కబుర్లు - సత్యమేవ జయతే
కోతి కొమ్మచ్చులాట!
- సత్యం మందపాటి

దాని పేరు ‘కోతుల కోన’. అక్కడ ఎన్నో కోతులున్నాయి.

ఎన్నో కోతులేమిటి, అన్నీ కోతులే వున్నాయి. రకరకాల కోతులు వున్నాయి.

అన్ని కోతులూ ఎంతో స్నేహంగా, సోదరభావంతో ఒక్క తాటి మీద కూర్చుని, శాంతంగా, సహనంగా, సౌఖ్యంగా జీవిస్తున్నాయి.

అప్పుడే పక్కనే వున్న ‘నరుల నేల’ అనే ప్రదేశం నించీ, ఒక మాయదారి గాలి ఆ కోతుల కోనని ఎడాపెడా ఊపేసింది. ఒక రోజు కాదు, సరిగ్గా మూడు రోజులు.

ఎవరికి దొరికిన కొమ్మలు అవి పట్టుకుని, దాదాపు అన్ని కోతులూ, ఏమాత్రం ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డాయి.

ఆ మాయదారి గాలి, తన దారి తను వెతుక్కుంటూ ‘కోతుల కోన’ దాటి, ‘గాడిదల గట్టు’ వేపు వెళ్ళిపోయింది.
ఆ గాలి అలా వెళ్ళిపోగానే, కోతుల కోనలో ఇలా ఒక పెద్ద విచిత్రం జరిగింది.

అదేమిటయ్యా అంటే..

పైన మూడో పేరాలో, ‘అన్ని కోతులూ ఒకే తాటి మీద కూర్చుని..’ అని అనుకున్నాం కదా... ఆ తాడు గాలిపోటుకి పుటుక్కున తెగిపోయింది. దానితో కోతులన్నీ క్రింద పడిపోయి, విచ్చలవిడిగా విడిపోయాయి.

అసలే కోతులు కదా మరి. ఆ కోతుల్లో కొన్ని ఎడమ పక్కకి, కొన్ని కుడి పక్కకి వెళ్ళాయి. మిగిలినవి ఎటు వెళ్ళాలో తెలీక, వెనక్కి వెళ్లి సోద్యం చూస్తూ నుంచున్నాయి.

ఎడమ పక్కకి వెళ్ళిన కోతుల్లో, రెమ్మ వానరయ్య అనే నాయకుడు అందరినీ దగ్గరగా రమ్మని ఇలా అన్నాడు.

“మనం రెమ్మ వర్గం కోతులం. అసలు మనం కోతులం కాదు. వానరులం. ‘వానర వాగు’ అనే ప్రదేశం నించీ వచ్చాం మనం. ఈ కోతిమూకతో మనం ఇన్నాళ్ళు కలిసివున్నామంటేనే ఆశ్చర్యంగా వుంది. వానరులు కోతులు కన్నా గొప్పవారు. అందులోనూ మన రెమ్మ వర్గం వారు వెయ్యిన్నర రెట్లు గొప్పవాళ్ళు. కనుక..”

‘ఒక ప్రశ్న అడగాలని వుంది’ అని ఎడం చేయి పైకెత్తిన ఒక పిల్ల కోతి, తనని ఎవరూ పట్టించుకోక పోవటం చూసి, వానరయ్య మాటలకి అడ్డం వస్తూ ఇలా అంది.

“కోతులలోనించే కదా వానరులు, నరులు వచ్చింది. మరి మనం ఎలా గొప్పవాళ్ళం అయాం?“ అంది.

రెమ్మ వానరయ్య పెద్దగా ఒక కోతి నవ్వు నవ్వి అన్నాడు, “రామాయణంలో హనుమంతులవారు ఎవరనుకుంటున్నారు? మనవాడే. రెమ్మ వర్గం వానరుడు. రామాయణంలో వానరసేన అంటారు గుర్తుందా? కోతుల సేన అనలేదు కదా. అందుకని మనమే గొప్పవాళ్ళం. వాళ్లందరూ వఠ్ఠి కోతి మూక!”

మరి అనుమానం వచ్చి బుర్ర గోక్కుందో, పేలు కుట్టి బుర్ర గోక్కుందో కానీ, పిల్ల కోతి బరబరా బుర్ర గోక్కుని, “హలాగా.. హయితే మనమే గొప్పవాళ్ళమన్నమాట” అంది తోక ఆడిస్తూ.

