అనగనగా ఓ కథ

అల్లుడు

- యఱ్ఱం శెట్టి శాయి


సీతారామయ్యగారింట్లో, వీధివేపు గదిలో ఓ చాకులాంటి కుఱ్ఱాడు అద్దెకు దిగాడన్న విషయం ఆ వీధంతా వ్యాపించిపోయింది. ఆ వార్త విని కండువా అయినా భుజాన వేసుకోకుండా నాలుగో ఇంటి శివనాధం పెద్ద పనున్నట్లు ఆ గది ముందునుంచి అటూ ఇటూ తిరిగి కుఱ్ఱాడిని ఎక్స్రే తీసినట్లు చూసి తబ్బిబ్బయిపోయాడు.
"అబ్బ! ఏమందం? ఏమందం? అచ్చం సినిమా యాక్టర్లా ఉన్నాడనుకో!

యమపర్సనాలిటి!......అహాహా.... ఓహోహో..." అన్నాడు పెళ్ళాంతో "ఉద్యోగం ఏమిటో?" ఆరాగా అడింగింది ఆయన భార్యారత్నం.

"ఏదో మంచి ఉద్యోగమే అయ్యుంటుంది. గదిలో చాలా ఖరీదయిన సామాన్లు కనిపించినయి. పెద్ద రేడియో, గదంతా హాంగర్లకి వేలాడుతున్న ఖరీదయిన బట్టలూ-ఓ టేబులూ, కుర్చీ-చాలా హడావుడిగానే ఉన్నాళ్ళే...."

"మరి అలాంటప్పుడు...కులమేమిటో కనుక్కొని...ఒకవేళ పెళ్ళవకపోతే మన అమ్మాయికి చూడరాదుటండీ?...."

"అవన్నీ కూడా కనుక్కొన్నాలేవోయ్-వీధి ముదట్లో ఉన్న కిల్లీకొట్లో, సిగిరెట్లు కొనేప్పుడు వాడికి చెప్పాట్ట-తన దసలు విశాఖపట్నం అనీ-ఇంకా వివాహం కాలేదనీ...ఇక కులమంతావూ మన కులంవాళ్ళకి తప్పితే మరొకరిది గది అద్దెకివ్వడుగా సీతారామయ్య..."

"మరింకేం త్వరగా మాట్లాడండి లేకపోతే ఆ సీతారామయ్య గాలాం వేసేయగలడు, వాడి కూతురుకోసం..." రహస్యంగా అందావిడ.

"నాకు తెలుసులేవే బాబూ!...నేనూ ఆ ప్రయత్నంలోనే ఉన్నాగా! ఈలోగా మనమ్మాయికి మంచి చీరా అదీ కట్టి రెండు మూడు సార్లు, ఆ కుఱ్ఱాడున్న టైములో సీతారామయ్య ఇంటి

-----------------------

ఆ రాత్రి భోజనాలయినాక వీధిలోకొచ్చి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఓ కన్ను గదివేపే పడేశాడు శివనాధం ఆ కుఱ్ఱాడు గదిలో కూర్చుని రేడియో వింటూ ఏదో పత్రిక చదువుకొంటున్నాడు. కుఱ్ఱాడిని చూస్తున్నకొద్దీ ముచ్చట పుట్టుకొస్తోంది శివనాధానికి. తన కూతురు శారదకు సరైనజోడు చిలకా గోరింకల్లా ఉంటారు.

"గురువుగారు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు!..." నవ్వుతూ అన్నాడు ఎదురింటి లింగమూర్తి భుజాన్న తుండు వేసుకొని వీధిలోకొస్తూ.

"ఆ! ఏముంటుందీ? భోజనాలయినాయా?" అడిగాడు శివనాధం.

"ఇప్పుడే ముగించాం! అది సరేగాని సీతారామయ్య ఇంట్లో ఓ కుఱ్ఱాడు అద్దెకు దిగాడు చూశావా?"

"ఎప్పుడు! నాకు తెలీదే?" ఏమీ ఎరగనట్లు అబద్దమాడేశాడు శివనాధం.

