కథా భారతి

అనగనగా ఓ కథ

కలల పంట

- అందే గోపాలకృష్ణమూర్తి

"రామయ్యా! "

ఆనందమూర్తి పిలుపు విని ఒక్క పరుగులో వచ్చి వినయంగా నిల్చున్నాడు రామయ్య.

"మధ్యాహ్నం రిషిబాబొస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే టెలిగ్రామొచ్చింది. పదిన్నరనుంచీ కారుని బస్ స్టాండులో ఉంచమని డ్రైవరు రాగానే చెప్పు. నువ్వేమో అబ్బాయి రూమ్ శుభ్రంగా క్లీన్ చేసుంచు. "

"అలాగే బాబూ!"

"బెడ్ షీట్లన్నీ మార్చు. స్టీరియో సెట్ గాడ్రేజ్ అల్మారాలో లాక్ చేసుంది. అమ్మగారి కీ బంచ్ లో తాళముంది. తీసుకుని, రిషిబాబు రూమ్ లో అన్నీ అరేంజ్ చెయ్యి."

"అయ్య.."

"బాబుకి చక్రపొంగలి ఇష్టం. అది చెయ్యమని చెప్పు. జీడిపప్పు, ఫ్రై చేయిమ్చు. తర్వాత ఫ్రిజ్ లో బీర్ బాటిల్స్ తీసేసి, నా అల్మారాలో పెట్టు. ఇంట్లో ఎక్కడా ఖాళీ బాటిల్సు ఉండనీయక! రిషీకి గోల్డ్ స్పాట్ ఇష్టం. ఫ్రిజ్ లో ఓ కేసు పెట్టించు..ఓ.కే?..."

"అలాగేనయ్యా.. ! రిషిబాబు కిందటి దీపావళికొచ్చేరు, మళ్ళీ ఇప్పుడొస్తున్నారు ఈ ఆర్నెల్లలోనూ ఎలా మారిపోయారో ఏవిటో!!..."

"రిషీకేం... సైనిక్ స్కూలా, మరే మైనానా? మాంచి డిసిప్లిన్ అబ్బుతుంది. రన్నింగ్, జంపింగ్, హార్స్ రైడింగ్ ఒకటేమిటి, చదువుతోపాటు అన్నీ నేర్పుతారక్కడ "

"అయ్యగారూ, అబ్బాయిగార్ని ఇక్కడే చదివించకూడదా బాబూ? అక్కడ చదివినోళంతా సైన్యంలోకో, ఓడమీదకో, విమానంలోకో వెళ్ళిపోవాలంట! ఎంత పెద్ద ఉద్యోగమైనా ప్రాణంతో చెలగాటం కద బాబూ!..."
రామయ్య కంఠంలో అత్మీయత వణికింది.

"రామయ్యా! మ గా డి వి నువ్వే ఇలాంటి పిరికిమాటలు మాట్లాడ్తే ఎలా? అందరూ నీలాగా, నాలాగా చూరుని పట్టుకు వేళాడితే సైన్యంలొ కెళ్ళేదెవరు? ఓడలూ, విమానాలూ నడిపేదెవరు. ?
చిన్నప్పట్నుంచి ధైర్య సాహసాలున్నట్లయితే..."

"కాదు.. బాబూ, ఒక్కగానొక్క కొడుకు, ఆ బాబుని అలా సైన్యంలోకి పంపేస్తే..."

