ధారావాహికలు
మరీచికలు
- వెంపటి హేమ

(గత సంచిక తరువాయి)

ముని మాపువేళకు ఇల్లుచేరిన యామినిని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మరుక్షణం వకుళ పరుగునవచ్చి " కులాసాయా? ప్రయాణం బాగా సాగిందా" అంటూ యామినిని కౌగిలించుకుంది. ఆ తరవాత ఆమెను ఒక్కొక్కరే కుశలప్రశ్నలు అడగ సాగారు.

జరిగినదంతా మొత్తం "పోలో" మని ఏకరువుపెట్టి, వాళ్ళని బాధపెట్టినకంటే; మంచివి, ఆహ్లాదకరమైనవి విశేషాలుమాత్రమే చెప్పి వాళ్ళని సంతోషపెట్టడంలోనే వివేకముంది - అనుకుంది యామిని.

ఆఫీసునుండి వచ్చి విశ్రాంతిగా పడుకున్న రామేశం యామిని కంఠం విని లేచి వచ్చాడు. "నమస్తే అంకుల్ " అంటూ ఎదురుగావెళ్ళి వంగి ఆయన కాళ్ళకు నమస్కరించింది యామిని.

"గ్రేట్! ప్రయాణం బాగా సాగిందా? మొత్తానికి చందనపు అడవుల్ని చూసి వచ్చావన్నమాట" అంటూ బుజం తట్టాడు రామేశం.

యామిని చిన్నగా నవ్వి, చూశాను అంకుల్. చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రత్యేక విషయాలు కూడా ఉన్నాయి నెమ్మదిగా అన్నీ చెపుతాను. " అంది యామిని.

కూతురి గొంతు వినిపించగానే లేచి వచ్చాడు విశ్వనాధం కూడా. " పోనీలే అమ్మా! చిన్నప్పటి నుండి ఉన్న, అడవులు చూడాలన్న నీ ముచ్చట ఇప్పటికి తీరింది. సంతోషమేనా" అన్నాడు కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ.

"చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. వేణ్ణీళ్ళు కలుపుతా, వచ్చి స్నానం చెయ్యి. కొంత బడలిక తగ్గుతుంది" అంది రమణమ్మ మేనకోడలి వైపు ప్రేమగా చూస్తూ.

యామిని స్నానానికి లేచింది. తనుపడ్డ అవమానాలు, కష్టాలూ, కన్నీళ్ళు - ఇవేమీ వకుళకు కూడా చెప్పకూడదు, "పాస్టు ఈస్ పాస్టు!" ఇక తనకు దాంతో పనిలేదు - అనుకుంది దృఢంగా.

ఆ రాత్రి పడుకోబోయే ముందర తను చూసివచ్చిన విశేషాలు కొన్ని వాళ్ళకు చెప్పింది యామిని. గంధపు చెట్లను వర్ణించి, తనకు అమరేంద్ర దాచమని ఇచ్చిన చందనపు బొమ్మల్లో, తనకెంతో నచ్చిన గోవు నానుకుని నిలబడి మురళీ వాయిస్తున్నట్లున్న కృష్ణుని బొమ్మ వకుళకు, నగిషీ పనిచేసిన గంధపు చెక్కలు, రాజేశ్వరికీ రవణమ్మకీ చెరొకటీ ఇచ్చింది, ఆ తరవాత ఎలాగో ఓలాగ బాస్కి సద్ది చెప్పొచ్చులెమ్మని తెగింపుగా.

యధాప్రకారం యానినీ, వకుళా ఒకే మంచం మీద పడుకున్నారు. ప్రయాణంవల్ల, వచ్చిన బడలిక యామిని మొహంలో కొట్టోచ్చినట్లు కనిపిస్తూండడం తో, అది తగ్గేవరకూ యామినిని ఇవీ అవీ అడిగి విసిగించకూడదని, వెనక్కి తిరిగి కళ్ళు మూసుకు పడుకుంది వకుళ. నిజంగానే, శారీరకంగానూ, మానసికంగానూ కూడా బడలి ఉందేమో, మాటాడే మూడ్ కూడా లేక, మంచాన్ని చేరగానే యామిని అలసటతో కళ్ళు మూసుకుని, ఇట్టే నిద్రపోయింది.

* * *

మరుసటి రోజంతా ఎస్కర్షన్ విశేషాలు - ఖెడ్డా, పాముల పోరు వగైరా విశేష విషయాలన్నీ చెపుతూంటే పొద్దు తెలియకుండా గడిచిపోయింది. ఆ రాత్రి వకుళతో కలిసి డిన్నర్ వాళ్ళింట్లోనే చేసింది యామిని. భోజనం చేసి వచ్చి, తిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళింది.

ఆయన భోజనం ముగించి విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు. తండ్రికి ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చి, ఆవి వేసుకోడం అయ్యక, పాలగ్లాసు చేతికి ఇచ్చి, గదిని సవిరించడం మొదలుపెట్టింది యామిని. పుస్తకాలమధ్య కనిపించింది రెండు రోజులకు ముందు వచ్చిన పోస్టు. అది ఇంకా ఎవరూ తెరిచి చడవలేదు. వాటిని చేతిలోకి తీసుకుంది యామిని. మూడున్నాయి అవి. ఒక్కొక్కటీ విప్పి తండ్రికి చదివి వినిపించసాగింది యామిని .........

ఒకటి కార్డు. అది చందా అడుగుతూ ఒక ధార్మిక సంస్థ రాసినది. రెండవది ఒక ఇన్లాండ్ లెటర్. విప్పి చదివింది యామిని. తనకు ఉద్యోగం దొరికిందంటూ విశ్వనాధం గారికి శిష్యుడు రవి రాసిన ఉత్తరం అది . ఆ వార్త విని విశ్వనాధం చాలా సంతోషించాడు. ఇక మూడవది, ఒక శుభలేఖ! యామిని ఆ శుభలేఖ చూసి ఆశ్చర్యంతో కేకపెట్టింది ....

" కామాక్షికి పెళ్లిట!" సరిగా అప్పుడే యామిని కోసం అక్కడికి వచ్చింది వకుళ.

"నాన్న! ఇన్నాళ్ళకి కామాక్షికి కల్యాణ ఘడియలు వచ్చినట్లున్నాయి! దాని పెళ్ళి శుభలేఖ ఇది. ఇంతకీ దాన్ని పెళ్లి చేసుకోబోతున్న ఆ అదృష్టవంతుడు ఎవరో రాజారాంట! " అంది రవంత హేళన మిళాయించిన స్వరంతో.

"రాజారాం అంటే ఎవరో కాదమ్మా, కామాక్షికి మేనత్త కొడుకే! మొదట్లో వాళ్ళు పిల్లనిమ్మని వస్తే, పిల్లాడు నలుపని వీళ్ళు చెందనాడుకున్నారు. తరవాత కామాక్షిని గురించి విన్న పెళ్ళివారెవరూ దాన్ని ఇష్టపడకపోడంతో, చివరికి ఇంటి ఆడపడుచుని పరువు నిలబెట్టమని బతిమాలుకొని, వాళ్ళ సంబంధం ఖాయం చేసుకుని ఉంటారు. అంతా ఘటన అంటారు అందుకే! ఈ లోగా ఎన్ని తరిమిట్లు పడినా వృధాయే కదా" అన్నాడు విశ్వనాధం.