"ఎప్పుడో, ఏమో నాకు తెలీదుగానీ, ఇందాక ఆఫీసునుంచి వస్తూ చూశాను..."

"అలాగా..." చాలా మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ అన్నాడు శివనాథం.. నాకు అనుమానమేమిటంటే- సీతారామయ్య ఏ ఉద్దేశ్యమూ లేకుండా ఆ కుఱ్ఱాడికి గది అద్దెకివ్వడని!...

" ఏ మంటావ్?"

శివనాధం ఆశ్చర్యం నటిస్తూ లింగమూర్తివంక చూశాడు.

"ఏమై ఉంటుందంటావ్ వాడి ప్లాను?"

"ఇంకేముంటుందోయ్! ఎఱ్ఱగా, బుఱ్ఱగా వాడి కూతురు ఈ కుఱ్ఱాడిముందు తిరుగుతూ కనబడితే, అమాంతం ’లవ్’ చేసి, దమ్మిడీ కట్నం లేకుండా చేసుకొంటాడేమోనని..."

"అవునవును! వాడికలాంటి ఆలోచనలు చాలా వున్నాయి. నీ అనుమానం నిజమే అయుండుచ్చు..."

"నిజమేనేమిటి నా శ్రాద్దం! నిజం ................ న్నరా! రాసిస్తానలా అని! అయినా నాకు తెలీకడుగుతాను, వాడికదేం బుద్దోయ్! చుట్టూ పెద్దమనుషుల ఇళ్ళు పెట్టుకొని, మధ్యలో ఈ తందనాలు! ఆ కుఱ్ఱవెధవ, గదిలో దిగి ఎంత సేపైందంటావ్? మహా అయితే ఒక రోజు! అవునా? మరా సీతారామయ్యగాడి పెద్ద కూతురు, వాడితో మహా చనువున్నట్లు-వాడు ఇంట్లో మనిషయినట్లు, వసారాలో నిలబడి, వాడు చూస్తూండగా "నువ్వూ-నేనూ ఏకమైనాము..."అని సినిమా పాట పాడుతోంది...

"అవ్వ..." నోరు నొక్కు కున్నాడు శివనాధం.

లింగమూర్తి మరి కాసేపు సీతారామయ్య చేష్టల్ని తిట్టిపోసి, అమాయకుడైన ఆ కుఱ్ఱాడిమీద జాలిపడి-నిద్రొస్తోందని ఇంట్లో కెళ్ళిపోయాడు.

అతనితో మాట్లాడింది చాలావరకూ నిరుపయోగమయినా, కొంతవరకు ముఖ్యమయిన సమాచారం శివనాధానికి దొరికిపోయింది. సీతారామయ్యే కాకుండా అతని కూతురు స్వయంగాకూడా ఆ కుఱ్ఱాడిని వలలో వేసుకోడానికి ప్రయత్నిస్తోంది. అంతేగాక అంతకంటె ముఖ్యమయిన విషయం ఏమిటంటే లింగమూర్తి కన్ను
కూడా ఆ కుఱ్ఱాడి మీద పడింది. ఇక తను వాయువేగంతో పనులు పూర్తిచేసుకోపోతే ఆ అవకాశం కాస్తా వాళ్ళిద్దరిలొ ఎవరొహళ్ళు తన్నుకు పోతారు.

సీతారామయ్య కూతురు కొంతవరకు నయం " నవ్వూ-నేనూ ఏకమైనాము..." అన్న పాటల్తోనే సరిపుచ్చుకుంటోంది. లింగమూర్తి కూతురైతే ఏకంగా ఆకుఱ్ఱాడితో ఏకమయిపోతుంది-రెండో కంటికి తెలీకుండా! ఆ పిల్ల సంగతెవరకు తెలీదని? హైస్కూల్లో కొత్తగా చేరిన సైన్స్ టీచర్ తో సరుగుడు తోటలోంచి బయటికొస్తూ కనిపించలేదూ? ఊరందరకూ తెలుసా హరికథ! సిగ్గులేని వెధవ! అక్కడికి వీడో పెద్ద పతివ్రతయినట్లు సీతారామయ్యను తిడుతున్నాడు; ఇద్దరికిద్దరే-కక్కుర్తి సన్యాసులు తిట్టుకొంటూ ఇంట్లోకి నడిచాడు శివనాధం.

