ధారావాహికలు
సుందరకాండ
- డా.అక్కిరాజు రమాపతిరావు

(గత సంచిక తరువాయి)

ఇంద్రజిత్తుతో హనుమంతుడి యుద్ధం

ఇట్లా అక్షకుమారుడు భీకరయుద్ధం చేసి మరణం పాలుగావటం చూసి రావణుడి మనస్సులో ఆశ్చర్యంతోబాటు, ఆందోళనతో భయం పట్టుకొంది. భీతమనస్కుడైనా, దానిని నిగ్రహించుకొని అమితపరాక్రముడైన తన సుతుడు ఇంద్రజిత్తుకు పరిపరివిధాల యుద్ధవ్యూహాలన్నిటిని బోధపరిచి అస్త్రశస్త్రాల ప్రయోగపాటవాన్ని గుర్తుచేసి బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని నొక్కి చెప్పి హనుమంతుడిపైకి యుద్ధానికి పంపించాడు. ''చిన్నవాడివైన నిన్ను యుద్ధానికి పంపించటం నాకు ఇష్టం లేదు. కాని అసమాన పరాక్రమవంతులైన వీరులుండగా రాజు స్వయంగా యుద్ధానికి వెళ్లటం రాజనీతి కాదు'' అని రావణుడు ఇంద్రజిత్తును ప్రోత్సాహపరిచాడు.

పర్వదినం నాడు సముద్రం ఉవ్వెత్తున ఎగసినట్లు రాక్షసవీరులంతా తనను ప్రశంసిస్తూ ఉండగా యుద్ధానికి కదిలాడు ఇంద్రజిత్తు. అతడి మహారథానికి గుర్రాలు కాదు సింహాలు పూన్చివున్నాయి. హనుమంతుడు ఇంద్రజిత్తు యుద్ధాటోపాన్ని చూసి ఉల్లసిల్లాడు. సింహనాదం చేశాడు. తన శరీరాన్ని శీఘ్రంగా పెంచాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలన్నీ తప్పించుకుంటూ హనుమంతుడు ఆకాశంలో విహరించసాగాడు. ఇంద్రజిత్తును మరీ మరీ కవ్వించసాగాడు. గురిచూసి ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలను దాగుడు మూతలాటలో లాగా ఎగిరి తప్పించుకొనేవాడు హనుమంతుడు. ఒకరినొకరు ఎట్లా లొంగదీసుకోవాలో తెలియక ఎంతో పట్టుదలతో పరస్పర జయకాంక్షతో వాళ్ళు ఘోరయుద్ధం చేశారప్పుడు. తన శరప్రయోగ కౌశలమంతా వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు గాఢాలోచన చేశాడు. అప్పుడిక చివరి అస్త్రంగా హనుమంతుడిపైకి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. తనపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు తెలుసుకుని దానికి విధేయుడై కదలిక లేని స్థితిలో హనుమంతుడు భూమి మీద పడిపోయాడు. బ్రహ్మాస్త్రం నుంచి విముక్తికాగల శక్తిసామర్థ్యాలున్నప్పటికి కూడా బ్రహ్మదేవుడిపట్ల తన వినమ్రత చూపుతూ ఆయన కట్టుపడ్డాడు. బ్రహ్మదేవుడూ, ఇంద్రుడూ, వాయుదేవుడూ నా సంరక్షణకు ఉద్యుక్తులయ్యే ఉన్నారని ఆయన నిశ్చింతుడైనాడు. రాక్షసులు నన్ను బంధించి రావణుడి ముందు ఉంచినా అది నాకు లాభమే ననుకున్నాడు హనుమంతుడు.

హనుమంతుణ్ణి రావణుడి ముందు ప్రవేశపెట్టటం

అప్పుడు హనుమంతుడు తమకు చిక్కాడని, లోబడి పోయాడని రాక్షసులు విజృంభించి ఆయనను బంధించారు. కేరింతలు, కేకిసలు కొట్టారు. తాళ్లతో ఆయనను కట్టిపడవేశారు. ఆ పైన నారబట్టలు బిగించారు. ఎప్పుడైతే రాక్షసలు ఇట్లా తాళ్లతో, వల్కలాలతో ఆయనను బంధించారో అప్పుడు బ్రహ్మాస్త్రబంధం తొలగిపోయింది. బ్రహ్మాస్త్రం ఇతర పాశాలను సహించదు. వెంటనే బద్ధుడిని విడిచిపెడుతుంది. ఆ విషయం తెలుసుకొని ఇంద్రజిత్తు చాలా విచారం పొందాడు. హనుమంతుడు తనను రావణుడి దగ్గరకు తీసుకొని పోతున్నారు కదా అని, బ్రహ్మాస్త్రం తనను విడిచి వేసిందని తెలిసికూడా తెలియనట్లే ఉండిపోయినాడు. అప్పుడు ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణుడి సమక్షానికి తీసుకుని పోయినాడు. రాక్షసులంతా హనుమంతుణ్ణి చూసి అశోకవనం ధ్వంసం చేసినవాడు ఈ వానరుడే అని గుసగుసలు పోయినారు.

