శీర్షికలు

 

సంగీత రంజని

కుమారి శ్రీరంగం గోపాలరత్నం - సంగీత సేవ


- శ్రీమతి.డా.ఓ.ఎన్.శైలేశ్వరి

సౌజన్యం: శ్రీమతి వై. రమాప్రభ, ప్రిన్సిపాల్, ఆంధ్రమహిళాసభ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీడియా ఎడ్యుకేషన్

 

గడచిన శతాబ్దిలో తెలుగు దేశంలోని కర్నాటక సంగీత విదుషీమణులలో అపారమైన కీర్తి, అనేకమైన బిరుదులు సంపదించుకున్న వారిలో పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నంగారు ముఖ్యులు.

కళలకు కాణాచి అయిన విజయనగరం జిల్లా పుష్పగిరిలో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు 1939లో జన్మించారు. వారిది సంగీత కుటుంబం కావడం వలన చిన్నతనాన్నేబామ్మవద్ద సంగీతంలో తొలిపాఠాలు, తరువాత తండ్రివద్ద మలిపాఠాలు, పెదతల్లి రంగమ్మగారి దగ్గర బాల్యంలో సంప్రదాయకీర్తనలు, తల్లి మేనమామ అప్పకొండమాచార్యులు రాసిన హరికథలను నేర్చుకున్నారు. వీరు వ్రాసిన రెండు హరికథలను పాలకొల్లు వైష్హ్ణవ సభలో చెప్పి నాటి ప్రఖ్యాత హరికథా విద్వాంసుడు పెద్దింటి దీక్శితులచే ప్రశంసలందుకున్నారు. అప్పటికి ఆమె వయస్సు 9 సంవత్సరాలే.

విశాఖపట్టణంలో కవిరాయని జోగారావుగారి దగ్గర గురుకుల పద్దతిలో వీణ, గాత్రం నేర్చుకునారు. చక్కగా వీణ వాయించేవారు. తరువాత వీరు, ’సంగీత కళానిధి’ శ్రీపాద పినాకపాణిగారి దగ్గర అనేకమైన మెళకువలు నేర్చుకున్నారు. ’నా సంగీత యాత్ర’ పుస్తకంలో 37వ పేజీలో పాణిగారు శ్రీరంగం గోపాలరత్నంగారి గురుంచి ప్రస్తావిస్తూ "విశాఖపట్నంలో కవిరాయని జోగారావు అనే యువవైనిక విద్వాంసుడు తన వద్ద వీణ, గాత్ర సంగీతం నేర్చుకుంటున్న కుమారి శ్రీరంగం గోపాలరత్నం చాలా తెలివైనదనీ, తాను నేర్పిన దనికంటె ఎక్కువగా పాడగలిగిన ప్రతిభాశీలి అనీ, నేను సమ్మతిస్తే నా వద్దకు ఉత్తమ శ్రేణి సంగీతాభ్యాసం కోసం పంపగలడనీ వినయపూర్వకంగా కోరాడు. నేను అలాగే అన్నాను. ఆమెది ఎంచదగిన అపూర్వసౌందర్య శారీరము. ఏ సంగతులైన వెంటనే పాడగల గాత్రసంపద, నేర్చుకున్న కృతులు వెంటనే పాడగల ధారణాశక్తి అన్నీ ఉన్నాయి. కొన్ని కృతులు, రాగాలాపనలు నేర్చుకున్నది" అని వ్రాసారు. వీరు వద్ద నేర్చుకున్న విద్య ఆమె పాండిత్యానికి మెరులద్దింది. అసమానమైన ప్రతిభతో అద్భ్తమైన గాత్రంతో, తనదైన బాణీలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగి దేశవిదేశాలలో ఎన్నోకచ్చేరీలు చేశారు.

