కబుర్లు

సత్యమేవ జయతే!

స్వచ్ఛ భారత్!

 

- సత్యం మందపాటి

ఈ సంవత్సరం మొదట్లో, అంటే 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇండియాలో నాలుగు రాష్ట్రాల్లో సరదాగా గడిపాం. ఒక పెళ్ళికి వెళ్లటం, నా కొత్త పుస్తకాలు రెండు ఆవిష్కరించటం, బంధుమిత్రులతో సమయం గడపటం మొదలైన వాటితో సహా, ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలకి కూడా వెళ్ళాం.

అప్పుడు పేపర్లలో, టీవీలోనూ ఎక్కువగా ప్రచారం జరిగినది, “స్వచ్ఛ భారత్” అనే కార్యక్రమం మీద.

అంటే దేశాన్ని పరిశుభ్రంగా వుంచమని చెబుతున్నారన్నమాట!

అవును, మరి మనకి దుమ్మూ, ధూళితో పాటు, రోడ్డు మీదా, ఇళ్ళ చుట్టూతా, షాపింగ్ సెంటర్ల దగ్గరా మరి చెత్త ఎక్కువగా కనపడుతుంది కదూ. అలాకాకుండా దేశాన్ని శుభ్రంగా వుంచమని మన ప్రధాని మోడీ మొదలుపెట్టిన కార్యక్రమమిది. మంచిదే. ఏవో కొన్ని వెనకపడిన దేశాలు మినహాయించి, మిగతా దేశాలని చూశాక, మనకి కొట్టవచ్చినట్టు భారతదేశంలో కనపడేది ఎక్కడ చూసినా చెత్తా, చెదారం. అందుకని ఇదేదో బాగానే వుంది అనుకున్నాను.

కానీ ఈ కార్యక్రమం జరుగుతున్న పద్ధతి చూస్తుంటే, మిగతా ప్రభుత్వ కార్యక్రమాల లాగానే, ఇది కూడా ఒక ఎండమావి అవుతుందేమో అని భయం వేసింది. అలా ఎందుకు అనుకున్నానో చెబుతాను.

***

1986లోనే ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ అనే కార్యక్రమం పల్లెల్ని పరిశుభ్రంగా వుంచటానికి ప్రారంభం అయింది. ప్రభుత్వం ఎంతో డబ్బు కేటాయించింది కానీ, అది ఇంకా ఆ పల్లెలకి చేరినట్టులేదు. మళ్ళీ 1999లో ఇదే కార్యక్రమానికి ‘Total Sanitation Campaign’ అని పేరు పెట్టి ఇంకొంత ధనం కేటాయించారు. అది టోటలుగానో, టోకుగానో ఎటు పోయిందో నాకు తెలీదు. మళ్ళీ 2012లో దీనికే ‘నిర్మల్ భారత అభియాన్’ అనే పేరు మార్చి, ఇంకా కొంత బడ్జట్ నైవేద్యం పెట్టారు. మళ్ళీ 2014 అక్టోబర్ రెండున, గాంధీ జయంతి రోజున, దీనికి మళ్ళీ ‘స్వచ్ఛ భారత్’ అని పేరు పెట్టి అరవై రెండు వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపు పది బిలియన్ డాలర్లు కేటాయించి, రాజఘాట్ దగ్గర మళ్ళీ ఇంకోసారి అంకురార్పణ చేసారు. ఈ కార్యక్రమాన్ని 2019 సంవత్సరంలో మళ్ళీ గాంధీ జయంతి రోజున (అది గాంధీగారి నూట యాభైవ పుట్టినరోజు) విజయవంతంగా పూర్తి చేయాలని, మన శ్రీ ప్రభుత్వం వారి కోరిక. సంకల్పం.

సంకల్పం చాలా మంచిదే. కాకపోతే ఈ ఆట మూడు ఇన్నింగ్సులసేపు దెబ్బతిని, ఇప్పుడు నాలుగో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసారయినా కబుర్లూ, కాకరకాయలూ, భోజనాలూ, చేతులు కడుక్కోవటాలూ మానేసి, సక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే అంతకన్నా కావలసింది లేదు. కానీ ఇప్పుడు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం జరుగుతున్న విధానం చూస్తుంటే ఎంతటి ఆశావాదులకైనా ఆ నమ్మకం కలగటం చాల కష్టం.

