కబుర్లు - సత్యమేవ జయతే
భాష - భాష్యం
- సత్యం మందపాటి

నాకు ఇష్టమైన విషయాలలో చాల ముఖ్యమైనది, రకరకాల భాషల గురించీ, వాటిలోని కొన్ని పదాల మూలం గురించీ తెలుసుకోవటం, ఆ భాషా సౌందర్యాలని ఆనందించటం.

మేము 1970 దశకంలో కేరళలోని తిరువనంతపురంలో వున్నప్పుడు, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో రకరకాల రాష్ట్రాల వారు వుండటం వల్ల, అక్కడ ఎన్నో భాషలు వినేవాడిని. అక్కడ నా స్నేహితులలోనే, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ.. ఇలా ఎన్నో భాషలు మాట్లాడేవారు వున్నారు. మన తెలుగు ద్రవిడ భాష కాబట్టి, మలయాళం, తమిళ్, కన్నడ, కొంకిణి భాషల మీద, నా పరిశీలన మరి కాస్త ఎక్కువయింది.

తమిళ భాషలోనించీ తెలుగులోకి, ఇతర ద్రవిడ భాషలలోకి, వందల కొద్దీ తమిళ పదాలు వచ్చాయి. అందుకని కేరళ వెళ్ళిన కొత్తల్లో, కొంత ఇబ్బంది పడ్డాం కానీ, మరీ కష్టాలు పడలేదు. తమిళ, మళయాళ భాషల మధ్య తేడా కూడా ఎక్కువ లేకపోవటం వల్ల, తెలుగులోకి వచ్చిన తమిళ పదాల ఆధారంతో ఇటు తమిళం. అటు మలయాళం ముందు అర్ధం చేసుకోవటానికి అంత సమయం పట్టలేదు. వాక్య నిర్మాణంలో తేడాలున్నాయి కానీ, కొన్ని మాటల అర్ధం తెలియటం వల్ల సంభాషణ సాగించేవాళ్ళం. తర్వాత కొన్నాళ్ళకి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడిని. మా ఆవిడ నాకన్నా ముందుగానే, చకచకా మాట్లాడేసేది. ఐదేళ్ల తర్వాత, నేను మలయాళం చదవటం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు అంటే దాదాపు నలభై ఏళ్ల తర్వాత, చదవటం, మాట్లాడటం రెండూ అటక ఎక్కేసాయి.

మన తెలుగు వాళ్ళం, భారతదేశంలో దక్షిణాన వున్న రాష్ట్రాల్లో ఉత్తరాన వుండటం వల్లనేమో, తెలుగులో చాల సంస్కృతం కూడా చోటు చేసుకుంది. తమిళంలో ఎక్కువ సంస్కృత పదాలు లేవు. కానీ మలయాళం, కన్నడ భాషలు కూడా తెలుగులాగా ఎన్నో సంస్కృత పదాలను కలుపుకున్నాయి. రేడియోలో మలయాళం వార్తలు మొదలైనప్పుడు వార్తఘళ్ ఆరంభిక్యున్ను అనేవాళ్ళు. అలాగే వార్తలు అయిపోతున్నప్పుడు వార్తఘళ్ సమాప్తిక్యున్ను అనే వాళ్ళు. అంటే మొదట ద్రవిడం, తర్వాత సంస్కృతం, వాక్య నిర్మాణం మాత్రం మలయాళంలో వుందన్నమాట.

మన తెలుగులో మూడు రకాల పదాలు వున్నాయి. తమిళంలో నించీ వచ్చినవి, సంస్కృతంలో నించీ వచ్చినవి, అచ్చ తెలుగు పదాలు. ఉదాహరణకి ‘తల’ తమిళ పదం. ‘శిరస్సు’ సంస్కృత పదం. ‘బుర్ర’ అచ్చ తెలుగు పదం. ఇక్కడ మనం రోజువారీ మాట్లాడుకునే భాషలో, తమిళ పదమైన ‘తల’ అనే మాటని ఎక్కువగా వాడటం గమనించగలరు.
మా తమిళ మిత్రులు మాట్లాడుతుంటే ఆ మాటలు శ్రద్ధగా వినేవాడిని, తెలుగులో ద్రవిడ భాష ఆధారంగా ఎన్ని తమిళ మాటలు వున్నాయా అని. చూడగా చూడగా చాల చాల వున్నాయి. ఉదాహరణకి, మన శరీర భాగాల పదజాలం చాల వరకూ తమిళంలో నించీ వచ్చినదే. తల, కాలు, కన్ను, చెవి, ముక్కు మొదలైనవి. అలాగే బంధుత్వాలు. అమ్మ, అయ్య, అక్క, అన్న, మామ, అత్త మొదలైనవి. అలాగే ఉప్పు, కారం, పాలు, నీరు (తన్నీరు), పో, ఆట, పాట, ఊరు, పట్టణం, మాదిరి, పేరు.. ఇలా ఎన్నో వున్నాయి.

