సారస్వతం - 'దీప్తి' వాక్యం
కృష్ణం వందే...
- దీప్తి కోడూరు

కృష్ణుడు మన తార్కిక పొరల్లో అమరని, కొలమానాల్లో ఇమడని మహాత్ముడు. కృష్ణుడికి ఆలయాలు నిర్మించాము. పూజలు చేస్తున్నాము. భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాము. "హరే రామ హరే కృష్ణ" మహామంత్రాన్ని నిరంతరం జపించుకొనే వాళ్ళమూ ఉన్నాము. అంటే అనుక్షణం ఆ మాహాత్ముడిని మన స్మృతి పథంలో నిలిపి ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నాం.

“కృష్ణుడు” అనే శబ్దం వినగానే స్ఫురించేది ఏమిటి?

భగవద్గీత, పదహారువేల మంది గోపికలతో బృందావన రాసలీలలు, యశోదమ్మ వద్ద చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు, రాధమ్మతో ప్రణయలహరి, సత్యభామాది అష్టసఖులు ఇంకా ఎన్నో... కానీ, ఒక్క క్షణం యోచించండి.

కృష్ణుని గురించి మనకున్న అవగాహనతో కృష్ణుడిలాంటి ఒక వ్యక్తి దేహధారిగా మనతో సహజీవనం చేయడానికి వస్తే, అంగీకరించి, ఆదరించి, అభిమానించే వాళ్ళం ఎంతమందిమి? పైకి అంగీకరించినా, అంతరాంతరాల్లో మింగుడు పడని ప్రశ్నే అవుతాడు కృష్ణుడు.

ఎప్పుడో ఐదు వేల సంవత్సరాలనాడు ఉండి, పోయిన కృష్ణుణ్ణి, మన తాత, తండ్రులు చెప్పారని పూజించటం, కృష్ణ తత్వం పట్ల ఎట్టి అవగాహన పెంచుకోకుండా, గొర్రెదాటు మనస్తత్వంతో తరాలు సాగిపోవటం సమర్ధనీయమా? ఒక వ్యక్తిగా కూడా అంగీకరించగలమో, లేదో తెలియని కృష్ణుడికి మనం చేస్తున్న ఈ పూజలు, స్మరణలు, జపాలు అబద్దాలు, మనల్ని మనం మోసం చేసుకొనే చర్యలు కావా?!!

మరి కృష్ణుడు అంటే ఏమిటి?

అధికశాతం మందికి కృష్ణుడు గీతచార్యుడుగానో, బృందావన రాసలీలా విహారిగానో స్ఫురణకు వస్తాడు.

“కృష్ణ” అంటే,

నీ గుండె లోతుల్లోకి చూచుకొన్నపుడు గుబులు, గుబులుగా, వెలితిగా దేన్నైతే అనుభూతి చెందుతావో ఆ వ్యధ, వెలితిల సమాహార స్వరూపమే కృష్ణుడు. ఒకానొక తీరని కాంక్షతో, దేన్ని పొందలేక అసంపూర్ణంగా మిగిలి ఉన్నామని అనిపిస్తుందో, దేని సంయోగంతో పరిపూర్ణం కాగలమని ఆర్తిగా ఎదురుచూస్తామో ఆ నిండుతనమే కృష్ణుడు.

ఎట్టి జీవికైనా, ఏ పరిస్థితిలోనైనా బాసటగా నిలిచి చేయి పట్టి నడిపించించగల తోడు కృష్ణుడు.

'కన్నయ్యా!' అన్న యశోదమ్మకు సమస్త విశ్వమూ తనలోనే దర్శింపజేసినాడు.

'అన్నా!' అన్న ద్రౌపదీ దేవి ఆర్తనాదానికి కరిగిపోయి, ఆమె అభిమానాన్ని నిలబెట్టినాడు.

'కృష్ణా!' అంటూ, ఆ పిలుపులోనే కరిగిపోయి, నామమాత్రంతో, దర్శనమాత్రంతో, స్పర్శామాత్రంతో తన్మయురాలై, సర్వం విస్మరించి, ఆ భావంలోనే లయించిపోయిన రాధమ్మ, వియోగానికి తనను తాను సమర్పించుకున్నాడు.

