సారస్వతం
అష్టావక్రుడు - అష్టావక్ర గీత
- టీ.వీ.యస్.శాస్త్రి

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం ఉంది. అదేమిటంటే నిలకడలేదు మనిషిదగ్గర . అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ ఉండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు. కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడన్న పేరు వచ్చింది .అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనకుడు పెద్దయాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువూ, మిత్రుడూ అయినా సువేదకేతువును వెంటపెట్టుకుని అష్టావక్రుడు జనకుడి వద్దకు వెళ్ళాలనుకున్నాడు .అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో "నాయనలారా! గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు, ఉపనిషత్తులు చదువుకున్న విద్యాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే - రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది " అన్నాడు.ఈ వాదం రాజుగారి చెవికి చేరింది.ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి రాజు, "నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన బేధం లేదు. కాలుతుంది, కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్దండుడిలా ఉన్నాడు" అనుకుని, "ఆ బాలకులిద్దర్నీ వెంటనే లోపలికి పంపండి" అని భటుల్ని ఆదేశించాడు.ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుడ్ని సువేదకేతువునీ లోపలికి పంపారు.కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్న పిల్లలు రాకూడదు.వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు."మేం చిన్న పిల్లలం
కాము, వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవర్నీ పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు - జ్ఞానంచేత పండినవారే వృద్ధులు. తెలివి ఉన్నవాడే మనిషి " అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు.ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడకు వచ్చి, " మా పండితులందరూ మహా విద్యాంసులు. అటువంటి వాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్ధం కావటం లేదు. ఒక వేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు."మహారాజా! మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్ళు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమనీ, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పొగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను. మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానీయండి" అని కోరాడు అష్టావక్రుడు.అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు.అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.ఒకసారి అష్టావక్రుడు అలకానగరానికి వెళ్ళాడు. కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు.

"అయ్యా! మీ వంటి మహనీయుణ్ణి ఆరాధించగలిగాను! తరించాను!! మీకేం కావాలో చెప్పండి" అని వినయంగా అడిగాడు కుబేరుడు."అలకాధిపతీ! నేను బ్రహ్మచారిని. తపస్సు చేసుకుంటూ ఉండే వాణ్ణి. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. వదాన్యుడనే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది. ఆమెకు, నాకు పెళ్ళి చేయమని" అడిగాను."నువ్వు నా కుమార్తెకు తగినవాడవు.తప్పకుండా ఇస్తాను.కాని పెళ్ళయే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళిరావాలి" అన్నాడాయన.

"ఉత్తర దిక్కుగా ఎంతదూరం వెళ్ళను?ఎక్కడికి వెళ్ళను? ఏం పని చెయ్యను?" అని అడిగాను.

"అలకానగరం దాటి, హిమాలయంలో గిరీవుని కోసం గిరిజన తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు. నీప వృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది. అక్కడ ప్రాయంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది. ఆమెను చూసిరా! రాగానే పెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను" అన్నాడు వదాన్యుడు. అందుకని బయలుదేరాను. నాకు నీ వల్ల ప్రత్యేకంగా కావల్సిందేమీ లేదు, వెళ్ళొస్తాను" అన్నాడు అష్టావక్రుడు. హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి. వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేకం కనిపించాయి. వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది. అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు. "అమ్మాయీ! లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు" అన్నాడు గుమ్మం దగ్గరున్న పరిచారికను చూసి.కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు వచ్చి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు. తిన్నగా వాళ్ళ వెంట అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడొక్క రత్నపర్యంకం ఉంది. దానిమీద యవ్వనం, సౌందర్యం మూర్తీభవించిన ఒక స్త్రీ కూర్చుని ఉంది. రత్నాభరణాలతో, తెల్లని వస్త్రాలలో మెరిసిపోతోంది.

అష్టావక్రుణ్ణి చూడగానే లేచి నిలబడిందామె.ఆమె, అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లాడుకోసాగారు. చీకటిపడింది."పొద్దుపోయింది - పడుకుందామా?" అని అడిగింది ఆమె.ఇద్దరూ విడివిడి శయ్యల మీద పడుకున్నారు. కొంచెంసేపటికి ఆమె లేచి అతని దగ్గరకు వెళ్ళింది. అతనిలో ఏ చలనం లేకపోయేసరికి గట్టిగా కౌగిలించుకుని, "మగవాళ్ళు భోగపరులు. ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకి ఉంటుంది, కానీ పురుషులకు ఉండదు. కానీ, మీ వైఖరి విపరీతంగా ఉంది. నా అంతట నేను వలచి దగ్గరకు వస్తే నన్ను నిరాదరిస్తారేమిటి? నన్ను, నాతోపాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలనుభవించండి. నేను మీదానను. మీ మాట జవదాటను. నన్ను బాధ పెట్టకండి. నన్ను మీ దానిగా చేసుకోండి" అని బతిమాలింది."అతివా! నేను అస్ఖలిత బ్రహ్మచారిని. ఇటీవలనే నాకు పెళ్ళి చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది. నన్నిలా అడగడం తగదు" అన్నాడు అష్టావక్రుడు."నువ్వు ధర్మమార్గంలో సంచరించు ఇటువంటి పనులు చెయ్యకు" అని వారించాడు అష్టావక్రుడు. "సరే" అందామె. అక్కడినుంచి వెళ్ళిపోయింది.మళ్ళీ రాత్రి అయింది. " నేను మీ దగ్గరకు రానా?" దీనంగా అడిగిందామె."నేను వెళ్ళొస్తాను" అని లేచాడు అష్టావక్రుడు."మహాత్మా! నిన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో వదాన్యుడే నాదగ్గరకు పంపాడు నిన్ను. నేను ఉత్తర దిశను. నీ నిష్ఠకు సంతోషించాను. ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు కోరుకున్న సుప్రభ నీకు భార్య అవుతుంది. ఇంక సంతోషంగా వెళ్ళు" అందామె.ఆమెకు నమస్కరించి బయలుదేరాడు అష్టావక్రుడు. జరిగినదంతా వదాన్యుడితో చెప్పాడు.ఆయన సంతోషించి అష్టావక్రుడికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు.అష్టావక్రుడికి శాప విముక్తి కలిగి, చక్కని రూపాన్ని పొందాడు. ఇదీ అష్టావక్రుడి కధ!

