కథా భారతి - అనగనగా ఓ కథ
రోమియో
- మాదిరెడ్డి సులోచన

డ్రాయింగ్స్, నోట్సు పూర్తి చేశాము.

ఆ నోట్స్ బుర్రలోకి ఎక్కించడమే తరువాయి, కళ్ళు మూసుకున్నాను. తలగడ క్రిందున్న నోట్సన్నీ విక్స్ వెపరబ్‍లోని అడ్వర్టయిజ్‍మెంటు యారోల్లా నా బుర్రలోకి యెక్కి, అది నేను కాగితం మీద కక్కి ఫస్ట్ న పాసయినట్టు కలలు కంటున్నాను.

"మాలా ...మాలా!" కంగారుగా వచ్చింది సుధ. విసుగ్గా కళ్ళు విప్పాను.

"ఏ మాల కావాలి తల్లీ? కనకాంబరమా, కదంబమా!"

"అమ్మా! మాలతీ! ఒట్టి మాలతి కాదు, మామిడి మాలతీ! పరిహాసానికి సమయముకాదే. పరిష్కారం చెప్పని అన్నది అటు ఇటు చూస్తూ. మామిడి మా ఇంటి పేరు.

"మళ్ళీ ఏమొచ్చిందే! ఈ వారంలో వంట లక్ష్మి చూసుకుంటుంది కదా!" అంది విసుగ్గా.

"అంత విసుగెందుకే!" ఏడుపు గొంతుకతో అన్నది.

"విసుగుకాక మరేమిటి? ఈ శాస్త్ర గ్రంథాలన్నీ నూరి తాగినా నాకు ఫస్ట్ క్లాసు రాదని తెలుసు. క్లాసు వచ్చినట్టు కల కఁటున్నాను. నువ్వు అర్చావ్... నాలాంటి దానికి కలలు కనే హక్కులేదు కదా!"

"కలలే కాదు. పిల్లల్ని కనే హక్కు కూడా స్త్రీల కిచ్చాం అని మన రాజ్యాంగం నంబర్...నంబర్..." అంటూ వచ్చింది లక్ష్మి.

"జ్ఞాపకంలేని విషయాన్ని యొందుకు వాగుతావ్? మన చెలి... అంటే సుద్దమ్మకు ఏదో కష్టం వచ్చిందట..."

"అఁ...సాలిమ్మ మళ్ళీ వచ్చిందా!" లక్ష్మి బిక్క మొహం వేసింది. సుధ దాని రెక్క పట్టి కూలేసింది.

"మన ఇంటివాళ్ళ పిన్నిలేదూ?"

"పిన్ని ఉంది, బాబాయ్ ఉన్నాడు. వాళ్ళ పిల్లలు, ఈ మధ్యే ఉద్యోగాన్వేషణలో వచ్చిన ఆమె తమ్మూడూ, అందరూ ఉన్నారు..."

"అదేనే... ఆ తమ్ముడు నాకు లౌ లెటర్ వ్రాసాడు" అన్నది సుధ.

"ఆఁ లౌ లెటర్ మీన్స్! ప్రేమలేఖ వ్రాశాడా?" కళ్ళు పెద్దవిచేసి అడిగింది లక్ష్మి.

"ఆఁ అచ్చంగా ప్రేమలేఖ వ్రాసి, నేను బయటినుండి వస్తుంటే చేతిలో పెట్టాడు."

కంగ్రాచ్యులేషన్స్!" లక్ష్మి ఎగిరి గంతేసింది. సుధ చెయ్యి కంగారుగా నొక్కింది.

"థాంక్స్ చెప్పను, తంతాను..." అన్నది సుధ.

"ఉత్త అవ్వ కబుర్లు! లవ్ లెటర్ అందుకోవటం లక్ అంటాను. నువ్వేమంటావు మాలా?" లక్ష్మి సంబరపడింది.

