కలుపు తీస్తూ, మందు కొడుతూ, రోజల్లా కోతులను పిట్టలను కొడుతూ ఇంటిల్లి పాది చేరి మొక్కజన్న చేనును కాపాడు కోవాల్సి వస్తున్నది. సాయంత్రం ఆరు ఆరున్నరకు గాని పిట్టల బాధ కోతుల బాధ తగ్గడం లేదు. ఇపుడిపుడే కంకులు చక్కగా తయారవుతున్నాయి. వాళ్ళ ముఖాల్లో కొత్త ఆశలు రేగుతున్నాయి.

మామూలుగా అయితే తావుర్యా అటు వెళ్ళగానే తండ్రి చూడకుండా.. ''అమ్మా ఈ ఒక్కటే.. ఆ ఒక్కటే..'' అంటూ పిల్లలు కంకులు విరిచి పాల కంకులంటూ పచ్చి గింజలే ఇష్టంగా తినేవారు. కాస్త గింజ ముదిరాకా తావుర్యా పిల్లలు అతని అన్నదమ్ముల బిడ్డలంతా అక్కడే చితుకులు పేర్చుకుని వాటిమాద కంకులు కాల్చుకుని తినేవారు. వేడి వేడి కంకికి నిమ్మకాయ బద్ద రాసి కారం ఉప్పు అద్ది తినేవారు. ఈ సంవత్సరం విత్తనాల రేట్లు ఎరువుల రేట్లు పెరిగాయని, పంట గిట్టు బాటు అవ్వడంలేదని కంకులన్నీ ఇట్ల తింటానికే సరిపోతే ఇగ పైసలచ్చేదెట్ల అని తావుర్యా ఎవరినీ ఒక్క కంకి కూడా ముట్టకోనివ్వడం లేదు.అట్లాంటిది.. పంటంతా కోతుల పాలవుతున్నదే అని తావుర్యాకు, జాన్కికి చెప్పలేనంత బాధగావున్నది.

* * *

చాలా కాలానికి తన ఇంటికి వచ్చిన తావుర్యా బావమరిదికి తన కష్టాన్నీ చెప్పుకున్నాడు తావుర్యా.

''ఏం జెప్పాలే దీరు ! అసల్కే వానలచ్చీ రాక పంట చేతికందుడే కష్టమయితున్నది. కాలు రెక్కలు నొయ్యంగ బోయి గంపెడు కంకులు అమ్యుకుంటే వచ్చే పైసలు పొయ్యిమీది అన్నం కుండకు సాల్తల్లేవు. ఇగ పిల్లగాల్లను ఎట్ల సాదుడో నాకయితే సమజయితల్లె.. నడుమ గీ కోతల బాధ ఎక్కువయిపోతున్నది. పంటల మీదనేగాదు ఊర్లెకు గూడ బోయి ఇండ్ల మీద బడుతుంటే పంచాయతోల్లు వాన్ల కొండముచ్చును దెచ్చి బజాట్ల తిప్పుతున్నరంట. కొండముచ్చుల జూస్తే గీ కోతులకు గంతభయం మెందుకో గాని.. యాడాడ కోతుల మస్తు దిరుగుతున్నయో అడాడా కొండముచ్చుల తిప్పుతున్నరట. అన్నాడు మనం కొండముచ్చులను యాడినుంచి దెస్తం. గా పంచాయతోల్లు మనకోసరం ఈడ ఎందుకు కొండముచ్చుల దిప్పుతరు.'' అన్నాడు.

''గది నిజమేగాని మా ఊరిదిక్కు పొరగాల్లు ఎలుగ్గొడ్ల ఏశం గట్టి చేన్లల్ల దిరుగుతున్నరు. అవిట్ని చూసి కోతులు ఒక్క ఉరుకుడు గాదు.'' చెప్పి నవ్వాడు దీరు.

''ఏంది ఏంది మల్ల జెప్పు. పోరగాల్లు ఎలుగ్గొడ్డు ఏశం గట్టినారు. ఇదేం ఇశిత్రముల్లా.! '' అని ఒక్కటే ఆశ్చర్యపోయాడు తావుర్యా. అంతలోనే ముసి ముసి నవ్వులు నవ్వాడు.

''ఎందిరా వారి మీరు గిట్ట గా ఏశం గడ్తరా మల్ల..'' అని కొడుకులను అడిగాడు..