"పాపం కామాక్షి! ఎన్నిసార్లో వలలు వేసింది, కాని ఒక్క చేపా పడలేదు. చివరకి రాసిపెట్టినవాడే మొగుడౌతున్నాడన్నమాట! పోనీలే పాపం! వాళ్ళు సుఖంగా బతికితే అంతే చాలు" అంది, అన్నగారి కోసం మంచినీళ్ళ చెంబు తీసుకుని వచ్చిన రవణమ్మ సానుభూతితో .

వకుళ తన కోసం రావడం చూసి, "నాన్నా నేనింక పడుకోడానికి వెళ్ళనా" అంటూ తండ్రికి దుప్పటీ కప్పి, గదిలోని ట్యూబ్ లైట్ ఆర్పి, బెడ్ లైట్ వేసి వకుళ వెంటనడిచింది యామిని.

యామిని టేబుల్ మీద పడేసిన శుభలేఖ చేతిలోకి తీసుకుంది వకుళ. హాల్లోకి వచ్చాక యామినిని అడిగింది. "యామినీ నీకీ కామాక్షి బాగా తెలుసా" అని.

"నిజానికి తెలియాల్సిన పనిలేదు. ఊరికి ఉత్తరపు కొసలోఉంది వాళ్ళిల్లు. చాలాదూరం. కాని ఈ కామాక్షి కొన్నాళ్ళు మన ఇనిస్టిట్యూట్ కి వచ్చింది. అలా అయ్యింది పరిచయం. మనసుల మధ్య సాపత్యం ఉంటే గాని మనుష్యుల మధ్య స్నేహం కలవదు, వకుళా. తన పద్ధతులన్నీ వేరు. ఒట్టి తింగరిది. కాస్త అందంగా ఉన్న అబ్బా యెవరు కనిపించినా ఇట్టే మనసు పారేసుకుంటుంది. అంతేకాదు, వాడు తన కోసమే పుట్టాడనుకుంటుంది. దీనికి వత్తాసు దీని మేనత్త! అంత స్కీమింగ్ బ్రెయిన్ మళ్ళీ ఎక్కడా కనిపించదు మనకు. ఇద్దరూ కలిసి ప్లానువేస్తే ఏ అబ్బాయికో మూడిందన్నమాటే - అని చెప్పుకుంటారు ఊళ్ళోవాళ్ళు. నాలుగేళ్ళయ్యి ఉంటుంది, లేటేష్టు ఎపిసోడ్ జరిగి, మేనత్తా, మేనకోడలూ కలిసి, వ్యూహం పన్ని ఒకబ్బాయిని పట్టాలని చూశారుట! కాని ఆ అబ్బాయి, దీనితో పెళ్ళి కంటే ఏదైనా మేలేనని, "జై భజరంగా " అంటూ, ఇల్లొదిలి వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోయాడుట! ఎంతబాగుందో చూడు! చాలారోజులు ఊరు ఊరంతా ఇదేమాట హోరెత్తిపోయింది." అంది యామిని.

వకుళ ఏమనుకుంటోందో చూడాలని తల తిప్పి ఆమె మొహంలోకి చూసిన యామిని నిర్ఘాంతపోయింది. వకుళ మొహం చుక్క రక్తం లేనట్లు, తెల్లగా పాలిపోయి కళావిహీనంగా ఉంది. ఆమె పెదవులు ఉద్వేగంతో ఒణుకుతున్నాయి.

కంఠస్వరం కంపించి పోతూండగా, "ఇదంతా నిజమే కదూ?" అడిగింది వకుళ.

"చాలా వరకు నిజమే. కామాక్షి స్వభావం నాకు బాగా తెలుసు. వట్టి తింగరిది! టైపు నేర్చుకోడానికి వచ్చినప్పుడు కూడా ఇది అక్కడ ఒక అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టింది. కాని దైవికంగా వాళ్ళ నాన్నకు ట్రాన్సుఫర్ అవ్వడంతో వాళ్ళు ఇక్కడినుండి వెళ్ళిపోయారు. ఆ తరవాత ఇది కూడా ఇనిస్టిట్యూట్ కిరావడం మానేసింది.

కాని ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి వకుళా! ఈ రూమర్లన్నవి ఒకరి నోటి నుండివేరొకరి నోటికి మారినప్పుడల్లా ఎంతోకొంత మారిపోతూనేఉంటాయి. నాకు కామాక్షి స్వభావం తెలుసు కనక నేను నీతో చెప్పగలిగాను, కేవలం అపవాదులను పట్టుకుని కాదు. మా రెండిళ్ళకీ మధ్యనున్న దూరాన్నిబట్టి చూస్తే, నేను చెప్పినదానిలో కూడా చాలా ట్విస్టులే ఉండి వుంటాయి. "

"యామినీ, నీకు పుణ్యముంటుంది! ఆ పిల్లని గురించి నీకు తెలిసిన విషయాలు మా నాన్నకు కూడా చెప్పవూ" అని అడిగింది వకుళ, కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ.

వకుళ ఎందుకంత హైరాణ పడుతోందో తెలియక యామిని కంగారు పడింది. కాని తన చెయ్యి పట్టుకుని నడిపించుకుపోతున్న స్నేహితురాలి వెంట మాటాడకుండా నడిచి వెళ్ళింది.

రామేశం భోజనం ముగించి, రాత్రి వేసుకోవలసిన మందులన్నీ వేసుకుని ఇక నిద్రపోడానికి సిద్ధంగా, రేడియో సన్నంగా పెట్టుకుని వింటూ, మంచం మీద కూర్చున్నాడు.

యామిని చెయ్యి పట్టుకుని అక్కడకు తీసుకు వచ్చిన వకుళ ముందుగా చేసిన పని రేడియో కట్టేయ్యడం. ఆశ్చర్యంగా తలెత్తి ఆమెవైపుకి చూశాడు రామేశం.

"నాన్నా! ఆ రాక్షసికి పెళ్ళీట" అంది వకుళ కటువుగా. తండ్రి "ఏ రాక్షసి" అని అడక్కముందే శుభలేఖ ఆయనకు ఇచ్చింది.

రామేశం చదివి చూశాడు. తలపైకెత్తి కూతుర్నిచూస్తూ, " పోనీలేమ్మా, మంచిదే కదా -మన ప్రాణానికి పడి ఏడవకుండా.....! సంతోషం" అన్నాడు శుభలేఖ పక్కనున్న టీపాయ్ మీద పెడుతూ.

"సంతోషమా నాన్నా! ఎవరి జోలికీ పోకుండా మన దారిన మనం హాయిగా బ్రతుకుతూంటే, మన సంసారాన్ని రచ్చకీడ్చి, విఛ్ఛిన్నం చేసింది ఆ రాక్షసి కాదా? యామిని చెపుతుంది విను అదేంత ఘటికురాలో!" ఉకోషపడింది వకుళ. యామిని వైపు చూశాడు రామేశం.