1957లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిలయవిద్వాంసురాలిగా చేరిన ఆమె 1977 వరకు రేడియో ద్వారా కర్ణాటక సంగీతాన్ని, లలిత సంగీతాన్ని జనసామాన్యానికి చేరువచేశారు. 1960-70 ప్రాంతాల్లో విజయవాడ, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రాలు సంగీతానికి పెద్దపీట వేసే రోజులు. విజయవాడలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వేంకటేశ్వర్లు, పింగళి లక్ష్మీకాంతం, రమణమూర్తి, సంధ్యావందనం శ్రీనివాసరావు, బాలాంత్రపు రజనీకాంతారావు, మంచాల జగన్నాధరావు వంటి గొప్పవిద్వాంసులతో కలసి ఆమె సమర్పించిన సంగీత కార్యక్రమాలు గోపసలరత్నం సంగీత ప్రతిభకు నిదర్శనాలు.

ఈ పరంపరలో ఆకాశవాణి ద్వారా ఆమె విన్పించిన అన్నమయ్య కీర్తనలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. ’కస్తూరి రంగయ్య కరుణించవేమయ్యా" "ఏడీ అల్లరి వనమాలి’ పాటలు మంచి పేరు తీసుకువచ్చాయి. క్షేత్రయ్య పదాలు, మీరా భజనలు, లీలాశుకుని తరంగాలు జయదేవుని అష్టపదులు, రామదాసు, ముత్తుస్వామి దీక్శితులు కీర్తనలు, నండూరి ఎంకిపాటలు, పెళ్లిపాటలు, సంప్రదాయ జానపద గీతాలు, తిల్లానాలు, జోలపాటలు, భక్తిగీతాలు ఏవిపాడినా అవి ఆమె గొంతులో తియ్యదనాన్ని కలుపుకొని హృద్యంగా బయటకు వచ్నేవి. విజయవాడ కేంద్రం నుండి ఈవిడ, వింజమూరి లక్ష్మీగారు పాడిన అన్నమయ్యకీర్తనలు ’రసమాధురి’ కార్యక్రమంలో 2 సంవత్సరాలపాటు వచ్చాయి. శ్రీరంగంగారు, మంగళంపల్లి బాలమురళీగారు పాడిన తిరుప్పావై ఇప్పటికీ ప్రసారం చేయబడుతోంది. విజయవాడ రేడియో కేంద్రం రెండు దశాబ్దాలపాటు సుప్రభాతం మొదలు ప్రసార సమాప్తివరకు ఏదో ఒక సందర్భంలో శ్రీరంగం కంఠంతో శ్రోతల హృదయాలను రంజింపచేసేవారు.

 

ఓలేటి వేంకటేశ్వర్లుగారు, ’భామాకలాపం’ యక్షగానాన్ని సంస్కరించి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం చేత రికార్డుచేసి ప్రసారం చేసారు. ఆ యక్షగానాన్నిఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ’మదనా (ఆనందభైరవి), శకునాలు మంచివాయె(మోహన), భామనే సత్యభామనే వంటి స్వరరచనలు నేటివరకు ఎందరికో మార్గదర్నకంగా ఉన్నాయంటే అది గోపాలపత్నం అద్భుత స్వరమాధుర్యమే. ఒకసారి నూకల చిన సత్యనారాయణగారు ’నౌకాచరితం’ హైదరాబాదు అమృతవాణి స్టూడియోలో గోపాలరత్నం చేతనే రికార్డు చేయించారు. ఇందులోని ’తనయందే ప్రేమ’ అనే కృతిని నలుగురు గోపికలకు నలుగురు పాడాలి. అందులో ఒకరు శ్రీరంగంగారు కాని రికార్డు అయిన తరువాత మిగతా ముగ్ఘురూ ఆమె స్థాయిలో పాడకపోవడంతో నూకలగారు పూర్తిపాతను ఆమె చేతనే పాడించారు.

ఇక మీరాబాయి సంగీత నాటకంలో గోపాలరత్నం సాక్షాత్తూ మీరాబాయితో తాదాత్మ్యం పొందిందా అన్పిస్తుంది. ఈమె ’బికారి రాముడు’ చిత్రంలో పాడిన నిదురమ్మా కదలి వేగమె రావమ్మా, శ్రీ వేంకటేశ్వర వైభవంలో " ఒక పిలుపులో పిలచితే పలుకుతావట" పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