రక్తనయనాలతో ఉరిమిచూస్తూ రావణుడు ఆయనను ''ఎవరు నీవు?'' అని ప్రశ్నించాడు. ''ఈ వానరుడెవరో తెలుసుకోండి'' అని తన మంత్రులను ఆజ్ఞాపించాడు. ఆ మంత్రులు హనుమంతుణ్ణి అనేక విధాల ప్రశ్నించారు. అప్పుడు హనుమంతుడు, ''నేను సుగ్రీవుడి దూతను'' అని ఆ కొలువుకూటానికి చెప్పాడు. రావణుణ్ణి చూసి హనుమంతుడు ఎంతగానో ఆగ్రహించాడు. కాని రావణుడి తేజస్సుకు, ఆయన అలంకరించుకున్న దివ్యాభరణాల మహావైభవానికీ, రావణుడి అంతులేని సంపదకూ చాలా ఆశ్చర్యపడి మనసులో మెచ్చుకున్నాడు. అధర్మానికి పూనుకోకపోతే దేవేంద్రుడిలాగా స్వర్గలోకాధిపత్యానికి కూడా అర్హుడై ఉండేవాడు కదా రావణుడు అని తలపోశాడు హనుమంతుడు.

రావణుడు కూడా హనుమంతుణ్ణి అవలోకించి క్రుద్ధుడైనా హనుమంతుడి తేజోబలపరాక్రమాలను తలచుకొని ఆశ్చర్యపడి మనస్సులో ప్రశంసించాడు. ''పూర్వం నేను కైలాస పర్వతాన్ని నా బాహువులతో కదిపేటప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడేమో ఇతడు'' అని విస్తుపోయినాడు. ''లేదా వానరరూపంలో వచ్చిన ఆ బాణాసురుడా ఏమిటి?'' అని సంభ్రాంత చేతస్కుడైనాడు. తన మంత్రులలో ఇష్టుడైన ప్రహస్తుణ్ణి చూసి ఈ వానరుడు ఎక్కడనుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అశోకవనాన్ని ఎందుకు విధ్వంసం చేశాడు? తెలుసుకోవలసిందిగా కోరాడు రావణుడు. అప్పుడు ప్రహస్తుడు ''ఓ వానరా! నీవు ఎవరివి? ఇంద్రుడో, కుబేరుడో, యముడో, వరుణుడో, ఇక్కడికి పంపించారా నిన్ను? లేదా మహావిష్ణువే నీనుంచి ఇక్కడి విషయాలు రాబట్టడానికి చారుడిగా పంపించాఆ? నిన్నేమీ చేయం, భయం లేదు. అసలు విషయం చెప్పవలసింది'' అని శాంత వచనాలతో హనుమంతుణ్ణి కోరాడు. ''నీవు కేవలం చూడటానికి మాత్రం వానరవీరుడిలా కనపడుతున్నావు. కాని వానరుడివి కావు. యథార్థం చెబితే నిన్ను ఏమీ చేయం. అసత్యం చెపితే నీ ప్రాణాలు దక్కవు'' అని బెదిరింపుగా అన్నాడా ప్రహస్తుడు హనుమంతుడితో. ''ఎందుకు ఈ లంకా పట్టణం వచ్చావు?'' అని గద్దించాడు.