మనవాళ్ళకి తమిళ్ అంటే మొదటినించీ చిన్న చూపు. దానికి కారణం మనమందరం ఆనాటి మద్రాస్ సంయుక్త రాష్ట్రంలో వున్నప్పుడు, వాళ్ళు మనల్ని తక్కువ చేశారంటారే, అందుకేనేమో! తమిళ భాషకి రవం లేనిది కనుక అరవం అని పేరు పెట్టుకోవటమే కాక, వాళ్ళు మాట్లాడుతుంటే కిరసనాయిల్ డబ్బాలో రాళ్ళు మ్రోగించినట్టు వుండేదని అంటుండేవాళ్ళు మనవాళ్ళు. గమ్మత్తేమిటంటే, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ మాట్లాడేవాళ్ళు, మన తెలుగుని విని సరిగ్గా అదే అనేవాళ్ళు. అందరూ కాదు, ఇతర భాషలలోని అందాలను గమనించని వాళ్ళు. ఎవరి భాష వారికి తీపి. మరి మాతృభాష కదా.. అదే అమ్మ ప్రేమలో వున్న తీయదనం. కానీ మిగతా రాజకీయలవల్లనో, పరులది ఏదయినా పరుషం అనుకోవటం వల్లనో, ఇతర భాషలని కించపరచటం మంచిది కాదు. ప్రతి భాషలోనూ ఒక వినూత్నమైన సౌందర్యం వుంది. అది చూడాలంటే కొంచెం మన తలలో నించీ, మన శిరస్సులో నించీ, మన బుర్రలో నించీ, ఆ దోమని బయటికి తరిమేయాలి. అప్పుడు ఆ భాషలోని మాధుర్యాలు కనిపిస్తాయి. అలాటివారికి, పేలూ దోమలూ లేని మన శిరస్సు వంచి నమస్కారం పెట్టవచ్చు.

ప్రతి భాషలోనూ యాసలు వున్నాయి. వుంటాయి. యాస భాషకి అందానిస్తుంది. మన తెలుగులోనే చాల యాసలు వున్నాయి. ఈ వ్యాసంలో మనం వాటి జోలికి వెళ్లొద్దు. ఇంకోసారి వాటి పని పడదాం!

౦ ౦ ౦

మేము మూడున్నర దశాబ్దాల క్రితం అమెరికాకి వచ్చాక, నాలాటి వాడికి ఈ భాషల విషయంలో తంతే గారెల బుట్టల్లో పడ్డట్టు అనిపించింది. ఇక్కడ ఎన్నో భారతీయ భాషలతో పాటు, చాల విదేశీ భాషలు కూడా వినవచ్చు. ఈ విదేశీ భాషల విషయం పరిశీలిస్తే వింతగా వుంటుంది.

అన్నిటిలోకి ఎన్నో భాషల వాళ్ళు రకరకాలుగా పలికే అక్షరం j అనే ఇంగ్లీషు అక్షరం. స్పానిష్ భాషలో ja అనే దాన్ని జ అని పలకరు. హ అంటారు. మా సుజాత గారిని స్పానిష్ వాళ్ళు సుహాత అని పిలుస్తారు. j అనే అక్షరానికి u కలిపితే వ అవుతుంది. Juan అనే మిత్రుడిని వాన్ అని పిలుస్తాం. మా ఆఫీసులో జాన్ (John) అనే అమెరికన్ అతనితో పాటు, Jon అనే ఒకతను వున్నాడు, అతను స్వీడిష్ అతను. అతన్ని యాన్ అని పిలవాలి. Jon అని ఒకమ్మాయి వుంది. ఆ అమ్మాయిని యాన్ అని పిలిస్తే, కాదు జోన్ అని పిలవమంది. ఆవిడ తూర్పు యూరప్ ఆవిడ. అలాగే మేము హ్యూస్టన్లో వున్న రోజుల్లో, Bob Budreaux అనే ఒకాయన వార్తలు చదివేవాడు. అతన్ని బాబ్ బుడ్రో అంటారు. అది ఒక ఫ్రెంచ్ పేరు.

