ధారావాహికలు

రామ నామ రుచి

 

(గత మాసం తరువాయి)

 

3. దేవాలయ దుస్థితి

తే.గీ. గుడిని చూడంగ నాలో నిగూఢమైన
చిన్ననాటి స్మృతు లెగసి చిందులేసె,
అంత చెలికానితో ఆలయంబులోన
కాలుబెట్టినాడ నొడలు గగురుపొడువ.

ఉ||. భక్తులు లేక దేవళము బావురుమం చగుపించె తారకా
త్యక్త నభమ్మువోలె; విననైతిని రింగున మ్రోగు గంటలున్,
ప్రాక్తన వేదమంత్రములు, బంధురరీతిని వైదికార్చనల్
ప్రోక్తములై వినంబడవు, పూర్వ మహస్సు కనంగ లేదటన్.

కం.|| “పూజారైనం గలడా,
బేజారై పారి గుడిని వీడినొ" అని నే
నాజి నిలిచి యడుగ హితుం
డా జాడను మసలువాని నార్తింజూపెన్.

ఉ||. అంతట గాంచినా నచట - ఆలయ మండపమందు నుండి మా
చెంతకు వచ్చు నొక్కని, విశీర్ణ శరీరుని, ఊర్ధ్వపుండ్ర భా
మంతుని, శోణవర్ణ సుషమా పరిధాన సమావృతున్, జరో
పాంతుని, నిర్మలాస్యుని నవారిత తోషకు దేవళార్చకున్.

తే.గీ.|| వచ్చుచున్నట్టి పూజారి వదనమందు
భక్తి తోడను రక్తియు వఱలుచుండె;
ఇంతదనుకను నీ యూర నెక్కడైన
కాంచి యుండనట్టి ప్రశాంతి కానిపించె.

తే.గీ||. అంత, "శ్రీరామ! నీ నామ మెంతరుచిర!
ఎంత రుచిర! ఏమీ రుచిర! ఎంత రుచిర!"
అనుచు తనలోన తానిట్లు గొణుగుకొనుచు
అల్లనల్లన మము జేరె నర్చకుండు.

కం||. ఆ పూజారిని చూడగ
నే పరవశత దరికేగి నెగసిన ప్రీతిన్
బాపని క్షేమం బడిగితి -
పాప మతడు నన్ను గుర్తు పట్టగలేమిన్.

ఉ||. దగ్గఱ చేరి మా కతడు దండ మొనర్చుచు, ఈయనెవ్వరం
చగ్గలికంబుతోడ కనులార్పక నాదెస చూడ - వానికిన్
దిగ్గన మ్రొక్కి స్నేహితుడు తెల్పెను నా వివరంబు లన్ని - ఆ
వగ్గు ముఖంబు స్నిగ్ధమయి పాతరలాడ నిగూఢ చక్షువుల్.

తే.గీ||. కొన్ని క్షణములు యోజించి కొంత ఎఱుక
స్మృతి పథంబున మెఱయంగ చేరి నన్ను
కౌగలించుకొనుచు గొంతు మూగవోవ,
నిండుకొన్న నేత్రాల కన్నీరు కారు.

తే.గీ.|| కొంత సేపు పరిష్వంగ శాంతి నొంది,
కోల్కొని తిరిగి వీక్షించి కుశలమడిగి,
సతిని రమ్మని పిలిచి సంగతిని తెలిపి,
నన్ను జ్ఞప్తి చేయించె సంతసము తోడ.

కం.|| "అతిముఖ్యులైన వారీ
అతిథులు - ఊహించనటుల నరుదెంచిన స్నే
హుతులగుటన్ పెట్టగదవె
అతివా! రాముని ప్రసాద మానందముతో"

ఒక్క ప్రక్కను గరుడుని ఱెక్క విఱిగె,
రాము డూరేగు పల్లకీ వ్రక్కవాఱె,
గర్భగుడి తలుపుల కొయ్యగడియ లూడె
ద్వారపాలకు డొక్కడు వార కొరిగె.

చం.|| అనుచును భార్యనంపి, ప్రియమారగ మా దెస జూచి, "మీరు దే
వుని గుడిలో నొకింత నిలువుండ"ని మమ్ముల బంపె రామ ల
క్ష్మణ జనకాత్మజాత హనుమ త్సహితమ్మగు దివ్యదేవళం
బునకు - మదీయ చిత్తము ప్రమోదముతోడను పొంగిపొర్లగన్.

తే.గీ. ||కాని దేవళమును చూడగ నెదలొన
కలతరేగె, కాళ్ళు వణకె, గళము రుద్ధ
మయ్యె, నోట నాలుక తడి యారిపోయె,
కళ్ళు చెమరించి కన్నీళ్ళు వెళ్ళగ్రక్కె.

తే.గీ. ||పాడుపడి యుండె నా గుడి గోడలెల్ల,
గోపురమ్మున ప్రతిమలు రూపుమాసె,
అతుకులూడి ధ్వజస్తంభ మచ్చటచట
తుప్పు పట్టె, మండపము పైకప్పు విచ్చె.

తే.గీ. ||ఒక్క ప్రక్కను గరుడుని ఱెక్క విఱిగె,
రాము డూరేగు పల్లకీ వ్రక్కవాఱె,
గర్భగుడి తలుపుల కొయ్యగడియ లూడె
ద్వారపాలకు డొక్కడు వార కొరిగె.

ఉ.|| ధ్వాంతములోని గర్భగుడి తల్పులు మెల్లగ త్రోసికొంచు మే
మంతట లోనికేగితిమి - అచ్చెరువయ్యెను నాకు జూడ - ఉ
న్నంతటి లోన గర్భగుడి యంతయు చక్కగ తీర్చిదిద్ది న
ట్లెంతయొ ముద్దులొల్కుచును హృద్యముగా కనుపట్టె దెసల్.

తే.గీ.|| నలువుగా ముగ్గుతో నొప్పె నాపరాళ్ళు,
ప్రమిద లందున దీపాలు ప్రజ్వలించె,
విగ్రహంబుల గళముల పెద్ద పూల
దండ లొప్పుగా వ్రేలాడుచుండె నపుడు.

తే.గీ.|| తేరి పరికించి నేనంత తెల్లబోతి,
అమ్మవారికి గాని అయ్యలకు గాని,
బంటు హనుమంతునకు గాని వలయు రీతి
మంచి బట్టలు కఱవయ్యె నెంచిచూడ.

ఆ.వె. || ముందుకు నూలుతోడ ముదురు రంగుల తోడ
నలిగియుండిన వసనములెగాని
రామ లక్ష్మణులకు రాజసం బీనెడు
పట్టుబట్ట లేవి కట్టలేదు.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)