రావణుడికి పవనకుమారుడి హితబోధ

అప్పుడు మారుతి రావణుడితో - రాక్షసరాజా! ''నేను ఎవరి దూతనూ కాను. నిన్ను చూడాలనే ఉద్దేశ్యంతోనే నీ అశోకవనాన్ని విరిచివేశాను. నేను ఒక రాచకార్యం మీద ఈ లంకానగరం వచ్చాను. సుగ్రీవుడి ఆజ్ఞ తలదాల్చి వచ్చాను. సుగ్రీవుడు చాలా ఉత్తముడు. ఆయనతో నీవు సోదరభావం పాటిస్తే నీకు మేలు జరుగుతుంది. అయోధ్యాధిపతి అయిన దశరథమహారాజు శ్రీరాముడి తండ్రి. శ్రీరాముడు తండ్రి ఆనతి మేరకు సీతాదేవితో, తమ్ముడైన లక్ష్మణుడితో దండకారణ్యవాసం చేయడానికి వచ్చాడు. సీతాదేవి విదేహరాజతనయ. ఆమె అరణ్యంలో అపహరణకు గురి అయింది. ఆమెను వెతుక్కుంటూ అన్నదమ్ములు ఋశ్యమూకం చేరారు. సుగ్రీవుడితో వాళ్లకు సఖ్యం కుదిరింది. రామలక్ష్మణులు ఒకరిపట్ల ఒకరు ఎంత ప్రీతిగలవారో, వాలిసుగ్రీవులు ఒకరితో ఒకరు అంత పరమవిరోధులు. వాలిని సంహరించి వానరరాజ్యాన్ని సుగ్రీవుడికి పట్టం కడతానని శ్రీరాముడు శపథం చేశాడు. సుగ్రీవుడేమో శ్రీరాముడి భార్యను ఎక్కడున్నా సరే అన్వేషించి ఆమెను శ్రీరాముడితో చేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇట్లా వాళ్లు ఒకరి కొకరు ఒప్పందం చేసుకున్నారు. వాలిని శ్రీరాముడు సంహరించాడు. సుగ్రీవుడు తన ఆధీనంలో ఉన్న వానర సైన్యాలను సీతాదేవిని అన్వేషించటానికి నాలుగు దిక్కులకూ పంపాడు. నా అదృష్టం వల్ల లంకలో నేను సీతాదేవిని చూశాను. నీ మేలుకోరి హితం చెబుతున్నాను. నీవు ధర్మాధర్మాలు తెలిసినవాడివి. సకలశాస్త్రాలు నీకు తెలుసు.

నీవు చేసిన దుర్మార్గం నిన్ను కట్టి కుదుపుతుంది. శ్రీరాముడికి ఆగ్రహం కలిగించి ఈ ముల్లోకాలలో ఎవరూ జీవించలేరు. నీవు ఆమెను తీసుకొచ్చానని సంతోషడుతున్నావేమో? కాని ఆమె నా ప్రాణాలు నీవే తీసుకోవడానికి తెచ్చుకున్న ఐదు తలల మహాసర్పం అని నీకు తెలియటం లేదు. నీకు ఎవరివల్లా చావులేదని విర్రవీగుతున్నావు. నీ చావు దగ్గరకు వచ్చింది. జనస్థానంలో ఏమైంది? నీ సర్వబలగాలను రాముడు సంహరించివేశాడు. తలచుకుంటే ఈ లంకానగరాన్ని నేనే సర్వనాశనం చేయగలను. అయితే శ్రీరాముడి ప్రతిజ్ఞ నెరవేరాలిక దా! నీ సంపద, నీ అంహకారం అన్నీ సర్వనాశనం కావటానికి కాళరాత్రి లాంటి సీతాదేవి ఇక్కడ ఉంది. నేను శ్రీరాముడి దూతగా వచ్చాను కాబట్టి నీకు హితం బోధించటం నా కర్తవ్యం. మహాప్రభావం కల బ్రహ్మదేవుడు కాని, త్రిపురాసురసంహారుడైన రుద్రుడు కాని, వృత్రహంతకుడైన ఇంద్రుడు కాని ముగ్గురూ కలసి కానీ నిన్ను రక్షిద్దామనుకున్నా రామబాణం ముందు అది సాధ్యం కాదు.''