అది ఎలాగో వివరిస్తాను. చిత్తగించండి.

మోడీగారు ఢిల్లీలో ఎంతో శుభ్రంగా వున్న రోడ్డు మీద, చీపురు పట్టుకుని ఫొటోలూ, విడియోలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. మేమేం తక్కువ తినలేదని, ఆయన శిష్య బృందం కూడా చీపుర్లు కలిపారు. మరి మేమో అంటూ, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులూ, మంత్రులూ, తదితర చెమ్చాలూ కూడా చీపుర్లు కలిపారు. నేను ఇది ఇంత వ్యంగ్యంగా వ్రాయటానికి ఒక కారణం వుంది. విడియోల కోసం అతి శుభ్రంగా వున్న రోడ్ల మీద, మన నాయకులు చీపుర్లు పట్టుకుని నటించటం చూసి, నవ్వేవాళ్ళే ఎక్కువగా కనపడ్డారు. కొంతమంది పట్టుదలగల కార్యకర్తలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సేవకులు నిజంగానే రోడ్లు శుభ్రం చేయటం కూడా టీవీలో చూశాను. వారి గురించి ఇక్కడ చెప్పటం లేదు.

మన ముఖ్యమంత్రి చీపురు పట్టుకోగానే, ఒకే కంటి చూపుతో విలనుగాళ్ళని చంపేయగల ఒక తారడు, మిగతా కొందరు తారగాళ్ళు కూడా, శుభ్రంగా వున్న రోడ్లని ఇంకొంచెం శుభ్రం చేస్తూ, టీవీలో చేతిలో చీపుర్లు పట్టుకుని కనపడ్డారు.

శ్రీ ప్రభుత్వం వారు కొంతమంది ప్రముఖుల్ని, ఈ కార్యక్రమానికి రాయబారులుగా, ప్రచార కర్తలుగా ఎన్నుకున్నారు. వారిలో ప్రముఖులు అనిల్ అంబానీ, కమల్ హసన్, ప్రియంకా చోప్రా (ప్రియంకా గాంధీ కాదు), సచిన్ తెండూల్కర్ (శతకం శతకాల హీరో), సల్మాన్ ఖాన్ (అవును, అతనే), శశి కపూర్, మన ‘పాడుతా తీయగా’ బాలు, పవన్ కల్యాణ్ (అవును, అతనే), సౌరభ్ గంగూలీ, అమల (అవును, ఆవిడే), వివియస్ లక్ష్మణ్ (ఒకే ఇన్నింగ్సులో మూడొందల రన్స్ కొట్టగల ‘మన’వాడు) ప్లస్ ఎంతోమంది అభిమానులు వున్న ఇంకా కొందరు. ప్రముఖులు ప్రముఖంగా ప్రచారం చేస్తే, కనీసం వారి అభిమానులైనా దేశాన్ని తొందరగా శుభ్రం చేస్తారని వారి కోరిక, సంకల్పం అయి వుండవచ్చు.

సంకల్పం చాలా మంచిదే. కాకపొతే, ఈ కార్యక్రమం విడియోలతోనూ, ఫోటోలతోనూ ఆగకూడదు కదా మరి!
కానీ అత్యవసరంగా జరగవలసినవి ఏవీ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అదే నా ఆవేదన.

చేపలు తినాలనుకునే వాడికి ఒక ఈరోజు ఒక చేపని ఇస్తే, మళ్ళీ రేపు ఇంకో చేప కోసం వస్తాడు. అదే అతనికి చేపలు పట్టటం నేర్పిస్తే, అతను ఇక రాడు. తన కాళ్ళ మీద తనే నిలబడతాడు అని ఇంగ్లీషులో ఒక
సామెత వుంది. అలాగే ఈరోజు చీపుర్లతో ఫోటోలు దిగితే లాభం లేదు. మరి రేపు...?
ముందుగా చేయవలసినవి రెండు పనులు వున్నాయి. వాటి మీద ఇప్పటి దాకా, అంటే ఈ కార్యక్రమం మొదలు పెట్టిన ఐదు నెలలుగా, ఎక్కడా ఏ పనీ జరిగినట్టు కనపడలేదు. వినపడలేదు.

