బాల రంజని
ఎరిగింపు
-

వేసవిసెలవులకు మేనత్త మల్లీశ్వరి ఊరికెళ్ళాడు వినోద్. మేనత్త ఆ ఊర్లో టీచరమ్మ. వాళ్లది ఉమ్మడి కుటుంబం ,ముగ్గురు అన్నదమ్ములు వారి పిల్లలూ, ముసలి తాతా అవ్వా అంతా కలసి ఉంటారు, ఐనా వాళ్ళిల్లు క్రమ శిక్షణకు పెట్టింది పేరు. వినోద్ కు అది చూస్తే ’ క్రమశిక్షణ ’లా కాక, ’క్రమశిక్ష’ లా అనిపించింది. రెండ్రోజులకే బోరుకొట్టింది. శలవులు కానీ, బళ్ళు కానీ ఏ రోజైనా కానీ ఒంట్లో బాగు లేనపుడు తప్ప అంతా ఉదయం ఆరింటికే మంచం దిగాలి. నోరు పుక్కిలించుకుని దేవుని గది ముందు హాల్లో అంతా కూర్చుని , ఉదయ ప్రార్ధనలూ, ధ్యానమూ చేయాల్సిందే, ఆ తర్వాత టెర్రేస్ మీది కెళ్ళి యోగా, సూర్య నమస్కారాలూ చేసి, పాలు త్రాగి, స్నానాదులు ముగించి అవకాయో, మాగాయో, చింతకాయో, గోంగూరో కందిపొడి తో కలిపి ఇంటి వెన్నతో ముద్దలు చేసి అత్త పెడుతుంటే లొట్టలేసుకుంటూ తిని , ఆపైన కత్తితో కోస్తేకానీ రానట్లుండే ఇంటి గేదె పెరుగుతో పెరుగన్నం తినేసి , ఆ పది మంది పిల్లలూ కాస్త సేపు తోటలో కెళ్ళి కూర పాదులకూ, పూల మొక్క లకూ నీరు పట్టాలి. ఆపైన ఊరి గ్రంధాల యానికెళ్ళి ఆనాటి దినపత్రికలూ, కధల పుస్తకాలూ చదువుకుని తాము చదివిన విషయాలు డైరీలో వ్రాసుకుని ఇంటి కెళ్ళాలి. అవి అత్తకు చూపాలి, అత్త వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి.

మధ్యాహ్నభోజనం ఇంటిలో పండించిన కూరలు, వేయించిన కందిపప్పూ , ముక్కలు నిండుగా ఉండే సాంబారూ, అప్పడాలూ, వడియాలూ, గడ్డ పెరుగు లో నిమ్మకాయో, దబ్బకాయో నంజుకుంటూ తినేసి ,మామిడిముక్కలు తిని త్రేన్పుకుంటూ వెళ్ళి పెద్దలైతే విశ్రాతి, పిలల్లైతే పెరటితోటలో ఊయ్యాలలూ, కోతి కొమ్మచ్చులూ,సూర్యుడు ప్రొద్దు వాలగానే మధ్యాహ్నం అత్త పెట్టే చక్కిలాలూ, చక్రాలూ,కజ్జికాయలూ , అతిరసాలూ, సున్నుండలూ, వంటివి తినడం , పండ్ల మొక్కలకు నీరు పట్టాక బయటకెళ్ళి ఆడుకోడం , సూర్యాస్తమయానికి ఇంటి కొచ్చేసి స్నానాదులు ముగించి , వేడిపాలు త్రాగేసి, శతక పద్యాలూ, భారత, భాగవత పద్యాలు వల్లే వేసి అత్తచెప్పే కధలు పాటలూ నేర్చు కుని, కమ్మని భోజనం చేసేసి కాస్తసేపు అత్త వేసే సీ.డీలో రామాయణం, భాగవతం వంటి పౌరాణికాలు చూసి హాయిగా నిద్ర పోడం. బాబోయ్ ఇదేం షెడ్యూల్! అనుకున్నాడు వినోద్. లైబ్రరీ పక్కనే ఉండే పూరి పాకలోని కాకా హోటల్ నుంచీ వచ్చే చిట్టి గారెలు, మిరప కాయ బజ్జీల వాసన సురేష్ ను నిలవ నీయట్లేదు. ఎలాగైనా అవి తిని తీరాలని ముక్కు ,బొజ్జ అల్లరి పెడుతున్నాయి. అమ్మ నాన్నా డబ్బులన్నీ అత్తవద్దే ఇచ్చి ఉంచమన్నారు. అత్తను డబ్బడి గి తే అన్నీ ఇంట్లో చేసి పెడుతుంతే ఇంకా డబ్బెందుకూ అంటుందేమోని భయ మే సింది వాడికి. మొహ మాట పడ్డాడు అత్తను డబ్బు అడగను. 2,3 రోజులయ్యేసరికి ఇహ ఉండ బట్ట లేక ఎలాగైనా కాస్త డబ్బు తీసుకుని ఆమిరప కాయ బజ్జీలూ, జిలేబీ తిని తీరాలనుకున్నాడు.