విభీషణుడి హితబోధ

ఇట్లా రావణుడికి హనుమంతుడు హితోపదేశం చేయగానే రావణుడికి ఇంతా అంతా అనరాని కోపం వచ్చింది. ''హనుమంతుణ్ణి వెంటనే వధించండి'' అని ఆయన రాక్షసులను ఆజ్ఞాపించాడు. ఆ కొలువులోనే ఉన్న విభీషణుడు అన్నగారైన రావణుని అప్పుడు సాంత్వవచనాలతో శాంతపరిచాడు. ''దూతను వధించడం రాజనీతి కాదు. దూత పరుషంగా మాట్లాడినా అవి ఆయన మాటలు కావు. నీకు రాజ్యధర్మం అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యం అని తెలుసు'' అని బోధించాడు. అయినా రావణుడి కోపం తగ్గలేదు. ''ఇటువంటి పరమ దుర్మార్గులను, పాపాత్ములను చంపడం దోషం కాదు'' అని వాదించాడు. ''మహారాజా! ఎటువంటి పరిస్థితులలోనూ దూతను చంపడం పరమనింద్యం. రాజనీతివిగర్హితమైన అకృత్యానికి నీవు పాల్పడవద్దు'' అని మళ్లీ విన్నవించుకున్నాడు విభీషణుడు. అంతేకాకుండా ''దూత ధిక్కరిస్తే అందుకు తగిన శిక్ష కొరడాలతో కొట్టించడమో, శరీరాంగాలలో దేనినైనా ఖండించడమో, తల గొరిగించి అవమానించడమో ఏదో ఒకటి యుక్తం. అట్లా అని రాజనీతిశాస్త్రం చెబుతున్నది'' అని అన్నగారికి మనవి చేశాడు విభీషణుడు. అంతేకాదు ''ఇప్పుడు హనుమంతుణ్ణి నీవు చంపివేస్తే రామలక్ష్మణులను ప్రేరేపించి ఇక్కడకు ఎవరు తీసుకువస్తారు? నీ పగ ఎట్లా చల్లారుతుంది'' అని కూడా రావణుణ్ణి శాంతపరిచాడు విభీషణుడు. వాళ్లు వస్తే గదా కోటానుకోట్ల సైన్యాన్ని, వాళ్లనూ నీవు జయించగలిగేది? అని కూడా ప్రబోధించాడు విభీషణుడు. తమ్ముడు చెప్పిన కార్యాలోచన రావణుడికి నచ్చింది.

''వానరాలకు తమ తోక అంటే ఎంతో ప్రీతి. అందువల్ల హనుమంతుడి తోకకు నిప్పు పెట్టండి'' అని ఆజ్ఞాపించాడు రావణుడు.

అప్పుడు రాక్షసులు కోలాహలంగా హనుమంతుడి తోకకు వస్త్రాలు చుట్టి వాటిని నూనెతో తడిపి నిప్పు అంటించారు. హనుమంతుడికి మహాగ్రహం కలిగింది. 'సరే! నన్ను ఈ లంకానగరం అంతా తిప్పి అవమానపరుస్తారు కదా వీళ్లు. అట్లా లంకనంతా ఒకసారి చూసి దాని ఆనుపానులేమిటో తెలుసుకుంటాను'' అని సర్దిచెప్పుకున్నాడు తనలో తాను. దీని రక్షణ కట్టుదిట్టాలు పగటిపూట స్పష్టంగా చూసి తెలుసుకోవడం అత్యంతావశ్యకం గదా అనుకున్నాడు.

ఆ పరమ ఉల్లాసకర వార్తను సంబరంతో చూడాలని గుమికూడింది నగరమంతా హనుమంతుడి చుట్టూ. అప్పుడు క్రూర రాక్షసాంగనలు ఉబ్బితబ్బిబ్బువుతూ సీతాదేవికి ఈ వార్త చెప్పారు. ఆమె ఇంతింతనరాని దుఃఖంలో కూరుకొనిపోయింది. హనుమంతుడికి ఎటువంటి బాధా కలిగించవద్దనీ, అపకారం కలగచేయరాదనీ అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది.

సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించటం
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః,
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః.
యది కించి దనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః,
యది వా బౄగ్యశేషో మే శీతో భవ హనూమతః.
యది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసామ్‌,
స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః.
యది మాం తారయే దార్యః సుగ్రీవః సత్యసంగరః,
అస్మాద్దుఃఖాంబుసంరోధాత్‌ శీతో భవ హనూమతః. (సుందర.53.28-31)

'నేను పతిశుశ్రూషాపరురాలినైతే, నేను తపస్సు చేసి ఉన్నట్లయితే, నేనే పతివ్రతనైతే అగ్నిదేవుడు హనుమంతుడి పట్ల చల్లబడిపోవాలి. శ్రీరాముడికి నా మీద జాలీ, దయా ఉంటే, నా భాగ్యమేమైనా మిగిలి ఉంటే హనుమంతుడి పట్ల అగ్నిదేవుడు చల్లబడిపోవాలి. ఆ శ్రీరాముడు ధర్మప్రభువు. ఆయన, నేను శీలవతిననీ, తనను ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నానని తెలిసినవాడైతే అగ్నిదేవుడు వెంటనే హనుమంతుడిపట్ల చల్లబడిపోవాలి. పూజ్యుడూ, సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు నన్నీ శోకసాగరం దాటించగలవాడైతే అగ్నిదేవుడు హనుమంతుడి పట్ల చల్లబడిపోవాలి'' అని సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది.

