సారస్వతం
కావ్యలహరి
-‘విద్వాన్’ తిరుమల పెద్దింటి. నరసింహాచార్యులు

వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు మొదలగు అనేక ప్రక్రియలలో మన సంప్రదాయ సాహిత్యం జీవనదిలా తర, తరాలుగా ప్రవహిస్తూ, మన హృదయక్షేత్రంలో సంస్కార కేదారాలను పండిస్తూ, మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ, సకల మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రకాశిస్తోంది. పురాణ యుగం నుండి, అనువాద యుగం ప్రారంభమై తెలుగులో“ మహాభారత, భాగవత, రామాయణాదులు” వెలిశాయి. శ్రీనాధుడు సంస్కృతంలో ఉన్న “ కాశీ ఖండ, భీమ ఖండ, శృంగారనైషథాదులను తెనిగించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. అట్లే నన్నెచోడుడు, ప్రబంధ కవులు, మొల్ల, రంగాజమ్మ ముద్దుపళని, చేమకూర వెంకటకవి, సారంగుతమ్మయ, తాళ్ళపాక వంశస్థులు ఇలా ఎందరెందరో మహాకవులు, కవయిత్రులు తమ కావ్యాల ద్వారా తెలుగు భారతిని పూజించి తరించారు.

అట్టి మహానుభావుల కావ్యాలు నిత్య నూతనాలు, ఆచంద్ర తారార్కాలు. ఆనాటి కావ్య భాషా సౌందర్యం, భావం, వర్ణన, అక్షర విన్యాసం అమోఘం, అద్భుతం, అమందానంద కందళితం. “ కవయః క్రాంత దర్శినః” అన్న నుడి కారానికి ఈ క్రింది ఉదాహరణ చూడండి.---

నూతన వధూవరులు ప్రధమ సమాగమ స్ధల వర్ణన ఎంత రమణీయంగా ఉందో! (శోభనపు గది వర్ణన.) “ శయనాగారము విశాలమై, హృదయాన్ని పులకింప చేసే విధంగా అలంకరింపబడింది. అచ్చటచ్చట ఏనుగు దంతములతో చేయబడిన శృంగార శిల్పములు, గంధపు చెక్కలతో చేయబడిన పీటములు, నవరత్నములు పొదగబడిన బంగారు పాత్రలలో కస్తూరి, కృష్ణాగరు, పునుగు, జవ్వాది, చందనాది సుగంధ ద్రవ్యములు, బంగారు పళ్ళెరములలో ద్రాక్ష, ఖర్జూర, రంభాది (అరటి) ఫలములు, మధుర మధుర రాసాస్వాదనా భరితములైన నానారకముల పిండి వంటలు, మత్తెక్కించి, మన్మధ క్రీడకు దోహద పడే మధుర పానీయాలు, అరవిందం, అశోకం, చ్యూతం , నవమల్లికం, నీలోత్పలం అనే పంచ బాణాలు ప్రయోగించి, పంచబాణుడు నవ వధూవరులను శృంగార సంగ్రామానికి సమాయత్త పరిచే విధంగా ఉన్న నగిషీలు చెక్కబడి ఎత్తైన బంగారు కోళ్ళున్న పట్టె మంచము, దానిపై హంసతూలికా తల్పము, (హంస ఈకలు చాల మెత్తగా ఉంటాయి వాటితో చేసిన పరుపుని ‘హంస తూలికా తల్పం’ అంటారు.) దానిపై సువాసనలు వెదజల్లే మృదువైన పూల రేకులు, వెన్నెల తీగలుగా వ్రేలాడునట్లు వెండి తీగలతో చేసిన తెరలు, మనసుకు హాయి గొలిపే మందమందముగా వినిపించే మధుర సంగీత స్వర విన్యాసములు అహో! స్వర్గ సుఖాలకు ఆలవాలమైనట్లున్నదట ఆ స్ధలము”. ఎంత అద్భుతమైన వర్ణన. ఇది కవి క్రాంత దర్శిత్వానికి అనగా నిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనం. పూర్వ కావ్యాలలో ఇట్టి వర్ణనలు, అక్షర విన్యాసాలు కోకొల్లలు. కనుకనే అవి నేటికీ ‘నిత్య నూతనాలు’ అని చెప్పడం జరిగింది. అట్టి కావ్యాలను గూర్చి కొద్దిగా తెలుసుకొని ఆనందిద్దాం. (ఈ వ్యాసాలలో పద్యాలకి భావార్థాలు వివరించడం కాని, కవుల చరిత్ర తెలపడం కాని జరగదు. మహాకవుల కావ్యాలను పరిచయం చేసి, వాటి గొప్పతనాన్ని తెలియ జేయడమే ఈ రచనోద్దేశం. గమనించగలరు.)

