సారస్వతం - కుంతి మాట
శ్రీకృష్ణుడి శైశవ క్రీడలు-గోపికల కోపము!
- కుంతి

ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మా!
పోయెదమెక్కడికైనను
మా యన్నుల సురభులాన మంజులవాణీ!

ఇది ఆంధ్ర దేశమందలి ఆబాలగోపాలాన్ని ఆనంద భక్తి పారవశ్యములోముంచి శ్రీకృష్ణ తత్వాన్ని తెలియచెప్పిన పద్యము. కృష్ణుడి అల్లరికి పతాకస్థాయి సన్నివేశము.

శ్రీమద్భాగవతములోని ఈ పద్యము పోతనగారిది. ఈ పద్యమొక్కటి చాలు గోపికలను కృష్ణుడు కపట శైశవముతో ఎంతగా బాధపెట్టాడో తెలియచెప్పడానికి, మనల ఆనంద పరచడానికి. చిన్ని కృష్ణుడి శైశవక్రీడలలోని ముగ్ధమాధుర్యాన్ని తెలియచేస్తూ, ఓపలేని గోపమ్మల నిందాపర్వము వర్ణిస్తూ, పాఠకులను ఆనందింపచేస్తూ , తద్వారా తరింపచేయడమే ఈ వ్యాసము యొక్క ఉద్దేశము.

సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీ కృష్ణుడిగా అవతరించినవేళ, తాను పరమాత్ముడైనా మానుష్యత్వాన్ని ప్రదర్షిస్తూ గోకులములో, గోపమ్మల ఇండ్లలో ఆడిన ఆటపాటలు చేసిన ఆగడాలు అంతా ఇంతాకాదు. అందువల్ల నాటినుండి నేటి వరకు భారతీయులందరూ చిన్నపిల్లల అల్లరిలో చిన్నికృష్ణుణ్ణి, చిన్నికృష్ణుడి అల్లరిలో శైశవమాధుర్యాన్ని, ముగ్ధత్వాన్ని చూస్తూ చిన్మయానందులవుతున్నారు. చిట్టి పొట్టి అడుగులను వేస్తూ అతడు చేసిన అల్లరిని, ఆగడాలను కొండొకచో శ్రుతిమించిన దుశ్చేష్టితములను కాంచి, పిడుగు బుడుగులున్న తల్లిదండ్రులు, ఈ ఆగడాలు మా కన్నయ్యవే అంటూ మురిసిపోతూ అనన్య ఆ"నందు"లవుతున్నారు.

వెన్నదొంగ కపటశైశవమును హరివంశ కావ్యములో ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన ,మాహాభాగవతములో పోతన అద్భుతముగా వర్ణించారు. ముందుగా వారిరువురికి శిరసువంచి పాదాభివందనములు.

ఈ కవులు కొంటె కృష్ణుని అల్లరిని వర్ణించినప్పుడు, దానిని మూడువిధములుగా చూపారు.

అ) కృష్ణుడు ఇంటింటా దూరి అలవిమాలిన అల్లరి చేయడము

ఆ)ఈ అల్లరి వెనుక గల ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్ధము చేసుకోలేని, భగవంతుడు తమపట్ల చూపుతున్న అవ్యాజప్రేమామృతమును మహాప్రసాదముగా భావించలేని గోపికలు, (లేదా గ్రహించినా, భావించినా మానుషరూపములో ఉన్న గోపమ్మలు తమ సహజ మానుషత్వాన్ని ప్రదర్శిస్తూ,) కృష్ణుడి ఆగడాలను భరించలేక అతడిని నిందిస్తూ, యశోదమ్మ ఇంటికి పోట్లాటకు రావడము.

ఇ) తెలుగు తల్లి, తెలుగు ఇల్లాలు ఎలా తన కొడుకు చేష్టలకు స్పందిస్తుందో అలాగే యశోదమ్మ స్పందించడము.

ఇక " ఆ కుమార శేఖరుండు, కపటశైశవంబున దొంగ జాడలంగ్రీడింప, గోపికలోపికలేక "యశోద కడకు వచ్చి, ఱవ్వ చేసిన వైనము కడు రమణీయము. మనకు స్మరణీయము.

ముందుగా ఎఱ్ఱన కృష్ణుడు ఎలా అల్లరి చేసాడో చూద్దాము.

