నాకు నచ్చిన కథ
ఇల్లు - ఒక చేదు మాత్ర
కథారచన - విహారి
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి

గబగబా అడుగులు వేస్తున్నాడు రామ్మూర్తి. ఎండ కరకరలాడుతోంది. మనసు చిరచిరలాడుతోంది.

"ఈరోజు అమీతుమీ తేల్చుకోవాలి" - మనసులో ఏ వందోసారో అనుకున్నాడు. చూస్తుండగానే నీరెండ కమ్మింది. గాలీ, మేఘం విజృంభించాయి. వేగం హెచ్చించాడు.

వచ్చేశాడు, అదిగో ’మేజిస్టిక్ హేటట్’! తొండాన్ని పైకెత్తి ఘీంకరిస్తున్న గజరాజులా చూపరుల్ని సంభ్రమింపజేస్తుంది. అదే చిట్టిబాబు భవంతి, చిట్టిబాబంటే నగరంలో నాలుగుదిక్కులా రిసార్ట్ లూ, కాంప్లెక్స్ లూ, ప్రాజెక్టులూ వున్న రియల్ ఎస్టేట్ టైకూన్!

బిక్కు బిక్కుమంటూ కాంపౌండ్ గేట్ దగ్గరికి చేరుకున్నాడు. లోపలికి చూస్తుంటే ’సెక్యూరిటీ’ చెప్పాడు, "అయ్యగారు లేరు".

క్షణకాలం మనసు మల్లడిగొన్నది. "ఐనా ఈ సంగతిని ఇవాళ్టితో ఫైనల్ చేసుకోవాలి" అనుకొన్నాడు. “ఫర్వాలేదు. అమ్మగారితో మాట్లాడాలి” అన్నాడు.

పన్నేండేళ్ళనుంచి పాతబడిన విజిటర్ కనుక, “ సరే వెళ్ళండి” అన్నాడు సెక్యూరిటీ. పదహారు మెట్ల బేస్ మెంట్ల బేస్ మెంట్ ఎక్కి వసారాలో వున్న వరుస కుర్చీల్లో ఒకదానిలో కూర్చున్నాడు.

సింహద్వారం గుమ్మం పక్కనుంచీ “ఎవరు కావాలండీ?” ప్రశ్న వచ్చింది. స్త్రీ కంఠం.

“అమ్మగారితో మాట్లాడాలి”.

ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికెళ్ళింది.
కొద్ది క్షణాల్లో తిరిగి వచ్చి “హాల్లోకి రండి” అన్నది.

హాల్లోకి వచ్చి సోఫాల్లో ఒకదానిలో కూచున్నాడు. హాలుని చూడటం ఇదే మొదటిసారి. చుట్టూ చూశాడు. టెన్నిస్ కోర్టంత వుంది. గోడలకి రిసార్టులూ, బిల్డింగుల వాల్ పేపర్లూ, సోఫాలూ, కుర్చీలు, సీలింగ్ కి షాండ్లియర్లూ.. అంతా ’రిచ్’గా వుంది.

’మంది సొమ్ము వైభోగం’ అని రామ్మూర్తి’లో’ మనిషిలోని ‘కసి’ గొణుక్కుంది. పక్క గదిలోంచీ ఆమె వచ్చింది. నడివయస్సు, సాదారణ వేషమే అయినా హూందాగా వుంది.

సోఫాలోంచీ లేచీ లేవకుండా ’నమస్కారం’ అన్నాడు రామ్మూర్తి. ఆమె ప్రతినమస్కారం చేస్తూ కూర్చుంది.

“మీరు చాలా ఏళ్ళ నుంచీ వచ్చి వెళుతున్నారు. నేను చూస్తున్నాను. ఏమిటీ విషయం? చెప్పండి” అన్నది.

ఆమె ఈ మాట అంటూ వుండగానే ఒక వృద్ధురాలు హాల్లోకొచ్చి వేరే సోఫాలో కూచుంది “ఈ పార్వతి నా కూతురే లెండి. చిట్టిబాబుగారి భార్య. చెప్పండి” అన్నది కొంత చొరవతీసుకుని. పార్వతి సన్నగా నవ్వి, “మా అమ్మ సుశీలమ్మ. మాతోనే వుంటుంది” అన్నది.

రామ్మూర్తి గొంతు సవరించుకున్నాడు. ఇంతలో వో యువతి ట్రేలో నీళ్ళ గ్లాసూ, కాఫీ తెచ్చి టీపాయ్ మీద వుంచి వెళ్ళిపోయింది. “తీసుకోండి” అంది పార్వతి.