ఆ రాత్రంతా నిద్రపోకుండా ’టీ’ డికాషన్ తాగి మరీ ఆలోచించాడు శివనాధం. ఆ కుఱ్ఱాడితో మాట్లాడటం ఎలా? వాళ్ళిద్దరూ ’నీ చుట్టూ వల పన్నేస్తున్నార్రా నాయినా!’ అని తెలియ జెయ్యడం ఎలా? పరువు ప్రతిష్టలు గల కుటుంబం, ఈ వీధిలో మా దొఖ్ఖటేరా బాబూ అని ఋజువుచేయడం ఎలా - ఇవే ఆలోచనలు! మరోమూల అతని భార్యారత్నం కూడా నిద్రలేకుండా ఇలాంటి ఆలోచనల్తోనే సతమతమయిపోతోంది. ఆ కుఱ్ఱాణ్ణి ఇంటికి, ఏదో నెపంమీద పిలవాలి. పిలిచి సీతారామయ్యమీదా, అతని కూతురుమీదా ఉన్నవీ-లేనివీ చెప్పాలి. ఆనక అతని భార్య గయ్యాళితనం గురించి నచ్చ జెప్పాలి.

భళ్ళున తెల్లారిపోయింది.

"సరే...కాసేపు వసంత దగ్గరే ఉంటాను! ఇంట్లో ఏమీ తోచటం లేదు..." అంది అక్కడే కుర్చీలో కూలబడుతూ.

"వసంతా! పోనీ నువ్వే వెళ్ళి కాసేపు వాళ్ళింట్లోనే కూర్చుని మాట్లాడుకోగూడదు?" అందామె తల్లి.

"నే నిప్పుడు వెళ్ళనే అమ్మా! నాకు చాలా పనుంది! నువ్వెళ్ళవే హైమా! నాకు తీరిక దొరికినప్పుడు నేనే వస్తాలే-వువ్వు రాకిక్కడకు..." అంది ఆప్యాయత నటిస్తూ

’తప్పకుండ రానోయ్! మనం మాట్లాడుకొని చాలా రోజులయింది...’ అంది  హైమావతి బయటకు నడవలేక నడుస్తూ.

వసంత ఆమెను సాగనంపటానికి గేటువరకూ వచ్చింది.

అక్కడ పూలుపూసిన చామంతి మొక్కను చూసేవంకతో నిలబడి ఆ గదిలో కుఱ్ఱాడితో చూపులు కలిపి "ఈ మొక్క చాలా పూలుపూసిందే!" అంది హైమావతి.

"అదెప్పుడూ అంతే--" విసుగ్గా అంది వసంత.

"వస్తా! మళ్ళొస్తా..." అని సినిమా పాటలా అని వీలయినంత అందంగా నవ్వుతూ ఆ గదివేపు చూసి, ఆ కుఱ్ఱాడికే కనిపించేట్లు చేయి ఊపుతూ ’టాటా’ అని బయల్దేరింది హైమావతి.

వసంత ఉక్రోషంతో రగిలిపోయింది.

’వఠ్ఠి బేవార్స్ రక౦!...’ అనుకొని మొఖమంతా చిరునవ్వు పులుముకొని గేటుదగ్గరే నిలబడి గదిలో కుఱ్ఱాడి వంక చూపులు విసుర్తూ "నువ్వూ-నేనూ ఏ క మై నా ము..."

