కథాభారతి

 

కృపానుడు

-డి.శోభారాణి

 

“సార్...” అన్న పిలుపుతో క్లాసు తీసుకోడానికి వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసాడు కృపానందం.
కామేశం పరుగులాంటి నడకతో తన వైపు రావటం గమనించాడు.

అప్పటికే కృపానందం ఐదవ తరగతి క్లాసు తీసుకునే సమయం దాటి ఐదునిముషాలైంది.

“మీ కోసం ఇల్లు చూశాను సార్. నేనుంటున్న ప్రక్క పోర్షనే. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను” అంటూ ఎంతో ఉత్సాహంగా భుజాలెగరేస్తూ వచ్చాడు కామేశం.

కృపానందం కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి.

“వెరీ గుడ్. థాంక్స్ కామూ..!” అంటూ కామేశం చేయి కలిపాడు.

“సార్.. టీ త్రాగుతూ మాట్లాడుకుందాం రండి” అంటూ ఎంతో వినయ పూర్వకమంగా ఆహ్వానించాడు కామేశం.

టీ అనగానే పోయే ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందానికి లోనయ్యాడు కృపానందం.

క్లాసుకు మరోపది నిముషాలు ఆలస్యమైనా కొంపలు మునిగి పోయిందేమీ లేదు. పైగా తేరగా వచ్చే ‘టీ’ ని వదులుకోవడం ‘సిరిరాగ మోకాలడ్డు పెట్టినట్లే.. ’ అని మనసులో గొణుక్కున్నాడు.. డస్టర్ ఉన్న చేతితోనే తల గోక్కుంటూ..

చేతిలోని డస్టర్, చాక్ పీసులు తిర్గి స్టాఫ్ రూంలో పెడితే తాను క్లాసుకు వెళ్ళలేదనే అనుమానం రావచ్చని ఉన్నఫళంగా కామేశం వెనకాలే పరుగు తీశాడు కృపానందం.

***

కృపానందానికి మారు పేరు కృపణుడు. స్టాఫ్ అంతా ‘కృపణ్’ అని పిలుస్తుంటారు. దానికి అర్థమేమిటో అతడికి తెలియంది కాదు. అయినా ఎవరు ఏమి అనుకున్నానేమి.. ‘ధనం మూలం ఇదం జగత్’. అనుకునే కృపానందం డబ్బుకు తప్ప దేనికీ ప్రాధాన్యత ఇవ్వడు. అడుక్కోడానికి అరవై సూత్రాలు అనుసరించే ఆచార్యుడు... ‘నీ పప్పూ నా పొట్టూ కలుపుకొని ఊదుకొని తిందాం’ అనే రకం.

ప్రకాశం, ప్రమీలమ్మలకు ఇద్దరు కొడుకులు. వ్యవసాయ ఆధారిత కుటుంబం. పెద్దవాడు సదానందం తన తమ్ముడు కృపానందాన్ని ఉన్నత చదువులు చదివించాలని ఉన్నత పదవిలో చూడాలని కలలు కనేవాడు. అహర్నిశలూ శ్రమించేవాడు. వ్యవసాయ పనుల్లో కృపానందం తల దూర్చకుండా హాస్టల్లో ఉంచాడు.

కాలం కక్షబూనింది. అతడి భార్య సుశీల ప్రసవించి ఆడపిల్ల జన్మనిచ్చిన సమయానికే పొలంలో పాము కాటుకు బలయ్యాడు. బిడ్డను చూసు కోకుండానే కన్ను మూశాడు సదానందం.

ఆ ఇంట్లో కొన్నాళ్లపాటు కుటుంబంలో స్థబ్దత నెలకొంది.

అన్నయ్య ఆశయం నెరవేర్చాలని బాగా చదువుకొమ్మని ఎంత బతిమాలినా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టాడు కృపానందం. భవిష్యత్తులో తల్లిదండ్రులనే కాకుండా.. వదినమ్మ, ఆమె కూతురు కూడా తన మెడకే చుట్టుకుంటారని.. ఖర్చులు లెక్కలు వేసుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా కుటుంబం నుండి తప్పుకోవడమే మేలని నిర్ణయించుకున్నాడు. పథకాలు రచించుకున్నాడు.

ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో టీచర్ ఉద్యోగం సంపాదించుకొని ఇల్లు వదిలేసాడు. ఏరి కోరి అమ్మాయిని వెతుక్కున్నాడు.

కట్నం కృపానందం ఆశించినదానికన్నా ఎక్కువగానే గిట్టుబాటయింది. పైగా ఒక్కర్తే అమ్మాయి...
ఆలసించిన ఆశాభంగమని ఆలోచించకుండా కళావతి మెళ్ళో తాళి కట్టేశాడు కృపానందం. కట్నం తాలూకు డబ్బులు సాంతం తన పేర బ్యాంకులో పదిలపర్చుకున్నాడు. పెళ్ళి ఖర్చులు ‘కన్నవారి బాధ్యత’ కు వదిలేసాడు.
పెళ్ళికాగానే ఇంటితో తెగతెంపులు చేసుకున్నాడు.

అయినా కన్న పేగుబంధం.. తెంచుకుంటే తెగేది కాదు. కొడుకు మీద ఆధార పడడం ఎండమావుల్లో నీళ్ళ కోసం వెదుక్కోవడమేనని కృపానంద తల్లి దండ్రులు తమ మానాన తాము బ్రతుకుతున్నారు.. వ్యవసాయ భారాన్ని ఈడ్చుకొస్తున్నారు.

కుటుంబ పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్న సుశీల పుట్టింటి వారు ఒక రోజు అంతా కూడబలిక్కొని వచ్చారు. సుశీలను తమ ఇంటికి ఆహ్వానించారు. తనకు మళ్ళీ పెళ్లి చేస్తామన్నారు. ఆరో తరగతితో ఆగిపోయిన ఆమె చదువును మళ్ళీ కొనసాగేలా చూస్తామని ప్రమాణం చేసారు. నూతన జీవితంపై ఆశలు కల్పించారు. మరెన్నో ప్రలోభాలు చూపించినా సుశీల దేనికీ లొంగలేదు. తాను ఒకే త్రాటిపై నిలపడింది. వారితో పుల్ల విరుపుగా ఒకే ఒక మాట అంది.

“నేను ఇప్పుడు మీ అమ్మాయిని కాను” కన్నీళ్ళు ఒత్తుకుంటూ..

“ఈ ఇంటి కోడలును. నా అత్తా మామలే నాకు ఇప్పుడు తల్లి దండ్రులు. వారి వంశనామం మోస్తున్నాను. వారి కుటుంబ గౌరవం కాపాడాల్సిన బాధ్యత నామీద ఉంది. కష్టాలైనా సుఖాలైనా వారి తోనే పంచుకుంటాను” అంటూ నిర్మోహమాటంగా వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది.

కృపానందం ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి. పిల్లలు ఇద్దరూ రత్నమాణిక్యాలు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు.
కాని పరిస్థితి మరింత ధారుణంగా మారింది. జంధ్యాల గారి ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో పిసినారి కోట శ్రీనివాసరావును తలదన్నే రాజేంద్ర ప్రసాద్ పాత్ర కృపానందం ఆరాధ్య దైవమయింది.

కృపానందం పిసినారితనం మీద పరిపూర్ణంగా పరిశోధన చేసిన శాల్తీయే కామేశం. అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు. ప్రథమంగా ఉద్యోగంలో చేరిందిక్కడే.. అవివాహితుడు.

కామేశం పుట్టగానే అతడి తల్లి చనిపోయింది. తండ్రి వీరేశం అతిగారాబంగా పెంచి పెద్ద చేసాడు. కలిగిన కుటుంబం. కామేశం కోరికలను కాదనలేక కొండమీది కోతిని సహితం కొనిచ్చేవాడు. అతడంటే పంచ ప్రాణాలు. కామేశం కోరుకున్న అమ్మాయినే కట్టబెట్టాలని చూస్తున్నాడు.