" నిజమే అంకుల్! అది ఉట్టి తింగరిబుచ్చి. మంచిచెడ్డలు తెలియవు! వాళ్ళత్త సుబ్బులమ్మ ఎలా చెపితే అలా ఆడుతుంది. దాన్ని గురించి చమత్కారమైన కథలెన్నోఊళ్ళోవాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూంటారు" అంటూ, వకుళకు చెప్పిన విషయాలే రామేశానికి కూడా చెప్పింది యామిని. తెల్లబోయాడు రామేశం.

" అమ్మా, వకుళా! నన్ను క్షమించ గలవా తల్లీ! ఆడపిల్ల అలా వీధెక్కిందంటే తగినంత కారణం ఉండే ఉంటుందని మీ అన్నయ్యని శంకించాను. వాళ్ళనే నమ్మాను. అహంకారంతో, నామాట వినలేదని కోపగించి ప్రాణానికి ప్రాణమైనవాడిని ఇంట్ళోంచి వెళ్ళిపొమ్మన్నాను. పూర్వాపరాలు పట్టి నిదానించి చూడకుండా తొందరపడ్డాను, ఫలితం అనుభవిస్తున్నాను. అక్కడకూ వాడు చెపుతూనే వున్నాడు, తనే తప్పూ చెయ్యలేదని! కాని ఆడపిల్లల ఆత్మగౌరవం మీదున్న నమ్మకంతో ఆ పిల్లకి న్యాయం చెయ్యాలని, నా కన్ను నా వేలితోనే పొడుచుకున్నానమ్మా" అంటూ దోసిలిలో ముఖం దాచుకుని దు:ఖించడం మొదలుపెట్టాడు రామేశం.

కూతురు వెళ్ళాక నిద్రపోవాలని కళ్ళుమూసుకున్నా, విశ్వనాధానికి వెంటనే కునుకురాలేదు. వినీవినిపించకుండా ఉన్న మాటలనుబట్టి, ఇంట్లో వాళ్ళింకా నిద్రపోలేదని అర్థం చేసుకుని తనుకూడా వాళ్ళలో చేరి కబుర్లు చెప్పాలని లేచి హాల్లోకి వచ్చాడు విశ్వనాధం. రామేశం కూతురితో అంటున్న మాటలు ఆయన చెవినిపడ్డయి, కాని సరిగా వివరం తెలియలేదు.

రామేశం దు:ఖానికి అవధులు లేకపోయింది. "అమ్మా యామినీ! జాతిరత్నం లాంటి కొడుకమ్మా! నేనే లేనిపోని భేషజాలకుపోయి, చేజేతులా జారవిడుచుకున్న నిర్భాగ్యుణ్ణి! నా బంగారు తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో " అంటూ ఇక దు:ఖం ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు రామేశం పసివాడిలా.

ఆ మాటలు విశ్వనాధానికి వినిపించాయి. అప్పుడప్పుడు రామేశానికి ఒక కొడుకు ఉన్నాడని వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోడం వినిపించినా, ఆయన మాటల్లో ఎప్పుడూ ఆ ప్రసక్తి రాకపోడంతో, తను విన్న మాటల్ని ఉత్తుత్తి నీలివార్తలుగా కట్టేశాడు తను. అంతేకాదు, ఒకసారి గురుమూర్తి "బ్యాంకువాళ్ళు మన రామూకి వయసొచ్చిన కొడుకు వున్నాడంటున్నారు" అన్నప్పుడు కూడా, "అది నిజం అయ్యివుండదు. నిజమే అయితే రామూ ఎందుకు మనకు చెప్పడు? ఏ బంధువుల అబ్బాయినో చూసి జనం అలా అనుకుని ఉంటారు" - అని తను ఎంతో నమ్మకంగా చెప్పేశాడు. ఇప్పటికి తెలిసింది తనదే పొరపాటని! ఇలా, ఇంత ఇదిగా ఈ తండ్రీ కొడుకులు విడిపోవలసిన అవసరం ఏమొచ్చిందో మరి! ఇక ఉపేక్షించను. అడిగి తెలుసుకుంటా " అనుకుంటూ రామేశం గదిలోకి నడిచాడు విశ్వనాధం. ఇంతలో వంటింటి సద్దుబాట్లు పూర్తి చేసుకుని అక్కడకి వచ్చింది రాజేశ్వరి కూడా.

"ఏమిటి? ఏమయ్యింది" అని అడుగుతూ విశ్వనాధం కంగారు పడుతూ లోపలకు వచ్చాడు. టూకీగా జరిగిందంతా తండ్రికి చెప్పింది యామిని. విశ్వనాధం రామేశం పక్కనే కూచుని అతని బుజం చుట్టూ చెయ్యి వేసి, మౌనంగా.

రామేశామికది భరించ లేనిదయ్యింది. " విస్సూ! నా పాపానికి నిష్కృతి లేదురా ..... ! నిర్దోషిని దోషిగా నిర్ణయించి ఇంట్లోంచి పొమ్మన్నాను. ఇక ఈ జన్మలో ఇక నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదురా" అంటూ వాపోయాడు.

" రామూ! ఊరుకో! మరీ అంత బేలతనం పనికిరాదు. నువ్వు నిర్దోషికి శిక్షవేసి ఊరుకోలేదు, నీకు నువ్వూ వేసుకున్నావు భయంకరమైన శిక్ష! రోజురోజుకీ, నువ్వు ఎలా కృంగిపోతున్నావో నేను చూస్తూనే ఉన్నా. కాని దానికి అసలైన కారణం మాత్రం నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు నాకీ విషయం ముందే చెప్పివుంటే ఈ సమస్య ఎప్పుడో తీరిపోయేది కదా! ఇలా ఎందుకు చేశావు?"

"ఏమోరా! "నీ సుఖం నలుగురితో పంచుకో, నీ దు:ఖం నీలోనే ఉంచుకో" అన్న ఇంగ్లీషు సామెతను నమ్మా, అలా నమ్మిమరో తప్పు చేశా!"

"అది ఒకళ్ళ సంగతి ఒకళ్ళకి పట్టని మ్లేఛ్ఛజాతుల లోకోక్తి, మనది ఎంతమాత్రం కాదు. అది మనకి సరిపడదు. అందరం కష్ట సుఖాలు కలబోసుకుని బ్రతకడమన్నది మన సంస్కృతి. ఆత్మీయులంటే అర్ధం తెలియదా? సరే! జరిగిపోయింది ఎలాగా వెనక్కి రాదు! విచారించకురా రామూ! "బుద్ధి: కర్మానుసారిణి" అంటారు. నీ ప్రమేయం ఏమీ లేదు. అది అలా జరగవలసి ఉంది జరిగిపోయింది. నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి" అన్నాడు ఓదార్పుకోసం విశ్వనాధం.

రాజేశ్వరి, వకుళ గుడ్లనీరు కుక్కుకుంటూ ఒకపక్కగా నిలబడి వాళ్ళ మాటలు వింటున్నారు. యామిని మాత్రం, విషయం అర్థమయ్యీ కాని పరిస్థితిలో, దిగ్భ్రాంతితో అందరి మొహాలవైపుకీ మార్చి మార్చి చూస్తూ వాళ్ళపక్కన నిలబదిపోయింది.