“హందుకని మనం.. చూశావా నీతో రెండు మాటలు మాట్లాడగానే నాకూ హ భాష వచ్చేస్తున్నది, అలా మాట్లాడకు. అలా అనవసరంగా తోక కూడా ఆడించకు. ఎక్కడున్నానూ.. అందుకని మన రెమ్మ వర్గమే గొప్పది. ఆ కడ్డి వర్గం వాళ్ళని దూరంగా పెట్టండి, మనం వుండే ఈ ప్రదేశానికి రెమ్మాపురం అని పేరు పెడుతున్నాను. ఇకనించీ అక్కడి కాకి ఇక్కడ వాలకూడదు” అన్నాడు రెమ్మ వానరయ్య.

అలా వానరయ్య అంటుండగా, కుడి పక్కకి వెళ్ళిన వారిని ఉద్దేశించి కడ్డి హనుమయ్య అక్కడ ఏమంటున్నాడయ్యా అంటే..

“అమ్మయ్య! ఎన్నాళ్ళకి ఈ రెమ్మగాళ్ళ పీడ వదిలింది. ఇకనించీ మన కడ్డి వర్గం వాళ్ళమందరం ఒక తాటి మీద నిల్చుని..”

కడ్డి హనుమయ్య మాటలకు అడ్డం వస్తూ, చిన్న కోతిగాడు అన్నాడు, “మళ్ళీ మనందరం ఒక తాడు మీద నుంచుందామంటావేమిటి, కోతి బావా! ఇప్పుడే కదా మనమంతా కూర్చున్న తాడు తెగిపోయి నడ్డి విరిగేటట్టు క్రింద పడ్డాం”

కడ్డి హనుమయ్య ఒకసారి అన్ని పళ్ళు చక్కగా కనపడేలా పళ్ళికిలించి, “భలే చెప్పావు కోతిగాడూ.. నేను అన్నది నిజంగా తాడు మీద నిల్చుందామని కాదు, అది ఒక భాషా ప్రయోగం మాత్రమే.. అసలు నేను చెప్పేదేమిటంటే.. మన కడ్డి వర్గం వారు చాల మేధావులు. మా ముత్తాత ముత్తాతకి మూడో ముత్తాత కడ్డి ఆంజనేయులే ఆనాడు అశోకవనంలో సీతాదేవిని రక్షించి, శ్రీరాములవారికి సహాయం చేసింది. రెమ్మ వర్గం వాళ్ళు ఆనాడు వారధి కట్టిన వఠ్ఠి వానర మూక. వారిలో నాయకుల లక్షణాలు లేవు. వాళ్ళని దూరంగా పెట్టటం, వారంటే దురభిమానం చూపించటం మన కోతి లక్షణం” అన్నాడు.

“అయితే కోతి బావా.. అది మన కడ్డి వారి కోతి లక్షణం కనుక, రెమ్మ వర్గం వారి కన్నా మనం లక్ష రెట్లు గొప్ప అన్నమాట” అన్నాడు చిన్న కోతిగాడు.

చిన్న కోతిగాడి అంకెల పరిజ్ఞానానికి, విగ్నానానికి అందరూ అబ్బురపడి తప్పట్లు కొట్టారు.

“అవును. లక్ష రెట్లే కాదు. కోతి రెట్లు.. కాదు కాదు... కోటి రెట్లు నయం. అందుకని రెమ్మగాళ్ళని దూరంగా పెట్టండి. మన కోతి పిల్లల్ని, ఆ వానరాలకి ఇచ్చి పెళ్లి చేయవద్దు. భోజనాలు కూడా మనం ‘కడ్డి వారికి మాత్రమే’ అన్న చోటనే చేద్దాం. అక్కడికి రెమ్మ వాళ్ళు ఎవరూ రావటానికి వీల్లేదు. అంతేకాదు మనం వుండే ప్రదేశానికి కడ్డిపేట అని పేరు పెడుతున్నాను. ఇకనించీ అక్కడి దోమలు ఇక్కడికి రాకూడదు, వస్తే వాటిని వెంటనే చంపేయండి” అన్నాడు కడ్డి హనుమయ్య.

