కథా భారతి
ప్రేమంటే ఇదేనా?
- డా . పి.కె. జయలక్ష్మి

’“నేనసలు ఊహించలేదు పిన్నీ! బాబాయ్ అలా మాట్లాడతారని. నాకు మీరంటే చాలా అడ్మిరేషన్ చిన్నప్పటి నించీ. ఒక్క మాట లో చెప్పాలంటే మీరు నా రోల్ మోడల్! అందుకే మా అమ్మవాళ్లు అర్ధం చేసుకోకపోయినా మీరు నన్ను కచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. కానీ..”. కళ్ల నీళ్ళు తన్నుకొచ్చాయి వాహిని కి. దీపిక చూస్తూ ఉండిపోయింది ఏమీ చలనం లేకుండా.

కాసేపటికి తేరుకుని “ముందు మొహం కడుక్కో” అంటూ వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు, వేడిగా టీ పట్టుకొని వచ్చింది. టీ తాగుతున్న సాధన తల నిమురుతూ ప్రేమగా “వాహీ! వాస్తవానికి, ఊహలకి చాలా తేడా ఉంటుందిరా. మనకి కనిపిస్తున్నదంతా యదార్థం కాదు. ఊహలెప్పుడూ అందమైన అబద్ధాలే. సరేగాని ఆ అబ్బాయికీ నీకూ ఎన్నాళ్లబట్టి పరిచయం? ఇంతకీ ఏం చేస్తూ ఉంటాడు? వివరంగా చెప్పు” అంది దీపిక.

“అతని పేరు రామ్. చాలా మంచివాడు. డిగ్రీ నించీ స్నేహం, తర్వాత పీజీ లో ప్రేమగా మారింది. వాళ్లదీ మన ఊరే. కానీ కులం వేరు. జాబ్ ప్రయత్నం లో ఉన్నాడు. నేనంటే చాలా ఇష్టం పిన్నీ. తానే ప్రపోజ్ చేశాడు. నాకు బ్యాంక్ జాబ్ తగలడంతో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఎవరో ఒకళ్ళకి జాబ్ ఉంది కదా. ఇంట్లో చెప్తే అమ్మ సంగతి తెలుసు కదా. నోరు పెట్టుకుని పడిపోయింది. చదువు కోలేదు కదా .నాన్న సరే సరి. అయినా కులం పట్టింపులేంటి? మా కంటే పెద్ద కులం మీది. అయినా మీరు బాబాయి ని చేసుకో లేదా ఇరవయ్యేళ్ళ క్రితం? ఇప్పుడు నేను నా కంటే తక్కువ కులం అబ్బాయిని చేసుకుంటా నన్నానని ఒకటే పెద్ద రాద్ధాంతమే అయింది ఇంట్లో.మాదేదో పెద్ద కులం అయినట్టు. అసలు మీ కులం తప్ప అన్నీ కులాలు ఒకటే కాటగిరీ నా దృష్టిలో.” ఆవేశంగా చెప్పుకుపోతున్న వాహినిని ఆపుతూ “చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరి కులం వాళ్ళకి గొప్ప. ఒకటి చెప్పు. ఏ ధైర్యం చూసుకొని ఉద్యోగం లేని వాణ్ని చేస్కోవలనుకుంటున్నావ్?వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళావా? వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారో చూశావా?”

“అవన్నీ నాకెందుకు? నేను రామ్ ప్రేమించుకున్నాం. పెళ్లయ్యాక మా బతుకు మాది. పెళ్లి టైమ్ కి సరయిన జాబ్ లేకపోయినా మీరు పెళ్లి చేసుకొని హేపీ గా ఉన్నారా లేదా?కానీ ఇక్కడ నాకు పర్మనెంట్ జాబ్ ఉంది. నన్ను ప్రేమించే రామ్ ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి”?

“అదే తప్పు. మా వాళ్ళు నాకు నయాపైసా ఇవ్వకపోయినా, నాకు జాబ్ లేకపోయినా మీ బాబాయి చేసుకున్నారు. నా ఆస్తి కోసమో, జీతం కోసమో ఆశపడి కాదు. మరి నిజంగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే రామ్ కూడా ఈ పాటికి సీరియస్ గా నీలాగే మంచి జాబ్ తెచ్చుకోవాలి కదా? ఇకపోతే వాళ్ళ వాళ్ళు నువ్వు అనవసరం అనుకుంటున్నావ్.. కానీ అతను ఎలా వదులుకుంటాడు? వదిలేశాడనుకో అందరూ నిన్నే తిడతారు. కొడుకుని వల్లో వేస్కోని తమకి దూరం చేసిందని. ఒకవేళ కలిసి ఉన్నా నిన్ను కలుపుకోరు”.
“అదేంటలా? నాకేం తక్కువ? అన్నిట్లో రామ్ కంటే ఎక్కువేగా? అవటానికి పల్లెటూరివాళ్లయినా మా వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదా? అలాగే నన్నూ...”