లంకను దగ్ధం చేసిన హనుమ

తన తోక మండుతున్నా తనకు ఏమీ తాపం కానీ, బాధ కానీ కలగనందుకు హనుమంతుడికి ఆశ్చర్యమేసింది. ఇక హనుమంతుడు ఆకాశం ఈదకు ఎగసిపడే పెద్దంటలతో లంకనంతా కాల్చివేశాడు. రాచనగరును కూడా పూర్తిగా తగలబెట్టాడు. మంత్రుల ఇండ్లను, సైన్యాధికారుల ఇండ్లను, రాచకొలువులో ప్రముఖ అధికారుల మందిరాలను అగ్నికి ఆహుతి చేశాడు. విభీషణుడి ఇంటి జోలికి మాత్రం హనుమంతుడు వెళ్లలేదు. ఇంతలో ఆయనకు సీతాదేవి గుర్తువచ్చి 'అయ్యో! అయ్యో! ఎంత బుద్ధిలేని పని చేశాను, ఆమె ఏమైందో' అని భయవిహ్వలుడైనాడు.

ధన్యాన్తే పురుషశ్రేష్ఠా యే బుద్ధ్యా కోప ముత్థితమ్‌,నిరుంధంతి మహౄత్మాతో దీప్త మగ్ని మివాంభసా.
క్రుద్ధః పాపం స కుర్యాత్‌ కః క్రుద్ధో హన్యాత్‌ గురూనపి,
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూ నధిక్షిపేత్‌.
వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్‌,
నా కార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్‌.
యః సముత్పతితః క్రోధం క్షమయైవ నిరస్యతి,
యథోరగ స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే. (సుందర. 55.4-7)

మండే అగ్నిని నీటితో చల్లార్చినట్లు, తమకు కలిగిన కోపాన్ని (శాంతంతో) తమలోనే అణుచుకున్న మహాత్ములు నిజంగా ధన్యులు! కోపించినవాడు పాపం చెయ్యకుండా ఉంటాడా? వాడు తనకు పూజార్హులైన పెద్దల్ని కూడా చంపటానికి వెనుదీయడు. కోపించినవాడు పరుషవాక్కులు పలికి సత్పురుషులను కూడా నిందిస్తాడు. కోపించినవాడికి 'ఈ మాట పలకవచ్చు, ఇది పలుకకూడదు' అనేది తెలియదు. అతడికి చేయరాని పనిగాని, పలుకరాని మాటకాని ఉండదు. సర్పం నలిగిపోయిన కుబుసం విడిచిపెట్టినట్లు, ఓర్పుచేత కోపాన్ని నిరోధించిన వాడినే సత్పురుషుడంటారు.

అప్పుడు ఆకాశాచారులు 'సీతాదేవి క్షేమంగా ఉంది. ఆమె దరిదాపులకు కూడా అగ్ని ప్రసరించలేదు' అని చెప్పుకోవడం హనుమంతుడు విని ఊరట చెందాడు. ఈ బీభత్సకాండనంతా పరమోత్సాహంతో నిర్వర్తించిన తర్వాత మనసును కుదుట పర్చుకుని సీతాదేవిని ఒకసారి దర్శించి మళ్లీ ఆమె దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై పోవాలని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు.

హనుమంతుడు మళ్లీ సీతాదేవిని దర్శించుకున్నాడు. శింశుపావృక్షం కింద ఆమె కూర్చుని ఉంది. హనుమంతుణ్ణి చూసి ఆమె ఎంతో సంతోషించింది. నీకు సాటి నువ్వే అని పొగడింది. 'త్వరలోనే రామలక్ష్మణులను తీసుకొనివస్తాను' అని ఆమె దగ్గర సెలవుపొంది మహేంద్రగిరి చేరటానికి వెంటనే సమాయత్తమైనాడు హనుమంతుడు.