"నోరు ముయ్యమంటాను. లవ్ లెటర్ అందుకోవటం లక్కేగాని అలాఁటి తిక్కమొహం వ్రాశాడంటే ఏడ్వవల్సిందే" అన్నాను, హనుమంతుడి అన్నలా ఉన్న పిన్నిగారి తమ్ములు గారి రూపురేఖలు ఊహించుకుంటూ.
నవ్వితే దవడపళ్ళు కనిపిస్తాయి. నడిస్తే ట్విస్టా, షేకా అర్థంకాదు. నెత్తిన వుగ్గుపెట్టుకున్నట్టున్న దుబ్బు జుట్టులో ఎన్ని పేలున్నాయో అనిపిస్తే, మన తలే బరా, బరా గోకేసుకోవాలనిపిస్తుంది.

చారలున్న ప్యాంట్లు, పెద్దపువ్వుల చొక్కాలు వేసుకుని తిరుగుతుంటే ఏదో అనీజీగా ఉంటుంది.

మా అందట్లో సుధ అందంగా బొమ్మలా ఉంటుంది.

"చింపేసి, చెత్తబుట్టలో పడెయ్యరాదూ ?" అన్నాను.

"అబ్బ ! మీరు ఏడ్పిస్తారని చెప్పలేదే...."

"ఆఁ ఏం జరిగింది?" లక్ష్మి దగ్గరగా వచ్చింది.

"నిన్న పొద్దున పంపుదగ్గర పయిట పట్టుకున్నాడు, ఉదయం హాల్లో కళ్ళు చికిలించాడు..."

"పళ్ళు ఇగిలించనందుకు సంతోషించు" అన్నాను. దాని చేతిలోని ఉత్తరం లాక్కున్నాను, విప్పాను.

మై డియరెస్ట్, స్వీట్, స్వీట్ సుధా!

నా భుజం మీదుగా సంబోధన చదివింది లక్ష్మి.

"స్వీట్‍గా ఉన్నాము-" మూతి ముడిచింది.

"షటప్!" సుధ అరిచింది.

"థాంక్యూ!... ఊఁ చదవ్వే..." లక్ష్మి హుషారుగా ఈల వేసింది.

"నేను నిన్ను చూచిన మెదటి క్షణంలోనే ప్రేమించాను..."

"లవ్ ఎట్ ఫస్ట్ సైట్... కమాన్."

"చూచిన తక్షణమే పలుకరించాలనుకున్నాను, కాని నీ కిరువైపులా శంకినీ, లంకినీలా..." వీడి పోలిక కూలా! అయినా ఎందుకు ఉడుక్కోవాలి! అతడిని హనుమంతుడు అనుకున్నానుగా!

"వీడికి యెన్ని గుండెలే..." లక్ష్మి కళ్ళు ఎర్రజేసింది.

"నేను లెక్కపేట్టలేదు..." సుధ ఉడుక్కున్నది..

"ఊఁ...బావుంది," అన్నాను. ఉత్తరంనిండా విరహం, ఆవేదనా, ఆరాటం ఒలకబోశాడు.

"ఓయ్! తెలుగు సినిమాలు తెగ చూస్తాడులా ఉందే. అంతబరువైన సంబాషణలు వ్రాశాడంటే..."

"లక్ష్మి! ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఏం చేస్తాడని కాదు అతడి బారినుండి యెలా తప్పించుకోవాలే!" బిక్కమొహం వేసింది.

"నా కిక్కడో సందేహము, ఒన్ వే ట్రాఫిక్కా! నీకేం ఇంటరెస్ట్ లేదా?" లక్ష్మి అడిగింది.

"ఓ కోరిక మాత్రం ఉంది. అతనంగీకరిస్తే నీ కిచ్చి చేయాలని." వెటకారంగా అన్నది సుధ.

"యెంత పొగరే..."

"రెండుకిలోల పొగరుగాని కాసేపు ఊర్కో లక్ష్మి ! సుధా ! ఇతడిని పట్టించుకోకు నువ్వు నిర్లక్ష్యం చేస్తే అతనే సర్దుకుంటాడు. అదీకాక వచ్చే సోమవారమే అతనికి ఇంటార్‍వ్యూ ఉంది. కాగానే వెళ్ళిపోతాడని పిన్ని చెప్పింది."

"సోమవారం వరకు అతడి..."

