కథా భారతి
ఋణగ్రస్తుడు
- చెన్నూరి సుదర్శన్

రామయ్య ఎడ్ల కొట్టంలో భీముడు బెంగటిల్లి తలెత్తి హృదయ విదారకంగా రోదిస్తోంది. దాని కళ్ళ నుండి ఏకధాటిగా కారి ఎండి పోయిన కన్నీటి చారల్లోని దైన్యం నేటి రైతు బ్రతుకు భారాన్ని పరిహసిస్తోంది. అది తల విసురుకుంటూ మళ్ళీ, మళ్ళీ దీనారాగాలు తీస్తోంది.

దాని ముందర వున్న గోలెంలో కుడితి కలిపింది కలిపినట్లేవుంది. మూతి పెడితే ఒట్టు. చొప్ప జోలికి వెళ్ళాలనే ధ్యాసే లేదు దానికి.

ఆ దృశ్యం చూడగానే రామయ్య గుండె బ్రద్దలయ్యింది. ఉన్న ఫళంగా పరుగెత్తుకుంటూ వెళ్లి భీముని ముందరి కాళ్ళపై పడి భోరుమన్నాడు. భీముని కన్నీటి చుక్కలు రామయ్య మెడపై పడి అవిర్లు కాసాగాయి.. రామయ్య కడుపులో రగులుతున్న వేదనకు నిదర్శనంగా.

ఎవరికైనా చెప్పుకుంటే మనసు కాస్తా తేలిక పడుతుందనుకుంటే రామయ్యకెవరున్నారు?..పెద్ద దిక్కు భీముడు తప్ప.. పట్టిన కాళ్ళు విడువకుండా తన ఎదలోని వ్యధను భీమునితో చెప్పసాగాడు.

“ నీ చెలికాడు రాముడు లేడని ఏడుస్తున్నావా భీముడా.. ” అంటూ భీముని తల నిమురుతూ కుడితి త్రాగుమన్నట్లు బతిమాలాడు.. అది తల అడ్డంగా విసిరింది.

“ఇలా అయితే ఎలారా.. నేనేం చేసేదిరా.. నా కర్మ యిలా పాడైంది. ఈడు మీరక ముందే నా ఇంటిదానికి మాయదారి రోగమొచ్చె.. ఒక్క పోరన్నే కని కాటికి కాలు చాచె.. సర్కారు దవఖానకు తీసుకెళ్తే.. చేతులెత్తేసిరి. ప్రైవేటు దవఖానకు తీసుకెళ్తే.. పరీక్షలు.. పరీక్షలు.. అనుకుంటూ డబ్బులు కాజేసిరి.. పొతే పోయింది నా చేతి మురికి అనుకున్నా. పెద్ద దవాఖాన్లకు పొమ్మని పట్నం తోవ చూపిరి. మళ్ళీ మళ్ళీ పరీక్షలు.. పరీక్షలు.. పరీక్షలు. రోగం ముదిరి పోయాక వచ్చావని కన్నెర్ర జేసిరి.. కాని ఫలాన రోగమని తేల్చి చెప్పక పోయిరి డాక్టర్లు. ఇందులో నా తప్పేమున్నది చెప్పు భీముడా.. సీతమ్మ ఒంట్లో కాసంత జ్వరం రాగానే దవఖానకు తీసుకెళ్ళాను కదా.. అన్ని పరీక్షలు చేసినా రోగమేంటో తెలుసుకోక పోతె నాతప్పా?.. మందుల కంటె డాక్టర్ల పీజులే తడిసి మోపడాయె.. ఉన్న రెండెకరాలు ఊడ్చుకు పోయె.. రోగం తగ్గక పోయె.. ” అంటుంటే రామయ్యకు డగ్గుత్తిక పడింది. నోట్లో నుండి సొల్లు కారింది.. తల ఓరగ చేసుకొని భుజంమ్మీదున్న కండువకు తుడుచుకున్నాడు. కాని భీముని కాల్లు వదల్లేదు..
ముట్టుకుంటే మాసి పోయే మనిషి.. నల్ల కట్టె పడి తలవెండ్రుకలన్నీ ఊడిపోయి బొక్కల గూడులా మంచానికి అతుక్కొని ప్రాణమిడిచిన సీతమ్మ కళ్ళళ్ళో మెదిలే సరికి అతడి కన్నీటి పొరల్లో గతం సుళ్లు తిరిగింది.