అంటూ ట్యూన్ తో సహా అంటోంది ఉండుండి. పదవుతోండగా శివనాధం వీధి చివరి కిళ్ళీకొట్టుదగ్గర నిలబడి, ఎప్పుడూలేంది ఓ మిఠాయి కిళ్ళీని నమలసాగాడు. అతని చూపులు మాత్రం సీతారామయ్య ఇంటివేపే ఉన్నాయి. సరిగ్గా పదయింతర్వాత ఆ గదిలోని కుఱ్ఱాడు టిప్ టాప్ గా ముస్తాబయి చేతిలో ఓ లెదర్ బాగ్ తో బయటి కొచ్చాడు. శివనాధం సర్దుకొని నిలబడ్డాడు ’ఎటెన్షన్’ పొజిషన్లో.

అతని సరాసరి కిళ్ళీకొట్టు దగ్గర కొచ్చి ’ఓ పాకెట్ గోల్డ్ ఫ్లాక్’ అన్నాడు పదిరూపాయల నోటు విసిరేస్తూ.

అబ్బో! అబ్బో! చాలా డబ్బున్న వాడిలానే ఉన్నాడు...’ అనుకొన్నాడు లోపల్లోపల కిళ్ళీకొట్టువాడు పాకెట్ - చిల్లరా అందించా డతనికి ఓ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని జేబులోనుంచి
లైటర్ తీసి వెలిగించి నెమ్మదిగా ముందుకి నడిచాడు.

"మీరు...సీతారామయ్య గారింట్లో అద్దెకుంటున్నట్లున్నారు..." అతన్తో పాటు అడుగులువేస్తూ అన్నాడు శివనాధం.

"అవునండీ" నమ్రతగా అన్నాడు కుఱ్ఱాడు.

"మరేంలేదు. ఈ వీధిలో కొత్తగా కనిపిస్తుంటేనూ-అనుమానం వచ్చింది. నా పేరు శివనాధం-మీ గదికి నాలుగిళ్ళవతలే మా ఇల్లు! మీ పేరేమిటన్నారు?"

"చంద్రకాంత్..." అన్నాడతను ముక్తసరిగా.

’అలాగా! చాలా సంతోషం!- స్వగ్రామం ఏది?"

"విశాఖపట్నం అనుకోండి! కాని మా వాళ్ళంతా హైద్రాబాద్ లోనే స్థిరపడి పోయారు..."

"ఊహు!....ఇక్కడకు బదిలీమీద వచ్చారేమిటి?"

"అబ్బే? కాదండీ! మా కంపెనీవాళ్ళు ఈ ఊళ్ళో ఒక బ్రాంచీ పెట్టాలనుకొన్నారు. అందుకని సర్వేచెయ్యడానికి నన్ను పంపించారన్నమాట. బహుశా ఇక్కడ నేనే మానేజరుగా ఉండాలి కొంతకాలంపాటు..."

’అబ్బా!’ అనుకొన్నాడు శివనాధం "ఏం కంపెనీ అండీ మీది?"

’ఎ-టు-జెడ్ డీలర్స్’ అనీ, మా కంపెనీ ’డీల్’ చెయ్యని వస్తువంటూ లేదనుకోండీ! ఉత్తర హిందూస్థనంలో ఇప్పుడు మా కంపెనీయే లీడింగ్ లో ఉంది. గుండుసూదు ల్దగ్గరినుమ్చీ, ట్రాక్టర్లవరకూ అన్ని వస్తువులూ డీల్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజినెస్ విస్తరింపచేయాలని వాళ్ళ ప్రయత్నం. ఇంతకూ మీ రెక్కడ పని చేస్తున్నారు?..."

"తాలూకాఫీసులో గుమస్తాగా ఉంటున్నాను లెండి-ఏదో ఒక ఉద్యోగం-జీతం బత్తాలు సరిగ్గా లేకపోయినా ఉన్న ఊళ్ళో ఉద్యోగం ’మంచిద’ని ఉండి పోయాను..."

"అవునవును...అదే మంచిదండీ బాబూ! నా పరిస్థితి చూడండి! నెలకు తొమ్మిదొందలు సంపాయిస్తున్నాను. ఏం లాభం? సొంతూళ్ళో ఉన్న సుఖం వేరు..."

"అమ్మో! తొమ్మి దొందలే..." లోపల్లోపలే గుండెలు బాదుకొన్నంత పనిచేశాడు శివనాధం.