''ఓ కడ్తం నాయినా..'' సంబరంగా అన్నారు రామ్లాల్శ్యామ్లాల్..

''ఏంది నిజంగనే పిల్లగాళ్ళతో ఏశం గట్టిపిస్తవా ఎట్ల..?'' జాన్కి చాలా ఆశ్చర్యపోయింది.

''అవు మల్ల లేకుంటే ఈ కోతులనాపుడు మన వశం అయితల్లే. ఏదో ఒకటి జేసుడే..'' స్థిరంగా అన్నాడు
''మరి గా ఎలుగొడ్ల డిరెస్సులు ఎట్ల మామా..?'' పిల్లలు అడిగారు.

''నేను దెస్త తియ్యి ఎట్లనో ఒకట్ల తిప్పలు బడాలె గదా మా ఊరి పోరగాళ్ళను ఒగ నెలరోజులు మనకు ఇమ్మని అడుగుతలే..''అన్నాడు అనడమే కాదు మూడు రోజుల్లో ఎలుగు బంటి దుస్తులు తీసుకు వచ్చి ఇచ్చాడు. అవి నిజంగా ఎలుగుచర్మంతో చేసినవే..

''థూ.. యాక్..'' వాటి వాసన చూసి జాన్కి పక్కకెల్లి ఊసి వచ్చింది. కాని ఆ మగపిల్లలిద్దరూ పద్నాలుగు పదిహేను వయసుల వాళ్ళు. వేశం కట్టే ఉషారులో దానిని నుండి వచ్చే వాసనలను పట్టించుకోలేదు. ఇద్దరూ అవి వేసుకుని సరదా సరదాగా చేనంతా తిరగిగారు. కోతులు రాగానే వీళ్ళు వాటికి ''భాం..'' అంటూ ఎదురెల్లగానే అవి భయపడిపోయి ఒకటే ఉరుకులు పెట్టి వెళ్ళి పోయాయి. వీళ్ళ సంబరం ఇంఆ అంతా కాదు.. తెల్లవారి మళ్ళీ మాములుగానే అవి రావడం వీళ్ళు వేశం కట్టగానే ఆ దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతుండడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పిల్లకు సరాదాగా వుంది పెద్దలకు కోతుల బెడద తొలగి మలనలసుల తేలికల పడుతున్నాయి.

* * *

ఇప్పుడు మొక్క జన్న చేను విరగ బూసి చాలా అందంగా కనపడుతున్నది. కంకులు బలంగా తయారయి ఎర్రటి కురులు ఆర బెట్టుకుంటున్న కన్నె పిల్లల్లా తయారయ్యాయి.

''పాపం కొడుకులిద్దరికీ ఎంత తక్లీబచ్చింది. పిల్లలలిద్దరికి పెయ్యంతా చెమట పట్టి చిట చిట మంటాంది పాపం.'' జాన్కి తల్లి మనసు తల్లడిల్ల్లి పోయింది. ఇంటికి రాగానే కుండల్లో వేడి వేడి నీళ్ళు కాగబెట్టి ఇచ్చి వాళ్ళను స్నానం చేయ్యమంటున్నది. గబా గబా వంట చేసి ఇంత తిండి పెడుతున్నది.

చేను నిండా మిఠాయి పొట్లాల్లా కంకులు ఊరిస్తున్నా.. తండ్రికి దడిచి ఎవరూ కంకులు విరచట్లేదు. తయారైన కంకులు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఎంతకెంతకు అమ్మాలో ఆలోచించుకుంటూ పనులు చేసుకుంటున్నారు ఆలు మగలు. చేను ఏపుగా తయారవ్వడంతో కాస్త పని తగ్గి ఆ పూట జాన్కి చేనుకు రాలేదు.

* * *

తలంచుకుని చేలో మట్టి తవ్వుతున్న దొర గొంతు వినపడి ఉలిక్కిపడ్డాడు.

''అరె తావుర్యా.! అమ్మాయి కడుపుతో వున్నదిరా నిన్ననే తీసుకచ్చినం. అమ్మాయికి మక్కగారెలు దినాలెనన్నుదని అంటాందంట. మక్క గారెలు ఇష్టంగానిది ఎవ్వళ్ళకు.? గొంచెమన్ని ఎక్కువనే కోస్కపోయి దొరసానికిచ్చిరా..''

