సారస్వతం

ఉగాది సారస్వతం

- సన్యాసి (శాక్రమెంటో); సేకరణ: కాశీవఝుల శారద

(కాలిఫోర్నియా తెలుగుసమితి, తెలుగువాణి పత్రిక సౌజన్యంతో)

మన్మథ నామ సంవత్సరం, జయ నామ సంవత్సరాన్ని వెనక్కి నెట్టి మన ముందు అడుగు పెడుతోంది. ప్రభవాది అరవై సంవత్సరాల లో 29 వ స్థానాన్ని అలంకరించిన మన్మథ నామ సంవత్సరానికి ఏ ఋషి నామకరణం చేసేడో తెలియదు కానీ మన్మథ నామం అందరికి పరిచితం, ప్రియం కూడా. మన్మథుడి గురించి పురాణేతిహాసాలలో కథలూ కట్టుకథలూ ఎన్నో ఉన్నాయి.

ఒక అందమైన జంటని చూసినప్పుడు "రతీమన్మథుల్లా" ఉన్నారని పొగుడుతారు. శివుడి ఫాల నేత్రాగ్నిలో దగ్ధమైన మన్మథుడు చివరకి అశరీరుడుగా మిగిలినా అతనికి చిలకల రథం ఉందని, చెరకు విల్లూ, పూల బాణాలూ ఉన్నాయని వర్ణిస్తారు. రతీ మన్మథులను శృంగార ప్రతీకగా మలిచిన శాస్త్రం మన్మథుడికి ఒక సంవత్సరం కేటాయించింది.

లౌకికంగా చూస్తే “ఉగాది” అనగానే మనకి మన సంప్రదాయ బద్దమైన పండగే గుర్తుకి వస్తుంది. ముఖ్యంగా, ద్వారాలకు లేత మామిడాకుల తోరణాలు కట్టడం, ప్రొద్దున్నే నూనెతో తలంటి నలుగు పెట్టిన స్నానాలు, కొత్త బట్టలు కట్టుకోవడం, ఉగాది పచ్చడి, పోలిపూర్ణం బూరెలు, చద్ది అన్నం, బొబ్బట్లు, పంచాంగ శ్రవణాలు, కవితా గోష్టులు, సంగీత కచ్చేరీలు, ఈ సమస్తమూ గుర్తుకి వస్త్తాయి.

కానీ లోతుగా గమనిస్తే, మన్మథ నామ సంవత్సరం వెనక ఎంతో అర్ధమున్నది. మనస్సుని మధించేది మన్మథ.. ఏదది?. జ్ఞానం. మనస్సుతో సహా ప్రాణం, ఇంద్రియాలు అన్నీ కూడా జ్ఞానం ఉంటేనే పని చేస్తాయని కేనోపనిషత్తు ఘోషిస్తోంది. ఇటు బంధానికి గాని అటు మోక్షానికి గాని మనస్సే మార్గం చూపుతుంది .అవసరం కూడా. అందుకే మన మనస్సుని మధించి అటు మళ్లించండిరా అని హెచ్చరించడానికేనేమో ఈ మన్మథ నామ వత్సరం మన ముందుకి రావడం!

ఇంకా ఉగాది పచ్చడి గురించి ఎన్నో అర్ధాలు, విశ్లేషణలు చెప్పుకుంటూ ఉంటాం. ఆ పచ్చడిలోని వేప చేదు ధుఃఖానికి, బెల్లం తీపి సుఖానికి, పచ్చిమిరప క్రోధానికి, చిగురు మామిడి ఆశకీ /ఆశ్చర్యానికీ, పులుపు జుగుప్సకీ / ఏవగింపుకీ, పసుపు శ్రేయస్సుకీ ఇలా అర్ధాలు చెప్పుకుంటూ పోతారు పెద్దలు. దీంట్లో అంతరార్థం ఏమిటంటే, మనలోనే అంతర్యంగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనీ ఈ షడ్రుచుల్లాగా కలిపి తినేయమని అంటే జయించమని సంకేతం. అంతే గాని ఎదో లాంఛనంగా, లౌకికంగా, ఆరగించమని కాదు.

ప్రతి ఏడూ, ఉగాది చైత్ర శుక్ల (శుద్ద) పాడ్యమితో ప్రారంభం అవుతుంది. వసంతానికి స్వాగతం పలుకుతున్నదన్నమాట. వసంత ఋతువులో మన చుట్టూ వున్న భూమీ, చెట్టూ, చేమా, సమస్తం పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. పాడీ, పంటా సమృద్ధిగా పండుతాయి. అది మనకి ఆహ్లాదకరం. ఆనంద దాయకం కూడా.

ఇలాంటి మధురమైన మనోన్మథనం శాంతికి నోచుకోని మానవాళికి ఈ సంవత్సరంలో చాలా అవసరం. మనమంతా ఈ మన్మథ నామ వత్సర ఉగాదిని లాంఛనముగా స్వాగతిద్దాం!మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)