“నువ్వనుకుంటున్నావా నన్ను యాక్సెప్ట్ చేశారని? ఎప్పటికీ చేయరు.”
“అదేంటి పిన్నీ. ఎవరోచ్చినా బాగా చూసుకుంటారు, చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్నా గర్వం ఉండదు. నాన్నమ్మ తాతయ్యలకి చివరి రోజుల్లో ఎంతో సేవ చేశారు. మన పల్లెలో, చుట్టాల్లో మీ ఇద్దరి గురించి బాగా చెప్పుకుంటారు కూడా.”

“అవన్నీ నిజమే. కానీ నేను కులాన్ని వదులుకున్నా, మీ వాళ్ళు నన్ను తమలో కలుపుకోవడానికి ఎప్పుడూ సిద్ధపడలేదు. అందరూ వ్యక్తి గతంగా అభిమానిస్తారు మమ్మల్నిద్దరినీ . కానీ బాబాయిని అల్లుడిగామావాళ్ళూ, నన్ను కోడలిగా మీ వాళ్ళూ ఆమోదించరు. కారణం కులం. రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించావా?”
“అన్నీ మనం అనుకోవడం లో ఉంటుంది పిన్నీ. రామ్ చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది”.

“ఓకే. అతని తల్లిదండ్రులకి, అన్న చెల్లే ళ్ళకీ, బంధువులకి నువ్వంటే ఎందుకిష్టం ఉండాలి? పెళ్లంటే రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం. మనకి నచ్చని చాలావాటితో సర్దుకు పోతూ, రాజీ పడుతూ జీవించాలి. దానికి చాలా సహనం అవసరం. నువ్వు ఒక్కతే కూతురువని అల్లారుముద్దుగా ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచారు. అత్తగారింట్లో నీకు నచ్చినట్టు ఉండదు. అందీ అందనట్టు అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండే ప్రేమికులు ఒక్కసారి దంపతులుగా రూపాంతరం చెందాక నెమ్మదిగా వాస్తవాలు అనుభవం లోకి రావడం మొదలౌతుంది. పెళ్లయ్యే వరకు కన్పరిచిన ప్రేమ తరవాత ఆంక్షలుగా అనిపిస్తుంది. నా అనుభవం చెప్తున్నా. ఇగో లేకుండా, అందరినీ ఆత్మీయంగా కలుపుకుంటున్నా మీ వాళ్లెప్పుడూ నన్ను దూరంగానే పెట్టారు”.
“అదేం కాదు పిన్నీమీరంటే చాలా గౌరవం అందరికీ”.

“అదే మరి. ఇప్పటికీ మీరు అనే అంటున్నావ్. నువ్వు అని చనువుగా మాట్లాడచ్చు కదా. నువ్వే కాదు సాధూ.. మీ అత్తలు, పెదన్నాన్నలు అందరూ ఇలాగే మన్నిస్తారు. మనసు విప్పి ఎవరూ మాట్లాడరు. ఈ కులం వల్లే కదా గౌరవం తో దూరం పెడుతున్నారు. అదే భరించలేకపోతున్నా. ఏదైనా పండగలప్పుడు కలుసుకున్నా అందరూ సరదాగా మాట్లాడుకుంటారు జోక్స్ చెప్పుకుంటూ. నేను రాగానే ఆపేస్తారు. నేనేదైనా మాట్లాడబోయినా మీ బాబాయి మాట్లాడనివ్వరు. తర్వాత చెప్తారన్నమాట .. వాళ్ళంతా ఒకటి. వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోరు. నువ్వేదైనా సరదాగా అన్నా పెద్ద రభస చేస్తారు”. అంటారు.

“ఒక్క మాటలో చెప్పాలంటే నటిస్తూ బతకాలి వాహినీ . అందరి అనుభవాలు ఒక్కలా ఉండవు. కానీ వర్ణాంతరం చేసుకుని అత్తారింటికి వెళ్లే కోడళ్ళందరికి కాస్త అటూ ఇటూగా ఒకేలాంటి అనుభవాలు ఎదురవుతాయని చెప్పగలను. కొందరు సంస్కారవంతులు గౌరవిస్తే , మరి కొందరు సంస్కార హీనులు చాలా చులకనగా, ఇంట్లో చెప్పేవాళ్లు లేరు, బరితెగించిన రకం. ఇంకెవరూ దొరకక వేరే కులానికి వచ్చింది. అంటూ హేళనగా మాట్లాడతారు. ఒక మాట చెప్పనా?