''ఆ.. మర్సిపోయినా జర మీ ఆడోళ్ళను మక్కలు రుబ్బనీకు బంపుడు మరువకు.'' జీపు ఆపి దొర చెప్పగానే
''గట్లనే దొరా..'' అన్నాడు తావుర్యా. తలంచుకుని బరువుగా అడుగలేస్తూ ఇల్లు చేరి జాన్కికి విషయం చెప్పాడు.

''ఏందయ్యా..! గ్యారెలకు కంకులియ్యాల్నంటే ఎట్లయితది ఇప్పుడిప్పుడే చేతికచ్చే పంట.పెయ్యి నొవ్వంగ మోస్కపోయి అమ్ముకుంటే కష్టానికి సాలుతల్లేవు నడుమ గీ పంపకాలేంది పరాస్కాలా? నాకు వండుడు శాతాగాదా..? నీకు, పిల్లలకు తిన శాతగాదా..? తినేకాడా పదిమంది జేర్తరు. ఎన్ని కంకులైతే గ్యారెలయితరు జెప్పు. మల్లబోయి నేనే రుబ్బాల్నా.. అయినంక కడాయి బెట్టి జర నువ్వే గ్యారెలు జెయ్యమంటది గూడా గా దొరసాని. ఆమెకు పెయ్యి వంగుతదా..?

''ఏమనేటట్లున్నది జాన్కీ.. ఎప్పుడడిగినా ఏలకు ఏలు అప్పులిచ్చే దొర. కాదంటే మల్ల పైస బుట్టదు..''

''అవుమల్ల వడ్డీలు దీసుకుంటల్లేడా..? సామాన్లు కుదవ బెట్టుకుంటల్లేడా..? ''

''వడ్డీలు దీసుకున్నా గరీబుగాని నమ్మి పైసల్ఇచ్చేటోల్లెవళ్ళు..?''

''మనం ఇయ్యకుంటే ఆయనకే మరింత నయ్యం గదా. మన కాడున్న గాయింత చేను జాగా రాపిచ్చుకుంటడు. ఒగబంగారమే గాదు గిన్నెలు చెంబులుగూడా గుంజుకపోతడు. ఆయన సంగతి ఎవ్వళ్ళకు దెల్వదు..''జానకికి కళ్ళళ్ళో నీళ్ళు ఒక్కటే తక్కువ.

''ఏం జేసుడు జాన్కి ఆడిబిల్ల కడుపుతోని వున్నది. దొర నోరు దెరిసి అడిగిండు. నేను కంకులు ఇరుసుకస్త గాని నువ్వు బోయి జరంత రుబ్బి రాపో. పిల్లలు ముగ్గురి ముఖాల్లోకి చూడలేక తలవంచుకుని చేనుకు వెళ్ళాడు తావుర్యా.

* * *

జాన్కి అనుకున్నంతా అయ్యింది. ఆ కబురు ఈ కబురు చెబుతూ.. మొక్క జోన్నలు వలవడం దగ్గర్నుంచి రుబ్బడం గారెలు వేపడం అన్నీ పనులు జాన్కితోనే చేయించింది దొరసాని. ''రెక్కలు ముక్కలు చేసుకుని రుబ్బుతున్నందుకు కాదు నా బాధ పిల్లల నోర్లు కట్టి పెంచుకున్న పంట. ఒక్క కంకి సుత పిల్లలను ముట్టకోనియ్యకుంట ఈళ్ళ ఎదాన బోస్తున్నానే'' అనుకుని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

''జాన్కీ..! సిటీల పిల్లలకు ఇంత మంచి కంకులేడా దొరుకుతయి. గా మిక్సిల ఏస్తే జారుడు జారుడన్నా అయితది. లేకుంటే నలగకుంటనన్న అయితది. ఇంత మంచిగా రుబ్బేటోల్లు ఎవరు దొరుకుతారు. అంటూ మురిసి పోయింది. పిల్లలకు పెట్టమని ఒక్క గారె కూడా ఇవ్వకుండా..

''నీ పిల్లలకు గారెలు చేసి పెట్టడం నీ చేతుల్లో పని..'' కిసుక్కున నవ్వింది.

''అవు మల్ల రోజూ నా పిల్లలకు గీ గ్యారలె జేసి పెడతాన్న గాదు.'' దుఖాన్ని అణచుకుంటూ నీరసంగా ఇంటికి చేరింది. ఖాళీ చేతులతో ఇల్లు చేరిన తల్లిని చూసీ మౌనంగా వుండిపోయారు పిల్లలు ముగ్గురు.

