శీర్షికలు - తెలుగు తేజోమూర్తులు

శాస్త్రవేత్త, వాణిజ్యవేత్త - పద్మభూషణ్ డాక్టర్ కళ్ళం అంజి రెడ్డి

- ఈరంకి వెంకట కామేశ్వర్

భారత ఔషద పరిశ్రమకు ఒక కొత్త ఒరవడి, దిశామార్గం చూపారు డా. అంజిరెడ్డి. రెడ్డి లాబ్స్ ని భారత ఔషద క్షేత్రంలో మేటి పరిశ్రమగా తీర్చిదిద్దారు. సామాన్య ప్రజల ఆరోగ్యానికి, సరసమైన దరలకు మందులను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, కిడ్నీ సంబందిత వ్యాధులకు మందులను రూపొందించారు. ఒంటి చేత్తో డాక్టర్ రెడ్డిస్ ( డి ఆర్ ఎల్ ) సంస్థని బిలియన్ డాలర్ క్లబ్లో చేర్చారు.

సగటు భారతీయుడికి సరసమైన దరకు - నోర్ఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైద్రాబాదు ని భారీ ప్రమాణ మందుల రాజధానిగా మార్చారు. 2001 లో డి ఆర్ ఎల్ ని న్యు యార్క్ స్టాక్ ఎక్స్ చేంగ్ లిస్టింగ్ చేయించారు. జపాన్ తరువాత ఆసియా నుండి వచ్చిన దేశం అన్న ఘనత ఆపాదించారు. బహుళ జాతి సంస్థలకు దీటుగా నిలచి, అనేక మందులను అందుబాటులోకి తెచ్చారు. ఏ పి ఐ ఔషద క్షేత్రంలో ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా రూపొందించారు. న్యు కెమికల్ ఎంటిటీస్ (ఎన్ సి ఈస్) క్షేత్ర స్థాయిలో కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. రెండు వందలకు పైగా మందులను తయారు చేసి, ప్రజల అందుబాటులోకి తెచ్చారు.

తమ సంస్థ వాణిజ్య కార్య కలాపాలను ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలను పరివ్యాప్తి చేశారు. భారీ ప్రమాణ మందులను అమ్మి వచ్చిన నికర లాభాలను కొత్త ఔషదాణువులను కనిపెట్టే పరిశోధనలో వెచ్చించారు. కోట్లాదిమందికి అనేక ఔషధాలను సరసమైన దరలకు అందుబాటులోకి తెచ్చారు. భారీ ఎగుమతులు చేసి భారత దేశాన్ని ఔషదాలు అందించే దేశంగా ప్రపంచ పటం మీద నెలకొల్పి , సముచిత స్థానం లభించేలా చేశారు. ఏ పీ ఐ ల రూపకల్పనలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా రూపుదిద్దారు. శాస్త్రవేత్తగా, వాణిజ్వేత్తగా రాణించారు - డాక్టర్ అంజి రెడ్డి గారు.

బాల్యం, చదువు - ఆరోగ్య పయనం:

1941 లో గుంటూర్ జిల్లా లోని తాడేపల్లి గ్రామంలో రైతు బిడ్డగా జన్మించారు. జిల్లా పరిషద్ హై స్కూల్ లో చదువుకున్నారు. 1958 లో గుంటూరు ఏ సి కాలేజి నుండి బి ఎస్ సీ పట్టా సాదించారు. తరువాత యు డి సి టి నుండి ఫార్మసూటికల్స్ లో పట్టా తీసుకున్నారు.

పూనా లోని నేషనల్ కెమికల్ లాబరేటరీ లో డాక్టర్ దొరైస్వామి పర్యవేక్షణలో " కైనిటిక్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ టోల్యూన్ " అంశం మీద పరిశోధన చేసి - రసాయన శాస్త్ర ఇంజినీరింగ్ డాక్టరేట్ పట్టా సాదించారు. పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ వచ్చినా, ప్రభుత్వ రంగ సంస్థ - ఐ డి పీ ఎల్ సంస్థలో ఉద్యోగం రావడంతో అందులో చేరారు. 1980 నుండి 1984 తరుణంలో సాల్ (స్టాండర్డ్ ఒర్గానిక్ లిమిటెడ్) సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు.

అంజి రెడ్డి గారు, ప్రప్రధమంగా మెట్రోనిడజోల్, సుల్ఫా మెతోక్సజోల్ మందులని రూపొందించారు. తరువాత గ్లిటజోన్ మిస్రమం - బలగ్లిటజోన్ రూపొందించారు. దీన్ని నొవో నోర్డిస్క్ సంస్థకు జారి చేసి (లైసెన్స్ ఇచ్చి) భారతీయ ఔషద పరిశ్రమకి ఒక కొత్త దిశామార్గం చూపారు. ఫ్లోరో క్వినొ లోన్స్ - నోర్ఫ్లాక్సిన్, సిప్రో ఫ్లాక్సిన్ ని డి ఆర్ ఎల్ సంస్థ ద్వారా నిర్మించారు.