"గోతి నీవెకా గారాబు కొడుకు గంటి-------".,"వినుమాయటు సెవులారంగ నిట్టులాత్మజకృతముల్---"అంటూ గోపికలు అతడి అల్లరి చేష్టల జాబితా మాటను విప్పారు.

-మాయింట్లో పదికడవలపాలు త్రాగి, వాటిని పడద్రోసి, అరుస్తూ వచ్చాడు.

-యాభై బానలలో చక్కటి వెన్నఉట్టి పై పెడితే, ఆ వెన్ననంతా వెక్కసముగా మ్రింగి కూలద్రోసాడు.

- చంద్రశాలలో ఓమూలలో పెద్ద కుండలలో నెయ్యిని దాచితే మాయావి యైన నీకొడుకు తాళాలు తలుపులు తెరిచి చొచ్చాడు. మేము వెళ్ళి చూసేలోగా త్రాగాడో యేమి చేసాడొ తెలియదు కాని ఒక్కబొట్టు నెయ్యిలేదు.

-నీకొడుకు పదికుండలపాలు, పెరుగు, నెయ్యిని, నేలపై వరదలాగా గుమ్మరించాడు. మేము వండుకున్న కూరలను, కూడును, పాయసాలను అందరికీ పంచాడు, దొంతులను పగులగొట్టాడు, పెయ్యల్ను కుడువ విడిచాడు.

-మగడికి, పిల్లలకు పెట్టుకోవడనికై వెన్న పటిక బెల్లము కలిపి వండుకున్నవి, అలసందలు, పంచదార కలుపుకుని వండుకున్నవి నీకొడుకు మింగి వేసాడు.

-ఆంతంత వెన్నముద్దలను చేరలతొ మింగాడు--- అంటూ ఇలా రకరకాలుగా రోష కషాయిత నేత్రలై ఆంగికాభినయములతో యశోదమ్మకు చెప్పారు. చెపుతూనే,

"యెట్టి బలియురైన దగవు పాటింపరే" ," ఏగతివేగుదునెక్కడ జొత్తుచెప్పుమా", "ఏ పగిదిని బ్రతుకరాదె యిటు చెడు కంటెన్" -అని నిష్ఠూరములు పలుకుతూ, నిస్శహాయతను వ్యక్తము చేస్తూ, "బూతములున్నవిగాక కడుపునన్", "శిశునందండంగెడు పనులే?", "ఇట్టి మనుజులుర్వి గలరే?" అంటూ చురకలు అంటించారు.

అంతేకాదు

"ఎక్కడకేనియుబోయెద మిక్కష్టపుబాటుపడగ నేమోర్వమునీ
చొక్కపు గొడుకు నీవును నొక్కతలై స్రుక్కుమాని యుండుడు నెమ్మిన్"

అంటూ నిరసన ధ్వని వినిపించారు. ఇది ఎఱ్ఱన కృష్ణుడి అల్లరి.

ఇక పోతన కృష్ణుడి అల్లరి చూద్దాము. అల్లరితో పాటు కొంటెతనము కొండొకచో లలిత శృంగారముకలగలిసాయి. ఔను! ఎఱ్ఱన నుండి పోతనకు వచ్చేసరికి కాలము మరింత మారింది. పిల్లలు మరింత పిడుగులయ్యారు. పోతన కృష్ణుడు అల్లరిలో చాలా అడుగులే ముందుకు వేసాడు. ఇక్కడ ఎఱ్ఱన కృష్ణుడి కంటే పోతన కృష్ణుడు రెండు ఆకులే ఎక్కువగా చదివాడు. పోతన ఇతడి అల్లరిని ఆగడముగా, కొంటెతనము శృంగారముగా మలిచాడు. ఈ సందర్భములో కోపించిన గోపికలు యశోద కడకు వచ్చి కృష్ణుని అల్లరి జాబితాను వివరించారు.

-మాపిల్లలకే పాలు లేవని బాలింతలు మొఱలు పెడుతుంటే మీ పిల్లవాడు నవ్వుతూ, దూడలను విడిచాడు.

-నీ బిడ్డ పాలన్ని ఇతరులకుపోసి మిగిలిన కుండలన్నీ పగులగొట్టాడు.

-పుట్టిపుట్టనట్టి నీబిడ్డ మాఇంట్లో దూరి రోలు, పీటలనెక్కి అప్పటికీ ఉట్టిపై కుండలు అందకపోతే కుండ క్రింద పెద్ద తూటు పెట్టి మీగడపాలు చేరలపట్టి త్రాగాడు.