"ఆఁ...ఆ రోమియో రొమాన్స్ భరించాల్సిందే," అన్నాను. అప్పటి నుండి పిన్నిగారి తమ్ముడి అసలుపేరు మరచిపోయి ’రోమియో’ అని పిలవటం మొదలుపెట్టాము. సుధ ఒంటరిగా ఒక్క క్షణం ఉండక, మమ్మల్ని అంటిపెట్టుకుని తిరిగింది. సోమవారం సాయంత్రం ఉత్సాహంగా ఇల్లు చేరాం. పిన్నిగారు చాటంత ముఖంతో వచ్చింది.

"ఇదిగో ఈ స్వీట్స్ పుచ్చుకోండే అమ్మాయిలూ. మా తమ్ముడు ఇంటర్‍వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. పెళ్ళి అయి కాపురం పెట్టేవరకు ఇక్కడే ఉంటాడు," అన్నది సంతోషంగా.

మా సుధ ముఖం, సుద్ధకంటే తెల్లగా పాలిపోయింది.

"ఆఁ.... అలాగా, సంతోషం..." అన్నాను ఏడ్వలేక నవ్వుతూ.

ఆ తరువాత అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. బయటికంటే ముగ్గురం కలిసి వెడతాం. స్నానానికి ఎలా వెడతాం. ఏమిటో చదువుకుందామని హాస్టల్లో చేరి భోజనము బాగా లేదని బస ఏర్పాటు చేసుకుని, పనివారితో నానాపాట్లు పడి స్వశక్తిని నమ్ముకుని, ఏదో వంతులవారిగా ఉడకేసుకునితిందామంటే, ఈ రోమియో బెడద వచ్చిపడింది. ఆ రోజు ఐదు గంటలకే సుధ స్నానంచేసి వచ్చి బుద్దిగా చదువుకుంటుంది.

తొమ్మిది గంటలకు నేను బాత్‍రూమ్‍లోకి వెళ్ళాను. స్నానంచేసి చీర చుట్టుకున్నాను. వెంటిలేటర్‍లో నుండి టప్‍మని వచ్చిపడిందో కాగితపు ఉండ. తుపాకిగుండు తాకినట్టు ఉలికిపడ్డాను. రోమియో సంగతి మరిచిపోయి, ఆదుర్దాగా విప్పాను.

"డియర్ సుధా! అర్థంకాదా నా బాధ..." ఈతనికి కవిత్వం కూడా వచ్చనుకున్నాను. ఉత్తరం అంతా గాథలతో, బాధలతో సాగింది.

అది చించి పడేశాను. ఆ సాయంత్రం పిన్నిగారి పనిమనిషి సుధను పిలిచింది. ఏమిటని వెడితే అక్కడ రోమియో ఉన్నాట్ట. ఇది పరుగెత్తుకువచ్చింది.

"మనము ఇల్లు మార్చటం తప్ప మరో దారిలేదు," సుధ బాధ.

"ఇల్లు తేరగా ఎక్కడ దొరుకుతుంది. పరీక్షలముందు ఈ గొడవ దేనికి?" అన్నాను.

దొడ్లోకి వెడుతుంటే, కిటికీలో నిలబడి నవ్వుతాడు. వరండాలోకి వెడితే కూనిరాగాలు తీస్తాడు..." ఏడ్పుముఖం పెట్టింది సుధ. అతనితో చెప్పిచూద్దామనుకున్నాను.

"ఏమండీ రోమియోగారూ!" ఆవేశంగా వెళ్ళాను. స్టయిలుగా సిగరెట్టు కాలుస్తూ, చేతికున్న గొలుసు సవరించుకుని, నిర్లక్ష్యంగా చూశాడు.

"ఏమిటండీ మీ ఉద్దేశం ?"

"పడుచు పిల్లవాడు పిల్లదాని ప్రేమిస్తే తప్పా ?"

"కాదండీ ఒప్పు ! ఆ ప్రేమతోనే పెళ్ళీకూడా చేసుకుంటారా!"

"యెందుకండీ అంత వెటకారం ! ప్రేమ నాకు సంబంధించింది గనుక ప్రేమిస్తాను. పెళ్ళి పెద్దలకు సంబంధించింది," అన్నాడు.

"ఓర్నీ యిల్లు బంగారంగానూ!" అనుకున్నాను. "మీ అక్కకు చెబుతాను" బెదిరించబోయాను.

