శీర్షికలు

పద్యం హృద్యం



- నిర్వహణ: పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమపూరణలను తరువాయ సంచికలో ప్రచురిస్తాము.

ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకుల నుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

 

మాసంప్రశ్న:


ఈ నెల కొనసాగుతున్న ICC క్రికెట్టు పోటీల సందర్భముగా సమస్య:
బ్యాటింగును జేయువాడె బౌలరు గదరా!


గతమాసం ప్రశ్న:

 

దత్తపది: ఈ నెల ప్రారంభమౌతున్న ప్రపంచ క్రికెట్టు పోటీల సందర్భముగా, "దోని" (ధోని), "కోలి" (కోహ్లి), "రానే", "రైనా" పదాలను నామవాచకములు కాకుండా వాడుతూ క్రికెట్టు ఆటపై మీకు నచ్చిన చంధస్సులో పద్యము వ్రాయాలి.

 

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
తే.గీ||
కలదు కలదో, నిజము నమ్ము, కనకపాట
సొమ్ము తోడు! రానే వచ్చి శోభ గూర్చు!
రమణులున్ తయారైనారు! రామ! రామ!
చెల్లు చుండెనకో! లిప్స! చేటు గాదె!
(లిప్స = అభిలాష, కోరిక)

సూర్యకుమారి వారణాసి, మచిలీపట్నం
ఈ క్రికెట్ నెంచి యేదో నిధిగను బంతి
కొఱకు నెవ్వరైనా పెట్టు పరుగు లెన్నొ
ఐన నెందుకో లిఖియించి లేని యెడల
విజయ మింక రానేరదు నిజము గాను

జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు
ఇరు పక్షములలోన నిరువుగా యువకులు - పదకొండుగురుయుండు బంతియాట
ఒక బృందమందొక డొడుపుగా విసిరినా - బంతి రానే వచ్చు పరిధి మీరి
జయమునకో లిప్త చాలునక్కజముగ - నవకాశపు మెరుపులరుదు గాన
కుదురునో లేదో నికరముగ పరుగులె - క్కువచేయబూనుటకాట గాండ్ర
కనుచు నభిమానులెల్లరు కాంచు యాట
జట్టునందొకరైనా విజయ శిఖరము
నందు బాట లో పయనింతురతి రయమున
ఘనముగ గణుతికెక్కిన క్రికెటు నందు.

గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌
కేరింతల్‌ చెలగన్‌; అదో నినద సత్కేళీ క్రికెట్‌ హేల, సొం
పారం గాంచుటకో, లిఖింప చరితల్‌, పట్టుల్‌ వికెట్టుల్‌ పడన్‌
పేరుం బొందిన ఆటగాళ్ళు పరుగుల్‌ పెంపొందరా నేర్పుతో
ప్రారంభించి తెగించి మించుతరి తీరైనాడు క్రీడా ద్యుతిన్‌.

గెలుపెవరిదో నిరీక్షించ తెలియ వచ్చు
పేరు గుర్తింపుకో లిప్స జోరు హెచ్చు
క్రీడ చూడరా నాణ్యమై వేడు కగును
జట్టు గాళ్ళెవరైనా క్రికెట్టు మోజు.

చావలి విజయ, సిడ్నీ
పరుగుకో లిప్త తత్తర పడిన తీరు
బౌండరీ తోసెరా నేర్పు పరుగు పెంచ
గెలుచు వారెవరైనా వికెట్టు పడిన
దోనిశితము చూపు కెమెరా తోడ విందు
గెలుపు కోరు వీక్షకులతో గేము సాగు
వేడుకే క్రికెట్ వీక్షణ వేడి పుట్ట

డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా
రానే వచ్చె క్రికెట్ ఎవ
రైనా జట్టున ప్రతిభను రాణించంగా
దోనియ జట్టే ట్రోఫిని
వైనము తానందుకో లివముతో నెపుడున్
(వైనము=ఉపాయము, దోని=అల్పము,చిన్నది, లివ=నేర్పు)

శివప్రసాద్ చావలి, సిడ్నీ
రానే వచ్చెను! ఈ సా
రైనా కప్పును గెలిచెదరా? మది యందే
దో నిలుచు సంశయంబును
ఐనా, వీడ్కోలిక క్రికెటర్లకు ప్రీతిన్‌!

(ప్రపంచ క్రికెట్‌ కప్పు పోటీలో మన జట్టు కప్పును గెలుస్తారా యను చెరగని సందేహము రానే వచ్చింది. అయినా, ఆస్ట్రేలియా దర్శించి, ఆడి, వెళ్ళనున్న ప్రియతమ క్రీడాకరులకు వీడ్కోలు పలుకు నేపథ్యమున వ్రాయడమైనది.)

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
విజయమెవరిదో నిజమును విశ్వమందు
యెవ్వరైనఁ దెల్పగలరా ఈభువినను?
గెలుపె వరికో లిఖించిన నలువ తప్ప
“స్రష్ట! తెలుపరా! నేడు నిజమ్ము మాకు”.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)