హనుమంతుడి తిరుగు ప్రయాణం

ఆయన లంక నుంచి బయలుదేరిపోతూ సముద్రాన్ని మళ్లీ లంఘించటానికి అరిష్ట పర్వతంపైన నిలిచాడు. దేహాన్ని బాగా పెంచాడు. ఆకాశానికి ఎగిరాడు. ఆయన ఉదుటుకు ఆ పర్వతం చలించింది. హనుమంతుడు ఆకాశాన్నే మింగబోతున్నాడా అన్నట్లు, ఆకాశమనే సముద్రంలో వేగంగా ఈదుతున్నట్లు, రివ్వున దూసుకుని పోతున్నాడు. మహేంద్రపర్వతాన్ని సమీపించేటప్పటికి ఆయనకు మహాసంతోషం వేసింది. దశదిశలు నిండేటట్లు హాసింహనాదం చేశాడు. గరుత్మంతుడి విహారప్రదేశమైన ఆకాశం చీలిపోతుదా అన్నంత మహోత్సాహంతో ఆయన గర్జించాడు.

మహేంద్రగిరిపై అప్పటివరకు దిగులుగా, నిరుత్సాహంగా, విచారంగా ఉన్న వానర ప్రముఖులంతా హనుమంతుడి సింహనాదమూ, మహాద్భుతమైన ఆయన వేగమూ చూసి, శుభవార్త తెస్తున్నాడని ఉప్పొంగిపోయారు. లేకపోతే ఇట్లా హనుమంతుడికి ఇంత ఉల్లాసం ఎక్కడిది? అని ఒకరికొకరు చెప్పుకున్నారు. హనుమంతుడు వాళ్లదగ్గరకు రానే వచ్చాడు. చేరనే చేరాడు. 'చూశాను సీతాదేవిని' అని మొదటిమాటగా చెప్పాడు అంగదుడికి. ఆ తర్వాత అక్కడి సంగతులన్నీ సవిస్తరంగా చెప్పాడు. అప్పుడు ఆ వానరప్రముఖుల సంతోషం అంతా ఇంతా కాదు. గర్జించారు. దూకారు. నేలను తోకలతో తాటించారు. కలకల నవ్వారు. పర్వతశిఖరాలమీదికి ఎగసిపోయారు. అక్కడినుంచి దూకి హనుమంతుణ్ణి అనురాగంతో స్పృశించారు.

అంగదుడి ప్రశంస

అంగదుడు హనుమంతుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ''బలపరాక్రమాలలో, స్వామిభక్తిలో, చాతుర్యంలో, ప్రజ్ఞలో నీ అంతటి వాడెవడయ్యా!'' అని పవనకుమారుడి మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ''రామప్రభువును సీతావియోగదుఃఖం నుంచి తరింపచేశావు. నీకు సాటి ఎవరయ్యా'' అని మెచ్చుకున్నాడు అంగదుడు. అప్పుడు జాంబవంతుడు ''అక్కడ జరిగిన కథనంతా సవిస్తరంగా చెప్పవయ్యా! నీ సముద్ర లంఘనవిశేషాలను కూడా మాకు వీనుల విందుగా విన్పించు!'' అని లాలనగా అడిగాడు హనుమంతుణ్ణి. అప్పుడు హనుమంతుడు తాను బయలుదేరిన దగ్గరనుంచి తిరిగి వచ్చినంతవరకు సముద్రంలో తనకు ఎదురైన విషమఘట్టాలు, వింతలు, విశేషాలు, అక్కడ లంకలోసీతాదేవి పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, రావణుడి కండకావరం, లంకాదహనం, అన్నీ వివరంగా విన్పించాడు. త్రిజట స్వప్నకథను కూడా ఉత్సాహంగా వాళ్లకు విన్పించాడు. తాను చేసిన రాక్షససంహారమంతా హనుమంతుడు పరమోత్సాహంగా చెప్పుకొనివచ్చాడు వాళ్లకు. ఆ పరమోత్సాహంతో మారుతాత్మజుడు 'మనం ఇప్పటికప్పుడే పోయి లంకానగరంలో ఉన్న సీతాదేవిని వెంటబెట్టుకుని వచ్చి రామలక్ష్మణుల దగ్గరకు పోదామని' జాంబవంతుడు మొదలైన పెద్దలకు చెప్పాడు. ''నేను ఒక్కణ్ణే రావణాసురుడి పీచమణిచి సపుత్ర మిత్ర బాంధవంగా వాణ్ణి చంపివేస్తాను. లంకానగరాన్నంతా సర్వనాశనం చేసి పాదుబెడతాను. లంకకు పోదాం రండి'' అని మహావానరవీరులను యోధానుయోధులను పురికొల్పాడు హనుమంతుడు. ఈ అంగదుడు, ఈ నీలుడు, మైందద్వివిదులు, జాంబవంతుడు ఎంతటి పరాక్రమవంతులు! వీళ్లు తలచుకొంటే లంక రూపుమాసిపోతుంది. భస్మీపటలమైపోతుంది. వీళ్లను ఎదరించే శక్తీ, సామర్థ్యం ఎవరికుంటుంది? అని వాళ్లను ఉప్పొంగచేశాడు హనుమంతుడు. అంగదుడు కూడా హనుమంతుడికి వంతపాడాడు. మనం వెంటనే వెళ్లి సీతాదేవిని వెంట బెట్టుకొని వచ్చి శ్రీరాముడికి సమర్పిద్దాము'' అన్నాడు.