కామేశం ఒక పథకం ప్రకారం కృపానందం కుటుంబానికి దగ్గరయ్యాడు. దానికి నాందిగా కృపానందం కూతుళ్ళను మచ్చిక చేసుకున్నాడు. వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఖర్చులలో పాలుపంచుకోసాగాడు.
కృపానందం ఆనందానికి హద్దులు లేవు.

టీ కొట్టు సాక్షిగా..

“అద్దె ఎంత? అడ్వానన్స్ ఎంతిచ్చావ్? నెలా.. రెణ్ణెల్లా?” టీ చప్పరిస్తూ అడిగాడు కృపానందం.

“రెండు వేలు సార్. రెణ్ణెల్లకిచ్చాను”

“ఓ.కె...”అంటూ టీ త్రాగిన గ్లాసు ప్రక్కన పెడ్తూ జేబులో నుండి డబ్బు తీయబోయాడు కృపానందం.

అది కేవలం నటనేనని కామేశంకు తెలుసు. పైగా అతని జేబులో కేవలం ఒకే ఒక రూపాయి మాత్రమే ఉంటుంది. అదీ చెమటకు తడ్చిపోకుండా పాలితిన్ కవర్లో భద్రపర్చబడి సదా యవ్వనంగా.. దానిని బయటికి తీసినప్పుడల్లా రెప రెపలాడుతూ ఉంటుందే తప్ప.. ఏనాడూ దాన్ని ఖర్చు పెట్టింది లేదు.

“నేనిస్తాను సార్.. మీరు ఉండండి..” అని కామేశం మాటవరుసకు అనగానే.. గబ్బుక్కున తన జేబులో నుండి చేతిని బయటకు లాక్కున్నాడు కృపానందం.

“సరే!.. వస్తా క్లాసుకు టైమైంది...” అంటూ లేచాడు లోలోన ముసి, ముసి నవ్వులు నవ్వుకుంటూ..
“అన్నట్లు ఈ ఆదివారమే ఇల్లు షిఫ్ట్ చేద్దాం.. కామూ కాస్తా సాయం చేయి” అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా క్లాసుకు వెళ్ళిపోయాడు.

క్లాసు సంగతి దేవుడెరుగు.. అద్దె కొంపకిచ్చిన అడ్వాన్సు కామేశం అడుగకుండా ఉండాలని మనసులో వేయి వేల్పులను వేడుకున్నాడు.

కాస్తా ఒంటరిగా ఉన్నా అద్దె తక్కువని అన్నపూర్ణ ఆఠాతో చేసిన చపాతీలా ఉబ్బి పోయాడు భిక్షపతి. కాని ఇది కామేశం కావాలనే అలాంటి ఇల్లు చూసాడని కనిపెట్టలేక పోయాడు.

ఇంటి సామాను సర్దడంతో బాటు ఆ నెలకు సరిపడే సరుకులు తెచ్చి చేరవేశాడు కామేశం.

అతని నిస్వార్థ సేవకు తెగ సంబరపడి పోయాడు కృపానందం. ఆమాటే ఆ రాత్రి అర్థాంగి కళావతి చెవిలో ఊదాడు.

“సహాయకారి... సహృదయుడు...” అంటూ కళావతి వత్తాసు పలికే సరికి ఉబ్బినవాడు కాస్తా ఊదిన బెలూన్‍లా అయిపోయాడు కృపానందం.

‘ఇలాంటి బకరాలను నాలాంటి వారికై ఖర్చుల సమతుల్యం కోసం ఆ పైవాడు సృష్టిస్తుంటాడని’ మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.. మిణుగుడు పురుగు వెలుతురులో చదువుకుందామని తాపత్రయపడే కృపానందం.

***

క్రమేణా కళావతి కామేశం ఉచ్చులో చిక్కుకుంది.

దొంగతనమైనా.. రంకుతనమైనా.. దాచితే దాగేవి కావు. బట్టలో నిప్పు దాచినట్లే..
కామేశంతో జాగ్రత్తగా ఉండమని.. అతడు మంచి వాడు కాదని తోటి స్టాఫ్ మెంబర్స్ చెబుతునే ఉన్నారు. కృపానందం తన పిసినారి తనాన్ని మానుకొమ్మని అతడి హోదాకు తగినది కాదని హితవులు పలుకుతునే ఉన్నారు. అయినా కృపానందం తలకు ఎక్కేది కాదు.