నీళ్ళు తాగి, కాఫీ కూడా పూర్తిచేశాడు రామ్మూర్తి.

“నాది ఒక పెద్ద గాథ అమ్మా. కొంచెం ఓపిగ్గా వినాలి మీరు” అని ప్రారంభించాడు.

“నాకేమీ ప్రత్యేకమైన పనులు లేవులెండి” –పార్వతి.

“మీ వారి మియాపూర్ ప్రాజెక్ట్ ’గాడ్స్ నెస్ట్’ గురించి మీకు తెలుసనుకుంటాను”

“వ్యాపార విషయాన్ని అణుమాత్రం కూడా వారు మాకు తెలియనియ్యరు. మీరు చెప్పండి” అన్నది పార్వతి.

“ఆ ప్రాజెక్టు బాధితుణ్ణి నేను”

“ఏం జరిగింది?” సుశీలమ్మ అడిగింది.

“ఆ ఎపార్ట్ మెంట్ కాంప్లెక్స్ స్థలం ఎనిమిది వందల గజాలు, దాన్లో నాది నూట ఇరవై గజాలు. నాతో కలిసి నలుగురం స్థల యజమానులం. ఇరవై ఒక్క ఎపార్ట్ మెంట్స్ లో నాకు రెండు ఫ్లాట్స్ ఇచ్చేటట్లు ఒప్పందం. అదిగాక ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకూ నేనుండే ఇంటి అద్దెని వారే భరించాలి. నగదుగా ఒక లక్ష ఇవ్వాలి. అగ్రిమెంట్ రోజున ఏభైవేలిచ్చి, మిగిలినది వారంలో ఇస్తానని నా సంతకం తీసుకున్నారు. ప్రాజెక్ట్ రెండేళ్ళ వ్యవదిలో పూర్తి కావలసి వుంది”

ఆగాడు. గ్లాసులో ఉన్న కాస్త నీళ్ళు తాగాడు రామ్మూర్తి. మళ్ళీ కొనసాగించాడు.

“రెండేళ్ళలో పనిపూర్తి కాకపోతే, నా సైట్ విలువ పదిలక్షలూ పన్నెండు పర్సెంట్ వడ్డీతో తిరిగి చెల్లించాలి”

“అయితే… ఏమైంది?” సుశీలమ్మే ప్రశ్నించింది. “పన్నెండేళ్ళ నుంచీ బేస్ మెంట్ మీది మొండి పిల్లర్స్ తో ఆచుట్టు పక్కల పెరిగిపోయిన కాంక్రిట్ జింగిల్ కి దిష్టి చుక్కలా నిలబడివుంది”.

“ఎందుకని ఆగిపోయిందో?” సాలోచనగా అన్నది పార్వతి.

“నా దురదృష్టం తల్లీ! ప్రభుత్వం అవరోధాలూ, కోర్టుకేసులూ.. వగైరా! ఆ తర్వాత చిట్టిబాబుగారు పదిపన్నెండు హౌసింగ్ కాంప్లెక్స్ లు కట్టారు. దీనికే ఈ గతి పట్టింది. నాతోపాటు సైట్ ఇచ్చిన ముగ్గురూ కోర్టుకి వెళ్ళారు. వారిలో ఒకాయన తన రాజకీయశక్తి తో డబ్బు రాబట్టుకున్నాడు. ఇంకొకాయన మాఫియా ద్వారా భయపెట్టి సాధించాడు. మూడో ఆయన కేసు నడుస్తోంది. నేను కోర్టుకు వెరచి, ఆ ఆలోచన చెయ్యలేదు. వినియోగదారుల ఫోరమ్ కి పోతే, వాళ్ళు నా డబ్బు నాకివ్వాలని తీర్పునిచ్చారు. కానీ, దాన్ని అమలు చేసే యంత్రాంగం కరువైంది”.

పార్వతీ, సుశీలమ్మా ఇద్దరూ ఏదో ఆలోచనతో మౌనం వహించారు.

బయట సన్నని తుంపర మొదలైంది.

“అంటే మీ సమస్య…?” పార్వతి ప్రశ్నతోనే తన దిగులు ధ్వనింపజేసింది.