'బావా!' అని పిలిచినా, 'నువ్వే తల్లి, తండ్రి, సఖుడు , ఫ్రియుడు, గురువు, దేవుడు అని నమ్మి, నడయాడిన అర్జునునికి భగవానుడైన అమృత బోధ చేసి, విశ్వమంతా తానే నిండి ఉన్నానని మహదానుభవంతో అక్కున చేర్చుకున్నాడు.

'మిత్రమా!' అని చేరవచ్చిన కుచేలుని ఒడి నిండా సమస్త సంపదలూ నింపివేసినాడు.

ఇది, అది అననేల! వారేది చేసినా దాని వెనుక భావమొక్కటే.

ప్రతివారిలోని అసంపూర్ణతకు పరిపూర్ణత చేకూర్చడమే కృష్ణ తత్వం.

"కృష్ణం వందే జగద్గురుం" అన్నదానికర్థమదే.

కృష్ణుడు అనగానే కామవికారాలతో కూడిన శృంగార భావనను ఏర్పరచుకున్న వారికిదే సమధానం.

'కృష్ణస్య హృదయం రాధా, రాధాయాః హృదయో హరిః' అన్నప్పుడు, రాధమ్మ హృదయం ఎలా ఉండి ఉంటుందనుకొన్నారు?!!

సర్వదా కృష్ణుని సుఖాన్నే కోరుతూ, అతడు సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆ సుఖంలో ఏదైనా బాధ కలుగుతుందేమో అని భయం చెందుతూ, ఆ భయంతో క్షణమైనా స్థిమితంగా ఉండలేక, అనుక్షణం ఆ శ్రీకృష్ణుని దివ్యదర్శనం కోసం పరితపిస్తూ, ఒక్కసారిగా కృష్ణుడు కనుల ముందు నిలవగానే, సమస్తాన్నీ మరచిపోయి, వారి దివ్యమోహన రూపలావణ్యంతో, సౌందర్యంలో మైమరచిపోయి, కోటి కోటి బ్రహ్మాండాలలోని సుఖం యావత్తూ ఒక కోట్యంశానికి కూడా సమం కాని, ఆ కృష్ణ సంయోగానుభవంలో సంలీనమౌతూ, కృష్ణుడు కానరాని కాలాల్లో, వర్ణనాతీతమైన వియోగ దుఃఖాన్ని దిగమింగుకోలేక, వెర్రిదానిలా బృందావనంలోని ప్రతి చెట్టుని, పుట్టనీ, యమునా తీరంలోని ప్రతి ఇసుక రేణువునూ కృష్ణుని జాడ తెలుపమని కలవరిస్తూ, కరిగిపోయి, కన్నీరు మున్నీరు అవుతుంది.
అదీ రాధమ్మంటే!!

మధుర భావ సాధనలో ఉండగా శ్రీ రామకృష్ణ పరమహంస, రాధమ్మ, గోపికల అనుభవాన్ని ఇలా వివరించారు,
"పూర్తిగా కామహీనులు కాకపోతే మహాభావమైన రాధాదేవి ప్రేమభావాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని చూడగానే గొపికల మనస్సులు కోటానుకోట్ల రత్యానందం కంటే అధికానందంతో పొంగిపొరలేవి. అలాంటప్పుడు పరమ తుఛ్ఛమైన ఈ దైహిక సుఖాన్ని గురించి వారి మనస్సులు ఎలా యోచిస్తాయి? శ్రీ కృష్ణుని దేహం నుండి వెలువడే దివ్యజ్యోతి వారి శరీరాలను స్పృశించి, ప్రతి ఒక్క రోమ కూపం ద్వారా అనంతమైన ఆనందాన్ని అనుభవింపజేసేది."

ఇంద్రియ మనోనిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమైన, మహానుభావుడు రామకృష్ణుడు చెప్పిన మాటలివి.

అటువంటి శ్రీ కృష్ణుని చల్లని తోడు, సర్వులకూ సదా నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ, అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)