బ్రిటిష్ ఇంగ్లీష్ వేరు, అమెరికన్ ఇంగ్లీష్ వేరు. బ్రిటిష్ వాళ్లకి ఆర్ అనే అక్షరం సైలెంట్ అయితే, అమెరికా వాళ్ళు ఆర్ అనే అక్షరాన్ని నోరారా పలికి, టి అనే అక్షరాన్ని చాల సుతిమెత్తంగా, పలికీ పలకనట్టుగా పలుకుతారు. “England and America are two countries separated by the same language” అన్నాడు జార్జి బెర్నార్డ్ షా.

ఇండియా నించీ ఈమధ్యనే అమెరికా వచ్చిన ఒకమ్మాయి, ఇట్ టేక్స్ త్రీ ఆర్స్ అంది. ముందు ఆ త్రీ ఆర్స్ ఏమిటో అర్ధం కాలేదు. తర్వాత తెలిసింది త్రీ అవర్స్ అని. అది ఇటు అమెరికన్ ఇంగ్లీష్ కాదు, అటు బ్రిటీష్ ఇంగ్లీషూ కాదు. ఇండియాలో నేర్పించిన ఇండియన్ ఇంగ్లీష్.

భాష అనేది సాంస్కృతికపరంగా వుంటుంది. ఒక సంస్కృతికి అవసరం లేని పదాలు ఆ భాషలో వుండవు. వాక్యాలతో వాటిని వర్ణించవచ్చు కానీ, ఒకే ఒక పదం రూపంలో వుండటం తక్కువ. ఉదాహరణకి ఎంగిలి, ముగ్గు, పిడకలు, ఆవకాయ మొదలైన తెలుగు పదాలకి ఇంగ్లీషు పదాలు లేవు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే చేసే పని ఇంకొకటుంది. ఇంగ్లీషులోకి రకరకాల పదాలు వేరే భాషల్లోనించీ వచ్చాయి. అవేమిటో, వాటికి మూలాధారం ఏమిటో తెలుసు కోవటం. ఇదీ సరదాగానే వుంటుంది. అందుకే ఈ వ్యాసాన్ని కూడా సరదాగానే వ్రాస్తున్నాను. దీన్ని ఒక రీసెర్చి పేపరనుకుని, తప్పులు పట్టి నన్ను చీల్చి చెండాడకండి. నా ఆలోచనలని పైకి చెప్పుకుంటున్నానంతే! భాష అనేది వేగంగా ప్రవహించే ఒక నదిలాటిది. గోదావరి నది ప్రవహిస్తుంటే, దానిలో ఎన్నో ఇతర కాలువలు, పాయలు కలుస్తుంటాయి. అందువల్ల గోదావరి పేరు మారి, ఆ పాయల పేరు రాదు. అలాగే ఒక భాషలో ఎన్నో ఇతర భాషా పదాలు చేరుతుంటాయి. కానీ ఆ భాష పేరు మారదు.

మనందరికీ తెలుసు, ఇంగ్లీషులోని బాండికూట్ అనే మాట తెలుగులోని పందికొక్కునించీ వచ్చిందని. అలాగే ఇంగ్లీషులోని కాష్ అనే మాట, తమిళ్ కాసు నించీ వచ్చింది. ద్రవిడ భాషా ప్రభావం వల్ల తెలుగులో కూడా కాసు అనే వాడతాం. మాంగో అని మాట, తమిళ్ మాంగా నించీ వచ్చింది. ఇది తమిళ్ నించీ మలయ్ భాషలోకి కూడా వెళ్ళింది. ఇంగ్లీషులో కేటమరాన్ అంటే చెక్కలతో కట్టిన చిన్న తెప్ప అని. దీనికి మూలం కట్టుమరం అనే తమిళ్ మాట. కట్టు అంటే అన్నిటినీ కలిపి కట్టటం. కట్టు అనే పదం తెలుగులోకీ వచ్చింది.

ఒక్క తమిళమే కాదు, సంస్కృతంలోనించీ కూడా ఎన్నో మాటలు ఇంగ్లీషులోకి వెళ్ళాయి. గురు, పండిట్ లాటివి. ఇంగ్లీషులో ఫాదర్, మదర్, బ్రదర్ అన్నవి, పితృ, మాతృ, భాతృ అనే పదాలలో నించీ వచ్చాయని ఒకచోట చదివాను కానీ, నిర్ధారణగా ఎక్కడా లేదు.