"అవునవును!" అన్నాడు పైకి.

ఇద్దరూ మాట్లాడుకొంటూనే మెయిన్ రోడ్ దగ్గర కొచ్చేశారు.

"సరే ఉంటాను!..." అన్నాడు చంద్రకాంత్.

"మంచిదండీ... రోజూ కల్సుకొంటూనే ఉంటాంగదా ఇక..." అన్నాడు శినాధం నవ్వుతూ.

"అవునవును..." అన్నాడు చంద్రకాంత్ కూడా నవ్వుతూ.

ఆ మర్నాడు చంద్రకాంత్ బయల్దేరే సమయానికి అదే కిళ్ళీకొట్టుదగ్గర కలుసుకొన్నాడు శివనాధం.

"ఇవాళ ఎటువేపు వెల్తున్నారేమిటి?" అడిగాడు శివనాధం నమ్రతగా

"ఇంకా డిసైడ్ చేసుకోలేదండీ! మార్కెట్ ప్రాంతం సర్వే ఇంకా పూర్తి కాలేదు ... అటే వెళ్ళాలనుకొంటున్నాను..."

"మరింకేం-నేనూ అటే వస్తున్నాను పదండి..." అన్నాడు శివనాధం.

ఇద్దరూ నెమ్మదిగా నడిచి మెయిన్ రోడ్ మీదకు చేరుకొన్నారు. ఖాళీగా వెళ్తున్న రిక్షా పిలిచాడు చంద్రకాంత్.

"కూర్చోండి!" అన్నాడు శివనాధాన్ని చూస్తూ.

"బేరమాడకుండానే?’ ఆశ్చర్యంగా అడిగాడు శివనాధం.

"ఆ! ఎంతోకంత కంపెనీ మాకు జీతం కాకుండా ఇలాంటి తిరుగుడు కోసమని రోజుకి పద్దెనిమిది రూపాయలిస్తుంది..."

అబ్బా! లోలోపలే గుండెలు బాదుకొన్నాడు శివనాధం. తొమ్మిదొందలు జీతంకాక ఇంకా రోజుకి పద్దెనిమిది రూపాయలా! బాబోయ్ ఎంత సంపాదన!
ఎంత సంపాదన.

రిక్షా నెమ్మదిగా పోతోంది.

"చూడండి! మిమ్మల్ని చూస్తూంటే ఎంచేతో ఆప్తుల్ని చూసినట్లుంది. పాపం అందరికీ దూరంగా-ఆ పాడుహోటల్ కూడు తింటూ-ఎలా వుంటున్నారో ఏమో! ---- మీ కేమీ అభ్యంతరం లేకపోతే రాత్రికి మా ఇంటికి భోజనానికి రండి..."

"ఎందుకండీ - మీకు శ్రమ..." నవ్వుతూ అన్నాడతను.

"అహహ! అలా అనకండి! చెప్పానుకదా! ఒకో మనిషినిచూస్తే అలా అభిమానం కలుగుతుంది! మాది చాలా పెద్ద వంశం లెండి! ఎంతో పేరు ప్రఖ్యాతులున్నయ్. అసలు మాకు సరి పడేవాళ్ళు మా వీధిలో ఎవ్వరూ లేరు. అయినాగాని, అంతకంటె మంచి ప్రాంతం దొరక్క అక్కడ ఉండి పోయాం! ..."

"మీ ఇష్టం! మీరంతగా పట్టుపడుతూంటే కాదనలేను. కాని ఓ చిన్న రిక్వెస్ట్! నా కోసం స్పెషల్గా ఏమీ చెయ్యకండి! మీతోపాటూ నేనూనూ! నన్ను ఓ చుట్టంలా కాకుండా మీ ఇంట్లో ఒకడిగా చూడండి. అంతే నేను కోరుకొనేది...."

"అమ్మమ్మమ్మ! ఎంత మాట! మిమ్మల్ని బయటివారిలా ఎలా చూస్తాము? అలా అనుకొంటే అసలు మీదగ్గరకే రాను!..."