కృపానందం విద్యార్థులకు నైతిక పాఠాలు బడిలో బోధిస్తుంటే.. కళావతి అనైతిక కృత్యాలు కాలనీలో.. హరి కథలు, బుర్ర కథలుగా విడుదల కాసాగాయి.

ఆ వాస్తవాన్ని కృపానందం గ్రహించేసరికే.. జరగ కూడని ప్రమాదం జరగనే జరిగింది.

కళావతి నాడి తెలిసిన కామేశం కలర్‍ఫుల్ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు. ఆమెను బ్యూటీ పార్లర్‍కు తీసుకు వెళ్ళే వాడు. కోరిన చీరలు నగలు కొనిచ్చే వాడు. కృపానందం కలిగించే అసౌకర్యాలన్నీ కామేశం సౌకర్యాలుగా తీర్చిదిద్దే వాడు. కళావతి అసలు జీవితం అంటే ఇదేనని భ్రమిసింది.

అగ్ని సాక్షిగా ఏడడుగులు కృపానందం వెంట నడిచిన స్త్రీమూర్తీ చేయాల్సిన పని కాదు. ఇది వనితాలోకానికి మాయని మచ్చ అని గ్రహించే స్థితిలో లేని కళావతి కామేశం వెంట పరుగులు తీసింది. వారిని దురదృష్టం వెంటాడింది.

అదే రోజు రాత్రి కళావతి కామేశంలు పోలీసు రైడింగులో సిటీ లోని ఒక లాడ్జింగులో దొరికిపోయారు.
“మేము ఫ్యామిలీ... ఎలా అరెస్టు చేస్తారు?...” అంటూ రెట్టించింది కళావతి. పరమ పతివ్రతలా తన మెడలోని మంగళ సూత్రాలను మొక్కుకుంటూ తన అక్కసు వెళ్ళగక్కింది.

‘తందానా..! తాన తందనానా..!!’ అన్నాడు కామేశం.

ఎస్సై కరుణాకర్ తన లాఠీని గోడగడియారంలోని పెండ్యూలంలా ఊపుకుంటూ చిరునవ్వుతోనే సమాధానమివ్వసాగాడు. కానిస్టేబుల్‍ను పిలిచి తగిన సూచనలిచ్చి తన క్వార్టర్స్ కు వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి కళావతి కామేశంలు చెరొక సెల్‍లో నీల్గుతూ నీళ్ళు నమల సాగారు.. ‘ప్రియతమా..! నీవచట కుశలమా..!!’ అని మనసులో పాడుకుంటూ..

తెల్లవారింది..

కృపానందం సదరు పోలీసు స్టేషన్లో హాజరు. ఆయన వెంట ఉపాధ్యాయ సంఘ అద్యక్షుడు.. మరో యిద్దరు స్నేహితులు.

కళావతి కామేశంలు ఖంగుతిన్నారు...

ముఖంలో నెత్తురు ఇంకిపోయి శిలా ప్రతిమలయ్యారు...

ఎస్సై కరుణాకర్ వచ్చాడు...

వాతావరణం గంభీరంగా మారి పోయింది.

అంతా మౌనం...

నిశ్శబ్దాన్నిచ్చేదిస్తూ “సార్ నన్ను గుర్తుబట్టారా? నేను కరుణాకరాణ్ణి. మీస్టూడెంట్‍ని. మీ ఇంటికి ట్యూషన్‍కు వచ్చేవాణ్ణి. మీరు కన్నయ్యా అని పిలిచే వారు”

కృపానందం ముఖం అత్తిపత్తి ఆకును ముట్టుకున్నట్లు ముకుళించుకు పోయింది. ఘోర పరాభవం.. తన పూర్వ విద్యార్థి ముందు.

మనసు మరింత ఆవేదనకు గురైంది..