భారత, బాగవత, రామాయణాలు కావ్యసౌధానికి పునాదులు. ముందుగా మన మనోమాలిన్యాన్ని తొలగించి, శాంతిని, దాంతిని చేకూర్చి, భక్తి తత్త్వాన్ని బోధించే పోతన భాగవత మహాకావ్య స్వరూపాన్ని తెలుసుకొందాం. అది శ్రీకైవల్య పదం చూడండి-

ఇది భాగవతం తొలి పద్యం.

శా. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెద\న్‌ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకు\న్‌ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకు\న్‌.

పోతన భాగవతాన్ని తెలుగులో వ్రాయటానికి కారణం ‘ శ్రీ కైవల్య పదం’ అనగా మోక్షాన్ని చేరటానికి వ్రాస్తున్నాను అంటాడు. కావ్య ప్రయోజనం ఇంతకంటే ఏముంటుంది. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట” ( పలికితే పాపాలు పోతాయిట ) కనుక భాగవతాన్ని మనకందించేడు పోతన. మరి శ్రీకైవల్య పదం చేరటానికి ఎవరిని ప్రార్థించాలి! “లోకాలని రక్షించేవాడు, భక్తులను పాలించేవాడు, దానవులను శిక్షించేవాడు, తన కేళీ (ఆట) లీలావిలాస దృష్టితో సమస్తలోకాలని సృజించే వాడు” అయిన శ్రీకృష్ణుని ప్రార్థించాలి అంటాడు. అలా సామాన్యంగా శ్రీకృష్ణుడు అని చెపితే ఎలా! అందుకే ‘ మహానందాంగనా డింభకున్’ అంటే మహానందుని యొక్క అంగన (భార్య) అయిన యశోదాదేవి కుమారుడట. ఈ పదంలో ఇంకో అందమైన అర్థం ఉంది మహా + ఆనంద= తలచి నంతనే గొప్ప ఆనందాన్ని కలిగించేవాడుట కృష్ణుడు. కృష్ అనగా అపరిమిత ణ అంటే ఆనందాన్ని అనే అర్థం కృష్ణ అనే పదం లోనే ఉంది. అది ‘ సహజ కవి, భక్త కవి’ అయిన పోతన కవితా చమత్కారం. ఇట్టి మందార మకరందాల వంటి కొన్ని విశేష పద్యాల సౌందర్యాలని పరిశీలిద్దాం.

భాగవతము నారదుని ఆజ్ఞపై వ్యాసుడు రచించగా, వ్యాసపుత్రుడైన శుక మహర్షి పరీక్షిత్తునకు వినిపించి, లోకమున ప్రచారము గావించెను.

“అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగ సం
కలితులు మందభాగ్యులు సుకర్మములెయ్యవి సేయఁజాలరీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.”