''అమ్మా మనం గిట్ల తినేటి మక్క కంకులు గాకుంట ఏ మిరప పంటో ఏసుంటే బాగుంటుండె.. అప్పుడు ఎవ్వళ్ళు మనల అడుగకపోను..'' బుజ్జి అన్నది.

''నువ్వు మరిసినవేమోగాని బుజ్జీ నిరుడు మిరప పంట ఏస్తే పండ్ల పచ్చడని.. తమాట పచ్చట్ల మిరప పండ్లు కలిపి నూర్తే మంచిగుంటదని వీఆర్పో సారూ, యమ్మార్పో సారూ అందరూ మన చేన్లనే మిరప్పండ్లు కోపిచ్చుకున్నరు. రూపాయిగూడ సేతుల బెట్టలే గాని రాంబాయి పెద్దవ్వ్మతో రుబ్బి పిచ్చుకున్నరు కూడా.'' శ్యామ్గుర్తు చేసాడు.

''అమ్మా.. పాపం నాయినను ఏమనకమ్మా..! వాల్లు గట్ల వచ్చి రుబాబు జేస్తాంటే నాయిన మాత్రం ఏంజేస్తడు జెప్పుమొన్నొక దినం యమ్మార్పో సారు జవాను బంపి మస్తు కంకులు కోపిచ్చుకున్నడు. పాపం నాయిన గింతాంత బాధ పడలే.. '' మీ నాయినను అనేదేమున్నది కొడుకా..! కోపిచ్చుకుంటే కోపిచ్చుకున్నరు. గరీబుగాడు రెక్కల కష్టం చేసుకుని ఏసుకున్న పంట అని పోయెతప్పుడు.. వాళ్ళు దీసుకున్న దాంట్ల సగమన్నా ఒగ ఇరవయ్యో యాపయ్యో సేతులవెడ్తే తప్పేంది.?ఇంతట్లకే బిల్లింగులు కడ్తరా ఎట్ల.? మిరపపంటేసినా పత్తి పంటేసినా తినేదయితే అన్నమో రొట్టెలే గదా. అవిటికయితే సేతిల పైసలు ఆడాలె గదా..! పిల్లగాండ్లను పస్తులు బడుకో బెట్టాల్నా ఎట్ల..? అరెకరం కుదువ బెట్టి ఒగ ఎకరం పంటేసినోళ్ళు ఉన్నరు. పుస్తెలు తాకట్టు బెట్టినోళ్ళు ఒకరు, గొట్లు గోదలు అమ్ముకున్నోల్లు ఒకరు.. ఇవ్వన్నీ ఆల్లకేర్పాటేనా.! అంకాయలు పండితేఅంకాయలు గావాల్నంటరు. బెండకాయలేస్తే బెండకాయలు బంపుమంటరు. మడిసై పుట్టినంగ ఇంత ఇవురముండాలె. సదువు రానోళ్ళము మాతోని ఏం చెప్పింపుకుంటరు ఈళ్ళు..'' కలత పడ్డ మనసుతో కొంత.. గారెలు వేపిన నూనె వాసనకు కడుపులో తిప్పినట్లై కొంత నులక మంచంపై ముడుచుకుని పడుకున్నది జాన్కి.

* * *

''పోయినేడు మైదాకు అమ్ముకుందమని చేతులు గీర్కపోంగ.. కోస్కచ్చి అమ్మబోతే.. రేల్గాడిదాంక పోకమునుపై దొరగారి బారియ పిల్లగాండ్లకు గావల్నననవట్టే, నేను గోస్కచ్చిన మైదాకు జూసినంక ఇగ మనూరి సర్పంచుకు, గుడిల అయ్యగారికి, దుక్నంల కోమటాయనకు అందర్కీ.. మైదాకు బండిన సేతులు సూడాల్నని వాల్ల ఆడోళ్ళ మీద మస్తు పేమ బుట్టుకచ్చె. ఇగ పోలీసాయన చెల్లెల్ల్ల్లకు గావాల్నన్నడు..పోని తియి అందరూ మనసొంటి ఆడోల్లే గదా మైదాకంటే ఓల్లకయినా పాణమే గదా అని అట్ట్టిగా బంచిన. ఇగ మిగిలింది నేను అమ్మిందెంతో నాకు అచ్చిందెంతో బగమంతునికెరుక అక్కా.'' మొక్క జన్న చేలో కలుపు దీస్తానికి సాయం వచ్చిన రాంబాయితో జాన్కి అన్నది.

