కథా భారతి - అనగనగా ఓ కథ
ప్రశ్న
-సి.యస్.రావు

అది వేసవి సాయంకాలం - సూర్యుడు చల్లబడినా వాతావరణం వెచ్చగానే వుంది. అభ్యుదయ నాటక సమితి రిహార్సల్ హాలులో ఆ సమితి సంస్థాపకుడు శర్మాజీ కూర్చుని ఒక కొత్త నాటికకు, ప్రొడక్షన్ నోట్ రాస్తున్నాడు.

ఆ సమాజంలోని నలుగురు నటులు శర్మాజీ ఏకాగ్రతకు అంతరాయం కలగకుండా ఏదో పిచ్చాపాటీ నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.

శర్మాజీ ఆ సమాజానికి ప్రయోక్త, దర్శకుడు. సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలుకల మనిషి.

సమాజంలోని మూఢనమ్మకాలను, కుళ్ళుని రంగస్థలం ద్వారా తొలగించాలని తాపత్రయపడే మనిషి... మనిషిలోని మానవత్వాన్ని పెంపొందించటానికి, ఆలోచింపచేయడానికి నాటకం ఒక బలమైన ఆయుధం అని నమ్మిన మనిషి.

గత యిరవై ఏళ్లుగా చిత్తశుద్దితో కళాసేవ చేస్తున్నాడు. క్రమశిక్షణకు మరో పేరు శర్మాజీ--- గత యిరవై ఏళ్లలోను ఎందరో నటులు ఆయన దగ్గర తర్ఫీదు పొందారు- పేరు తెచ్చుకున్నారు.

క్రమశిక్షణకు తట్టుకోలేక కొంతమంది, మంచి అవకాశాలు వచ్చి కొంతమంది, అవకాశాలు లేక కొంతమంది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే వున్నారు - కొత్తవారు వస్తూనే వున్నారు...

శర్మాజీ సమాజం ఒక ప్రవాహం. పాత నీరు పోవటం - కొత్తనీరు రావటం ప్రవాహ లక్షణం---

ఇప్పుడున్న కొత్తనీరు. ఆయనతో పాటుగా కూర్చున్న ఆ నలుగురు నటులు.

హీరో ప్రకాశ్

కమెడియన్ తంబు

విలన్ నాగరాజు

హిరో తండ్రి చిట్టిబాబు.

నిజానికి యీ నలుగురుకీ నాటకమంటే సరదాలేదు. అది ఒక కాలక్షేపం అనుకుంటారు.

హీరో తండ్రి పాత్ర వేసే చిట్టిబాబు భార్య పురుడికి పుట్టింటికి వెళితే నాటకం వెయ్యడానికి దిగాడు.

హీరో ప్రకాశ్ లక్ష్యం వేరు. శర్మాజీ పలుకులకీ, పేరు గల మనిషని అయన నాటక ప్రదర్శనలకు చాలామంది పెద్దవాళ్ళు వస్తారనీ, అలా పెద్దవాళ్లతో పరిచయం అయితే తాను రంగస్థలం మీంచి వెండి తెరకు చేరుకోవచ్చనే ఆశతో ఆ సంస్థలో జేరాడు.

కమెడియన్ తంబు హీరోయిన్ పరిచయం కోసం మాత్రమే చేరాడు...

విలన్ నాగరాజు నలుగురితోపాటు నారాయణ.

ఎవరి మనసులో ఏ లక్ష్యాలు వున్నా శర్మాజీ మనసులో వున్న లక్ష్యం మంచి నాటకాన్ని ప్రదర్శించడం. అతని నిజాయితీ అలాంటిది.

ప్రొడక్షన్ నోట్సు రాస్తున్న శర్మాజీ "టైమ్ ఎంతదయిందయ్యా" అన్నాడు తన పని తాను చేసుకుంటూ.

"ఆరూ - పది" అన్నాడు కమెడియన్ తంబు.

"అమ్మాయి ఆరుగంటలకే వస్తానంది. యింకా రాలేదే" అన్నాడు శర్మాజీ పుస్తకం మూస్తూ.

"ఎందుకొస్తుందండీ" అన్నాడు నాగరాజు.

"అదేం మాటయ్యా!" అన్నాడు శర్మాజీ నవ్వుతూ.