మార్కెట్లో ఆగింది రిక్షా తను ముందుగా దిగి డబ్బులిచ్చేశాడు చంద్రకాంత్.

"అరెరె! మీ రెందుకిస్తున్నారు? నేను ఇచ్చేవాడినిగదా..." అన్నాడు ఇబ్బందిపడిపోయినట్లు నటిస్తూ.

"ఫరవాలేదు లెండి! ఎవరిస్తే ఏముందీ? మనలో మనకి..."

"ఔనౌను... అది నిజవే ననుకోండి... మరి నేను శెలవు తీసుకోనా?-సాయంత్రం ఏడుగంటలకల్లా ఇంటికి రాగలరా?"

"ఓ! వస్తాను..."

"మరో చిన్న విషయం..." అంటూ అతని చెవిదగ్గరగా జరిగాడు శివనాధం.

"ఏమిటి?"

"మీరిలా మా ఇంటికి భోజనానికొస్తున్న సంగతి సీతారామయ్య కేమాత్రం తెలీనీకండి! వాడసలే వఠ్ఠి బేవార్స్ రకం...ఏవో లేనిపోనివి వాగుతాడు..."

"అలాగే...అలాగే..." నవ్వుతూ అన్నాడతను.

శివనాధం సరాసరి ఆఫీసుకెళ్ళి ఆ రోజు కాజువల్ లీవ్ పెట్టేసి ఇంటికి చేరుకొన్నాడు.

"ఏమిటిప్పుడే వచ్చేశారు?" అందాయన భార్య.

"ఏముందీ?--- మన పంట పండబోతోంది. ఆ కుర్రాడు సాయంత్రం మనింటికి భోజనానికి రావడానికి వప్పుకొన్నాడు..."

"నిజంగానేనా?"

"నూరుపాళ్ళూనూ! మనమంటే ఏమనుకొన్నావే!-నువ్వుమాత్రం ఓ పనిచెయ్! అమ్మాయిని కొంచెం బాగా అలంకరించి మా ఇద్దరికీ అన్నం వడ్డించడానికి నియోగించు! తెల్సిందా? నువ్వు కూడా అతివాగుడు వాక్కుండా-జాగ్రత్తగా వళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు!..."

"అవును-మాట్లాడ్డం ఇక ఇప్పుడు నేర్చుకోవాలి-నేను..." కోపంగా అందామె.

"అబ్బబ్బ! అదికాదే-అలాకోప్పడకు మరి-అబ్బాయి కొంచెం మితభాషి లాగున్నాడు. అందుకనే నీకింత గట్టిగా నొక్కి చెప్త..." సర్ది చెప్పుకొన్నాడు శివనాధం

"సాయంత్రం ఆరింటికల్లా వంట పూర్తయింది. నాలుగురకాల స్వీట్లు, హాట్లు తయారయినయ్. శివనాధం ఆరున్నరనుంచే వీధిలో నుంచుని ఎదురు చూడసాగాడు.
శివనాధం కూతురు హైమావతి ఝూమ్మని అలంకరించుకొని ఇంకా ఏమేమో చూసుకొంటూ అద్దంముందు కూర్చుంది.

ఏడు గంటలకు లింగమూర్తి శివనాధం ఇంటివేపు వచ్చేడు. శివనాధానికి వళ్ళు మండిపోయింది.

ఈ వెధవ ఈ సమయానికే తగలడాలా? ఆ కుర్రాడు భోజనాని కొచ్చే సమయమయింది ఓ పక్క! ఈ సంగతి వీడికి తెలిసిందంటే ఊరంతా మార్మోగించేస్తాడు, అనుకొన్నాడు.

"ఏమిటి శివనాధంగారూ! ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లున్నారు?"

"ఆ ఏముంది! తల నొప్పిగా ఉంటేనూ కాసేపలా తిరిగి ఇంట్లో కెళ్తున్నాను-ఇక వెళ్తాను."


"అబ్బ--ఆ మ్మ--తలనొప్పి--ఛంపేస్తోంది..." అంటూ ఇంట్లోకి నడువబోయాడు.