"చెప్పు....." అన్నాడు ముసి, ముసిగా నవ్వుతూ. అతనికి వాళ్ళక్క సంగతి బాగా తెలిసే ఉంటుంది ఆమె తనింట్లో వాళ్ళని ఏ పొరపాటు అంగీకరించదు. పెళ్ళి ఏదో చేస్తానంది. అది త్వరలో ఉంటే మా బాధ తప్పుతుందని పిన్నిగార్నే పెళ్ళి విషయం కదిపాను.

"పిన్నిగారూ! మీ తమ్ముడి పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా?" ఆమె సంబరంగా కొండనాలుక కనిపించేలా నవ్వింది.

"మా వాళ్ళకు సాంప్రాదాయం, కట్నం ఘనంగా కావాలి. వీడికేమో అందమయిన అమ్మాయి కావాలి అన్నీ సమకూరవద్దూ?" అన్నది చంద్రహారం సవరించుకుంటూ.

"అన్నీ సమకూరేలోపల... రోమియో రోడ్డున పడితే..." అనబోయి నాలుక కరచుకున్నాను.

"ఏమిటీ?"

"ఏంలేదు పిన్నీ ! ఆలస్యం అయితే అందగాడు, ఉద్యోగం చేస్తున్నవాడు. ఎవరయినా ప్రేమిస్తే, కట్నం, గిట్నం పోతాయని..."

"ఆ బెంగ నీకు అక్కరలేదు. మావాడు అలాంటివాడు కాదు. అవునూ" నావైపు అనుమానంగా చూచింది పిన్ని కర్మ! ఉండి, ఉండి అతడిని ప్రేమించే కర్మ పట్టటం ఏమిటి ! ఏం చేయాలి? పరీక్షలముందు రోజుకో సమస్య. సుధ మరీ దిగులుపడిపోయింది.

"ఆడదానికి రక్షణలేని ఈ సమాజాన్ని తగలెయ్యాలి" అంది సుధ.

చేతకానివాళ్ళంతా తప్పు ఇతరుల మీదికి దులిపి, తాము ఆదర్శవాదులం అంటారు. మా ఆలోచనలో మేం ఉండగానే మరో ప్రేమలేఖ. సుధకు రాహు, కేతువుల్లా మేం దాపురించామట సినిమాకు రమ్మని ఆహ్వానం. అల్లరికాకుండా రోమియోకు బుద్ధి చెప్పాలి ! యెలా ? అతను వ్రాసిన ఉత్తరం తీసుకువెళ్ళి పిన్నిగారికి చూపాను. ఆవిడ ఆదిశక్తి అయి తమ్ముడిని అదమాయిస్తుందనుకున్నాను. అలక్ష్యంగా నవ్వింది.

"చూడూ, మాలా! ఈ ఉత్తరం నీకెందుకు వ్రాయలేదు ? ఆ సుధకే వ్రాశాడంటే ఆమె ప్రోత్సాహం ఉండే ఉంటుంది"

అమ్మా ! పిన్నమ్మా ! యెంత తెలివయినదానవు ! ఈ విషయము సుధతో చెప్పాను. అది గఁయ్‍మంది.

"ఛీ ఛీ ! వెధవ రాయబారం చేసి పరువు తీశావుకదే. ఈ ఉత్తరం ఆవిడకెందుకు చూపావు ? అక్కడికి నువ్వు బుద్ధిమంతురాలవయినట్టు, మేము అల్లరి చిల్లరి వారమయినట్టు..." మా సుధ అరుస్తూనే ఉంటుంది. దానికి నాలుకపై అప్పుడప్పుడు స్వాధీనం తప్పుతుంది. దానికి ఉన్న అవలక్షణాలన్నీ కనిపించకపోయినా రెండు మాత్రం ఎదుటివారిని బాధపెడతాయి. దుసురుగా నోరు పారేసుకుని ఫ్రాంక్‍నెస్ అనుకుంటుంది పాపం ! తనంత తెలివైందీ అందమయిందీ లేదనుకుంటుంది. నేను ఆలోచించి, ఓ చిన్న చీటీ వ్రాసి దానికిచ్చాను.

"ఇదీ నీ రోమియోకు అందించు... ఊఁ..."
అది చదివి అదిరిపడింది.