ప్రేమించకుండా పెళ్లి చేసుకున్నాసరే అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లయినా మొగుడైన వాడు పెళ్లాన్ని ప్రేమించే తీరతాడు. అలాగే ప్రేమించి చేసుకున్నవాడు ఎప్పుడూ నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడని, ఏమనకుండా ప్రేమిస్తూనే ఉంటాడని గ్యారంటీ లేదు. అంతెందుకు?మేమూ దెబ్బలాడుకుంటూనే ఉంటాము. ప్రేమ మైకం లో పడి వర్ణాంతరం చేసుకుంటే ముఖ్యంగా పుట్టింటి సపోర్ట్ కచ్చితంగా మనమాశించినంతగా ఉండదు. ఏ కష్టమొచ్చినా చెప్పుకోడానికి ఎవరూ ఉండరు. “నువ్వు కోరి చేసుకున్నావుగా” అనడమే కాకుండా నీ భర్తని కూడా తిడతారు. మీ మధ్య ఏ కారణం గానో అపార్ధాల వల్ల ఏర్పడ్డ దూరాన్ని మరింత పెంచుతారు. కులాన్ని వదులుకున్నామంటే మన పుట్టింటి ప్రేమలతో పాటు వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని వదులుకున్నట్టే. బైట సమాజం లో ఆదర్శ వివాహమని అందరూ ప్రశంసించినా ఇంట్లో మాత్రం ఈసడింపులు, చిన్న చూపులు తప్పనే తప్పవు. మా విషయం లో అలాగే జరిగింది, జరుగుతోంది కూడా! ఇంతకీ బాబాయి ఏమన్నారేంటి?”

“అమ్మో, ఎంత కోపమొచ్చిందో తెలుసా? నేనసలు అంతా కోపంగా ఎప్పుడూ చూడలేదు. వాడు నిన్ను మోసం చేస్తాడు. కష్టాల పాలు చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసుకోడానికి వీల్లేదు. ఇంటికి పెద్దకూతురివి. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నావ్. నీ తమ్ముళ్ళు పెద్ద జాబ్స్ లో ఉన్నారు. మీ నాన్న ఎంత కట్నమయినా ఇచ్చి మంచి సంబంధం తెస్తాడు. వాళ్ళని ఉసురు పెట్టకు” అని గట్టిగా కోప్పడ్డారు. అయినా అడిగాను నువ్వు వర్ణాంతరం చేసుకోలేదా పిన్నిని? అని.

“నాతో పోలికా? అందరూ నాలాగా ఉండరు. ఎంతో ఆలోచించి చేసుకున్నాం”. అన్నారు. “అదేంటో తనకో రూలు, నాకొక రూలా? పెద్ద కులం అమ్మాయిని తను చేస్కోవచ్చు కానీ తమ ఇంటి పిల్ల తమ కంటే చిన్న కులానికి వెళ్లకూడదు.తను వర్ణాంతరం చేసుకుంటే తప్పు లేదట. రామ్ మాత్రం మోసగాడట. మీ పెళ్లప్పుడి స్థితిగతులతో పోలిస్తే మేం మెచ్యూర్డ్ గానే ఉన్నాం. కనీసం మీరయినా సపోర్ట్ చేస్తారనుకున్నా.” ఆవేదనగా అంది వాహిని .“లేదు వాహీ. నేను సర్వసాధారణంగా జరుగుతున్న సంఘటనలు చెప్తున్నా. నేనెవర్నీ జడ్జ్ చేయడం లేదు. ఆ అబ్బాయి చెడ్డవాడని అనను. మీ బాబాయ్ తను మంచివాడనీ, రామ్ మోసగాడనీ అనడం కూడా ఖండిస్తాను. కానీ వర్ణాంతరం పర్యవసానాలు చెప్తున్నాను. నువ్వేదో అందగత్తెనని, ఉద్యోగస్తురాలిననీ, పెద్ద కులం నించి వచ్చాననీ అత్తగారింట్లో మెచ్చి మేకతోలు కప్పుతారని అనుకుంటే భ్రమే. ఎంత మంచిగా ఉన్నా కొన్నాళ్ళకి ఈగో క్లాషులు మొదలు.నువ్వు మాట పడే రకం కాదు.ఇంకో పక్క మీ ఇంట్లో రామ్ ని ఆదరించరు. అదీ బాధ కలిగించే విషయం. ఎందుకంటే. నిన్ను అతను ఎంత బాగా చూసుకుంటున్నా, మీ తమ్ముళ్ళ కంటే ఎన్నో రెట్లు ఉత్తముడయినా సరే అతన్ని చూడగానే తక్కువ కులం వాడన్న సంగతే గుర్తుకొస్తుంది, అతని వల్ల చుట్టాల్లో చిన్నబోయాం కదా అని కోపం కూడా వస్తుంది. నాకు అలాటి అనుభవాలు ఎదురయ్యాయి, అవుతున్నాయి కాబట్టే ఇంతలా చెప్తున్నాను. తరతరాలుగా మనలో పాతుకు పోయిన మూఢ నమ్మకాలివి.మనం మరీ నాగరికత పెరిగి పోయిన మహా నగరాల్లో కాదు కదా ఉంటున్నది.