“అతి కష్టంమీద చిట్టిబాబుగారి దర్శనభాగ్యం కలగటం, ఆయనేమో “ఫోరమ్ కి వెళ్ళావుగా. తేలనీ” అని వెటకారంగా మాట్లాడి శూన్య హస్తాన్ని చూపటం. అగ్రిమెంట్ సొమ్ములోని ఏభైవేలు కూడా ఇవ్వకుండా సాచివేస్తూ వచ్చారు”

“ఏం చెప్పమంటారు తల్లీ. ఉన్న గూడుపోయింది. నాకు తొమ్మిదేళ్ళ కొడూకూ, ఆరేళ్ళ కూతురూ ఉన్నారు. వాళ్ళ చదువు సరిగా లేదు. నేను చదివిన చదువుకు ఉద్యోగమా-షాపింగ్ మాల్ లో సేల్స్ మన్. ఆ చారెడు కొంప ఉన్నప్పుడు చిన్నస్టేషనరీ షాప్ తో నోట్లోకి నాలుగు వేళ్ళూ వెళ్తూవుండేవి. నాభార్య కుట్టుమిషన్ తో రోజులు వెళ్ళదీయాల్సొచ్చింది”.

“నాలుగేళ్ళు గడిచాయి. ఖర్చులు పెరుగుతున్నై, పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, నా భార్యా పిల్లలూ- నన్ను, నా అసమర్థతనీ తిట్టని రోజులేదు. ఇలా కటువుగా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీవారిని శాపనార్థాలు పెట్టని రోజులేదు. తమని నిశ్రయుల్ని చేసి వేధిస్తున్న పాపానికి అనరాని మాటలు అనేవారు. నవ్వేవాళ్ళది నవ్వే వేడుకగా తయారైంది. నానలుగురి అన్నలకీ మమ్మల్ని దెప్పటమే ఆనందమైంది”.

“నా నిస్సహాయతకి నన్ను నేనే నిందించుకోవటం మిగిలింది”

పక్క గదిలోంచీ ఎవరో ’అమ్మా’ అంటూ కేకేశారు.

“నే చూస్తాలే” అంటూ లోపలికి వెళ్ళింది సుశీలమ్మ.

“ఊ..” అని నిట్టూర్పు విడిచి సోఫాలో కదిలింది పార్వతి. రామ్మూర్తి ఆమెకేసి చూస్తూ మళ్ళీ చెప్పసాగాడు.

“ఆరేళ్ళ క్రితం – నా కొడుకు టెన్త్ అయింది. ఇంటర్ లో చేరాలి. చేతిలో పైసా లేదు. ఆవేళ… మా కుటుంబం మోత్తం మీ ఆఫీసుకు వెళ్ళాం. పదిగంటలకు వెళితే, రెండుగంటలకి చిట్టిబాబుగారి దర్శనమైంది. పరిస్థితి చెప్పుకుని ప్రాధేయపడ్డాం. ’ఆ ప్రాజెక్టంతా భ్రష్టు పట్టిపోయింది. నేనేం చెయ్యలేను’ అన్నాడు. నాకొడుకు చిన్నతనపు ఆవేశంతో ’నీ అంతు చూస్తేగానీ ఏదో ఒకటి చెయ్యవు’ అని మాటలు తూలి మాట్లాడాడు. నా భార్య కనీసం అగ్రిమెంట్ సొమ్ములోని ఏభై వేలన్నా ఇవ్వమని కాళ్ళా వేళ్ళా పడింది. చిట్టిబాబుగారు నా వైపు చూస్తూ, నేనసలు బ్యాలెన్స్ ఇవ్వాలనెక్కడుందయ్యా- వెర్రి పంతులూ!’ అని నవ్వేశారమ్మా.

’నా గుండె మండిపోయింది. మా అందరి పిడికిళ్లు బిగిసినై, పెదవులు కొరుక్కున్నాము. చివరికి ఏమీ చేతగాని నిస్సహాయతతో వెనక్కి పోయాము. నా కొడుకు చదువుని ఆపేయాల్సి వచ్చింది.’

దీనంగా పార్వతిని చూస్తూ కూర్చున్నాడు రామ్మూర్తి. పార్వతి సోఫాలో అస్తిమితంగా కదిలి, చీరని పాదాల మీదికి లాక్కుని, రామ్మూర్తివైపు చూపు నిలపలేక, పక్క గదివైపు చూస్తూ మొహాన్ని పమిటతో తుడుచుకుంది. ఇటు తిరిగి, “ఆ తర్వాత?” అని మాత్రం అన్నది.