"అరె! నా దగ్గర హోమియోపతి మందుంది... తెమ్మంటారా?" అడిగాడు లింగమూర్తి.

"అబ్బే! ఏమీ అవసరంలేదు కాసేపు నిద్రపోయిలేస్తే అదే సర్దుకొంటుంది... వస్తాను..." అంటూ లోనికి నడిచాడతను శివనాధం ప్రవర్తన ఎంచేతో లింగమూర్తికి అనుమానం
కలిగించింది. అందుకని ఓ కన్ను శివనాధం ఇంటివేపే పడేసి వీధిలో కాపలా మొదలెట్టాడు.

సరిగ్గా ఏడున్నరకి చంద్రకాంత్ నెమ్మదిగా శివనాధం ఇంట్లోకి నడవడం-శివనాధం స్వయంగా బయటి కొచ్చి అతన్ని లోనికి ఆహ్వానించడం గమనించాడు లింగమూర్తి.

"అమ్మ రాస్కెల్ - తల్నొప్పి అని వంకబెట్టి, తనను వదిలిచుకొంది-ఇందుకా?" అనుకొని మండిపడ్డాడు.

"నా దగ్గర నా మాటలు చెప్పి-ఆ కుర్రాడిని తన కూతురికి కట్టెయ్యాలని ప్లానేస్తున్నాడు కాబోలు! నా కంఠంలో ప్రాణముండగా ఆ పెళ్ళి జరుగనీను-" అనుకొని భార్యతో
రహస్య సమావేశం వెంటనే జరిపాడు.

శివనాధం ఇంట్లో చంద్రకాంత్ కి హేమలత ప్రతి నిమిషానికి ఓసారి స్నోపౌడరూ అద్దుకుంటూ భోజనం వడ్డిస్తోంది. శివనాధం భర్య మెల్లగా చంద్రకాంత్ ని సంభాషణలోకి
దించి వాళ్ళ వాళ్ళకీ-తమకీ - పదితరలముందు చుట్టరికం ఉన్నట్లు ఋజువులు చూపించింది. "అయితే నువ్వింకా కుర్రాడివి, అంచేత ఆ విషయాలు నీ కంతగా తెలీదంది" చంద్రకాంత్ వప్పుకొన్నాడు.

హేమలత ఆ కుర్రాడిని "ఇంకేంకావాలండీ?" అనడగడం చూసి "అండీ ఏమిటే పిచ్చిదానా! బావా అనలేవూ? ఆ మాత్రం వరుస తెలీదా?" అంటూ కోప్పడిందామె.

దాంతో హేమలత సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉండుండి అవసరమున్నాలేకపోయినా ’బావా’ అనడం మొదలు పెట్టింది.

ఇది జరిగిన రెండుమూడు రోజులకు చంద్రకాంత్ లింగమూర్తి ఇంట్లో భోజనానికి వెళ్ళడం సీతారామయ్య కంటబడింది ఇది ఆయన ఏమాత్రం సహించలేకపోయాడు.

మర్నాడే చంద్రకాంత్ ని కలుసుకొని "ఆ చూడల్లుడూ! మీ అత్తయ్య ఒకటే గొడవచేస్తోంది. నువ్వలా అడ్డమైనచోటా తిని ఆరోగ్యం చెడగొట్టుకొంటున్నావట! అందుకని ఇవాళ్టినుంచీ మా ఇంట్లోనే భోజనం వగైరాలన్నీ చేయమని చెప్పింది. అంచేత నువ్వింక బయటెక్కడా తినకు! ఎంతాలస్యమైనాసరే తిన్నగా ఇంటికి వచ్చేసెయ్" అన్నాడు.

"ఆ! ఎందుకండీ! మీకు శ్రమ!" అన్నాడు చంద్రకాంత్.

తలుపు వెనుకనుంచి సీతారామయ్య భార్యగొంతు ఖంగునమోగింది. "శ్రమేమిటి నాయనా! అయినవాళ్ళకి ఆ మాత్రం చేసుకోలేమేమిటి? అయినా నువేమయినా బయటివాడవా
ఏమన్నానా?"