''అయ్యో జాన్కి..! నేను సుత నా యారాలి తక్లీబు నా తక్లీబు ఏ దేవుడు దీరుస్తడో అనుకుంట..! గా సీతబల్క పండ్లప్పుడు గూడ ఇద్దరం జంగలంత దిరిగి దిరిగి ఎట్లనో గోస్కచ్చి ఆకులుగప్పి పండవెట్టెటోళ్ళం. ఇంగ అమ్ముకుందం అనుకునెటాల్లకు, దొర పిల్లలకు, సర్పంచు బారియకు, రయిలు టేసన్సారుకు, ఆళ్ళు రుబాబుగా అడుగుడు మనం నోరు మూసుకుని పంచుడు.. మిగిలిన పండ్లు గంపల్లకెత్తుకుని మనం నడవంగ, నడవంగ.. కొనేటోళ్ళు పిసకంగ, పిసకంగ. సితకి పోయేటియి యెన్నో అమ్ముడయేటివి ఎన్నో మనకే దెలుసు.. బాకీలున్నట్టు పంచుడు కర్మ కొద్ది కాల్లు నొవ్వంగ నడుసుడు..''

''గిప్పుడు గీ మక్కంకుల గూడ గిట్లనే అయితాన్నయి. రెండు దినాలకోపారి.. మనుమలకు కంకులు కావాలని జీపులోవచ్చి అడిగి తీస్కపోతున్నడు దొరా. ఆయనకే గాక ఆయన సోపతోల్లకు గూడా ఇయ్యమంటడు. ఏమంటం.. ఏమనలేక అడిగినప్పుడల్లా పచ్చీసు కంకులదాంక పంపతున్నాడు. గీ గరీబుగానికి ఇత్తులు పురుగు మందులు..ఏడనుండస్తయి అని ఒక్కడు సోంచాయించడు. మా ఊరి పక్క తండావోల్లే మా చేలల్ల.. మాఊర్లల్ల పని పాట జేసుకునెటోల్లే.. అని కంది కాయలు, కంకులు అన్నీ రుబాబుగా అడుగుడు దెల్సుగాని,మా వోల్లే మరి ఏం దింటరు ఎట్ల బతుకుతరు ఒక రూపాయిద్దం అనిజూడరు..'' మాటల్లో కష్టాలు తీరడంలేదు గాని జాన్కి, రాంబాయి, పని అలసట మరచి పోగలుగుతున్నారు..

ఇలా ఇంటి ఆడవాల్లు పనులకు వచ్చినప్పుడల్లా.. కాస్త వీలు చిక్కి తావుర్యా. నష్టమో లాభమో అప్పుడు కొన్ని, ఇప్పుడు కొన్ని కంకులుగంపల వాళ్ళకు వేస్తున్నాడు. ఆ కాసిన్ని డబ్బులు చేతుల్లో ఆడితేగాని తిండికి జరుగుబాటవ్వదు. పంచినవిపంచగా..

అమ్మినవి అమ్మగా.. కాస్త ఆలస్యంగా వేసిన మరో అరెకరం పంట ఇప్పుడిప్పుడే చేతికందుతున్నది. దాని మీదే ఆశ పెట్టకున్నాడు.

కోతుల బాధ కాస్త తగ్గిందనుకుని పిల్లలిద్దరు చేనుకు ఆ ఎలుగు బట్టలు తెచ్చుకోవడం లేదు. కానీ ఇన్నాల్లు కాస్త ఆగిన కోతులు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. దాంతో రేపు ''ఏమైనా సరే ఆ బట్టలు మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ కోతులను భయ పెట్టాలి.'' అనుకున్నారు పిల్లలు.

మర్నాడు తావుర్యా చేనుకు చేరుకునేటప్పటికి రామచిలుకలు కంకులపై వాలి పోట్ట నింపుకుంటున్నాయి. అంతే పోగేసుకున్న రాళ్ళతో బుజ్జి ఉండేలుతీసి పిట్టలనన్నింటినీ కొట్టంది. మరి కాస్సేపటికి కోతుల దాడి మొదలయ్యింది. ఇక తమ వెంట తెచ్చుకున్న ఎలుగు బంటు దుస్తులు ధరించి వచ్చిన కోతలనల్లా తరిమి తరిమి కొట్టారు శ్యామ్లాల్, రామ్లాల్.

