కవితా స్రవంతి
నువ్వు నేను అజ్ఞానం
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

ఆరోజు మనతోపాటు అతను కూడా ఉన్నాడన్నవిషయం నువ్వు గుర్తించి ఉండవు.
అతనిపేరు అజ్ఞానం అన్నసంగతి బహుశా నీకు తెలిసి ఉండదు.
నువ్వడిగే ప్రతిప్రశ్నా అతని ప్రేరణే అని,నీ ప్రతి అనుభూతికి అతనే కారణమని,
నీ ప్రశ్నలకు బదులివ్వటం కాలహరణమే అని,
నా నవ్వును నువ్వు అపార్ధం చేసుకోవటానికి అతనే హేతువని కూడా నాకు తెలుసు,
అందుకే నాకు మళ్ళీ ఇప్పుడు నవ్వువస్తోంది.
నువ్వు చెప్పే దుర్లక్షణాలు సమాజంలోవి కావని, హృదయంలోనివని,
ఎవరైనా సమాజాన్ని మార్చలేరని,హృదయాన్ని మాత్రమే మార్చుకోగలరని,
నేను నీకు అర్ధమయేలా చెప్పాలన్నా అతను నీకవి అర్ధం కాకుండా చేస్తున్నాడు.
ఎందుకంటే మిధ్య అతను నేర్చుకున్న విధ్యఅని,
అరిషడ్వర్గాలు అతని శక్తులని, భ్రాంతియే అతని కాంతియని
వాటినే అతను నీపై ప్రయోగిస్తున్నాడని తెలుసుకొని ,
నీ విజ్ఞాన మహిమతో అతనితో వాదించు, అతనిని బేధించు,
నీ జ్ఞానపటిమతో అతనిని ఓడించు, అతనిపై పట్టును సాధించు.
అతను నీకు లొంగిన మరుక్షణం
కోపంతో కార్యాలు సాధించలేమని, ఉక్రోషంతో ఊరిని బాగుచేయలేమని,
ఉండాల్సినది ఆశకాదు ఆశయమని, ఆతృత కాదు ఆలోచనని తెలుస్తుంది.
ఆవేశం కాదు ఆచరణ ముఖ్యమని నీకు అర్ధం అవుతుంది.
లేకుంటే నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా వ్యర్ధంఅవుతుంది.
అతనిపై ప్రకటించు రణం, ఈ శ్రమలన్నిటికీ అతనే కారణం.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)