సారస్వతం
కావ్య లహరి
-‘విద్వాన్’ తిరుమల పెద్దింటి. నరసింహాచార్యులు

( భాగవత పరిచయం ద్వితీయభాగం)

“ లలిత స్కందము, కృష్ణ మూలము, శుకాలాపాభి రామంబు” అయిన భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మనం తిలకిస్తున్నాం !! అంటే శ్రవ్య కావ్యంలో ఓ సన్నివేశాన్ని చూడటం. దీనినే కావ్య పరిభాషలో ‘నాటకీకరణం’ అంటారు. ఈ ప్రక్రియలో కవిబ్రహ్మ తిక్కన నిష్ణాతుడు. అట్లే పోతనది కూడా ‘అందెవేసిన చేయి’ శ్రీమన్నారాయుణుడు నివసించే అల వైకుంఠపురాన్ని ఎలా! మన కనులముందు నిలిపాడో తిలకించండ ----

. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై

“అక్కడెక్కడో వైకుంఠపురమట, ఆపురంలో ఓ మూల సౌధమట ( మేడ) ఆమేడ పరిసరాల్లో మందార వనం, అందులో అమృత సరస్సు, అక్కడ పర్యంకము ( మంచం) దానిపై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడు.” ఆయనకి ఏనుగు ‘పాహీ! పాహీ! ( రక్షించు,రక్షించు) అని పెట్టిన కేక వినిపించింది. కవి అంతర్ముఖుడై ఎక్కడో ఉన్న వైకుంఠపురిని మన కనులముందు ఉంచిన తీరు అద్భుతం! అందుకే ఆ కావ్యాలు “ఆచంద్రతారార్కాలు” నిత్య నూతనాలు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం!

“సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగంబు జేదోయి సంధింపఁ డే
పరిపారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జొక్క నొత్తఁడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.”

“ ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవికి చెప్పలేదట, శంఖ,చక్రాది ఆయుధాలని ధరించలేదట, నిరంతరం తనని సేవించే పరివారాన్ని పిలవలేదట, తన వాహన మైన గరుడుని కూడా చూడ లేదట, అలంకారంగా చెవికి పెట్టుకొన్న పుష్పం జారిపోతుంటే దానిని సరిచేసుకోడట, ఇంకా ఆశ్చర్యంకరం వినోదక్రీడలో ఉన్నపుడు లక్ష్మీ దేవి పైట చెంగు తన ఆభరణాలలో చిక్కుకొంటే దానిని కూడా తొలగించకుండ ఉన్నవాడు ఉన్నట్లు భక్తుని రక్షించడానికి బయలు దేరాడట” భక్త వరదుడు కదా! ఆస్వామి. ఎంతటి అద్భుత సన్నివేశ కల్పన ! అందుకే పోతన “ పలికించే వాడు రామభద్రుడు” కాని నేను కాదు అని ముందే విన్నవించు కొన్నాడు. ఇంక గొప్ప చిత్రకారుడు చిత్రీకరించిన అద్భుత చిత్రం వలే ఉన్న ఈ పద్యం తిలకించండి!

“ తనవెంట\న్‌ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతము\న్‌, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండుఁ దా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలము\న్‌.”
ఆర్తత్రాణ పరాయుణుడైన నారాయణుడు త్వరిత గతిని గజేంద్రుని రక్షించ

దలిచి పరువిడగా, ఆ స్వామివెంట ఒకరి తరువాత ఒకరి ఎలా బయలుదేరారో చూడండి!---- “ ముందు నారాయణుడు, ఆవేనుక లక్ష్మి, పిదప పరివారము, వారివెనుక గరుత్మంతుడు, వానివెనుక శంఖచక్రాది ఆయుధాలు వీరిని ఆశ్చర్యంగా చూస్తూ నారదుడు” ఇలా ఆకాశ మార్గాన పయనించి వచ్చే ఆబాల గోపాలాన్ని మనకనులముందు నిలిపిన పోతన ప్రాతఃస్మరణీయుడు కాదా!?

తన పయ్యద స్వామి ఆభారణంలో చిక్కుకొంది ఆయనేమో చూసుకోకుండా పరుగిడుతున్నాడు, లక్ష్మీదేవి తన పయ్యద జారిపోకుండా గట్టిగా పట్టుకొని లాగతూ ఆస్వామి వెంట వెళుతున్న దృశ్యాన్ని ఈ చిన్ని వచనంలో ఎంత చక్కగా వర్ణించేడో చూడండి ! ----

“తదనంతరంబ ముఖారవింద మకరంద బిందుసందోహ పరిష్యందమా నానంద దిందిందిర యగు నయ్యిందిరాదేవి, గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవాద చేలాంచలయై పోవుచు.”