-ఒక ఇంట్లో మీగడపాలుత్రాగి, కొంచెము మీగడను ఆ యింటి కోడలిమూతికిరాసాడు. దానితోఆమె అత్త , కోడలే దొంగ అంటూ కోడలిని కొట్టింది.

-ఒకింట్లో దూరి చక్కగ నెయ్యిత్రాగి, ఖాళీ కుండలను మరొక ఇంట్లో పెట్టగా, వారికీ వీరికీ పెద్దగొడవే అయింది.

-నా కంటే పెద్ద దేవుడు ఎవరు అంటూ మాయింట్లో నున్నదేవుళ్ళపై ఎంగిళ్ళు వేసాడు.

-చక్కగా నిదురపోతున్ననా బిడ్డ జుట్టును లేగతోకకు కట్టి ఇరువురిని వీధుల్లోకి నెట్టాడు.

ఇంతవరకు బాగానే ఉంది. ఇకముందు చూడండి.

-వెన్నదినబొడగని మా, పిన్నది యడ్డంబు వచ్చి పిఱిదికి దీయన్ జన్నొడిసి పట్టి చీరెను

-ఇమ్మగువ తన్ను వాకిట,గ్రుమ్మరుచో జేరినిలుపుకొని పేరడుగన్ నెమ్మోవి గఱచి వడిజనె

-మాబిడ్ద జలకమాడగ, నీబిడ్డడు వలువ దెచ్చె

-ఇచ్చెలువ జూచి మ్రుచ్చిలి, యచ్చుగ నుఱికించుకొనుచు నరిగెద నాతో వచ్చెదవా యని అన్నాడు.

- కొడుకులు లేరని మరొక సతి, కడు వగవగ దన్ను మగనిగా గైకొనినన్ గొడుకులు కలిగెదరని పై బడినాడు.

-చూలాలం దలగుమనిన, జూలగుటకు నేమూలంబు చెప్పమనె

-మామగవారలటువోవగ జూచి మంతనమునకున్ దగ జీరి పొందునడిగెను.

-తెఱవ యొకతె నిద్రింపగా, నెఱగట్టిన వలువనీడ్చి నేటగు తేలుంగఱిపించె నీకుమరుండు

-నాకొడుకును నాకోడలు నేకతమున బెనగ బామునీసుతుడు వైవంగోక లెఱుంగకపాఱిన, గూకలిడెన్నీ సుతుండు.

-తరుణి యొకతె పెరుగు దరుచుచు దుది వంగివెన్నదియ్యనొదిగివెనుక గదిసి మగువ ! నీ సుతుండు మగపోడుములు సేయసాగినాడు.

అని చెబుతూ" ఒక ఇంటి లో బాడునొక యింటిలోనాడు నొకయింటిలో నవ్వు నొకటఁదిట్టునొకట వెక్కిరించు నొక్కొకచో మృగ పక్షి ఘోషణములు పరగజేయు నిట్లు జేసి వెనుకనెక్కడ బోవునో" అంటూ వాపోయారు. అంతటితో వారూరుకోక అతడి చేష్టలు తెలుపుతునే ," జిన్నికుమారుండె యితడు శీతాంశుముఖీ" , " యీ ముద్దుగుర్ఱ్ఱడల్పుడెచెపుమా", చిత్రమిట్టిది గలదే" ,"ఇది వినుము శిశువు పనులే తల్లి" ,"జగమున్నిట్టి శిశువు చదువంబడనే", "రాచబిడ్డడైన ఱవ్వమేలే", అంటూ సంభ్రమసంశయావేశావేదనాశ్చ్రార్యాదులను ప్రకటించారు.

"కడు లచ్చి గలిగెనేనియు గుడుతురు గట్టుదురుగాక కొడుకులనగుచున్ బడుగుల వాడలపై బడవిడుతురె రాకాంతలెందు విమలేందుముఖీ" అంటూ నిందానిష్ఠూరాలాడారు.

ఎఱ్ఱ్రన గోపమ్మల్లాగే పోతన గోపమ్మలుకూడా పోయెదమెక్కడికైనను అంటూ, పెద్దింటి వాళ్ళ ఆగడాలను భరించలేని సగటువర్గాల ప్రజలు పొందే బాధలను వ్యక్తము చేస్తూ, నిస్సహాయత చూపారు.

ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, వీరిని యశోద సమాధాన పరచడము మరొక ఎత్తు. ఈవిడ అచ్చము మన పొరుగింటి ఇల్లాలే. తెలుగు తల్లియే. "తమపిల్లలు మంచివారే, అనవసరంగా ఇతరులు ఆడిపోసుకుంటున్నారు అనుకునే మనస్థత్వము కలది.

ఎఱ్ఱ్రన యశోద తెలివిగా"అనిన వినియశోదాదేవివేర్వేర వారి" ననునయించింది.

"మీసేగులెల్లనచ్చెద వేసరకుడు మీరులేక వేగునే మాకున్", అన్నది.

"బొంకాడెడుగఱితలెమీరింకిటజూచుకొనుడితనినెట్లడిచెదనో కింకయును గలకయునుమది శంకయు బోవిడిచి చనుడు సదనంబులకున్" అంటూ బుజ్జగించింది, సర్ది చెప్పింది. గోపికలు కోపము విడిచి వెళ్ళిపోయారు.

పోతన యశోద తన కొడుకును వెనుకేసుకొని వచ్చింది.

"(చ) నన్నువిడిచి చనడిట్టటు, నెన్నడు బొరుగిండ్లత్రోవలెఱుగడు నేడుం
గన్నులు తెఱువని మాయీ, చిన్నికుమారకుని ఱవ్వసేయందగునే"

ఏమీ తెలియని తన పసికందునుపట్టుకొని నిందిస్తారా అంటూ, వెనుకేసుకు వచ్చింది.

అన్యమెఱుగడు తనయంతనాడుచుండు మంచివాడితడెగ్గులుమానరమ్మా
అంటూ తనకొడుక్కు తాను కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చుకుంది.

ఏది ఏమైనప్పటికీ, అనగా శ్రీకృష్ణుడి అల్లరి, బాల్య చేష్టలు, గోపికలకోపము, యశోద సర్ది చెప్పడము అంతాహృద్యంగా అందమైన చలనచిత్రముగా మన కళ్ళముందు కదిలి, పోతనకు, ఎఱ్ఱనకు వేనవేల ధన్యవాదాలను సమర్పించుకొనేటట్లు చేస్తాయి.

ఇక ఈ ఇరువురు ఈ ప్రహసనాన్ని నడపడానికి ఎంచుకున్న భాష, వాతావరణము తెలుగు లోగిళ్ళకు దగ్గరగానుండి , మనము నిత్యము చూస్తున్నవిషయంగా తోచి ఆనందము కలిగిస్తుంది.

పోతన అంభోజాక్షి, కలకంఠి, విమలేందుముఖి, హేలావతి, గుణాఢ్యా, మంజులవాణీ, మృగాక్షీ, పర్వేందుముఖీ వంటి సంబోధనలను గొల్లెతలతో, యశోదకు ప్రయోగింపజేసి సంభాషణను రక్తికట్టించాడు. ఎఱ్ఱన, పోతనలు ప్రతి పద్యములో స్త్రీకి గల పర్యాయ పదములను ఔచితీ వంతముగా ప్రయోగిస్తూ, అవసరమగుచోట అచ్చతెలుగు పదాలు వాడుతూ సన్నివేశములను సుందరముగా మలిచారు.

అన్నమయ్య యశోద కూడా "కానరటె పెంచరటె" అను సంకీర్తనలో, గోపికలకు గడుసుగా సమాధానముగా ఇవ్వడమే కాక, కన్నయ్యను వెనుకేసుకొస్తుంది.

అందుకే ఈ శ్రీకృష్ణ లీలల ఘట్టము మధురాతిమధురంగా ఉంటుంది. మరియు బంగారానికి తావి అబ్బినట్లుగా ఈ లీలలను వర్ణిస్తున్నప్పుడు పోతన, ఎఱ్ఱనల కవిత్వము రసభరితముగా ఉండి పాఠకులను మరింత రంజింపచేస్తుంది.

అత్యద్భుత లీలను ప్రదర్శించి, మనుకు ఆనందము పంచిన ఆ లీలామానుషవిగ్ర్హహధారికి కోటిదండాలు.

వానిని అక్షరబద్దము చేసిన కవివరేణ్యులకు వేనవేల దండాలు.

శ్రీకృష్ణార్పణమస్తు!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)