కొన్ని మాటలు ఎన్నో భాషల్లో వున్నాయి. అవి ఎంతగా ఆ భాషల్లో కలిసిపోయాయంటే, అవి ఆ భాషలోవే అని వాదించేటంతగా. ట్రిగొనామెట్రీ అంటే మనందరికీ తెలుసు, లెఖ్కల్లో అదొక పధ్ధతి అని. దాన్ని తెలుగులో త్రికోణమితి అంటారు. అది ఏ భాషలో నించీ ఏ భాషలోకి వచ్చిందో భాషా భాష్యకారులే చెప్పాలి. మూడు కోణాలు అన్నది త్రికోణం అంటారు సంస్కృతంలో. ట్రిగొనం అని గ్రీకు భాషలో వుంది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషల్లోనూ ట్రి, త్రి, త్రేస్ అంటే మూడు. ఇంగ్లీషులో త్రీ అంటే మూడు. ట్రయాంగిల్లో ట్రి వాటిల్లో నించే వచ్చింది. దేంట్లోనించీ దేంట్లోకి వచ్చింది? మేమే ముందున్నాం, మమ్మల్నే కాపీ కొట్టారు అంటాడు మా గ్రీకు వీరుడు మిత్రుడు బేజల్. అలాగే కాష్యూ అంటే జీడిపప్పు. దాన్ని హిందీ కాజు నించీ వచ్చింది అని వెబ్స్టర్ డిక్షనరీలో వుంది. అదే చోట అకాజు అనే ఫ్రెంచ్ మాటలోనించీ వచ్చింది అని కూడా వుంది. అలాగే మన లాంతరు, ఇంగ్లీషులోని లాంటర్న్. దేంట్లో నించీ ఏది వచ్చిందో నాకూ తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి.

ఇంగ్లీషులో నించీ తెలుగులోకి వచ్చిన మాటలు కొన్ని మనకి సులభంగా తెలిసిపోతాయి. అవి తెలుగులో ఎంతగా కలసిపోయాయంటే, వాటికి సరైన తెలుగు పదాలని ఈనాడు మనం అసలు వాడనంతగా. ఇంగ్లీషు పదాలకి అజంతాలు కలిపేసి రోడ్డు, పోలీసు, రైలు, ట్రైను, సిగ్నలు, ఫాను, కారు, బస్సు, బోటు, డాక్టరు, నర్సు, డ్రమ్ము, తారు, సిమెంటు, గ్లాసు, సారు, టీచరు, మాస్టారు, ప్రిన్సిపాలు, కాలేజీ, యూనివర్సిటీ... ఇలా కొన్ని వందల ఇంగ్లీషు మాటలు తెలుగు పదాలుగా మారిపోయాయి.

అసలీ మాటలు ఎలా పుడతాయి అన్నదానికి మనందరికీ బాగా గుర్తున్న హాస్య సన్నివేశం ఒకటి వుంది. అది మాయాబజారు సినిమాలో. ఈనాడయితే ఆస్కారులూ, నోబుల్ బహుమానాలూ వున్నాయి, మరి ఘటోత్కచుని కాలంలో? యస్వీ రంగారావు ఒకమాట అంటాడు, “ఎవరో ఒకళ్ళు కనిపెట్టకపోతే మాటలు ఎలా పుడతాయిరా? వెయ్యరా వీడికో వీరతాడు” అని. అంటే ఆ వీరతాడే ఈనాటి ఆస్కారు, అర్జున ఎవార్డులన్నమాట.

ఆ సినిమాలో చాల కొత్త మాటలు ఎన్నో వినబడతాయి. గింబళి, గిల్పం, లంబూ, జంబూ లాటివి. ఆనాటి తెలుగు సినిమా పాటల, మాటల మహా రచయిత పింగళి నాగేంద్రరావుగారు హల, లాహిరి మొదలైన ఎన్నో కొత్త మాటలను కనిపెట్టారు.

మా తమిళ మిత్రుడు గోపాలకృష్ణమూర్తి కొత్త మాటలు కనిపెట్టడం గురించి ఒక చిన్నకథ సరదాగా చెబుతుండేవాడు. ఎన్నో సంవత్సరాల క్రితం కొంతమంది తమిళులు రామేశ్వరం నించీ ఒక చిన్న బోటులో దక్షిణాది యాత్రకి బయల్దేరారుట. చలిగా వుందేమో, అందరూ దుప్పట్లు కప్పుకుని, చుట్టలు తాగుతూ బోటు ప్రయాణం చేస్తున్నారుట. అలా కొన్ని రోజులు వెళ్ళాక, ఒకరోజు గాలి బాగా కుదిపేసి, పడవని ముంచేసిందిట.