“మరి రెమ్మాపురంలో కడ్డి వాళ్ళు, కడ్డిపేటలో రెమ్మ వాళ్ళు వున్నారు కదా.. అదెలా..” అడిగాడు చిన్న కోతిగాడు.

కడ్డి హనుమయ్య, “అది ఆటల్లో అరటిపండు” అని, నాలిక బయటపెట్టి, చిరునవ్వి, “ఏదయినా అలాగే మొదలవుతుంది.. కొన్నాళ్ళలో మనం హోలు మొత్తం అంతా ఆక్రమించుకుంటాం కదా!” అన్నాడు.

“లెస్స పలికావ్” అన్నాయి కోతులన్నీ చప్పట్లు కొట్టి.

ఈలోగా రెమ్మాపురంలో చాల చెట్టు కొమ్మల మీద ‘ఈ కొమ్మ రెమ్మ వర్గం వారికి మాత్రమే’ అని వ్రాస్తున్నారు రెమ్మ వర్గం వారు.

పిల్ల కోతి మళ్ళీ ఒక ప్రశ్న అడగాలని చేయి పైకెత్తింది.

“మళ్ళీ ఏమిటి?” అడిగాడు రెమ్మ వానరయ్య.

“మీరు అన్నీ తెలిసిన పెద్దవారు. నేనేమో ఏమీ తెలియని పిల్ల కోతిని. మరి నాకు ఎవరు రెమ్మ వర్గం వారో, ఎవరు కడ్డి వర్గం వారో ఎలా తెలుస్తుంది. నాకు అందరూ ఒకే రకం కోతుల్లాగానే కనిపిస్తున్నారు మరి!” అంది.

“భలే ప్రశ్న అడిగావు” అని అక్కడ వున్న వానరాలన్నీ తోకలాడించాయి.

వానరయ్య పెద్దగా నవ్వాడు. “మీరందరూ ఎప్పుడు ఎదుగుతార్రా.. తోకలాడించటం తప్ప ఏమీ తెలీదు. ఇంత సులభమైనదే తెలియక పొతే ఎలా. ఒరేయ్.. పిల్ల కోతీ, ఒకసారి వెనక్కి తిరిగి, నాలుగు కాళ్ళ మీద నుంచుని తోక పైకెత్తు” అన్నాడు.

పిల్ల కోతి వెనక్కి తిరిగి, నాలుగు కాళ్ళ మీద నుంచుని, తోక పైకెత్తింది.

“బాగా చూడండి. వెనకాల ఎర్రగా వుంటే, అవి రెమ్మ వర్గం కోతులు. అంటే మనం అన్నమాట. నల్లగా వుంటే కడ్డి వర్గం కోతులు” అన్నాడు వానరయ్య, అందరికీ అర్ధమయేలా.

పిల్ల కోతి అర్ధం కాకపోయినా, అర్ధమయినట్టు తల వూపుతూ, “హలాగా” అంది.

“హదిగో మళ్ళీ హ భాష.. “ విసుక్కున్నాడు వానరయ్య.

ఒకసారి నాలిక కొరుక్కుని, “అయితే మరి ఇంకో ప్రశ్న అడగవచ్చా?” అంది పిల్ల కోతి.

“అడుగు, ఇదే చివరి ప్రశ్న. మళ్ళీ ఇక ప్రశ్నలు అడగకూడదు” అన్నాడు వానరయ్య కోపంగా.

“మరి రెమ్మ వాళ్ళం ఇక్కడ, కడ్డి వర్గం వాళ్ళు అక్కడ వున్నాం కదా.. మరి వెనక సోద్యం చూస్తూ నుంచున్న మిగతా కోతులు ఎవరు?” అని అడిగింది పిల్ల కోతి.