“నా కొడుకు ప్రవర్తన రోజు రోజుకీ మారిపోయింది. నేను వాణ్ణి కాలేజీలో చేర్చాలని శతథా ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. వాడు పిచ్చివాడిలా తిరగసాగాడు. చివరికి ఆ నిరాశతో, కోపంతో, నామీది కసితో…” అని ఆపి మొహాన్ని కడువాతో కప్పుకుని ఏడవసాగాడు. పార్వతి గతుక్కుమన్నది. మౌనంగానే మెడ ముందుకు వంచి ప్రశ్నార్థకంగా కూచుంది.

చాలాసేపు హాల్లో మౌనం పరుచుకుంది.

పక్కగదిలోకి వెళ్ళిన సుశీలమ్మ బయటికివచ్చి, గంభీరంగా ఉన్న ఆ వాతావరణ పరిస్థితిని గమనించి తానూ మౌనంగా కూచుంది.

కొంతసేపటికి తెప్పరిల్లాడు రామ్మూర్తి.

“అయితే… ఆ అబ్బాయి..?” అడిగింది పార్వతి, బయట చినుకు పెద్దదయినట్టు చప్పుడు చేస్తోంది.

“నిద్రమాత్రలు మింగి చనిపోయాడమ్మా!”

గతుక్కు మన్నది పార్వతి. చాలాసేపటికి, “సారీ, వెరీ సారీ రామ్మూర్తిగారూ. చాలా విచారకరం…” అని తల్లివైపు చూస్తూ, “వారి కొడుకు…” అని తెలిపింది. ఆమె “అయ్యో. పాపం…” అని నిట్టూరుస్తూ, “పిల్లలకి ఈమద్య ఈ ధోరణి ఎక్కువైంది.” అని రామ్మూర్తి కొడుకు చర్యని కూడా లోకరీతిలో కలిపేసింది. పార్వతి మాత్రం ఈదరగాలికి తలవొగ్గి ఊగుతున్న మొక్కలాంటి మనసుతో అలా కూర్చుండిపోయింది.

“ఆ తర్వాత మీరు మా అల్లుడిగారిని కలుసుకోలేదా ఏవిటి రామ్మూర్తిగారూ?”

అని అడిగింది సుశీలమ్మ.

“లేకేం తల్లీ! కలుసుకున్నాను. వాళ్ళ ఆఫీసులో చెప్పి, వొక పదివేలిప్పించారు.

’ఇది లెక్కల్లో వుండదు. ఔటాఫ్ సింపతీ ఇప్పిస్తున్నాను. కేసు వ్యవహారం తేలనీయండి’ అని పాతపాట పాడారమ్మా”

ఇది విని సుశీలమ్మ నిలకడగా ‘ప్చ్’ అని నిట్టూర్చింది.

చాలా సేపటికి వెళ్ళటానికి లేచాడు రామ్మూర్తి. ఆయన వసారా మెట్టు దిగుతుంటే పైన గుమ్మంలో నుంచుని అన్నది పార్వతి, “రమ్మూర్తిగారూ ఒక్కమాట!”

వెనక్కి తిరిగి చూశాడు. అడుగుని వ్యత్యస్తంగా నిలుపుకున్నాడు.

“మీరొక్కసారి శనివారం నాడు ఇక్కడకి రండి..”

“అలాగేనమ్మా” అని తలవూపి వెనక్కి చూసి ముందు మెట్లు గబగబా దిగేశాడు రామ్మూర్తి, చినుకుల్లో తడుస్తూ వెళ్ళిపోయాడు.

-శనివారం వచ్చింది.

సాయంత్రం ఐదవుతుండగా, ‘మేజస్టిక్ హేబిటెట్’కి వచ్చాడు రామ్మూర్తి. నీళ్ళూ, కాఫీ వచ్చాయి. సేవించాడు. ఏం జరుగనున్నదో అని దిగులు కళ్ళతో దిక్కులు చూస్తూ కూచున్నాడు.

పార్వతి హాల్లో కొచ్చింది. ఆమె వెనగ్గా సుశీలమ్మ వచ్చింది. నమస్కరించాడు రామ్మూర్తి. కూర్చోండి అన్నట్టు తానూ కూచుంది పార్వతి. సుశీలమ్మ నిలబడే వుంది.

“మీరు నా మాటని మన్నించి వచ్చినందుకు సంతోషం రామ్మూర్తిగారూ. మీ సమస్యని నాకు వీలైనవిధంగా పరిష్కరిస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఇదిగో డబ్బు. పదిలక్షలు!” అని తల్లి వైపు చూసింది. సుశీలమ్మ ఒక వేలెట్ని అతనికి అందించింది. తీసుకున్నాడు. అతని మేధ శూన్యంగా ఉంది.