***


రామయ్యకు తన తాత సంపాదించిన అయిదెకరాల పొలం తన చేతికొచ్చేసరికల్లా రెండెకరాలయ్యింది. రామయ్య నాన్న సాందయ్య అప్పులు తెచ్చి పంటలు పండించే వాడు.

ఓ ఏడాది చేతికి వచ్చిన పంట తుఫానుకు కొట్టుక పోయింది.

మరో ఏడాది నకిలీ విత్తనం నట్టేట ముంచింది. అయినా దైర్యం చెడ లేదు. ప్రభుత్వం సప్లై చేసిన విత్తనం నాటాడు. పంట ఏపుగ పెరిగింది. తమ దరిద్రం తీరిందనుకున్నాడు. వాళ్ళిచ్చిన పురుగుల మందు చల్లాడు. అది నకిలీ పురుగుల మందు.. పంట మట్టిలో కలిసింది. కాని అదే నకిలీమందు సాందయ్యను కాలగర్భంలో కలిపింది.

అప్పుడు రామయ్యకు నాలుగేండ్లు.

రామయ్య తల్లి శాంతమ్మ ఉన్న పొలం కౌలుకిచ్చి తను కాయకష్టం చేసుకుంటూ ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు చేసింది.. చివరి వాడు రామయ్య.

“నాన్న చాలా తప్పు చేసాడమ్మా. ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మ హత్య చేసుకోవద్దు. నాన్నలా నువ్వు కూడా పోతే మేమేమయ్యే వాళ్ళం. నువ్వు ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవటం లేదా..” అంటూ నిరంతరం శాంతమ్మతో వాదించేవాడు రామయ్య.

“యీ వ్యవసాయంలో వ్యయం తప్పితే సాయం ఉండదురా కొడుకా.. బడికి పోయి చక్కగా చదువుకో.. ఏదైనా నౌకరి సేసుకొని బతుకొచ్చు. ఇప్పుడు యిలాగే మాట్లాడుతావ్.. పెద్దవాడివయితే నీకు తెలిసొస్తుంది” అంటూ శాంతమ్మ సముదాయించేది. శాంతమ్మ మాటలు రామయ్య తలకెక్కించుకోలేదు.. తన పొలమే తనకు దేవుడనుకున్నాడు. పొలాన్ని కౌలుకియ్యకుండా తనే సాగు చెయ్యసాగాడు. కాస్తా చెయ్యి తిరగ్గానే రామయ్యను ఓ యింటి వాణ్ణి చేసి కాలం చేసింది శాంతమ్మ.

రెండేళ్ళు గడిచాయి.. కూషాలు పుట్టాడు.. అ సంతోషం ఎంతో కాలం మిగుల లేదు వారికి. సీతమ్మ మంచాన పడింది. రామయ్య నాల్గవ యేట తండ్రిని పోగుట్టుకున్నట్టే కూషాలూ తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఉన్న రెండెకరాలు ఊడ్చుక పోయాయి.

తన ఇంట్లో పుట్టి పెరిగిన రాముడు, భీముడు ఎడ్లు కవలలు.. వానిని తన రెండు కళ్ళలా చూసుకునేవాడు రామయ్య. సీతమ్మ చావుకు, రాముడు అమ్ముడు బోయి తన బాకీ తీర్చింది. కాని దాని బాకిలో పడిపోయానే అని బాధ పడ్తున్నాడు రామయ్య.

అవాళ సీతమ్మను పెళ్ళిపిల్లలా తయారు చేసి పాడె మీద పడుకోబెట్టారు. ముత్తైదు చావు.. చాలా పుణ్యాత్మురాలని వాడవారంతా అనుకోసాగారు.