"ఏమౌతుంది? అవసరమొస్తే హీరోలా ఫైట్ చేస్తాడు రిషిబాబు. ఇంకా అవసరమొస్తే హీరోలానే దేశంకోసం ప్రాణాలిచ్చేస్తాడు. అంతకంటే కావల్సిందేముంది? నువ్వూ నేనూ బతికుండి ఏం సాధించేం రామయ్యా! పొద్దున్నే లేచి, ఇక్కడ నీకు చాకిరీ, నువ్వూ, నేనూ, ఆ రోడ్డుమీద కిళ్ళీ బడ్డీ అబ్బాయీ ఇంకా మనలాంటి అందరూ రెండుపూట్లా ఎలా తిందామా, డబ్బూ దస్కం ఎలా వెనకేద్దామా అనే బ్ర్హాంతిలోపడి మన కనీస ధర్మాల్ని మర్చిపోతున్నాం. మన దేశం గురించి అటుంచి, కనీసం సంఘం గురించి అయినా ఆలోచించడమే లేదు. అందుకే ఈ వాతావరణంలో ఉంటే రిషి బాబు కూడా మనలాగే స్వార్ధపు వలలో పడిపోతాడనే భయంతో అక్కడికి పంపించేసాను. అక్కడ రిషిబాబు అన్నింటిలోనూ ఫస్ట్! హి విల్ బికమ్ ఏ హీరో! గో ఎహెడ్! నీకు చెప్పిన పనులన్నీ అర్జెంటుగా చెయ్!"

"తప్పకుండా బాబూ! రిషిబాబంటే మీకే కాదు. మా అందరికీ కూడా ప్రాణం! అందుకే మాకీ తాపత్రయం. బాబొస్తే ఎంత హడావుడి, ఎంత సందడి! కోపం మాత్రం ముక్కు మీదుంటుంది. సైన్యంలోకెళితే, కోపమొస్తే టుపుక్కున అందర్నీ కాల్చేస్తారేమో రిషిబాబు - చిన్నప్పటి దీపావళి తుపాకీ అనుకుని "

"అలాంటి కోపాలు, తాపాలు అన్నీ మాయమైపోతయ్ రామయ్యా అక్కడి చదువుమూలంగాను! మంచి డిసిప్లిన్, మేనర్సూ అలవాటవుతై. అదేకదా మనకి కావల్సింది. చిన్నప్పట్నుంచి డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ - "

"అవును బాబూ.."

"డిసిప్లిన్ద్ గా పిల్లల్ని ఇళ్ళదగ్గర తల్లిదండ్రులు పెంచలేరు. ముద్దూ, గారం ఎక్కువైపోయి పిల్లలు సర్వసాధారణంగా పాడైపోతుంటారు. రెండేళ్ళప్పట్నుంచి రిషిబాబు అమ్మగార్ని తంతా జాగ్రత్త.. అంటూ ఇష్టమొచ్చినట్టు రక్కేస్తుండేవాడు. అ మ్మ గా రు ఆ మాటలు వింటూ బాబుని మరీ ముద్దు చేస్తుండేది. తర్వాత్తర్వాత రిషి నా మాట కూడా లక్ష్యపెట్టేవాడు కాదు. నా మాటె లెక్కపెట్టనివాడు తల్లిమాట వింటాడా? ఇక తల్లిమాట వినే ప్రసక్తే లేదు! మరీ అల్లరి చేసినప్పుడు నేను కోప్పడితే తాతగారింటికి పారిపోతానని బెదిరించి అలిగేవాడు. తాతగారింట్లో రిషికి మరీ గారం. అక్కడ బాబు ఒంటిమీద ఈగనైనావాలనివ్వరు! అసలు బాబు పాదాల్ని నేలమీదే పెట్టనీయరు. ఇప్పుడైనా చూడు.. రా గా నే ఓ రెండ్రోజులు ఆ స్టీరియో ముందు రికార్దులేసుకుని కుర్చుంటాడు. తర్వాత బోరుకొట్టేసుందిక్కడ అని రాజమండ్రి పారిపోతానంటాడు. మనెవ్వరి మాటమీదా గురిలేదు. వాళ్ళ నాన్నమ్మా, తాతగారూను!. ఇద్దర్లోనూ మళ్ళీ నాన్నమ్మ ఉంటె చాలు, ఇంకెవ్వరూ పనికిరారు. ఇలా అతిగా గారాబంచేస్తే పెంకిదనం పెరిగిపోతుందని బాబుమీద ప్రేమని మనసులోనే దాచుకుని అందరి ఇష్టానికి ఎగెనెస్ట్ గా అక్కడికి పంపించేశాను. మరేం పర్లేదు. రిషిబాబు బ్రహ్మాండంగా చదువుకుంటాడక్కడ. ఊ..నువ్వు అర్జెంట్ గా పనులు చూస్కో! రిషి గురించైతే నేను గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటాను."