ఒకటి: చెత్తా, చెదారం – ఇళ్ళల్లో నించీ, షాపుల్లో నించీ, ఫాక్టరీలలో నించీ, రైళ్ళలో నించీ బయట పడేయకుండాను, రోడ్ల మీద ‘ఒకటి’, ‘రెండూ’ పోయకుండానూ, ఉమ్ములు వేయకుండానూ – అవస్థాపన సౌకర్యాలు కలిగించటం, ఉపకరణ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టటం. అంటే తెలుగు రాని వాళ్ళ సౌకర్యార్ధం, అంగ్ల భాషలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చటం అన్నమాట.

రెండు: తమ హక్కుల కోసం అరవటమే తప్ప, ఏమాత్రం బాధ్యత తీసుకోవటం ఇష్టం లేని ప్రజలే అతి ఎక్కువగా వున్న మన భారతదేశంలో, సమాజంలో వారికి ఆ బాధ్యతలు గుర్తు చేయటమే కాక, అలాటి ప్రమాదకరమైన సంస్కృతినే మార్చటానికి ప్రయత్నం చేయటం.

నేను ఈ ప్రయాణంలో చూసిన ఇండియా గురించి కొంత చెబుతాను.

హైదరాబాదులో, గుంటూరులో, రాజమండ్రిలో, భువనేశ్వర్లో రోడ్ల మీద చెత్త కుండీలు చాల తక్కువ చోట్ల కనపడ్డాయి. అవి వున్న చోట్లల్లో కూడా, అవి ఈమధ్యన ఖాళీ చేసిన నిదర్శనలు కనపడలేదు. కొన్ని కుండీలు చెత్తలో ముణిగిపోయి, కనపడటం కూడా లేదు. ఇళ్ళ ముందు చాలా చోట్ల మునిసిపాలిటీ వారి చెత్త కుండీలు లేవు. హైదరాబాదులో ఆగిన సిటీ బస్ పక్కన నుంచుంటే, మీ తెల్ల చొక్కా మీద ఎర్రటి జర్దా కిళ్ళీ పడితే ఆశ్చర్యపోనఖ్కర్లేదు. ఏ తెల్లటి గోడ చూసినా, సినిమా పోస్టర్లు. ఎ.బి.వి.పి. వారి గోడ రాతలు.

ఈ ట్రిప్పులో మేము ఒరిస్సాలోని పూరీ అనే పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళాం. పూరీలో జగన్నాధుని గుడి దగ్గర రోడ్డు, వాతావరణం ఎంతో అశుభ్రంగా వున్నాయి. ఎక్కడ చూసినా ఆవులు కాగితాలు తింటూ, పేడ వేస్తూ, మూత్రం విడుస్తూ పాడుచేస్తున్నాయి. రోడ్ల పక్కన ఇటూ అటూ బారులు తీర్చి కూర్చున్న ముష్టివాళ్ళ చుట్టూ దుమ్మూ, ధూళీ, బురద. రోడ్డు మీద ఎర్రటి కార్పెట్ వేసినట్టుగా జర్దా కిళ్ళీ ఉమ్ములు. ఎప్పుడు బయట పడదామా అనిపించింది.

అదే మా తమ్ముడితో చెబితే, ‘ఇంకా నయం. నువ్వు కాశీ వెళ్ళలేదు. పూరీ, కాశీ మీద ఎంతో నయం. పవిత్రమైన గంగలో నీళ్ళు ముట్టుకోవాలన్నా భయమేస్తుంది’ అన్నాడు.

రైల్లో వెళ్ళేటప్పుడు, మీరు ఫస్టు క్లాసు ఏ.సి.లో వెడుతున్నా, బాత్రూం వాడే ప్రశ్నే లేదు. బాత్రూం బయట నుంచుంటేనే ఆ వాసన భరించటం కష్టం. ఇహ లోపలి ఏం వెడతాం. అంతేకాదు, స్లీపర్ కోచిలో ఎప్పుడూ బొద్దంకులు చూసేవాళ్ళం, ఈసారి ఎలుకలు కూడా చూశాం.