“సార్.. నేను మీపెళ్ళికి గూడా వచ్చాను. యూనిఫాంలో ఉన్న నన్ను మేడం గుర్తు పట్టలేదు. కాని నేను మేడంను గుర్తుపట్టాను. మీప్రెసిడెంట్‍కు ఫోన్ జేసి కన్ఫాం చేసుకున్నాను. మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు.. మీరే నలుగురికి చెప్పేవారు. సొసైటీలో ఉపాధ్యాయులకు మంచి గౌరవముంది...” అంటూ తీయ, తీయగా చురకలంటిస్తూనే దొంగలను బంధించే సెల్ ఓపెన్ చేయించాడు.

కళావతి, కామేశంలు తలలు దించుకున్నారు.. దొంగకు తేలు కుట్టినట్లు.

వచ్చిన కృపానందం స్నేహితులంతా తలా ఓప్రక్క చీవాట్లు పెట్టారు.

‘‘ఇద్దరు రత్నాల్లాంటి బిడ్డలను విడిచి పెట్టి ఎలా పారి పోయి వచ్చావు?. భార్యాభర్తల అనుబంధానికి తీరని ద్రోహం చేసావు. సంసారమన్నాక సర్దుబాట్లు ఉండవా?. వివాహమాడటం ప్రథానం కాదు. ఆ పవిత్ర బంధాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం నిలబెట్టుకోవటం ముఖ్యం. తప్పులను సరిదిద్దుకుంటూ సంసారాని చక్కదిద్దుకోవాల్సింది పోయి పారి పోవటం నీ మంచికే అనుకుంటున్నావా?. సమాజంలో కృపానందం సారుకు ఎంత అవమానం!.. తలెత్తుకోగలడా?..’’ అంటూ కళావతిని ఒక పక్క..

‘‘భార్య మనసెరిగి మసలుకోవాలి సార్.. సాగరం ఈదవచ్చునేమో కాని సంసారం ఈదటం అంత తేలిక కాదు.. ప్రేమ వివాహాలు.. విఫలమవుతున్నాయి.. భార్య ఉద్యోగస్తురాలు అయితే అహంభావాల వల్ల సంసారాలు తెగిపోతున్నాయి అనుకుంటున్నాం కాని మీకేమైంది? మీది పెద్దలు కుదిర్చిన వివాహం.. పైగా నీభార్య ఉద్యోగస్తురాలు కూడా కాదు.. వివాహబంధం జీవితాంతం నిలబడాలంటే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం.. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకోవటం అతి ముఖ్యం.. మీకు తెలియంది కాదు” అని సదానందంకు మరో పక్క క్లాసు తీసుకున్నారు.

ఎస్సై కరుణాకర్ కరుణా కటాక్షాలతో ఏకేసూ లేకుండా బయట పడ్డారు..

***

వారం గడిచింది..

ఒక రోజు కామేశం తండ్రి వీరేశం సదానందం ఇంటికి రాయబారానికై వచ్చాడు.

కళావతి లేకుండా తన కొడుకు అన్నపానీయాలు, నిద్రాహారాలు మాని చావు ముఖం పడిందని తనకు పుత్ర భిక్ష పెట్టుమని కళావతి కాళ్ళపై పడ్డాడు. ‘తనకు ఒక్కగానొక్క కొడుకు..’ అంటూ ప్రాధేయపడ్డాడు..

ఇలాంటి రాయబారాలు వినడానికి నీచంగా అనిపించినా కొడుకు మీద ప్రేమతో వీరేశానికి రాక తప్పలేదు.

కృపానందం బడి నుండి రాగానే హాల్లో టేబుల్‍పై ఉత్తరం కనిపించి ‘కోర్టుకెక్కినీ పరువింకా దిగ జార్చుకోకు. నన్ను పూర్తిగా మర్చిపో. ఆపై నీ ఇష్టం...’ అంటూ వినిపించింది.. ఉత్తరంలో తన అర్థాంగి కళావతి అవహేళన కలాకృతులు కనిపిస్తూ..

నిల్చునే ఓపిక లేక పక్కనే వాల్చి ఉన్న వాలు కుర్చీలో వాలి పోయాడు కృపానందం.

విగత జీవులైన పిల్లలకు అతుకూ బొతుకూ లేని సమాధానాలతో మభ్యబెట్టక తప్పలేదు.

***

కృపానందం తన స్వంత ఊళ్ళో ఉన్న పాఠశాలకు బదిలీ చేయించుకున్నాడు.