అందరూ ముణిగిపోతుండగా ఒక సీతారామన్ గారు అక్కడవున్న చుట్టల్నీ, అగ్గిపెట్టెనీ భద్రంగా బొడ్లో దోపుకుని, మిత్రులతో పాటూ నీళ్ళల్లోకి దూకేసి ఈదటం మొదలుపెట్టాడుట. అందరూ కొంత దూరం వెళ్ళగానే ఎదురుగుండా ఒక ద్వీపం. మనుష్య సంచారంలేని ఒక ద్వీపం. అందరూ అక్కడ కూర్చుని సేద తీర్చుకుంటున్నారుట. మన సీతారామన్ గారు, లుంగీలో దాచిన చుట్టా, అగ్గిపెట్టె తీసి చుట్ట వెలిగించాడుట. (మరి అవి తడిసిపోలేదా అని నన్ను అడక్కండి. జవాబు కావాలంటే మా మూర్తిగాడు ఎక్కడ వున్నాడో వెతికి, అతన్నడగండి. నాకే బాధ్యతా లేదు) ఆయన చుట్ట తాగుతుంటే చుట్ట చివర నుసి బాగా పేరుకుపోయిందిట. అది ఎక్కడ రాల్చాలో తెలీక, అటూ ఇటూ చూసి “ఆష్ ట్రే ఇల్లియా” అని అడిగాడుట, తమిళంలో. అప్పటినించీ ఆ ద్వీపానికి, Australia అనే పేరు వచ్చిందిట. ఇదీ అతను సరదాగా చెప్పిన కొత్త మాటల పుట్టుక కథ.

పైన చెప్పింది హాస్యంగా చెప్పుకున్న కథ అయితే, నిజంగా జరిగిన కథ ఇంకోటి వుంది. కొలంబస్ ఇండియా వెడుతున్నాననుకుని, తూర్పు పడమరయితే పొరపాటు లేదోయ్ అని పాడుకుంటూ, అమెరికాలో తేలాడు. అదే ఇండియా అనుకుని అక్కడి వాళ్ళని ఇండియన్లు అని పిలిచాడు. అప్పటినించీ ఇప్పటి దాకా, ఆయన పేరుతో ఒకరోజు సెలవు కూడా ఇచ్చి, ఇక్కడ వున్న పూర్వీకుల సంతతిని ఇండియన్స్ అనే పిలుస్తున్నారు. అమెరికాలోనే కాదు, అమెరికా ఖండంలోని అన్ని దేశాల్లోనూ ఇండియన్స్ అనే అంటారు. మనం వీళ్ళని రెడ్ ఇండియన్స్ అంటాం.
తెలుగు పదాల వాడుకలో నాకు అంతుపట్టనిది ఒకటుంది. పైన గిల్పం, గింబళి అని వ్రాస్తుంటే అది గుర్తుకి వచ్చింది. తల్పం గిల్పం, కంబళి గింబళి, అవాకులూ చవాకులూ, తడిక గిడిక, పెళ్లి గిళ్లి, డబ్బు గిబ్బు, పుస్తకం గిస్తకం.. ఇలాటి ద్వంద పదాలు మన తెలుగులో ఎన్నో కనిపిస్తాయి. ఇంగ్లీషులో అలాటి పదాలు నేను వినలేదు.

మా వూళ్ళో ఓ సుబ్బారావుగారు ప్రపంచంలో అన్ని భాషల మీదా తెలుగు ప్రభావం వుంది అని సరదాగా అంటుంటారు. (మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి!) రెండు కాళ్ళ మీద కంగారుగా పరుగెడుతుంది కనుక, ఆ జంతువుకి కంగారు అని పేరు వచ్చిందంటారు. వయోలిన్ అంటే ఏమిటి? వాయులీనం. అంటే గాలిలో అలా లీనమయే సంగీతం అన్నమాట. చిల్లి అన్నది మెక్సికో నించీ వచ్చిన మాట కాదు. మన గుంటూరు మిరపకాయ తింటే నాలికకు చిల్లి పడుతుంది. అందుకుని చిల్లి అంటారు.. ఇలా వుంటాయి ఆయన ఉవాచలు.

భాషల మీద ఇలాటి కబుర్లు కావాలంటే, ఒక పెద్ద ఇంగ్లీషు డిక్షనరీ కొనుక్కుని, తీరిక దొరికినప్పుడల్లా, మాటల అర్ధాలూ, వాటి జీవిత చరిత్రా చదివి చూడండి. చాల సరదాగా వుంటుంది.


౦ ౦ ౦


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)