ఇవన్నీ నేను ఏదో కొత్తగా చూస్తున్నట్టు, మీకు తెలియనట్టు చెప్పటం లేదు. ‘స్వచ్ఛ భారత్’ పని ఎక్కడ మొదలు పెట్టాలో చెబుదామని చెబుతున్నాను.

మనం వీటన్నిటినీ ఉదాహరణలుగా తీసుకుని, కొంచెం ఓపిగ్గా ఆలోచించి ఇలాటివి జరగకుండా మనం కలలు కంటున్న ‘స్వచ్ఛ భారత్’ని ఎలా సాధించటమా అని పరిష్కారాలు వెదికితే, మొట్టమొదటగా నాకూ, మీకూ కనపడేవి నేను పైన చెప్పిన రెండు కార్యక్రమాలే అని సులభంగా తెలిసిపోతుంది.

ఇక్కడ ఇంకొంచెం వివరణ ఇచ్చే ముందు, మేము పోయిన నెల రాజమండ్రి రైల్వే స్టేషన్లో చూసిన ఒక సంఘటన చెప్పాలని వుంది. నేను ‘బాధ్యతలు’ అనే పదం ఎందుకు వాడానో చెబుదామని మాత్రమే, ఈ ఉదాహరణ చెబుతున్నాను.

వైజాగ్ వెళ్ళే రైలు కోసం రాజమండ్రి స్టేషన్లో ప్లాట్ఫారం మీదకి వచ్చాం. సామాను ఒక చోట పెట్టి, రైలు వచ్చే సమయానికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కూలీ. ప్లాట్ఫారం అంతా బిజీగా వుంది. మేము నుంచున్న చోట కూడా జనం బాగానే వున్నారు. అప్పుడే చూసాను, కొంచెం పక్కగా ప్లాట్ఫారం మధ్యగా, ఒక చేతులతో తీసుకువెళ్ళే స్ట్రెచ్చర్ వుంది అక్కడ. పూర్తిగా రక్తసిక్తమై వుంది. అంతకు ముందు ఏం జరిగిందో కానీ, ఇంకా ఆ రక్తం జిగటగా, నల్లబడుతున్న ఎర్ర రంగుతో, నేల మీద కూడా పారుతున్నది. అక్కడ ఈగలు ముసురుతున్నాయి. అది చూసిన జనం ముక్కులు మూసుకుని పక్కగా వెళ్ళిపోతున్నారు. చూడకుండా వెడుతున్నవాళ్ళు, అది తొక్కుకుంటూ వెడుతున్నారు. వారి అడుగుజాడలు కూడా ఆ రక్తంతో ముద్రలు వేస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, అక్కడే నుంచుని ఆ స్ట్రెచ్చర్ మీద అడుగులు వేసి వెడుతున్నవారిని చూసి, పెద్దగా జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు.

నాకు మా ఆఫీసులో సేఫ్టీ ట్రైనింగులో ‘డేంజర్స్ ఆఫ్ పాతజెన్స్’ మీద చెప్పినది గుర్తుకి వచ్చింది. అది ఎవరి రక్తమో తెలియదు, ఎటువంటిదో తెలియదు. హెచ్ఐవి పాజిటివ్ అయితే!
అదే నేనూ మా శ్రీమతీ మాట్లాడుకుంటుంటే, ఎదురుగా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఆఫీస్ అనుకుంటాను, కనపడింది.

శ్రీమతి ‘ఉండు.. నేను రిపోర్టు ఇచ్చి వస్తాను’ అని ఆఫీసులోకి వెళ్లి, ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.
‘చెప్పాను. ఆయనకేం తెలీదన్నాడు. అది వెంటనే అక్కడి నించీ తీసివేసి, అక్కడ శుభ్రం చేయకపోతే చాల ప్రమాదం. ఎన్నో ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం వుంది అని చెప్పాను. చూస్తానన్నాడు’ అంది.

