ధారావాహికలు

మరీచికలు

- వెంపటి హేమ

"మైత్రీ ఫర్నిచర్సు" వారి వ్యాపారం హైదరాబాదులో బాగానే సాగుతోంది. కాని, ఉభయ గోదావరీ జిల్లాల నుండి ఆర్డర్లు వాళ్ళకి అంతగా వచ్చేవికావు. కారణం కనుక్కుంటే, సరుకు రవాణా కావలసిన దూరం ఎక్కువగా ఉండడం - అని తేలింది. ప్రయాణ సౌకర్యం సరిగా ఉండక, సామాన్యంగా ఎవరూ మైత్రీ ఫర్నిచర్ కొనడానికి సాహసించ లేకపోతున్నారని తెలిసింది. ఆ లోపాన్ని సవరించే పనిగా, ఉభయ గోదావరి జిల్లాల వారికీ అందుబాటులో ఉండేలా రాజమండ్రీలో ఒక షోరూం, ఆ పైన దానికి అనుబంధంగా ఒక ఆఫీసు తెరవాలనీ, సరుకు పదిలంగా దాచిఉంచేందుకు తగిన గోడౌన్లు ఏర్పరచాలనీ నిర్ణయించుకుని, అనుభవజ్ఞుడైన గోపాల్రావుగారిని అక్కడి వ్యవహారాలు చూసుకోడానికి, జీతం పెంచి, అక్కడి బిజినెస్ కి M D గా, ప్రమోషన్ మీద ట్రాన్సఫర్ చేశారనీ, హైదరాబాదు ఆఫీసుకు మరొకరు M.D. గా వస్తారనీ రాసి ఉంది హెడ్డాఫీసు నుండి వచ్చిన ఉత్తరంలో. అంటే గోపాల్రావుగారు ఇక్కడనుండి త్వరలోనే వెళ్ళిపోతారన్నమాట! అది చదివిన యామినికి గుండెల్లో బండపడినట్లై, కొంతసేపు అవాక్కై నిలబడి ఉండిపోయింది. గోపాల్రావుగారు ఆమెను పలకరించారు .... .


"ఏమిటమ్మా యామినీ! నీకీ డెవలప్ మెంటు నచ్చలేదా ఏమిటి?"

" మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది సర్! ఈ రెండు సంవత్సరాలూ ఎంతో బాగా గడిచాయి నాకు. మా నాన్నలాగే మీరూ, గురువులా, తండ్రిలా - ఎంతో ఆత్మీయంగా చూసుకుంటూ, నాకు పని నేర్పించారు. మీరు వెళ్ళిపోతే నేను మిమ్మల్ని బాగా "మిస్" అవుతాను సర్ " అంది యామిని దిగులుగా.

"పిచ్చిపిల్లా! నిన్ను వదిలి వెళ్ళడం నాకూ బాధగానే ఉంది. కాని వెళ్ళక తప్పదు. ఉద్యోగాలు చేసీ వాళ్ళకు ఇలాంటివన్నీ మామూలే. పొట్ట చేత పట్టుకుని, ఉద్యోగాలు వెతుక్కుంటూ బయలుదేరాక, యజమాని ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకి వెళ్ళాలి కదమ్మా! ఎవరితోనైనా మనకు అనుబంధం ఏర్పడితే చాలు, వెంటనే ఎవరో ఒకరు వేరేచోటుకి వెళ్ళవలసి రావడం అన్నది మామూలే! అంతేకాదు, ఈ ప్రయివేటు సెక్టర్లలో ఉన్నబడంగా ఎవరికైనా ఊస్టింగ్ ఆర్డర్ వచ్చినా మనం ఆశ్చర్యపో నక్కరలేదు. " ఎవ్విరి థింగ్ డిపెండ్సు అపాన్ ది వ్వింసు అండ్ ఫాన్సీస్ ఆఫ్ ది బాస్!" మనమే ఢక్కామెక్కీలు తింటూ, జాగ్రత్తగా మసలుకుంటూ, నెమ్మదిగా బాస్ "గుడ్ బుక్సు"లోకి ఎక్కే ప్రయత్నం చెయ్యాలి." అంటూ ఆయన యామినికి హితబోధ చేశాడు.