తన ఇంట్లో తల్లి దండ్రులతో ఉండకుండా.. వేరే ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.

తనకంటే సీనియర్లు ఎవరూ లేరు.. తనే ప్రధానోపాధ్యాయుడు. పిల్లల మధ్యాహ్న భోజన పథకం అతడికి అక్షయ పాత్రగా మారింది.

‘మేకకు తెలిసింది మేత సంగతే’ అన్నట్లు పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అలవెన్సులలో కక్కుర్తి పడడం చూసి ‘ఎలుక తోక పట్టి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు’ అన్నట్లు కృపానందం పిసినారి తనంలో రవ్వంత కూడా మార్పు రాలేదని యిట్టే గ్రహించారు అక్కడి స్టాఫ్ మెంబర్లు.

కృపానందం అడగటం ‘మేక లోలాకులు పట్టుకొని పాలు పితకడమే’ నని భావించినా కడుపులోని కుతి ఆగక “నమస్తే సార్...” అంటూ చేతులు నలుపుకునే వారు వంట మనుషులు. నాకే చాలలేదు అన్నట్లు ముఖం పెట్టే వాడు కృపానందం పెదవులను నాలుకతో తడుపుకుంటూ..

ఇదంతా ఒక కంట కనిపెడ్తున్న కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగిని సుశీల ఒక రోజు పాఠశాల తరగతి గదులు ఊడుస్తూ..
“కృపానందం ఇంకా ఏమాత్రం మారలేదు..” అని గొణుక్కోవటం మరో ఉపాద్యాయుడు సురేందర్‍చెవిలో పడింది.
ఒక ఉపాధ్యాయుణ్ణి పేరు పెట్టి అమర్యాదగా సంభోదించే సరికి సుశీల వంక కోపంతో చూశాడు సురేందర్‍..
ఊడుస్తున్న చీపురు విసురుగా నేల మీద వేసింది..

“పెళ్ళాం లేచిపోయినా.. మనిషి మారలేదు సార్.. మళ్ళీ పెళ్ళి చేసుకొని కట్నం కోసం కలలు కంటున్నాడు. ఇతడి పిసినారి తనం తెలిసి ఎవరూ ముందుకు రావడం లేదు.. సార్.

ఊళ్ళోనే తల్లి దండ్రులు. వారి ముఖమన్నా చూడడు. చదివించి పెద్దజేసి పెళ్ళి జేస్తే ఆయనిచ్చే మర్యాద ఇదేనా? అడిగేవారెవరూ లేకపోయే సరికి ఇంకా మిడిసిపాటెక్కువైంది.. సార్.

తన పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడనే నమ్మకమూ లేదు సార్. వాళ్ళే ఎవరినైనా చూసుకొని లేచి పోవాలని చూసే రకం. చచ్చాక సంపాదించిందంతా తలాపుకు పెట్టుకొని పట్టుకు పోతడా?...” అంటూ తన గదుమ పట్టుకుంటూ అంది.
సుశీల బి.పి.హెచ్చిన దానిలా వాగుతుంటే గట్టిగా కేకేసి ఆమె వాక్ప్రవాహాన్ని అడ్డు కున్నాడు సురేందర్. ఆమె మాటల్లో ఇసుమంత కూడా అబద్ధం లేదని తెలిసినా..

“చూడు సుశీలా.. కృపానందం సార్ మన హెడ్‍మాస్టర్. నువలా అమర్యాదగా మాట్లాడడం తప్పు” అన్నాడు.
“సారీ సార్. తప్పైంది. నా కడుపంత మసిలింది. కృపానందం సార్ ఎవరో కాదు సార్ నామరిది ...”