ఈమె ఎంతో ఉన్నతమైన పదవులను నిర్వహించారు. 1969లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిక నియమించబడ్దారు. అప్పటికి ఆమె వయసు 30 సంవత్స్రరాలే. వెలుగు చూడని ఎన్నో అన్నమాచార్యకీర్తనలను స్వరపరిచారు 1977లో హైదరాబాద్ సంగీత కలాశాల ప్రిన్సిపల్గా నియమించబడ్డారు. 1979-80లో విజయనగరం కాలేజీ ప్రిన్సిపల్ గా నియమించబడ్డారు. తరువాత సికింద్రాబాద్ కాలేజీకి, తెలుగు విశ్వవిద్యలయంలో డీన్ గాను పనిచేసి తిరిగి హైదరాబాద్ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళి కచ్చేరీలు నిర్వహించారు. 1985 వ సంవత్సరంలో ఆంధ్రరాష్రావతరణ సందర్భ్హంగా ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుగారిచే సన్మానించబడ్ఛారు. 1992లో ’పద్మశ్రీ’ బిరుదు పొందారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ సంగీత విదుషి, గానకోకిల, సంగీత కళానిధి, సంగీత రత్న, ఆంధ్ర నైటింగేల్, గాంధర్వ కళానిధి, మధురగాయని మొదలగు బిరుదులు పొందారు.

గోపాలరత్నం గారిది ప్రత్యేకమైన బాణి. శ్రుతి శుధ్హత, స్వర శుధ్దత, స్పష్టమైన లయ, స్పష్టమైన ఉచ్చారణ వీరి సంగీతానికి పునాదులు. కొన్ని సందర్భ్హంలో వీరి గాత్రం ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి గారి గాత్రాన్నిపోలి ఉంటుంది. అటు కర్ణాటక సంగీతాన్ని గాని ఇటు భావగీతాలను గాని, జానపదసంగీతాన్ని కాని, భ్హక్తి సంగీతంగాని ఏదైనా, సునిశితంగా ఆయాశాఖలకు పూర్తి న్యాయాన్ని చేకూరుస్తూ సాగుతుంది ఈమె గాత్రం. మనోధర్మశాఖలైన రాగ, ఆలాపన, నెఱవు, స్వరకల్పన చేయడంలో వీరికి వీరె సాటి. వీరు పాడిన అనేక కచ్చేరీలలో విలక్షణమైన మనోధర్మాన్ని వినగల్గుతాము.

గోపాలరత్నంగారు స్వరపరచిన కొన్ని అన్నమాచార్యకీర్తనలు,

1. నల్లని మేని నగవుచూపులవాడు - పూర్వీ కల్యాణి - ఆది
2. ఏమని పొగడుదు ఇట్టినీ గుణమును - అఠాణ్ - ఆది
3. అలమేలు మంగ నీ అభినవ రూపము - కల్యాణి - ఆది
4. ఇద్దరి తమకము ఇటువలెనే - సురటి - ఆది
5. ఎవ్వడెరుగును నీ ఎత్తులు - మోహన - ఆది
6. నాలమ్ వా - బృందావని - ఆది
7. నమొ నారాయణ - కాపీ - ఆది
8. సకలమ్ హే సఖి - సింధుభైరవి - ఆది
9. ఇందిరా రమణ - మోహన
10. వేదన పొరలే - శహన
11.ఇందుడన నీకెడలేదు - సారంగ
12. తోరణములే తోవెల్ల - శహన -
13. ఇందిరా నామము - హంసానంది
14. అనరాదు వినరాదు - ఆరభ
15. ఇతడే పరబ్రహ్మ- శుద్ద సావీరి
16. పట్టిల్ పంతం - బేగడ

మీరా భజనలు

1. హరి మేరే జీవన ప్రాణ్ ఆధార్
2. రామనామ రస్ పీజే మనువా
3. రామనామ మేరే మన్
4. గోవర్ధన గిరిధారీ
5. ప్యారేజే
6. మైతో గిరిధార్ కీ ఘర్
7. బసో మేరే నయనన్ మే నందలాల
8.యే మేరా మన్మోహన్
9. మేరే లాగీ లగన్
10. రాధికా తవ విరహేకేశవా - అష్టపది.

పై విషయాలను హైదరాబాదుకు చెందిన తులసమ్మ గారి ద్వారా సేకరించడం జరిగింది.