"అదికాదు బాబూ, పోనీ నాన్నమ్మ గరి మాట వింటాడు గదా రిషిబాబు. అక్కడే ఉంచి చదివించకుడదా బాబూ! అప్పుడప్పుడు ఇక్కడికి రావడానికి.."

"లేదు రామయ్యా, నాఅకు పిరికిమాత్రలు వేయబోకు! రిషిబాబుని ఒక మహత్తరమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే మన దగ్గర తను పెరగకూడదు. ఫరెగ్జాంపుల్..."

"అయ్యా!..."

* * *

"చీర్స్ బాస్, ఫర్ ద హెల్త్ ఆఫ్ మాస్టర్ రిషీ ఆన్ హిజ్ బర్త్ డే!"

"చీర్స్" మిత్రులంతా స్క్రాచ్ గ్లాసుల్ని 'టక టక' లాడించేరు."‘స్టీరియో" లోంచి ‘డారిస్ డే’ పాటలు వినబడుతున్నై.
"డాడీ.. నాకో!" గ్లాసు పట్టుకుని పరిగెట్టుకొచ్చేడు పుట్టిన్రోజు పెళ్ళికొడుకు ముడేళ్ళ రిషి.

"నో మై లవ్..! నువ్వు తాకూడదు. ఏదీ, బర్త్ డే కిస్ మరోటియ్యి... ఊ... దట్సిట్ ..., మరి మమ్మీ ముద్దూ... ఆ...ఈ బుగ్గ మీద...ఊ ...గుడ్... ఇప్పుడు డాడీ ముద్దు...?...య్యా... రిషీ ఈజ్ ఏ గుడ్ బాయ్... గో..గోటు మమ్మీ, మమ్మీ దగ్గరికెళ్ళి..."

డాడీ, అది కావాలి...కొంచెం..."

"ఛీ నాన్నా! ఆ ఉండు నీకు గోల్డ్ స్పాట్ ఇస్తా. సరేనా? దా, ఇలా కూర్చో,...ఏయ్, సన్యాసీ...రిషిబాబు కో గోల్డ్ స్పాట్ అర్జెంట్ గా పట్రా! " రిషిని ఒళ్ళొ కూర్చోబెట్టుకున్నాడు ఆనందమూర్తి. పనిపిల్ల తెచ్చిన గోల్డ్ స్పాట్ ని సగానికి పోసి, గ్లాసుని రిషికి అందించాడు.

"చీర్స్ రిషీ!" అంటూ రిషి గ్లాసుకి అందరూ గ్లాసుల్ని తగిలించారు.

"ఓ ఫర్ ద హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ మై లవింగ్, లవింగ్ రిషి!" ఆనందమూర్తి గ్లాసుని 'సిప్' చేసేడు.

"ఇది మరీ బావుంది, వాదికిలానే అలవాటు చేయండి. కమాన్ రిషీ, కమియర్, డాడీ ఈజ్ నాట్ గుడ్. ఐసే, కమాన్ రిషి..!"... ఎదురుగా చక్రాల్లంటి పెద్ద కళ్ళను తిప్పుతూ ‘కృష్ణ’ - ఆనందముర్తి ఇంటి దీపం, అతని కలల పంట దైవం!

"కిట్టూ, రిషిబాబు గోల్డ్ స్పాట్ తీసుకుంటున్నాడు. అంతే! చినపిల్లాడుగా ఇవేమీ వాడికి అర్ధమవవులే. కాస్త ఊహ వచ్చేక ఇలా కూర్చోబెట్టుకోనుగా! అదీకాక, ఇది రిషి బర్త్ డే పార్టీ, ఊ ...ప్లీజ్.!"