నీ పేరెంట్స్ ది పల్లెటూరి నేపథ్యం. వాళ్ళ వైపు నించి కూడా ఆలోచించు ఒకసారి. నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్న వాళ్ళని దుఖపెట్టి ఏం బావుకుంటావ్? ఇంకో పక్క అతనికి జాబ్ లేదు., నీ హోదా కి సరిపడా ఆఫీసర్ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం నీకుందా? కొత్తల్లో అన్నీ బాగానే ఉంటాయి.. ఒక్కసారి ఊహించుకో. ఆర్ధికంగా నీమీద ఆధారపడుతూ కొన్నాళ్ళకి మేల్ ఈగో తో నిన్ను టెన్షన్స్ కి గురిచేయవచ్చు లేదా నీకే అతనంటే చులకన భావం ఏర్పడచ్చు...కీడెంచి మేలెంచాలి. ఎంత పాశ్చాత్య సంస్కృతి ప్రకోపించినా మనం మన మూలాల్ని విస్మరించకూడదు. అక్కడ ఏ కట్టుబాట్లూ, కులాల కార్చిచ్చులూ లేవు. అయినా నాల్రోజుల్లోనే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. కానీ ఎక్కడో తప్ప మన అరేంజ్డ్ మేరేజెస్ ఎప్పటికీ విజయవంతమే.

నిన్ను నిరుత్సాహపరుస్తున్నాని అనుకోకు. నువ్వు బాగా చదువుకున్నావ్, మంచి జాబ్ లో ఉన్నావ్. కొన్నాళ్లు వెయిట్ చెయ్. ఈ లోగా రామ్ కి మంచి ఉద్యోగం రావచ్చు. ఒకసారి అతన్నీ మీ ఇంటికి తీసుకు వెళ్ళు. ఇగో సమస్య లేకుండా, సహనంతో కుటుంబం లో ఇమడగలరా లేదా అన్నది ముందు గమనించుకోవాలి. తర్వాత పెద్దవాళ్లని కన్విన్స్ చేయడం గురించి ఆలోచించచ్చు.వాళ్ళు మనల్ని కలుపుకోకపోతే మనమే వాళ్ళని కలుపుకుందాం అనుకునే స్వభావం ఉంటే.. మనం అవతలి వారి నించి ఏమాశిస్తున్నామో అది ముందు మనం అవతలి వారికి ఇవ్వగలిగితే... అపార్ధాలు ఉండవు. అన్నిటి కంటే ముందు మీది తొందరపాటు నిర్ణయం కాదని ప్రూవ్ చేసుకోండర్రా. వాహినీ !సమాజం లో మంచి హోదా ఉంటే అందరూ బ్రహ్మరథం పడతారు. లేకపోతే మీ మంచితనాన్ని , ఆదర్శాల్ని హేళన చేస్తారు, కించపరుస్తారు. సంయమనం అన్నది చాలా అవసరం. మేం మంచి స్థాయి లో ఉంటూ అందర్నీ అభిమానంగా చూస్తూ, అవసరాలకి ఆదుకుంటూ ఉండబట్టి మమ్మల్ని మా ముందు విమర్శించడంలేదేవరూ. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా తక్షణం తెగతెంపులే! .. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నా. బాగా ఆలోచించుకో నీ ఇష్టం”

సుదీర్ఘమైన మాటల పరంపరని ముగించిన దీపిక వైపు ఆరాధనగా చూస్తూ “ చాలా థేంక్స్ పిన్నీ! ఓపిగ్గా, వివరంగా చెప్పినందుకు. ఇంత లోతుగా నేనెప్పుడూ ఆలోచించలేదు. మీరు చెప్పినవన్నీ యదార్థాలు. నేను మరో కోణం లోంచి ఆలోచించడానికే కాకుండా నాలాటి మరెందరికో మార్గదర్శకాలు మీ మాటలు. నేను రామ్ ని మంచి జాబ్ తెచ్చుకునేలా ఎంకరేజ్ చేసి, తను ప్రయోజకుడయ్యాకే పెళ్లి చేసుకుంటా. ఐ విల్ వెయిట్ పిన్నీ. నిజం గానే ! మీ అనుభవాల్ని నాతో పంచుకుని వివేకంతో నిర్ణయం తీసుకునేలా సహాయం చేసిన మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. వస్తా పిన్నీ” అంటూ బ్యాగ్ భుజాన తగిలించుకుని ఆత్మవిశ్వాసంతో బైటకి నడిచింది వాహిని.