మూడు నెలలు గడిచిపోయినయ్. ఈలోగా  చంద్రకాంత్ కంపెనీవాళ్ళు సమయానికి అతని జీతం పంపలేకపోవడంవల్ల సీతారామయ్య,  లింగమూర్తి, శివనాధం
తలో అయిదొందలూ ఒకరికి తెలీకుండా ఒకరు అతనికి అప్పుకూడా ఇచ్చారు.

"చెక్కురాగానే...మీ డబ్బు మీకిచ్చేస్తాను..." అన్నాడు చంద్రకాంత్.

భలేవాడివేలే! పెద్ద మునిగిపోయిందేమిటిందులో!" అంటూ కోప్పడ్డారు వాళ్ళు. మరికొన్ని రోజులు గడిచినా చెక్కురాకపోయేసరికి "మా కంపెనీకి వెళ్ళి చెక్కు తెచ్చుకుంటా"నని
చెప్పి ఉత్తరదేశం ప్రయాణం అయేడు చంద్రకాంత్. దారి ఖర్చులకని అందరూ తలో రెండొందలూ మళ్ళీ అప్పుగా ఇచ్చారతనికి.

"మీ ఋణం పెరిగిపోతోందే! - కంపెనీలో కాష్ తీసుకోగానే టెలిగ్రామ్ మనిఆర్డరు ద్వారా మీ డబ్బు మీకు పంపించేస్తాను..." అన్నాడు బయల్దేరేముందు.

"ఆ దాన్దేముందిలేస్తూ! నువ్వు తిరిగి ఇవ్వాలేమిటి? రేపు మా అమ్మాయిని చేసుకొన్నా ఇలాగే ఇచ్చిపుచ్చుకోడాలు ఉంటాయా ఏమిటి?" అన్నారు ఛలోక్తిగా వాళ్ళు.

అతను వెళ్ళిన నెల్రోజుల తర్వాత ముగ్గురికీ మూడు ఉత్తరాలొచ్చినయ్. మూడింటిలోనూ విషయం ఒక్కటే.

"శివనాధంగారు, లింగమూర్తిగారు, సీతారామయ్యగారు, మీ ముగ్గురి ఆదరణ నేను మరచిపోలేను. నన్ను మీ ఇంట్లో ఒకడిగా చూసుకొన్నారు. మీకు ఎప్పటికీ కృతజ్ణుడిని! నా లాంటి వాడిని మాడటం బహుశా మీకు కొత్త అనుకుంటాను. కాని మీలాంటి ’ఆడపిల్లల’తండ్రుల్ని నేను చాలామందిని చూశాను. ఇంచుమించుగా వాళ్ళందర్నీ
వాళ్ళ బలహీనతని కనిపెట్టి మోసం చేశాను. అలా మోసం చేశాను. అలా మోసం చేయడం తప్పని నాకు తెలుసు. కాని ఏమ్ చేయను? నిరుద్యోగం! తింటానికి తిండిలేని పరిస్థితి! ఈ పద్దతిలో నాకు మాంఛి భోజనమూ, గౌరవమూ, డబ్బూ దక్కటమే కాకుండా, అందమయిన ఆడపిల్లలు ’బావా’ అంటూ ప్రేమగా పిలుస్తున్నారు. అంచేత గడిచినన్నాళ్ళు ఇలాగే పొట్ట నింపుకోదలచుకొన్నాను. ప్రస్తుతం మరో చోట మీలాంటి ఆడపిల్లల తండ్రి దగ్గర ఉంటున్నాను. పోలీస్ రిపోర్టివ్వకండి! అందుమూలాన ఎక్కువ నష్టం కలిగేది మీ అమ్మాయిలకే! మీ రందరకూ మరోసారి కృతజ్ణత లర్పిస్తూ మీ అల్లుడు చంద్రకాంత్."

ఉత్తరం చదివి మండి పడుతూ ఆ కుర్రాడి గదితలుపులు పగల గొట్టి చూశాడు సీతారామయ్య.

గదంతా ఖాళీ!

******



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)