దింపుడు కల్లం వద్ద సీతమ్మ చెవులలో ‘సీతమ్మా.. సీతమ్మా... సీతమ్మా..’ అని మూడు సార్లు పైనున్న దేవునికి వినవచ్చేలా పిలిచాడు. కండ్ల నిండ చూసి.. కాష్టంలో పెట్టాడు. కొడుకు చేత నిప్పుపెట్టించి నెత్తి కొట్టుకోసాగాడు.. ఏడువని వారు లేరంటే పాపం..!

“కొడుకు చేతికందకముందే నా బతుకు బండలు చేసి పోయె..ఉన్నఫళంగా ప్రాణం పోయే దాక చెప్పక పోయిరి డాక్టర్లు.. దిక్కు లేని పక్షిలా ఏడుస్తుంటే.. నోరు తెరిచి డాక్టర్లు ‘ఊపిరి తిత్తులకు క్యాన్సరైంది.. క్యాన్సరంటే ప్రాణం కాన్సిలే.. మా చేతుల్లో ఏముంది మేమేమైన దేవుళ్ళమా..?’ అన్నారు.

అలా అయితే పరీక్షలు.. పరీక్షలు అనుకుంటూ పీతిరి గద్దల్లా పీక్క తినడమెందుకో అనిపించింది నామనసుకు.. మొత్తం డబ్బులు కట్టందే శవాన్ని ముట్టుకోవద్దన్నారు.. ఏం చెయ్యాలె.. నువ్వే చెప్పు భీముడా.. చేతుల చిల్లి గవ్వైనా లేదాయె.. చివరికి నీ చెలికాడే నాకు దారి చూపాడు. సీతమ్మను దహనం చెయ్యాలంటే రామున్ని అమ్మక తప్పలే.. భీముడా.. మన బాధలు దేవుడు చూస్తున్నాడంటావా.. నువ్వైనాచెప్పు ఆ రాతి గుండె దేవుడికి ..” అనుకుంటూ ఏడ్వసాగాడు రామయ్య. పాపం..! ఎద్దు ఏం చెబుతుంది.. బుద్ధున్న మనుషులే వెన్ను చూపుతున్న కాలమిది.


“నాన్నా.. ఆకలి.. అన్నం పెట్టు” అనుకుంటూ దగ్గరికి వచ్చి రామయ్య గదుమ పట్టుకునేసరికి యీలోకానికొచ్చాడు రామయ్య.

***


తన కొడుకు కూషాలును చూడగానే రామయ్య ప్రాణం విలవిల లాడింది.

కూషాలు.. అది రామయ్య తాత పేరు. కొడుకు తన తాతలాగా గొప్పవాడు కావాలని ఆ పేరు పెట్టాడు రామయ్య.

కూషాలును దగ్గరికి తీసుకున్నాడు లాలనగా. రామయ్య దుఃఖమంతా మటుమాయమయ్యింది. కూషాలు తన ఏడుపు చూసి బెంగటిల్లుతాడని లేచి చంకనెత్తుకున్నాడు. అరువు తెచ్చుకున్న నవ్వు మొకంతో..

“అన్నమెక్కడిది కొడుకా.. ఉన్న నాలుగు మెతుకులు నీకు రాత్రే ఊడ్చి పెడితి.. ” అనుకుంటూ కూషాలు బుగ్గపై ముద్దు పెట్టి క్రింద కూర్చోబెట్టాడు. పొయ్యి మీద గంజి ముంత దించి కంచంలో కాసింత పోసాడు .. ఓపక్క ఊదుకుంటూ మరోప్రక్క తాగించసాగాడు. ఒక గుక్క తాగాడో లేదో.. “ఉత్త గంజి నాకు తాగ బుద్ధి కావటం లేదు నాన్నా..” అని ముక్కిరిచి గోడకు ఉమ్మేసాడు కూషాలు.