"అమ్మో! ఇంకేమయినా ఉందా? ఆ మెట్ల గదిలో యెవరేంచేసినా చూచే దిక్కులేరు."

"సుధా ! మనల్ని మనం రక్షించుకోవాలి. స్ర్తీకి రక్షణ ఇస్తాం అంటూ సమాజం రడీగా కూర్చోదు. గదిలోకి నువ్వు వెళ్ళటంలేదు. పిన్నిగారు ప్రక్కింటి ఆమెతో సినిమా కెళ్ళేరోజు మెట్లగదికి తాళం వేసుకుపోతుంది.."

"ఏమిటో నా కర్థం కావటంలేదు." సుధ ముఖం చిట్లించింది.

"అమ్మా ! రెండు రెండ్లు ఆరు అంటే అర్థమవుతుంది. నాలుగు అంటే యెలా అని అడిగే మేదావివి. నీకు చెప్పినా అర్థంకాదు. పదిగంటలవరకు ఓపికపట్టు," అన్నాను.
"సరే..." అయిష్టంగా తల ఊపింది.

నెరజాణ పోజు ! మగధీరులమని ముఖం తిప్పుతూ తిరిగే ముఠాను చూస్తే ముచ్చెమట్లు పోస్తాయి తనకు. ఒల్లంతా వొయ్యారమే అన్నట్లు ఉలికిపడుతుంది.

"పిన్ని ఆ గుమ్మం తాళం వేసుకోకపోతే?" లక్ష్మి అడిగింది.
"తరువాత మరో కోణంనుండి ఆలోచించుకోవచ్చు" అన్నాను.

ముగ్గురము తర్జన, భర్జన చేశాక, ఉత్తరం రోమియోకు అందజేసింది, సుధ ! ఆ క్షణంలో అతని ముఖం వర్ణించతరం గానంతగా మారిపోయింది. చింకి చాటంతయింది. ముగ్గురం చదువుతున్నా, మా దృష్టి అంతా పిన్ని మీదే ఉంది. ఆమె మెట్ల గదికి తాళం వేసుకుపోవటం చూచి అందరం తేలికగా నిట్టూర్చాం.

"మన సుద్దపప్పు అనుకుని పిన్ని గార్ని ముద్దెట్టుకోడుకదా!"

"అంత చొరవ ఉన్నవాడనుకోను..."

బాబాయిగారు, పిల్లలు భోజనాలు చేశారు. రోమియో భోజనం చేశాడో లేదో గాని మౌనము భోజనము చేస్తూ సిగరెట్టుమీద సిగరెట్టు కాల్చివేస్తున్నాడు. గాలి వచ్చినప్పుడల్లా సెంటు గప్పుమని గదిలోకి వచ్చి ముక్కు పుటాలు అదరగొడుతుంది.

హాల్లో గడియారం టంగు, టంగుమని పదిసార్లు కొట్టింది. నేను తొంగి చూశాను. రోమియోగారు లేరక్కడ.

"సుధా, లక్ష్మి, రండే..." పిలిచాను.

"ఛ...ఛ...మంచి ప్రేమ కథను అంతంచేస్తున్న పాపానికి, ప్రతీ జన్మలో ఆడపిల్లవై పుడతావు."

"థాంక్స్ ! నీకు మొగుడయ్యే దౌర్భాగ్యం పట్టనందుకు..." అన్నాను. ముగ్గురం హాల్లో జీరో బల్బ్ వేసి యెరగనట్టు నిల్చున్నాం. అందరికి ఉద్వేగం గానూ, ఏదో డిటెక్టివ్ సినిమాలోని ఆఖరి సీను చూస్తున్నట్టు ఉంది.సిగరెట్టు వాసన విపరీతంగా వస్తుంది.

"మాలా! సిగరెట్టు వాసన భరించలేక ఉక్కిరి బిక్కిరవుతావేమో... ప్రణాళికలూ..." లక్ష్మి ఏదో అనబోయింది. టక్కున దాని నోరు మూశాను. అవతల తాళం తీసిన శబ్దం అయింది. అక్క చేసుకున్న ఏర్పాటు కొత్తగా వచ్చిన తమ్ముడికి తెలియదు.

"డార్లింగ్ !... " బొంగురుగా వినిపించింది. చీకటి చీల్చుకుని చూడాలని ప్రయత్నించినాను. పిన్నిగారు భయంతో నిలబడిపోయింది.