ఆరోజు రాత్రి అందరి కంటే గబగబా అన్నం తినేసి చేయి తుడుచు కోను గదిలోకి వెళ్ళి , అక్కడ ఉన్న అత్త హ్యాండ్ బ్యాగ్ లోంచీ ఇరవై నోట్లు మూడు తీసి గబుక్కున తన బ్యాగ్ లోని తాను రేపు వేసుకోబోయే నిక్కర్ జేబులో కుక్కేసి, నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి అందరితో కల్సి కూర్చున్నాడు. తాను చేసిన పని ఎవ్వరూ చూడలేదనే ధైర్యంతో రేపటి జిలేబీ నములు కుంటూ నిద్రపోయాడు . మరునాడు యధాప్రకారం పనులన్నీ పూర్తి చేసుకుని అందరితో పాటుగా లైబ్రరీకి వెళ్ళాడు. అంతా దినపత్రిలకు చదువు తుండ గా , ‘ఒంటికి ‘అనిసైగ చేసి బయటికొచ్చి మెల్లిగా కాకా హోటల్ లోకి వెళ్ళి అరడజను జిలేబీలు, మూడు చిట్టి గారెలూ, మూడు మిరపకాయ బజ్జీలు గబ గబా లాగించేసి డబ్బు కోసం జేబులో చేయి పెట్టాడు.తాను అత్త హేండ్ బ్యాగ్ లోంచీ తీసి దాచినమూడు ఇరవై నోట్ల కు బదులు మూడు వంద నోట్లు వచ్చాయి బయటికి, వినోద్ కు కంగా రేసింది. ఇదేంటీ ఇలా వంద నోట్లు వచ్చాయి. చీకట్లో తాను వంద నోట్లు తీసినట్లున్నానే! ' అన ికంగారు పడ్డాడు.ముందు హోటల్లో డబ్బిచ్చేసి తిరిగి గ్రంధాలయంలోకి వెళ్ళాడు. కధల పుస్తకం తెరిచినా చదవ బుధ్ధేయలేదు.ఎలాగో కాలం గడిపి ఇల్లు చేరాడు. అంతా హుషారుగా ఉన్నా వినోద్ దిగాలుగా ఉండటం చూసిన మేనత్త "ఏం వినోద్ ! అలా ఉన్నావ్? వంట్లో బాగోలేదా? ఇంటి మీద గాలి మళ్ళిందా?" అని అడిగింది ." బాగనే ఉన్నానత్తా!" అని చెప్పాడు కానీ కడుపు లో గడబిడ గానే ఉంది వాడికి. కాళ్ళు కడుక్కోను పెరట్లో కెళ్ళాడు , వాడికి టాయిలెట్ కెళ్ళాల్సివచ్చింది, మూడు మార్లు వెళ్ళాడు. లూజ్ మోషన్స్ అయ్యాయి. ఇంట్లోకీ పెరట్లోకీ అలా తిరగడం వల్ల నీరసం వచ్చింది.

అత్త దగ్గరగా వచ్చి " వినోద్! నీకు జిలేబీ, మిరప కాయ బజ్జీలూ పడినట్లు లేదురా! బయటి తిండి తింటే ఇలాగే అవుతుంది. సంత పకోడీకి వాసనా అనారోగ్యమూ రెండూ ఎక్కువే నోయ్! ఈ పెరుగు మెంతులూ తిను, కాసేపు పడుకోపో. నీకు కావలిస్తే నేనే మిరప కాయ బజ్జీలూ, చిట్టి గారెలూ చేసి పెట్టే దాన్నికదా!” అంటూ వాడిని తీసుకెళ్ళి పడుకో బెట్టింది.

అత్తకు అంతా తెల్సి పోయిందని తెల్సి, " అత్తా!సారీ! క్షమించు,మా నగరంలో ఇలా తినే వాళ్ళం , నాకూ అవి చూసి నోరూరింది, తప్పు చేశాను" అంటూ బావురని ఏడ్చడు.

" నీకు డబ్బుచాలు తుందో లేదోని, నేనే నీ జేబులో మూడు వంద నోట్లు పెట్టానులే, మీ ఊర్లో ఇలాగే మీ అమ్మ బ్యాగ్ లోంచీ, నాన్న జేబు లోంచీ తీసుకుని వాడుకునే వాడివని మా అన్నయ్య చెప్పాడ్లే! "అంది.

" అత్తా! మరెన్నడూ మాఊర్లో కూడా అమ్మానాన్నలను అడక్కండా డబ్బు తీసుకోను. నీవు అందరి మూందూ నన్ను నిలదీసి ప్రశ్నించకుండా నా పరువు కాపాడావు. ప్రామిస్ మా ఊర్లోకూడా మరెన్న డూ ఇలా డబ్బుతీయను, బయటి తిండ్లు తినను. " అన్నాడు దినేష్ .

నీతి - తప్పు చేయడం సహజం, అదితెల్సుకుని మంచిగా మారడం ఉత్తమ లక్షణం .పిల్లలు వారి తప్పు వారు తెల్సుకుని మారే అవకాశం పెద్దలే కల్పించాలి. పిల్లలు చేసే తప్పుల్ని పెద్దవి చేసి వారి ని నలుగుర్లో అవమానించక చాకచక్యంగా హేండిల్ చేయాలి. వారి తప్పును చెప్పకనే తెలియ జేయాలి.

ప్రశ్నలు-

1. ఏది క్రమశిక్షలా అనిపించింది వినోద్ కు?

2. మల్లీశ్వరి అత్త ఇంట్లో నిత్యకార్యక్రమమేమి?

3. ఏమి చూసి ఉండబట్టలేక అత్త బ్యాగ్ లో డబ్బుతీశాడు వినోద్?

4. వినోద్ కాకాహోటాల్లో జిలేబీలు తినివెళ్ళాక ఇంట్లో ఏమైంది?

5. అత్తకు వినోద్ ఎందుకు థాంక్స్ చెప్పాడు?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)