శీర్షికలు

సంగీత రంజని


మా సంగీత మార్గదర్శకులలో "వైణికులు" శ్రీ పుదుక్కోటై ఆర్. కృష్ణమూర్తిగారు

- యనమండ్ర శ్రీనివాస శర్మ


 

 

నేను 2011 వ సంవత్సరంలో తిరుపతిలో రాష్ట్రీయ విద్యాపీఠంలో పి.హెచ్.డి. చేస్తున్న సందర్భములో నాకు ఎదురుపడిన వైణిక గంధర్వులు శ్రీ పుదుక్కోటై కృష్ణమూర్తిగారు.

వీణావాదన తత్త్వజ్ఞః శ్రుతిజాతి విశారదః |
తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి ?? ||

అని యాజ్ఞవల్కి మహర్షి చెప్పిన విధంగా ఎవరైతే వీణావాదనంలో దాగి ఉన్న శ్రుతి-లయల రహస్యములను ప్రయాసపడకుండా తెలుసుకోగలుగుతారో వారే నాదయోగులు వారే ముక్తి అర్హులు. అటువంటి వారిలో శ్రీ కృష్ణమూర్తి గారు ఒకరు;. వీరు వీణావాదనంలోనే కాదు వీణను తయారుచేయడంలో కూడా గొప్ప అనుభవశాలి. నేను వీరివద్ద సంగీత సాధన చేయడానికి ముందు నా భార్య లలితాసరస్వతి వీణను అభ్యసించడానికి ఆశ్రయించింది. మేము తిరుపతికి వీణను కూడా తీసుకువెళ్లని కారణం చేత సాధనకోసం వీణని వారినే ఇమ్మని అడిగాము. అప్పుడు వారు మాకు ఒక వీణ ఇచ్చారు. అది - అద్వితీయమైన నాదసౌందర్యం గలవీణ. అలాగని అది క్రొత్తది కాదు. బాగా పగిలి చెడిపోయిన వీణను ఎవరివద్దనుంచో వీరు తీసుకుని దానికి క్రొత్త వీణలా బాగుచేసి మాకిచ్చారని తెలుసుకుని మేము అమితమైన ఆశ్చర్యమును పొందాము. అందువల్లే సంగీత విద్య కోసం ఎందరెందరో శిష్యులుగా వారిని ఆశ్రయించి గొప్ప కళాకారులుగా తయారవుతున్నారు.

వీరు పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారికి సంగీత విద్యాపరంగా గొప్ప సన్నిహితులు. వారితో సాన్నిహిత్యం వీణవల్ల ఏర్పడితే వారి సాన్నిహిత్యంలో వీరికి లభించిన అనర్ఘరత్నం వీరి శ్రీమతి పద్మా కృష్ణమూర్తి. వీరి చేతిలో వీణని ఆమె చేతిలోపెట్టి నాదాన్ని వీరు పలికిస్తూంటారు. వీరు పలికే నాదాన్ని ఆమెనుండి అలవోకగా పలికిస్తారు. వీరి అన్యోన్యత చంద్ర-చంద్రికల వలె గొప్పదని మాకు అనిపిస్తూంటుంది.

అటువంటి వీరివద్ద మేమిద్దరం నాదవిద్యను అభ్యసించడం జన్మ సాఫ్లల్యమునకు నిదర్శనమని నా భావన. వీరు తమిళనాడులో మరియు కర్ణాటకలో పుట్టి పెరిగి ఇటు వైణికులుగా అటు గాయకులుగా మన ఆంధ్రదేశమున " ఎ టాప్ " గ్రేడ్ విద్వాంసులుగా ఉండడం ఆంధ్రరాష్ట్ర సౌభాగ్యం.

శ్రీ కృష్ణమూర్తి గారు వీణాగాన విద్యను వారి తాతముత్తాతల నుండి ఆస్తిగా తెచ్చుకోలేదు. వారి తండ్రిగారు కూడా మైసూరు రాజావారి ఆస్థానంలొ వాహనచోదకునిగా పనిచేసేవారట. వారు వీరిని ఆ ఆస్థాన వైణిక విద్వాంసుల వద్ద చేర్పిస్తే తండ్రిగారి ప్రార్ధన మేరకు వీరిని విద్వాంసులు తీర్చిదిద్దారు. ఆశ్చర్యమేమంటే వీరి వీణావాదన వైదుష్యాన్ని చూసేవారికి వీరి గురించి వెనుక చెప్పిన విషయాలన్నీ అసంభవములని అనిపిస్తాయి. "ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః" అని కాళిదాసు మహాకవి కుమారసంభవ కావ్యంలో వివరించినట్లు పూర్వజన్మలో వీరు సాధించిన సంగీత విద్యా వైదుష్యం వీరిని వెతుక్కుంటూ వచ్చిందనడం తప్ప మరెవ్వరూ ఇంకేమీ అనలేరు.

వీరి ప్రత్యేకతలలో మరొకటేమిటంటే వీరు గానం చేస్తూ వీణ వాయించడం. ఒక నొటేషన్ ని ఆధారంగా చేసుకుని రాగాలాపన గాని కృతిగాని వాయిస్తూ పాడుతూంటే బింబ-ప్రతిబింబముల కదలికల వంటి పర్ ఫెక్షన్ స్పష్టంగా కనిపిస్తూంటుంది. సాధారణంగా వారికి ఉన్న శ్రుతిలోనే కాక వీణకి సంబంధించిన మూడు శ్రుతులో కూడా అన్ని స్థాయిసంచారములు వీరు అలవోకా చేయగలరు.

శ్రీ కృష్ణమూర్తి గారు మంచి వ్యక్తిత్వ వికాసం గల సజ్జనులు. సంగీత వాణ్మయంలో ఎన్నో సూక్ష్మ విషయములు తెలిసినా సందర్భోచితం కాకుండా ఏ విషయాన్నీ బయటకు వ్యక్తం చేయరు. ఇది వారి నిరహంకార స్థితిని సూచిస్తుంది. అందుకే వారు పిల్లలతో కూడా పిల్లవానిగా కలిసిపోయి చాలా వినోదభరితంగా ప్రవర్తిస్తారు;.

అలాగే మంచి జిజ్ఞాసువులాగ ప్రవర్తించే వినయశీలి. నేను ముత్తుస్వామి దీక్షితుల కృతులపై సంస్కృత వ్యాఖ్య చేస్తున్నానని వారితో చెబుతే ఎంతో ఆనందించి సమయాన్ని లెక్కచేయకుండా చాలాసేపు నా వివరణని వింటుంటే "విద్యా వినయేన శోభతే" అనే మాటకి అర్ధం ఇదే అని నాకు అనిపిస్తుంది.\

ఇంతటి గొప్ప సంస్కారము దానికి తగిన వ్యక్తిత్వము దానివల్ల పండిన అనుభవము వీటితో ప్రకాశించే వీణాగాన విద్యా ప్రతిభ కలిగిన ఈ మహావిద్వాంసులను విద్యార్ధులు వినియోగించుకున్నట్లుగా లోకం వినియోగించుకోవడం లేదని అనిపిస్తుంది. మంచి సంగీత సంస్థలు వీరిని ఆదరిస్తూ వినియోగించుకుంటె విలువైన ఈ విద్య లోకంలో ప్రకాశిస్తుంది.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)