"రామూ! మొహం మీది ఆ చేతులు ఏమిటి, తీసేసెయ్యి. విచారిస్తూ కూర్చోవద్దు. చేతికందిన కొడుకుని చేజేతులా చెయ్యిజార్ఛుకున్న నీ దు:ఖం నాకు అర్థమౌతోంది. కాని, జరిగింది చాలు, దాన్ని శీఘ్రం సరిదిద్దుకోవాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యాలి గాని, దు:ఖిస్తూ ఉండిపోడం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పు?" అని, కూతురువైపు తిరిగి, "అమ్మలూ, నువ్వెళ్ళి లెటర్ పేడ్డు, పెన్ను తీసుకురా, అంకుల్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో! రేపు దానికి ఓ ఇరవై కాపీలు తీసి అంకుల్కి ఇయ్యి. పొద్దున్నే ఆపని పూర్తిచెయ్యి. రేపు కొన్నైనా లెటర్సు పోష్టు చేద్దాం" అన్నాడు విశ్వనాధం.

"సరే నాన్నా" అంటూ ఆ పనిమీద వెళ్ళింది యామిని .

"ఒరే, రామూ! జరిగినడి పొరపాటనీ, దాన్ని సరిదిద్దుకుందామనీ ఎక్కడున్నా వెంటనే ఇంటికి తిరిగి రమ్మనీ నువ్వు నీ కొడుక్కి ఉత్తరం రాయి. నేను చెపుతున్నా చూడు, ఆ ఉత్తరం డిక్టేట్ చెయ్యడం పూర్తయ్యేసరికి నీ గుండె బరువు చాలావరకూ తగ్గిపోయి నువ్వు తెరిపినపడతావు. పనిలోపనిగా, ఎక్కడున్నా తెలియజెయ్యమని, అతని ఫ్రెండ్సుకి కూడా రాద్దాం. నువ్వు డిక్టేట్ చేసిన ఉత్తరం పేపర్లకు పంపిద్దాం. త్వరలోనే మీవాడు తిరిగి వస్తాడు చూడు" అంటూ ఉషారుగా చెప్పాడు విశ్వనాధం.

యామిని లెటర్ పేడ్డు, పెన్ను తెచ్చింది. వాటిని తనే అందుకున్నాడు రామేశం. " నువ్వు వద్దమ్మా, నేనే స్వయంగా నా చేతులతోనే రాస్తా. అలా చేస్తే అది నాకు కొంత తృప్తి నిస్తుంది" అన్నాడు.

తను చేసిన పొరపాటుని క్షమించమని కొడుకుని అడుగుతూ ఉత్తరం రాసి,, సంతకం చేసి, దానిని యామిని చేతికి ఇచ్చి, చదివి అందరికీ వినిపించమని అడిగాడు రామేశం. యామిని ఆ ఉత్తరం అందుకుని చదవడం మొదలుపెట్టింది .........

" నాన్నా, ప్రిన్సు! పెద్దమనసు చేసుకుని ఈ నాన్నను క్షమించగలవా? నువ్వు వెళ్ళినప్పటి నుండి ప్రతిక్షణం నిన్నే తలుచుకుంటూ, అహం అడ్డొచ్చి ఆ మాట పైకి చెప్పలేక, నిన్ను మర్చిపోవాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించక నిప్పచ్చరపు బ్రతుకు బ్రతికాను. ఈ మూడు ..... నాలుగేళ్ళూ నేను పడ్డ యాతన ఇంతా అంతాకాదు. ఇన్నాళ్ళకి ఇప్పుడు, నా తప్పు నేను తెలుసుకున్నాను. సారీరా కన్నా! ఈ నాన్నను మన్నించి తక్షణం బయలుదేరి మన ఇంటికి వచ్చేయ్యి. మీ అమ్మ, నీ చెల్లెలు వకుళ కూడా నీ రాకకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇది నీ ఇల్లు, మేము నీవాళ్ళమే కదా! తొందరగా రా...

ఇట్లు
మీ నాన్న రామేశం

అక్కడే ఉన్న రాజేశ్వరి ఇక దు:ఖం ఆపుకోలేకపోయింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మాటాడింది, " మేము చెపుతూనే ఉన్నాం అన్నయ్యగారూ, వాడు అల్లాంటి దుర్బలుడు కాడని! ఈయన మా మాటలు వినిపించుకుంటేకదా ..... ! వాళ్ళ మాయా తక్కువదేంకాదు. ఆ మాయలోపడి ఈయన వాడిని నిర్దాక్షిణ్యంగా బహిష్క రించారు. అంతేకాదు, ఇంట్లో వాడి గుర్తన్నది మిగలకుండా చేశారు. ఒక్క మహా - భయంకరమైన ఒట్టుతో నన్నూ, వకుళనూ కూడా వాడి మాట ఎత్తనీకుండా చేశారు. పోనీ అల్లా గని, పూర్తిగా విరక్తి చేసుకున్నారా - అంటే, అదీ లేదు. ప్రతి క్షణం వాడిమీది బెంగతో కుమిలిపోతూ ఆరోగ్యం పాడు చేసుకున్నారు. నాకు అంతా తెలుసు, కాని ఏమీ చెయ్యలేక, నోరు మూసుకుని ఉండిపోయా" అంది. కారే కన్నీటితో పాటుగా, ఇన్నాళ్ళూ మనసులో పేరుకొని ఉన్నఆవేదనని కూడా వెళ్ళగక్కింది రాజేశ్వరి. .

"బాధపడకు తల్లీ! త్వరలోనే అన్నీ సద్దుకుంటాయి. ఇంకొద్ది రోజులు ఓపిక పడితే మీవాడు మీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్రియాలైన విషయాలేమీ తలుచుకోవద్దు. గడచిపోయింది తల్చుకుంటే మనకు మిగిలేది పరితాపం ఒక్కటే! ఇక భవిష్యత్తు అంటావా - అది అంతుదొరకని గొప్ప అయోమయం. మనకింక మిగిలిఉన్నదీ, అవసరానికి పనికివచ్చేదీ ప్రస్థుతమొక్కటే! మనం మన పని మొదలుపెడదాం. పిలుపు అందాలేగాని వెంటనే మీ అబ్బాయి పరుగెత్తుకుంటూ రాడూ......! శని రోజులు వస్తే మనకి ఏవేవో ఇబ్బందులు రాకమానవు. కాని అవి శాశ్వతం కావు. " అందరికీ ఓదార్పు కలిగేలా మాట్లాడాలనుకున్నాడు విశ్వనాధం.

రామేశం మోహమ ఎర్రగా కందిపోయింది. " తలుచుకుంటే సిగ్గవుతోంది.వాడిని చూడాలంటే నాకు మొహం చెల్లుతుందనిపించడం లేదురా విశ్శూ? అది తలుచుకుంటేనే నా మనసు సిగ్గుతో చితికిపోతున్నట్లు ఉందిరా" అన్నాడు రామేశం దీనంగా.

విశ్వనాధం వెంటనే ఆ మాటల్ని ఖండించాడు. "ఛా! అవేం మాతలురా రామూ! "బ్లడ్ ఈస్ థిక్కర్ దేన్ వాటర్!" రక్తసంబంధం అంత తెలికగా విడిపోయేది కాదు. నీకొడుక్కి నీమీద కోపం ఇంకా ఉంటుం దనే అనుకుంటున్నావా? ఎప్పుడో అంతా మర్చిపోయి, నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటాడు. మిమ్మల్ని చూడాలన్న తహ తహ అతనికి మాత్రం ఉండదా ఏమిటి!?."