"మీరు అమ్మాయీ, అమ్మా అంటూ హీరోయిన్స్ ని నెత్తిని పెట్టుకుంటారు. వాళ్ళేమో తోకాడిస్తారు," అన్నాడు నాగరాజు.

శర్మాజీకి ఆ మాట నచ్చలేదు. "గౌరవం యిచ్చి పుచ్చుకోవటం సంస్కారం" అని మాత్రం వూరుకున్నాడు.

అన్న టైమ్‍కి హీరోయిన్ లత రాలేదన్న తపన మనసులోనూ వుంది.

మరో అయిదు నిమిషాలు గడిచాయ్.

చిట్టిబాబు వాచీ చూసి "ఆరూ- పదిహేను, సినిమా టైమయ్యింది," అన్నాడు.

"మీరు సినిమాకు వెళదామనుకుంటున్నారా" అన్నాడు శర్మాజీ.

"నేను అనుకోవటం లేదండీ. లత వెళ్ళి వుంటుందేమో అని అనుకుంటున్నాను."

"అలా ఎలా వెళ్తుందయ్యా! మనమంటే సరదాకి నాటకాలు ఆడుతున్నాం గాని ఆమెకు నాటకమే బ్రతుకు తెరువు. మరో రిహార్సల్‍కేదో వెళ్లుంటుంది. అక్కడ కాస్త ఆలస్యమయితే ఇక్కడికి రావడం ఆలస్యమయ్యుంటుంది" అన్నాడు శర్మాజీ.

"అసలు వాళ్ళ మీద మీ విశ్వాసమే పాడుచేస్తుందండీ వాళ్ళని" అన్నాడు కమెడియన్ తంబు.

శర్మాజీ ఒకసారి తంబు కళ్లల్లోకి చూశాడు. తంబు చూపులు తిప్పేశాడు.

"ఆరున్నర దాటిందిసార్! యింక ఆవిడ రాదు" అన్నాడు చిట్టిబాబు.

"ఏవిటి నీకింత నమ్మకం" అన్నాడు శర్మాజీ చిరాగ్గా.

"నిజం చెబితే మీరు చిరాకు పడతారు! అందుకే ఎవరూ మీ ముందు నిజం చెప్పరు" అన్నాడు చిట్టిబాబు.

"పోని నువ్వు చెప్పొచ్చుగా" అన్నాడు కాస్త కటువుగా శర్మాజీ.

తంబు "చిట్టిబాబు పిరికిపీనుగ సార్! వాడి ఉద్దేశమేమంటే లత మధుబాబుతో సినిమాకు వెళ్ళివుంటుందేమోనని!" అన్నాడు వ్యంగ్యంగా.

హీరో ప్రకాష్ నవ్వాడు.

"మీరు మాట్లాడే మాటలేమిటో నాకర్థం కావటంలేదు. సూటీగా చెప్పండి" అన్నాడు శర్మాజీ.

నాగరాజు నవ్వి "ఇరవై ఏళ్ళబట్టి నాటకాలు వేస్తూ మీకింత అమాయకమేవిటండీ బాబూ. వాడనేది ఏవిటంటే లతకు నాటకం కంటె మంచి గిరాకీ తగిలినట్టుందీ అని."

"తగిలుండటం ఏవిటీ?"

తగిలింది - మధుబాబు కొత్త సమాజం పెట్టాడు. కొత్త నాటకం రిహార్సల్స్ చేస్తున్నాడు.

రసికుడు. భార్య జబ్బుతో హాస్పిటల్లో వుంది. చేతినిండా డబ్బుంది. అందుబాటులో లత వుంది. ఇంకా చెప్పాలంటే... " అంటూ ఏదో చెప్పబోతున్న చిట్టిబాబు మాటలకు శర్మాజీ అడ్డు తగిలి---

"ఏవిటయ్యా ఆ మాటలు? మనతో కలిసి నటించే ఓ అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పుకాదూ.... ? అసలు నన్ను అడిగితే యిక్కడ లేని మనిషిని గురించి చెడు మాట్లాడటం చాలా చెడ్డ అలవాటు. లత అలాటిది కాదు," అన్నాడు.