1. తులసమ్మ గారి అమ్మాయి రమణశ్రీ శ్రీరంగంగారి దగ్గర నేర్చుకున్నారు. వారు పాడిన అనేక కచేరీలను వీరు భద్రపరిచారు. శ్రీరంగం గారు వాయించిన వీణ, రెండు తంబూరాలు శ్రీరంగంగారి మరణానంతరం వీరికి ఇవ్వబడ్డాయి. అవి ఇప్పటికీ, వారి దగ్గరే ఉన్నాయి. ఈవిడ చెప్పిన దానిని బట్టి గోపాలరత్నంగారు చాలా మీరా భజనలు కూడా స్వరపరిచారని, వాటిని విని ప్రముఖ హిందీ గాయని ఆశాభోంస్లే వీటిలో కొన్నిటిని నేర్చుకున్నారని శ్రీరంగంగారు స్వయంగా తులసమ్మగారితో చెప్పారట. తెలుగులో మీరా భజనలను కూడా వీరు పాడారు. సఖియా, నిదురన్నది ఎరుగలేనిది, "వలపుసోకనే" మొదలగునవి. ఇవి విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి వనితావాణి కార్యక్రమాలలో ప్రసారం అయ్యేవి. ఇంకా పువ్వులా ఈ జీవితం, ఏమని పాడితివో గోపాల, మబ్బులు ఏవో మాట, ఎటు నుంటివో ప్రియ మొదలగు భావగీతాలను ఆవిడ చాలా బాగా పాడేవారట.

ఈ విధంగా ఎన్నో పదవులను అలంకరించి, అనేక ప్రభుత్వ అవార్డులు, బిరుదులు పొంది సంగీతాన్నే తన ఊపిరిగా జీవితాన్ని పంచుకున్న శ్రీరంగం గోపాలరత్నంగారు దురదృష్టవశాత్తూ అతిచిన్నతనంలో తన 54వ ఏట 1993, మార్చి 16న అకాలమరణం పొందారు. కానీ సంగీత ప్రియులకూ, రసికులకు ఆమె చిరంజీవియే.

ఉపయుక్త గ్రంధసూచి

1. నా సంగీత యాత్ర. సంగీత కళానిధి డా. శ్రీపాదపినాకపాణి, ఇంటి నెం-40/806, ఫ్లోర్ - 1 శ్రీనివాసనగర్, కర్నూలు - 518004.
2. శ్రీరంగం గోపాలరత్నం. Wikiepedia
3. శ్రీరంగం గోపాలరత్నం. Youtube
4. Annamacharya Kirtanas (realandid) by T.T.D.
5. Material from sri. Modumudi Sudhakar, Vocalist, AIR, Vijayawada.
6. మండపాక శ్రీదేవిగారు విశాఖ పట్నం, వీణ ఆర్టిస్టు పంపిన కొన్ని రికార్డింగులు.
7. Telephone Interviews

శ్రీరంగం గోపాలరత్నం - 1977 ముందు కచ్చేరీలు

శ్రీ చీమ త్రిదండం - నెట్లో భద్రపరిచారు.
1. సావేరి - సరసుడ - వర్ణం
2. మహాగణపతిం - నాట - దీక్షితర్
3. బంటురీతి కొలువు - హంసానాదం అది
4. మనసులోని మర్మము - హిందోళ - అది
5. సద్భక్తి - ఆనందభైరవి - రూపక
6. బాగాయెనయ్య - చంద్రజ్యోతి - అది
7. సొగసుగా - శ్రీరంజని - రూపక
8. వరదరాజ, సారంగ -
9. దేవినీయే - కీరవాణి -
10. ఎన్నగ మనసుకు రాని - నీలాంబరి -
11. ధీరసమీరే - ధిల్లాంగ్ - అష్టపది
12. నాలమ్వా - బృందావనసారంగ - అన్నమయ్య
13. ఒక పిలుపులో -
14. ఖండగుహ - షణ్ముఖప్రియ
15. బలోమేరే - భజన్ - మిశ్రకాపీ
16. మోహమెల్ల - మోహన
17. పతికి హారతి - మంగళం - సురటి.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)