"ఏ.......... మో............రా ...... విస్సూ ....... ! " రామేశానికి మత్తుగా కళ్ళు మూతలు పడసాగాయి. మాట సరిగా రాలేదు. నిద్రమాత్రల ప్రభావం మొదలయ్యింది.

అది గ్రహించాడు విశ్వనాధం. ఇక పడుకోరా రామం!రే పు లేవగానే ముందుగా మనం ఉత్తరాల సంగతి చూద్దాం. ఆలస్యం చెయ్యవద్దు. ఇకనేను వెళ్ళనా " అంటూ తమ వాటాలోకి దారితీశాడు విశ్వనాధం . రామేశం వెంటనే మంచం మీద పడుకుని, మరు క్షణం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు.

బిక్కమొహం చేసుకుని గదిలో ఒక వారగా గోడకానుకుని నిలబడి ఉన్న వకుళ దగ్గరకు వెళ్ళింది యామిని, " వకుళా! ఈ వేళ నువ్వు ఆంటీ దగ్గర పడుకో. నీకే ఇంత ఇదిగా ఉంటే, ఆమెకెంత బాధగా ఉంటుందో! రేపు మనకి చాలా పని ఉంది. నేను వెళ్ళి మా అత్తయ్య పక్కన పడుకుంటా" అంటూ తండ్రి వెనక తమ వాటాలోకి వెళ్ళిపోయింది యామిని.

* * *

ముందు రాత్రి సరిగా నిద్రపోని వాళ్ళు మరునాడు ఆలస్యంగా నిద్ర లేవడం అన్నది వింతేం కాదు. మరీ తొందరగా నిద్రపోడం వల్ల, రాత్రి వైపరీత్యాలేమీ తెలియని రమణమ్మ మాత్రం రోజూ వేళకే నిద్రలేచి, పనులు మొదలుపెట్టింది.

యామిని మీద ఆమెకు వల్లమాలిన ప్రేమ ఉంది. ఆమె యామినికి కన్నతల్లి కాకపోయినా, ఆరేళ్ళైనా నిండకముందే తల్లిని కోల్పోయిన యామినిని తానే తల్లై పెంచుకొచ్చింది ఆమె!

"అడవిలో నా చిట్టితల్లికి సరైన తిండి దొరికి ఉండదు. అందుకే కాబోలు, మరీ అంత చిక్కిపోయింది! మళ్ళీ రేపు హైదరాబాదు వెళ్ళిపోయాక కూడా రదో కాస్త వండుకు తిని ఆఫీసుకి పరుగెత్తడమేకదా! కడుపు నిండా తిండి తినేందుకు కూడా టైం ఉండదు. ఏం ఉద్యోగమో ఏమో గాని పిల్ల నలిగిపోతోంది, పాపం! ఇక్కడున్న రెండురోజులైనా కాస్తంత మంచి తిండి పెట్టాలి" అనుకుంది.

వెంటనే రెండు గ్లాసుల మినప్పప్పు నీళ్ళలో పోసింది, యామినికి ఇష్టమైన పెరుగుగారెలు చేసి పెట్టడానికి. ఆ రోజు రెండు కుటుంబాలకీ తనే భోజనం పెట్టాలన్నది ఆమె సంకల్పం.

యామిని ఇంటికి వచ్చిందంటే చాలు, ఆమెకు పండుగ నట్టిం టికి వచ్చినట్లే అనిపిస్తుంది. తను అల్లారు ముద్దుగా పెంచిన తన పెంపుడు కూతురు మంచి ఉద్యోగస్థురాలై పుట్టినింటిని నిలబెట్టిందని ఆమెకు లోలోపల కించిత్తు గర్వంగా కూడా ఉంటుంది.

"సాధారణంగా ఆడపిల్లలు పుట్టింటి సంపదను ఏదో విధంగా అత్తింటికి చేరెయ్యాలని చూస్తారేగాని, పుట్టింటి అవసరాలకు స్పందించాలని అనుకోరు. అండుకే వాళ్ళని మైనస్ పోయింట్లుగా లేక్కేస్తారు కన్నవాళ్ళు! నా బంగారుతల్లి ఎంతమాత్రం అలాంటిది కాదు, తను ప్రయోజకురాలై పుట్టింటి పరువును నిలబెట్టింది. ఆడపిల్లల్లోకూడా ప్లస్ పోయింట్లు తెచ్చీవారు ఉంటారని లోకానికి తెలియ జెప్పింది" అని యామినిని తలుచుకు తలుచుకు మురిసిపోతుంది రమణమ్మ.

నెమ్మదిగా ఒకరొకరే లేస్తున్నారు. మెలకువ రాగానే, ఆరోజు చెయ్యాల్సిన పనులు గుర్తు రావడంతో, కంగారుగా మంచం దిగింది వకుళ. అప్పటికే లేచివున్న రాజేశ్వరి, కాఫీ పెట్టే ప్రయత్నంలో ఉంది.

అప్పుడే మొహం కడుక్కుని వచ్చిన వకుళ తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వచ్చింది. " అమ్మా నాన్నని నిద్ర లేపనా" అని అడిగింది.

"వద్దమ్మా. ఇంకా కొంతసేపు నిద్రపోనీయ్. ఈ వేళ ఆదివారమే కదా, తొందరేముంది? పొద్దెక్కి లేస్తే నష్టమేం లేదు, పడుకోనియ్యి" అంది రాజేశ్వరి.

అంతలో అక్కడకు వచ్చింది యామిని. "నాకు మీ చేతి కాఫీ తాగాలని ఉంది, ఆంటీ! మీరు అంకుల్కి ఇచ్చినప్పుడు నాకూ ఒక కప్పు కాఫీ ఇవ్వాలి, తప్పదు" అంతూ గారాలుపోయింది.

రాజేశ్వరి చిన్నగా నవ్వి, "అల్లరిపిల్లా! ఏమయ్యిందేమిటి? మీ అత్త నీకు ఈవేళ కాఫీ ఇవ్వనందా ఏమిటి" అంది.

కళ్ళు రెపరెపలాడించి అంది యామిని, "అమ్మో! ఆవిడ ఆగడాలు మీకేం తెలుసని! నేను పుట్టకముందే ఆడపిల్లే పుడుతుందని ఛాలంజ్ చేసి, నాకోసమని ఒక గొలుసు చేయించి ఉంచిందిట! అలాగే ఇప్పుడు కూడా నే నింకా నిద్రలేవకముందే, నాకోసం కాఫీ కలిపేసి ఉంచుతుంది. చాలా గొప్ప కేరెక్టర్, ఏమనుకుంటున్నారో" అంది కొంటెగా నవ్వుతూ.

" చాలా బాగుందిలే నీ నిందాస్థుతి" అంటూ నవ్వింది వకుళ.

" కబుర్లు తినిపించి కాఫీ ఇవ్వడం మానొద్దు. మీరు కలిపిన కాఫీ తాగాలనివుంది నాకీవేళ" అంది యామిని.