మన మిప్పు డేం చేయాలి?
అప్పుడు జాంబవంతుడు 'నాయనలారా! మనం శ్రీరాముడి ఆజ్ఞానువర్తనులం. సుగ్రీవుడి వశవర్తులం. వాళ్లు ఏవిధంగా నిర్ణయిస్తారో ఆవిధంగా నడుచుకోవాలి. వాళ్లు చెప్పినట్లు చేయాలి. స్వతంత్రించకూడదు. ఇంతకూ మన పని సానుకూలమైంది గదా! నిర్భయంగా నిస్సంకోచంగా వెళ్లి మనం సుగ్రీవుణ్ణి, శ్రీరాముణ్ణి దర్శించుకుందాం. ఆ తర్వాత చేయవలసిన పనికి ఉపక్రమిద్దాము' అని వాళ్లకు నచ్చచెప్పాడు. జాంబవంతుడు చెప్పినట్లే చేయడం సబబు అని వాళ్లంతా కూడబలుక్కున్నారు.

మహోత్సాహంతో కిలకిలలతో, కిచకిచలతో, గర్జనలతో, గాండ్రింపులతో, కహకహలతో, అహమహమికలతో వాళ్లంతా కోలాహలంగా బయలుదేరారు. సుగ్రీవుడు తక్కిన దిక్కులకు పంపిన వారెవరూ సాధించేని పనిని తమ జట్టు వారం సాధించ గలిగాము కదా అన్న ఉత్సాహాతిరేకం వాళ్లల్లో వెల్లివిరిసింది.

మధువన విధ్వంసం

సుగ్రీవుణ్ణి, శ్రీరామలక్ష్మణులను దర్శించాలన్న ఆత్రుత, అత్యుత్సాహం వాళ్లను వేగిరపరిచింది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తోకలు ఉల్లాసంగా ఆడించుకుంటూ, చిత్ర విచిత్ర విన్యాసాలు చస్తూ వాళ్లు బయలుదేరారు. కొంతదూరం పోగానే వాళ్లకు సుగ్రీవుడి మధువనం కన్పించింది. దానిని సుగ్రీవుడి మేనమామ దధిముఖుడు కావలి కాస్తూ సంరక్షిస్తుంటాడు నిరంతరం. ఆ మధువనాన్ని చూసేప్పటికి మహోల్లాసం కలిగింది వానరులకు అంతట వాళ్లు ఆ మధువనంలో తేనెలు, పండ్లూ, కాయలు ఆరగించాలనుకున్నారు. కుతూహలంతో అంగదుడి అనుజ్ఞను అర్థించారు. అంగదుడు వాళ్లందరికన్నా ఉల్లాసంగా ఆ ప్రతిపాదనను ఆమోదించాడు. అందరూ మధువనంలోకి దూసుకొని వెళ్లారు. అయితే దధిముఖుడు వాళ్లను అడ్డగించాడు. ప్రతిఘటించాడు. అప్పుడు వానరులంతా కలసికట్టుగా దధిముఖుణ్ణి మర్దించి బాగా దేహశుద్ధి చేశారు. దధిముఖుడు దీనవదనుడై తన పరాభవాన్ని చెప్పుకోవటానికి సుగ్రీవుడి దగ్గరకు పరిగెత్తాడు. సుగ్రీవుడు అంతా విని వీళ్లు సీతమ్మవార్తను తీసుకుని వస్తున్నారని హర్షించాడు. ఆ ఉల్లాసంతోనే వాళ్లు చెలరేగి ఉంటారని ఊహించాడు. దధిముఖుణ్ణి ఓదార్చాడు. 'మామా! ఇదేదీ మనసులో పెట్టుకోకు' అని శాంతపరిచాడు.