“దీనితో మీరు ఏదో విధంగా మీ జీవికను ఒక గాడిలోకి తెచ్చుకోండి. అంతగా అయితే, పాత రోజులనాటి స్టేషనరీ షాపునే పెట్టుకోండి.”

రామ్మూర్తికిది అనూహ్యమైన మలుపు. మొహంమీద విభ్రమచ్చాయ పరచుకుంది. క్షణాల తర్వాత మేధలో చలనం కలిగింది.

“మా అమ్మాయి తనకి నేనిచ్చిన నగలన్నింటినీ అమ్మేసింది- ఈ డబ్బు కోసం. మా అల్లుడికి తెలీదు” సుశీలమ్మ టూకీగానే విషయం విశదపరచింది.

ఇంకా విభ్రమంగా పార్వతి మొహంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు రామ్మూర్తి. హఠాత్తుగా ఇప్పుడతని కళ్ళల్లో నీరు తిరిగింది. దూరంగా నడిసముద్రంలో ఎత్తైన గిరిశిఖరం మీద వెలుగు కిరణం తోచింది. కన్నీటి తెరమధ్యన పార్వతి రూపం!

చాలాసేపటికి స్పృహలోకొచ్చి, గొంతు పెగల్చుకుని “మీకు నేనెలా కృతజ్ఞత చెప్పలో తెలియటంలేదు” అని మాత్రం అనగలిగాడు.

సుశీలమ్మ మాత్రం “ఈ రశీదు మీద సంతకం చేసివ్వండి. మా భద్రత కోసం” అని రశీదుని అందించింది. తీసుకుని సంతకం చేసిచ్చాడు.

మరికొన్ని నిముషాలు గడిచాక లేచాడు రామ్మూర్తి. “వెళ్దురుగాని. మిమ్మల్ని మా డ్రైవర్ దింపుతాడు” అన్నది పార్వతి. మళ్ళీ కూచున్నాడు.

క్షణాల తర్వాత పార్వతి లేచి “ ఒక్కసారి ఇటురండి…” అని పక్కగదివైపు అడుగేసింది.

రామ్మూర్తి లేచి నిమ్మలంగా ఆమెని అనుసరించాడు. ఆమె లోనికి వెళ్ళింది. రామ్మూర్తి గుమ్మం బయటి అడుగుతో నిలబడ్డాడు.

“చూడండి.” అని పక్కకి తొలగింది పార్వతి.

చూశాడు. కళ్ళు తిరిగినట్టైంది. గదంతా నిండుగా వెలుగుతో దేదీప్యమానంగా వున్నా ‘లో’ చీకటి ముద్దకట్టినట్లనిపించింది. శ్వాస స్తంభించినట్లయింది. గుండె కరిగి ప్రవహిస్తున్నట్టు చల్లబడింది. తూలి పడబోయి గుమ్మాన్ని పట్టుకుని నిలువరించుకున్నాడు.

దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అన్నది పార్వతి, “ఏనాడు చేసిన పాప ఫలమో, ఎవరి శాప ప్రభావమో ఇట్టా కట్టి కడుపుతోంది. అనుభవిస్తున్నాం…” ఆగి మొహాన్ని చేతుల్లో దాచుకుని “ఇంకా మీ భార్య వంటి ఇల్లాలి శాపనార్థాల బరువుని మోయలేను. ఈ డబ్బుతో ఆమెకు ఓదార్పునివ్వండి. మమ్మల్ని క్షమించమనండి” అన్నది. ఉలిక్కి పడ్డాడు రామ్మూర్తి. శరీరాన్ని జలదరింపజేస్తున్న కళ్ళెదుట భౌతిక వాస్తవం నుంచీ కొంచం తేరుకున్నాడు.

భయం భయంగా- కళ్ళు విచ్చుకుని మరొకసారి గదిలోకి చూపుమరల్చాడు.

సుమారు ఇరవై ఏళ్ళ యువతి! కాళ్ళూ చేతులూ ముడుచుకుపోయి, నిలువు గుడ్లతో, ముద్దగట్టిన వికృతాకారంగా-గుడ్డల మూటలా నేలపై పడి వుంది! అసహజమైన పరిమాణంలో వున్న ఆమె శిరస్సు అటూ ఇటూ అసంకల్పంగా, అవిరళంగా ఊగుతోంది!

“సారీ.. సారీ… వెరీ సారీ…!” అంటూ రివ్వున వెనక్కి తిరిగి, గబగబా నడుస్తూ బయట పడ్డాడు రామ్మూర్తి!!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)