“కృపానందం నీ స్వంత మరిదా?..” ఆశ్చర్యపోయాడు సురేందర్. ఇన్ని రోజుల నుండి అతడు తింటున్న టిఫిన్ బాక్స్ సహితం కడుగుతున్న సుశీలను తన వదిన అంటూ చెప్పనందుకు కృపానందంపై తనకూ కోపం రాసాగింది..
“కృపానందం సార్ అన్నయ్య పాము కరిచి చనిపోయాడు. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన హెడ్‍మాస్టర్ దేవుడు. అతడు వచ్చాక ఈ బడి పిల్లల సంఖ్య పెరిగింది. డ్రాపౌట్స్ ను స్వంత ఖర్చులు భరించి వారంతా తిరిగి బడికి వచ్చేలా శ్రమించాడు. సంఖ్య పెరిగిందని రెండు కాట్రాక్ట్ పోస్టులు స్యాంక్షన్ చేసింది ప్రభుత్వం” అంటూ మరో కాట్రాక్ట్ అటెండర్ వాచ్‍మన్ నాగయ్య చెప్తుంటే ఆసక్తిగా వినసాగాడు సురేందర్.

“సుశీల మామయ్య ప్రకాశం ఈ ఊళ్ళోవారి నోటిలో నాలుక లాంటి వాడు. అతడంటే అందరికీ గౌరవం కూడానూ. చాలా ఉత్తముడు. అలాంటి వానికి అతడి ఉన్న ఒక్క కొడుకు వెన్ను పోటు పొడిచాడని తెలుసుకొని సుశీలకు స్వీపర్ పోస్ట్ ఇప్పించాడు పోయిన హెడ్‍మాస్టర్. సుశీల నాకు ముగ్గురు పిల్లలు అంటూ తన బిడ్డతో బాటే అత్తామామలు గూడా పోషిస్తోంది.. సార్..”

సురేందర్ కళ్ళు చెమర్చాయి.

ఇంతలో సెల్‍ఫోన్ మ్రోగడంతో అన్యమనస్కంగానే ఆన్ చేశాడు సురేందర్.

ఫోన్లో మాట్లాడుతుంటే అతడి ముఖం కళావిహీనమైంది.

ఉన్నఫళంగా కుర్చీలో నుండి లేచి “కృపానందం సారుకు ఆక్సిడెంటైందట. నేను వస్తాను..” అంటూ హడావుడిగా బయలుదేరాడు.

“నేనూ వస్తాను సార్...” అంటూ సుశీల సురేందర్ వెనకాలే పరుగు దీసింది నడుంచుట్టూ కొంగు బిగిస్తూ.. మిగతా పని చూసుకోమన్నట్లుగా నాగయ్యకు రెండు చేతులా దండంపెట్టింది.

‘ఇంతసేపూ మరిదిని తిట్టి ఆక్సిడెంట్ అనగానే ఎలా పరుగెడ్తుందో చూడు...’ అన్నట్లుగా ఆశ్చర్యంగా సుశీల వెనుకాలే చూడసాగాడు నాగయ్య.
“ఆక్సిడెంట్ ఎలా అయిందట సార్.. ప్రమాదమేమీ లేదు గదా...” అతృత ఆపుకోలేక అడుగసాగింది సుశీల.

“బస్సులో అయితే టిక్కట్టు తీయాలి కదా.. ఫ్రీగా వెళ్ళొచ్చని ఎవరో ఒక టూ వీలర్ వాణ్ణి లిఫ్ట్ అడిగాడట. వాడు బాగా తాగి ఉన్నాడట. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు.. వాడు చనిపోయాడు. భిక్షపతి సీరియస్‍గా ఉన్నాడట”

అంటూ స్కూటర్ వేగం పెంచడంలో నిమగ్న మయ్యాడు సురేందర్...


సుశీల కన్నీరు మున్నీరు కాసాగింది.

***


రోహిణీ ప్రైవేటు హాస్పిటల్..

రక్తం పంచుకొని పుట్టిన తనకు.. తల్లి తిరిగి రక్తమివ్వడం.. తను వాళ్ళ పట్ల చూపిన నిర్దయ సహితం మర్చిపోయి నెల రోజులుగా తనకు సేవలు చేయటం కృపానందం హృదయం కలిచి వేయసాగింది.

‘అమ్మ తర్వాత అమ్మ లాంటి వదినమ్మ సుశీల తన సుఖాలను త్యజించి అన్నయ్య లేని లోటును పూరించడం.. నిజంగా ఆమె మా ఇంటి ఇలవేల్పు. నా అర్థాంగి ఉన్న సుఖాలతో తృప్తి పడక ఎండమావుల సుఖాల కోసం అర్రులుచాస్తూ వెళ్ళింది. ఇద్దరిలో ఎంత తేడా..

