హుద్-హుద్

హుద్ హుద్ తుఫాను – ఓదార్పు (కవిత)


- ‘విద్వాన్’ విజయలక్ష్మి.రాచకొండ.


కారు మేఘములు కాల సర్పములై

ఉరుముల మెరుపుల ఆర్భాటమ్ముల

ప్రళయ గర్జనలు ఫూత్కారములై

వరుణుడు వాయువు విజ్రుంభించగ

అంతరిక్షమే జలనిధి తాకగ

విజ్రుంభించెను అంబుధి అలలతో

విరుచుకు పడెను హుద్ హుద్ తుఫాను

విధ్వంసమాయెను విశాఖ నగరి

ఫెళ ఫెళ విరిగెను చెట్లెల్లెడల

కూకటి వేళ్ళతో కూలిపోయెను

చీకటి నిండెను ప్రతియింట

జలమయమాయను ప్రతి గడప

కన్నుల కాంతులు నీట గలిసెను

వెల వెల బోయెను విశాఖ సొబగులు

కూడు గుడ్డ నీరు కరవై

విల విల లాడెను ప్రజానీకము

పాలు లేక వెలుగు లేక

వల వల ఏడ్చిరి పసి పాపలు

మేడలు మిద్దెలు పూరి గుడిసెలు

చెట్టు చేమ జంతు సంతతి

పిల్లలు పెద్దలు బడుగు జీవులు

గడ గడ వణికిరి పెను తుఫానులో ( అప్పుడు)

అభయమిచ్చెను అప్పన్న స్వామి

కరుణ జూపెను కనక మహాలక్ష్మి

ఆడుకొనెను కైలాసగిరీశ్వరుడు

కలుగలేదు ప్రాణ నష్టం

సజ్జన హృదయం స్పందించెనులే

తక్షణ సాయం అందించెనులే

ప్రభుతసైతం కదలి వచ్చెను

మేమున్నామని ధైర్యమిచ్చెను

కడగండ్లిక తీరునులే

కన్నుల కాంతులు నిండునులే

పడిలేచే కెరటంలా ప్రతి హృదయం ఉప్పొంగునులే

నరునికే కష్టం అరయమురా!

చిత్తము స్ధిరముగ నుంచుమురా!

రేపటి సుఖమును తలచుమురా!

దైవమునెప్పుడు మరవకురా

కష్టాల కడలినీదుమురా!

వెలుగుల తీరం చేరుమురా!

శ్రీ హరి చరణమే శరణమురా!

అందరు సుఖముగ ఉందమురా!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)