ఆ మాటలు యామిని మనసుకు హత్తుకుపోయాయి.

* * *

అలవాటుగా వారాంతపు సెలవులకు ఇంటికి వెళ్ళింది యామిని. మళ్ళీ యధాప్రకారం సోమవారం ఉదయం ఫస్టు బస్సుకి హైదరాబాదుకి తిరుగు ప్రయాణమయ్యింది.

ఆ రోజు వెంట తీసుకెళ్ళవలసిన సామానేమీ లేకపోవడంతో, ఉదయాన్నే లేచి, హాండ్ బాగ్ మాత్రం బుజానికి తగుల్చుకుని, బస్ స్టాండుకి వెళ్లిన యామిని, ప్రయాణానికి సిద్దంగా ఉన్న హైదరాబాదు బస్సు ఎక్కేసింది. కొంచెం హెచ్చుతక్కువగా రెండేళ్ళ పరిచయమున్నవాడే కనుక, కండక్టర్ జనాన్ని సద్ది, ఆమెకు కూర్చోడానికి చోటు చూపించాడు. బస్సు బయలుదేరింది.

హైదరాబాదుకి వెళ్ళే దారిలో ఉన్న ఒక ఊరిలో ఆ రోజు అమ్మవారి జాతర ఉంది. దానికి వెళ్ళే జనంతో బస్సు కిక్కిరిసిపోయింది. దారి పొడుగునా, బస్సు ఆగినచోటల్లా ఇంకా ఇంకా ప్రయాణీకులు బస్సు ఎక్కుతూనే ఉన్నారు. బస్సు పాతది కావడంతో, బరువెక్కువైన కొద్దీ వేగం అంతకంతా కుంటుపడసాగింది. నిండు గర్భిణిలా ఉన్న ఆ బస్సు ఆపసోపాలు పడుతూ, ఎంతో ప్రయాసతో గమ్యం వైపుగా, నెమ్మదిగా సాగుతోంది. యామినికి చాలా దిగులయ్యింది, "ఈ బస్సు ఇలాగే సాగితే ఈరోజుకి నేను హైదరాబాదు చేరుకోగలనా? కొత్త M. D. వచ్చి చార్జి తీసుకునీది ఈ రోజే కదా! "ఫష్టు ఇంప్ర్రెషన్ ఈజ్ ది బెష్టు ఇంప్రెషన్" అంటారు! అలాంటిది, నాకు ఆదిలోనే రావాలా ఈ హంసపాదు" అని అనుకుంటూ బాధపడుతూ కూర్చుంది.

సగం దూరం పైగా ప్రయాణించాక, దిగాల్సిన ఊరు రావడంతో చాలా వరకూ జనం అక్కడ దిగిపోయారు. బస్సు తేలికపడింది. వెనకబడిన కాలాన్ని సద్దుబాటు చేసీ ఉద్దేశంతో డ్రైవరు బస్సు స్పీడు పెంచాడు. "అమ్మయ్యా" అనుకుంది యామిని.

హైదరాబాదు బస్సు స్టేషన్లో ఆగగానే బస్సు దిగింది యామిని. కాని రిష్టువాచీ చూసుకుంటే అప్పటికే ఆఫీస్ టైం దగ్గరపడిందని తెలిసింది. "ఈ సరికి ఆఫీసు, తెరిచేసేసి ఉంటారు" అనుకుంది యామిని.