“నీ కాళ్ళు మొక్కుతా.. రెండు బుక్కలు తాగు. కడుపులో కాస్త ఆసరవతుంది. లేకుంటె పానం పూర్తిగా చతికిల పడుతుంది.. నీ తోటి స్నేహితులు చూడు.. ఎంత ముద్దుగ ఆడుకుంటున్నారో.. కాసంత ప్రాణం నిమ్మళం చేసుకొని తాగి నువ్వుకూడా వెళ్ళి ఆడుకో.. నేను ఇంతలో మన షావుకారు షాపుకు వెళ్ళి ఉద్దెరకు కొన్ని సరుకులు తీసుకొస్తా.. పాత బాకి కట్టందే ముఖం చూపొద్దన్నాడు. మన రామున్ని అమ్మి మీ అమ్మను దహనం చేయగా కొంత డబ్బు మిగిలింది. అవి సంవత్సరీకానికి పనికొస్తాయని దాచి పెట్టా.. కాని ఇంట్లో పూర్తిగా సరుకులు నిండుకునే.. కొంత పాత బాకీ కింద జమ చేసుకొమ్మని చెప్త..” అనుకుంటూ ఎడం చెయ్యి భూమ్మీద, కుడి చెయ్యి మోకాలు మీద పెట్టి ప్రాణ మంత ముఖంలో నుండి వెళ్ళిపోతున్నట్లు్ నిలబడ యత్నించాడు రామయ్య.

“అది కాదు నాన్నా.. తేప తేపకు అమ్మ గుర్తుకొస్తూంది. అమ్మ కూడా ఉంటే మనతో బాటే గంజి తాగేది కదా..” కూషాలు అంటుంటే రామయ్య ప్రాణమంతా అవిరైపోయింది.. లేవ చేతగాలేదు.. “ఇంకెక్కెడి అమ్మరా.. అమ్మ మహరాజులా దేవుని దగ్గరికి పోయింది” అనుకుంటూ మళ్ళీ అలాగే నేలపై చతికిలా పడిపోయాడు.

“అయితే నేను కూడా అమ్మ దగ్గరికి త్వరగా వెళ్తా..” అని కూషాలు అనగానే “వద్దు కొడుకా.. వద్దురో..” అంటూ బావురుమన్నాడు.

గంజి కంచం మళ్ళీ కూషాలు నోటికందించాడు రామయ్య.

“అంతా నాకేనా.. మరి నీకో..” అనుకుంటూ ఒక బుక్కెడు తాగాడు. “నువ్వు కడుపు నిండ తాగరా .. నువ్వు తాగాక నేను తాగుతా..” అంటూ మరో బుక్కెడు తాగబోయే కూషాలును చూస్తూ మురిసిపోసాగాడు.

కూషాలు మరోబుక్క తాగబోయి కండ్లు తేలేసి వెల్లికిలా పడిపోయాడు.

“కూషాలూ.. ఏమైందిరా..?” అని లబో దిబో మంటూ మంచి నీళ్ళ కుండ దగ్గరికి పరుగెత్తాడు రామయ్య. గంజి ముంత నేలపైపడి గతుక్కుమంది.

గ్లాసుతో నీళ్ళు ముంచుకొచ్చి కుషాలు ముఖంమ్మీద చిలికరించాడు రామయ్య. కూషాల్లో ఉలుకూ పలుకూ లేదు. చెంప మీద కొట్టి చూసాడు.. గిల్లి చూసాడు.. గొంతుకలో రాయిపడినట్లై కూషాలును అమాంతం భుజంమ్మీదేసుకొని పరుగెత్తుకుంటూ వెళ్ళి రోడ్డేక్కాడు.

దేవుని మాదిరిగా ఎదురయ్యాడు ఆటో మల్లేశం.

***

ఊళ్ళో ఉన్న సర్కారు దవఖానా సిబ్బంది చేతులెత్తేసారు. పట్నం తీససుకెళ్ళుమని ఉచిత సలహా యిచ్చారు.
రామయ్య మౌనంగా రోదించ సాగాడు.