“వాళ్ళా.. వాళ్ళల్లో మిగతా చిల్లర మల్లర వర్గాల వాళ్ళు అంతా వున్నారు. చి.మ.వ. కోతులన్నమాట. వాళ్ళల్లో కూడా కాకో, బ్రాకో, కోకో, నాకో, మాకో, మీకో, తేకో, పీకో.. అంటూ చాల వర్గాల కోతులు వున్నాయి. కొంతమందికి తగినంత సంస్కారం లేక, ఈ వర్గ బేధాలంటే ఏమిటో తెలీక, పిచ్చిమాలోకాలు అందర్నీ సమానంగా చూస్తుంటారు. మరి కొంతమందేమో, నిమ్మకి నీరెత్తకుండా, ఎవరినీ పట్టించుకోకుండా, ‘అసలు మనకెందుకులే ఈ తద్దినం’ అనుకుని తప్పించుకు తిరిగే ధన్యులమనుకుంటారు. అందుకే మనమిలా శక్తియుక్తులు, బలాబలాలు చూపిస్తుంటే, వాళ్ళు తీరిగ్గా సోద్యం చూస్తూ నుంచున్నారు. ఇంకో పదేళ్ళ తర్వాత వచ్చినా, వాళ్లక్కడే అలాగే నుంచుని వుంటారు, పాపం.. “ అని తనకి తెలిసిన భగవర్గోపదేశం చేశాడు వానరయ్య.

“అయితే వాళ్ళల్లో మనలాగా అభిమానాలూ, దురభిమానాలూ లేవా?” అనుకోకుండా ఇంకో ప్రశ్న అడిగేసి, మళ్ళీ నాలిక కొరుక్కుంది పిల్ల కోతి.

“ఎందుకుండవు? అభిమానాలుండటం వల్ల తప్పు లేదు. కానీ వారికి దురభిమాన సంఖ్యాబలం తక్కువ వుండటం వల్ల ఇంకా కలిసే వుంటున్నారు, పాపం అమాయకులు! అదే మనకి లాభం”

“హలాగా.. “ అనబోయి, మళ్ళీ వానరయ్య కోప్పడతాడేమో అనుకుని, నోరు మూసుకుంది పిల్లకోతి.

ఈలోగా అక్కడ కడ్డిపేటలో కోతేశ్వరరావు లగ్న పత్రిక తయారు చేస్తున్నాడు.

“నా ప్రధమ పుత్రిక చి.సౌ. మారుతిని, వానరయ్యగారి ప్రధమ పుత్రుడు వాలికి ఇచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు కావున, తమరందరూ తప్పక విచ్చేసి, మదర్పిత అరటిపళ్ళు స్వీకరించి, కొత్త దంపతులను ఆశీర్వదించమని కోరుతున్నాము” అని వ్రాస్తున్నాడు.

“నీకు అసలు బుద్ధుందా కోతేశ్వర్రావ్. వానరయ్య తన కొడుకు వాలిని నీ కూతురికి ఎలా ఇస్తాడు అనుకున్నావ్. వర్గాల గజ్జితో అసలే రెండు కాళ్ళూ గరగరా గోక్కుంటున్నాడు” అంటున్నాడు పిల్లి గడ్డం సవరించుకుంటూ సుగ్రీవుడు.

అది విని కడ్డి హనుమయ్య కోపంతో, “వాడు ఒప్పుకున్నా, నేను ఒప్పుకుంటానా? మన అంతస్తు ఎక్కడ, వాడి అంతస్తు ఎక్కడ. వాళ్ళ కన్నా మనం లక్ష రెట్లు ఎక్కువ. మన కోతి పిల్ల మనకి కోతి బంగారం. ఇలాటి పెళ్ళిళ్ళు మనకి వద్దు. నాలుగు రోజులు ఓపిక పట్టు. కోతిలింగం అని, మనకి తెలిసిన మనవాడే.. వాడిని ఒప్పించి పెళ్లి చేయిస్తానుగా..” అన్నాడు.

“అదికాదు, హనుమయ్య బాబాయ్. మరి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా” అన్నాడు కోతేశ్వర్రావ్.

“ఔను. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అయితే పెళ్లి చేసుకోవటమేనా? మన వర్గాన్ని మనం సమర్ధించక పొతే ఎలా.. ఈ పెళ్లి జరగదు కాక జరగదు కాక జరగదు కాక జరగదు..” అన్నాడు కోపంతో హనుమయ్య.

ఇదంతా ఎన్నో ఊడలు వేసి పాకిపోయిన ఆ మర్రి చెట్టు క్రిందే జరుగుతున్నది. ఎడమ పక్క ఊడ క్రింద రెమ్మ వర్గం వారూ, కుడి పక్క ఊడ క్రింద కడ్డి వర్గం వారూ, కారాలూ మిరియాలూ నూరుతున్నారు.