సరిగ్గా అదే సమయానికి ఆ హాలులోకి అడుగు పెట్టబోయి తన గురించి మాట్లాడుకుంటున్నారని గ్రహించి వినాలన్న కుతుహలంతో బయటే ఆగిపోయింది లత. పొంచివుండి వింటోంది!

"లత మీకు నటిగానే తెల్సుసార్! కాని ఆమె చాలా తెలివైంది. మీరు రంగస్థలాన్ని దేవాలయంగా భావిస్తారు. ఆమె షోరూమ్‍గా భావిస్తుంది....... వయసులో వుంది. దీపం వుండగానే యిల్లు చక్కబెట్టుకుంటోంది" అని వ్యాఖ్యానించాడు ప్రకాష్.

"బాగా చెప్పావ్ ! వెధవది నాటకం వేస్తే వందరూపాయలిస్తారు. నెల రోజులు రిహార్సల్ చెయ్యాలి.

మధు బాబులాటి వాడితో ఒకరోజు గడిపితే, నాటకానికి వచ్చే వందా వస్తాయి ! రాత్రికి వచ్చే ఆదాయమూ వస్తుంది " అన్నాడు తంబు.

"ప్లీజ్ స్టాపిట్! లేవండీ రిహార్సల్ చేద్దాం" అన్నాడు శర్మాజీ ఆదేశపూర్వకంగా.

అందరూ లేచి నిబడ్డారు.

"హీరోయిన్ లేకుండా నసిగాడు ప్రకాష్.

"ఆమె బదులు డమ్మీగా నేనుంటానయ్యా!" అని కసురుకున్నాడు శర్మాజీ.

"మీరా! హిరోయిన్ బదులు డమ్మీగా మీరు ఉంటారా...?" వాడికి యిన్స్పిరేషన్ ఎలా వస్తుంది సార్? వాడామె చెక్కిళ్ళు తాకాలి; మీకు గెడ్డముంది," అన్నాడు కమెడియన్ తంబు-ప్రకాష్ వంక జాలిగా చూస్తూ.

"సరేనయ్యా, ఆ అమ్మాయి లేని సన్నివేశాలే చేద్దాం. ప్రారంభించండి" అన్నాడు శర్మాజీ.

వాళ్ల మాటలన్నీ విన్న లత "సారీ సార్, లేటయ్యింది" అంటూ రిహార్సల్ హాలులోకి ప్రవేశించింది.

ఆమె పరోక్షంలో ఆమె గురించి చులకనగా మాట్లాడిన నలుగురు నటులు ఆమెను చూడగానే ఎక్కడలేని మర్యాద చేయటం ప్రారంభించారు.

ఒకడు "ముందు కాఫీ తాగండి" అన్నాడు.

"మొహం నిండా ఆ చెమట ఏవిటి? నడిచి వచ్చారా.....? రిక్షాలో రాకపోయారా?" మరొకడు.

"ఇప్పుడు కాఫీ ఏవిట్రా? కూల్‍డ్రింకో, హార్లిక్సో తెప్పించండి..... ఆవిడ అలిసి పోయినట్టున్నారు," అన్నాడు హీరో ప్రకాష్.

"ఏం వద్దండీ! మంచినీళ్లు చాలు-- లేవండీ రిహార్సల్ చేద్దాం?" అంది లత నవ్వుమొహంతోనే.

రిహార్సల్ ప్రారంభమయ్యింది...

దాదాపు ఒక గంటసేపు చాలా పకడ్బందీగా రిహార్సల్స్ జరిగాయ్... హీరో ప్రకాష్ సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయం గురించీ, పురుషుడు చేసిన తప్పే స్త్రీ చేస్తే సంఘం ఆ పురుషుడిని ఎలా గౌరవిస్తుందో ఆ స్త్రీని ఎంత చిన్న చూపు చూస్తుందో వివరించబడిన సంఘటనలను ప్రాకాషూ, లతా కూడా అద్భుతంగా నటించారు.

నటనలో చెమ్మగిల్లిన కళ్లను ఒత్తుకుంటూ, "ఈవేళ కాస్త త్వరగా యింటికి వెళ్లాలండీ" అంది లత శర్మాజీతో-

"అలాగేనమ్మా! రేపు మాత్రం టైముకిరా" అన్నాడు శర్మాజీ.