"అదెంత భాగ్యం, పిచ్చిపిల్లా! తప్పకుండా ఇస్తాలే. అన్నట్లు, ఈ వేళ మీకందరికీ బ్రేక్ఫాస్టు మా ఇంట్లోనే. నీ కిష్టమని మసాలా దోశ ప్లాన్ చేశా. బ్రేక్ఫాస్టు అయ్యాక మీరు మీ రనుకున్నపని మొదలెట్టవచ్చు. సరా?

"వావ్! దోశ కూరతో తిండమంటే నాకు చాల చాలా ఇష్టం. థాంక్యూ ఆంటీ! థాంక్యూ..... ! " అంది సంబరపడుతూ యామిని. "తను కూడా ఏమిటేమిటో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది, మా రమణమ్మత్త. ఈ వేళ మీ భోజనం అక్కడే - అనుకుంటా. కాసేపట్లో మీకు పిలుపు రావచ్చు. కాని నేనిలా ముందే చెప్పేశానని మాత్రం ఆమెకు తెలియనీయొద్దు, ప్లీజ్! ఆవిడంటే నాకు చాలా భయం" అంటూ భయం నటించి వాళ్ళని నవ్వించింది యామిని.

"చాల్లే, ఊరుకో కొంటె పిల్లా! ఆవిడంటే నీకు ఎంతభయమో నాకు తెలియదా ఏమిటి" అంటూ నవ్వింది రాజేశ్వరి.

తండ్రి నిద్రలేచాడేమో చూడాలని వెళ్ళిన వకుళ "అమ్మా" అంటూ గొంతెత్తి ఆర్తనాదంలాంటి ఒక వెర్రికేక పెట్టింది. ఆ కేకవిని యామినీ, రాజేశ్వరీ కంగారుపడుతూ ఆమె దగ్గరకు పరుగుపెట్టారు. అక్కడ వాళ్ళకు కనిపించిన దృశ్యాన్నిచూసి వాళ్ళు భయంతో నిలువునా కొయ్యబారిపోయారు.

వకుళ తండ్రి బుజాలు పట్టుకుని కుదుపుతూ "లే నాన్నా లే" అంటూ భోరున ఏడుస్తోంది. ఏ స్పందనా లేకుండా అచేతనంగా మంచం మీద పడి ఉన్నాడు రామేశం. రాజేశ్వరి, ఆయన కాళ్ళూ చేతులూ పట్టిచూసి, తలబాదుకుంటూ ఆయనమీద వాలిపోయి ఏడవసాగింది. విషయం ఏమిటో అర్థంకాగానే తండ్రి కోసం పరుగెత్తింది యామిని.

ఇంకేముంది! చూస్తూండగా ముగిసిపోయింది అంతా. రామేశం మరి లేడు, ఆయన ప్రాణవాయువులు ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయాయి! వాళ్ళ ఏడుపులు విని కంగారు పడుతూ ఇరుగుపొరుగులవాళ్ళు రాసాగారు. వాళ్ళలో కొందరు, గుమ్మం బయట నేలమీద చాపపరిచి, రామేశం పార్ధివ దేహాన్ని నలుగురూ సాయంపట్టి తీసుకెళ్ళి భూశయనం చేయించారు. ఆప్తమిత్రుని మరణానికి విశ్వనాధం, రమణమ్మా కూడా ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. యామిని సరేసరి, వకుళను కౌగిలించుకుని ఒకటే ఏడుపు! చూస్తూండగా, ఇరుగు పొరుగులు చాలామందే పోగుపడ్డారు. వెంటనే సోమయాజులుగారు, కొడుకు, కోడలూ కూడా వచ్చారు. కబురు తెలవగానే, ఒకరొకరుగా బ్యాంకు ఉద్యోగులు రాసాగారు.

రామేశం హఠాన్మరణానికి కారణం "మాస్సివ్ హార్టు అటాక్" కావచ్చునని అనుకున్నారు అందరూ! అంత వరకూ సంపూర్ణారోగ్యంతో ఉన్నట్లు కనిపించే మనిషిని, అంతలోనే విగత జీవునిగా మార్చేసే అద్భుత శక్కి దానికే ఉంది మరి! సాంప్రదాయం ప్రకారంఎవరో ప్రమిదలో చమురుపోసి, వత్తివేసి వెలిగించి తెచ్చి, శవం తల దిక్కిన ఉంచారు. అక్కడున్నవారిలో అనుభవజ్ఞుడైన పెద్దమనిషి ఒకడు కల్పించుకుని, "కావలసిన వారికెవరికైనా కబురు పెట్టాల్సి ఉంటే తొందరగా ఆ పని కానియ్యండి" అన్నాడు .

"ఒక్కర్తే కూతురు! కొడుకులు లేరు కాబోలు, తలకొరివి ఎవరు పెడతారు?" మరొకరి సందేహం.

" ఏం? కొడుకులే తలకొరివి పెట్టాలనడం ఏమిటి? కూతుళ్ళు పిల్లలు కారా ఏమిటి, వాళ్ళెందుకు పెట్టకూడదు?" ఒక సంఘ సంస్కర్త లెవదీశాడు అసలు సిసలు లాపోయింటు.

వెంటనే జవాబు చెప్పారు ఇంకెవరో, " ఏమిటి నీ ఉద్దేశ్యం? నీ కున్నంత తెలివితేటలు మన పూర్వీకులకు లేవనా? ఆడవాళ్ళు సున్నిత మనస్కులు. అలాంటి కటిక పనులు వాళ్లు చెయ్యలేరని వాళ్ళని మినహాయించి ఉంటారు. కాలక్రమంలో అదే ఆచారంగా మారిపోయి ఉంటారు.".

అక్కడ చేరిన వాళ్ళు నలుగురూ నాలుగురకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు గుసగుసగా మాటాడుకుంటున్నారు. చూస్తూండగా పొద్దు గడిచి పోతోంది. ఆ పూట ఆ వాడకట్టున ఎవరికీ భోజనాలు లేవు. ఆ చుట్టుపక్కల ఎవరూ పొయ్యి ముట్టించలేదు. చీకటి పడకముందు శవదహనం పూర్తి కావాలి . లేకపోతే రాత్రి భోజనాలకు కూడా వీలుండదు. అక్కడవాళ్ళకి రామేశంగారికి తలకొరివి ఎవరు పెట్టాలన్నది పెద్ద ప్రశ్నయ్యి కూర్చుంది.

గురుమూర్తి దేశంలో లేడు. అమెరికాలోఉన్న చిన్నకూతురు, తల్లి సంవత్సరీకాలకు వచ్చి, వెడుతూ కొన్నాళ్ళు తండ్రిని తన దగ్గర వుంచుకోవాలని వెంట తీసుకెళ్ళింది. అతడు తిరిగి రావడానికి ఇంక కొంతకాలం పడుతుంది.

కబురందుకుని వచ్చిన పురోహితుడు విశ్వనాధంతో, " అయ్యా! చీకటి పడకముందే శవదహనం ఐపోవాలంటే ఇప్పటినుండీ కర్మకాండ మొదలుపెట్టాలి. కర్త ఎవరు?" అని అడిగాడు.

అంతలో మురళీ వచ్చి " మాష్టారు! రామేశం గారికి కొడుకు ఉన్నాడు - అంటున్నారు బ్యాంకు నుండి వచ్చినవాళ్ళు. అతడు రావాలి కదా తలకొరివి పెట్టడానికి" అన్నాడు .