"ఇప్పుడు ఇంటికివెళ్ళి ఫ్రెష్ గా తయారయ్యి మరీ, ఆఫీసుకు వెళ్ళాలంటే టైమ్ చాలదు. ఇటు నుండి ఇటే ఆఫీసుకి వెళ్ళడం మంచిది. అలాగైతే సమయానికి నేను అక్కడ ఉండడం జరుగుతుంది . వీలైతే ఆఫీసులోనే, కొద్దిగా జుట్టు సద్దుకుని, మొహం కడుక్కుని ఫ్రెషప్ అవ్వొచ్చులే" అనుకుని, వెంటనే ఆటో ఎక్కి ఆఫీస్ అడ్రస్ చెప్పింది యామిని.

* * *

యామిని ఆటో దిగి ఆఫీసు మెట్లు ఎక్కుతూండగా చూసిన ఆఫీస్ బాయ్, రాజు ఒక్కపరుగున ఎదురుగా వచ్చాడు. "కొత్తసారు వచ్చేశారు మేడం! గదిలో పెద్దసారుతో మట్లాడుతున్నారు" అంటూ గుసగుసగా ఆమెకు చెప్పేసి, కంగారుగా వెనక్కి వెళ్ళిపోయాడు.

యామిని ఇంకా తన గదిలోకి వెళ్ళకముందే కాలింగు బెల్ మ్రోగింది.

గ్లాస్ డోర్లో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసుకుని ఉలికిపడింది యామిని. గాలికి చిందరవందరగా రేగిపోయిన జుట్టుతో, ఎగిరివచ్సిన దుమ్ముపడి మాసిన బట్టలతో, ఆందోళన వాళ్ళ వచ్చిన అలసటతో పీక్కుపోయిన మొహంతో - దుమ్ముకొట్టుకునిపోయి ఉన్న తనరూపం చూసుకుని ఉసూరుమంది. "కొంచెం మొహం కడుక్కునీ టైం కూడా లేదు కాబోలు" అనుకుంది బాధగా. అంతలో మరోసారి మోగింది బెల్!

తప్పని సరిగా పెన్సిలు, పేడ్డు తీసుకుని మేనేజర్ రూంలోకి వెళ్ళింది యామిని. గడప దాటుతూనే, తల బాగా వంచుకుని, "గుడ్మార్నింగ్ సార్సు" అంటూ, ఉమ్మడిగా పాత, కొత్త బాసులిద్దరికీ అభివాదం చేసింది. ఆ తరవాత నెమ్మదిగా తల పైకెత్తి చూసిన ఆమె, ఉన్నచోట ఉన్నట్లుగానే స్థాణువులా కొయ్యబారిపోయింది.

కొత్తగా వచ్చిన M.D. కి ఆఫీసు విషయాలు తెలియజేస్తూన్న గోపాల్రావు, యామిని రావడం చూసి, అంత వరకూ చెపుతున్న మాటల్ని ఆపి, కొత్త బాసుకి ఆమెను పరిచయం చేశాడు. " ఈమే మన స్టేనో కం క్లర్కు! పేరు యామినీ ప్రియదర్శిని. వర్కు ఎఫిషియంట్. చాలా సిన్సియర్!. ఈమె ..... " అంటూ ఇంకా ఆయన ఏమేమో చెప్పబోతూంటే , కొత్త బాసు అడ్డొచ్చాడు ..... .

" ఔను సర్! ఆసంగతి నాకు తెలుసు" అన్నాడు ......

గోపాల్రావు ఆశ్చర్యపోయాడు . " అదెలా? ఐతే, ఈమె మీకు ఇదివరకే తెలుసునా" అని అడిగాడు.

"దీనికంత పరిచయం ఉండవలసిన అవసరం ఏమీ లేదు సర్! ఒక్క చూపు తోనే తెలిసిపోతుంది ఎవరికైనా, ఈమెకు తన మీద కంటే తన వర్కు మీదే ఇంటరెష్టు ఎక్కు వన్నది" అని, యామిని వైపు తిరిగి, "యా మై కరెక్టు" అని ఆమెనే అడిగాడు అతడు.

యామిని జవాబు చెప్పలేదు. అసలు విననట్లు తలవాల్చుకుని నిలబడి ఉండిపోయింది.