* * *

అ రోజు ఊరంతా జీపులు కారుల బండ్లు రయ్యి రయ్యిమని తిరుగుతున్నాయి. ఎందుకో అర్థం కాలేదు తావుర్యాకు.

''ఏంది జాన్కి ఊర్లెకు ఇన్న జీపులు కార్లు బోతున్నయి. అడిగాడు.అవు మల్ల ఇయ్యాల దొరగారి బిడ్డకు వడినింపుతున్నరంట వాళ్ళ అత్తగారోల్లు.. సిటీలవున్న దోస్తులు సుట్టాలు అందరూ అస్తాన్నరు''

''ఏంది మల్ల నిన్ను గిట్ట గ్యారెల పిండి రుబ్బుమనో.. చాపలు రుద్ది పెట్టమనో.. కూరగాయలు గోసి పెట్టమనో బిల్లలేదా ఎట్ల''

''నన్ను ఈ సారి బతికచ్చిండ్రు. గా వండెటోల్లు పెట్టేటోల్లు అందర్ని సీటి కాడనుండే దెచ్చుకున్నరంట. అయ్యేందో తీర్ల తీర్ల వంటలంట..'' జాన్కి చెప్పింది.

''పోని తియ్యి నీకు జర రికాం దొరికింది.'' అన్నాడు.

* * *

మూడయ్యింది. ఇంకా ఎండగానే వుంది అకస్మత్తుగా మూడు నాలుగు కార్లు చేను పక్కన ఆగాయి.

''అరె తావుర్యా.. వీళ్ళు మా అల్లుని తరుపు సుట్టాలు రా. జర మంచివి జూసి నాలుగు కంకులు ఇరిసి ఇయ్యరా.. పిల్లలు దార్ల దింటరు. జాన్కీ.. సితుకులేసి ఒగ నాలుగు కంకులు కాల్సియ్యి..'' పెత్తనంలో కూడా చనువు చూపించాడు దొర.

స్వంత చేన్లో తిరిగినట్టు తిరుగతూ దొర చెప్పగానే కీలు బమ్మ ఆడినట్టు తావుర్యా, శ్యామ్లాల్కంకులు ఇరుచుకు రావడం.. బుజ్జీ అన్నింటికి పొట్టు తియ్యడం, జాన్కి, రామ్లాల్చితుకుల మీద కంకులు కాల్చి పెట్టడం.. అలా ఓ గంట సాగింది. ఒకొక్కరూ ఊదుకుంటు ఊదుకూంటూ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.అప్పటికే ఓ యాభై అరవయి కంకులు లాగించేసారు.

''మన సిటీలల్లో కంకులు దెచ్చి, వాల్లు కాల్చి అమ్మేటప్పటికి.. చప్పబడిపోతాయి.. గడ్డి తిన్నట్టే వుంటాయి.. ''కస కస కంకి నమిలిపారేస్తూ అన్నాడు ఒకడు..

''మీ ఊరి కంకుల తింటానికయినా మళ్ళీ మళ్ళీ మీ ఊరు రావాలనిపిస్తుంది..'' మరొకరన్నారు.

''అరె రంగా చూడరా ఇంకా పది కంకుల ఇచ్చినా లాగిచ్చేట్లున్నాడు..''

''నువ్వు తినలేదారా..లేతగా వున్నాయి.. అంటూ ఆరు కంకులు .. ఉడుక్కున్నాడు రంగారావు అనబడు తినువాడు
''సరదాగా అన్నాంగాని నీకు తినాలనుంటే మరో రెండు తిను. మళ్ళీ ఇంత లేతగా తాజాగా ఎక్కడ దొరుకుతాయి..''

పంట మీద వున్న చిన్న చిన్న ఆశలను తుంచేసుకుంటూ.. కంకులను తెంచి తెస్తున్నారు తావుర్యా. శ్యామ్లాల్. గుండెల్లో నిప్పులు రగులతుండగా.. మరిన్ని చితుకులు రాజేస్తూ..'' జాన్కీ రామ్లాల్..కంకుల కాల్చిస్తున్నారు.