"అవసరం లేదు బాబూ! ఆ అబ్బాయి అడ్రస్సు ఎవరికీ తెలియదు. అసలు ఆయనకి కొడుకు ఉన్నాడన్న సంగతి నిన్నటిదాకా నాకూ తెలియదు. అదంతా ఒక పెద్ద గాధ, తరవాత చెపుతాలే. మనమే ఇప్పుడు జరగవలసిన పనేమిటో చూద్దాం. కూతురు తలకొరివి పెట్టొచ్చునేమో బ్రహ్మగారిని కనుక్కోవాలి" అన్నాడు విశ్వనాధం లో గొంతుతో మురళీకి మాత్రమే వినిపింఛేలా..

" ఇంక వచ్చే బంధువులేవరూ లేరా?" గొణిగాడు మురళీ.

"నాకు తెలిసినంతవరకూ ఎవరూ లేరు. వీడికి బంధువులమైనా మిత్రులమైనా మనమే!" దు:ఖంతో ఒణికే కంఠంతో మురళీకి జవాబుచెప్పాడు విశ్వనాధం.

మురళీ వెళ్ళి పురోహితుణ్ణి అడిగాడు, "కూతురు తలకొరివి పెట్టవచ్చునా పంతులుగారూ !" అ

"బాబూ కాలం చాలా మారింది. ఇదివరకు ఎక్కడో ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమదేవి - ఇలా అక్కడక్కడా ధైర్యసాహసాలు చూపించిన ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. తక్కిన ఆడవాళ్ళంతా అబలలుగా, పిరికివాళ్ళుగా ఉండేవాళ్ళు. ఇప్పుడలా కాదు. ఆడదంటే ఆదిశక్తికి ప్రతిరూపాలు అంటున్నారు. ఏవో కొద్దిపాటి మినహాయింపులు తప్ప,మగవాళ్ళు చేసీ పనులన్నీ వాళ్ళూ చేస్తున్నారు. నాకేమీ అభ్యంతరం లేదు,అమ్మాయి తలకొరివి పెడితే నేను మంత్రాలు చడువుతాను" అన్నాడు.

కాని వకుళ ఒప్పుకోలేదు. "మా నాన్నని నేను అంటించడమా! నా వల్లకాదు" అంటూ భోరున, మరింతగా ఏడ్చింది.

ఆ మాటలు విన్న ఒక పెద్దమనిషి " మరైతే ఎవరినైనా కూలికి పెట్టి పని జరిపించవలసి ఉంటుంది" అన్నాడు.

" అందుకు నేను ఒప్పుకోను. నేనున్నాను కదా, వేరే ఎవరో ఆ పని చెయ్యడం ఎందుకు? ఎలాగో ఓలా తిప్పలు పడతాగాని, మా రామూని దిక్కులేనివాడిలా పరాయివాళ్ళ పాలు చెయ్యను" అన్నాడు విశ్వనాధం. ఆయనకి ఏడుపు ఆగిందికాదు. పైనున్న అంగవస్త్రంతో వరదలొఉతున్న కన్నుల్ని తుడుచుకుంటూ లేచాడు.

ఆ తరవాత పనులన్నీ చురుగ్గా జరిగిపోయాయి. రామేశం కొడుకుమీద కర్తవ్యం ఉంచి తాను కర్మలన్నీ చెయ్యడానికి సిద్ధపడ్డాడు విశ్వనాధం. వెంటనే తానులోంచి చింపిన ముడిగుడ్ద కట్టుకుని, చన్నీళ్ళు స్నానంచేసి, కర్మకాండలు చెయ్యడానికి తయారయ్యాడు. పురోహితుడు వచ్చి, ఆయనకు కొత్తగుద్డపీలికను జందెంగా చేసి, అపసవ్యంగా మెడలో వేశాడు. ఆ సరికే పెద్దవాళ్ళకు కర్మలు చేసి ఉన్న యువకు డొకడు, తనూ స్నానం చేసి వచ్చి, సాయంగాపక్కన నిలబడ్డాడువిశ్వనాధానికి.ఓ వారగా కూర్చుని చాకలి మల్లయ్య కొత్తకుండలోకి నిప్పు రాజెయ్య సాగాడు. పక్కనే వెదుళ్ళతో చేసిన కటుకు సిద్ధంగా ఉంది.

తండ్రి మీదపడి గోడుగోడున ఏడుస్తున్న వకుళను బలవంతంగా లేవదీసి కౌగిలించుకుని ఒక వారగా నిలబడింది యామిని, తానూ కంటికీ, మంటికీ ఏకధారగా ఏడుస్తూ. ఇరుగు పొరుగుల ఆడవాళ్ళు వచ్చి రాజేశ్వరిని లేవదీశారు. శవాన్ని సప్తకట్ల సవారీ మీద పడుకోబెట్టి చన్నీళ్ళతో స్నానం చేయించారు.

రామేశం అక్కడ పనిచేసినది కొన్ని ఏళ్ళే ఐనా తన మంచితనంతో చాలామందికి ఇష్టుడయ్యాడు. అతన్ని అభిమానించే వాళ్ళు వచ్చి ఆయన మీద పువ్వులుంచి నమస్కరించి వెడుతున్నారు. పురోహితుడు వేదమంత్రాలతో తంతు నడిపించాడు. నలుగురు బ్యాంకు ఆఫీసర్లు తువ్వాళ్ళు నడుముకి బిగించి, శవవాహకులుగా ఉంటామంటూ ముందుకి వచ్చారు.

అగ్నిహోత్రం ఉన్న కుండ పట్టుకుని సాయానికి వచ్చిన యువకుడు ముందు నడుస్తూండగా విశ్వనాధం కర్ర ఆసరా చేసుకుని అతని వెనుక బయలు దేరాడు. "గోవిందా - గోవింద" అంటూ దైవనామ స్మరణ చేశారు అక్కడున్నవారందరూ. ఊరికి దూరంగా ఉన్న రుద్ర భూమి దిశగా శవయాత్ర మొదలయ్యింది. శాస్త్రోక్తంగా, నిరాడంబరంగా రామేశం పార్ధివ దేహానికి మిత్రులందరూ కూడి కడసారి ప్రేమగా వీడ్కోలు చెప్పి రావడానికి వెంట బయలుదేరారు.

ఒళ్ళూపై తెలియకుండా ఏడుస్తున్న ఆ తల్లీ కూతుళ్ళను ఇరుగుపొరుగుల అమ్మలక్కలు బలవంతంగా లేవదీసుకువెళ్ళి తాపోపశమనంగా చన్నీళ్ళతో స్నానం చేయించి, తడి బట్టలు మార్పించి, గదిలో కూర్చోబెట్టారు. కాని చన్నీళ్ళకు తగ్గే తాపమా అది! అవధుల్లేని దు:ఖభారంతో వివశులై దిక్కు తెలియకుండా ఏడుస్తున్నారు వాళ్ళు.

స్మశానంలో పనిని చక్కబెట్టుకుని తిరిగి వచ్చారు వెళ్ళినవాళ్ళు. ఆపై ఇక వాళ్ళ అవసరం లేకపోడంతో ఒకరొకరే మాటాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో "వెళ్ళొస్తా" నని చెప్పడం సమంజసం కాదు కదా! మళ్ళీ అటువంటి అవసరం రాకూడదన్నదే అందరి కోరికాను.