"ఇదేనండి హీరోయిన్స్ తో ఉన్న యిబ్బంది. రిహార్సల్స్ కి ఆలస్యంగా వస్తారు. త్వరగా వెళతానంటారు" అన్నాడు తంబు.

"ఈవేళ ఒక్కరోజుకేనండి" అంది లత.

ఒక్క క్షణం ఏదో ఆలోచించింది. ఓ నిర్ణయానికి వచ్చింది. తోటి నటులను ఉద్దేశించి "నాదో చిన్న ప్రశ్నండి. మీకు తోచిన సమాధానాలు యివ్వాలందరూ, శర్మాజీ గారు అక్కర్లేదు. వారు పెద్ద వారు. వారు చాలా సులువుగా సమాధానం చెప్పగలరు," అంది లత.

"అడగండి"అన్నారు ప్రకాష్.

"మీరు అడగాలేకాని ఒక్క ప్రశ్నేం ఖర్మ! వంద ప్రశ్నలయినా వరుసగా సమాధానాలు చెబుతాం" అన్నాడు తంబు.

"నోటితో చెప్పడంకాదు. నేను ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం ఎవరికి తోచింది వారు కాగితంమీద రాయండి. ఎవర్నీ ఎవరూ సలహా అడగకూడదు. అంటే కాపీ కొట్టొద్దు అని" అంది లత.

"మేం స్టూడెంట్లము అనుకున్నారా కాపీకొట్టడానికి. జెంటిల్ మన్స్. కాగితాలు సప్లయి చేయండి" అన్నాడు నాగరాజు వీరుడిలా ముందుకివచ్చి.

ఒక తెల్లకాగితం నాలుగు ముక్కలు చేసి నలుగురుకీ యిచ్చింది. నలుగురూ ప్రశ్న కోసం ఎదురుచూస్తున్నారు.

"మీకు తెలిసిన పతివ్రతల పేర్లు ఒక్కొక్కరూ రెండేసి రాయండి... ప్రశ్న జాగర్తగా విన్నారుగా ! నేనడిగింది మీకు తెలిసిన పతివ్రతల పేర్లు" అంది లత.

"ఓస్ యింతేనా" అన్నారు నల్గురూ ముక్తకంఠంతో.

"అంతే. పైకి చెప్పకుండా కాగితం మీద రాయండి" అంది లత.

ఆ ప్రశ్నలోని అంతరార్థం కోసం శర్మాజీ ఆలోచిస్తున్నాడు. అది మామూలు ప్రశ్న మాత్రం కాదు అనుకున్నాడు. నలుగురు నటులు సమాధానాలు రాశారు.

"చదవనా" అన్నాడు హీరో ప్రకాష్.

"చదవండి" అంది లత.

"అరుంధతి - అనసూయ" అని చదివాడు.

చిన్నగా నవ్వింది లత....

"ఏవిటి అలా నవ్వుతున్నారు? వీరిద్దరూ పతివ్రతలు కారా?" అన్నాడు ప్రకాష్.

"కారని అనడానికి నేనెంతటి దాన్ని?" అని మాత్రం అంది లత.

‘ "నేను చదువుతానండీ, దమయంతి - చంద్రమతి" అని ఆమె అడక్కుండానే చదివేశాడు నాగరాజు.

లత స్పష్టంగా నవ్వుతూ "రాజపత్నుల్ని ఎన్నుకున్నారా" అంది.

"వీళ్లిద్దరూ పాపులర్ పతివ్రతలేనండి " అన్నాడు నాగరాజు.

"అవును ! అందుకే వారిమీద కావ్యాలు కూడా రాశారు - ఆ తర్వాత ...? " అంటూ చిట్టిబాబు ముఖంలోకి చూసింది.

"సీతా - సావిత్రీ నండి" అన్నాడు చిట్టిబాబు.

ఈసారి కాస్త గట్టిగా నవ్విందావిడ.

"ఏవిటి అలా నవ్వుతారు ! పేరు మోసిన పతివ్రతలండీ వీళ్ళు. అలాంటి వాళ్ళని మీరెందుకు అనుమానిస్తున్నారో నా కర్థంకావటం లేదు..." అన్నాడు చిట్టిబాబు.