“రామన్నా .. గుండె దిటవు చేసుకో... ఎలా కానుందో అలా గాక మానదు. మన చేతుల్లో ఏముంది చెప్పు.. అంతా ఆ మీదోని దయ. మనం మన బిడ్డల్ను కన్నాం గాని వాళ్ళ రాతల్ను కన్నమా?.. మన పయత్నం మనం చేద్దాం.. పట్నమైతే పోదాం పద..” అనుకుంటూ కూషాలును ఆటోల పడుకోబెట్టాడు మల్లేశం. రామయ్య అచేతనంగా ఆటోల కూర్చున్నాడు.

వరంగల్ ఎం.జీ.ఎం. (మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్) దవఖానలో కూషాలును అడ్మిట్ చేసారు. మంచం కావాలంటే ఆయాలు చెయ్యి తడుపాలన్నారు. లేదంటే నేలే గతి అని పుల్ల విరిచినట్లు చెప్పారు. కూషాలును నేల మీద పడుకోబెట్టక తప్పలేదు రామయ్యకు. మల్లేశం కోపానికొచ్చాడు.. కాని ‘మనం తగువులాటకు వచ్చామా.. ముందు పిల్లవాని ప్రాణాలు ఉన్నాయి.. అడ్మిట్ చేసుకొనుడే గొప్ప’ అన్నట్లు రామయ్య చేతి సైగ చూసి ఆవేశాన్ని అణుచుకున్నాడు మల్లేశం.

“మల్లేశూ.. చిన్న పని చేసి పుణ్యం కట్టుకో.. ” అంటుంటే రామయ్య కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి..

రామయ్య తనను డబ్బులు అడుగలేక పోతున్నాడని ఊహించాడు మల్లేశం.

“ఏమిటో చెప్పు రామన్నా.. మనుషులమన్నాక ఇలాంటి సమయంలో ఒకరికొకరం సహాయం చేసుకోకుంటే ఎలా?” అనుకుంటూ తన జేబులో వున్న డబ్బు తీసి ఇవ్వబోయాడు.

“వద్దు మల్లేశు.. ఇప్పటికే నీ బాకీలో పడిపోయాను.. నువ్వు మా ఇంటికెల్లి ఉన్నొక్క భీమున్ని తీసుకొచ్చి అమ్ముకురా.. చచ్చి నీ కడుపులో పుడుతా..” అని రెండు చేతులూ జోడించాడు. మల్లేశమంటే భీమునికి మాలిమి అని తెలుసు రామయ్యకు.

“ఇంత మాత్రానికే అంత పెద్ద మాటలెందికే రామన్నా.. ఆమాత్రం సాయం చేయనా.. నువ్వేం బాధ పడకు.. ఇలా వెళ్ళి అలా వస్తా.. అనుకుంటూ మల్లేశం లేచి నిలబడి రామయ్యకు ధైర్యం నూరిపోస్తూ బయలుదేరాడు.

***

మరునాడు పొద్దున్నే మల్లేశం భీమున్ని అమ్మి డబ్బులు పట్టుకొని వచ్చేసరికి దవఖాన వాతావరణమంతా గందరగోళంగా వుంది.జూనియర్ డాక్టర్లందరు స్ట్రైక్ చేస్తున్నారు..

“కైసే లేంగే.. లడ్‍కే లేంగే.., కైసె లడేంగే.. మిల్‍కే లడేంగే..”, “కైసే మిలేంగే.. ఝంకే మిలేంగే..”, “ డౌన్.. డౌన్.. ” , “ జిందాబాద్..” అని నినాదాలతో దవఖాన ముందర రోడ్డుమీద కూర్చున్నారు.

‘బస్సులన్నీ బందు.. దుకాన్లు బందు.. అలా అయితే కూలి నాలి చేసుకొని నిత్యం సరుకులులు తెచ్చుకొని తిని బ్రతికే వాళ్ళు బ్రతికేది ఎలా?.. స్ట్రైక్ అంటే అన్నీ బందులేనా?..చదువుకున్నోళ్ళే గాని మెదడు లేదు..’ అని మనసులో అనుకోసాగాడు మల్లేశం.