ఆ ఘాటుకి ఒక్కసారి పెద్దగా తుమ్మి, తల్లి చెట్టు ఆవేదనతో అంది. “ఎదిగిన కొద్దీ ఒదగమని మన చెట్లు అందరికీ చెబుతుంటాయి కదా. మరి ఈ కోతి వెధవలకి ఇది ఎందుకు అర్ధం కాదు. మన చెట్లల్లో ఎన్ని రకాల చెట్లు లేవూ.. అన్నీ కలిసీ మెలిసీ వుండటం లేదూ.. అంతా పిదప కాలం.. పిదప బుద్దులూ..”

పక్కనే వున్న వేప చెట్టు, “వీళ్ళిలా కొట్టుకు చస్తున్నారు కానీ, నాకేమీ తేడా కనపడటం లేదమ్మా. అన్ని కోతులూ కోతుల్లాగానే వున్నాయి. అన్నీ ఒకే రకంగా పళ్ళికిలిస్తున్నాయి. ఒకే రకంగా గంతులు వేస్తున్నాయి. ఒకే రకంగా తోకలు ఊపుతున్నాయి. ఒకే రకంగా ఆ కోతి బుద్ధులు చూపిస్తున్నాయి. క్రింద ఏ రంగులో వుంటేనేం, మన కోతి ముఖాలు అందంగా వుంటే చాలదూ..” అంది.

“మరి మనకి కనపడని తేడాలు, వాటికి ఏమి కనపడ్డాయో.. సిగ్గూ ఎగ్గూ లేకపోతే సరి.. కోతి పుటక పుడితే సరిపోతుందా, కోతుల్లా బ్రతకొద్దూ...” అంది మర్రి చెట్టు అసహ్యించుకుంటూ.

ఈలోగా ఆ రెండు వర్గాల మధ్యా వున్న పచ్చగడ్డి భగ్గుమని మండటం మొదలు పెట్టింది.

‘అదేమిటి. పచ్చగడ్డి అలా మండుతున్నది. ఎండుగడ్డి మండుతుంది కానీ, పచ్చగడ్డి మండటం ఎప్పుడూ కనీ వినీ ఎరగమే..” అంటున్నది మర్రి చెట్టు.

ఆ మాటలు పూర్తి అవకముందే, అక్కడ వున్న చెట్లకి కూడా అంటుకున్నది నిప్పు.

అడవి అంతటా ఆక్రమిస్తున్నాయి మంటలు.

అన్ని కోతులూ, ఒకేసారి ఒకే గుంపుగా పరుగెత్తుతున్నాయి. పక్కనే వున్న నది మీద, రెండు ఒడ్డులనీ కలుపుతూ వున్న కర్రల మీద నించీ అవతలి ఒడ్డుకి పరుగెడుతున్నాయి. తమతోపాటుగా పరుగేత్తలేని చిన్న చిన్న పిల్ల కోతుల్నీ, ముసలి కోతుల్నీ తమ భుజాల మీద ఎక్కించుకుని నదిని దాటుతున్నాయి.

అక్కడ వర్గ బేధం లేదు. కడ్డి కోతుల్ని రెమ్మ కోతులూ, రెమ్మ కోతుల్ని కడ్డి కోతులూ భుజాల మీద ఎక్కించుకుని ఈ ఒడ్డు నించీ ఆ ఒడ్డుకి పరుగెడుతున్నాయి. అందరూ ఒకరి చేతులు ఒకరు వదలకుండా గట్టిగా పట్టుకుని, గొలుసుకట్టుగా పరుగెత్తుతున్నారు.

రెమ్మ వానరయ్య క్రింద పడిపోతే, కడ్డి హనుమయ్య అతని చేయి పట్టుకుని లేవనెత్తి తీసుకు వెడుతున్నాడు.

వాలి తనకి కాబోయే భార్య మారుతి చేయి పట్టుకుని పరుగెడుతున్నాడు.

మరి అగ్నిదేవుడికి ఏమనిపించిందో ఏమో కానీ, కోతులన్నీ మళ్ళీ వర్గ బేధం లేకుండా ఇలా సఖ్యంగా వుండటం చూసి చల్లబడ్డాడు.

“సర్వేవానరా సుఖినోభవంతు!” అనుకోబోయి, పైకే అనేశాడు అగ్నిదేవుడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)