మందులని సరసమైన దరలకు అందిస్తూ వచ్చారు. 2011 లో భారత ప్రభుత్వం అంజి రెడ్డి గారికి పద్మభూషణ్ గౌరవం ఇచ్చింది.


జర్మన్ కంపనీ - మెర్క్ సెరొనో సౌజన్యంతో క్యాన్సర్ నివారణ ఔషదాలను రూపొందిస్తున్నారు. " ఐదు వందల ఏళ్ళు నడిచే సంస్థను నిర్మించాలి " అని అనుకున్నానని ఒక సందర్భంలలో అన్నారు. నేడు వారి చిరజీవి - సతీష్ రెడ్డి గారు, జి వి ప్రసాద్ గారు డి ఆర్ ఎల్ సంస్థని పర్యవేక్షిస్తున్నారు. కార్య కలాపాలని మరింత విస్తరింప చేస్తున్నారు.

దృక్పధం:

" జీవనోపాధి మనుషులకు ముఖ్యం. నేను నా జీవితంలో ఎన్ని ఉపాధి అవకాశాలనుకల్పించగలిగితే అన్నీ చేస్తాను; ఈ జీవనోపాధి అణునిత్యం నడిచేటట్లు ఉండాలి " అని ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇది ఆయన దృక్పధాన్ని చాటుతుంది. నేడు 22 రాష్ట్రాలలో పలు కార్యక్రమాల ద్వా రా యువతకు శిక్షణ అందిస్తున్నారు.


డి ఆర్ ఎఫ్ - డాక్టర్ రెడ్డి రిసర్చ్ ఫౌండేషన్ ని నెలకొల్పారు. ఇందులో విభిన్న ప్రయోగాలు చేసి కొత్త అణువులను, మిశ్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ - ఫార్మా, బయోటెక్ రంగాలలో మూలాధర పరిశోధనలు ( ఫుండమెంటల్ రిసర్చ్) జరిపి నాణ్యమైన నవకల్పనని (ఇన్నోవేషన్స్) బయటికి తీసుకు వచ్చే మిషతో ఈ సంస్థకి అంకురార్పణ చేశారు. హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఈ పరిశోధనా సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. పరిశోధకుడు, పరిపాలనాదక్షుడు, డాక్టర్ ఆకెళ్ళ వెంకటేశ్వరులు గారు ఈ సంస్థ వ్యవస్థాపక సంచాలకుడిగా ఉన్నారు. నలబై కి పైగా పేటెంట్లు సంపాయించారు.

కంటి రుగ్మతలను నివారించే దిశగా ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనుబంధంతో అణు జీవకణాల ప్రయోగాలు జరుపుతున్నారు.

గౌరవ, పురస్కారాలు:

- భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం

- బిజినెస్ మాన్ ఆఫ్ ది ఏర్ (బిజినెస్ ఇండియా)

- కెంటెక్ ఫౌండేషన్ పురస్కారం

- హాల్ ఆఫ్ ఫేం అవార్డు

- నైపెర్ - సభ్యులు

- భారత ప్రభుత్వ పద్మశ్రీ (2001)

- పి సి రే పురస్కారం

- భారత ఫార్మసూటికల్ అల్లయాన్స్, అధ్యక్షులు

- గైన్ (స్విట్జర్ లాండ్), సభ్యులు

- గ్లోబల్ అల్లయాన్స్ ఫర్ టి బి డ్రగ్ డెవలప్మెంట్ (న్యు యార్క్), సభ్యులు

- ఫెల్లో, ఇండియన్ నేష్నల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్

మార్చ్ 15, 2013 న, హైద్రాబాదులో లివర్ క్యాన్సర్ వ్యాధితో స్వర్గస్తులైయ్యారు. ఔషద దిగ్గజంగా నిలిచారు. తాము రూపొందించిన మందులు అందరికీ సౌలభ్యం కావాలని ఆకాంక్షించారు - సాధించారు కూడానూ. భారత దేశానికి మందుల క్షేత్రంలో సముచిత స్థానాన్ని కల్పించారు. ఆయన తలపెట్టిన " అన్ ఫినిష్డ్ అజెండా " (ఔషద అణువులని కనిపెట్టడం) భవితవ్యంలో సాధించి అంజి రెడ్డి గారి కల సాకారం చేస్తారని ఆశిద్దాం. 1984 లో మొదలు పెట్టిన ప్రయాణం, ఒక కొత్త ఒడుపునిచ్చిన డి ఆర్ ఎల్ సంస్థ మరో ఐదు వందల ఏళ్ళు వర్ధిల్లి మరిన్ని " ఆరోగ్య " శిఖరాలను అధిరోహిస్తూ వారి కలలని సాకారం చేస్తుందని విశ్వసిద్దాం.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)