డాక్టర్లు పల్లెటూళ్ళళ్ళో పని చెయ్యరట. చెయ్యిమని ప్రభుత్వం అంక్షలు విధిస్తే ఒక్క యేడాది చేయగానే సర్కారు నౌకరి ఇవ్వాలట.. పనులకు నీళ్ళు వదిలారు. వీళ్ళ బొబ్బ ఒక ప్రక్క.. వచ్చేప్రాణం పోయే ప్రాణం అన్నట్లు బీమారోల్ల పెడబొబ్బలు ఇంకో పక్క.

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. స్ట్రైక్ ఆపే పయత్నంలో లేదు. ఇప్పటికే స్ట్రైక్ చేయబట్టి పది రోజులు దాటిందట. రోజూ ఒక గంట చేసెవారు ఈ రోజు రోడ్డు మీదికొచ్చారు.

ఇది పేదోల్ల దవాఖాన. యిక్కడే ఇలా వుంటే ఇంకెక్కడికి వెళ్తారు?. చస్తే మాకేంటి అన్నట్లు అటు సర్కారు చూస్తోంది.. ఇటు డాక్టర్లు చూస్తున్నారు. డాక్టరు అంటే దేవునితోటి సమానం. డాక్టరు సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ఒక్క పైస కూడా తీసుకోకుండా రోగుల ప్రాణానలకు తమ ప్రాణాలు ఫణంగా పెడ్తామని ప్రమాణాలు చేస్తారు.

సర్కారు ఏర్పాటయ్యేటప్పుడు మంత్రులు చక్కంగా పాలిస్తామని దేవుని మీద ప్రమాణంచేస్తారు. ‘ఓడెక్కేదాక ఓడ మల్లయ్య.. ఓడ దిగినంక బోడ మల్లయ్య..’, పజల పానాలతోటి ఆటలాడుకునుడేనా నాయకుల పాలిచ్చుడు. ‘గరీబీ హఠావో కాదు.. గరీబోల్లను హఠావో..’. పూర్వం నాయకులకు జీతాలు లేకుండె.. ఇప్పుడేమో మనమూహించని జీతాలు.. పడుకుంటూ లేచుకుంటూ ఐదేండ్లు చేస్తేనే పించను.. వారి జీతాలు వాళ్ళే పెంచుకుంటారు.. ప్రజలనేమైనా అడుగుతారా?.. వాళ్ళ ఇష్టా రాజ్యం.. బీదా, బిక్కి చూడరు.. ఎన్కాముందు లేనోల్లను చూడరు.. థూ..’ అన్కుంట మల్లేశం కాండ్రించి ఉమ్మి తొట్టిలో ఉమ్మేశాడు.

ఇంతలో మల్లేశంకు కూషాలు జ్ఞప్తికొచ్చాడు.. గాబరా పడుకుంటూ దవ్ఖాన లోనికి పరుగు తీసాడు.

రామయ్య తల పట్టుకుని కూషాలు చెంతనే కూర్చున్నాడు. మల్లేశంను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. చటుక్కున లేచి కావలించుకున్నాడు. ఇంత త్వరగా పని అవుతుందని నమ్మశక్యం కాలేదు..

“భీమున్ని అమ్మాను” అనుకుంటూ మల్లేశం డబ్బులిస్తుంటే రామయ్య గొల్లు మన్నాడు.

కూషాలు యింకా మూసిన కన్ను తెరువ లేదని చూపించ సాగాడు. డాక్టర్లెవ్వరూ వచ్చి చూడ్డం లేదని తల బాదుకోసాగాడు.

ఇంతలో వార్డుల్లో తిరుక్కుంటూ చూసే ఒక పెద్ద డాక్టరు వచ్చి.. కూషాలు రిపోర్టు చదివాడు.

“రామయ్యా.. నీ కొడుకు దక్కాలంటే నా దవఖానకు తీసుకొని రా.. ” అననుకుంటూ తన ‘సంజీవయ్య ప్రైవేటు హాస్పిటల్’ విజిటింగ్ కార్డు యిచ్చి వెళ్ళాడు. రామయ్య ముఖంలో ఆశాకిరణం మెరిసింది.