ఆనందమూర్తి నోటి నుంచి' ప్లీజ్!' అన్న పదం వింటే కృష్ణ మరింకేమీ మాట్లడదు. ఆమె అతని ప్రాణం! అతను ఆమె సర్వస్వం! ఆమె నోటి నుండి 'ప్లీజ్ డోంట్ టచ్ ద డ్రింక్' అని అతను వింటే, ఆ క్షణాన్నే ఆ పార్టీ కేన్సిలయిపోతుంది. అతనేం చేసినా ఆమె అడ్డు చెప్పదు. అందుకే, ఏ పనికైనా స్రే, ఆమె అంగీకారన్నతడు అభ్యర్ధిస్తాడు. ఆ త నూ - ఆ మె - వాళ్ళ కలలపంట రిషీ!... ఇదే వాళ్ళ సంసారం. ఇదే వాళ్ళ సర్వస్వం. ఇదే వాళ్ళ స్వర్గం!

స్టీరియో గ్రామ్ నుం చి 'డారిస్టే' ఫేమస్ సాంగ్; "కేసరా-సరా, వాటెవర్ విల్ బీ - విల్ బీ; ద ఫ్యూచర్ - ఈజ్ నాట్ - అవర్స్ టు సీ - కేసరా - సరా; వాటెవర్ విల్ బీ, విల్ బీ,!"ప్రారంభమైంది.

"హో ఈ పాటనే గదా, ఏదో సినిమాలో మన భానుమతి కూడా పాడుతుంది? " ఓ మిత్రుడు ప్రశ్నించేదు.

"ఔనండి. మా రిషీ ఫేవ్రెట్ పాటిది. అస్తమానం అదే పెట్టమంటాదు.".. కృష్ణ సమాధానమిచ్చింది.

"అమ్మయ్య, థాంక్స్ టు - 'డోరిస్ డే' - టాపిక్ మారినందుకు మనసులోనే అనుకున్నాడు ఆనందమూర్తి.

అంతలోనే అరగ్లాసు గోల్డ్ స్పాట్ ని అదేపనిగా కొట్టేసిన రిషి మళ్ళీ ఖాళీ సీసాను పట్టుకుని డాడీ నాకు గోల్డ్ స్పాట్ ఇంకొద్దు. అదికావాలి!" అంటూ టేబుల్ మధ్యనున్న'రాయల్ శాల్యూట్' విస్కీ బాటిల్ చూపించాదు.

"ఛప్ అది విషం నాన్నా, నువు తాక్కూడదు."

"మరి డాడీ, నువ్వెందుకు తాగుతున్నావ్ విషాన్ని?"

"ఇవేళ నీ పుట్టిన్రోజు కదా, నా ఫ్రెండ్సొచ్చారుగా పార్టీకి, అందుకూ!"

"నా పుట్టిన్రోజు గనక నేనూ విషం తాగుతా, డాడీ!"

"షటప్ రిషీ, నువ్వు లోపలికి పో!" కసిరేడు ఆనందమూర్తి.

"మమ్మీ!..." అంటూ గ్లాసు క్రిందకి విసిరికొట్టి, "డాడీ తిట్టేసేరు" అని ఏడుస్తూ 'మమ్మీ' దగ్గరకు పరుగెత్తేడు రిషి. "లేదు నాన్నా రా... డాడీ జట్టు పచ్చి..." అంటూ రిషి బుగ్గల మీద ముద్దుల్ని గుమ్మరిస్తూ లోపలికి తీసుకుపోయింది కృష్ణ.

"హో, యార్, యూ ఆర్ లక్కీ! మీ శ్రీమతి గారు నిజంగా సీతమ్మలాంటి వారు-"

"నో..నో..నో.. ఆవిడ్ని సీతమ్మతో పోల్చకండి. ఎందుకంటె, సీతమ్మ పడిన కష్టాల్లో ఒకటి కూడా లేకుండా నా కృష్ణని పువ్వుల్లో పెట్టి అపురూపంగా చుసుకునే శక్తి నాలో ఉంది. అలనాతి శ్రీరాముడు అమాయకుడు. అందుకే దేవుడై కూర్చున్నాడు. నేను చాలా గడుసరివాణ్ణి. అందుకే ఆనందమూర్తి నయ్యి ఇలా వెలిసేను!"

అందరూ ఆనందంగా నవ్వేరు. "కమాన్, గో ఎహెడ్ విత్ యువర్ డ్రింక్స్ ప్లీజ్!"ఖాళీ అయిన గ్లాసుల్లో విస్కీ నింపేడు ఆనందమూర్తి.