ఒక్క క్షణం బిత్తరపోయి ఇద్దరి వైపూ మార్చి మార్చి చూసి సద్దుకుని, తనవంతు పనిని పూర్తిచెయ్యడానికి కొత్త బాసుని యామినికి పరిచయం చెయ్యాలనుకున్నాడు గోఫాల్రావు ..... .

" యామినీ! ఈయనే ఇక్కడకి వచ్చిన కొత్త M .D.! పేరు అమరేంద్ర! నేను రేపే ఈయనకు ఛార్జి అప్పగించి వెళ్ళిపోతున్నాను" అన్నాడు .

అమరేంద్ర కుర్చీలోంచి లేచి, యామినికి షేక్ హాండు ఇవ్వడం కోసం చెయ్యి ముందుకు చాపాడు. కాని ఆమె ఆ చెయ్యి అందుకోలేదు. తలపైకెత్తి అతని వైపు ఒక్క చూపు చూసి, "నమస్తే" అంటూ రెండు చేతులూ జోడించి కొద్దిగా తలవంచి అతనికి నమస్కరించింది.

పైకి తెలియకూడదని పట్టుదలగా గాంభీర్యం నటిస్తోందేగాని, యామినికి లోలోపల చాలా బెరుకుగా, కంగారుగా ఉంది. తను ఏ వ్యక్తినైతే ఇక ఈ జన్మలో కళ్ళజూడరాదు - అనుకుందో, ఎవరి ఊసైతే తను ఈ జన్మలోనేకాదు, మరుజన్మలోకూడా ఎత్తకూడదు - అనుకుందో, ఆ ధూర్తుడు ఇప్పుడు తనకు బాసై వచ్చి, ఎదురుగా కుర్చీలో దర్జాగా కూర్చుని వున్నాడు! తనకిది ఎంత దుర్దశ!

ఆ వేళ తోటలో తనకీ మురళీకీ మధ్య జరిగిన ఆ అవాంఛనీయ సంభాషణకి ప్రత్యక్ష సాక్షి ఇతడు! తనను ఉత్తమ ఇల్లాలు కాలేవంటూ ఈసడించిన ఘనుడూ ఇతడే! ముక్కూ మొహమూ తెలియనప్పుడే అంత చొరవచేసి మాటాడిన వ్యక్తి; ఇప్పుడు, ఇంతటి మహదవకాశం దొరినప్పుడు, తనను తేరగా విడిచి పెడతాడన్నది కల్ల! ఇప్పుడు చెయ్యాలి? -- "ఐరనీ ఆఫ్ లైఫ్" అంటే ఇదే కాబోలు! అంతా విధి! నా తల రాత!" అనుకుని లోలోన బాధ పడసాగింది యామిని.

యామిని ఎందుకో మధనపడుతోందన్నది గుర్తించాడు గోపాల్రావు. దీనికి, బాస్ యువకుడు కావడమే కారణం కావచ్చు - అనుకున్నాడు. " కాని ఇతణ్ణి చూస్తే మంచివాడే ననిపిస్తోంది. యామినికి అపకారం చేస్తా డనిపించడం లేదు. మరి కొద్ది రోజుల్లో ఆమె కూడా తెలుసుకుంటుంది. ఆ తరవాత అపార్ధాలన్నీ వాటంతటవే సద్దుకుంటాయి" అనుకున్న గోపాలరావు, వాతావరణాన్ని తేలికపరచడం కోసం ఏదో ఒకటి మాటాడడం బాగుంటుంది - అనుకుని మాట్లాడసాగాడు ..... .

"ఏమ్మా, యామినీ! ఎప్పుడూ నాకంటే ముందే ఆఫీసుకి వచ్చి ఉండేదానివి, ఈ వేళ ఇంత ఆలస్యమయ్యిందేం" అని అడిగారు.