"పతివ్రతల్ని నేనెందుకు అనుమానిస్తానండి బాబు ... నేనెక్కడ .......? వారెక్కడ ...? తంబుగారూ మీరేం రాశారు...?

"ద్రౌపతి - అహల్య " అని చదివాడు తంబు.

ఈసారి లత విరగబడి నవ్వింది.

"నాకు తెలుసు అయిదుగురు భర్తలున్న ద్రౌపదినీ, ఇంద్రుడిచేత మోసగింపబడిన అహల్యను - పతివ్రతలన్నారని నవ్వుతున్నాను."

"కాని వాళ్ళిద్దరూ పతివ్రతలమని ప్రూవ్ చేసుకున్నారు. మన పురాణాలు ఘోషిస్తున్నాయ్ - పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. మనం కాదంటే గొడవ వస్తుంది కడండి" అన్నాడు తంబు.

"వారందరూ పతివ్రతలు కారని నేను నవ్వలేదండి - నేనడిగిన ప్రశ్న మీకు తెలిసిన పతివ్రతల పేర్లు రాయమని. ఈ పతివ్రత లెవ్వరూ మీకు తెలియదు. వీరందరూ మీరు విన్న పతివ్రతలు - అందుకు నవ్వొచ్చి నవ్వాను. మీ అమాయకత్వానికి జాలిపడి నవ్వాను.

చూడండి ! మిమ్మల్ని కన్నతల్లులున్నారు. అగ్నిసాక్షిగా మీరు పెళ్లాడిన భార్యలున్నారు... తోబుట్టువులున్నారు. మీలో కొందరికి మీ రక్తాన్ని పంచుకు పుట్టిన కూతుళ్ళున్నారు. వీళ్ళెవరూ పతివ్రతలు కారూ...? మీ వాళ్ళనే మీరు పతివ్రతలుగా అంగీకరించలేరా......" అంది ఆవేశంగా లత.

నలుగురి నటుల ముఖాలు తెల్లబోయాయి.

‘లత తెలివికి శర్మాజీ ముగ్ధుడయ్యాడు-

"కన్న తల్లినీ, కట్టుకున్న భార్యనీ, ఒకే కడుపున పుట్టిన తోడబుట్టినదాన్ని, మీ రక్తాన్ని పంచుకుపుట్టిన కన్నకూతుర్నీ పతివ్రతలుగా చూపించలేని మీరు-- నాలాంటి మీ తోటి నటిని పతివ్రతగా ఎలా గుర్తించగలరులెండి?

నా గురించి మీరేం మాట్లాడినా బాధ లేదు. వస్తాను" అని లత ఒక్కడుగు వేసి" అన్నట్టు చెప్పడం మరిచాను! రోజూ నా కూడా రిహార్సల్స్ కి పదేళ్ళ పిల్ల వచ్చేది - మీరందరూ చూశారు... అది నా చెల్లెలు అని చెప్పేదానిని అందరితోటి. అది నా చెల్లెలు కాదు. నా కడుపున పుట్టిన బిడ్డ - పదేళ్ళ కూతురు వుందీ అంటే నాకు వయసు మళ్ళిపోయిందని, హీరోయిన్ వేషం యివ్వడానికి అనుమానీస్తారని అలా అబద్ధమాడాను ... ఆ పిల్లకి కూడా అబద్దం ఆడటం నేర్పి అక్కా అని పిలిపించుకున్నాను ... ... ! ఆ పిల్ల ఈ వేళ ఉదయం చనిపోయింది.

ఆ పిల్ల జన్మకు కారకుడయిన మగవాడు ఉన్నాడు కాని తండ్రిని అని చెప్పుకునే మగవాడు కాదు ! అందుకే తల్లినీ, తండ్రినీ నేనే అయ్యాను! దాన్ని పూడ్చి పెట్టాను. అందుకని రిహార్సల్స్ కి కాస్త ఆలస్యమయ్యింది ! వస్తానండి" అని అందరికీ నమస్కరించి వెళ్ళిపోయింది లత.

ఆ క్షణంలో చెమ్మగిల్లిన శర్మాజీ కళ్లకు, లతలో లత కనపడలేదు !

లతలో నటి కనబడలేదు ! !

లతలో స్ర్తీ కనబడలేదు ! ! !

లతలో ఒక అమ్మను చూశాడు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)