ఈ వచనం చక్కని ‘అనుప్రాసాలంకారంతో’ విరాజిల్లు తున్నది. “ నారాయణుని ముఖమనే అరవిందం ( తామర పువ్వు,) ఆ తామరపూవులో ఉండే మకరంద బిందు సముదాయంలో (తేనె బిందువులలో) తనిసి పరశంతో వికసించిన పద్మము వంటి ముఖంగల లక్ష్మీదేవి, మరల అరవిందం వంటి (ఎర్రని పద్మంవంటి ) స్వామిచేతిలో చికుకొన్న పయ్యద, ఒకరు అటు మరియొకరు యిటు లాగుతున్న చేలాంచెలం” (పయ్యెద) అహో! ఏమి! ఆదృశ్యం కనులు మూసుకొని జ్ఞాన నేత్రంతో వీక్షిస్తే తనువు పులకించి పోదా!?

ఇక్కడ ఒక చక్కని కల్పిత కథ జన బాహుళ్యంలో వుంది, దానిని మరల ఒకసారి చదువు కొని ఆనందిద్దాం. శ్రీనాధునికి, పోతనకి బావాబావమరదుల సంబంధం ఉందని, అలాగే వారిమధ్య జరిగినవిగా చెప్పుకొనే అనేక సంఘటనలు లోక ప్రచారంలో ఉన్నాయి. కాని వారిద్దరికీ ఎట్టి సంబంధం లేదనేది విమర్శకుల అభిప్రాయం. చరిత్ర ఎలాఉన్నా కథ మంచిది కనుక చదువుకొందాం.--- “ ఒకరోజు శ్రీనాధుడు తన పుత్రికతో పోతన ఇంటికి వస్తాడు. వారిద్దరి మధ్య సాహిత్య చర్చ జరుగుతూ ఉంటుంది. పోతన కుమారుడు కూడా ఆ చర్చ వింటూ ఉంటాడు. శ్రీనాధుడు పోతనతో గజేంద్రమోక్షంలోని పద్యాలను గూర్చి చర్చిస్తూ “సిరికిం జెప్పడు--- అన్నపద్యం అంత సమంజసంగా లేదని, మొసలిని సంహరింప దలచిన శ్రీహరి ఆయుధాలు తీసుకోకుండా వెళ్లి ఎలా సంహరిస్తాడు?” అని విమర్శిస్తాడు. పోతన ఏమి సమాధానం చెప్పడు. ఇంతలో భోజన సమయం అవుతుంది. ఇద్దరూ భోజనం చేస్తూ ఉంటారు. పెరటిలో పిల్లలు ఆడుకొంటూ ఉంటారు. అప్పుడు బావిలో ఎదోపడినట్లు పెద్ద శబ్దం వస్తుంది, వెంటనే పోతన కొడుకు “మామయ్యా! నీ కూతురు బావిలో పడిపోయింది వచ్చి కాపాడు” అని, గట్టిగా అరుస్తూ పిలుస్తాడు. అపుడు శ్రీనాధుడు భోజనం వద్దనుండి గభాలున లేచి పైపంచ జారిపోతున్న చూసుకోకుండా బావివద్దకు పరుగెత్తుకెళ్ళి ‘అయ్యో నాకూతురా! ఎలాపడిపోయావు’ అని కంగారుపడుతూ బావిలోకి చూస్తాడు. అపుడు పోతన కుమారుడు “ మామయ్యా! కంగారు పడకు మీ అమ్మాయికి ఏమి కాలేదు. నేనేబావిలో రాయి వేసి నాటకం ఆడాను. బావిలోపడిన మీ అమ్మాయిని రక్షించాలి అంటే తాడు, నిచ్చెన వంటి పరికరాలు వెంట తీసుకు రాకుండా వచ్చేవు, మరి ఎలాకాపాడు తావు,? అంటే ఆపదలో ఉన్నవారిని రక్షించాలి అనుకొన్నపుడు, పైవేవి గుర్తు రావు. రక్షించాలి అన్న విషయం ఒక్కటే మనల్ని తొందర పెడుతుంది కదా!? అలాగే - శ్రీహరి భక్తుని మొర విని రక్షించాలి అనే తొందరలో ఆయుధాలు తీసుకోకుండా బయలు దేరాడు. అనేదే మా నాన్న వ్రాసిన ‘సిరికిం జెప్పడు’ అన్న పద్యంలోని అంతరార్థం” అని అంటాడు. అపుడు శ్రీనాధుడు సిగ్గుపడి, తండ్రికి తగ్గ కొడుకువి పద్యభావాన్ని యుక్తి యుక్తంగా వివరించావు.” అని మెచ్చుకొని ఆశీస్సులందిస్తాడు.” ఈ కథ కల్పితమైనదైనా పోతన కవిత్వం యొక్క గొప్పతనాన్ని చాటుతుంది కదా! ఇట్టి గాధలు మనం చదివి పిల్లలకి చెపితే మన సాహిత్యం ఎంత గొప్పదో మన పూర్వ కవులు ఎంత జ్ఞాన వంతులో వారికి తెలుస్తుంది. ఇంతటితో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ముగిస్తున్నాను.

( వచ్చేనెల ఇంకో ఘట్టం )

( సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)