ఆవిడ అలా అంటుండగానే, ఆయన బయటికి వచ్చాడు. అది చూసి, జేబులోనించీ రుమాలు తీసుకుని, ముక్కుకి అడ్డం పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.

కాసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆ స్ట్రెచ్చర్ తీసుకుని, పట్టాల మీద పడుకోబెట్టి దాని మీద నీళ్ళు పోశారు. తర్వాత దాన్ని తెచ్చి అదే ప్లాట్ఫారం మీద అదే చోట, గోడకి ఆనించి నిలబెట్టి వెళ్ళిపోయారు. అప్పుడే చూసాను వాళ్ళు చేతులకి గ్లవ్స్ కూడా వేసుకోలేదు. అసలు తగలబెట్ట వలసింది దాన్ని. అలా జరగలేదు.

అదే మాట తర్వాత మా స్నేహితుడితో అంటే, “నువ్వెప్పుడయినా ఇక్కడ హాస్పిటల్స్ చూశావా, అదే ప్రభుత్వ ఆసుపత్రి అయితే, నేల మీదే కొంతమంది రోగులు, పక్కనే కొన్ని శవాలు కూడా వుంటాయి” అన్నాడు.

ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, హక్కుల గురించి సమ్మెలూ, హర్తాళ్ళూ ప్రతి చిన్న విషయానికీ చేసే జనం, ఇలాటి వాటిలో ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటారో చెబుదామని. అందరూ రకాన్ని తప్పుకుంటూనో, తొక్కుకుంటూనో వెడుతున్నారు కానీ, ఎందుకు ఆ విషయం రిపోర్టు చేయటం లేదు? అదేదో జోకులా నవ్వుకుని ఆనందిస్తున్న పెద్ద మనుష్యులు వారి హక్కుల విషయంలో కూడా అలా నవ్వుకుంటూ వుంటారా.. లేదా సమ్మెలు చేస్తారా..

ఈ ‘స్వచ్ఛ భారత్’ విషయంలో కూడా, ఇలాటి వ్యక్తుల్లో, ఇలాటి సమాజంలో ముందుగా జరగ వలసింది బాధ్యతలని గుర్తు చేయటం. సామాజిక స్పృహ తేవటం. మనం వీళ్ళకి రోజూ చేపలు ఇస్తుంటే, మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. చేపలు పట్టటం నేర్పాలి. అలాగే వాళ్ళని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చి దిద్దాలి.

అలాగే ప్రతి రోడ్డు మీదా, ఇళ్ళ దగ్గరా చెత్త కుండీలు పెట్టటం, ఆ చెత్తని రోజుకి ఒకసారో, వారానికి మూడుసార్లో లారీల్లో తీసుకుపోవాలి. రోడ్ల మీద, షాపుల్లోనూ బాత్రూములు కట్టటమే కాక, వాటిని శుభ్రంగా వుంచాలి. రైళ్ళల్లోనూ బాత్రూములు శుభ్రంగా వుంచటం అవసరం. దీనికి కావలసిన అవస్థాపన సౌకర్యాలు కలిగించటం, ఉపకరణ నిర్మాణ కార్యక్రమాలు జరపటం చాల అవసరం.

ఇలాటివి ఎవరి బాధ్యత?

ఇద్దరిదీను. ప్రభుత్వాలది. ప్రజలది. రెండు చేతులూ కలిస్తేనే, విజయవంతంగా చప్పట్లు కొట్టటం.

ఇది విగ్గులు పెట్టుకునే ‘సెలెబ్రిటీ’లతో అయే పని కాదు. నా అభిమాన తార, ‘నేను లక్స్ టాయిలెట్ సోపునే వాడతాను’ అంటే, అది నేను వాడను. నాకు ఏది ఇష్టమో అదే వాడతాను. గంగూలీ చెప్పాడని నేను చేపలు తినను. నేను శాకాహారిని. ఈ రోగానికి మందు సెలబ్రిటీలు కాదు. మార్పు. మనుష్యుల్లో లోపలి నించీ రావలసిన మార్పు. మంచి కోసం వచ్చే మంచి మార్పు!

అది రానంత కాలం, ‘స్వచ్ఛ భారత్’ స్వచ్ఛంగా వుండటం చాల కష్టం!

***



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)