ఒకవేళ తన అసువులు బాసుంటే పిల్లలకు వీళ్ళు తప్ప వేరే ఎవరున్నారు?..’ అంటూ మనసులో ఆవేదన తన్నుకు రాసాగింది. తనలాంటి పాపాత్ముడు ఈ లోకంలో మరెవ్వడూ ఉండడని కన్నీళ్ళు పెట్టుకోసాగాడు.

“నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు బాబూ!..” అంటూ అతడి తల్లి ప్రమీలమ్మ తన కడకొంగుతో కన్నీళ్ళు తుడుస్తుంటే ఈ లోకానికి వచ్చాడు కృపానందం.

“నాప్రేగు తెంచుకొని పుట్టావు. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా మేము నిన్ను వదులుకుంటమా?...

నా మనుమరాండ్ల కోసమూ విచారించకు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మైనా వాళ్ళకు చదువులు చెప్పిస్తం. పెళ్ళిళ్ళు చేస్తాం.. నువేం దిగులు పడకు” అంటున్న ప్రమీలమ్మ మాటలు తూటాలై కృపానందం మదిలో పేల సాగాయి.

ప్రమీలమ్మ మెళ్ళో బంగారు పుస్తెల త్రాడు బదులు పసుపు త్రాడు కనబడే సరికి చలించి పోయాడు కృపానందం. కళ్ళు కన్నీటి కడవలయ్యాయి.

అది గమనించిన సురేందర్ “మీవాళ్ళు చాలా అభిమాన వంతులు సార్. ఎవరి సహాయమూ తీసుకోలేదు. వారి ఒంటిమీది నగలన్నీ నీకోసం ధారబోసారు. హాస్పిటల్ బిల్లు కట్టాడానికి మీనాన్నగారు వెళ్ళారు. ఈరోజే డిశ్చార్జి చేస్తున్నారు” అంటుండగానే కృపానందం నాన్న ప్రకాశం వచ్చాడు.

శక్తినంతా కూడగట్టుకొని బెడ్‍పై నుండి దొర్లి తల్లిదండ్రుల కాళ్ళపై పడిపోయాడు కృపానందం. చిన్నపిల్లాడిలా ఏడ్వసాగాడు.

కాసేపు నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది..

సుశీల పండ్ల రసం కృపానందానికి అందించింది. సుశీలకు రెండు చేతులా నమస్కరిస్తూ “మా వదినమ్మ సార్...” అంటూ సురేందర్‍కు పరిచయం చేయసాగాడు.

నాకు తెలుసన్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ ‘ఇక బయలు దేరుదాం...’ అంటూ లేచి నిల్చున్నాడు సురేందర్.

“నాన్నా.. నీకు ఆక్సిడెంటైతే అమ్మ రాలేదు... ఎప్పుడైనా వస్తే తంతాను...” అంటూ బుంగమూతి బెట్టిన చిన్న కూతురును హృదయానికత్తుకుంటూ “అమ్మా మనింటికే వెళ్దాం...” అన్నాడు కృపానందం.

వాతావరణం ఆహ్లాదభరితమైంది.

బయట సన్నని వర్షపు చిరుజల్లు ఆరంభమైంది.

హాస్పిటల్ గేటు దాటుతుండగా కొబ్బరికాయ కృపానందం చుట్టూ తిప్పుతూ ద్రిష్టి తీసి నేలపై కొట్టింది సుశీల.

కొబ్బరి ముక్కలు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయాయి. వాటి కోసం ఆతృంగా మాసిన కురులు, చిరిగిన బట్టలతో పరుగెత్తుకొచ్చింది ఒక మానసిక రోగి.. వెనకాల చిన్న పిల్లలు రాళ్ళతో కొడుతూ తరుముంటే..
ఆమె..!

చేజేతులా తన జీవితాన్ని సమాధి చేసుకున్న కామేశం యూజ్ అండ్ త్రో.. కళావతి.

* * *

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)