"సారీ సర్! ఎప్పటిలాగే మా ఊళ్ళో ఫస్టు బస్సుకే బయలుదేరా గాని, దారిలో బస్సుకి ట్రబుల్ రావడంతో గమ్యం చేరడానికి ఆలస్యం అయ్యింది. అందుకనే నేను, ఇంకా లేటవుతుందని ఇంటికి వెళ్ళకుండా, బస్సు స్టాండు నుండే ఇటు వచ్చేశా, ఐనా అరగంట లేటు అయ్యింది, సారీ సర్!" ........ "

"పోనీలేమ్మా! ఏ కష్టం లేకుండా వచ్చేశావు, అది చాలు! దారిలో నువ్వు ఇబ్బందులేమీ పడలేదు కదా?"

"ఇబ్బందులేం లేవు సర్! రావడం లేటయ్యింది, అంతకుమించి మరే కష్టం లేదు. కాని, ఇంటికి వెళ్ళి "ఫ్రష్ అప్" అయ్యి వచ్చే అవకాశం లేకపోయింది." అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది యామిని. అక్కడే ఏదో ఫైల్ తిరగేస్తూ కూర్చునివున్న అమరేంద్ర ఆ మాటలన్నీ విన్నాడో లేదో అతనికే తెలియాలి! ఏమీ మాటాడ లేదు.

గోపాల్రావు అమరేంద్ర వైపుకి తిరిగి, " కష్ట నిష్టూరాలని ఓర్చుకుంటూ, ఈ కాలపు ఆడపిల్లలు చొరవగా ఉద్యోగాలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. కాని, మా చిన్నప్పుడు, ఆడవాళ్ళని వెంట మగతోడు లేకుండా, గుమ్మం దాటనిచ్చేవారు కాదు. ఇప్పుడు రోజులు బాగా మారిపోయాయి కదూ" అన్నాడు మాటవరుసకి.

అమరేంద్ర యామిని వైపు చూస్తూ చిన్నగా నవ్వి, "ఔను సర్! కాలం, ఇలాగా అలాగా కాదు, చాలా స్పీడుగా మారిపోయింది. ఆ రోజుల్లో ఆడవాళ్ళని "అబలలు" అనేవారుట కదా! ఇప్పుడేమో వాళ్ళని "శక్తి స్వరూపాలు" అంటున్నారు. వాళ్ళిప్పుడు నదురూ బెదురూ లేకుండా ఎంతమాట పడితే అంతమాట చటుక్కున అనెయ్యనూగలరు. ఒకవేళ ఏదైనా తేడా గాని వచ్చిందంటే, ఇక ముందూ వెనకా ఏమాత్రం ఆలోచించ కుండానే వాళ్ళు, క్షణంలో చెంపపగలకొట్టనూ గలరు! తెలుసా మీకు? యమా స్పీడు సర్" అన్నాడు కొంటెగా యామినివైపు చూస్తూ.

అతని మాటలు తనకు తగిలిరావడంతో యామినికి ఒళ్ళు మండినట్లయ్యింది. బుస్సుమంటూ కోపం బుసలు కొట్టింది. కాని బొత్తిగా తప్పనిసరి పరిస్థితి కావడంతో బలవంతంగా ఉబికి వస్తున్న కోపపు పొంగుని అణగదొక్కి, శాంతపు ముసుకు ధరించి నిలబడింది. .

వెంటనే మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె, "అసలు ఈ సంభాషణతో తనకేమీ సంబంధం లేనట్లుగా నిర్లిప్తంగా ఉండిపోడమే దీనికి సరైన జవాబు" అనుకుంది మనసులో.

కొత్త బాస్ అనే వాడొకడు అక్కడ ఉన్నాడన్నదే ఎరగనట్లు, గోపాల్రావుతోనే మాటాడింది యామిని, "సర్! ఇక్కడ పని ఏమీ లేకపోతే నేను వెడతాను. డిస్పాచ్ చెయ్యాల్సిన మెయిల్ చాలా ఉంది. దాన్ని ఈవేళే పోస్టు చెయ్యాలి. వేళవుతోంది, ఇక నేను వెళ్ళనా" అని అడిగింది.