"మా అక్కను గూర్చి భయపడుతున్నావా సుధా ! నో... నో... నా ప్రేమ, పెళ్ళి నా యిష్టం ! అక్కయెవరు? దుక్కలా మన ప్రేమకు అడ్డు వస్తే నరికేస్తాను ..." ఆవేశంగా ముందుకు దూకాడు.

"ఓరెయ్ ! నీ నోరు పడ ... నీ కడుపు కాలా !" పిన్ని శాపనార్థాలు పెడుతూ లైటు వేసింది.

రోమియోగారి ముఖం చూచి లక్ష్మి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుంది.

"అక్కా ! అది కాదే..."

"ఏది కాదురా! నేను దుక్కలా ఉన్నానా? నీ పెళ్ళాం వచ్చి చేసి పెట్టిందా! నువ్వురా? నీ కడుపు కాలా!" శాపనార్థాలు పెడుతుంది. మేం మా గదిలోకి తప్పుకున్నాము. చెవులు మాత్రం పిన్నిగారి గొంతు వినడానికి వదిలాం. మైకు లేకుండానే ఇల్లంతా ప్రతిద్వనిస్తుంది, ఆమె కంచు కంఠం.

"లక్ష రూపాయల కట్నంతో పెళ్ళి చేయాలని అమ్మా, నాన్న ఉబలాట పడుతుంటే ప్రేమించాడట ... పెళ్ళి కావల్సి వచ్చిందట ..."

"నా మాట వినక్కా..." రోమియో బొంగురుగొంతు.

"ఇంకేం వినాలిరా ! నా చెవులారా నీ ఆంతర్యం ఏమిటో విన్నాను పాపం ఆడపిల్లలు బుద్ధిమంతులు కాబట్టి బ్రతికి పోయాం..."

"అమ్మయ్య ! పిన్ని మనకు సర్టిఫికెట్ ఇచ్చేసిందెవ్ ..." సుధ సంతోషంగా అరిచింది.

"అవునుకాని మాలా! ఆ హనుమంతుడికి లక్షరూపాయల కట్నం ఇస్తారంటావా?" లక్ష్మి అనుమానం.

"లక్ష కట్నంతో పాటు సవా లక్ష కోరికలు తీరుస్తారు కొందరు పిచ్చి ముఖాలు," అన్నాను. పిన్నిగారికి మా సంగతులు బాగా తెలుసు. మహా అయితే పదివేల రూపాయలుకూడా ఇవ్వగలరో లేరో!

ఆ రాత్రి కలత నిదురపోయాము. రాత్రంతా ఏదో సణుగుడు గొణుగుడు వినిపించింది. మర్నాడు పిన్ని మమ్మల్ని పిలిపించింది.

"మీరు చెబితే ఏదో అనుకున్నాను. ఒఠ్ఠి బడుద్దాయి. ప్రేమ ఒక్కటే తక్కువయిందట. వాడి ఆఫిసుకు దగ్గర, మా అక్కయ్య ఇంట్లో ఉండమన్నాను... " తేలికగా నిట్టూరుస్తూ చెప్పింది.

"థాంక్యూ పిన్నీ ! మీ దెంత మంచి హృదయం ..." అన్నాను. పిన్ని చాటంత ముఖం చేసుకుని వెళ్ళి పోయింది.

"ఏమిటే పిన్నిని మునగచెట్టు యెక్కించేశావ్..."

"షటప్ ! పాపం ఎంత సాయం చేసింది. ఆడది, అబల, గిబల అంటూ కబుర్లు చెప్పక, మన సమస్యలు, మనం పరిష్కరించుకోవాలి...."

"జై వీరనారీమణికి... " అరిచింది లక్ష్మి. సుధ వచ్చి లోపలికి లాక్కుపోయింది.

"పరీక్షలు చూస్తే ఎక్స్ ప్రెస్ రైలు బండిలా వస్తుంటే, ఏమిటే మీ ఆగడాలు !" ఆరాదానిలా అరవటం మొదలు పెట్టింది, రోమియో బారినుండి తప్పించుకున్న కన్యారత్నం మా సుద్దమ్మ.మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)