విశ్వనాధం ఇంటికి రాగానే, రామేశం ఆత్మకు ప్రతిరూపంగా వెలిగించబడ్డ జ్యోతికి నమస్కరించి, తిన్నగా రాజేశ్వరి ఉన్నదగ్గరకు వెళ్ళాడు.

విరబోసుకునివున్న తడి జుట్టుతో, ఏదో అపరాధం చేసినవాళ్ళలా సిగ్గుతో తలపైకెత్తలేక, భూమిలోకంతా తలలు వాల్చుకుని, బిక్కుబిక్కుమంటూ, గదిలో ఒక మూలగా నక్కి కూర్చుని, గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూ, మూర్తీభవించిన శోకంలా ఉన్న ఆ తల్లీ కూతుళ్లను చూడగానే విశ్వనాధానికి కన్నీరు ఆగలేదు. కొంత సేపు వాళ్ళతోపాటుగా తనూ ఏడిచి నెమ్మదిగా సద్దుకుని చెప్పాడు విశ్వనాధం .......

"అమ్మా, రాజేశ్వరీ! నేను నీకు అన్నయ్యనమ్మా! ఇది నీ పుట్టిల్లు అనుకో. నువ్వూ, వకుళా ఎన్నాళ్ళైనా ఇక్కడ ఉండొచ్చు. పరాయిచోటు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. చెల్లిపోయిన నీ పసుపు కుంకాలను నేను నీకు తెచ్చిపెట్టలేను గాని, నీకూ వకుళకూ మరేలోటూ రానీయనమ్మా. ఇతరమైన దిగుళ్ళేమీ పెట్టుకోకు. త్వరలోనే మీ అబ్బాయిని రప్పించే ప్రయత్నం చేద్దాము." అని రాజేశ్వరికి చెప్పి, వకుళవైపు చూసి " అమ్మలూ! నాకు యామినీ, నువ్వూ వేరు కాదమ్మా! ఇక నుండీ మీరిద్దరూ నా రెండు కళ్ళూగా ఉండండమ్మా"అన్నాడు. ఇక ఆపుకోలేక, అక్కడే కూర్చుని వాళ్ళతోపాటుగా తనూ ఏడ్చాడు మరింతసేపు. .

రామేశం లేని ఇల్ల శూన్యంగా బావురుమంటున్నట్లుగా ఉంది. నిన్నరాత్రి పదకొండు గంటలుదాటే వరకూ ఆ ఇంట్లో పులిలా దర్జాగా మసలిన వ్యక్తి, ఇప్పుడింక అక్కడ లేడు, మరి రాడు - అన్న వాస్తవం వాళ్ళకి వెగటుగా, భరించలేనిదిగా ఉంది. క్షణమైనా వకుళను, రాజేశ్వరినీ విడవకుండా వాళ్ళ దగ్గరే ఉంటోంది యామిని. రోజులు భారంగా నడుస్తున్నాయి గాని, యామినికి అమరేంద్ర ఇచ్చిన శలవు దినాలు నాలుగూ మాత్రం ఇట్టే ఐపోయాయి. కాని, యామినికి వకుళను ఇటువంటి దు:ఖ సమయంలో, అలా ఒంటరిగా విడిచిపెట్టి హైదరాబాదు వెళ్ళాలని ఎంతమాత్రం అనిపించడం లేదు.

సెలవు నాల్గురోజులూ పూర్తవ్వగానే, ఐదవరోజున వచ్చి ఆఫీసులో కనిపించకపోతే ఉద్యోగం ఉండదని చెప్పిన అమరేంద్ర మాటలు ఒకే ఇదిగా ఆమె చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి. ఇప్పుడు ఏమి చెయ్యాలన్నది ఆమెకు పెద్ద ప్రశ్నై కూర్ఛుంది. తనకి తానై ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ విషయం తండ్రికి చెప్పి ఆయన సలహా తీసుకోవాలనుకుంది యామిని.

"అంకుల్ పోయి మూడు రోజులయ్యింది అప్పుడే! కాని నా సెలవు నాల్గురోజులూ పూర్తయ్యాయి. నాకు వకుళను వదలి వెళ్ళాలని లేదు. ఇప్పుడు నేనేంచెయ్యాలి నాన్నా" అంటూ తండ్రిని సలహా అడిగింది.

"అలాగైతే పరిస్థితిని వివరించి సెలవు మరో పదిరోజులు పొడిగించమని అడుగుతూ మీ బాస్ కి ఉత్తరం రాయి. సరిపోతుంది" అన్నాడు విశ్వనాధం.

యామిని వెంటనే ఉత్తరం రాయడానికి కూర్చుంది .........

మహారాజశ్రీ అమరేంద్రగారికి యామిని నమస్కరించి వ్రాయునది .....

మా నాన్నగారికి ఆబాల్య మిత్రులూ, నా ప్రాణ స్నేహితురాలైన వకుళకుకు తండ్రి ఐన శ్రీ వారణాసి రామేశంగారు అకస్మాత్తుగా వచ్చిన గుండె పోటుతో మరణించారు. మహా దు:ఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి నేను ఆసరాగా ఉండడం చాలా అవసరం. తప్పనిసరి పరిస్థితిలో, నా సెలవు మరో పదిహేను రోజులు పొడిగించమని కోరుతున్నాను. సెలవు మంజూరు చెయ్య ప్రార్ధన..........

ఇట్లు,

సంతకం చెయ్యబోతూండగా యామినికి, ఇంత ట్రెడిషనల్ గా రాస్తే అమర్ , అది ఎంత సంతాపకరమైన విషయమైనా, హేళన చెయ్యక మానడు - అనిపించింది.. వెంటనే ఆమె ఆ కాగితాన్ని చింపేసి, ఆ జాబుని మరో రకంగా రాయాలి అన్న నిర్ణయానికి వచ్చింది.

ముందురాసిన దాన్ని చింపి పారేసి, వేరే కాగితం తీసుకుని మళ్ళీ మరోరకంగా జాబు రాయడం మొదలుపెట్టింది ......

రెస్పెక్టెడ్ సర్! మా అంకుల్ "హర్టు అటాక్" తో అకస్మాత్తుగా చనిపోయారు. ఇక్కడ నా అవసరం చాలా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని మరో పదిహేను రోజులు సెలవు పొడిగించమని అడుగుతున్నాను. దయవుంచి నాకు పదిహేనురోజులు సెలవు మంజూరు చెయ్యమని ప్రార్ధన .....

రా యడం ముగించి సంతకం చేసి, తేదీ కూడావేసి, ఆ జాబుని పదేపదే చదివి తృప్తిపడింది యామిని. ఆ కాగితాన్ని మడిచి కవరులో ఉంచి, అడ్రస్ రాసి, స్టాంపులు అతికించి స్వయంగా వెళ్లి పోష్టుడబ్బాలో వేసి వచ్చింది యామిని. ఆ ఉత్తరం తప్పకుండా శీఘ్రం గమ్యానికి చేరాలన్న ఉద్దేశంతో.

* * *

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)