పూర్వపు విషయాలేమీ తెలియని గోపాల్రావు యెలాగైనా యామిని పేరు కొత్త బాస్ అమరేంద్ర "గుడ్ బుక్సు"లోకి ఎక్కించాలన్న సదుద్దేశ్యంతో ఏమేమో మాటాడ సాగాడు. " మీరుచెప్పింది నిజమే! చాలామంది అమ్మాయిలలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరి సంగతి ఎలా ఉన్నా, ఈ యామిని మాత్రం అలాంటిది కాదు! ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో చక్కగా తెలుసు ఈమెకు. మంచి అమ్మాయి! చెప్పాలంటే, నూటికొక్కరు కూడా ఉండరు ఇటువంటి వాళ్ళు! ఆ అంకితభావంతో పనిచేశే తీరూ, ఆ వినయవిధేయతలూ ....."

వెళ్ళిపోతున్న యామిని చెవినిబడ్డాయి గోపాల్రావు మాటలు. "అయ్యో!" మనసులోనే ఆక్రోశించింది యామిని. " కాకి వచ్చి కడ కడవలో పడింది" అన్నట్లు నా కిలాంటి దురవస్థ వచ్చిందేమిటి దేవుడా " అని తనలో తానే దు:ఖపడింది. ఇంక ఇక్కడ ఉండ కూడదన్న ఆలోచన వచ్చింది ఆమెకు.

కాని, తానున్న పరిస్థితిలో ఎటుచూసినా ఆటంకాలే! ఉన్నబడంగా ఈ ఉద్యోగాన్ని వదిలివెళ్ళే దారి లేదు. తనకీ ఉద్యోగం అవసరమన్నది ఒకటే కాదు, మూడేళ్ళకు తను రాసిన బాండు కూడా కారణం దానికి! బాండు గడువు తీరాలంటే మరో సంవత్సరం గడవాల్సివుంది. అంతవరకూ తాను ఈ మొరటు మనిషితో అగచాట్లు పడక తప్పదు కాబోలు! బాండు గడువు తీరాక ఒక్క క్షణం కూడా తను ఇక్కడ ఉండదు. ఈలోగానే మరోచోట ఉద్యోగం చూసుకుని ఉంచుకోవాలి. అంతవరకూ దీన్ని ఒక పరీక్ష అనుకుని, ఇందులో నెగ్గడానికే కృషి చెయ్యాలి, చేస్తా ! అదే సరైన మార్గం" అనుకుంది యామిని స్థిర నిశ్చయంతో.

* * *

వేసవి ప్రకోపించడంతో హైదరాబాదు వాస్తవ్యులు ఎండ వేడిమిని తట్టుకోలేక, తాపంతో తహతహలాడిపోతున్నారు. అవిశ్రాంతంగా ఫాన్లు తిరుగుతూనే ఉన్నా కూడా, గాలిలో చల్లదనమన్నది ఏ కోశానా లేకపోడంతో పగలు ఎలాగో గడిచినా, రాత్రులు నిద్రపట్టక పక్కల మీద అటూ, ఇటూ దొల్లుతూ కాలం గడుపుతున్నారు. ఆరుబయట పడుకోవాలంటే ఎడతెగని దోమలు!

మనసులోని తాపానికి బయటి తాపం కూడా తోడయ్యి, అస్సలు కునుకు పట్టకపోడంతో పక్కమీద దొల్లుతున్న యామినికి, మనసుని ముసురుతున్న ఆలోచనల వేడి కూడా తోడవ్వడంతో నిద్రలేమికి అశాంతి కూడా జోడయ్యింది.