తమ స్వంత చేలో పండిన కంకులు పంచుకుంటునట్టే ఒకరికొకరు వేడి వేడి కంకులు కొసరి కొసరి ఇచ్చుకుంటున్నారు. కార్లల్లో వున్న ఆడవాల్లకు ఇచ్చి వస్తున్నారు. కస కస నముల్తూ జోకులు పేల్చుకుంటున్నారు. మొక్కల వరుసల మధ్య విచ్చల విడిగా తిరుగుతూ ఏనుగులు తొక్కిన చేనులా చేసారు.

అలా ఓ గంటా గంటన్నర జరిగిన ప్రహసనం తరువాత.. ఒక్కొక్కరు కార్లు బండ్లు ఎక్కసాగారు. హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు నీరసం కమ్ముకున్న తావుర్యా కుటుంబం.

మళ్ళీ దొర వాల్లతో ఏదో అనడం, వాల్లు కాస్త మెహమాట పడడం, ఏం మాట్టాడుకుంటున్నారో ఏమి చర్చ జరుగుతున్నదో అర్థం కావడం లేదు వాళ్ళకు. వాళ్ళల్లో కొందరు కార్లు దిగి దొరతో కలిసి మళ్ళీ వస్తూంటే.. పోనిలే ఇప్పటికయినా గరీబు గాని చేతిల నాలుగు పైసలు పెడదాం అని కొందరికైనా అనిపించింది అనుకున్న జాన్కి మనసు తేలిక పడింది. ఆశగా వాల్ల వంక చూసింది.

''అరె తావుర్యా జర నాలుగు కంకులు ఇరిసి కార్ల వెట్టరా.. మా వియ్యపురాలికి అడగనీకి మోగమాటం బడ్తాంది. అన్నాడు. బురువుగా అడుగులేసుకుంటూ వెళ్ళి మౌనంగా కోసి ఇచ్చాడు తావుర్యా. ఒకరి తరువాత ఒకరు మనిషికిన్ని కోయించుకుని శ్యామ్లాల్రామ్లాల్తో కారు డిక్కీ నిండా కంకులు పెట్టించుకున్నారు. వెళ్తూ వెళ్తూ.. ఏదో గుర్తుకు వచ్చిన వానిలాదొర వెనక్కు వచ్చి ఓ యభై నోటు తావుర్యా చేతిలో పెట్టాడు.

''అద్దు దొరా.. అద్దంటే అద్దు..'' చాలా మొండిగా అంటూ దొర చేతిలో పెట్టేసాడు తావుర్యా. కార్లన్నీ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపాయాయి. ఆ ధుమ్ము వల్లె అనుకుంటా.. జాన్కి కళ్ళల్లోనీరు చేనంతా చిందర వందరగా.. ఎక్కడ పడితే అక్కడ తిని పారేసిన కంకి బెండ్లు.. వాల్ల బూటు కాళ్ళ అడుగులు. చిన్న ముఖం చేసుకుని చూస్తున్న బుజ్జీని సమీపించి ''చెల్లే నువ్వు దింటవా నీకొకటి కాల్చిస్తా..'' చెల్లెలి వంక జాలిగా చూస్తూ అడిగాడు శ్యామ్.

''అద్దన్నా.. వాల్లు దినుడు జూసినంక నాకు మక్క కంకుల మీదనే లేకుండయ్యింది.. చేనంతా ఊర పందులు తొక్కిన నేల తీరయ్యింది..'' విరక్తిగా అన్నది. ఇంతలో..

''అన్నా అగ్గో మల్లా అచ్చినయి పాడు కోతులు. దా గా బట్టలు ఏసుకో.. కోతుల గొడదం దా.. '' గట్టిగా అరిచాడు శ్యామ్లాల్అన్నాడు.

''అద్దురా..! వాటిని ఆపకుండ్రి...తండ్రి మాటలకు ఆశ్చర్య పోతూనే ఇద్దరూ ఆగిపోయారు.

అంతే కోతులు స్వేచ్ఛగా విజృంభించాయి. అందిన కంకినల్లా అవి ఎడాపెడా కోసి తింటూంటే తావుర్యా విరాగిలా వాటిని చూస్తూ..

''అరె మనంబోయి గా అడవులన్ని నరికేస్తాంటే ఆకలికి ఆగలేకా పాపం అవి మన మీదవడుతున్నయి. ఇగ నుండి వాటిని కొట్టకుండ్రి. కడుపు నిండ తినిపోతయేగాని కార్లల్ల గట్కపోవు గదా..! అన్నాడు తావుర్యా.

* * *


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)