అష్టావక్ర గీత--అష్టావక్ర గీత వేదాంతానికి సంబంధించిన గ్రంథం. ఇది అద్వైత వేదాంతాన్ని వివరిస్తుంది. ఇది అష్టావక్ర మహర్షికీ, జనకుడికీ మధ్య జరిగిన సంవాదంగా వ్రాయబడింది.ఇక్కడ సంవాదంలో ఉన్న అష్టావక్రుడు, మహాభారతంలోని అష్టావక్ర మహర్షి ఒక్కరే అయి ఉండవచ్చు. అయితే ఈ విషయానికి ఋజువు గ్రంథంలో లేదు. రాధాకమల్ ముఖర్జీ అనే పరిశోధకుడు, ఈ గ్రంథంలోని జనకుడు రామాయణంలోని సీత తండ్రి అనీ, యజ్ఞవల్క్య మహర్షికి శిష్యుడనీ గుర్తించారు. ఇందుకు బృహదారణ్యకోపనిషత్తును ప్రమాణగ్రంథంగా తీసుకున్నారు. బృహదారణ్యకోపనిషత్తులో జనకుడు యజ్ఞవల్క్య మహర్షి నుండి పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని చాలామంది అంగీకరించ లేదు. ఎందుకంటే,యుగాలే తేడాలున్నాయి! భగవద్గీత (మూడవ అధ్యాయం 20 నుండి 25 శ్లోకాలు) లో జనకుడు ఆత్మజ్ఞానం పొందిన రాజుగా గుర్తించబడ్డాడు. అష్టావక్రుడు అత్యుత్తమమైన జ్ఞానాన్ని సరళమైన భాషలో, సూటిగా అందరికి చెప్పాలనే జన్మించారు. అలా చెప్పటానికి రాజదర్బారు కంటే వేరొక మంచి చోటు ఉంటుందా? అందుకని అప్పటి రాజు జనకుని ఆస్థానానికి బయలుదేరాడు. ఈయన రూపం, నడకతీరూ చూసి సభాసదులు నవ్వసాగారు.స్థాణువుగా అందరూ సద్దుమణిగేవరకూ నిశ్చలంగా ఉన్నాడు అష్టావకృడు. ఒక్కసారి సభికులను చూసి అష్టావక్రుడు బిగ్గరగా నవ్వాడు."నువ్వెందుకు నవ్వుతున్నావ్?" అన్నాడు జనకుడు."నువ్వు చెప్పులుకుట్టే వాడివి రాజా!చెప్పులు కుట్టేవాడే చర్మానికి విలువ కడతాడు,మీరు నా చర్మాన్నీ, ఆకారాన్నీ చూసి నా గురించి అంచనాకు వస్తున్నారు." అని అన్నాడు అష్టావక్రుడు.అష్టావకృడి జ్ఞానాన్ని గుర్తించి, ఆయనతో సంవాదం మొదలు పెడతాడు జనకుడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణే అష్టావక్ర గీత! దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉంటాయి. ఈ అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. అష్టావక్రగీతను ఎప్పుడు రాశారు అనే విషయాన్ని చెప్పటం చాలా కష్టం. అయితే భగవద్గీతను రాసిన తర్వాతే దీనిని రాశారని చెప్పవచ్చు. సంస్కృతంలోని ఈ మూల గ్రంథాన్ని తర్వాతి కాలంలో అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెబుతాడు అష్టావక్రుడు.అష్టావక్ర గీత ఆత్మజ్ఞాని లక్షణము గురించి ఇలా చెబుతుంది- ఎవడు తృప్తుడై ఇంద్రియశుద్ధి కలవాడై, ఎట్టి సంగమము లేని వాడై ఆనందించుచున్నాడో వానికే జ్ఞానఫలం, యోగాభ్యాస ఫలం లభించును.తత్త్వజ్ఞాని ఎప్పుడూ కూడ ఖేదమును పొందకూడదు.అతను నేను పరబ్రహ్మ స్వరూపమును అనే నిశ్చయజ్ఞానము పొంది ఉండాలి .అందువల్ల ఇతర విషయాలు అతనిని ప్రభావితుడిని చేయలేవు.

ముక్తచేతసుడగు జ్ఞానికి ఒకానొక ఉత్కృష్ఠ దశ ఉంటుంది ,ఇదే జీవన్ముక్త దశ!ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనినీ ఆశింపదో అతడే జీవన్ముక్తుడగుచున్నాడు.‘‘ఎవరైతే తాము స్వేచ్ఛగా ఉన్నామనుకుంటారో, వారు స్వేచ్ఛగా ఉంటారు. ఎవరైతే తాము బంధనాలలో చిక్కుకున్నామనకుంటారో వారు బంధనాలలోనే మగ్గిపోతారు. ఒక వ్యక్తి ఆలోచనల ఆధారంగానే అతని నడవడిక ఆధారపడి ఉంటుంది’’ అని చెబుతుంది. ఈ భావనను అనేక అద్వైత సిద్ధాంత గ్రంథాల్లో కూడా చూడవచ్చు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)