ఆమె ఆలోచనలకన్నిటికీ కేంద్రబిందువు అమరేంద్రే కావడం విశేషం. "శతృవు మనకన్నా బలవంతుడు అనిపించినప్పుడు, సూటిగా వెళ్లి "ఢీ" కొనడం మూర్ఖత్వం ఔతుంది . అలాచేస్తే, "కొండను "ఢీ" కొన్న గొర్రెపొట్టేలు కథే కదా మనకథ కూడా! అసలు ప్రతిఘటనే లేకుండా "బాంచను, కాల్మొక్తా" అనడం పిరికితనం! అలాగని ఉన్నచోటనే స్తబ్దంగా ఉండిపోయి ఓటమిని ఒప్పేసుకోడంలో కూడా ఏమాత్రం అర్థంలేదు....... మరి ఏంచెయ్యాలి?

నువ్వు చేసే పని తప్పు కాదని నీకు నమ్మకం ఉంటే చాలు, నువ్వు నీ శతృవుని నీలోని ఓరిమితో నువ్వు అహింసా మార్గంలో కూడా జయించవచ్చు- అన్నది మనకు బోధించి వెళ్ళారు మన పూజ్య బాపూజీ! ఇప్పుడు నాకు అనుసరణీయమైనది గాంధీ మార్గం ఒక్కటే! సత్యాగ్రహ విధానానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమే బెదిరిపోగాలేంది, ఆఫ్టరాల్ ఈ అమరేంద్ర అనగా ఎంతట " అనుకుంది యామిని ధీమాగా.


ఆమె ఆలోచన అక్కడితో ఆగలేదు. మనసు కోతిలాంటిది - అంటారు! శాఖా చంక్రమణం అన్నది కోతి లక్షణం! అలా ఆమె మనసులోకి మరొక కొంటి ఆలోచన కూడా వచ్చిచేరింది......


"ప్రపంచమంతా ఈ సత్యాగ్రహాన్ని కనిపెట్టినది గాంధీ గారే అనుకుంటారు గాని, అది నిజం కాదు. గాంధీ గారు పుట్టక ముందే ఉంది ఇది. పూర్వం అత్తలు, కొడుకులు తమని ఏమీ అనరన్న ధీమాతో, కోడళ్ళని "కోడంట్రికం" - అనే పేరుతో నానా హింసలూ పెట్టే వారుట! అప్పుడు ఆ కోడళ్ళకి ఆ అత్తమీద కోపం వచ్చినా కూడా, ఆ కోపాన్ని దిగమ్రింగి, శాంతి సహనాలతో అత్తలు పెట్టే బాధల్ని భరించి, సంసారాన్ని నిలబెట్టుకునే వారుట! చివరకు క్రమంగా అత్తలు వీగిపోవడం, కోడళ్ళు విజయాన్ని సాధించి పెత్తనం తమ చేతుల్లోకి తీసుకోడం జరిగేదిట! అందుకే కాబోలు దాని పేరు, సతి + ఆగ్రహము = "సత్యాగ్రహము" అయ్యింది! ఏముంది, ఓర్సినమ్మకు తేటనీరు! అంతేకాదు, నాకు ఎక్కడో ఎక్కడో చదివిన జ్ఞాపకం ఉంది - వెనకటి రోజుల్లో జపానీయులు , యజమానులు తమని వేధించినప్పుడు, మౌనంగా ఆ బాధను భరిస్తూ, వాళ్ళకి మరింతగా సహకరిస్తూ, మంచితనం తోనే వాళ్ళ మనసుని గెలుచుకుని తాము కోరుకున్నది సాధించుకునీ వారుట! అదే పద్దతి ఇప్పుడు నాకూ శిరోధార్యం. తొందరపడి చెందనాడుకుంటే నాన్నపరిస్థితి ఏంకావాలి? నాన్నని బాధపెట్టడం కన్నా ఆ బాధేదో నేనుపడడమే మంచిది. ఈ విషయాలేమీ ఎవరికీ చెప్పను. ఆఖరికి వకుళకు కూడా" అనుకుంది యామిని.

మనసులో ఆ ఊహ తోచే సరికి అప్రయత్నంగా యామిని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మనసుకు రవంత ప్రశాంతత చిక్కి, హాయిగా ఆమెకు నిద్ర పట్టేసింది.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)