* * *

"అలాగ, పిల్లలకి పెంకిదనం ఎక్కువై పోతుంది. అందుకే.."

"ఔను బాబు, ఒక విధంగా తవరు చేసిందే రైటు. రిషిబాబంటే తమకెంత ప్రేమో మాకు తెలిందేముంది?
సరే బాబు.. కొంచెం డబ్బూ, బాబుగారి గది తాళాలు ఇప్పించండి... ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను."

"అమ్మగారి దగ్గరున్నాయని చెప్పానుగా తీస్కో. ప్రతి చిన్న విషయానికి నన్నడక్క!..."

"చిత్రం బాబూ! "వినయంగా లోపలి కెళ్ళిపోయాదు రామయ్య.

తూర్పు దిక్కు నుండి ఏడు గుర్రాల రథం మీద ఆకాశపు టెత్తులకు ఎగబ్రాకే ప్రయత్నం చేస్తున్న బాలభానుని కిటికీలోంచి చుస్తూ, రిషిబాబు భవిష్యత్తును తీర్చిదిద్దే ఊహల్లో నిమగ్నమైపోయాదు ఆనందమూర్తి.

* * *

మెల్లగా గది తలుపు తెరిచాడు రామయ్య. అమ్మగారంటే అతనికి విపరీతమిఅన్ భక్తి, గౌరవమూను. ఆమెకు ఎదురుగా అతను మామూలుగా నిల్చోలేడు. ఓ దేవతను చుస్తున్న అనుభూతితో కంపించిపోతుంటాడు. అమ్మగారు మాత్రం రామయ్యను ఎన్నడూ, ఏవీ పల్లెత్తుమాట కూడా అనరు. అతను అతి నమ్మకస్థుడనీ, స్వామిద్రోహి ఏమాత్రం కాడని ఆమెకు బాగా తెలుసు!

"అమ్మగారూ!" వినీ విన్పించనట్టు రామయ్య కంఠం.

లోపల అగరువత్త్తుల సుగంధం... దైవ ప్రార్ధన జరుగుతున్నట్లు నిశ్శబ్దం.

ఎదురుగా బల్లమీద వెలుగుతున్న దీపం...

మెల్లగా చుట్టూ కలయజూశాడు రామయ్య. ప్రక్కనె, డ్రెస్సింగ్ టేబుల్ మిద, టాయిలెట్ సామానూ, ఆ ప్రక్కన బంగారు ఆభరణాలూ; వాటి వెనుక వజ్రాల నెక్లెస్, రవ్వల దుద్దులు, రిస్ట్ వాచీ...

అద్దాల బీరువాకు వ్రేళ్ళాడుతున్న తాళాలు, హేంగర్స్ కు తగిలించిన పట్టుచీరలూ, నైట్ గౌన్సూ, బెడ్ మీద రిషి బాబు కోసం సగం అల్లిన వూల్ స్వెట్టరూ, బెడ్ ప్రక్క టెబుల్ మీద అయ్యగారూ, అమ్మగారూ తాజమహల్ ముందు తీయించుకున్న రంగుల పోటో, దాని ప్రక్కన ఫోటో ఫ్రేం లో రిషిబాబు పుట్టిన్రోజు పోటో...

"అమ్మా ! బీరువా తాళాలూ, రిషి బాబు గది తాళాలూ...అయ్యగారు...తమర్ని అడిగి.....తీసుకోమన్నారు, తీసుకెళ్ళమంటారా? ..." రమయ్య కంఠంలో భక్తితో కూడిన వణుకు.

"వేరే చెప్పాలా తీస్కో రామయ్య !" అని ఆమె అంగీకరించినట్టుగా ఎనిమిది సంవత్సరాలు పాతపడిన అమ్మగారి చిత్తరువుమీద వ్రేలాడుతున్న పూలదండ, బొటబొటా రాల్తున్న రామయ్య కన్నీటిబొట్ల మీద ‘టప్’ మని జారిపడింది.

* * *

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)