కూషాలును భుజంమ్మీదేసుకొన్నాడు మల్లేశం. డాక్టరు వెనుకాలే వెళ్దామని పరుగెత్తుకుంటూ దవఖాన గేటు దగ్గరికి వచ్చి నెశ్చేష్టులయ్యారు. గేటు దాటాలంటే కాలు పెట్ట వశం లేదు. ఆటోలను సైతం నడువనివ్వడం లేదు. రామయ్యకు ప్రాణంపోయినంత పనయ్యింది.

“మల్లేశం.. నువ్వు నీ ఆటో సూసుకో.. నేను కూషాలును తీసుకొని ఎలాగైనా డాక్టరు దగ్గరికి వెళ్తా..” అనుకుంటూ మల్లేశం భుజం మీది నుండి కూషాలును తన భుజంమ్మీదికి మార్చుకొని నానా తంటాలు పడుతూ బయట పడ్డాడు. కొంచెం దూరం నడిచేసరికి ఆయాసం రాసాగింది. అయినా కూషాలు ప్రాణం జ్ఞప్తికి వస్తుంటే కూలబడబోయే కాళ్ళకు దండం పెట్టుకోసాగాడు. రామయ్య ఆందోళన దేవునికి అందినట్లుంది. తన ముందు నుండి ఒక ఒంటెద్దు బండి వెళ్ళడం గమనించాడు. లేని శక్తి పుంజుకొని పరుగెత్తుకు వెళ్లి కుషాలును బండిలో పడుకోబెట్టాడు.

“అన్నా నీకు పుణ్యముంటది. నా కొడుక్కు ప్రాణం మీదికొచ్చింది. నీకు దండంపెడ్తా.. కొంచెం సంజీవయ్య దవకాన్లకు పోనివ్వు”

“సంజీవయ్య దవాఖానా.. సరే.. నువ్వూ బండెక్కు ” అని బండి ఆసామి అనేసరికి ఆదేవుడే పంపించినట్లు పైకి చూసుకుంటూ దండం పెట్టుకున్నాడు రామయ్య.

బండి పరుగెత్త సాగింది.. తను బండిని అదిలించకముందే పరుగులు తీస్తుంటే బండి ఆసామి ఆశ్చర్యపోయాడు.

సంజీవయ్య దవఖాన ప్రాంగణంలో అడుగు పెట్టగానే బండి ఆసామి జేబులో కొన్ని డబ్బులు పెట్టి కూషాలును ఎత్తుకొని దవకాన్లకు పరుగెడుతుంటే.. తన జేబులో పెట్టిన డబ్బులు తీసి తిరిగి రామయ్య నెత్తికి చుట్టుకున్న రుమాల్లో చెక్కాడు బండాయన.

పేదవానికి పేదవాడే సాయపడ్తాడు.. ఒకరికి సాయం చెయ్యాలంటే డబ్బు కాదు ముఖ్యం.. మనసుండాలి.

డాక్టరు కూషాలును లోనికి తీసుకెళ్ళాడు. రామయ్యను రానివ్వ లేదు..

రామయ్య ప్రాణమంతా భయాందోళనలతో నిండిపోయింది. తేప తేపకు గది అద్దాలలో నుండి చూడ యత్నిస్తున్నాడు. కాని దానికున్న తెరలుడ్డుకుంటున్నాయి. ఓ చోట కాలు నిలువడం లేదు.. కాలు కాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగ సాగాడు. డాక్టరు గదిలో నుండి వస్తూ వెళ్ళే వారిని అడుగ ధైర్యం రావడం లేదు. అడుగుతే ఏ మాట వినాల్సి వస్తుందోనని మనసులో భయం..