ఇక్కడ మధువనంలో వానరుల నవ్వులు కావు, పెడబొబ్బలు కావు, ఒకరికొకరు తోసుకోవటాలు, కుస్తీలు పట్టడాలు కావు, ఒకరినొకరు వెక్కిరింపులు కావు, వేళాకోళాలు కావు, వెటకారాలు కావు, ఒకరిమీద ఒకరు ఎక్కడాలు కావు, ఒకరిని వంచి ఒకరు వీపుల మీద కురిపించే వడ్డనలు కావు, గుంజుకోవడాలు కావు, ఇట్లా లాగి పడవేయడాలు కావు, ఇట్లా రెచ్చిపోయి మధువనాన్ని అంతా కొల్లగొట్టారు వానరులు. పళ్లు కాయలు పిందెలు పూలు తేనెలు దోచుకున్నారు. వెక్కసమై పోయేటట్లు తిన్నారు. ఒక్కపండూ, ఒక్క తేనె పట్టూ వదలలేదు. ఆ కైపులో, ఆ మత్తులో మధువనాన్ని అంతా చిందర వందర చేశారు. చీకాకు పరిచారు. ఎగిరి గంతులు వేశారు. చెట్లకొమ్మలు విరిచారు. కడుపునిండా మధువులు తాగారు. తోసుకున్నారు, కొట్టుకున్నారు.ఇంతలో అంగదుడి నాయకత్వంలో, అతడి ప్రోత్సాహంతో వానరులు మధువనంలో జొరబడి చేసిన అల్లరిని, ఆగడాన్ని, అఘాయిత్యాన్ని వారు తనను బాగా మర్దించిన వైనాన్ని సుగ్రీవుడితో విన్నవించుకోవడానికి పోయిన దధిముఖుడు, నవ్వు ముఖంతో ఉల్లాసంతో మధువనానికి తన బృందంతో తిరిగి వచ్చాడు. అంగదుణ్ణీ తక్కిన వానర ప్రముఖులనూ, కపివరులను తనను మన్నించవలసినదిగా వేడుకున్నాడు. తాను తెలియక వాళ్లను ఆటంకపరిచానని విన్నవించుకున్నాడు. సుగ్రీవుడికి ఏమీ కోపం రాలేదనీ, కోపం తెచ్చుకోకపోగా నవ్వుతూ 'యథేచ్ఛగా వాళ్లను విహరించనీయకుండా ఎందుకు ఆటంకపరచావు'' అని తననే తప్పుపట్టాడనీ, తననే క్షమించాడనీ, ఓదార్చాడనీ దధిముఖుడు వాళ్లకు చెప్పాడు.
అప్పుడు అంగదుడు ఆ వానరప్రముఖులతో మనం రామకార్యం సాధించుకొని వచ్చామని సుగ్రీవుడికి తెలిసిందనీ, ఆయనెంతో సంతోషంగా ఉన్నాడనీ, రామలక్ష్మణులు కూడా తమ రాకకు ఎదురు చూస్తూ ఉండవచ్చుననీ, కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లను దర్శించాలనీ వానరులకు వినయంగా తెలియజేశాడు. అగందుడి వినయమూ, మృదుమధుర వాక్యసరళీ చూసి హనుమంతుడు అంగదుణ్ణి ఎంతగానో ప్రశంసించాడు. 'నేను యువరాజును అయినా నాకు మిమ్మల్ని ఆజ్ఞాపించే యోగ్యత లేదు' అని అంగదుడు అన్నప్పుడు 'నీవు సర్వాధికారివి. యువరాజువి. అంతేకాదు మాకు కాబోయే రాజువు కూడా నీవు' అని అంగదుణ్ణి అభినందించాడు హనుమంతుడు.

అప్పుడు వాళ్లంతా ఎంతో ఉత్సాహాతిశయంతో పట్టరాని సంతోషంతో ఋశ్యమూక ప్రస్రవణగిరికి బయలుదేరారు. ఈ వానరవీరులంతా ప్రస్రవణగిరి చేరే లోపే సుగ్రీవుడు, శ్రీరామలక్ష్మణులకు ఈ శుభవార్తను చేరవేశాడు. 'ఇక ఏమీ వేదన వద్దు' అని శ్రీరాముణ్ణి ఆశ్వౄసించాడు సుగ్రీవుడు. హనుమంతుడు అభీష్టకార్యం సాధించుకుని వచ్చాడని సుగ్రీవుడు శ్రీరాముడికి విన్నవించుకొన్నాడు. రామలక్ష్మణులు కూడా హనుమంతుడి రాకకు ఎదురుచూస్తూ ఉన్నారప్పుడు.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)