రాత్రి భర్త తో వాహిని వచ్చిన సంగతి చెప్తూ “ మీరు చెప్పినట్టే తనని వర్ణాంతరం చేసుకోకుండా డిస్కరేజ్ చేశానండీ. మనం బాగున్నట్టు చెప్పకుండా ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులెదుర్కుంటున్నట్టు చెప్పాను. పాపం శమించుగాక” అంది నవ్వుతూ. “అవును దీపూ! అందరి జీవితాలూ ఒకలాగే ఉండవు. దాని లైఫ్ బాగుంటే పర్లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వే దాన్ని ప్రోత్సహించి వర్ణంతరానికి ఉసిగొల్పేవంటారు.అందుకే మా అన్నయ్య దానికి నచ్చచెప్పమంటే నీతో చెప్పించాను.థేంక్యూ డియర్” అన్నాడు భార్య ని దగ్గరకి తీసుకుంటూ ప్రకాష్.

కొన్నాళ్ళ పాటు దీపిక వేరే దేశం వెళ్లింది పిల్లల దగ్గరకి. ఏ కబురూ లేదు సాధన గురించి. ఒక రోజు ప్రకాష్ దగ్గర్నించి ఫోన్. “దీపూ!నీకో సర్ప్రైజ్. రామ్ తహశీల్దార్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆశ్చర్యమేం టంటే ఇంకో నెలలో తన పెళ్లి. వాహిని తో కాదు. అతని మేనత్త కూతురితో. “అదేంటలా?” విస్తుపోతూ అడిగింది దీపిక. “ధన మూలం ఇదం జగత్ కదా . మన పిల్ల వాణ్ని అన్ని రకాలుగా సాన పెట్టి ప్రయోజకుడయ్యేలా సహకరిస్తే మంచి జాబ్ రాగానే తన కులంలో పిల్ల అయితే బంధుత్వాలు నిలబడ్డంతో పాటు కట్నానికి కట్నం అన్నీ దక్కుతాయని స్వార్ధం తో తన దారి తాను చూసుకున్నాడు. అయినా ఇదీ ఒకందుకు మంచిదేలే.ఋణస్య అంటారందుకే.” భర్త చెప్పింది విని దీర్ఘంగా నిట్టూర్చింది ఈ తరం పిల్లలు దేనికీ ఆగలేరు, ఎంతసేపూ తమ స్వార్ధమే తప్ప తమని ప్రేమించేవాళ్ళ ఫీలింగ్స్ ని ఏమాత్రం అర్ధం చేసుకోరు, గౌరవించరు..

రెండ్రోజులు పోయాక వాహిని నించి ఫోన్. ఎలా ఓదార్చాలా అనుకునే లోపే “ చాలా థేంక్స్ పిన్నీ. ఆ రోజు కరెక్ట్ టైమ్ లో మీరిచ్చిన సలహా నా జీవితాన్ని మేలి మలుపు తిప్పింది. జీవితం లో చేదు అనుభవాలు ఎదురైతేనే కదా మధురానుభూతుల్ని ఆస్వాదించగలిగేది. అంతే కాదు తల్లిదండ్రుల కంటే బాగు కోరే వారు ఉండరు అన్న విషయం ఇంకా బాగా అర్ధమైంది. నో రిగ్రెట్స్. ఇంతకీ చెప్పొచ్చే దేంటంటే అమ్మనాన్న చూసిన అబ్బాయిని చేసుకోబోతున్నాను. అంతా వాళ్లిష్టమే. ఎందుకంటే నాకేం కావాలో నా కంటే వాళ్ళకే బాగా తెలుసు అన్న విషయం బాగా అర్ధమైంది కదా . అత్యంత విలువైనది కుటుంబం. వాళ్ళని సంతోష పెట్టడం నా కర్తవ్యం. పెళ్ళికి తప్పక రావాలి మీరూ బాబాయ్ . మరి ఉంటాను పిన్నీ!” అంది మనసారా నవ్వుతూ వాహిని.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)