అవేళ సీతమ్మను ప్రైవేటు హాస్పిటల్‍కు తీసుకు వచ్చినప్పుడు కూడా ఇలాగే అయింది. రామయ్యను లోనికి రానివ్వరు.. ఏమవుతుందో చూడనివ్వరు.. పరీక్షలు, పరీక్షలు అని మందుల షాపుకు, హాస్పిటల్‍కు కబడ్డీ ఆట ఆడించారు. తీరా మిక్కుటానికి రాగానే చేతులు ఎత్తేస్తారు.. పైపెచ్చు తప్పంత మన నెత్తిన రుద్దడం... ‘ఎద్దు పుండు కాకికి ముద్దా’ అన్నట్టు ప్రాణమున్న వారినే కాల్చుకు తినడం ప్రైవేటు హాస్పిటల్‍వారికి వెన్నెతో పెట్టిన విద్య..

‘ఇంకా యీ సంజీవయ్య హాస్పిటల్‍వారు కాస్తా నయమే.. పరీక్షలు అనడం లేదు.. డబ్బులు లాగటం లేదురు.. మరి ఏ పరీక్షలు చేయకుంటే రోగమెలా తెలుస్తుంది?’ అని రామయ్య మనసులో అనుకోవటం.. ఠక్కున గది తలుపులు తెరుచుకొని డాక్టరు రావటం ఝల్లున వణికాడు రామయ్య.

డాక్టరు ఏం చెబుతాడో అని భయాందోళనతో చూడసాగాడు. చల్ల చెమటలు పోసాయి.. కాళ్ళ క్రింద భూదేవి కంపించినట్లయ్యింది.. తూలాడు. డాక్టరు రామయ్యను పడిపోకుండా పట్టుకున్నాడు.

“కూషాలు ప్రాణానికేం భయం లేదు. మరో ఐదు నిముషాలు ఆలస్యమైతే ప్రమాదమయ్యేది. ఇప్పుడు గండం గడిచింది. ఇంజక్షన్ చేసాను. ఒక గంట తరువాత మెళకువ వస్తుంది. నువేం భయ పడకు.. రేపటికల్లా పూర్తిగా కోలుకుంటాడు. అంతవరకు యిక్కడే ఉంటాడు.. నువ్వు ధైర్యంగా ఉండు..” అని నర్సును పిలిచాడు. ఆమె వచ్చి కొంత డబ్బు కట్టించుకొని రామయ్యను కూషాలు దగ్గరికి తీసుకు వెళ్ళింది.

కూషాలును చూడగానే రామయ్య ప్రాణం నిమ్మదించింది. దీర్ఘశ్వాస తీసుకున్నాడు. ‘నేను నడుచుకుంటూ వస్తే నా కొడుకు నాకు దక్కక పోవు.. బండి చల్లగుండాలి.. బండెద్దు చల్లగుండాలి.. బండాయన డబ్బులు తీసుకోక పోయె.. పాపం ఎద్దు దానకన్నా పనికొచ్చేది.. నా ఆదర బాదరతో పరుగెత్తి వచ్చానే కాని డబ్బులు బలవంతంగా బండాయన చేతిలో పెట్టకపోతిని’ అని మనసులో బాధ పడుకుంటూ బయటకు వచ్చేసరికి యింకా ఒంటెద్దు బండి పోలేదు. బండి ఆసామి ఎద్దును ఎంత అదిలించినా అది అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. రామయ్యకు ఆశ్చర్యమయ్యింది. ఏదో రక్త సంబధం పిలిస్తునట్లు అనిపించి బండి ముందుకు పరుగెత్తి చూసేసరికి.. భీముడు కనిపించాడు. తన కొడుకును తీసుకు వచ్చిన ఒంటెద్దు బండి భీముడే.. భీముని కళ్ళళ్ళో నుండి నీళ్ళు కారుతున్నాయి.. రామయ్య గుండెలు బాదుకుంటూ భీముని ముందరి కాళ్ళపై పడిపోయి రెండు కాళ్ళూ పట్టుకున్నాడు.

“రామున్ని భీమున్ని విడదీసిన పాపాత్ముణ్ణి. భీముడా..! నా కొడుకును నాకు దక్కించావు.. నేను ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను..” అంటూ ఏడువసాగాడు.

బండి ఆసామికిదేమీ అర్థంగాక నోరు తెరచి చూడసాగాడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)