ఆధునిక యాంత్రిక జీవన విధానంలో మానవులు ఎలా ఉంటారు, ఎలాంటి బాధలు పడతారు, వారికి శాంతిని కలుగజేసేది ఏది? అన్నప్రశ్నకు పైపద్యం చక్కని సమాధానం. ఈనాటి స్ధితి గతులని ఆనాడే పోతన వర్ణించిన తీరు అద్భుతం! ఈనాటి మనుజులు అలసత్వం అంటే బద్ధకం కలిగినవారు, మంద బుద్దులు,అల్పాయుష్కులు, పెద్ద పెద్ద రోగాలతో బాధపడేవారు, దురదృష్టవంతులు, మంచిపనులు చేయనివారు అయిన ఈ కలియుగ మానవుల బాధలన్నింటిని పోగొట్టి సుఖ శాంతులను చేకూర్చేది ఏది? అనగా భాగవతమొక్కటే తరుణోపాయమని శుకుడు సెలవిస్తాడు. “ అట్టి భాగవతంలోని కొన్ని ఘట్టాలను తెలుసు కొని ఆనందిద్దాం. ముందుగా గజేంద్ర మోక్షంలోని పద్యగత సౌందర్యాన్ని తిలకిద్దాం-

ఈ కథ అందరికి తెలిసినదే “ఓ గజరాజు చెరువులో స్నానంచేయడానికి దిగుతాడు, ఆ చెరువులో ఉన్న మొసలి ఏనుగు కాలు పట్టుకొంటుంది. వారి మధ్య చాలా సంవత్సరాలు పోరు జరుగుతుంది బలం తగ్గిన ఏనుగు తనని కాపాడమని భగవంతుని ప్రార్థిస్తుంది.”-

“ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాది మధ్య లయుఁ డెవ్వఁడు సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్‌.”
పై పద్యం ప్రసిద్దమైన. ఉపనిషత్తులో చెప్పిన –
“ పూర్ణ మదః పూర్ణమిదం / పూర్ణాత్ పూర్ణ మదుచ్యుతే /
పూర్ణస్య పూర్ణమాదాయ / పూర్ణ మేవావ సిష్యతి//

అన్న శ్లోకానికి చక్కని తెలుగు పద్యం. గజేంద్రుడు అహంకారంతో తనలో శక్తి ఉన్నంత కాలం మొసలితో పోరాడి ఆపై భగవంతుని సాహాయం కోరుతాడు. భగవత్ స్వరూపాన్ని వర్ణించే పద్యం యిది. “ ఈ సంపూర్ణ జగత్తుని సృష్టించిన వాడు, సమస్త జగత్తు తనలో ఉంచుకొన్న వాడు, అన్నింటికి మూలమైన వాడు, సృష్టి, స్థితి, లయము లకు కారణమైనవాడు, ఆ భగవంతుడట ! వానిని శరణువేడుతాను” అని గజేంద్రుడు ప్రార్థిస్తాడు --

శాపగ్రస్తుడైన ఇంద్రద్యుమ్న మహారాజే గజరాజు. అట్లే శాప గ్రస్తుడైన “ హూ హూ అనే గంధర్వుడే” మొసలి. వీరిద్దరి శాపవిమోచన కథే ‘ గజేంద్ర మోక్షము’

అద్భుతమైన ప్రాతఃస్మరణీయమైన ఈ క్రింది పద్యం చూడండి -

“ఓ కమలాత్మ! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపులప్రభావ! రా
వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే.”

అని గజేంద్రుడు ప్రార్ధిస్తాడు. నిత్యం భగవంతుని ప్రార్థించడానికి సమయం లేకపోతే కేవలం పై పద్యంలోని నామాలు చదివితే చాలు మనసుకు ప్రశాంతత చేకూరి, అనుకొన్నపనులు నెరవేరుతాయి. అని ఋషి వాక్యం. అలతి, అలతి పదాలతో ఉన్న ఈపద్యం ‘బమ్మెర పోతనామాత్యుని’ పాండిత్య ప్రకర్షకి నికషోపలం. ఆ స్వామీ ---
కమలాప్తుడు
వరదుడు
ప్రతిపక్ష విపక్ష దూరుడు
యోగివంద్యుడు
సుగుణోత్తముడు
శరణాగత వత్సలుడు
మునీశ్వరులకు మనోహరుడు
విపుల ప్రభావుడు.

భగవంతుని ఇంత చక్కగా పిలిస్తే ఎందుకు రాడు? తప్పక వస్తాడు.

( సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)